November 22, 2024

కన్యాశుల్కంలో ఉర్దూ పదప్రయోగాలు

కన్యాశుల్కం శతాబ్ధం క్రింద రాయబడిన పుస్తకం. ఈ నాటకాన్ని మొదట 1892లో ప్రచురించారు. 1897లో మొదటి సారి ప్రచురించారు. గురజాడ అప్పారావు ఈ నాటకాన్ని రాశారు. ఆయన విజయనగరానికి చెందినవారు. తెలంగాణలో ఉర్దూ ప్రభావం ఉందనుకోవచ్చు, కాని విజయనగరంలోని తెలుగుభాషపై కూడా ఉర్దూ ప్రభావం మనకు ఈ నాటకంలో స్పష్టంగా తెలుస్తుంది. తెలుగు భాషపై ఉర్దూ ప్రభావాన్ని, ముఖ్యంగా కన్యాశుల్కంలో ఉర్దూ పదాలను పరిశీలించడం ఈ వ్యాసం ఉద్దేశ్యం. నిజానికి ప్రతి భాష తన సమాపంలోని మరో భాషపై ప్రభావం వేస్తుంది. ఉర్దూపై కూడా తెలుగు పదాల ప్రభావం ఉంది. ఈ ఆదానప్రదానాలే భాషలను సజీవంగా ఉంచుతాయి. కన్యాశుల్కంలో ఉర్దూ పదాలను పరిశీలిద్దాం.

కన్యాశుల్కం మొదటి పంక్తిలోనే ’’సామాను‘‘ అన్న పదం ఉంది. గిరీశం స్వగతంలో అనుకుంటాడు. నిజానికి ఆ పంక్తిలో రూపాయలు అన్న మాట కూడా ఉర్దూయే. తెలుగు భాషపై ఉర్దూ ప్రభావమెంత ఉందో దీన్ని బట్టి అర్ధమవుతుంది. తెలుగులో విడదీయరానంతగా కలిసిపోయిన ఇలాంటి పదాలు చాలా ఉన్నాయి. కుర్చీ, రైతు వగైరా పదాలు ఇప్పుడు తెలుగుదనం ఎంతగా సంతరించుకున్నాయంటే, వీటి బదులు మరో పదం వాడే అవకాశమే మిగల్లేదు.

కన్యాశుల్కంలో ఉర్దూ పదప్రయోగాల గురించి మరింత విస్తారంగా మాట్లాడుకునే ముందు నాకు బాగా నచ్చిన ఒక డైలాగు గురించి మాట్లాడుకోవాలి. మధురవాణి ’’మీరు శిష్యులు కావాలంటే యిస్కూలు జీతం ఇచ్చుకోవాలి‘‘ అంటుంది. స్కూలు అనే పదం ఇంగ్లీషు పదం. ఇప్పుడు మనం స్కూలు అనే రాస్తాం. యిస్కూలు అని రాయం. కాని చాలా మంది రచయితలు యిస్కూలు అనే రాశారు. ఉర్దూలో ఇప్పటికి కూడా యిస్కూల్ అనే రాస్తారు. ఈ స్పెల్లింగుకు కారణం ఖచ్చితంగా ఉర్దూ ప్రభావమే. అలాగే మధురవాణి పోలిశెట్టితో మాట్లాడుతూ ’’మీరు కిరస్తానం అయితే కావచ్చును‘‘ అంటుంది. ఇక్కడ కిరస్తానం అనే పదం కూడా ఉర్దూ స్పెల్లింగ్ ప్రభావమే. ఉర్దూ లిపిలో అచ్చుల వాడకం చాలా తక్కువ. తెలుగు మాదిరిగా గుణింతాలు లేవు. ఉర్దూలో రాసిన సనమ్ అనే పదాన్ని సినమ్, సనిమ్, సునమ్, సునుమ్ ఎలా పలకాలన్న సంజ్ఞ ఏదీ లిపిలో ఉండదు. భాష తెలిసినవాళ్ళు అలవాటుగా సునాయాసంగా చదివేస్తారు. భాష తెలియకుండా కేవలం లిపి నేర్చుకుంటే చదవడం సాధ్యం కాదు. కాని ఉర్దూవాళ్ళకు తెలియని కొత్తపదం వచ్చినప్పుడు దాని ఉచ్ఛారణ తెలియక దాని స్వరూపమే మార్చేస్తారు. అందువల్ల క్రీస్టియన్ అనే పదాన్ని ఉర్దూలో రాసేటప్పుడు కరస్టాన్ లేదా కరస్తాన్ అయిపోయింది. రాసేవారు క్రీస్టియన్ అనే రాశారు, కాని చదివేవాడు కిరస్తాన్ అని లేదా కిరస్టాన్ అని చదువుతాడు. ఇది ఉర్దూ లిపితో ఉన్న సమస్య. అందువల్లనే కిరస్తానీ, కిరస్తానం వంటి పదాలు మనకు వచ్చాయి. ఆఫ్గనిస్తాన్, బెలూచిస్తాన్, పాకిస్తాన్ వంటి పదాల్లో స్తాన్ అంటే ప్రదేశం అన్న అర్ధం ఉంది. ఆ అర్ధమేదీ కిరస్తాన్ లో లేదు. ఇది లిపి సమస్య వల్ల ఉచ్ఛారణ మారిన పదం. ఇలా ఉర్దూ లిపి కారణంగా ఇంగ్లీషు పదాలు రూపం మారి ఉర్దూలోకి వచ్చినవి ఉన్నాయి. అవి అలాగే తెలుగుపై కూడా ప్రభావం వేశాయి.

ఇలా తెలుగులో తెలుగు పదాలుగా కలిసిపోయిన పదాలకన్నా ముందు ప్రత్యేకంగా కన్యాశుల్కంలో కనిపించే కొన్ని ఉర్దూ పదాలను పరిశీలిద్దాం. ముఖ్యంగా చూడగానే ఉర్దూ పదాలనిపించేవాటిని ముందు చూద్దాం:

వీడి వూరికి వుడాయిస్తే చాలా చిక్కులు వదుల్తాయి అని గిరీశం అంటాడు. ఉడ్నా అంటే ఎగరడం. వో వుడ్ గయా అంటే వాడు ఎగిరిపోయాడు. ఈ పదం కాస్త వుడాయించు అయ్యింది. అంటే ఉర్దూ పదానికి యించు ప్రత్యయం చేర్చి తెలుగుపదంగా మార్చేయడం. ఇప్పుడు తెలుగు శ్లాంగ్ లో అర్ధం చెప్పుకోవాలంటే చెక్కేయడం. వాడు వూరికి చెక్కేస్తే అనే అర్థంతో వాడారు. ఇలాంటి పదాలు చాలా మనకు కన్యాశుల్కంలో కనిపిస్తాయి. బనాయింపు పదం బనానా అనే ఉర్దూ పదం నుంచి వచ్చింది. అంటే బనానా అంటే తయారు చేయడం. ఈ తయారు కూడా ఉర్దూయే. కాని బనానా అంటే ఇప్పుడు ఉర్దూలో ఫూల్ చేయడం అనే భావం కూడా ఉంది. బనాయించడం అలాంటిదే. అబద్దాన్ని నిజంగా తయారు చేయడం. రామప్పంతులు ఫిరాయిస్తాను అంటాడు. ఫిర్ అంటే తిరిగి లేదా మళ్ళీ అని అర్ధం. ఇక్కడ తిరిగిస్తాను అన్న భావంతో వాడారు. కరటకశాస్త్రి రోకాయించకూడదు అంటాడు. రోక్ అంట్ ఆపు అని అర్ధం. రోక్నా అంటే ఆపడం. ఈ పదానికి యించు ప్రత్యయం చేర్చి తెలుగు చేసారు. అడ్డుకోరాదన్న భావంతో వాడారు. అలాగే బచాయిస్తుంది. బచానా అంటే కాపాడ్డం. బచ్నా అంటే తప్పించుకోవడం (ప్రమాదం వగైరా). ప్రాణం బచాయిస్తుంది అంటే ప్రాణం తప్పించుకుంది, బతికి బయటపడొచ్చు అనే భావంతో వాడారు. అలాగే సమాళించుకుని అన్న పదం కనబడుతుంది. సంభల్నా అంటే నిలదొక్కుకోవడం. సమాళించుకుని అంటే నిలదొక్కుకుని అన్న భావంతో వాడారు. బయిఠాయిస్తుంది అన్న పదం రామప్పంతులు చెబుతాడు. బైఠ్నా అంటే కూర్చోవడం. ఇక్కడ తిష్ఠవేస్తుంది అన్న భావంతో వాడారు. అలాగే ఛపాయించాడు అన్న పదం. ఛుప్నా అంటే దాక్కోవడం. దాక్కున్నాడు అన్న భావంతో వాడారు. దౌడాయింపిస్తాను అని రామప్పంతులు అంటాడు. దౌడ్ అంటే పరుగు. దౌడాయించడం అంటే పరుగుపెట్టిస్తాను అన్న భావంతో వాడారు. గభరాయింపజేస్తాను అంటాడు గిరీశం. గభరానా అంటే కంగారు పడడం. వాడిని హడలగొడతాను అన్న భావంతో వాడారు. బైరాగి భరాయించి అన్న పదం పలుకుతాడు. భర్నా అంటే నింపడం. భరాయించడం అంటే నింపడం అన్న భావం. దాఖల్చేయించడంలో దాఖలు అంటే సబ్మిట్ చేయడం అన్న భావం, చలాయించడంలో చలానా అంటే నడిపించడం, చలాయించడం అంటే నడిపించడం అనే భావం, బజాయించిలో బజానా అంటే మోగించడం, బజాయించడం అంటే మోగించడం అన్న అర్ధం.

ఈ పదాలన్ని యించు అనే ప్రత్యయం వాడి తెలుగీకరించుకున్న పదాలు. తెలుగు పదాలుగా కలగలిసిపోయినా వీటిని గుర్తు పట్టవచ్చు. కాని అస్సలు గుర్తు పట్టలేని పదాలు కూడా మనకు కన్యాశుల్కంలో కనబడతాయి. కబుర్లు అన్న పదం అలాంటిదే. ఖబర్ అంటే వార్త అని అర్ధం. క్యా ఖబర్ హై ఏంటి సంగతులన్న భావం. ఈ భావంతోనే ముచ్చట్లు, సంగతులు అనడానికి బదులు ఇప్పుడు కబుర్లు అన్న పదమే స్థిరపడిపోయింది. అలాగే తడాఖా అన్న పదం. ఉర్దూలో తడాఖ్ పదానికి సరయిన తెలుగు అనువాదం ’’ఫెళ్ళుమనడం‘‘ అంటే ఏదైనా పగిలినప్పుడు, విరిగినప్పుడు వచ్చే శబ్ధం. ఇది తెలుగులో తడాఖా అయ్యింది. క్రమేణా కొత్త అర్ధాలు సంతరించుకుంది. తడాఖా చూపిస్తానంటే దమ్ము చూపిస్తాను. తడాఖా తీస్తానంటే, విరగ్గొడతాను ఇలాంటి భావాల్లో స్థిరపడింది. ఇందులో ఆచోకి అన్న పదం అన్ ట్రేసెడ్ ఒరిజిన్ అని బ్రౌన్ మిశ్రమభాషా నిఘంటువు సూచిస్తుంది, కాని ఈ పదాన్ని చూస్తే ఉర్దూ నుంచి వచ్చినట్లు కనిపిస్తుంది. అసలు పదమేమిటో తెలియదు. అలాగే కస్పా బజారు, కస్బా అరబీ పదం. కస్బా అంటే కోట అనే అర్ధం కూడా ఉంది. ప్రదేశం అన్న అర్ధంతో కూడా ఉర్దూలో వాడతారు. అలాంటి అర్ధంలోనే ఇక్కడ ఈ బజారుకు ఈ పేరు వచ్చిందేమో. బజారు కూడా పూర్తిగా ఉర్దూ పదం. అదే అర్థంతో తెలుగులో ఉంది. అలాగే దుకాణం కూడా దుకాన్ అన్న పదం దుకాణమైంది. బస అన్న పదం కూడా అలాంటిదే. బసా అంటే నివాసమున్నాడు అని ఉర్దూలో భావం. బస్నా అంటే నివాసానికి స్థిరపడడం. కాని తెలుగులో ఈ పదం తాత్కాలికంగా విడిది చేయడానికి వాడుతున్నాం. ఉర్దూలో ఖియాం అనే అరబీ పదం వాడతారు. అలాగే రాదారి, ఈ పదం విచిత్రమైంది. ఉర్దూలో రాహ్ అంటే మార్గం, దారి అని భావం. ఉర్దూ తెలుగులో ఒక భావాన్నిచ్చే రెండు పదాలను కలిపి రాదారి అని వాడుతున్నారు. రాజమార్గం అని చెప్పడానికి మొదట్లో ఉపయోగించి ఉండవచ్చు. ఆబోరు అన్న పదం ఆబ్రూ అన్న పదం నుంచి వచ్చింది. ఆబ్రూ అంటే గౌరవమర్యాదలు. అబ్రూరేజీ అంటే ఉర్దూలో మానభంగం అన్న అర్ధంతో వాడతారు. అలాగే రుణ్, క్షణ్ అనే పదాలు సంస్కృతం మూలం నుంచి ఉర్దూలోకి వచ్చిన పదాలు. రుణం, క్షణం సంస్కృతం నుంచి వచ్చాయా, ఉర్దూ నుంచి వచ్చాయా అన్నది వేరే చర్చ. ఉర్దూ భాష స్వయంగా అనేక భాషల నుంచి పదాలను కలుపుకుని ఏర్పడిన భాష. సిఫారిష్ సిఫారసు అయ్యింది. బహదూర్ కాస్త బహద్దర్ అయ్యింది. సిక్కా అలాగే వాడారు. సిక్కా అంటే నాణెం అని అర్ధం. గిరీశం తనకు ముసాయిబ్ ఉద్యోగం వచ్చిందని చెబుతాడు. ముసాహిబ్ అంటే చెలికాడు అని అర్ధం. అంటే తన ఆంతరంగిక ఉద్యోగిగా నియమించారన్న భావంతో చెబుతాడు. అలాగే హమేషా అనే పదం అలాగే వాడారు. అంటే ఎల్లప్పుడు అని అర్ధం. హమేషా బాద్షావారి హుజూర్న ఉండడం అంటే ఎల్లప్పుడు రాజుగారి సమక్షంలో ఉండడం. తెలుగులో మనం వాడే హాజరు పదం దీని నుంచి వచ్చిందే. హాజరు కావడం సమక్షానికి రావడం. హాజిర్ జవాబ్ అంటే అప్పటికప్పుడు జవాబివ్వడం. హుజూర్ అన్న పదానికి సమక్షాన హాజరు కావడం అన్న అర్ధంతో పాటు మహాప్రభువు అన్న భావం కూడా ఉంది. స్పెల్లింగులో ఎలాంటి తేడా లేదు. సందర్భాన్ని బట్టి అర్ధం చేసుకోవాలి. కబడ్దార్ అన్న పదం తెలుగులోకి రాగానే అర్ధం మారిపోయింది. ఈ పదం ఖబర్ నుంచి వచ్చింది. ఖబర్ అంటే వర్తమానం, సమాచారం అని అర్ధం. ఖబర్ దేనా అంటే తెలియజేయడం, సమాచారమివ్వడం. దార్ అన్న పదం ప్రత్యయం. అంటే సమాచారం తెలిసినవాడు. ఖబర్ దార్ అంటే సమాచారం తెలుసుకున్నవాడు. ఖబర్ దార్ కర్నా అంటే అలర్ట్ చేయడం. అంటే ఏదన్నా విషయం గురించి జాగ్రత్తగా ఉండమని చెప్పడం, హెచ్చరించడం వగైరా భావాలున్నాయి. ఈ చివరి భావం తోనే తెలుగులోకి ఈ పదం వచ్చింది. కాని తర్వాత బెదిరించడం, హెచ్చరించడం అన్న అర్ధాల్లో స్థిరపడింది. దార్ అన్న ప్రత్యయం చాలా పదాల్లో మనకు కనబడుతుంది. దుకాణదారుడు, సప్లయిదారుడు వగైరా పదాలన్నీ ఇలాంటివే.

చూడు నా తమాషా అన్న ప్రయోగం గురజాడ చేశారు. తమాషా అన్న పదానికి వినోదప్రదర్శన అని అర్ధం. హాస్యం, ఎగతాళి, వైభవం, ఆట, లీల వగైరా అర్ధాలు సందర్భాన్ని బట్టి వర్తిస్తాయి. ఇక్కడ గురజాడ చూడు నా దెబ్బ అన్న అర్ధంతో వాడారు. నిజానికి చూడు నా లీల అన్న అర్ధంతో వాడారనిపిస్తుంది. అలాగే ఖాయలా అన్న పదం యథాతథంగా ఉర్దూ అర్ధంలోనే వాడారు. ఖాయలా అంటే వ్యాధిపడడం. బలహీనమవ్వడం. మునసబీ అన్న పదం మున్సిఫ్ అన్న పదం నుంచి వచ్చింది. మున్సిఫ్ అంటే న్యాయం చేసేవాడు. మున్సిఫ్ కోర్టులు ఇప్పుడు కూడా మనకు ఉన్నాయి. గ్రామస్థాయిలో మున్సబు పంచాయతీలు నిర్వహించేవారు. మున్సబీ అన్నది అదే భావంతో వాడారు. మున్సబు పదవి ఇస్తారని. గుమాస్తా అన్న పదం కూడా ఉర్దూ నుంచి ఉచ్ఛారణ మారి వచ్చింది. ఉర్దూలో గుమాష్తా అంటారు. కాని ఎక్కువగా వాడే పదం మున్షీ. అలాగే భరువసా అన్న పదం భరోసా నుంచి వచ్చింది. అంటే నమ్మకం. అలాగే ఫలానా అన్న పదం యథాతథంగా అదే అర్ధంతో తెలుగులో వాడుతున్నాం. సవబొకటి చెబుతాను అంటాడు గిరీశం. ఇది సబబు నుంచి వచ్చింది. సబబ్ అంటే కారణం అని అర్ధం. ఒక కారణం చెబుతాను అనడానికి సవబొకటి అని రాశారు. కత్తీ కఠారి అన్న పదాల్లో కఠారీ ఉర్దూ పదం. కాటారా అంటే పిడిబాకు. తనఖా అన్న పదం ప్రస్తావించదగింది. ఇప్పుడు ఉర్దూలో తనఖా అన్న పదానికి అర్ధం జీతం అని. తనఖా లేదా తంఖా అన్న పదానికి బ్రౌన్ ఇచ్చిన రెవిన్యూ అర్ధం An assignment on the revenue. An order on the treasury for the payment of a stipend. ఈ అర్ధంతో తనఖా పత్రం వగైరాలు పేర్కొన్నాడు. కాని గురజాడ తాకట్టు అన్న అర్ధంతో వాడారు. తెలుగులో ఇప్పుడు తనఖా అంటే తాకట్టు అన్న అర్ధమే ఉంది. జీతం అన్నఅర్ధం తాకట్టు అన్న అర్ధంగా ఎలా మారిందో తెలియదు.తంఖా గురించి మాట్లాడినప్పుడు కన్యాశుల్కంలో లేకపోయినా తంటా అన్న పదం కూడా ప్రస్తావించాలి. ఇది తంత్ నుంచి వచ్చింది. తంత్ అంటే అగత్యం, అవసరం, సమయం వగైరా అర్ధాలున్నాయి. తంతు కూడా ఇందులోంచి వచ్చిందే. ఫర్వాలేదు, ఫర్వా ఉండదు కూడా అలాంటిదే. ఉర్దూలో ఫ కాదు పర్వా అంటే అవసరం, చింత, విచారం, లక్ష్యం వగైరా అర్ధాలున్నాయి. ఫర్వాలేదు అంటే చింత లేదు అన్న భావంతో తెలుగులోకి వచ్చింది. ఆలండౌలత్తులు అనే పదాలు చూడగానే ఉర్దూ అని తెలిసిపోతాయి. దౌలత్ అంటే సంపద, భోగభాగ్యాలు. ఆలమ్ అంటే విలాసం అన్న అర్ధం ఉంది. ఆలమ్ దౌలత్తులు అన్న మాట భోగభాగ్యాల విలాసంతో అని భావం. గిరీశం రాసిన ఉత్తరంలో తాజాకలం అన్న పదం ఉంది. తాజాకలం అంటే కొత్త పేరా లేదా పోస్ట్ స్క్రిప్ట్ అని బ్రౌన్ అర్ధాలు రాశారు. తాజా అంటే ఫ్రష్ అని అర్ధం. రెండవ పదం బహుశా కలం కాదు కలాం. అంటే మాట అని అర్ధం. తాజా కలాం అంటే ఒక కవి రాసిన కొత్త కవిత అన్న భావం ఉర్దూలో ఉంది. అయితే ఖలమ్ బంద్ కర్నా అంటే రాయడం అన్న అర్ధం ఉంది. కాబట్టి ఈ పదం తాజాకలం కూడా కావచ్చు. విరాగి పదం నుంచి బైరాగి వచ్చింది. తాలూకు అన్న పదం ఉర్దూలో కూడా తాల్లూక్ అంటే సంబంధం అన్న అర్ధంతోనే వాడతారు. గమ్మత్తు అన్న పదానికి అర్ధం వినోదకాలక్షేపం అని భావం. ఈస్టర్న్ ఘాట్స్ అంతా పొగాకు అరణ్యం చేస్తానంటాడు గిరీశం. ఇందులో ఘాట్స్ అన్న పదం ఘాటీ అన్న ఉర్దూ పదం నుంచే వచ్చింది. ఘాటి అంటే కొండదారి. జోడు గుర్రాల బండిలో జోడు ఉర్దూలో జోడా నుంచి వచ్చింది. జోడా అంటే జత. భారంగా అన్న పదం భార్ నుంచి వచ్చింది. భార్ అంటే బరువు. పీపాలు కాళీ అయిపోయినాయి అంటాడు బైరాగి. పీపా, ఖాళీ రెండు పదాలు హిందూస్తానీ నుంచే వచ్చాయి. చిలుం అన్న పదం చిల్లం అనే పదం నుంచి వచ్చింది. సిపాయానా అన్న పదం గమనించదగ్గది. సిపాయానా అంటే సైనికుడికి నెలకు ఇచ్చే జీతం. తనఖా అన్న పదం దీన్నే సూచిస్తుంది. అలా సిపాయి ఉద్యోగం చేయాలని ఉందా అని మునసబు అడుగుతాడు. అలాంటి పదాల్లో సాకీను ఒకటి. ఇది తత్సమ రూపమే. ఎలాంటి మార్పు లేకుండా ఉర్దూ నుంచి వచ్చింది. ఉర్దూలో సాకీన్ అంటే నివాసం.

ఇన్ని ఉర్దూ పదాలు తెలుగులోకి ఎలా వచ్చాయన్నది ఆలోచించవలసిన ప్రశ్న. కన్యాశుల్కం ప్రారంభంలో గురజాడ రాసిన పదాలు గమనిస్తే మనకు చాలా విషయాలు తెలుస్తాయి. శ్రీశ్రీశ్రీ హర్ హైనెస్ మహారాజా కుమారికా సాహెబా ఆఫ్ విజయనగరం, మహారాణి ఆఫ్ మాధోగఢ్, రీవా సర్కార్ వారి భృత్యుడగు గురజాడ అప్పారావుచే రచించబడింది అని రాశారు. ఇందులో సాహెబా, సర్కార్ పదాలు స్పష్టంగా ఉర్దూ పదాలు. విజయనగరంలో ఉర్దూ ప్రభావాన్ని ఈ పదాలు చెబుతున్నాయి. ముగల్ చక్రవర్తి ఔరంగజేబు 1687లో గోల్కొండ కోటను జయించినప్పుడు పూసపాటి పాలకుడు పూసపాటి సీతారామ చంద్రరాజుకు ఒక ఖడ్గాన్ని బహూకరించాడు. ఆ ఖడ్గం పేరు జుల్ఫికర్. ఇది ఒక ప్రత్యేకమైన ఖడ్గం. ప్రవక్త ముహమ్మద్ సన్నిహిత అనుచరుడు, అల్లుడు అయిన హజ్రత్ అలీ ఒక ప్రత్యేకమైన ఖడ్గాన్ని వాడేవారు. ఇది ఒక ఖడ్గం కాదు. రెండు ఖడ్గాలు పిడి వద్ద కలిసిపోయి ఉంటాయి. ఒకదానిపై ఒక ఖడ్గం. పై ఖడ్గం పదును పైకి, క్రింది ఖడ్గం పదును క్రిందికి ఉంటుంది. దోధారీ తల్వార్ లాంటిదే కాని భిన్నమైనది. అలాంటి ఒక ఖడ్గం పూసపాటి రాజులకు ఔరంగజేబు బహూకరించాడు. మన్నె సుల్తాన్, కింగ్ ఆఫ్ హిల్స్ అన్న బిరుదు కూడా ముగల్ చక్రవర్తి ఇచ్చాడు. మీర్జా అన్న బిరుదు కూడా ముగల్ చక్రవర్తులు ఇచ్చిందే. దీనికి సంబంధించి 1760 నాటి ఫర్మానా ఉంది. గజపతులన్న టైటిల్ కూడా ఔరంగజేబు ఇచ్చిందే అంటారు. ఇప్పటికీ ఈ వంశం రాజులు తమ కోటు చేతులపై ఈ చిహ్నం ప్రదర్శిస్తారని అంటారు. అంతకు ముందు కుతుబ్ షాహీ పాలకులతోను పూసపాటి రాజులకు సంబంధాలు ఉండేవి. 1827లో మహారాజా విజయరామ గజపతి రాజు బ్రిటీషు వారి నుంచి హిజ్ హైనెస్ గౌరవాన్ని పొందారు.  అంతకు ముందు గోల్కొండకు చెందిన కుతుబ్ షాహీ రాజులు ఉత్తర సర్కారు ప్రాంతానికి సుబేదారులుగా పూసపాటి రాజులనే నియమించారు. ముగల్ చక్రవర్తి ముఖ్యంగా అక్బర్ ల్యాండ్ రెవిన్యూ వ్యవస్థీకరించాడు. న్యాయవ్యవస్థలోను ముగల్ చక్రవర్తుల కాలంలో సైనిక న్యాయస్థానాలు, రెవిన్యూ న్యాయస్థానాలు ఉండేవి. సుబా స్థాయి, సర్కార్ స్థాయి, పరగణా స్థాయి న్యాయస్థానాలుండేవి. కాజీలు, ముఫ్తీలు నియమించబడేవారు. ముఖ్యంగా ఈ రెండు రంగాల్లోను రెవిన్యూ, న్యాయ రంగాల్లో మనకు పెద్ద సంఖ్యలో పారశీకపదాలు కనబడతాయి. అలాగే పోలీసు, సైనిక రంగాల్లోను అవే పదాలు వచ్చాయి.

గురజాడ ఈ నాటకం రాసింది 1887లో. విజయనగరంలో రాజ్యవ్యవస్థ అప్పుడు పూసపాటివారిది. కుతుబ్ షాహీ కాలం నుంచి ముస్లిమ్ రాజులతో సంబంధాలు కొనసాగుతున్నాయి. పొరుగున ఉన్న శ్రీకాకుళం కూడా నవాబుల ఏలుబడిలో ఉన్నదే. శ్రీకాకుళాన్ని ఇప్పటికి ఉర్దూలో సిక్కాకోల్ అంటారు. సిక్కా అంటే నాణెం. ఖౌల్ అంటే సంచి అనే భావం ఉంది. ఇక్కడ టంకశాల ఉండేది. అందుకే ఈ పేరు వచ్చింది. ఈ నాటకం ప్రదర్శన మొదట 1892 ఆగష్టులో జరిగింది. 1909లో రెండవ కూర్పు ప్రచురించారు. అప్పటి మహారాణీ ఆఫ్ మధోగఢ్, హర్ హైనెస్ రాజకుమారికా సాహెబా అంటే అప్పల కొండమ్మ. ఈమె 1859లో పుట్టారు. రేవా మహారాజు కుమార్ సింగ్ను పెళ్ళాడారు. ఈమె 1912లో మరణించారు.

పాలకులు, ప్రజల మధ్య సంబంధాలు ఏమైనా, భారతదేశంలో చాలా ప్రాంతాల్లో మాదిరిగానే రెవిన్యూ భాష, న్యాయపరమైన పరిభాషలోను ఉర్దూ పదాలు అనివార్యంగా చేరుకున్నాయి. ఇరుభాషల మధ్య సంపర్కం వల్ల చాలా పదాలు తెలుగులోకి వచ్చాయి. పెద్దన, పింగళి సూరన, శ్రీనాథుడు కూడా పారశీక పదాలను వాడారని తెలుస్తోంది. బాజారు, మైజారు వంటి పదాలు క్రీడాభిరామంలో ఉన్నాయి. ఉర్దూలో మాజర్ అంటే వస్త్రానికి వేసే అంచు. కృష్ణదేవరాయల కాలంలో కవులు హాజారము అన్న పదం వాడారు.

ఉత్పాదకరంగాల్లో వ్యవసాయం ముఖ్యమైనది. అలాగే పరిపాలనలో న్యాయ, రెవిన్యూ విభాగాలు చాలా ముఖ్యమైనవి. భారతదేశంలో ముస్లిముల సుదీర్ఘ పరిపాలన వల్ల అనేక భారతీయ భాషల్లో ఉర్దూ, పారశీక పదాలు చోటు చేసుకున్నాయి. బ్రౌన్ ఇదే విషయాన్ని తన నిఘంటువు ముందు మాటలో రాశారు. రాధామాధవ సంవాదం, బలరామచరిత్ర, భళ్ళాణ చరిత్ర, అనేక శతకాలు, దశవతార చరిత్ర, కళాపూర్ణోదయంలలోను హిందూస్తానీ పదాలున్నాయని బ్రౌన్ పేర్కొన్నారు. ఆయన హిందూస్తానీ అని రాసింది ఉర్దూ గురించే. ఉర్దూను ఇంతకు ముందు హిందూయీ, హిందుస్తానీ, రేక్తా, ఖడీబోలీ తదితర పేర్లతో పిలిచేవారని గమనించాలి. బ్రౌన్ తెలుగుకు ముప్పయి సంవత్సరాల పాటు సేవలందించి 1854లో ఇంగ్లాండ్ వెళ్ళిపోయారు.

1857 ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం వరకు దేశంలో పరిపాలన, న్యాయ, కార్యనిర్వాహక రంగాల్లో ఉర్దూ ప్రభావం బలంగా ఉండేది. ఈ రెండు రంగాలతో పాటు మార్కెట్టుకు సంబంధించిన పదాలు కూడా పెద్ద సంఖ్యలో ఉర్దూ నుంచి దిగుమతి అయ్యాయి. సామాను, ఖర్చు, బిఛాణా, ఘంట, మజా, వగైరా పదాలు. వగైరా కూడా ఉర్దూ పదమే. చమ్డాలెక్కగొడతాను పదంలో చమ్డా ఉర్దూ పదం. తోలుతీస్తాను అన్న భావంతో వాడారు. శెలవులాఖర్న లో ఆఖరు అన్నది ఉర్దూ పదమే. ఇవి ఎలాంటి మార్పు లేకుండా ఎలాంటివలా తెలుగులో వాడబడుతున్న పదాలు. కొద్దిపాటి ఉచ్ఛారణ భేదం తప్ప ఈ పదాలు యథాతథంగా తెలుగులోకి వచ్చేశాయి. పదణాలులో అణా ఉర్దూ పదమే, దమ్మిడి ఉర్దూ పదమే. మిఠాయి ఉర్దూ పదమే. ఫైసలయ్యింది అన్న పదం యథాతథంగా వాడారు. ఫైసలా హువా అన్న అర్ధమే. నౌఖరు, జరూరు అలాంటి పదాలే. జరూరు పదం ఉర్దూలో జరూరీ. జరూరత్ అంటే అవసరం. జరూరీ అంటే తప్పనిసరి. ఖరీదు, అణా పైసలు, జేబు, ఆఖరు, చబాష్ (శహభాష్), చాడీకోర్ (చాడీలు చెప్పేవాడు), ఫర్మానా (శాసనం) ఇలా చాలా పదాలున్నాయి. బేహద్బీ కూడా అలాంటి పదమే. అదబ్ అంటే సభ్యత. సాహిత్యం అన్న అర్ధం కూడా ఉంది. బే అదబ్ అంటే అసభ్యత లేదా అమర్యాదకరంగా వ్యవహరించడం. బేఅదబీ అని యథాతథంగా ఉర్దూలో వాడతారు. సిస్తు కూడా సిస్త్ అన్న ఉర్దూ పదం. ఛప్పన్న భాషలులో ఛప్పన్ అంటే యాభైఆరు. ఛప్పన్ అనే మాట అనేకసార్లుకు బదులు ఉర్దూలో వాడతారు. పరాయి కూడా అదే భావంతో ఉర్దూలో వాడతారు. తరిఫీదు, దాఖలు, టోపీ, వకీలు, తర్జుమా పదాలు యథాతథంగా ఇదే భావంతో ఉర్దూలో వాడకంలో ఉన్నవే. ఇప్పుడు తెలుగులో ఖాతరీ, ఖాయదా పదాలు బహుశా వాడకం తగ్గింది. ఖాతరీ అంటే లక్ష్యపెట్టడం. ఖాతరీ లేదంటే నిర్లక్ష్యమని భావం. ఖాయదా అంటే నిజానికి ఉర్దూలో చాలా అర్ధాలున్నాయి. ఆధారం, వైఖరి, ఆచారం, విధి, నియమాలు,  అలవాటు, అభ్యాసం, వర్ణమాల లేదా బాలశిక్ష వగైరా అర్ధాల్లో వాడతారు. ఖాయిదేకీ బాత్ హై అంటే సాధారణంగా చెప్పే మాట అని భావం. తెలుగులో ఖాయిదా అన్న పదం కట్టడి చేయడం అన్న అర్ధంతోనే వాడారు. అలాగే తరిఫీదు అంటే శిక్షణ అన్న భావంతో వాడారు. అదే అర్ధంతో ఉర్దూలోను వాడతారు. దీవాన్గిరీ అనేది అలాంటి పదమే. దీవాన్ అంటే మంత్రి లేదా ప్రభుత్వంలో పెద్ద అధికారి అన్న అర్ధంతో వాడతారు. దీవాన్గిరీ అంటే గొప్ప పదవి. గిరి అన్న ప్రత్యయం ఇంకా అనేక పదాలకు చేర్చి వాడడం మనకు తెలుసు. గుండాగిరి, దాదాగిరి, గాంధీగిరి వగైరా ఇలా వచ్చిన పదాలే. పూరా ప్రయోజకుడులో పూరా అంటూ పూర్తిగా అని అర్ధం. షరతు, డప్పు, బజారు, ఘీ, దావా ఇవన్నీ యథాతథంగా ఇవే అర్ధాలతో ఉర్దూలోను వాడతారు. గడియ గడియకీ లో గడియ పదం ఘడీ అన్న పదం నుంచి వచ్చింది. ఘడీ అంటే గడియారం అని ఒక అర్ధమైతే, ఒక గంట అని మరో అర్ధం. అయితే క్షణక్షణానికి అన్న అర్ధంతో ఘడీ ఘడీ అనే పదం ఉర్దూలోను వాడతారు. అలాగే చెయ్యాసరా అన్న పదంలో ఆసరా కూడా ఉర్దూ పదమే. తెల్లవెంట్రుక తగిలితేనే చమక్ అని మధురవాణి అంటుంది. ఇందులో చమక్ ఉర్దూ పదమే. డీలాపడడం ఉర్దూలో ఢీలాపఢ్నా. ఉర్దూలో ఢీలా తెలుగులో డీలా అయ్యింది. పఢ్నా పడడం అయ్యింది. ఉర్దూ కుర్సీ తెలుగులో కుర్చి, తివాసీ ఉర్దూలోను తివాసీయే, సదా, సిఫారుసు, సలహా, దస్తావేజు, రోజు, మామోలు, నాజూకు, రస్తా, ఉర్దూ రంగ్ తెలుగులో రంగు, బేరీజు, బాకీ (బకాయీ), మరామత్తు (మరమత్), జవాబు యథాతథంగా అవే అర్ధాలతో తెలుగులో వాడుతున్నాం. సవారి అంటే వాహనం అని ఒక అర్ధం, వాహనాన్నెక్కి అని మరో అర్ధం. సవార్ హోనా అంటే వాహనమెక్కడం దాన్నే సవారి ఐ అని గురజాడ రాశారు. గప్ చుప్, హక్కు, జోరు (జోర్), షరా, పూచీ పదాలు అలాంటివే. పూచీ అంటే జవాబుదారీ అని భావం. పులిమొహరులో మొహరు అంటే బంగారునాణెం అని అర్ధం. సరంజాం లేదా సరంజామా ఉర్దూలో సరంజాం. కసరత్తు అనే పదానికి ఆధిక్యం, పుష్కలంగా ఉండడం వంటి అర్ధాలతో పాటు వ్యాయామం అన్న అర్ధం కూడా ఉంది. స్పెల్లింగులో పాత ఉర్దూలో కాస్త తేడా రాసేవారు. ఇప్పుడు వ్యాయామానికి వర్జిష్ అన్న పదం వాడుతున్నారు. కసరత్ అన్న పదం వాడడం ఉర్దూలో తగ్గిపోయింది. తెలుగులో ఈ పదం వ్యాయామాన్ని సూచిస్తూ వాడుతున్నారు. తాషామర్ఫా అంటే వాయిద్యాలు. దగా చేయడం, పరారీ, చలో, మహలు, బగీచాలు (తోటలు), ఖాయమేనా ఇవన్నీ ఉర్దూలో వాడే పదాలే. పుండాఖోర్ తిట్టుపదం. ఖోర్ అంటే తినడం. హరామ్ ఖోర్ అంటే అధర్మంగా సంపాదించి తినేవాడని అర్ధం. పుండాఖోర్ అంటే తగవుల మారి, నీచుడు అన్న భావంతో వాడుతున్నారు. అలాగే జులువేమిటిలో జుల్మ్ అంటే దౌర్జన్యం. మూడే తురుఫులు పడ్డాయి అంటాడు పోలిశెట్టి. తురుఫు అన్న పదం తురుఫ్ ఉర్దూలో. తమాషా దేఖో లంకాకే రాజా లాంటి ప్రయోగాలు చూస్తే ఉర్దూఎంత ఎక్కువగా వాడేవాళ్ళో చెప్పడానికి చాలు. హవల్దారు పారశీక పదం. హుక్కాలావ్ లాంటి పదాలు ఉర్దూను యథాతథంగా వాడిన పదాలు. పత్తాయేమైనా తెలిసిందాలో ఉర్దూ పతా అంటే చిరునామ అని అర్ధం. నమ్మక్ అంటే ఉప్పు, ఇంగిరీజ్ అంటే అంగ్రేస్ ఆంగ్లేయులు. హవల్దార్ పాడిన పాట పూర్తిగా హిందూస్తానీయే. పింజరేమేం అంటే పంజరంలో, ముల్కీ సునా అంటే ముల్కీ చెప్పు అని భావం. ముల్కీ అంటే ప్రాంతీయ లేదా దేశీయమైన అని భావం. హవల్దారు గద్దా అని తిడతాడు. ఘదా అంటే గాడిద అని అర్ధం. ఖూనీ, ఫరియాద్ లేదా ఫిర్యాదు, కానీ ఇవన్నీ ఉర్దూ పదాలే. ఎకాఎకి ఉర్దూలో ఎకాయక్, ఫకీరు, జిల్లా, రుమాల్ (తుండు), చహరా (ముఖం) ఇవన్నీ ఉర్దూలో యథాతథంగా ఇవే అర్ధాలతో వాడే పదాలు. ధగిడీకే అనేది తిట్టు పదం. థగడ్ అంటే శ్లాంగ్ లో మొగుడు అని అర్ధం. ధగడ్ బాజ్ అంటే మిండలమారి, ధగిడీకే అన్న పదం ఈ అర్ధంతోనే వాడారు. బంగీ, రూపాయి, లాచారీ (నిస్సహాయత), సర్కారు, ఖరారు, టపా, తక్సీర్ (తప్పు), మాఫ్ (క్షమించడం), దస్తావేజు, తహసిల్దార్, వకాల్తీనామా (వకీలుగా నియమించిన పత్రం), దండోరా (ఢండోరా), శటాకు (ఛటాకు అంటే యాభైగ్రాములు), జాగా, బందోబస్తు ఈ పదాలన్నీ ఉర్దూలో యథాతథంగా ఈ అర్ధాలతోనే వాడే పదాలు. జుల్మానా అన్న పదం ఉచ్ఛారణ కాస్త మారింది. జుల్మ్ అంటే దౌర్జన్యం. జుర్మ్ అంటే నేరం. జుర్మానా అంటే జరిమానా (ఇది కూడా జుర్మానా నుంచే వచ్చింది). కాని ఉచ్ఛారణలో జుర్మానా కాస్త జుల్మానా అయ్యింది.

ఇవన్నీ తత్సమాలుగా మనం భావించవచ్చు. ఇంతకు ముందు మనం యించు వంటి ప్రత్యయాలు చేర్చి తెలుగీకరించిన పదాల గురించి కూడా చెప్పుకున్నాం. అలాగే ఉర్దూలో పదం ఉచ్ఛారణ మారిపోయినవి, కొత్త అర్ధాలతో స్థిరపడిన పదాల గురించి కూడా చెప్పుకున్నాం. వాటన్నింటిని తద్భవరూపాలుగా చెప్పుకోవచ్చు. ఇందులో కొన్ని పదాలు మనకు హిందీ పదాలుగా కనబడతాయి. హిందీ, ఉర్దూ భాషల పుట్టుకను మనం అర్ధం చేసుకుంటే ఈ పదాలను అర్ధం చేసుకోవడం తేలిక.

హింది, ఉర్దూ భాషలు అక్కాచెల్లెళ్ళవంటివి. నిజానికి ఇవి రెండు భాషాలు కాదు. ఒకప్పుడు పెషావర్నుంచి బెంగాల్ సరిహద్దుల వరకు సాధారణ ప్రజలు మాట్లాడిన భాషే తర్వాత రెండుముక్కలైంది. 19వ శతాబ్ధం చివరి నాటికి ఈ భాషావిభజన పూర్తయ్యిందనవచ్చు. నిజానికి ఇది ఒకే భాష. ప్రాచీన సంస్కృతము, తర్వాత ప్రాకృతము, వాటి అపభ్రంశ రూపాలు అనేకం ఉత్తరాదిన ప్రజలు మాట్లాడేవారు. మాగధి, అవధి, భోజ్ పురి, ఖడీబోలీ వగైరా. ఈ ఖడీబోలీ తర్వాత ఉర్దూ అయ్యింది.

పర్షియనైజెడ్ ఖడీబోలి పర్షియా లిపితో రాస్తే ఉర్దూ అయ్యింది. సంస్కృతైజెడ్ ఖడీబోలీ దేవనాగరి లిపితో రాస్తే హిందీ అయ్యింది. నిజానికి ఉర్దూ అనే పేరు కూడా ఇటీవలి కాలంలో పెట్టిన పేరు. ముషాఫీ రాసిన మొదటి దీవాన్లో ఈ పేరు మనకు కనబడుతుంది. అంటే 1780లో.  కాని ఒక ప్రత్యేకమైన భాషగా కాదు. 19వ శతాబ్ధం ప్రారంభంలో హిందీ, ఉర్దూ అనే పేర్లు సమానార్థకాలుగానే ఉండేవి. ఉర్దూ లేదా ఉర్దూయే ముఅల్లా అనేవి షాజహానాబాద్ నగరాన్ని సూచించే పదాలుగా కూడా ఉండేవి. జుబానె ఉర్దూ యే ముఅల్లా తర్వాతి కాలంలో ఉర్దూగా మారింది. జుబానె ఉర్దూ యే ముఅల్లా అంటే షాహజానాభాద్ ప్రజలు మాట్లాడే భాష అని మాత్రమే అర్థం.

ఉర్దూ అనేది నిజానికి టర్కీ పదం. ఉర్దూ అంటే సైనిక శిబిరం. మహ్మూద్ గజనీ 1020లో పంజాబ్ జయించినప్పుడు స్థానిక ప్రజల భాష పంజాబీ. విజేత సైన్యం మాట్లాడే భాష పారశీకం. అప్పట్లో పారశీకం మాట్లాడేవాళ్ళు అనేకమంది భారతదేశానికి వచ్చారు. ఆ తర్వాత గజనీని ఘోరీ ఓడించాడు. ఆ తర్వాత ఘోరీ సైన్యంలో అధికారి కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీ జయించాడు. ఆ విధంగా గజనీ, ఘోరీ, కుతుబుద్దీన్ ఐబక్ కాలం వరకు 173 సంవత్సరాలు పారశీక, పంజాబీ భాషల మధ్య సంబంధం, ప్రజల మధ్య సంబంధాలు కొత్త భాషకు జన్మనిచ్చాయి. ఆ తర్వాత ముగల్ సైన్యంలో పంజాబీ, పఠాన్, రాజపుత్రులు అందరూ ఉండేవారు. వీళ్ళంతా మాట్లాడే భాషల్లోని పదాలన్నీ ఈ భాషలో కలిసిపోయాయి. 1295లోనే అల్లావుద్దీన్ ఖల్జీ దక్షిణాదిన అడుగుపెట్టాడు. ఆయనతోపాటు పంజాబీ, పారశీకం కలిసిన కొత్తభాష ఉర్దూ కూడా ఇక్కడికి వచ్చింది. 1327లో ముహమ్మద్ తుగ్లక్ తన రాజధాని ఢిల్లీ నుంచి దౌలతాబాద్ కు మార్చాడు. రాజుతో పాటు అసంఖ్యాక అధికారులు, కులీనకుటుంబాలు, దాదాపు 500 మంది సూఫీలు కూడా దౌలతాబాద్ వచ్చారు. ఇది ఔరంగాబాద్ కు దగ్గరగా ఉంది. అప్పటికే ఖిల్జీ తీసుకొచ్చిన ఉర్దూకు మరింత బలం దొరికింది. 1347 తర్వాత ప్రాంతీయ రాజులు తుగ్లక్ పై తిరుగుబాటు చేశారు. బహమనీ రాజ్యం ఏర్పడింది. ఈ దక్షిణాది రాజులు ఉత్తరాదితో పెద్దగా సంబంధాలు కొనసాగించలేదు. అందువల్ల ఆ తర్వాత దక్షిణాది ఉర్దూ ప్రత్యేకంగానే అభివృద్ధి చెందింది. మరాఠీ, తెలుగు, కన్నడ పదాలు ఇక్కడి ఉర్దూలో కలిశాయి. హవ్. నక్కో, కైకు వంటి పదాలు మరాఠి నుంచి వచ్చాయి. ఈ ఉర్దూను దక్కనీ అంటారు. కులీ కుతుబ్ షా కాలం నాటి ఉర్దూలో పంజాబీ ప్రభావం కూడా ఎక్కువే. తెలుగు ప్రభావం కూడా ఎక్కువే. కుతుబ్ షాహీ రాజ్యం ఉత్తర సర్కారు వరకు వ్యాపించిందన్నది మరిచిపోరాదు. ఆ తర్వాత ఔరంగజేబు 1687లో గోల్కొండను జయించాడు. ఆ తర్వాత ఉత్తరాది ఉర్దూ ప్రభావం దక్కనీపై పెరిగింది. కులీ కుతుబ్ షా దేవుడికి కర్తార్, సాయీం, దాతార్ వగైరా పదాలు వాడాడన్నది గుర్తుంచుకుంటే అప్పటి ఉర్దూలో పంజాబీ ప్రభావం అర్ధమవుతుంది. ఉత్తరాది ఉర్దూ ప్రభావం పెరిగిన తర్వాత ఖుదా అన్న పదం వాడకంలోకి ఎక్కువగా వచ్చింది. 1020 నుంచి సుదీర్ఘకాలం పారశీక భాష, పంజాబీతో కలిసి ఏర్పడిన ఉర్దూ భాష, తర్వాత దక్షిణాది పదాలను కూడా కలుపుకుని ఏర్పడిన దక్కనీ, ఆ పిదప ముగల్ ప్రభావంతో ఉత్తరాది పదాలను కలుపుకున్న ఉర్దూ పదాలు ఇక్కడి ప్రజల జీవితంలో భాగమైపోవడంలో ఆశ్చర్యం లేదు.

కాబట్టి తెలుగుపై ఉర్దూ ప్రభావమే కాదు, ఉర్దూపై కూడా తెలుగు ప్రభావం చాలా ఉంది. ఈ ప్రభావం గురించి చెప్పే ముందు ఒక్కసారి హిందీ గురించి కూడా మాట్లాడుకోవాలి.  

హిందీ, ఉర్దూ భాషలు వేర్వేరుగా ఏర్పడడానికి కారకుడు జాన్ బోర్త్ విక్ గిల్ క్రీస్ట్. పర్షియా లిపితో హిందూస్తాని, హిందూయీ, హైందవీ లేదా ఉర్దూ భాషను,  దేవనాగరి లిపితో హిందీ భాషను విభజించిన ఘనత ఆయనదే.

ముగల్ కాలంలో, ఆంగ్లేయులు రాకముందు ఉత్తరభారతదేశంలో వివిధ ప్రాంతాల్లో ప్రజలు మాట్లాడిన మాండలికాలు.. బ్రజ్ భాష, అవధి, మాగధి వగైరా భాషలుండేవి. ఈ భాషల ప్రభావం వల్ల ఏర్పడిందే ఖడీబోలీ. ఇప్పుడు మనం ఉర్దూగా పిలుస్తున్న భాషకు మూలం ఇదే. హిందీ, ఉర్దు భాషల్లో లిపి భేదం మాత్రమే కాదు ఉర్దూ అటు పర్షియన్ నుంచి ఇటు అరబ్బీ నుంచి పదాలను స్వీకరించడమే కాదు కొన్ని వ్యాకరణ సూత్రాలను కూడా తీసుకుంది. సమాస నిర్మాణాలు అటు పర్షియన్ సూత్రాల ప్రకారం, ఇటు అరబీ సూత్రాల ప్రకారం కూడా చేయవచ్చు. ఈ తేడా హిందీకి భిన్నమైనది. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్న మాటను హిందీలో ఆంధ్రప్రదేశ్ కీ సర్కార్ అంటాం. ఉర్దూలో పర్షియన్ సమాససూత్రాలతో హుకుమతె ఆంధ్రప్రదేశ్ అని రాస్తారు. అలాగే పద ప్రయోగాల్లోను తేడా కనబడుతుంది. ఖానా అనే పదం ఉర్దూలో రెండు రకాలుగా ఉచ్ఛరిస్తారు. ఒక ఉచ్ఛారణకు ఇల్లు, నిలయం అని అర్ధాలు, రెండవ ఉచ్ఛారణకు తినడం అని అర్ధం. దవాఖానా అనేది హిందీలో ఈ ఉఛ్చారణ భేదాన్ని చూపుతూ రాయలేం. ఇలాంటి తేడాలు ఉండడం వల్లనే హిందీ, ఉర్దూ రెండు వేర్వేరు భాషలుగా స్థిరపడ్డాయి.

చారిత్రకంగా చూస్తే క్రీశ 1253కు చెందిన అమీర్ ఖుస్రో ఉర్దూలో మొదటిదోహాలు రాశాడు. 19 శతాబ్ధం ప్రారంభం వరకు ఉర్దూలో రాసిన వాళ్ళు కూడా తమ భాషను హిందూయీ లేదా హైందవీ అనే పిలిచారు.

ముషాఫీ ఫార్శీకో తాక్ పే రఖ్

అబ్ హై అషారె హైందవీ కా రివాజ్

అంటే అర్థం.. ఓ ముషాఫీ ఇక పర్షియన్ భాషను అటకపై పెట్టు, ఇప్పుడు హైందవీ కవితల కాలం వచ్చింది. ఇది ముషాఫీ రాసిన కవిత. ఆయన 1820 కాలం నాటి వాడు. అప్పటికి ఉరుదు లేదు. ఉర్దూ హిందీ అన్న తేడా రాజకీయ కారణాల వల్ల, బ్రిటీషువారి విభజన నీతి వల్ల వచ్చిందే కాని అంతకు మించి కాదు.

హైదరాబాద్ రాష్ట్రంలోని రాజ భాష ఉర్దూ. పరిపాలన ఉర్దూలో జరిగేది. కోర్టులో వాదనలు ఉర్దూలో జరిగేవి. తీర్పులు ఉర్దూలో వచ్చేవి. ఉర్దూలో ఎన్నో న్యాయశాస్త్ర గ్రంథాలు ఉండేవి. ఉర్దూతెలుగూ కలిపి హైదరాబాద్ నగర వాసులు ఎక్కువగా మాట్లాడే వారు.

తెలంగాణ లోని తెలుగు భాషలో ఉర్దూ పదాలు ఎన్నో కనిపిస్తాయి. నిజానికి అవి తెలుగుని సంతరించుకున్నాయి. తెలంగాణ భాష మీద ఉర్దూ ప్రభావం ఎక్కువ అనుకుంటారు కాని నిజానికి మొత్తం తెలుగుభాషపైనే ఉర్దూ ప్రభావం ఎక్కువ. తెలుగువాళ్లు అసంఖ్యాకమైన ఉర్దూ పదాలను తెలుగు పదాలుగా వాడేస్తుంటారు. గుర్తు పట్టడం కూడా ఇప్పుడు కష్టం.

ఉర్దూ విదేశీభాష కాదు. మొఘల్‌ కాలంలో సంస్కృతంఖడీ బోలీవ్రజ్‌ భాష వంటి పలు భారతీయభాషలలోని పదాలతో క్రమేపీ రూపుదిద్దుకుంది. అక్బర్‌తన మంత్రి  రాజా మాన్‌సింగ్‌ సాయంతో తన ఏలుబడిలో వున్న ప్రాంతమంతటిలో లాండ్‌ రెవెన్యూను స్థిరపరచడంతోకోర్టు వ్యవహాలను క్రమబద్ధీకరించడంలో పన్నులకుకోర్టులకు సంబంధించిన పారిభాషికపదాలన్నీ ఉర్దూవే అయ్యాయి. అక్బరు తర్వాతి కాలంలో మొఘల్‌ సామ్రాజ్యం మరింతగా విస్తరించి యిదే విధానం దాదాపు దేశమంతా అమలులోకి వచ్చింది.

ఇక హిందీ భాష ఉర్దూ కంటె వయసులో చిన్నది. 1850ల తర్వాత ఖడీబోలీ భాషలోనే సంస్కృతపదాలు ఎక్కువగా రంగరించిసంస్కృతం వాడే దేవనాగరీ లిపిలో రాస్తూ ఉర్దూకంటె భిన్నంగా భాష తయారుచేయాలన్న ఉద్యమం ప్రారంభమై హిందీ రూపుదిద్దుకుంది. హిందూస్తానీ అనేది ఉర్దూ మిశ్రితమైజనసామాన్యం మాట్లాడే భాషగా వుండగా హిందీ అనేది సంస్కృతభూయిష్టమై పండితులు కవిత్వం రాసే భాషగా రూపొందింది. గాంధీ హిందీని ప్రచారం చేస్తూనేహిందూస్తానీని ఇంగ్లీషు స్థానంలో కామన్‌ లాంగ్వేజ్‌గా గుర్తింపచేయడానికి ప్రయత్నించాడు.  స్వాతంత్య్రం వచ్చాక అధికారభాషగా హిందీనాహిందూస్తానీనా దేన్ని గుర్తించాలి అని కమిటీలో చర్చలు జరిగాయి. చివరకు ఒక్క ఓటు తేడాతో హిందీ నెగ్గింది. దీని అర్థం గాంధీ ఒక్కడే కాదుఅనేక మంది ప్రజానాయకులు హిందూస్తానీ హిందీ కంటె ఎక్కువగా ప్రజలకు సన్నిహితం అవుతుందని భావించడం! హిందీ సినిమాల సెన్సారు సర్టిఫికెట్లలో యిదివరలో భాష – హిందూస్తానీ‘ అని రాసేవారు. మొఘలే ఆజం” వంటి కొన్ని సినిమాలలో మాత్రం ఉర్దూ‘ అని రాసేవారు. ఇప్పుడు అన్నిటికీ హిందీ‘ అని రాస్తున్నారు. అయినా వాడేది హిందూస్తానీ పదాలే. అచ్చమైన హిందీ అంటే పౌరాణిక టీవీ సీరియల్స్‌లో వాడే భాష! 

ఏది ఏమైనా ప్రాచీనత విషయంలో తెలుగు వంటి ప్రాంతీయ భాషలంత పాతవి కావు ఉర్దూ, హిందీ భాషలు. 200 ఏళ్ల క్రితం రాసిన హిందీ పుస్తకం చూపించమంటే వారు నోరు వెళ్లబెడతారు. అవధిమైథిలీభోజ్‌పురి వంటి భాషల్లో కవిత్వం వుంది కానీ ఆ భాషలకు విడిగా అస్తిత్వం వుంది. రామ్‌ చరిత మానస్‌” హిందీ అనుకుంటాంకాదుఅవధి! దాన్ని హిందీ మాండలికం అని అంటారు. హిందీ వచ్చినంత మాత్రాన హనుమాన్‌ చాలీసాలో మాటలు ఎన్ని అర్థమవుతాయిమాండలికం అంటే అసలు భాష వచ్చినవారికి ఓ 5-10% పదాల అర్థం విషయంలో గందరగోళం వుంటుంది. హిందీ మాండలికాలని చెప్పుకునేవాటిలో 75% పదాలు హిందీ వచ్చినా అర్థమే కావు. వాటిని స్వతంత్ర భాషల్లాగానే చూడాలి. వాటికి చాలా శతాబ్దాలుగా అస్తిత్వం వుంది. మైథిలీకి అతి దగ్గరగా వున్న భాషలో విద్యాపతి (1352 – 1448) వంటి గొప్ప కవులు వున్నారు. మరి హిందీయో? 1954లో హిందీ వ్యాకరణాన్ని స్టాండర్‌డైజ్‌ చేయడానికి మినిస్ట్రీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ కల్చర్‌ పూనుకుని కమిటీ వేసింది. వాళ్లు 1958లో ఎ బేసిక్‌ గ్రామర్‌ ఆఫ్‌ మోడర్న్‌ హిందీ” అని వేశారు. కాబట్టి హిందీ తర్వాతి భాష. ఉర్దూలో హిందీలా కనిపించే పదాలు నిజానికి అవధీ, భోజ్ పురి, మైథిలి, తదితర భాషలనుంచి వచ్చాయి.

అసలు ఉర్దూ భాషయే అనేక భాషల సంగమం.అందులో తెలుగు పదాలు కూడా చాలా ఉన్నాయి. దక్షిణాదిన మాట్లాడే ఉర్దూలో బండి అన్న పదం యథాతథంగా అలాగే ఉర్దూలో వాడతారు. ప్రముఖ ఉర్దూ కవి మక్దూం రాసిన గొప్ప కవిత ఏక్ చమేలీకే మండ్వే తలే లో మండ్వా అన్న పదం మండువా తెలుగు నుంచి తీసుకున్నదే. తెలంగాణ మాండలికంలో కాస్త పెన్ను ఇస్తావా అని అడగడానికి జర నీ కలమియ్యరాదే అంటారు. ఇది ఉర్దూ ప్రభావం. తెలుగు ప్రభావంతో ఉర్దూ వాక్యనిర్మాణంపై కూడా ఇక్కడ ప్రభావం పడింది. తెలుగు విభక్తులు కి, కు, రా వంటివి ఉర్దూపై ప్రభావం వేశాయి. కైకూ, కిస్కూ, కైకూకీ, మేరేకూ, తుమ్హారేకూ, కైసా హై రే, కతే వంటి పదాలు తెలుగు ప్రభావం వల్ల వచ్చినవే. దక్కనీ ఉర్దూలో సంస్కృతం నుంచి వచ్చిన తత్సమ రూపాలు కూడా చాలా ఉన్నాయి. మేఘ్, ఆకాశ్, జగ్, ముఖ్, చంద్ర్, గగన్, సకల్, కిరణ్, రూప్, సహజ్, సేవక్, మాయా, మోహ్, సూర్య్, దుఖ్, సుఖ్, దిన్, రాత్, ముక్త్, దేహ్, నైన్ వగైరా అనేక పదాలు సంస్కృతం నుంచి ఉర్దూ స్వీకరించింది. ఇలాంటి పదాలు తెలుగులో అంతకు ముందే సంస్కృతం నుంచి వచ్చి ఉండవచ్చు. ఎందుకంటే తెలుగు భాష ఉర్దూ కన్నా చాలా ప్రాచీనమైన భాష. కాని ఈ పదాలు హిందీ పదాలని భావించడం పొరబాటు. అవి సంస్కృత, ప్రాకృత భాషల నుంచి వచ్చిన పదాలు. ఉర్దూ కూడా ఆయా పదాలను స్వీకరించింది. ఇదంతా చెప్పడమెందుకంటే భాషల మధ్య ఆదాన ప్రదానాల వల్ల భాషలు సుసంపన్నమవుతాయి. తెలుగు భాష ఉర్దూ పదాలను కలుపుకోవడం వల్ల సుసంపన్నమయ్యింది.

/కన్యాశుల్కంలో ఉర్దూపదాలను, అవి వాడకంలోకి ఎలా వచ్చాయన్నది అర్ధం చేసుకోడానికి బ్రౌన్ తన మిశ్రమ నిఘంటువు ముందుమాటలో రాసిన విషయాలు కూడా ఒక్కసారి చూడడం అవసరం. ఈ నిఘంటువు 1854లో అచ్చయ్యింది. సుదీర్ఘకాలంగా కొనసాగిన ముస్లిముల పరిపాలన వల్ల అనేక భారతీయ భాషల్లో విదేశీ పదాలు వచ్చాయని ఆయన రాశాడు. ఆయన పేర్కొన్న విదేశీపదాలు పారశీక, అరబ్బీ, టర్కీ పదాలు. తర్వాతి కాలంలో ఇంగ్లీషు పదాలు కూడా తెలుగు వాడకంలో వచ్చాయని రాశారు. అందుకు ఉదాహరణగా ఆయన కోర్టులో రాసిన ఒక ఎంట్రీ ఇచ్చారు. అందులో భాష చూడండి.

’’ఈ నెంబరులో డిఫెండెంటు సమ్మను చూచి సైను (or దస్ఖత్) చేశి వాయిదా చొప్పున కోర్టులో హాజరు అయి ఆన్సరు యియ్యకపోయినందున యిందులో యెక్సపార్టీ దర్యాప్తు చేయవలెనని ప్లేంటిఫ్ ప్లీడరు మోశను చేశినాడు గనుక ఆ మోశను రికార్డులో దాఖలు (or ఫయిలు) చేసి అందులో దర్ఖాస్తు చేసిన చొప్పున నడిపించేలాగున ప్రొసీడింగుసులో ఆర్డరు ఎంటరు చేయడం అయినది.‘‘

తెలుగు కోర్టుల డైరీల్లో ఇలాంటి ఉదాహరణలు దొరుకుతాయని ఆయన రాశాడు.

ఈ భాష అప్పటి భాష. ఇక్కడ గమనించవలసిన విషయమేమంటే, ఈ ఉదాహరణలో సైను అన్న ఇంగ్లీషు పదం అర్ధం కావడానికి దస్ఖత్ అన్న ఉర్దూ పదం బ్రాకెట్ లో వాడారు. దాఖలు అన్న ఉర్దూ పదానికి బ్రాకెట్లో ఫైలు అన్న ఇంగ్లీషు పదం వాడారు. ఇవి మాత్రమే కాక మొత్తం ఈ నాలుగు పంక్తుల్లో ఐదారు ఉర్దూ పదాలున్నాయి. అంతే కాదు ఈ ఉదాహరణ ద్వారా అర్ధమవుతున్న మరో వాస్తవమేమంటే అప్పట్లో న్యాయస్థానాల రాతకోతల్లో తెలుగు వాడుకభాషలోనే జరిగేవి. అంటే పాలనాపరమైన రాతకోతలన్నీ తెలుగులో రాయవలసి వస్తే వాడుకభాషలోనే జరిగేవి.

1854 నాటి బ్రౌన్ నిఘంటువులో ఈ ఉదాహరణ ఇచ్చారంటే అంతకు ముందు చాలా కాలంగా ఈ భాష రాతకోతల్లో వాడుకలో ఉంది. కాని విచిత్రమేమంటే, 1864లో జన్మించిన గిడుగు రామమూర్తి వ్యావహారిక భాషోద్యమం నడపవలసి వచ్చింది. గురజాడ రాసిన ముందుమాటలు కూడా ఈ సందర్భంగా గమనించాలి. 1862లో గురజాడ జన్మించారు. 1889 ప్రాంతంలో ఆయన ఈ నాటకాన్ని రాస్తూ ఉన్నారు.  ఆయన మొదటి కూర్పుకు రాసిన ముందుమాటలో ఏమన్నారో చూద్దాం.

కన్యాశుల్కం దురాచారం వల్ల తలెత్తిన పరిస్థితిని విమర్శిస్తూ రాసిన తర్వాత, ఈ నాటకాన్ని తాను వాడుకభాషలో రాస్తున్నానని చెప్పారు. తెలుగులో నాటకసాహిత్యం లేదు కాబట్టి నాటకానికి తగిన డిక్షన్ ఎన్నుకునే స్వేచ్ఛ తనకు ఉందని చెబుతూ తెలుగు సంభాషణలు రాయడానికి గ్రాంధికం పనికిరాదని అన్నారు. ఇలా రాయడాన్ని ’’వల్గర్‘‘ అంటూ వచ్చే విమర్శలు పట్టించుకోనవసరం లేదని చెప్పారు. ఛందోబద్దమైన పద్యప్రయోగాలను, సంస్కృత సమాస భూయిష్టమైన ప్రయోగాలను కూడా ఆయన తీవ్రంగా తన ముందుమాటలో నిరసించారు. విరేశలింగం పంతులుగారి బ్రహ్మవివాహం గురించి కూడా ఆయన ప్రస్తావించారు. రెండవకూర్పుకు రాసిన ముందుమాటలోను ఈ విషయాలను ప్రస్తావించడం మాత్రమే కాదు తెలుగులో సాధారణంగా రచయితే ప్రచురణకర్తగా ఉంటాడని చెప్పారు. నేటికి అదే పరిస్థితి ఉంది. ఈ ముందుమాటలు కన్యాశుల్కంలో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ విస్తారంగా రాయనవసరం లేదు. కాని అర్ధం చేసుకోవలసిన విషయమేమంటే, వాడుకభాషలో ఉన్న పదాలను నిస్సంకోచంగా రాయడమే కాదు, స్పెల్లింగు విషయంలోను ప్రజలు ఎలా మాట్లాడుతున్నారో అలాగే ఆయన రాశారు. 1854లో పాలనాపరమైన వ్యవహారాల్లో రాతకోతలు వాడుకభాషలోనే జరుగుతున్నప్పటికీ సాహిత్యం వాడుకభాషలో రాయడానికి నాలుగుదశాబ్దాలు పట్టింది. ఎంత దురదృష్టం. ఈ దురదృష్టకరమైన పరిస్థితి నేటికి కూడా కొనసాగుతోంది. తెలుగులో కలిసిపోయిన ఇంగ్లీషుపదాలు అనేకం ఉన్నాయి. కాని కొత్తగా వస్తున్న ఇంగ్లీషు పదాలకు తెలుగు పదాలు తయారు చేయాలన్న ఉత్సాహం, తెలుగును ప్రక్షాళన చేసే ప్రయత్నాలతో అర్ధం కాని సంస్కృత పదాల సమాసాలు వస్తున్నాయి.

కన్యాశుల్కంలో వాడిన భాష ఆ కాలంలో ఉత్తరాంధ్రలో వాడుకలో ఉన్న భాష. 1980లో బండి గోపాలరెడ్డి గారు కన్యాశుల్కంలో ఎన్నో పదాలకు వివరణాత్మకమైన ఫుట్ నోట్స్ రాసి ప్రచురించారు. అది మొదటి కూర్పుకు సంబంధించినది. 1991లో కే.వీ.రమణారెడ్డి గారు రాసిన కన్యాశుల్కం టీకా.. టిప్పణి ప్రచురించారు వెలుగు రామినీడు గారు. ఈ పుస్తకాల సహాయంతో కన్యాశుల్కం పదాలను అర్ధం చేసుకుని చదవవచ్చు. అయితే కొన్ని పదాలకు, ముఖ్యంగా ఉర్దూ నుంచి వచ్చిన పదాలకు వివరణ అవసరమే. అలాగే పూర్తిగా రూపం మారిపోయిన పదాలున్నాయి. ఉర్దూ వాళ్ళు విన్నా కూడా వారికి ఆ పదం తమ భాష నుంచే వచ్చిందని తెలియదు.

యజమాని అన్న పదం మనకు తెలిసిందే. జజ్మాన్ అన్న పదం నుంచి ఇది వచ్చింది. యవడికిక్కడికి రావడానికి మగదూరు ఉంది అంటాడు గిరీశం. మఖ్దూర్ అన్న పదం ఉర్దూలో ఉంది. నిజానికి అక్కడ అక్షరం ఖ కాదు. ఇది క, గ అక్షరాలకు మధ్యస్థంగా ఉచ్ఛరించే అక్షరం. ఖుద్రత్ అంటే శక్తి, బలం అని అర్థం. మఖ్దూర్ అంటే శక్తి కలిగిన వాడు, దమ్మున్నవాడన్న భావం. అలాగే ఠస్సా అనే పదం. గర్వం, ఆడంబరం, ముద్ర, అచ్చు, మూస వగైరా అర్ధాల్లో ఉర్దూలో వాడతారు. కాని గురజాడ ఠస్సా చెప్పి రంజింపజేద్దాం అని రాశారు. ఖిస్సా అంటే కధ అనే అర్ధంతో వాడారు. ఈ పదాన్ని మరో చోట ’’ఒక ఠస్సా వేశామంటే అది బ్రహ్మభేద్యంగా ఉండాలి‘‘ అంటాడు గిరీశం. ఇక్కడ కూడా అదే అర్ధంతో వాడారు. ఠస్సా వేసుక్కూర్చోవడం అంటే మొండికేయడం అన్న అర్ధాన్ని బ్రౌన్ ఇచ్చారు. ఈ పదం వాడకంలో కట్టుకధ అన్న భావాన్ని సంతరించుకుని ఉండవచ్చు. ఎందుకంటే గురజాడ రెండు చోట్ల కూడా కట్టుకధ అన్న భావంతోనే వాడారు. అలాగే కదపాయించడం అన్న పదం కూడా గమనించదగింది. కదప అంటే కౌంటర్ అగ్రిమెంట్ అన్న అర్ధాన్ని బ్రౌన్ ఇచ్చారు. ఈ పదం ఉర్దూ నుంచి వచ్చిందిగా కనబడుతోంది. కాని అసలు పదమేమిటో బ్రౌన్ ఉర్దూ స్పెల్లింగు ఇవ్వలేదు.  బేరీజు అనే పదం బేరీజ్ నుంచి వచ్చింది. దీనికి లెక్కించడం, ఎస్సెస్ మెంట్ అన్న అర్ధాలున్నాయి. మేజువాణి అనే పదం కూడా తెలుగులో కాస్త అర్ధం మారి స్థిరపడింది. మేజ్బాన్ అంటే ఆతిథ్యం ఇచ్చేవాడు. హోస్ట్ అని భావం. అలాగే మేజ్బాన్ అంటే ఎంటర్ టైనర్ అనే అర్ధం కూడా ఉంది. మేజ్బానీ అంటే ఆతిథ్యం ఇవ్వడం, హోస్టు చేయడమూ అని అర్ధం. అది వినోదకార్యక్రమానికి కూడా కావచ్చు. ఈ అర్ధంతోనే తెలుగులో మేజువాణి అయ్యింది. మేజువాణి గురించి చెప్పినప్పుడు మూజువాణి గురించి కూడా చెప్పాలి. మూజుబాని అంటే నోటిమాట. అదే మూజువాణి అయ్యింది.  పెళ్ళి కూతురిని ఇలాకా చేసుకుని అంటాడు గిరీశం. ఇలాకా అంటే ప్రాంతం అన్న అర్ధమే కాదు, తన పనికి వాడుకునే ప్రయత్నం, అందుకు అవసరమైన సంబంధం వగైరా అర్ధాలున్నాయి. దుబారా అనేది దోబారా నుంచి వచ్చింది. దోబారా అంటే మరోసారి అని అర్ధం. మళ్ళీ మళ్ళీ అవసరం లేని ఖర్చులు దుబారా ఖర్చులయ్యాయి. తెరవెనుక నుంచి హంగు చేస్తాను అంటుంది మధురవాణి. ఇక్కడ హంగు అనే పదం ఉర్దూ ఢంగ్ నుంచి వచ్చింది. ఢంగ్ అంటే ఉపాయం, పద్ధతి వగైరా అర్ధాలున్నాయి. తెర వెనుక నుంచి ఉపాయం చేస్తాను అన్న భావంతో వాడారు. కాకితమైతే అగ్గిపుల్లతో ఫైసల్ అంటాడు రామప్పంతులు. కాగితం, కాకితం కూడా ఉర్దూ మూలపదం కాగజ్ నుంచి వచ్చినవే. కుమ్మక్కు అనే పదం యథాతథంగా ఉర్దూ నుంచి వచ్చింది. కుమక్ అంటే సహకరించడం, తోడ్పాటు అందించడం. ఏజన్సీ కమాన్ చేస్తున్నప్పుడులో కమాన్ అనే పదం ఫ్రెంచ్ కమాండ్, మిలిటరీ జర్నీ నుంచి వచ్చిందని బ్రౌన్ రాశారు. కమాన్ అంటే విల్లు అని అర్ధం ఉంది. కమాన్ దార్ అంటే విల్లు చేబూనినవాడు. కమాన్ పర్ జానా అంటే సైనికవిధులకు వెళ్ళడం అని భావం ఉర్దూలోను ఉంది. ఇంగ్లీషులో కమాండ్ అంటే అధికారం అనే భావంతో కూడా ఉర్దూలో కమాన్ వాడతారు. కమాన్ కర్నా అంటే నాయకత్వం వహించడం అన్న అర్ధముంది. ఏమైనా ఉద్యోగవిధుల్లో ప్రయాణమవ్వడం అన్న అర్ధంతో వాడినట్లు తెలుస్తోంది. కాగితాలు యావత్తు జాబితా రాస్తాను అంటాడు గిరీశం. జాబితా అనే పదం ఉర్దూ జాబ్తా నుంచి వచ్చింది. ఒకవేళ దెబ్బ బే జోటు అయిపోయి అంటాడు రామప్పంతులు. జోట్ అంటే జత అని భావం. బే జోట్ అంటే జతకుదరకపోవడం. ఇక్కడ విఫలం కావడం అన్న భావంతో వాడారు. పైలా పచ్చీసి అనే పదంలో పచ్చీసీ అంటే పాతికేళ్ల ప్రాయం. అనాడీ చేస్తున్నారు అంటాడు రామప్పంతులు. అనాడీ అంటే అజ్ఞాని, మూర్ఖుడు అని అర్ధాలున్నాయి. పల్లకి ఫాల్కి నుంచి వచ్చింది. ముక్తాయింపు అనేపదం విషయానికి వస్తే, మక్తా అంటే ముగించేది అని అర్ధం. దీనికి యించు ప్రత్యయం చేర్చి, మక్తా ముక్తా అయ్యింది. ముక్తాయింపు అంటే ముగింపు అనే భావం స్థిరపడింది. కరారావుండు పదంలో కరా అనే మాటకు ఉర్దూ ఖరా మూలమనిపిస్తోంది. ఖరా అనే పదానికి పాతకాలంలో ముద్రణకు ఉపయోగించే ఒక రాతిపై అక్షరాలు తుడిచే ఇటుక వంటి దాన్ని ఖరా అనేవారు. చిత్తు లెక్కలను ఖరా అనేవారు. ఖరా అనే పదానికి ఖచ్చితమైన, నికరమైన అనే అర్ధాలు కూడా ఉన్నాయి. రావుండు అనే పదం ఇంగ్లీషు నుంచి వచ్చింది. ఖరా రావుండు అంటే నికరంగా సున్నా చుట్టేశాను అనిపిస్తోంది. మీనాక్షి ఆపాతు ఎక్కదీసి అంటాడు రామప్పంతులు ఇందులో ఆపాతు ఉర్దూ ఆఫత్ నుంచి వచ్చింది. ఈ పదానికి అసలు అర్ధం ఆపద. కొంపలమ్ముకునే బేరాల తాపీ తెలియదు అనే వాక్యంలో తాపీ పదం కూడా ఉర్దూ తాపీ నుంచి వచ్చిందే కావచ్చు. తాపీ అంటే ఓడ అడుగుభాగాన బరువుకోసం వేసేది. ఇది పైకి కనబడదు. బ్రౌన్ ఈ అర్ధమే ఇచ్చారు. మావా, యేం ఖోదా కొట్టుకొచ్చిందోయ్ నీకు అంటాడు రామప్పంతులు. ఖోదా పదం ఖోజ్ నుంచి వచ్చి ఉండవచ్చు. ఈ పదానికి జాడ, ఆనవాలు, వెదుకులాట వగైరా అర్ధాలే కాదు, పరిశోధనద్వారా కనిపెట్టిన దాన్ని కూడా ఖోజ్ అనే అంటారు. మేరీ ఖోజ్ హై అంటే నేను కనిపెట్టిందని అర్ధం. ప్రయత్నం లేకుండా దానికదే కొట్టుకొచ్చిందనే భావంతో వాడి ఉండవచ్చు. ఈ పదం ఖుద్ అనే పదం నుంచి వచ్చింది కూడా కావచ్చు. ఖుద్ అంటే స్వయంగా, దానికదే అని అర్ధం. అందుకే ఖుద్దుగా వెళ్ళాడు అంటే తానే తనిష్టం కొద్ది స్వయంగా వెళ్ళాడు అని అర్ధం. దేవుడు సర్వశక్తి సంపన్నుడు, స్వయంగా సమస్త శక్తులు కలిగిన వాడు, ఆయన్నెవరూ సృష్టించలేదు కాబట్టి ఖుదా అంటారు. ఖుద్ అన్న పదం నుంచే ఈ పదం వచ్చింది.

ఖుదాయీ మదద్ అంటే దైవిక సహాయం అని అర్ధం. దైవికంగా వచ్చిన అదృష్టం అనే భావంతో కూడా ఈ పదం వాడి ఉండవచ్చు. దుస్తు డాబుగా ఉండాలి, దగలా గిగలా తీయించి ఎండవేస్తాను అనే వాక్యంలో డాబు ఉర్దూ నుంచి వచ్చిన పదమే. డాబుసరి కూడా అలాంటిదే. ఢబ్ అంటే ఉర్దూలో ఆకారం, రూపం, పద్ధతి వగైరా అర్ధాలున్నాయి. అలాగే దగలా అనే పదం ధగధగాహట్ లేదా ధగధగ నుంచి వచ్చింది. ఇది మూలపదం సంస్కృతం కావచ్చు. పంచాళీ పదం బంజారీ నుంచి వచ్చింది. మోస్తరు అనేది మోస్తర్ అంటే శాంపుల్ నుంచి వచ్చింది. ఒక మాదిరి అనే భావంతో వాడారు. మా స్నేహితులు అంచీబళ్ళు ఖణాయిస్తారు అంటాడు గిరీశం. ఖణాయిస్తారు అన్న పదం రూపం మారిన ఉర్దూ ప్రయోగం. ఖడానా అంటే నిలబెట్టడం. ఖడాయించడం రూపం మారి ఖణాయించడం అయి ఉండొచ్చు. ఉర్దూలో కతానా అంటే ఎక్కౌంట్స్ లో వేసే ఎంట్రీని అంటారని బ్రౌన్ రాశారు. కతాయించడం, కటాయించడం అంటే ఎక్కౌంట్ ఎంట్రీ. కతావణి లేదా కటావణి అంటే లెడ్జరు. కతానా అనేది అర్ధం మారి నియమించడంగా తెలుగులో వచ్చి ఉండవచ్చు. ఉచ్ఛారణ మారి ఖణాయించడం కావచ్చు. ఖడాయించడం అన్న పదాన్ని బ్రౌన్ కూడా రాశారు. నిలపడం అనే అర్ధం ఇచ్చారు. ఖణాయించడం అనేది ఖడాయించడం నుంచి వచ్చిందనే అనిపిస్తోంది. అఖాడా అంటే గోదా. హెడ్ కానిస్టేబుల్ రంఢా గర్భాలే కదా అంటాడు. రాండ్ అంటే విధవ, ముండమోపి అని అర్ధాలున్నాయి. విధవల గర్భాలే కదా అనే భావంతో వాడారు. అలాగే పింఛను ఫిరకా యావత్తు భుజాన్ని తుపాకి వేయవా అంటాడు. ఇక్కడ ఫిరకా అంటే సైన్యంలో సబ్ డివిజన్ని ఫిరకా అంటారు. తండ్రి కానిగీగా వచ్చి బండి ఎక్కించుకుని దౌడాయించాడేమో అని రామప్పంతులు అంటాడు. కానిగీ అంటే వ్యక్తిగతం, ప్రయివేటు, ఇంటికి సంబంధించిన అని అర్ధాలున్నాయి. ఇక్కడ రహస్యంగా వచ్చాడన్న భావంతో వాడారు. వ్యవహారం అంతా సూక్ష్మంగా ఫోక్తు పరచుకుని వచ్చానంటాడు రామప్పంతులు. పుఖ్తా కర్నా అంటే బలపరచడం అని అర్ధం. పుఖ్తా అంటే దృఢమైన అని అర్ధం. వ్యవహారం దృఢం చేసి వచ్చానన్న భావంతో వాడారు. దౌల్బాజీ అనే తిట్టు దగాబాజ్ నుంచి వచ్చింది. అంటే మోసగాడని అర్ధం. ఆయనలాంటి అచ్ఛానీలు అరుదు అంటాడు కరటకశాస్త్రి. అచ్ఛా అంటే మంచివాడని అర్ధం. అచ్ఛాణీ ఈ పదం నుంచే వచ్చింది. సౌజన్యరావు పంతులు ఇంట్లో కచేరీ గది అనే వాక్యంలో కచేరీ అంటే సిట్టింగ్ రూమ్, నిజానికి ఉర్దూలో దివాన్ ఖానా అనే పదం ఇప్పుడు వాడకంలో ఉంది. కచేరీ అంటే దర్బారు, న్యాయస్థానం వగైరా అర్ధాలు కూడా ఉన్నాయి. ఇక్కడ సిట్టింగ్ రూమ్ అన్న అర్ధంలో వాడారు.

రెండుమైళ్ళు లోసబరున ధర్మరాజు వారు ప్రతిష్ఠ చేసిన శివాలయం అన్న వాక్యంలో లోసబరున అనేది గమనించవలసిన పదం. ఇక్కడ సబరు పదం సఫర్ పదం నుంచి వచ్చింది. అంటే ప్రయాణం. గతంలో ముఖ్యంగా సముద్రప్రయాణాలకు వాడేవారు. ఇస్లామిక్ కేలండరులో రెండవనెల పేరు కూడా సఫర్. అంటే ప్రయాణాల నెల అని అర్ధం.  బ్రౌన్ నిఘంటువులో ఈ పదాలకు అర్ధాలు వివరించారు. లోసబరు అంటే సముద్రంలోపలికి వెళ్ళడం. రెండుమైళ్ళు సముద్రం లోపల అని భావంతో వాడి ఉంటారు. దరిసబరు అంటే తీరం వెంబడి ప్రయాణించడం అనే అర్ధం కూడా బ్రౌన్ ఇచ్చారు. పితూరి అనే మాట ఫుతూర్ నుంచి వచ్చింది. ఈ పదానికి అర్ధం గందరగోళం, కలహం, జగడము వగైరా ఉన్నాయి. ఫుతూరీ అంటే జగడాలమారి అనే అర్ధం కూడా ఉంది. పితూరి అనే పదం తిరుగుబాటు, కుట్ర, ద్రోహం అనే అర్ధాల్లో తెలుగులో స్థిరపడింది. ఖంగాళీ అనే పదం కంగాల్ నుంచి వచ్చింది. కంగాల్ అంటే దరిద్రుడని అర్ధం. కంగాలీ అంటే దౌర్భాగ్యం, గతిలేని తనం. తెలుగులో ఖంగాళీ అయ్యింది. దినుస్సు అనే పదం.      “దినుసులు” అని నెల్లూరు పరిసరాల వెచ్చాలను వ్యహరించడం చూస్తాము. జినిస్  అనే మాట నుంచి ఈ దినుసులు ఏర్పడ్డది. జినిస్  అన్నది ఉర్దూ మాట. జినిస్ అని బెంగాలీలు, ఒడియా వారూ కూడా వస్తువులను ఉద్దీశించి అంటారు. “జినిస్ ఆణిచో” అంటే “వస్తువులు తెచ్చావా”  అని ఒడియా లో అర్ధం.

కన్యాశుల్కంలో అనేక ఉర్దూపదాలు కనిపించడానికి కారణాలు కూడా మనం చూశాం.

మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లు గిడుగు రామమూర్తి పంతులుగారు వ్యవహారికోద్యమం కోసం నడుం కట్టకముందు కూడా పాలనాపరమైన రాతకోతల్లో, న్యాయస్థానాల్లోని రాతకోతల్లో నడిచింది వ్యావహారికభాషే. బ్రౌన్ ఆ ఉదాహరణ ఇచ్చారు. నాలుగు పంక్తుల్లోనే అనేక ఉర్దూ, ఇంగ్లీషు పదాలు మనకు కనిపించాయి. గిడుగు రామమూర్తి పంతులుగారు తన బాలకవి శరణ్యంలో చెప్పిన మాటలు కొన్న ఇక్కడ ప్రస్తావించుకోవడం అవసరం.

’’ ”మన తెలుగు భాషలో అన్యదేశ్యములు అనేకమున్నవి. కవులు కూడా వాడుతున్నారు. అట్టి శబ్దములు ఏయే భాషల నుండి ఎప్పుడెప్పుడు వచ్చి తెలుగులో చేరినవోఎలాగున మారినవో మన తెలుగు పండితులు విచారించ లేదు. శ్రీ వావిలి కొలను సుబ్బారావు పంతులు గారు తమ సులభ వ్యాకరణములో రోజుఖర్చుజమజాబుమొదలయిన తురకమాటలు ప్రయోగార్హములు కావని నిషేధించినారు గాని ఆయన రచించిన సుభద్రా విజయము (పుట 54)లో కంతుతేజీ‘ అని ప్రయోగించినారు తేజీ‘ అన్న పదమేభాషో? …మన దేశమును ముసల్మాను ప్రభువులు చాలా కాలము పరిపాలించి యుండినందుననుఆ మతము వారు తురుష్కులుపఠానులుఅరబ్బులు మొదలగువారు అన్ని మండలములలోను స్థిర నివాసము ఏర్పర్చుకొని మనకు తోడికాపులయి ఉన్నందునవారి భాషలో చేరిన అరబ్బీపారసీతుర్కీ మాటలు ఒక్క మన తెలుగులోనే కాదు అన్ని భాషలలోను చేరినవి.

                 ”తురక మాటలు” అపరిహార్యములు. సరస కవితకు ఆలంబనములుశ్రీనాధుడు అక్కడక్కడా ఒక్కొక్క మాట ‘ఖుసి మీరన్‌‘  అని ప్రయోగించాడు. నార్మను రాజులు ఇంగ్లాండు జయించి పాలించిన కాలమందు నార్మన్‌ఫ్రెంచి శబ్దములుఇంగ్లీషులో కలసినట్లేమన తెలుగులో ఉర్దూ మాటలు చేరిభాషాభివృద్ధికి కారణము లయినవి. సాలాఖరువలెనే నెలాఖరుమాసవారీబేమర్యాదపెత్తనదారుడుకలక్టరీనిజాయితీగుమాస్తాగిరి,బంట్రోతుగిరి ఎంత పొందికగలిగి యున్నవో చూడండి. వేలకొలదిగా ఉన్న ఈ హిందుస్తానీ మాటలు నిత్యవ్యవహరములో ఆంధ్ర భారతి శరీరములోని అంగములయినవి. ఛేదిస్తే గాయములు పడకతప్పదు. …..  ఇంగ్లీషు మాటలుసంస్కృత శబ్దములుఉర్దూ పదములు మన భాషలో కలిసిపోయిన వన్నీ మన మాటలే. అవి విడిచితే వ్యవహార హాని… తెలుగులో కలిసిపోయిన అనాంధ్ర శబ్దములన్నీ పూర్వము ఏ భాషలోనివైనా ఇప్పుడు తెలుగులే. నేటి వ్యావహారికాంధ్ర భాష అభినవాంధ్ర భారతి యొక్క వాజ్మయ శరీరము భాషలో చేరిన అన్యదేశ్యాలు ఆమె శరీరములో అంతర్భూతములే. అవిఅవసరమును బట్టి వేసే వేషాలుపెట్టుకునే అలంకారాలుపూసుకొనే మెరుగులు.

తెలుగును పరిశుద్ధం చేదామంటూ ఆంగ్ల పదాలు తొలగించేదామని ఉద్యమాలు చేస్తూ, కొన్ని ఎవరికీ అర్ధం కానీ తెలుగు పదాలు ప్రాచుర్యం లోకి తీసుకొద్దామని  చాలా ప్రయాస పడే వారు, తెలుగు భాషలో దాదాపు ముస్లిం పరిపాలకుల పాలన కాలమైన ఏడు వందల ఏళ్ల నుంచి తెలుగు మాత్రమే కాక దేశ భాషలలొ  విడదీయరానంతగా కలగలిసిపోయిన హిందూస్తానీ పదాల గురించి ఏమీ మాట్లాడరు. ఎందుకంటే ఇవి విడదీయరాని  సహజత్వాన్ని  సంతరించుకోవడం వల్ల కూడా అసలు ఇవి హిందూస్తానీ లేక ఉర్దు పదాలని గుర్తించడం కూడా ఇవాళ కష్టం.

తెలుగు భాషలోకి వచ్చిన వేలాది ఉర్దూ పదాలను చూస్తే  ఈ ఉర్దూ పదాలను తెలుగు నుండి ఇక తొలగించలేమేమో అనిపిస్తుంది. అవి పూర్తిగా తెలుగు పదాలు అయినట్లుగాతెలుగులో స్థిరపడిపోయినట్లుగా భావించే బ్రౌన్‌తెలుగు-ఇంగ్లీషు నిఘంటువులో వాటి అర్థాలను ఇచ్చాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ రీడరు డాక్టర్‌. కె. గోపాలకృష్ణరావు గారు ” తెలుగుపై ఉర్దూ పారశీకముల ప్రభావము” అనే తన గ్రంథంలో ఆదికవి నన్నయ మొదలు సి.నారాయణ రెడ్డి వరకు ఎందరో తెలుగు కవులు తమ రచనలలో ప్రయోగించిన ఉర్దూపార్శీ పదాలను సోదాహరణంగా వివరించారు. ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ వారి బహుమతి పొందిన ఈ పుస్తకాన్ని ఆంధ్ర సారస్వత పరిషత్తు 1968లో ప్రచురించింది. బ్రౌణ్య నిఘంటువులో కానరాని అనేక ఉర్దూ పదాలుఉర్దూతో మిళతమయిన తెలుగు పదాలు ఎన్నో ఈ గ్రంథంలో దర్శనమిస్తాయి.                 ‘ తెలుగుపై ఉర్దూ పారశీకముల ప్రభావము ‘  ‘పరిశిష్టము‘ లో గోపాల కృష్ణారావుగారు ఇలా అన్నారు. ఇప్పుడు దేశమునందుకాని రాష్ట్రమునందు కాని ఉరుదూ పారశీకములకు అధికార భాషాస్థాయి లేదు. కొన్ని రాష్ట్రములలో మాత్రమే ఉరుదూ అనుబంధ అధికార భాషగా స్వీకరింపబడినది. ఇట్టి పరిస్థితులందును ఉర్దూ పారశీక ప్రభావము ప్రసరించుచున్న అంశము విస్మరింపరానిది. పత్రికల భాషవివిధ సంస్థల ప్రకటనలుప్రభుత్వ శాసనములుచట్టములు వ్యవహారభాష మున్నగు వానిని పరిశీలించినచో ఈ అంశము స్పష్టమగును… ఉరుదూ పారశీకములందు అరబీ భాష నుండి పెక్కు పదములు ప్రవేశించినవి. కనుక పరోక్షముగా అరబీ పదములు కూడా తెలుగులో చేరినవనుట నిశ్చయము. చారిత్రక దృష్టితో చూచినచో ద్రావిడ భాషలపై అరబీ భాష ప్రభావమే మొట్టమొదట కలిగినట్లు కన్పించును… నావికుల పదజాలమును పండితులు పరిశీలించినచోఅమూల్యమయిన అంశములు వెల్లడియగునుపారిభాషిక పదములను రూపొందించుకొనుటలో తెలుగు వారు ఉదారదృష్టి వహించుట అవసరమే. ప్రతిపదము కూడా అచ్చమయిన తెలుగు పదముగా మాత్రమే ఉండవలయునను నిర్భందమును పూనినచో కార్యము క్లిష్టతరమగును. సంకుచిత దృష్టితో మడిగట్టుకొని పారిభాషిక పదములను తెలుగు పదముల తోడనే బలవంతముగా నిర్మించుకొనినచో అవి బహుజన ఆదరపాత్రములు కాక వ్యవహారమును కష్టతరమొనర్చును. విధిలేనపుడు ఎంత గొలుసు పదములనుచిత్ర విచిత్రములైన పదములను నిర్మించుకొనుట శాస్త్రసిద్ధమైన మార్గము కాదు. జేబురుమాలుగుండీఅంగీకుడ్తా,టోపిఅమలువాయిదా వంటి పదములకు సమానార్థకములగు తెలుగు పదములను ప్రత్యేకముగా కృషి సలిపి నిర్మించుకొనుట వృధాశ్రమయని అనుభవజ్ఞుల అభిప్రాయము… నిత్య పరివర్తన శీలమయిన భాషకు నిర్భంధములు తగవు అన్యభాషల నుండి పదములు స్వీకరించినంత మాత్రమున తెలుగు భాష గౌరవ ప్రతిష్టల కెట్టి భంగము వాట్లిలదు. తెలుగు ఇంకను పరిపుష్టమగును…ఆదాన ప్రదాన పద్ధతి ఉభయ భాషా సాహిత్యములకు లాభదాయకము. దక్షిణాది భాషలపై ఉర్దూ పారశీకముల ప్రభావమును తులనాత్మకముగా పరిశీలించి తెలుగుపై ప్రసరింపజేసిన ప్రభావ వైశిష్ట్యమును కూడా నిరూపించుటకు పండితులు కృషి యొనర్పవలసియున్నది. ఇట్టి పరిశోధనకు కృషికి పునాదిగా పనికి వచ్చునది పదజాలము. ఈ పదజాలమును నిఘంటువు రూపమున సంతరించుట ఎంతయో అవసరము. ఇది ఒకరి వలన అగు కార్యము కాదు. బహుభాషజ్ఞులగు పండితుల సహాయముతో సాహిత్యసంస్థలుఅకాడమీలు బృహత్ప్రణాళికను సిద్దము చేసి సాధింపదగిన కార్యము. ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ అన్యదేశ్య నిఘంటువును కూడా నిర్మించుటకు సాహసింపవలయునని వినయపూర్వకముగా విన్నవించు కొనుచున్నాను.

జాతీయాలు, సామెతలు, లోకోక్తులు, యాస పదాలు క్రోడీకరించి పరస్పరం అనువదించి గ్రంథాలుగా వెలువరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. భాషాప్రియ సంస్థలీ పనికి పూనుకోవాలి.

గురజాడ రచన లోని కలుపుగోలు  ధోరణి మనకు తెలియచెప్పేది ఏమిటంటేభాషలు కలిసినట్టే మనుషులు  కూడా కలగలిసి పోతారు.  గత తొమ్మిది వందల ఏళ్ల భాషా ప్రయాణంలో తెలుగులో వచ్చి చేరిన పొరుగు మాటలు అనేకం.  ఇవి సాహిత్యం లోనూ వందల ఏళ్ల బట్టి  వాడబడుతూనే వున్నాయి. తెలుగు లో మిశ్రమ భాషా  పదాల  పరిణామం అధ్యయనం  చేసే క్రమంలో కన్యా శుల్కం  కూడా ఒక ప్రధాన ఉపయుక్త  రచన. తన రచన లోని భాష ను ప్రజలు  మాట్లాడుకునే  భాషకు అద్దం గా నిలపడం ద్వారా నే గురజాడ  ఈ మహత్తర ప్రయోజనాన్ని సాధించారు.

 

a.wahed