November 21, 2024

అజ్ఞానం, అంధకారంలో కూరుకుపోయిన నాటి సమాజంలో ముహమ్మద్‌ ప్రవక్త(స) జ్ఞానజ్యోతులు వెలిగించారు. విద్యా కుసుమాలను వికసింపజేశారు. జ్ఞానార్జన ప్రతి ఒక్కరి విధి అని ఆయన నిర్దేశించారు. ‘‘జ్ఞానం జీవితం, అజ్ఞానం మరణం’’ అని విశదీకరించారు. జ్ఞాన సంపన్నులు, జ్ఞాన విహీనులు సరి సమానులు కాజాలరని స్పష్టం చేశారు.అంతిమ దైవప్రవక్త(స) తన జీవితంలో అత్యుత్తుమ నైతిక విలువ లను ఆచరించి, స్థాపించి ప్రపంచానికి ఆదర్శప్రాయుడయ్యారు. అందుకే ఆయన (ప్రవక్త) జననం సర్వ మానవాళికి ‘శుభోదయం’ అయింది. కేవలం బోధనలతో నైతిక విలువలను సమాజంలో పాదుకొల్పడం సాధ్యం కాదు. బోధకుడు ఆ విలువలను స్వయంగా ఆచరించి ఆ విలువల పునాదులపై సత్సమాజాన్ని సర్వోత్తమ వ్యవస్థను స్థాపించాలి. దాని పరిరక్షకుడు, ప్రచారానికి అన్ని చర్యలు తీసుకోవాలి. దైవప్రవక్త(స) పై విషయాలన్నింటినీ తన జీవిత కాలంలోనే సాధించారు.మానవజాతి సంస్కరణకు ఎంతోమంది మహనీయులు, మహా త్ములు, ప్రవక్తలు ఈ పుడమిపై ప్రభవించారు. సృష్టి ప్రారంభం నుండి ఈనాటి వరకు అన్ని కాలాల్లో, అన్ని జాతుల్లో, అన్ని దేశాల్లో, అన్ని ప్రాంతాల్లో ఈ మహనీయులు మానవుల సంస్క రణకు విశేషంగా కృషి చేశారు.

ఆది మానవుడు ఆదం(అ) మొదలు నేటివరకు దాదాపు ఒక లక్షా ఇరవై నాలుగు వేల మంది దైవప్రవక్తలు ఈ పుడమిపై ప్రభవించినట్లు ధర్మశాస్త్ర గ్రంథాల ద్వారా మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఈ ప్రవక్తల పరంపరలోని చిట్టచివరి దైవప్రవక్తే మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం).
జననం
క్రీ.శ. 571 ఏప్రిల్‌ మాసం 20వ తేదీన సోమవారం నాడు అరేబియా దేశంలోని మక్కా నగరంలో ముహమ్మద్‌ ప్రవక్త(స) జన్మించారు. ఈయన తల్లి పేరు ఆమినా, తండ్రి పేరు అబ్దు ల్లాప్‌ా. ఈ మహోన్నత వ్యక్తి జన్మించక ముందే తండ్రిని, ఆరేళ్ళ ప్రాయంలో తల్లిని కోల్పోయారు. అనాథ అయిన ఆ అరేళ్ళ బాబును తాతయ్య అబ్దుల్‌ ముత్తలిబ్‌ అక్కున చేర్చుకున్నారు. ఆయన తరువాత ముహమ్మద్‌ ప్రవక్త(స) పోషణ, సంరక్షణా బాధ్యతను పెత్తండ్రి అబూ తాలిబ్‌ స్వీకరించి అల్లారుముద్దుగా పెంచి పోషించారు. చిన్నతనం నుంచే బాల ముహమ్మద్‌ సుగు ణాల రాశిగా ప్రశంసించబడ్డారు.
సాదిక్‌… అమీన్‌గా
నీతి, నిజాయితీ, సేవా తత్పరత, సత్యసంధత, విశ్వసనీయత ఆయనకు ఉగ్గుపాలతోనే అలవడ్డాయి. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటం, నిష్పక్షపాతంగా, న్యాయంగా వ్యవహరించటం లాంటి అనేక సుగుణాల రీత్యా ఆయన ప్రజల మనసులు చూరగొని సాదిక్‌గా, అమీన్‌గా అంటే సత్యసంధునిగా, విశ్వస నీయునిగా పిలువబడ్డారు.

తల్లిదండ్రుల సేవ

తల్లిదండ్రులను గౌరవించటం, వారి సేవ చేయటం, వారి ఆజ్ఞ లను శిరసావహించటం పిల్లల బాధ్యత. ప్రవక్త(స)కు వారి తల్లి దండ్రులకు సేవ చేసే భాగ్యం కలుగలేదు.
అయితే దైవప్రవక్త(స) తల్లిదండ్రుల సేవ, వారి పట్ల సత్ప్రవర్తన కలిగి ఉండాలని హితవు పలికారు. దైవప్రవక్త(స)కు పాలుపట్టిన తల్లి దాయీ హలీమాను తన సొంత తల్లిగా చూసుకున్నారు.
సంతానం పట్ల తల్లిదండ్రుల సేవ
తమ పిల్లలను ప్రేమించడం, మంచి విద్యాబుద్ధులు నేర్పిం చడం, సజ్జనులుగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేయడం తల్లి దండ్రుల బాధ్యత. ప్రవక్త(స) తన కుమార్తె హజ్రత్‌ ఫాతిమాను అమితంగా ప్రేమించేవారు. ఆమెకు ఉన్నతమైన విద్యను అందించి ఉన్నతంగా తీర్చిదిద్దారు.
మిత్రునిగా..
దైవప్రవక్త(స) తన సహచర మిత్రులను చాలా ప్రేమించారు. ఎప్పుడూ వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉండేవారు. సత్యం విషయంలో ఆయన అందరినీ సమ దృష్టితో చూసేవారు. ధనికులైనా, పేదవారైనా, స్వతంత్రులైనా, బానిసలైనా ప్రతి ఒక్కరి ఆహ్వానాన్ని మన్నించేవారు. వ్యాధిగ్రస్తులు స్వంత వారైనా, పరాయి వారైనా వారి పరామర్శకు వెళ్ళేవారు. ఇతరులను ఆ దిశగా ప్రోత్సహించేవారు.

అతిథుల హక్కులు

ఎవరైతే అల్లాహ్ ను, పరలోక దినాన్ని విశ్వసిస్తారో వారు తమ అతిథిని ఆదరించి సత్కరించాలి అని దైవప్రవక్త(స) తెలిపారు. ఆతిథ్యం మూడు రోజుల వరకు ఉంటుంది. మొదటి రోజు విందు, సత్కరింపుల దినం. ఆ రోజు అతిథికి వీలైనంత మంచి అన్న పానీయాలు సమకూర్చాలి. రెండవ రోజు శ్రమించవలసిన అవసరం లేదు. మూడు రోజుల తరువాత అతిథికి చేసే సేవలు సదకా (దానం)గా పరిగణించబడతాయి. ఇంటి వారిని కష్టపెట్టే వరకు బస చేయడం అతిథికి సమంజసం కాదని ఉద్బోధించారు.

పొరుగువారి హక్కులు

తల్లిదండ్రులు, బంధుమిత్రుల హక్కుల తరువాత ఇరుగు పొరుగు వారితో మంచిగా ఉండాలని, వారితో సత్సంబంధాలు కలిగి ఉండి, మంచిగా ప్రవర్తించాలని ప్రవక్త(స) సూచించారు.
అనాథల హక్కులు
అనాథలను ప్రేమించడం, పెంచడం, వారి అలనా పాలనా చూడటం, మంచి విద్యాబుద్ధులు నేర్పించడం సాటి మనుషు లుగా మన బాధ్యత అని ప్రవక్త(స) తెలిపారు. అనాథలను ఆదుకోండి, ఆర్తులకు భోజనం పెట్టి దాహార్తులకు మంచినీరు అందివ్వాలని నొక్కి చెప్పారు.
దానశీలిగా
ఒకసారి ఒక వ్యక్తి ఆయన పవిత్ర సన్నిధిలోకి వచ్చాడు. ఆ సమయంలో సుదూరం వరకు గొర్రెల మంద ఉంది. ఆ వ్యక్తి వాటిని చూసి, ప్రవక్తా! నాకు వీటిని దానం చేయగలరా అని అడిగాడు. దానికి ప్రవక్త చిరు మందహాసంతో వాటన్నింటినీ దానం చేసేశారు. అలాగే ఎవరైనా ఏదైనా అడిగితే ఉంటే ఇచ్చే వారు లేకపోతే ఉన్నప్పుడు ఇస్తానని చెప్పి పంపేవారు.
న్యాయాధిపతిగా
ప్రవక్త(స) ఒక న్యాయాధిపతిగా, ఆదర్శ ప్రాయుడుగా చరిత్రలో నిలిచిపోయారు. సమ న్యాయ వ్యవస్థ, సామాజిక న్యాయ వ్యవస్థను స్థాపించారు. తద్వారా నల్లవారైనా, తెల్లవారైనా, అరబ్బైనా, అరబ్బేతరుడైనా, గొప్ప వంశస్థుడైనా, బానిస అయినా, ప్రవక్త వారి వంశానికి చెందినవారైనా, తెగల సర్దారులైనా న్యాయం, చట్టం, శిక్షల ముందు సమానులైపోయారు.
భర్తగా
దైవప్రవక్త(స) తన ఇరవై అయిదవ ఏట తనకన్నా వయసులో పదిహేనేళ్ళు పెద్దదైన, రెండోసారి వితంతువు అయిన ఖదీజాను వివాహమాడి స్త్రీ జనోద్ధరణకు శ్రీకారం చుట్టారు. ఆమెతో అత్యంత సంతోష జీవితాన్ని గడిపారు. ఆమె మరణానంతరం ఇస్లామీయ ఉద్యమ అవసరాలు, అరబ్బు తెగల మధ్య ఐక్యత సాధించడానికి వేర్వేరు తెగల నుంచి వివాహాలు చేసుకున్నారు. వారిలో ఒక్క ఆయిషా(ర) తప్ప మిగతా వారంతా వితంతువులే. కుటుంబ జీవనం భార్యా భర్తల పవిత్ర బంధంతో ప్రారంభమవు తుంది. భార్యాభర్తలిద్దరు సంసారిక జీవితం, దాని నియమాల్ని, బాధ్యతలను సరిగ్గా అర్థం చేసుకొని తదనుగుణంగా నడుచు కుంటే ఆ కుటుంబం మూడు పువ్వులు, ఆరుకాయలుగా వర్థిల్లుతుందని నిరూపించారు.
పాలకునిగా
ఒక పాలకునిగా ప్రవక్త(స) ప్రజలందరి కనీస అవసరాలు తీర్చ డానికి అవసరమైన చర్యలన్నీ తీసుకున్నారు. ముస్లిములైనా, ముస్లిమేతర సోదరుడైనా, స్త్రీ అయినా, పురుషుడైనా జన్మరీత్యా అందరూ సమానులే అని పేర్కొన్నారు. పౌరులందరి ధన, మాన, ప్రాణ రక్షణకు భరోసా ప్రసాదించారు. తూనికలు, కొలతలు, వ్యాపారాల్లో జరిగే మోసాలను నివారించి స్వచ్ఛమైన వాణిజ్యాన్ని ప్రపంచానికి అందించారు. జూదం, మద్యపానం, వ్యభిచారం లేని ఒక సుందర సమాజ నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టారు. జకాత్‌, ఫిత్రా, సదఖా లాంటి ఆర్థిక సంస్కరణల ద్వారా కేవలం 10 ఏళ్ల కాలంలో పేదరికాన్ని పారద్రోలి అద్భుత మైన ఆర్థిక మంత్ర దండాన్ని ప్రపంచానికి అందించారు. పర్యావరణ పరిరక్షణ, నీటి సంరక్షణ, మానవ హక్కుల పరిరక్షణకు మార్గదర్శక నియమాలు సూచించారు. అన్నిటికంటే మించి మానవులను సృష్టికర్త అయిన దేవునినే ఆరాధించాలని తెలిపారు.
ప్రపంచానికి ఆదర్శప్రాయుడుగా
కిరీటం లేని చక్రవర్తిగా, సంపద లేని మహారాజుగా, రాజమహలు ఎరుగని పాలకునిగా, హంసతూలికా తల్పం తెలియని మహా మనిషిగా, మరణించే రోజున ఇంటి దీపంలో నూనె సైతం లేని సామ్రాజ్యాధిపతిగా ప్రపంచ చరిత్రలో కనివినీ ఎరుగని నభూతో నభవిష్యత్‌ లాంటి గొప్ప వ్యక్తిత్వం గల సంక్షేమ రాజ్యస్థాపకునిగా ప్రపంచానికి ఆదర్శప్రాయుడయ్యారు.

 

ముహమ్మద్ వహీదుద్దీన్