November 21, 2024

‘జమాఅతె ఇస్లామీ హింద్‌’ మీడియా విభాగం ఆధ్వర్యంలో నవంబర్‌ 11, 12 తేదీలలోఢిల్లీి జమాఅత్‌ కార్యాలయంలో ఒక ‘వర్క్‌ షాప్‌’ ఏర్పాటు చేయబడింది. దేశవ్యాప్తంగా వివిధ భాషలలో జమాఅత్‌ ఆధ్వర్యంలో నడిచే పత్రికల ప్రతినిధులు, మీడియా సెక్రెటరీలు ఈ వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు. జమాఅతె ఇస్లామీ హింద్‌ ఏ.పి మహిళా విభాగం నుండి ప్రత్యేకంగా ప్రాతినిధ్యం వహించిన వారిలో రచయిత్రి తహ్సీన్‌ హుమైర్వీ ఒకరు. ఈ వర్క్‌షాపులో మౌలానా రజియుల్‌ ఇస్లామ్‌ నద్వి చేసిన ప్రసంగాన్ని తెలుగు పాఠకుల కోసం సమర్పిస్తున్నారు శ్రీమతి తహ్సీన్ హుమైర్వీ . ప్రవక్త ముహమ్మద్‌(స) కన్నా ముందు అరబ్బు తెగల్లో చాలా దురాచారాలుండేవి. అమ్మాయి పుట్టడం అంటే అగౌరవంగా భావించేవారు. అలాంటి సమాజంలో అమ్మాయి పుట్టుకను దైవకారుణ్యంగా భావించే సమాజంలో ప్రజాభిప్రాయం మారడం చరిత్ర కళ్ళారా చూసింది. ఈ వ్యాసంలో ఆ వివరాలు చదవండి. 

-ఎడిటర్

ఆముల్‌ వుఫూద్‌ (9వ హిజ్రీ) కాలంలో అరేబియా అంతటి నుండి అనేక తెగలు మదీనా వచ్చాయి. వారు ప్రవక్త(స) చేతుల మీదుగా ఇస్లాం స్వీకరిస్తామని, విధేయత పాటిస్తామని ప్రమాణం చేశారు. వారిలో బనూ తమీమ్‌ తెగ కూడా ఉంది. ఆ తెగ నాయకుల్లో ఒకరైన ఖైస్‌ బిన్‌ ఆసిమ్‌ (ర) ప్రవక్త సమక్షంలో హాజరై ఇలా విన్నవించుకున్నారు`
‘ఓ దైవప్రవక్తా(స)! నేను ఘోర పాపాలు చేశాను. దైవ సన్నిధిలో నాకు మన్నింపు లభిస్తుందా?’ అని. అందుకు మహానీయులు(స) ఆయన్ను ఓదార్చారు. క్షమాపణ లభిస్తుందని దిలాసా ఇచ్చారు. అప్పుడు ఖైస్‌(ర) తన వృత్తాంతం వివరంగా చెప్పుకొచ్చారు`
‘ఓ దైవప్రవక్తా! నా తెగ వాళ్ళు ఆడపిల్లలను పుట్టిన వెంటనే సజీవంగా పాతిపెట్టేసేవారు. నేను కూడా నా కూతుళ్ళను అలాగే చేశాను. పుట్టిన వెంటనే గొయ్యి తవ్వి సజీవంగా పూడ్చేసేవాడిని. కానీ ఒక సంఘటన మరవలేకపోతున్నా. నేనొకసారి వ్యాపార నిమిత్తం సుదూర ప్రయాణానికి బయల్దేరాను. అప్పుడు నా భార్య గర్భవతిగా ఉంది. కొన్నేళ్ల తర్వాత తిరిగొచ్చేసరికి ఇంట్లో ఒక చిన్న పాపను చూశాను. తనకు పుట్టిన బిడ్డ కొన్ని రోజులకే తనువు చాలించిందని, ఇంట్లో ఉన్న ఈ పాప తన బంధువుల్లో ఫలానా వాళ్ళమ్మాయని నాతో నా భార్య(అబద్ధం) చెప్పింది. ఆ అమ్మాయి నాకు చాలా దగ్గరైంది. నాతో ఆడుకునేది. నేనామెతో సరదాగా ఉండేవాణ్ణి. చాలా ఎక్కువగా ఆమెను ప్రేమించేవాణ్ణి. కాస్సేపు ఆమె నాకు కనిపించకుండా ఉంటే ఆందోళన చెందేవాడిని. కొన్ని రోజుల తర్వాత నా హృదయంలో పాప పట్ల ప్రేమ ఏర్పడిరదని నా భార్య తలచి, ఆమె నా సొంత కూతురేనని ఒక రోజు చెప్పేసింది. అంతే, నాకు దయ్యం పట్టినట్లయింది. నేనామెను సజీవంగా పాతి పెట్టడానికి ప్రణాళికలు రచించడం మొదలెట్టాను. ఒకరోజు నా భార్యతో ‘పాపను సిద్ధం చేయి, నేను బయట తిప్పుకొని వస్తాన’ని అన్నాను. ఆమె అలాగే చేసింది. దారిలో నేనొక పారను తీసుకున్నాను. చాలా దూరం ఎడారిలో ఓ చోట చేరుకున్నాక, నేను నేలను తవ్వడం మొదలెట్టాను.
‘నాన్నా! మీరేం చేస్తున్నారు?’ అని అమ్మాయి అడిగింది. నేను మౌనం దాల్చాను. తను అటూ ఇటూ నా చుట్టూ తిరుగుతోంది. గొయ్యి తవ్వేటప్పుడు నా దుస్తులకు మట్టి అంటుకుంటుంటే తాను మట్టి దులిపేది. ఒక్కోసారి ‘నాన్నా! మీరు చాలా అలసి పోయారు. కాస్సేపు విశ్రాంతి తీసుకోండ’ని చెప్పేది. నేను నాకు అవసరమైనంత గుంత తవ్వినాక బయటకొచ్చి పాపను పట్టుకొని అందులో పడేశాను. గబగబా పైనుంచి మట్టి వేయడం మొదలెట్టాను. పాప ఏడ్వడం మొదలెట్టింది. నా చెవుల్లో ఇప్పటికీ ఆమె గొంతు విన్పిస్తోంది. ‘నా ప్రియమైన నాన్న మీరేం చేస్తున్నారు? నాకు దెబ్బలు తగులుతున్నాయి. నాన్నా! నేను మట్టిలో కూరుకుపోతున్నాను. నాన్నా! నాకు ఊపిరాడట్లేదు. నాన్నా! నేను చనిపోతాను’ అని అంటూనే ఉంది. ఆ సమయంలో నాకు పిచ్చి పట్టింది. నాపై పైశాచికత్వం నాట్యమాడుతుంది. నేను గుంతలో మట్టి వేస్తూనే పోయాను. చివరకు పాప శరీరం మొత్తం మట్టిలో పూడ్చబడిరది. క్రమేణా ఆమె గొంతు కూడా మూగబోయింది.
ఈ సంఘటనను వినిపిస్తూ ఆయన వెక్కివెక్కి ఏడ్వడం మొదలెట్టారు. దైవప్రవక్త (స) నయనాల నుంచి అశ్రువులు ప్రవహించసాగాయి. ప్రవక్తా(స)! నా పాపాలకు ఏదైనా ప్రాయశ్చిత్తం ఉందా? అని అడిగారాయన. నీవు ఎంతమంది ఆడపిల్లలనైతే సజీవ సమాధి చేశావో అంతేమంది బానిసలకు స్వేచ్ఛను ప్రసాదించు అని ప్రవక్త బదులిచ్చారు.
(అల్‌ బజ్జార్‌ 1/60, అత్‌ తబ్రానీ ఫిల్‌ ము’జమిల్‌ కబీర్‌ 18/337, అల్‌ హైసమీ, మజ్‌ మవుజ్జవాయిద్‌ 7/283, అల్‌ అల్బానీ, సిల్‌ సిలతుల్‌ అహాదీస్సి స్సహీహ 3298)
ఈ సంఘటన ద్వారా అరబ్బులోని తెగల్లో ప్రవక్త (స) రాకపూర్వం ఆడపిల్లలను సజీవంగా పాతిపెట్టే ఆచారం కొనసాగుతుండేదని తెలుస్తుంది. చరిత్రపుటల్లో బనూ తమీమ్‌, బనూ ముజిర్‌, బనూ ఖుజాఅ లాంటి తెగల పేర్లు కనిపిస్తాయి. అమ్మాయి పుట్టడం అవమానంగా భావించేవారు. వారు ఈ దురాచారాన్ని పాటించే వారు. అమాయక బాలికలను సజీవంగా భూమిలో పాతి పెట్టడంలో వారికి ఎలాంటి సిగ్గు ఉండేది కాదు. కొందరు దీన్ని వ్యతిరేకించి, ఆడపిల్లలను రక్షించడానికి ప్రయత్నించేవారు. కాకపోతే వారి ప్రయత్నాలు వ్యక్తిగతంగానే ఉండేవి తప్ప ఇతర తెగలు మౌనం పాటించేవి. ఈ దురాచారానికి వ్యతిరేకంగా ఎవరూ ఏ ఉద్యమం కూడా నడిపించలేకపోయారు. అలాంటి వాతావరణంలో ఇంతటి దుష్ట ఆచారాన్ని అంతమొందించడానికి ఇస్లామ్‌ ఎలాంటి ప్రయత్నాలు చేసింది? చివరాఖరికి దాని మూలాలను పెకలించి పారేయడమే కాకుండా, ఆడపిల్లల పుట్టుక, పెంపకాన్ని గౌరవ మర్యాదలుగా భావించే విధంగా అదెలా ప్రయత్నించింది? ఈ వ్యాసంలో ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నించడం జరిగింది. దీనివల్ల ఒక విషయంలో ప్రజాభిప్రాయాన్ని ఎలా మార్చవచ్చునో, అందుకోసం ఏ రంగాల్లో పని చేయాల్సిన అవసరం ఉందో స్పష్టమవుతుంది. ఈ దురాచారాన్ని రూపుమాపటానికి అనేక రంగాల్లో కృషి జరిగింది.
ఖుర్‌ఆన్‌ గ్రంథంలో వివిధ కోణాల నుండి, వివిధ వివరణల ద్వారా దాని చెడును పదేపదే వివరించడం జరిగింది. దైవ ప్రవక్త(స) తన ప్రవచనాల ద్వారా ఈ ఆచారాన్ని తీవ్రంగా ఖండిరచారు. దాన్ని ఘోరపాపంగా ప్రకటించారు.
ఆయన(స) ఆడపిల్లలకు ప్రాధాన్యతనిచ్చారు. వారి పెంపకం స్వర్గానికి సోపానంగా, నరకం నుండి విముక్తి సాధనంగా అభివర్ణించారు. ఇలా ఆయన చేసిన నిరంతర ప్రయత్నాలతో ఈ దురాచారం పూర్తిగా నిర్మూలించబడిరది. క్రింద ఈ వ్యాసానికి సంబంధించిన కొన్ని ఖుర్‌ఆన్‌ వాక్యాలు, హదీసులు ఇవ్వబడ్డాయి.
ఖుర్‌ఆన్‌ ఉపదేశాలు
1- పవిత్ర ఖుర్‌ఆన్‌ సంతాన హత్యను బహుదైవారాధకుల లక్షణంగా ఖరారు చేసింది.
‘‘ఇదే విధంగా చాలామంది ముష్రిక్కులకు తమ సంతాన హత్యను, వారు నిలబెట్టిన భాగస్వాములు సరైనదిగా కనిపించేలా చేశారు.’’ (అల్‌ అన్‌ఆమ్‌: 137)
2- సంతాన హత్య మూర్ఖత్వం, అజ్ఞానం, నష్టానికి గురి చేసే చర్యగా ఖరారు చేయబడిరది.
‘‘అజ్ఞానం వల్ల, మూర్ఖత్వం వల్ల తమ సంతానాన్ని హత్య చేసిన వారూ…. నష్టానికి గురి అయ్యారు. (అల్‌ అన్‌ఆమ్‌:140)
3- సంతాన హత్య నుండి ముస్లింలను కఠినంగా వారించింది ఖుర్‌ఆన్‌.
‘‘పేదరికానికి భయపడి మీ సంతానాన్ని హత్య చేయకండి. మేము మీకూ ఉపాధినిస్తున్నాము. వారికీ ఇస్తాము.’’ (అల్‌ అన్‌ఆమ్‌:151)
‘‘పేదరికానికి భయపడి మీరు మీ సంతానాన్ని హత్య చేయకండి. మేము వారికీ ఉపాధిని ఇస్తాము, మీకూ ఇస్తాము. వాస్తవానికి వారిని హత్య చేయడం మహాపరాధం’’ (బనీ ఇస్రాయీల్‌: 31)
4- సంతానాన్ని హత్య చెయ్యబోమని స్త్రీల నుండి ప్రమాణం తీసుకోబడిరది`
‘‘తాము ఎవరినీ అల్లాప్‌ాకు సాటిగా నిలబెట్టము అనీ, దొంగతనం చేయము అనీ, వ్యభిచారం చేయము అనీ, తమ సంతానాన్ని హత్యచేయము అనీ’’ ప్రమాణం తీసుకోబడిరది. (అల్‌ ముమ్‌ తహినప్‌ా:12)
5- ఆడపిల్లలను హత్య చేసేవారిని ఇస్లామ్‌ తీవ్రమైన పదజాలంతో ఖండిరచింది.
‘‘వారిలో ఎవడికైనా కూతురు పుట్టినదనే శుభవార్తను అందజేస్తే అతడి ముఖాన్ని నల్లని ఛాయలు ఆవరిస్తాయి. అతడు లోలోన కుమిలిపోతాడు. ఈ దుర్వార్త విన్న తర్వాత ఇక లోకులకు ఎలా ముఖం చూపాలి అని అతడు నక్కినక్కి తిరుగుతూ ఉంటాడు. అవమానాన్ని భరిస్తూ కూతుర్ని ఇంట్లో ఉంచుకోవాలా లేక ఆమెను మట్టిలో పాతిపెట్టాలా? అని ఆలోచిస్తాడు.’’ (అన్‌ నప్ల్‌ా:58,59)
‘‘అసలు పరిస్థితి ఏమిటంటే, వారు కరుణామయుడైన దేవునికి అంటగట్టే సంతానమే వారిలోని ఒకడికి కలిగిందనే వార్త అందజేస్తే, అతడి ముఖం నల్లబడిపోతుంది, అతడు దుఃఖంలో మునిగిపోతాడు.’’ (అజ్‌ జుఖ్రుఫ్‌:17)
6- అమ్మాయిలను చంపే వారికి పరలోక శిక్ష ప్రకటించబడిరది.
‘‘సజీవంగా పాతిపెట్టబడిన బాలికను, నీవు ఏ తప్పువల్ల హత్య చేయబడ్డావని’’ అడగడం జరుగుతుంది. (అత్‌ తక్వీర్‌: 8,9)
ప్రవక్త ప్రవచనాలు
1- దైవప్రవక్త ఆడపిల్లలను సజీవ సమాధి చేయడాన్ని ఘోర పాపంగా పరిగణించారు.
‘‘తల్లుల పట్ల అవిధేయత చూపడాన్ని, ఆడపిల్లలను సజీవ సమాధి చేయడాన్ని అల్లాప్‌ా నిషేధించాడు.’’ (బుఖారీ: 2408, ముస్లిం: 1715)
2- అమ్మాయిలను ద్వేషించడాన్ని వారించారు. వారి ప్రాముఖ్యతను వివరించారు.
‘‘అమ్మాయిలను ద్వేషించకండి. వారు ప్రేమగల వాళ్ళు. చాలా విలువైన వాళ్ళు’’ అని అన్నారు. (అహ్మద్‌: 17373)
3- ఆడపిల్లలను సజీవంగా పాతిపెట్టకుండా, వారిని పోషించినందుకు స్వర్గ శుభవార్తను అందజేశారు.
‘‘ఏ వ్యక్తికైనా ఆడపిల్ల ఉండి, అతనామెను సజీవ సమాధి చేయకుండా, ఆమెను చిన్నచూపు చూడకుండా, ఆమెపై మగ పిల్లవానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఉంటే అల్లాప్‌ా అతణ్ణి స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు.’’ (అబూ దావూద్‌: 5146)
‘‘ఏ వ్యక్తికైనా ముగ్గురు అమ్మాయిలు ఉండి, అతను వారివల్ల కలిగే కష్టాలను సహించి, తన స్థోమత ప్రకారం వారికి తినిపించి, త్రాగించి, తొడిగించినట్లయితే, వారు అతణ్ణి నరకాగ్ని నుండి కాపాడే తెరగా మారుతారు.’’ (ఇబ్నె మాజ: 2947)
4- విశ్వాసుల మాత హజ్రత్‌ ఆయిషా (ర) వివరించారు: నా దగ్గరకు ఒక బిచ్చగత్తె తన ఇద్దరు కూతుళ్లను వెంట తీసుకొని వచ్చింది. నేను ఆమెకు మూడు ఖర్జూర పండ్లు ఇచ్చాను. ఆమె రెండు ఖర్జూర పండ్లు ఇద్దరు కూతుళ్లకు చెరొకటి ఇచ్చి, మిగిలిన ఒక ఖర్జూర పండును తన నోట్లో వేసుకోబోయింది. ఆ ఇద్దరు పిల్లలు అది కూడా ఇచ్చేయమని అడిగారు. ఆమె ఆ ఖర్జూరాన్ని రెండు ముక్కలుగా చేసి వాళ్ళిద్దరికీ చెరో ముక్క ఇచ్చేసింది. ఆమె చేసిన ఈ పని నాకు చాలా నచ్చింది. దైవప్రవక్త(స) వచ్చిన ప్పుడు నేను ఈ విషయాన్ని ప్రస్తావించాను. దానికాయన (స), దేవుడు ఆమె చేసిన పనికి మెచ్చుకొని ఆమె కోసం స్వర్గం తప్పనిసరి చేశాడు. (లేదా ఆయన, దేవుడు ఆమెకు నరకాగ్ని నుండి విముక్తినిచ్చాడు) అని అన్నారు. (ముస్లిం: 2630)
5- ఆడపిల్లల పట్ల ప్రేమను వ్యక్తపరిచారు`
దైవప్రవక్త (స), తన ముద్దుల తనయ ఫాతిమా(ర)ను అమితంగా ప్రేమించేవారు. ఫాతిమా ‘నా గుండె ముక్క’ అని ఆయన(స) అన్నారు. ఈ అవ్యాజానురాగం ఆమె వివాహం తర్వాత కూడా అలాగే ఉండిరది. ఆమె తండ్రిని కలవడానికి వచ్చినప్పుడల్లా ఆయన లేచి నిలబడి ఆమెకు స్వాగతం పలికేవారు. ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకునేవారు. (బుఖారీ: 3767)
విశ్వాసుల మాతృమూర్తి హజ్రత్‌ ఉమ్మె సలమా(ర) కుమార్తె జైనబ్‌ ఆయన(స) దగ్గరే పెరిగారు. ఆయన ఆ పాపను ఎత్తుకునే వారు, ముద్దు పెట్టుకునేవారు, తన భుజంపై కూర్చోబెట్టు కునేవారు.
ఈ వివరాల ద్వారా రెండు విషయాలు తెలిసొచ్చాయి.
మొదటిది : ఏదయినా ఒక విషయంలో ప్రజాభిప్రాయాన్ని మార్చడానికి నిరంతర ప్రయత్నం తప్పనిసరి అవుతుంది. ఒకటి రెండు రచనలు, ఒకట్రెండు ప్రసంగాలు, ఒకటి రెండు ప్రకటనలతో ఎలాంటి ప్రయోజనం చేకూరదు. రాయికి కూడా రంధ్రం వేయవచ్చు,కాకపోతే దానిపై నీటిబొట్టు నిరంతరాయంగా చాలాకాలం పాటు పడాల్సి ఉంటుంది. అలాగే నేడు ప్రజాభి ప్రాయాన్ని మలచవలసిన అనేక అంశాలున్నాయి. ఉదాహరణకు తల్లి కడుపులోనే ఆడబిడ్డను చంపేయడం, మద్యం సేవించడం, అంటరానితనం, కులాల మధ్య వివక్ష, వారసత్వ సంపదలో మహిళలకు వాటా ఇవ్వకపోవడం, వివాహాల్లో వృధాఖర్చు పోకడలు మొదలైనవి. ముస్లింల పట్ల తోటి దేశవాసుల్లో చాలా అపార్ధాలే ఉన్నాయి. వాటిని మార్చే ప్రయత్నం చేయొచ్చు.
రెండోది : ప్రజాభిప్రాయాన్ని మలచడంలో మీడియా పాత్ర చాలా కీలకమైంది. సోషల్‌ మీడియా ప్రతి ఇంటి లోపలకు, ప్రతి వ్యక్తి చెంతకు చేరుతుంది. అంచేత వివిధ కార్యక్రమాల ద్వారా, భిన్న ప్రయత్నాలు చేయడం ద్వారా మన సందేశాన్ని చాలా దూరం వరకు చేరవేయవచ్చు….