రఫీ ఫోన్ రింగవుతోంది. రాత్రి 11 గంటలు. బద్ధకంగా ఫోన్ లిఫ్ట్ చేశాడు. అవతల రజాక్ గొంతు. ఏరా రేపు మన గెట్ టుగెదర్ ప్రోగ్రాం ఉంది వస్తున్నావు గా? అడిగాడు రఫీని. ఇన్షాఅల్లాహ్ చెప్పాడు రఫీ. తప్పకుండా రావాలి. దాదాపు 20 సంవత్సరాల తర్వాత కలుస్తున్నాం ఫ్రెండ్స్ అంతా. నువ్వు రాకపోతే ఎలా? నచ్చజెప్పబోయాడు రజాక్‌ను. వస్తానులే అని ఫోన్ పెట్టేశాడు రఫీ.
ఫోన్ పెట్టేసినా వెంటనే నిద్ర పట్టలేదు రఫీకి. తన ఆలోచనలు అప్రయత్నంగా ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళి పోయాయి.
అది కర్నూల్‌లో ఒక డిగ్రీ కాలేజీ. ఆ కాలేజీ చాలా ఫేమస్. ఎక్కడెక్కడి నుండో విద్యార్థులు అక్కడికి వచ్చి చదువుకుంటూ ఉంటారు. కేవలం బాయ్స్ మాత్రమే. కో`ఎడ్యుకేషన్ లేదు. విశాలమైన ప్రాంగణం, పెద్ద ఆట స్థలం, అన్ని సౌకర్యాలతో అహ్లాద కరంగా ఉంటుంది కాలేజీ వాతా వరణం. హాస్టల్, కాలేజీ అంతా క్యాంపస్‌లో ఉంటాయి.
రఫీ కొత్తగా ఆ కాలేజీలో చేరాడు డిగ్రీ ఫస్టియర్‌లో. కొత్తకొత్తగా, భయం, బెరుకుతో క్లాస్‌కు అటెండ్ అయ్యాడు. అంతా ప్రెషర్స్. పరిచయాలు అవు తున్నాయి క్లాస్‌లో. రఫీ చలాకీ అబ్బాయి. చూడటానికి కూడా ఎంతో అందగాడు. స్వత హాగా కలుపుగోలుతనం ఉన్న రఫీ చాలా తొందరగానే క్లాస్‌లో, హాస్టల్‌లో అందరితో కలిసిపోయాడు. రఫీకి తన క్లాస్‌లోని మోహన్, బాలాజీ, రజాక్, అబ్రహం… ఇలా ఎంతోమంది ఫ్రెండ్స్ అయ్యారు. ఫస్టియర్‌లో సీనియర్లు కొంచెం ర్యాగింగ్ చేసేవారు. అయినా ఆ ర్యాగింగ్ కూడా ఎంతో సరదాగానే ఉండేది.
ఒక నెల తర్వాత కాలేజీలో మధు అనే విద్యార్థి చేరాడు. ఎంతో చలాకీ. రఫీ లాగే మంచి క్రికెట్ ప్లేయర్. అందరితో ఫ్రెండ్లీగా ఉండే రపీ మధును కూడా ఫ్రెండ్‌లాగే భావించేవాడు. అయితే రఫీ అతి మంచితనం, మృదుత్వం, స్నేహ స్వభావం వల్ల కాలేజీలో అందరు రఫీని బాగా అభిమానించేవారు. మధు రఫీతో ఎంతో కొంత స్నేహంగా ఉన్నా ఎక్కడో ఒక మూల ఒకింత ఈర్ష్య ఉండేది రఫీ పట్ల. రఫీ చదువుల్లో టాపర్. మధ్యతరగతి కుటుంబం కాబట్టి ఆర్థిక బాధలు తెలుసు. అందుకే చదువును నిర్లక్ష్యం చెయ్యకుండా చదివేవాడు. జీవితంలో ఎన్నో ఉన్నతమైన లక్ష్యాలను సాధించాలి అని అనుకునేవాడు. సివిల్స్ సాధించా లనేది అతని కల. మధు ఒక సంపన్న కుటుంబంలో పుట్టాడు. కాబట్టి బాధ్యత తెలీదు. బైక్‌లు, కావాల్సినంత డబ్బు, ఫ్రెండ్స్‌కు పార్టీలు… ఇలా స్టూడెంట్ లైఫ్ బాగా ఎంజాయ్ చేసేవాడు. అయితే క్రికెట్ అంటే పిచ్చి. మంచి క్రికెటర్ అవ్వాలని కలలు కనేవాడు.
తన దగ్గర డబ్బున్నా, తను మంచి క్రికెట్ ప్లేయర్ అయినా తన అహంకారం వల్ల ఫ్రెండ్స్ మధును అంతగా ఇష్టపడేవారు కాదు. కాలేజీలో, హాస్టల్‌లో అందరూ తన మాటే వినాలని పంతం ఉండేది మధులో. రఫీ మధులో ఒక మంచి స్నేహితుణ్ణి మాత్రమే చూసేవాడు. అతనితో ఎంతో మంచిగా ఉండటానికి ప్రయత్నిం చేవాడు.
డిగ్రీ ఫస్టియర్ ముగిసింది. పరీక్షలు అయిపోయాయి. రఫీ ఫస్టియర్‌లో కాలేజీ టాపర్‌గా నిలిచాడు. కాలేజీ వార్షికోత్సవ ఫంక్షన్‌లో బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రఫీకి వచ్చింది. రఫీ కాలేజీలో ఒక రోల్‌మోడల్ అయిపోయాడు. లెక్చరర్స్, ప్రిన్సిపాల్, తోటి విద్యార్థులు అంతా రఫీని ఎంతో అభిమానించే వారు. రఫీకి బెస్ట్ స్టూడెంట్ అవార్డు రావడం, అందరూ రఫీని అభిమానించడం మధులో ఈర్ష్యకు కారణం అయింది. ఈర్ష్య మనిషిలో విచక్షణను చంపేస్తుంది. అకారణంగా తోటివారిని ద్వేషించేలా చేస్తుంది. ఒకరి కీర్తి, సామర్థ్యం, వాళ్ళ టాలెంట్ జీర్ణించుకోలేని వారు ఎదుటివారికి ఏ కారణం లేకుండానే ద్వేషించడం మొదలుపెడతారు. రఫీ విషయంలో మధు అలానే ఆలోచించేవాడు. మధులో కనిపించే అసూయా ద్వేషాలు రఫీ గమనించేవాడు. అయినా ఏనాడూ పట్టించుకోలేదు. ఫ్రెండ్‌షిప్‌లో ఇవన్నీ సహజం అని భావించేవాడు. మధుతో ఎప్పటిలాగే ఫ్రెండ్లీగా ఉండటానికి ప్రయత్నించేవాడు.
డిగ్రీ ఫైనల్ ఇయర్‌లోకి వచ్చేశారు అందరూ. ఎప్పటిలాగే ఫైనలియర్‌లో కూడా బెస్ట్ స్టూడెంట్ అవార్డు రఫీనే వరించింది. మధులో ఈర్ష్య మరింత పెరిగిపోయింది. రఫీ ఎందుకో తనకు కంటిలో నలకలాగా, పంటి కింద రాయిలాగా తగలడం ప్రారం భించాడు. స్నేహధర్మం మర్చిపోయాడు. తనను ఎలాగైనా అందరిలో అవమానించాలని నిర్ణయించుకున్నాడు. అక్కడికి కొంతమంది ఫ్రెండ్స్ మధును హెచ్చరించారు. అయినా మధు ఎవరి మాట వినే పరిస్థితిలో లేడు. ఏదో ఒకటి చేయాలి? కాలేజీ ముగిసేలోపు రఫీ మర్యాదను మంటకలపాలి అనే నిర్ణయానికి వచ్చాడు.
కాలేజీలో మధు ప్రవర్తన నచ్చక కొందరు అతనికి దూరంగా ఉండేవారు. మధు వర్గం, రఫీ వర్గం ఇలా రెండు గ్రూపులుగా విద్యార్థులు అయిపోయారు. ఆ రోజు కాలేజీ సెండ్ ఆఫ్ పార్టీ..
అందరూ ఒకింత బాధ, మరికొంత ఆనందంతో ఫంక్షన్‌లో ఉన్నారు. ఎలాగైనా రఫీతో గొడవ పెట్టుకోవాలని అనుకున్నాడు మధు. ఏదో ఒక వంకతో రఫీని రెచ్చగొట్టేలా మాట్లాడటం, అతన్ని అవమానపరిచేలా ప్రవర్తించడం చేశాడు. రెండు గ్రూపుల మధ్య మాటామాటా పెరిగి పెద్ద గొడవయింది. గొడవ హద్దులు దాటి మాటల నుంచి చేతల్లోకి మారిపోయింది. రఫీ ఎంత వద్దని వారించినా వినే పరిస్థితిలో ఎవరూ లేరు. చిన్న మాట గొడవకు దారి తీసింది. ఒక్కసారిగా వాతావరణం అంతా మారిపోయింది. రెండు గ్రూపుల మధ్య పెద్ద గొడవ. పరిస్థితి చేయిదాటిపోయింది. అందుకే పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. మధు ఇదే మంచి అవకాశంగా భావించి తన మీద రఫీ దాడి చేయిం చాడని, తనని చంపాలని ప్రయత్నం చేశాడని, హత్యాయత్నం కింద కేసు ఫైల్ చేశాడు. తనకు ఉన్న ధనబలంతో రాజకీయ నాయకులకు చెప్పించి రఫీ మీద కేసు బలంగా పెట్టించాడు. రఫీ మీద ఎఫ్‌ఐఆర్ ఫైల్ అయింది. అతని జీవితం జైలు పాలయింది. అతని కలలు అన్నీ కూలిపోయాయి. తన ఐఏఎస్ లక్ష్యం మట్టిపాలయింది. చేయని తప్పుకు రఫీ శిక్షను అనుభవించాల్సి వచ్చింది. రఫీ టైమ్ చూశాడు. రాత్రి 2 గంటల యింది. 20 సంవత్సరాల గతం నుంచి ఒక్కసారిగా బయటికి వచ్చాడు. గుండె భారం అయింది. అయినా ఎవరి మీద కోపం లేదు. ద్వేషం అంతకన్నా లేదు. ఎందుకంటే తన గురించి తనకు తెలుసు. ఆ అల్లాప్‌ాకు తెలుసు. తను ఏ తప్పూ చేయలేదు అనేది నిజం.
ఆ గొడవల తర్వాత కొన్ని రోజులకు రఫీ మీద పెట్టిన కేసును కొట్టివేశారు ఏ తప్పు చేయలేదని. కానీ ఆ కేసు వల్ల తన భవిష్యత్తు నాశనం అయింది. కానీ ఆ దైవం తనను నమ్మిన దాసులను ఏనాడూ విడిచిపెట్టడు. వారి స్థానాలను మరింత ఉన్నతం చేస్తాడు. వారు ఊహించని మార్గాల ద్వారా వారికి ఉపాధిని కల్పిస్తాడు. రఫీ విషయంలో అదే జరిగింది. చిన్న వ్యాపారం మొదలుపెట్టాడు. అల్లాప్‌ా అందులోనే అతనికి శుభాన్ని ప్రసాదించాడు. వ్యాపారం దినదినాభివృద్ధి చెందింది. రఫీ చాలా తక్కువ కాలంలోనే మంచి వ్యాపారవేత్తగా పేరు ప్రఖ్యా తులు సంపాదించాడు. అతని వ్యాపారం బాగా విస్తరించింది. రఫీ కోటీశ్వరుడు అయ్యాడు. అయినా అతనిలో ఏమాత్రం అహంకారం లేదు. అదే మంచితనం, అదే మృదుస్వభావం. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే సుగుణం అతని సొంతం. అదే రఫీ విజయానికి కారణం.
తెల్లారింది. రఫీ ఫజ్ర్ నమాజు తర్వాత త్వరగా తయారయ్యి హైదరాబాద్ నుంచి కర్నూల్‌కు కారులో బయలుదేరాడు. ఇరవై సంవత్సరాల తర్వాత ఫ్రెండ్స్ అందర్ని కలుస్తామన్న ఆనందం రఫీ ముఖంలో కనిపిస్తుంది.
10 గంటలకు ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్కరూ కాలేజీకు చేరుకుంటున్నారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనంతో ఈ కాలేజీ కళకళలాడుతోంది. ఎన్నో సంవత్సరాల తర్వాత తమ ప్రియ నేస్తాలను కలవాలని అందరూ ఎంతో ఆతృతతో ఉన్నారు. అందరూ నలభైలో పడ్డారు. కొందరు గుర్తుపట్టలేనంతగా మారి పోయారు. లెక్చరర్లు అందరూ పెద్దవారైపోయారు. రఫీ కూడా కాలేజీకి చేరుకున్నాడు. తన ఫ్రెండ్స్ మోహన్, అబ్రహాం, రజాక్ అందరూ రఫీ కోసం ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నారు.
రఫీను చూసిన తర్వాత వాళ్ళందరి ముఖాలలో ఆనందం. ఎన్నో సంవత్సరాల తర్వాత కలిసిన స్నేహితుల కళ్ళల్లో కన్నీటి పొర. ఆనందం, దుఃఖం కలిగిన క్షణాలు అవి. ఒకర్ని ఒకరు గుండెలకు హత్తుకున్నారు. యోగక్షేమాల తర్వాత ఎవరెవరు ఎలా సెటిల్ అయ్యారో తెలుసుకుంటూ ఉన్నారు. రఫీ కళ్ళు మాత్రం మధు కోసం వెతుకుతున్నాయి. అతను ఎక్కడా కనిపించలేదు. మధు రాలేదా అని మోహన్‌ని అడిగాడు. మోహన్ రఫీ వంక కోపంగా చూశాడు. ఎందుకురా ఇంకా వాణ్ణి తలచుకుంటావు? సిగ్గు లేదా. నీ జీవితాన్ని నాశనం చేశాడు. ఇంకా వాడు నీకు ఫ్రెండ్ ఏంటిరా? చెప్పాడు మోహన్. రఫీ మోహన్‌ను, తప్పురా ఎంతైనా వాడు మన ఫ్రెండ్. తెలియక, ఆలోచించక వాడు తప్పు చేశాడు. ఆ వయసు అలాంటిది. ఆవేశమే కాని ఆలోచన ఉండదు. అంతమాత్రాన స్నేహితుణ్ణి కాదంటామా? చెప్పాడు రఫీ. అయినా నా జీవితం ఏమీ నాశనం కాలేదురా. నేను చాలా గొప్పగా బ్రతుకుతున్నాను ఆ అల్లాహ్ దయ వల్ల. మోహన్ భుజం తట్టాడు రఫీ.
దాదాపు ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. ఒక్క మధు మాత్రం రాలేదు. పాపం వాడు ఎందుకు రాలేదో అని రఫీ మనసులో బాధపడుతూనే ఉన్నాడు. మధు ఫ్రెండ్ అనిల్‌ను అడిగాడు. అనిల్ ఏమీ మాట్లాడకుండా తలదించుకున్నాడు. చెప్పరా ఏమైంది? మధు గెట్ టుగెదర్ ఫంక్షన్‌కు ఎందుకు రాలేదు అని అడిగాడు. మధు ఇక్కడే కర్నూలులోనే ఉంటున్నాడురా చెప్పాడు అనిల్. అవునా? మరి ఇక్కడే ఉండి ఎందుకు రాలేదు? మళ్ళీ అడిగాడు రఫీ.
అది… అది… ఏమి చెప్పాలో అర్థంకాక తలదించుకున్నాడు అనిల్. చెప్పరా ఏమైంది… నిలదీశాడు రఫీ.
చేసిన పాపం ఊరికే పోదు కదరా. నీ మీద అన్యాయంగా కేసు పెట్టి నిన్ను జైల్లో పెట్టించాడు. నీ భవిష్యత్తు నాశనం చేశాడు. దానికి వాడికి ఆ దేవుడు తగిన శాస్తి చేశాడు. క్రికెట్ టోర్నమెంట్‌కు వెళుతున్నప్పుడు కారు యాక్సిడెంట్ అయింది. వెన్నుముకకు గాయం అయి మంచానికే పరిమితం అయ్యాడు. ఒక్కగానొక్క కొడుకు అలా అయిపోయాడని వాళ్ళ అమ్మనాన్న దిగులు పెట్టుకుని నాన్న చనిపోయాడు. ఆస్తులన్నీ కరిగిపోయాయి. వాళ్ళ అమ్మగారు పాపం మధును చూసుకుని ఉంటున్నారు. మంచి వైద్యం చేయిస్తే వాడి పరిస్థితి బాగు పడుతుందట. కానీ అంత డబ్బు వాడి దగ్గర లేదు.. అని కళ్ళు తుడుచుకున్నాడు అనిల్.
రఫీ గుండె బాధతో బరువెక్కింది. పద ముందు మధు ఇంటికి వెళ్దాం అని కారు తీశాడు. రఫీ మధు ఇంటికి వెళ్ళాడు. మంచం మీద జీవచ్ఛవంలా పడి ఉన్న మధును చూస్తే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి రఫీకి. మధు కూడా రఫీని గుర్తుపట్టాడు. బాధతో, పశ్చాత్తాపంతో మధు గుండె పగిలేలా ఏడవసాగాడు. తన స్నేహితుడి చెయ్యి పట్టుకుని క్షమించమని కోరాడు. రఫీ మనలో మనకు క్షమాపణలు ఏంటిరా? అని రఫీ మధును ఓదార్చాడు. అతని పరిస్థితి చూసి చలించిపోయాడు. ఫ్రెండ్‌కు ధైర్యం చెప్పాడు. నేనున్నానని భరోసా ఇచ్చాడు. నీకు వైద్యం నా డబ్బు లతో చేయిస్తాను అని చెప్పాడు. మధు రఫీ మంచితనానికి ఇంకా కుమిలిపోయాడు.
రఫీ తీసుకున్న నిర్ణయానికి మోహన్ ఆశ్చర్యపోయాడు. నీకేమైనా పిచ్చిపట్టిందా? అని అర్థం కానట్టు చూశాడు మోహన్. నేను ఒక నిజమైన ముస్లింని ప్రవక్త ముహమ్మద్(స) అనుచరుణ్ణి. ఆయనే నా రోల్‌మోడల్. నిన్ను ద్వేషించేవారిని ప్రేమించు. నీకు అపకారం తలపెట్టిన వారికి మాత్రం ఉపకారం చేయి. నీ నుంచి దూరం పోయినా నువ్వు వారికి దగ్గర అవ్వు. ద్వేషాన్ని ప్రేమతో జయించు అనే ప్రవక్త(స) బోధనల్ని నమ్మేవాణ్ని. ఆయన బాటే నాకు ఆదర్శం అని చెప్పి చిన్నగా నవ్వి మధు వైద్యానికి కావాల్సిన ఏర్పాట్లలో మునిగిపోయాడు రఫీ.
- ఖుర్షీద్ బేగం