November 22, 2024

నువ్వు కడుపులో పడ్డప్పుడు
ఉన్న ప్రశాంత వాతావరణం
ఇప్పుడు లేదు…!
లోపల నువ్వు పెరుగుతున్న కొద్దీ
బయట సమస్యల ఊబి
తన వైశాల్యాన్ని పెంచుకుంటోంది..!
ప్రశాంతంగా ఉన్న ‘‘గాజా’’
ఇప్పుడు అత్యాచారం చేయబడ్డ స్త్రీలా
మౌనంగా రోదిస్తోంది
ఎటు చూసినా శవాల దిబ్బలు
కూలిన భవనాలు
తల్లిదండ్రులను కోల్పోయి
అనాధలైన పిల్లలు కొందరు
పిల్లల్ని కోల్పోయి దీనంగా
రోదిస్తున్న తల్లిదండ్రులు ఇంకొందరు
చిన్నపిల్లల్ని కూడా యుద్ధంలో హత్య చేస్తున్నారు
చనిపోయిన పిల్లలంతా ఊహించని మృత్యువుకి ఆహారమైతే
పిల్లల్ని చంపిన వాడిని ఏమనాలి.?
‘‘గాజా ఇప్పుడు గాయాల భూమి’’
ప్రశాంతంగా కడుపులోనే ఉండిపో
నేను బ్రతికితే నీకు ఊపిరి పోస్తాను
ఒకవేళ నేను చస్తే అదే రోజు నీకు ఆఖరి రోజవుతుంది..!
ప్రశాంతంగా కడుపులోనే పడుకో కన్నా…
నువ్వు ఇప్పుడు బయటకు వస్తే
నీకు ఇప్పుడు నేను ఏం ఇవ్వగలను..?
కూలిన ఇల్లును, చనిపోయిన మీ నాన్నను,
తాతయ్యను, నానమ్మను ఎలా చూయించగలను..?
నేనే తెగిన గాలిపటంలా శరణార్థి శిబిరంలో
బిక్కుబిక్కుమంటూ దొరికినప్పుడే తింటూ
నీ కోసం ఆలోచిస్తూ క్షణమొక యుగంలా గడుపుతున్న..
నా కాళ్ళ క్రింద భూమి కంపించి పోతోంది
ఎప్పుడు ఏం జరుగుతుందో అని..
‘‘గాజాలో’’ ఇప్పుడు విధ్వంసం జరుగుతోంది
నా మనసులో ఇప్పుడు ‘‘అలజడి’’ రేగుతోంది..
కడుపులోనే ప్రశాంతంగా పడుకో..
బయటకు వస్తానని ఇప్పుడే ‘‘సడి’’ చేయకు…

డాక్టర్‌ మహమ్మద్‌ హసన్‌