టీం ఇండియా
నల్లటి టీ షర్టు ధరించిన రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ తన వయసు కన్నా తక్కువగా కనిపిస్తున్నారిప్పుడు. ఆరోగ్యంగా కనిపిస్తున్నారు. ఆసుపత్రిలోను, జైల్లోను చాలా కాలం గడిపినప్పటికీ హుషారుగా కనిపిస్తున్నారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేటు నిరంతరం ఆయన కుటుంబాన్ని వెంటాడుతున్నప్పటికీ, వేధింపులకు గురవుతున్నప్పటికీ అవేమీ పట్టించుకోనట్లు కనిపిస్తున్నారు. ఎంతో హుషారుగా కాంగ్రెసు మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీని పలకరిస్తూ కనిపించారు. ఇదంతా బెంగుళూరులో జరిగిన ప్రతిపక్ష సమావేశంలోని దృశ్యాలు. లాలూ ప్రసాద్ యాదవ్ గతంలో కనిపించే చురుకుదనం మరోసారి కనిపిస్తోంది. ప్రతిపక్ష నేతలందరిపై ఆ ప్రభావం కూడా కనిపించింది.
పాట్నాలో జూన్ లో చాలా మంది ప్రతిపక్ష నేతలు సమావేశమయ్యారు. అందులో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశానికి పాట్నా వచ్చిన మమతాబెనర్జీ అక్కడ ఎయిర్ పోర్టులో దిగగానే తిన్నగా ముందు లాలూ యాదవ్ ఇంటికే వెళ్ళారు. అంతకు ముందు లాలూ యాదవ్ చాలా సరదాగా రాహుల్ గాంధీతో పెళ్ళి గురించి ఆలోచనేమైనా ఉందా లేదా అని జోకులేశారు. పాట్నాలోనే బెంగుళూరు సమావేశం తేదీ నిర్ణయమై పోయింది. ప్రతిపక్ష సమైక్యత కోసం జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగా బెంగుళూరులో మరోసారి 26 పార్టీల నేతలు సమావేశమయ్యారు. సామాజిక న్యాయం, సానుకూల ప్రగతి, జాతీయ సంక్షేమం లక్ష్యాలుగా ఈ పార్టీలు ఒక్కటవుతున్నాయి. రెండు రోజుల పాటు ఈ సమావేశం జరిగింది. సారూప్య భావాలున్న పార్టీలు కలిసి పనిచేస్తాయని కాంగ్రెసు అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అన్నారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడడానికి ఇది చాలా ముఖ్యమైన సమావేశమని ఖర్గే చెప్పారు. ఈ సమావేశంలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారని చెప్పారు. ఈ కూటమి పేరు ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూసివ్ అలయెన్స్ సంక్షిప్తంగా ఇండియా అని ప్రకటించారు.
తర్వాతి సమావేశం ముంబయిలో జరగబోతోంది. ఆ సమావేశంలో 11 మంది సభ్యుల కోఆర్డినేషన్ కమిటీని ప్రకటిస్తామన్నారు. ఈ కూటమికి ఇండియా అని పేరు పెట్టిన వెంటనే రాజకీయంగా గగ్గోలు మొదలయ్యింది. బీజేపీ నేతలు ఎవరికి తోచిన వ్యాఖ్యలు వాళ్ళు చేయడం మొదలు పెట్టారు. ఇండియా అనే పేరు భ్రిటీషు వారు పెట్టిన పేరని, బ్రిటీషు వలసపాలన చిహ్నమని, దేశానికి భారత్ అనేదే అసలు పేరంటూ అస్సాం ముఖ్యమంత్రి బీజేపీ నేత హేమంత బిశ్వ శర్మ ప్రకటించాడు. ఆయన సోషల్ మీడియా ఖాతాల్లో బీజేపీ ఫర్ ఇండియా అని ఇంత వరకు ఉండేది ఇప్పుడు మార్చేసి బీజేపీ ఫర్ భారత్ అని పెట్టుకున్నాడు. కాని ఇండియా అనేది బ్రిటీషు వారు పెట్టిన పేరని ఈసడించేదయితే ఎక్కడెక్కడ ఈ పేరును మార్చగలం? రాజ్యాంగంలో కూడా ఇండియా అనే పేరే ఉంది. అనేక పార్టీల పేర్లలో ఇండియా అన్న పదమే ఉంది. కేంద్రం ప్రారంభించిన స్టార్టప్ ఇండియా, మేకిన్ ఇండియా, ఖేలో ఇండియా ఇలా అనేక వాటిల్లో ఇండియా అనే పేరే ఉంది. భారత ప్రధానిని ప్రైం మినిస్టర్ ఆఫ్ ఇండియా అనే అంటున్నాం. వివిధ దేశాలు కూడా ఇలాగే పిలుస్తున్నాయి. ఎక్కడెక్కడ ఇండియా అనే పేరు తీసి భారత్ అనే పేరు పెట్టాలో హేమంత బిశ్వ శర్మ చెప్పలేదు. ఫెర్టిలైజర్ జిహాద్ అనే కొత్త జిహాద్ కనిపెట్టిన హేమంత బిశ్వ శర్మ జవాబు కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఈ లోగా ఇండియా అనే పేరు పెట్టడం చట్టరిత్యా నేరమంటూ ఈ 26 పార్టీలపై పోలీసు కేసు కూడా ఒక చోట నమోదైంది. కాని ఇండియా అనేది సంక్షిప్త నామం. కూటమి మొత్తం పేరులో కూడ ఇండియా అనే పదం ఉంది, కాని దేశంలోని చాలా పార్టీల పేర్లలో ఇండియా అనే పదం ఉంది. కాబట్టి ఈ పోలీసు కేసు కోర్టు వరకు వెళుతుందా? ఉన్నత న్యాయస్థానాల వరకు వెళుతుందా? కోర్టులు దీనిపై ఎలాంటి తీర్పు ఇస్తాయన్న ఉత్కంఠ కూడా మరోవైపు ఉంది.
బీజేపీ నేతలు కార్యకర్తల్లో ఈ కంగారు, కలవరం ఎందుకుని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. బెంగుళూరు సమావేశం తర్వాత మమతాబెనర్జీ మాట్లాడుతూ రాహుల్ గాంధీపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇండియాను సవాలు చేసే శక్తి బీజేపీకి ఉందా అంటూ గర్జించారు. రాబోయే రోజుల్లో రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారబోతున్నాయన్నది ఈ ప్రతిపక్ష సమావేశం తర్వాత స్పష్టంగా అర్థమయ్యింది. మమతా బెనర్జీ ఎలాంటి శషబిషలు లేకుండా తామే అసలైన దేశభక్తులమని, రైతుల కోసం, దళితుల కోసం, దేశం కోసం పనిచేస్తున్నది తామేనంటూ ప్రకటించారు. ఈ సారి ఎన్నికల్లో ఇండియా గెలుస్తుందని, బీజేపీ ఓడిపోతుందని అన్నారు. ప్రతిపక్ష కూటమికి ఇండియా అని పేరు పెట్టిన తర్వాత సోషల్ మీడియాలో ఆసక్తికరమైన పోస్టులు కూడా కనిపించాయి. ఓట్ ఫర్ ఇండియా అంటూ గతంలో ప్రధాని మోడీ చేసిన ప్రసంగాన్ని ఇప్పుడు కొందరు ప్రచారంలో పెట్టారు.
ప్రస్తుతం దేశంలో లౌకిక ప్రజాస్వామిక విలువలను కాపాడుకోవలసిన అవసరం ఉందని సిపిఎం ప్రధాన కార్యదర్శి ఏచూరి సీతారాం అన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ కూటమిలోకి వచ్చారు. కాంగ్రెసు ట్విటరు హ్యాండిల్ పై అరవింద్ కేజ్రీవాల్ పోస్టు రావడం ఒకప్పుడు ఊహించలేని విషయం. అది కూడా ఇప్పుడు కనిపించింది. పాట్నాలో 16 పార్టీలు ఒక్కటయ్యాయి. ఇప్పుడు సంఖ్య పెరిగి 26కు చేరుకుంది. మోడీ తొమ్మిది సంవత్సరాల పాలనలో ఒక్క రంగం కూడా అభివృద్ధి చెందలేదు. ఐదారేళ్ళ క్రితం వరకు రైల్వేలు బాగానే పనిచేసేవి. ఇప్పుడు కూలబడ్డాయి. కేంద్ర ప్రభుత్వం అన్ని అమ్మేస్తుందంటూ కేజ్రీవాల్ మండిపడ్డారు.
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన నేత ఉద్ధవ్ థాక్రే మాట్లాడుతూ ఒక వ్యక్తి మొత్తం దేశంగా మారడం ఎన్నటికీ జరగదని అన్నారు. పాట్నాలో ప్రతిపక్ష సమావేశాన్ని బీహారు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు బెంగుళూరు సమావేశాన్ని కాంగ్రెసు పార్టీ ఏర్పాటు చేసింది. ఖర్గే, రాహుల్ గాంధీలు అందుబాటులో లేనందువల్ల ఈ సమావేశాన్ని కొన్ని రోజుల పాటు వాయిదా వేయడానికి ప్రతిపక్షాలు ఒప్పుకోవడం కూడా గమనార్హమైన విషయం. భారత్ జోడో యాత్ర, కర్నాటక ఎన్నికల విజయం తర్వాత రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ఇప్పుడు ప్రతిపక్ష కూటమికి ఇండియా సంక్షిప్తనామం పెట్టి రాహుల్ గాంధీ మాస్టర్ స్ట్రోక్ కొట్టారని చాలా మంది విశ్లేషకుల అభిప్రాయం. ఈ అభిప్రాయం నిజమే అన్నట్లు బీజేపీలో కంగారు కూడా కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఎన్డీయే మిత్రపక్షాల సమావేశం ఎన్నడూ ఏర్పాటు చేయని బీజేపీ ఇప్పుడు ఎన్డీయే సమావేశం ఏర్పాటు చేసింది.
కర్నాటకలో కాంగ్రేసు సాధించిన విజయం ఒక్క రాష్ట్రంలో సాధించిన విజయమే అయినప్పటికీ బీజేపీకి లోక్ సభ ఎన్నికలకు ముందు చావుదెబ్బ కొట్టినట్లయ్యింది. కర్నాటక ఎన్నికల్లో భజరంగ్ భళీ నినాదాలు, ముస్లిముల పట్ల విద్వేష ప్రసంగాలు ఏవీ పనిచేయలేదు. ఇంతకు ముందు బెంగాల్ ఎన్నికల్లోను ఇదే జరిగింది. మరోవైపు మణిపూర్ హింసాకాండ వల్ల ఈశాన్య రాష్ట్రాల్లోను వ్యతిరేకత పెరుగుతోంది. మరోవైపు ఢిల్లీ వీధుల్లో మహిళా మల్లయోధులు, అంతర్జాతీయంగా దేశానికి మెడల్స్ సాధించి పెట్టిన క్రీడాకారిణులు బీజేపీ నేతకు వ్యతిరేకంగా ప్రదర్శనలకు దిగిన సంఘటనలు కూడా బీజేపీ ప్రతిష్ఠను మట్టిలో కలిపాయి. మణిపూర్ హింసాకాండ తర్వాత రాహుల్ గాంధీ మణిపూర్ పర్యటించారు. అక్కడ శిబిరాల్లో తలదాచుకున్న బాధితులతో కలిసి మాట్లాడారు. వారి పిల్లలతో కలిసి భోజనం చేశారు. అదే సమయంలో ప్రధాని మోడీ విదేశాల్లో విహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో జరిగిన బెంగుళూరు సమావేశంలో కూడా మణిపూర్ చర్చ వచ్చింది. అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని మణిపూర్ పంపించాలని నిర్ణయించారు.
ప్రతిపక్ష సమైక్యత ఒక్కసారిగా సాధ్యపడలేదు. నిజానికి దీని వెనుక బీహారు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చొరవ చాలా ఉంది. కాంగ్రెసు నేతలతోను, ప్రాంతీయ పార్టీల నాయకులతోను ఆయన నిరంతరం సంప్రదింపులు జరిపారు. మమతాబెనర్జీ, అఖిలేష్ యాదవ్, అరవింద్ కేజ్రీవాల్ తదితర నేతలను ఒక్క తాటిపై తీసుకువచ్చే ప్రయత్నాలు చేశారు. మరోవైపు కాంగ్రెసు పార్టీ కూడా గతానికి భిన్నంగా అందరినీ కలుపుకు వెళ్ళే ధోరణి ప్రదర్శించింది. కేజ్రీవాల్ కు రాజ్యసభలో అవసరమైన మద్దతు ఇవ్వడానికి ఒప్పుకుంది. ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వం అధికారాలకు కోత పెట్టే ఆర్డినెన్సు విషయంలో కేజ్రీవాల్ కు పూర్తి మద్దతు ప్రకటించింది.
బీజేపీకి ఇప్పటికి కూడా రాజ్యసభలో మెజారిటీ లేదు. ఇటీవల విదేశాంగ మంత్రి యస్. జైశంకర్ రాజ్యసభలో సభ్యత్వం పొందారు. అయినా కూడా బీజేపీకి పూర్తి బలం లేదు. పైగా తృణమూల్ కాంగ్రెసు ఎంపీల సంఖ్య ఆరుగురు పెరిగారు. మమతాబెనర్జీ కూడా కేజ్రీవాల్ కు ఆర్డినెన్సు విషయంలో మద్దతిస్తున్నారు. కేంద్రం బెంగాల్ పట్ల కూడా సవతి తల్లి ప్రేమ చూపిస్తుందంటూ మండిపడ్డారు. బెంగుళూరు సమావేశానికి ముందు కాంగ్రెసు ఢిల్లీ ఆర్డినెన్సు విషయంలో కేజ్రీవాల్ కు మద్దతివ్వడం ద్వారా రాజకీయ పరిణతిని ప్రదర్శించింది. కాంగ్రెసు నిర్ణయం తర్వాత కేజ్రీవాల్ ప్రతిపక్ష కూటమిలో చాలా సంతోషంగా చేరాడు. నిజానికి కేజ్రీవాల్ కు కాంగ్రెసుకు మధ్య మమతాబెనర్జీ మధ్యవర్తిత్వం పనిచేసిందని కొందరంటున్నారు. నిజానికి జమ్ము కశ్మీర్ లో అధికరణ 374 రద్దు చేసినప్పుడు కేజ్రీవాల్ కేంద్ర నిర్ణయం పట్ల సానుకూలంగా వ్యవహరించడాన్ని మహబూబా ముఫ్తీ, ఉమర్ అబ్దుల్లాలు గుర్తు చేశారు. కాని ప్రతిపక్ష సమైక్యత సాధించడానికి ఈ విభేదాలను సమయస్ఫూర్తితో, చాకచక్యంగా పరిష్కరించడం జరిగింది. కర్నాటక ఉప ముఖ్యమంత్రి డి.కే.శివకుమార్ పోషించిన పాత్ర కూడా చాలా కీలకమైనది.
ప్రతిపక్ష సమావేశంలో కూటమి పేరు, కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ తదితర విషయాలపై చర్చ జరిగింది. కాంగ్రెసు నాయకత్వ పాత్ర పోషిస్తూ పెద్దన్నగా వ్యవహరిస్తుందన్న భయాలుండేవి. కాని కాంగ్రెసు రాజకీయ పరిణతి ప్రదర్శించింది. కన్వినర్ హోదా నితీష్ కుమార్ కు అప్పగించింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడ్డం, నిరంకుశ పోకడలను అడ్డుకోవడం ప్రతిపక్ష సమైక్యత ముఖ్య లక్ష్యాలు కాబట్టి అవసరమైన సర్దుబాట్లకు సిద్ధమే అన్నట్లు కాంగ్రెసు వ్యవహరించడం గమనించదగిన విషయం. ఫలితంగా ఒక ఏకాభిప్రాయం కుదిరింది. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట్ల ఆ పార్టీలకే ప్రాముఖ్యం ఉంటుంది. కాంగ్రెసు బలంగా ఉన్న ప్రాంతాల్లో కాంగ్రెసుకు ప్రాధాన్యత ఉంటుంది. అంటే బెంగాల్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, బీహార్ తదితర రాష్ట్రాల్లో కాంగ్రెసు వెనక్కు తగ్గుతుంది. రాజస్థాన్, కర్నాటక, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో కాంగ్రెసు ముఖ్యమైన పార్టీగా కొనసాగుతుంది.
అయితే తెలంగాణ పరిస్థితిని పరిశీలిస్తే, తెలంగాణలో కాంగ్రెసు బలం పుంజుకున్న దాఖలాలున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ డైలమా ఉంది. తెలుగుదేశం బీజేపీతో చేతులు కలుపుతుంటే, జగన్ పార్టీ ఎటూ తేల్చుకోలేదు. ఈ రెండు రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలు ఎలా ఉంటాయో చూడాలి. కాగా జగన్ సోదరి షర్మిలా కాంగ్రెసుతో చేతులు కలపడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనివల్ల చంద్రబాబునాయుడుకు ఆంధ్రప్రదేశ్ లో తలనొప్పి తప్పదు. తెలంగాణలో షర్మిలా ప్రభావం గురించి ఇప్పుడే ఎవరు ఏదీ చెప్పలేని పరిస్థితి ఉంది. బీజేపీని ఢీకొనడానికి ప్రధానంగా కేసీఆర్ తన పార్టీని జాతీయస్థాయిలో విస్తరించి, బీఆరెస్ అని పేరు మార్చారు. కాని ఇప్పుడు మారిన పరిస్తితుల్లో తెలంగాణను కాపాడుకోడానికే ప్రాముఖ్యం ఇస్తారన్నది స్పష్టం. బెంగుళూరు సమావేశానికి తెలుగుదేశం, మజ్లిస్ పార్టీలకు ఆహ్వానం అందలేదు. మజ్లిస్, బీఆరెస్ పార్టీలు బీజేపీకి బీ టీములుగా పనిచేస్తాయని కొందరి విశ్లేషణ. పైగా ఈ రాష్ట్రాల్లో బీజేపికి పెద్దగా బలం కూడా లేదు. పైగా మజ్లిస్ పార్టీ మహారాష్ట్రలో కాలు మోపడానికి ప్రయత్నించడం శరద్ పవార్, ఉద్ధవ్ థాక్రే వంటి మహారాష్ట్ర నేతలకు నచ్చడం లేదు. రాహుల్ గాంధీ ర్యాలీకి తెలంగాణలో వచ్చిన భారీ ప్రతిస్పందన కూడా మారుతున్న రాజకీయ సమీకరణాలకు సూచన.
ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఎన్నడూ ఎన్డీయే సమావేశం నిర్వహించడానికి ఇష్టపడని బీజేపీ హఠాత్తుగా ఢిల్లీలో 40 పార్టీలతో సమావేశం నిర్వహించింది. అవినీతిపరుల ముఠా లాంటి ప్రతిపక్ష కూటమికి జవాబుగా తమ ఎన్డీయేలో చాలా పార్టీలున్నాయని చూపించుకునే ప్రయత్నాలు జరిగాయి. ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ వంటి ఇటీవల పార్టీ మార్చిన నేతలతో పాటు, అందరూ మరిచిపోయిన చిరాగ్ పాశ్వాన్ ను కూడా హఠాత్తుగా బీజేపీ ముందుకు తీసుకువచ్చింది. ఒకప్పుడు తమకు మిత్రుడిగా ఉన్న నితీష్ కుమార్ ను దెబ్బతీయడానికి చిరాగ్ పాశ్వాన్ ను ఉపయోగించుకున్నారు. తర్వాత తేజస్వీ యాదవ్ నచ్చచెప్పడంతో చిరాగ్ పాశ్వాన్ బీహారులో మహాఘటబంధన్ లో చేరాడు. కానీ తర్వాత చిరాగ్ పాశ్వాన్ జేడీయుకు వ్యతిరేకంగా అభ్యర్థులను నిలబెట్టి ఎన్నికల్లో చావుదెబ్బలు తిన్నాడు. ఆ తర్వాత చిరాగ్ పాశ్వాన్ పేరు రాజకీయాల్లో వినిపించలేదు. ఇప్పుడు చిరాగ్ పాశ్వాన్ తనకు ఆరు లోక్ సభ సీట్లు కావాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ ఈ డిమాండ్ కు ఒప్పుకుంటుందా?
బీజేపీ పట్ల ప్రజలు విసిగిపోయారని శరద్ పవార్ అంటున్నారు. రాజకీయాల్లో తలపండిన శరద్ పవార్ మాటలను అంత తేలిగ్గా కొట్టిపారేయలేము. ఇప్పుడు అజిత్ పవార్ బీజేపీలో చేరడంతో శివసేనను చీల్చి బీజేపీ శిబిరంలోకి వచ్చిన ఏక్ నాథ్ షిండే పరిస్థితి అగమ్యగోచరమయ్యింది. దేవేంద్ర ఫడ్నవిస్, అజిత్ పవార్ వంటి అతిరథుల మధ్య చిక్కుకుపోయాడు. ఆయనతో ఉన్న ఎమ్మెల్యేలు కూడా నేడో రేపో ఉద్ధవ్ థాక్రే వైపు వెళ్ళిపోయే పరిస్థితి తలెత్తవచ్చు. పైగా అజిత్ పవార్ ఇంతకు ముందు కూడా బీజేపీ వైపు మొగ్గు చూపి తనపై ఎన్ ఫోర్స్ మెంట్ దాడులను తప్పించుకున్నాడు. ఇప్పుడు కూడా అజిత్ పవార్ అతనితో ఉన్న ఎమ్మెల్యేలు కేంద్ర సంస్థల నుంచి తప్పించుకోడానికి మాత్రమే ఈ ఎత్తుగడ వేశారని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. చివరకు అజిత్ పవార్ మళ్ళీ శరద్ పవార్ ఇంటికే తిరిగి వస్తాడని భావిస్తున్నారు.
ఏదిఏమైనా ఎన్డీయే సమావేశం సాధించింది ఏదీ కనబడలేదు. కాని ప్రతిపక్షాల కూటమికి ఇండియా అని సంక్షిప్త నామం పెట్టడం ద్వారా రాజకీయాల్లో కొత్త తుఫాను ప్రారంభమయ్యింది. రాబోయే రోజుల్లో ఈ గాలులు ఎటు నుంచి ఎటు వీస్తాయో చూడాలి.