కూలి వాని చెమట ఆరకముందే అతని కూలీ ఇచ్చేయండి.
– ముహమ్మద్ ప్రవక్త (సఅసం)
– ముహమ్మద్ ప్రవక్త (సఅసం)
పుడమిపై శ్వాసించే ప్రతి ఒక్కరూ బ్రతుకు దెరువుకోసం ఎదోఒక పని చేయాల్సి ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయంతో పాటు వివిధరకాల పనులను మనిషి ఆశ్రయిస్తాడు భుక్తి కోసం. అందులో కాయ కష్టం చేసుకునే శ్రమ జీవులే అత్యధిక శాతం ఉన్నారు. అయితే సమాజంలో ఉద్యోగం చేసేవారికి, వ్యాపారం చేసేవారికి, లేక మరికొన్ని ఇతరత్రా వృత్తులు చేసేవారికి లభించే గౌరవం కూలి నాలి చేసుకునే శ్రమ జీవులకు లభించడంలేదు. నిజానికి మిగతా వారందరి కంటే ఎక్కువ గౌరవానికి వీరే అర్హులు. కష్టపడి, చెమటోడ్చి సంపాదించే డబ్బుతో జీవితం గడిపేవారి కంటే గౌరవనీయులు , నిజాయితీ పరులు మరొకరు కాజాలరు. పవిత్ర ఖురాన్ దృష్టిలో ఇలాంటివారే అందరికన్నా ఎక్కువగా సాఫల్యం పొందేవారు. కష్టజీవులను దైవ ప్రవక్త ముహమ్మద్ (స) అమితంగా ప్రేమించేవారు. అందరికన్నా ఎక్కువగా వారిని గౌరవించేవారు. ఏ వృత్తినీ ఆయన తక్కువగా చూడలేదు. వృత్తుల పరంగా మనుషుల మధ్య తారతమ్యాన్ని ఆయన ఏనాడూ సహించలేదు. జాతి, కులం, మతం, హోదా, అంతస్తు కారణంగా ఎవరూ ఎక్కువ కాని, తక్కువకాని కాదని చెప్పారు. నీతి నిజాయితీ, విశ్వసనీయత, దైవభీతి పరంగా ఎవరు ఉత్తములో వారే అందరికన్నా గౌరవనీయులని ప్రవక్త మహనీయులు సెలవిచ్చారు.
కష్టజీవి చేతుల్ని ముద్దాడిన ప్రవక్త
ఒకసారి ముహమ్మద్ ప్రవక్త (స) వారు, అనుచరుల మధ్య ఆసీనులై ఉండగా ఒకవ్యక్తి వచ్చాడు. అందరికీ వినయంగా సలాం (అభివాదం) చేసి కూర్చోబోయాడు. వెంటనే ముహమ్మద్ ప్రవక్త(స) అతనితో కరచాలనం చేసి తన పక్కనే కూర్చోబెట్టుకున్నారు. వచ్చిన వ్యక్తి బాగా కష్టజీవి అయినందున చేతులు కాయలు కాసి, మొరటుగా ఉన్నాయి. ఆ చేతులు చూసి ప్రవక్త మహనీయులు ఆశ్చర్య పొయ్యారు. ‘సోదరా! నీచేతులు ఇంతగా కాయలుకాసి నల్లగా ఉన్నాయేమిటి? ‘అని అదిగారు.
అప్పుడా వ్యక్తి , ‘ఏమీ లేదండీ.. నేను కూలి పని చేస్తాను. కుటుంబ పోషణ కోసం రాళ్ళు( పగుల) గొట్టే పనికి వెళుతుంటాను. బరువైన సుత్తెతో పదే పదే రాళ్ళను కొట్టడం వల్ల చేతులు కాయలుకాసి నల్లబడ్డాయి అంతే’. అని చెప్పాడు.
ఆ వ్యక్తి సమాధానం ప్రవక్త వారికి అమిత సంతోషాన్ని కలిగించింది. వెంటనే ప్రవక్త మహనీయులు కాయలు కాసిన ఆ నల్లని చేతులను ఆప్యాయంగా చుంబించారు. కాయకష్టం చేసుకునే కష్టజీవులపట్ల తనకున్న ప్రేమను, ఆప్యాయతను వ్యక్తం చేశారు ప్రవక్త మహనీయులు.
శ్రమ విలువ
సాధారణంగా ప్రజలు డబ్బు , హోదా , పలుకుబడి ఉన్నవాళ్ళను గౌరవిస్తారు. పేదసాదలను ఎవరూ పట్టించుకోరు. కాని ప్రవక్త మహనీయులు కష్టజీవులనే ఇష్టపడ్డారు. కాయలు కాసిన నల్లని చేతుల్ని ఆయన ముద్దాడారు. అంటే శ్రమ జీవులకు ముహమ్మద్ ప్రవక్త (స) ఎంతటి గౌరవాన్ని ప్రసాదించారో దీనివల్ల మనకు తెలుస్తోంది. ఒక సందర్భంలో ప్రవక్త మహనీయులు, ‘శ్రామికుని స్వేద బిందువుల తడి ఆరక ముందే అతని వేతనం చెల్లించాలి ‘ అని ఆదేశించారు. శ్రమజీవులపట్ల ఆ మహనీయునికి ఎంతటి కరుణ, ప్రేమానురాగాలున్నా యో దీనివల్ల మనకు అర్ధమవుతోంది. కనుక మనంకూడా ఆమహనీయుని అడుగుజాడల్లో నడుస్తూ అన్ని వృత్తుల వారిని, అన్ని పనులు చేసుకునే వారిని గౌరవించాలి. ఎవర్నీ చులకన భావంతో చూడకూడదు. ముహమ్మద్ ప్రవక్త (స) స్వయంగా శ్రమజీవుల చేతులను చుంబించారంటే వారు ఎంతటి అదృష్ట వంతులో మనం అర్ధం చేసుకోవాలి. నేడు కార్మికలోకం తమ హక్కులకోసం గొంతెత్తుతున్న సందర్భంలో మనమంతా వారికి అండదండగా నిలబడి ఖురాన్ బోధనలను, ప్రవక్తవారి ఉపదేశాలను లోకానికి గుర్తు చేయాల్సిన అవసరం ఉంది.
(మేడే శుభాకాంక్షలతో..)
– యండి. ఉస్మాన్ ఖాన్