కాలం గిర్రున తిరిగింది. చూస్తుండగానే మరో యేడాది కాలగర్భంలో కలిసిపోయింది. ఎన్నో ఆశలు, ఆశయాలు, బాసలతో గత నూతన సంవత్సరంలోకి ప్రవేశించినవారు తమ ఆశలను, ఆశయాలను ఏ మేరకు సాకారం చేసుకున్నారోగాని, కాలమైతే తనకేమీ సంబంధమే లేనట్లు అప్రతిహతంగా సాగిపోయింది. ఎందుకంటే అదే దాని కర్తవ్యం. ఎవరికోసమూ అది ఆగదు. పరుగే దాని నైజం. నిరంతరం అది పరుగెడుతూనే ఉంటుంది. దానివెనుక పరుగెత్తలేని వారు మరుగున పడిపోతారు.
అనంతమైన ఈ కాల ప్రవాహాన్ని దైవం మనకోసం సులభతరం చేశాడు. కనుకనే క్షణాలు, నిమిషాలు, గంటలు, ఘడియలు, రaాములు అని మనం కాలాన్ని మన సౌకర్యం కోసం రకరకాలుగా విభజించు కున్నాం. ప్రకృతి పరంగా కూడా, సూర్యోదయం, సూర్యాస్తమయం, చంద్రోదయం, అమావాస్య, పౌర్ణమి, పగలు, రాత్రి, రోజు, వారం, నెల, సంవత్సరం అనే విభజన ఉది. ఈ ప్రకృతి నియమాన్నే మానవులు అనాదిగా అనుసరిస్తూ వస్తున్నారు. కాలగతిలో కేలండర్లు మారుతుంటాయి. కొత్తవత్సరాలు వస్తూ ఉంటాయి. వివిధ దేశాల్లో, వివిధ మతాల్లో రకరకాల పేర్లతో ఇవి ప్రాచుర్యం పొందాయి. ‘ఉగాది’ తో కొత్త సంవత్సరం ప్రారంభమైనట్లుగానే, ఇస్లాంలో ‘ ముహర్రం’ నెలతో నూతన సంవత్సరం ప్రారంభమవు తుంది. అలాగే జనవరితో ఆంగ్ల సంవత్సరం ఆరంభమవుతుంది. కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నప్పుడల్లా, మనకు ఓ విధమైన నూతనత్వపు అనుభూతి కలుగుతుంది. అనునిత్యం మార్పుచెందే ఈ కాల ప్రవాహంలో సంవత్సరాలు మారడం అనేది పెద్ద విశేషమేమీ కాదు. ఈ మార్పు ఒక చిన్న బిందువు లాంటిది. ఆ బిందువే మార్పుకు శ్రీకారం చుడుతుంది. ఇది నిరాటంకంగా, ప్రతినిత్యం జరిగే సహజ ప్రక్రియ. కాలం ఎంత వేగంగా గడిచిపోతుందో తెలుసుకోవాలంటే, కాసేపు గడియారపు సెకన్ల ముల్లు కదలికను గమనిస్తే అర్ధమవుతుంది. నిజానికి ఒక్క సెకను కాలం కూడా చాలా విలువైనదే. ఈ ఒక్క సెకనులో వెలుగు లక్షా ఎనభై ఆరువేల మైళ్ళ దూరం ప్రయాణం చేస్తుంది. ఇది మనకు తెలిసిన లెక్క. దేవుని ఈ సృష్టిలో ఇంతకన్నా వేగంగా పయనించగల అనేక వస్తువులు కూడా ఉండవచ్చు. అవి ఇంకా మన జ్ఞానపరిధిలోకి రాలేదేమో! మనం గోడకు నూతన సంవత్సర క్యాలెండరును వేలాడదీసే ముందుగా, ఎన్నో విషయాలు, గణాంకాలు మారిపోయిన సంగతి మనకు బోధపడుతుంది. అందుకే ఈ నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టే ముందు, మనం గతాన్ని నెమరువేసుకొని జాగృతం కావాలి. భవిష్యత్ కలలను సాకారం చేసుకునే దిశగా అడుగులు ముందుకు వేయాలి. ఈక్రమంలో గడిచిన కాలాన్ని మరింత దగ్గరగా, నిశితంగా పరిశీలించడం వల్ల ఇక ముందు మనం ఏం చేయాలో, ఏం చేయకూడదో ఒక స్పష్టత వస్తుంది. మారుతున్న కాలంలో మన జీవితాలు సరైన పంథాలో పయనించడానికి తోడ్పడుతుంది. జీవితంలో సంభవించిన ఆసక్తికరమైన అంశాలతో పాటు, మనపై ప్రభావం చూపిన అంశాలను కూడా ఈ సందర్భంగా పరిగణన లోకి తీసుకోవాలి. వాటిని అవలోకనం చేసుకోవాలి. గతకాలానికి వీడ్కోలు పలికి కొత్తవత్సరానికి స్వాగతం పలికే సమయంలో ఎవరైనా ఆనందానుభూతులకు లోనుకావడం సహజం. సంతోషం అనేది మానవ నైజంలో ఉన్న సహజ గుణం. అయితే, ఆనంద పారవశ్యంలో హద్దుల్ని అతిక్రమించి, నిషిధ్ధ కార్యాలకు పాల్పడడం ధార్మికంగానే కాకుండా, సామాజిక పరంగా, నైతిక పరంగా కూడా తగదు. అదినేరమవుతుంది. దీనికి దేవుని దగ్గర సమాధానం చెప్పుకోవలసి ఉంటుంది. అందుకే కాలాన్ని సాక్షిగా పెట్టిదేవుడు అనేక యదార్ధాలు చెప్పాడు. ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూస్తేకాలం చెప్పిన అనేక వాస్తవాలు కళ్ళకు కడతాయి. కాలం విలువను గుర్తించినవారు మాత్రమే వాటినుండి గుణపాఠం నేర్చుకోగలుగుతారు. అలా కాకుండా గతకాలాన్ని గాలికొదిలేసి, కొత్తసంవత్సరంలో చైతన్య రహిత చర్యలతో, అర్ధం పర్థం లేని కార్యకలాపాలతో కొత్తకాలాన్ని ప్రారంభిస్తే ప్రయోజనం శూన్యం. కాలం ఎవరి కోసమూ ఆగదు. రాజులు రారాజులు, మాన్యులు, సామాన్యులు, పండితులు, పామరులు అంతా కాలగర్భంలో కలిసిపోయినవారే, కలిసి పోవలసినవారే. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేటప్పుడు ఈ వాస్తవాన్ని గుర్తుంచు కోవాలి. గతంనుండి గుణపాఠం గ్రహిస్తూ భవిష్యత్తు కాలానికి స్వాగతం పలకాలి. నిస్సందేహంగా కొత్తసంవత్సరాన్ని సంతోషంగా స్వాగతించాల్సిందే. కాని ఆ సంతోషంలో హద్దుల అతిక్రమణ జరగకుండా చూసుకోవాలి. మందు, చిందు ఇతరత్రా అసభ్య, నిషిధ్ధ కార్యాలతో నూతన సంవత్సరాన్ని ఆహ్వానించడం ఎంతవరకు సమంజసం అన్న స్పృహ జాగృతం కావాలి. కాలం చెప్పే చారిత్రక వాస్తవాలనుండి గుణపాఠం గ్రహించకుండా లక్ష్య రహితంగా భవిష్యత్తును ప్రారంభిస్తే మిగిలేది నిరాశే. అందుకని గడచిన కాలంలో ఏం చేశామన్నది కొత్తసంవత్సరం ప్రారంభాన ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మంచిపనులు చేసిఉంటే ఈ కొత్త సంవత్సరంలో వాటిని మరింతగా విస్తృత పరుచుకునే ప్రయత్నం చెయ్యాలి. ఏమైనా తప్పులు, పొరపాట్లు, పాపాలు జరిగి ఉంటే చిత్తశుధ్ధితో పశ్చాత్తాపం చెందుతూ, ఇక ముందు అలాంటి వాటన్నిటినీ ఖచ్చితంగా విసర్జిస్తామని ప్రతిన బూనాలి. ఇక నుండి ఓనూతన శకానికి నాంది అన్న ఆత్మ విశ్వాసం తొణికిస లాడాలి. గత పాపాల పట్ల సిగ్గుపడి, పశ్చాత్తాపం చెంది, భవిష్యత్తులో ఇక వాటి జోలికి పోమని ప్రతిన బూనిన వారిని దేవుడు ప్రేమిస్తాడు. కరుణిస్తాడు. వారి పాపాలను క్షమిస్తాడు. వారి ఇహపర సాఫల్యానికి మార్గం సుగమం చేస్తాడు. జీవితం చాలా చిన్నది. ఎవరి జీవితం ఎప్పుడు సమాప్తమో ఎవరికీ తెలియదు. కనుక ఆనంద సమయమని హద్దుల్ని అతిక్రమించకుండా విలువలతో కూడిన జీవితం గడపడానికి శాయశక్తులా ప్రయత్నిం చాలి. సమాజ హితం కోసం సమయాన్ని వెచ్చించాలి. కాలాన్ని వినియోగం చేసుకోవడంపైన్నే సాఫల్య వైఫల్యాలు ఆధారపడి ఉన్నాయన్న వాస్తవాన్ని గ్రహించాలి.