November 21, 2024

పెళ్లి వేడుక జరుగుతోంది. అందులో ఒక వ్యక్తి తనకు తెలిసిన ఓ పెద్దాయన్ను గుర్తుపట్టి వెళ్లి పలకరించాడు. ఆ పెద్దాయన చూపు ఆనకపోవడంతో పలకరించింది ఎవరా కళ్లకు చెయ్యి అడ్డుగా పెట్టి పట్టిపట్టి చూశాడు. తీరా గుర్తుపట్టాడు.

‘నువ్వు ప్రైమరీ స్కూలు శిష్యుడివి కదూ. ఇప్పుడేం చేస్తున్నావురా’ అని నవ్వుతూ ఆప్యాయంగా అడిగారాయన. ‘నేనూ మీలానే స్కూల్ టీచర్ ను. దీనికి మీరే స్ఫూర్తి’ అని సంతోంగా చెప్పాడు. అదెలారా నాయనా అని అడిగితే గతంలోకి వెళ్లాడు.. ‘ఒకరోజు క్లాస్ రూములో ఒక విద్యార్థి చేతివాచి దొంగతనానికి గురయ్యింది. ఆ వాచీ నాకెంతగానో నచ్చడంతో దాన్ని నేనే దొంగిలించాను. వాచీని ఎవరైతే తీశారో వెంటనే ఇచ్చేయాలని క్లాసులు ప్రకటించారు. ఆ సమయంలో గడియారాన్ని తిరిగి ఇచ్చేయాలనుకున్నాను కానీ భయంతో ఇవ్వలేకపోయాను. అందరి ముందూ పరువు పోతుందని భయపడ్డాను. మమ్మల్ని అందరినీ గోడవైపునకు తిరిగి కళ్లుమూసుకొని నిల్చోవాలని చెప్పారు. మేమంతా అలా నిలబడ్డాక అందరి జేబులు గాలించారు. అప్పుడు నా జేబులోనే ఆ గడియారం దొరికింది. నా పేరు మాత్రం ఎవ్వరికీ చెప్పకుండా ఆ గడియారం ఎవరిదో అతనికి ఇచ్చేశారు. ఆ రోజు మీరు చేసిన మంచి పని నాలో ఎంతో పరివర్తన తీసుకొచ్చింది. ఇంకెప్పుడూ దొంగతనం చేయరాదని నిర్ణయించుకున్నాను. నేను కూడా టీచర్ కావాలని గట్టిగా సంకల్పం చేసుకున్నాను.’ అని పాతరోజులను గురువుగారితో నెమరవేసుకున్నాడు. అంతలో గురువు గారు కలుగజేసుకుని ‘ఆ సందర్భంలో నేను కళ్లకు గంతలు కట్టుకున్నాను. ఆ వాచీ దొంగిలించిందెవరో నాకూ ఈ రోజే తెలిసింది’ అని చెప్పడంతో ఆ విద్యార్థి ఆశ్చర్యపోయాడు.
ఖలీఫా హారూన్ రషీద్ తన ఇద్దరు పిల్లలకు ఇంట్లోనే చదువులు చెప్పించేవారు. ఇమామ్ కసాయి చెప్పే పాఠాలను ఖలీఫా ఇద్దరు పిల్లలు మామూర్, అమీన్ ఎంతో బుద్ధిగా వినేవారు. గురువు గారికి పరమ విధేయులుగా ఉండేవారు. ఒకరోజు గురువుగారు చదువు చెప్పి ఇంటికెళ్లబోయారు. అంతలో అన్నదమ్ములిద్దరూ లేచి గురువు గారికి తానంటే తాను మేజోళ్లు తొడిగిస్తానని పోటీపడ్డారు. ఇద్దరిమధ్య స్వల్ప గొడవజరిగినంత పనయ్యింది. ఇంతలో గురువుగారు కలగజేసుకుని ‘చెరో చెప్పు తొడిగించండి’ అని చెప్పడంతో ఇద్దరి గొడవ సద్దుమణిగింది. ఈ ఘటన జరిగిన కొన్ని రోజులు గడిచిన తరువాత ఖలీఫాను కలుసుకున్నారు. ఆ సమయంలో ఖలీఫా హారూన్ రషీద్ ‘‘అత్యంత గౌరవనీయుడెవడు’’ అని ఇమామ్ కసాయిని అడిగాడు. దానికాయన ‘‘ఖలీఫా కంటే ఆదరణీయుడు, గౌరవనీయుడు ఇంకెవరుంటారు’’. అన్నారు. దానికి ఖలీఫా హారూన్ రషీద్ ‘‘ఖలీఫా కొడుకులు ఎవరికైతే చెప్పులు తొడిగించారో అతను గౌరవనీయుడు’’ అన్నారు. గురువులను ప్రవక్తల వారసులుగా అభివర్ణించారు ప్రవక్త మహనీయులు. జ్ఞానాన్ని నేర్పే వారికోసం సముద్రంలో చేపలు, భూమికింద కీటకాలు, ఆకాశంలో పక్షులు వేడుకుంటాయని ప్రవక్త (స) చెప్పారు. జ్ఞానసంపన్నులైన గురువులకు అల్లాహ్ మహోన్నత స్థానాలు ప్రసాదిస్తాడని ఖుర్ఆన్ పేర్కొంటోంది. మీలో విశ్వసించిన వారికి, జ్ఞానం ప్రసాదించబడిన వారికి అల్లాహ్ ఉన్నత స్థానాలు ప్రసాదిస్తాడు. (57:11)

ముహమ్మద్ ముజాహిద్