‘‘విద్య అనేది వ్యక్తిలోని మంచిని బయటకు తీసుకురావడానికి కృషి చేస్తుంది’’ అంటాడు గ్రీకు తత్త్వవేత్త ప్లేటో. మనిషి ఆటవిక జీవనం నుండి క్రమంగా మానవ వికాసంలో మార్పులు రావటం సామూహిక జీవనానికి అలవాటు పడటం మొదలైన తర్వాత సంజ్ఞల ద్వారా జరిగిన సంభాషణ కాస్తా ఒక రూపాన్ని సంతరించు కోవటం అనంతరం ఏ ప్రాంతంలోని వారు ఆ ప్రాంతానికి అనుగుణమైన భాషను రూపొందించుకోవటం ఆ తరువాత మనిషి నాగరిక జీవనానికి అలవాటు పడ్డట్టుగా అనేక చారిత్రక ఆధారాలు నిరూపించాయి. వెరసి ఇంత సుదీర్ఘంగా జరిగిన మానవ పరిణామ క్రమంలో ఆదిమ సమాజం నుండి నేడు అంతరిక్షానికి వెళ్తున్న ఆధునిక సమాజం వరకు జరుగుతున్న మానవ అన్వేషణలు అనేక ఫలితాలు ఇస్తున్నాయి. అందులో భాగంగానే నేడు మనం అనుభవిస్తున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం. అరచేతిలో వున్న చరవాణి (సెల్‌ఫోన్) ప్రపంచంలోని ఏ మూలాన ఎం జరుగుతున్నా క్షణాల్లో మన కళ్ళ ముందుంచటం అంటే మానవుడు సాధించిన అద్భుతమైన మేధో వికాసానికి ఉదాహరణ కాకపోతే ఏమిటి? రోజురోజుకు మానవుడు నూతన ఆవిష్కరణ లతో మేధస్సును మధించి కొత్తకొత్త యంత్రాలను సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆవిష్కరిస్తున్నప్పటికి తను కనిపెట్టిన యంత్రాలే భస్మాసుర హస్తం మాదిరిగా మారి మనుషులకు సవాల్ విసరటం కొంత ఆశ్చర్యం కలిగించకమానదు ఉదా: ‘‘ఆల్ప్రేడ్ నోబెల్’’ కనిపెట్టిన ‘‘డైనమెట్’’ కావొచ్చు, ‘‘రైట్’’ సోదరులు కనిపెట్టిన ‘‘విమానం’’ కావొచ్చు ఇవి రెండు మనిషి మెదడులోంచి వచ్చిన అద్భుతమైన ఆవిష్కరణలే కాని ఇవి రెండు కూడా రెండో ప్రపంచ యుద్దంలో(1939-1945) ఎంతటి విధ్వంసానికి కారణం అయినవో అందరికి తెలిసిన విషయమే.
ఇక ప్రస్తుతం మనిషి చేతిలో వున్న మరొక సాంకేతిక పరికరం ‘‘సెల్‌ఫోన్’’. చరవాణి చెరలో నేడు విద్యార్ధులు విలువైన సమయాన్ని దుర్వినియోగం చేసుకోవడం బాధ కల్గించే విషయం. చేతిలో పాఠ్యపుస్తకం ఉండాల్సింది పోయి సెల్‌ఫోన్ చేరింది. ఆ మధ్య కాలంలో కేంద్రం చేసిన ఓ సంచలన ప్రకటన ఈ సందర్భంగా ప్రస్తావించాలి. ‘‘మరుగుదొడ్డి’’ లేని ఇంట్లో విలువైన ‘‘సెల్ ఫోన్’’ చేరింది అనేది ఆ ప్రకటన సారాంశం. అంటే ఇక్కడ ఏది ప్రాథమిక అవసరమో, ఏది గౌణ అవసరమో గమనించాల్సిన విషయం, విస్తుగొలిపే వాస్తవం కూడా. జనాభాలో ఎనబై శాతంపైగా సెల్‌ఫోన్ వాడుతున్నారంటే ఆశ్చర్యం కలగకమానదు. మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మూడు సంవత్సరాల క్రితం కరోనా రూపంలో ఓ భయంకరమైన విపత్తు ప్రపంచాన్ని చుట్టుముట్టింది అది ఎలా వచ్చింది, ఏంటి అన్న అంశాల జోలికి పోకుండా ‘‘కరోనా’’ ప్రభావంతో ప్రపంచం మొత్తం స్తంభించి పోయింది. మనిషి సాధించిన సాంకేతిక పరిజ్ఞానానికి పెను సవాల్ విసిరింది. ఐతే దానికి అంతే తొందరగా మందుని (వ్యాక్సిన్) కనిపెట్టి అదుపులోకి తేగలిగాం. కాని కరోనా సమయంలో విద్యార్ధుల విలువైన సమయం వృధా కాకుండా ఉండటం కోసం ప్రత్యక్ష భోదన కాకుండా పరోక్ష బోధనకు నిపుణులు సూచిం చటం తరగతి గది బోధన కాస్తా ఆన్‌లైన్ బోధనకు శ్రీకారం చుట్టడం జరిగింది.
ఇక ప్రపంచవ్యాప్తంగా దాని దుష్ప్రభావాలు ఇప్పుడిప్పుడే యువతపై ప్రభావం చూయించటం మొదలైనవి. కోవిడ్ పుణ్యమా అని విద్యార్ధుల చేతికి వరంలా వచ్చిన ‘‘సెల్ ఫోన్’’ నేడు వారికి శరాఘాతంగా మారిందని చెప్పాలి. కోవిడ్ వ్యాపించిన ఈ మూడు సంవత్సరాల కాలంలో విద్యార్ధులు తరగతి గదికి దూరంగా ఉండటం వల్ల తప్పనిసరిగా ‘‘మొబైల్ ఫోన్’’ను కొనుగోలు చేయాల్సి రావటం ఫలితంగా ఆన్‌లైన్ క్లాసులు ఎంతమంది విని విద్యా ప్రగతిని సాధించారనేది ప్రశ్నార్ధకం. కాని నేడు విద్యార్ధుల పాలిట అదే ‘‘సెల్ ఫోన్’’ పెను విస్పోటనం కలుగ జేస్తుంది అనటంలో సందేహం లేదు. ఇటీవలే హైదరాబాద్‌లో జరిగిన సంఘటనలోని అంశాలు భయం గొలిపేవిధంగా వున్నాయి. నలుగురు మైనర్ విద్యార్ధులు ‘‘సెల్ ఫోన్’’లోని అశ్లీల వీడియోలు చూస్తూ వారు కూడా అలానే చేసి వీడియో తీసి ‘‘ఫేస్ బుక్’’లో అప్లోడ్ చేయాలని నిర్ణయించుకొని ఓ మైనర్ అమ్మాయిని ఎంచుకోవటం ఆ తరువాత జరిగిన పరిణామాలు మనందరికి తెలిసిన విషయమే.
తరగతి గదిలో గురువు చెప్పే అంశాలపై శ్రద్ధ పెట్టాల్సిన విద్యార్ధులు ఏకాగ్రత కోల్పోయి నిత్యం ‘‘సెల్ ఫోన్’’పై దృష్టిపెట్టి విలువైన సమయం వృధా చేస్తున్నారనేది పరిశోధకుల అభిప్రాయం. ఇంకాస్త ముందుకెళ్తే ఖచీూ వారి అనుబంధ సంస్థ ఐన ఔనూ ‘‘సెల్ ఫోన్’’ విద్యార్ధులపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరించింది. దీనివల్ల దృష్టి మందగిం చటం ఆందోళన కలగటం, ‘‘సెల్‌ఫోన్’’తో ఎక్కువ సమయం గడపటం కోసం ఒంటరితనాన్ని ఆశ్రయించటం నిద్రాభంగం, అనైతిక కార్యకలాపాలు, తద్వారా ఆరోగ్య సమస్యలు వస్తాయని పేర్కొంది. ‘‘కరోనా’’వల్ల ‘‘సెల్ ఫోన్’’కు అలవాటుపడిన విద్యార్ధులు నేడు దానికి బానిసలుగా మారి అది లేకపోతే ఉండలేని స్థితికి రావటం అంటే ఎంతగా వారిని ప్రభావితం చేస్తుందో అర్ధం చేసుకోవచ్చు. దీని ద్వారా ‘‘నోమోఫోభియా’’ అనే మానసిక వ్యాధికి గురవుతారని వైద్యులు సూచించటం ఆలోచించాల్సిన విషయం.
ఇక ‘‘సెల్ ఫోన్’’ పిల్లలపై ఇంకా ఎలా పభావం చూపుతుందో మరికొన్ని విషయాలు తెల్సుకుందాం. ఆ మధ్యకాలంలో మలేసియన్ ఆన్‌లైన్ జర్నల్ వారు చేసిన అధ్యయనంలో విద్యార్ధులు సుమారు 3-6 గంటల విలువైన సమయాన్ని ‘‘సెల్ ఫోన్’’తో కాలక్షేపం చేస్తున్నారనేది దాని సారాంశం. అంత మొత్తం విలువైన సమయాన్ని పుస్తకంపై కాకుండా ఉపయోగం లేని ‘‘చరవాణితో’’ కాలక్షేపం చేయడం వల్ల కలిగే పర్యవసానాలు ఎలా ప్రభావం చూపుతున్నాయో చూస్తూనే వున్నాం, ఇక ఈ సందర్భంగానే ఇక్కడ మరొక విషయం ప్రస్తావించాలి ఇటీవల బెంగళూర్ లోని ఓ ప్రైవేటు పాఠశాల విద్యార్ధుల స్కూల్ బ్యాగుల్ని పరిశీలిస్తే అందులో వివిధ రకాల ‘‘మాదక ద్రవ్యాలు, సిగరెట్లు, కండోమ్ ప్యాకెట్లు’’ మొదలైనవి దొరకటం సంచలనంగా మారిన విషయం అందరిని విస్మయానికి గురిచేసింది. దీనిపై స్పందించిన ప్రభుత్వ యంత్రాంగం వెంటనే తల్లితండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ చేయాలని నిర్ణయించటం అంటే సమస్య తీవ్రత ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు.
మనిషి జీవితంలో అత్యంత క్రియశీలక పాత్రపోషించేది ‘‘టీనేజ్’’ (13-19 సం. మధ్య) ఈ దశలోనే విద్యార్ధికి సరైన మార్గదర్శకత్వం చేయాలి, అధ్యాపకులు, తల్లిదండ్రులు పిల్లల్లో వస్తున్న శారీరక మానసికపరమైన మార్పులను పసిగట్టి సానుకూల దృక్పదంతో దిశానిర్దేశం చేయాలి, అభ్యాసన లోపాలు ఇంకా ఏమైన అసహజమైన పద్ధతుల్లో వారి ప్రవర్తన ఉన్నట్లయితే ముందే పసిగట్టి వారిని సక్రమ మార్గంలో నడిచేలా ఉపాధ్యా యులు, తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలి.
విద్య పరమావధి వ్యక్తిత్వ వికాసం. వ్యక్తిలో మూర్తిమత్వ వికాసం సమగ్రంగా, సంపూర్ణంగా సమర్ధవంతంగా జరగడానికి బాల్యం నుండి మొదలుకొని తరగతి గది నుండి వీడ్కోలు తీసుకొనే స్థాయి వరకు ఒక క్రమ పద్దతిలో పిల్లవాడికి లభించే సలహా, సహాయం (జశీబఅంవశ్రీశ్రీఱఅస్త్ర డ Gబఱసaఅషవ) ఎంతగానో తోడ్పడు తుంది. కాబట్టి విద్యార్ధి క్రియాశీలక భవిష్యత్తుకు ఆటంకం కల్పించే వస్తువులపట్ల (సెల్‌ఫోన్, ఇతర మాదకద్రవ్యాలు, మత్తు పదార్ధాలు) జాగరూకత లేకపోతే విద్య వ్యవస్థ ప్రమాదంలో పడే ఆస్కారం ఉంది.
అలా కాని పక్షంలో అటువంటి పిల్లలే భవిష్యత్తులో నేరాలకు పాల్పడి సమాజంలోని శాంతి భద్రతలకు విఘాతం కల్గించే అవకాశం లేకపోలేదు. అందుకే పాఠశాల స్థాయి నుండి డిగ్రీ లోపు విద్యార్ధులకు తరగతి గదిలోకి ‘‘సెల్ ఫోన్’’ అనుమతించ కుండా కఠిన ఆంక్షలు విధించాలి లేనిపక్షంలో విద్యార్ధి ఏకాగ్రత దెబ్బ తిని మధ్యలోనే (వృధా, స్తబ్తత) చదువు నుండి నిష్క్రమించే అవకాశం కూడా ఉంటుంది.