November 21, 2024

కూతుళ్లు  ఇంటికి వెలుగులు. వాళ్లు త‌ల్లిదండ్రుల‌కు అల్లాహ్ ఇచ్చిన ఆత్మీయ‌ కానుక‌లు. కూతుళ్లంటే ఇంటికి కారుణ్యం, సంతోషం, శుభాలను మోసుకొచ్చే వెలుగు రేఖలు. అందుకే వారు పుట్ట‌గానే దైవ దూతలు దివి నుంచి దిగి వచ్చి దీవిస్తారు. బాలిక‌లు అవ‌నికే వెలుగులు, అనురాగానికి ప్ర‌తీక‌లు, పూల కంటే సున్నిత‌మైన‌వారు.  బాలిక‌లు బాలుర కంటే ఎందులోనూ త‌క్కువ కాదు. చంద‌మామ లేని ఆకాశం.. కూతురు లేని ఇల్లు ఒక్క‌టే! అందుకే మ‌న ఇంట్లో వెన్నెల కురిపించే ఒక కూతురు  ఉండాలి. ఆడ పిల్ల‌లు ఆడుకునే ఇల్లు సంతోషాల‌కు నెల‌వు. కూతుళ్లంటే త‌ల్లిదండ్రుల క‌న్నీళ్లు తుడిచే ఆత్మీయులు. వారు ఎంతో ప్రేమ‌గా, బాధ్య‌త‌గా త‌ల్లిదండ్రుల‌తో వ్య‌వ‌హ‌రిస్తారు. అలాంటి ఆడ‌పిల్ల‌ల‌ను ఎలా పెంచాలి? వారికి ఎలాంటి విద్యాబుద్ధులు నేర్పించాలి? ఎలాంటి వ‌రుడికిచ్చి పెళ్లి చేయాలి? ఆమెకు ఆస్తిలో వాటా ఇవ్వాలా? త‌దిత‌ర అంశాల గురించి ఇస్లాం స్ప‌ష్ట‌మైన సందేశం ఇచ్చింది.

మొదటి సంతానంగా ఆడబిడ్డ పుడితే ఆ ఇంట్లో శుభాల వర్షం కురిసినట్లేన‌ని ఇస్లాం తెలిపింది. పవిత్ర ఖుర్ఆన్ నాలుగో అధ్యాయం ‘నిసా’ అంటే మహిళ అని అర్థం. ఈ అధ్యాయంలో బోధనలన్నీ మహిళలకే ప్రత్యేకం. అనాథ బాలికలు, పెళ్లి కాని యువ‌తులకు త‌గిన హ‌క్కుల‌ను క‌ల్పించింది ఇస్లాం. యుక్త వ‌య‌స్సు అమ్మాయిల పెళ్లిని వాళ్ల అనుమ‌తితోనే చేయాల‌ని ఇస్లాం బోధించింది. అమ్మాయి అంగీకారం లేని పెళ్లి చెల్ల‌ద‌ని తెలిపింది. త‌ల్లిదండ్రుల ఆస్తిలోనూ ఆడ‌పిల్ల‌ల‌కు త‌గిన వాటా ఇవ్వాల‌ని ఆదేశించింది. క‌న్న కూతురిని ఎలా ఆద‌రించాలో ముహమ్మద్ ప్రవక్త (స) ఆచ‌ర‌ణాత్మ‌కంగా నిరూపించారు. ప్రవక్త (స) తన నలుగురు కుమార్తెలను ఎంతో ప్రేమాదరణలతో పెంచి పెద్ద చేశారు. బయటి నుంచి ఇంటికి రాగానే వారిని ముద్దాడేవారు. మగ పిల్లలు, ఆడ పిల్లలు ఇద్దరినీ సమానంగా పెంచమని బోధించారు. ఆడ‌పిల్ల‌ల ప‌ట్ల ఎలాంటి వివక్ష చూపొదన్నారు. ఏదైనా వస్తువు, కానుక ఇంటికి తీసుకువస్తే ముందు ఆడపిల్లలకే ఇవ్వాలన్నారు. ఆడపిల్లలను పెంచి పోషించి వారికి సరైన విద్యాబుద్ధులు నేర్పించాల‌ని చెప్పారు. ఆమెను మంచి వరుడికిచ్చి పెళ్లి జరిపించే తల్లిదండ్రులు స్వర్గానికి వారసులవుతారని తెలిపారు.
ఖుర్ఆన్ లో మహిళా హక్కుల రక్షణ గురించి కొన్ని బోధనలు..
మగవారికి మహిళలపై ఉన్నటువంటి హక్కులే ధర్మం ప్రకారం మహిళలకు కూడా మగవారిపై ఉన్నాయి. (2:228)

ఆస్తిలో వాటా ఇలా…

మీ సంతానం విషయంలో అల్లాహ్ మీకు ఇలా ఆదేశిస్తున్నాడు : ఒక పురుషుని భాగం ఇద్దరు స్త్రీల భాగాలకు సమానం. ఒకవేళ (మృతునికి వారసులుగా) ఇద్దరికంటే ఎక్కువమంది ఆడ పిల్లలు ఉంటే, వారికి మొత్తం ఆస్తిలో మూడింట రెండు భాగాలు ఇవ్వాలి. ఒకే ఆడపిల్ల వారసురాలైతే, ఆస్తిలో అర్థ భాగం ఆమెకు చెందుతుంది. మృతుడు సంతానం కలవాడైతే, అతని తల్లిదండ్రులలో ఒక్కొక్కరికి మొత్తం ఆస్తిలో ఆరోభాగం లభించాలి. (4:11)
ఒక మనిషి గనక సంతానం లేకుండా మరణిస్తే, అతనికి ఒక సోదరి ఉంటే, అప్పుడు ఆమె అతని ఆస్తిలో సగభాగం పొందుతుంది. సోదరి గనక సంతానం లేకుండా మరణిస్తే ఆమె సోదరుడు ఆమెకు వారసుడౌతాడు. ఒకవేళ మృతునికి (వారసులు) ఇద్దరు సోదరీమణులైతే, వారు అతని ఆస్తిలోని మూడింట రెండు భాగాలకు హక్కుదారులు అవుతారు. ఒకవేళ సోదరీ సోదరులు అనేకులు ఉన్నట్లయితే, అప్పుడు స్త్రీలకు ఒక వంతు పురుషులకు రెండు వంతులు లభిస్తాయి. అల్లాహ్ మీ కొరకు తన ఆజ్ఞలను విశదపరుస్తున్నాడు – మీరు మార్గం తప్పి తిరగకుండా ఉండేందుకు. అల్లాహ్ కు ప్రతి విషయమూ తెలుసు. (4:176)

మగువలకు రక్షణ ఇలా…

ప్రవక్తా! విశ్వసించిన మహిళలకు ఇలా చెప్పు, తమ చూపులను కాపాడుకోండి అని, తమ మర్మాంగాలను రక్షించుకోండి అని, తమ అలంకరణను ప్రదర్శించవలదని – దానంతట అదే కనిపించేది తప్ప – తమ వక్షస్థలాలను ఓణీ అంచులతో కప్పుకోవాలని, వారు తమ అలంకరణను వీరి ముందు తప్ప మరెవరి ముందూ ప్రదర్శించకూడదని: భర్త, తండ్రి, భర్తల తండ్రులు, తమ కుమారులు, భర్తల  కుమారులు, అన్నదమ్ములు, అన్నదమ్ముల కుమారులు, అక్కా చెల్లెళ్ల కుమారులు తమతో కలసీ మెలసీ ఉండే స్త్రీలు. తమ స్త్రీ పురుష బానిసలు, వేరే ఏ ఉద్దేశ్యమూ లేని వారి కింద పనిచేసే పురుష సేవకులు. స్త్రీల గుప్త విషయాలను గురించి ఇంకా తెలియని బాలురు. తాము గుప్తంగా ఉంచిన తమ అలంకరణ ప్రజలకు తెలిసేలా వారు తమ కాళ్లను నేలపై కొడుతూ నడవరాదని కూడ వారికి చెప్పు. (24:31)
ప్రవక్తా! నీ భార్యలకూ, నీ కూతుళ్లకూ, విశ్వాసుల యొక్క స్త్రీలకూ తమ దుప్పట్ల కొంగులను తమపై వ్రేలాడతీసుకోమని చెప్పు వారు గుర్తింపబడ టానికీ, వేధింపబడకుండా ఉండేందుకూ ఇది ఎంతో సముచితమైన పద్ధతి. అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడూను. (33:59)
తల్లిపాదాల చెంత స్వర్గం..
అతని తల్లి బలహీనతపై బలహీనతను సహించి అతనిని తన కడుపున మోసింది. అతను పాలు విడిచిపెట్టటానికి రెండు సంవత్సరాలు పట్టింది. (ఇందుకే మేము అతనికి ఇలా బోధించాము) ‘‘నాకు కృతజ్ఞుడవై ఉండు, నీ తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలుపు. (31:14)
మేము మానవునికి, అతను తన తల్లిదండ్రుల పట్ల సద్భావంతో మెలగాలని ఉపదేశించాము. అతని తల్లి అతనిని ఎంతో శ్రమతో తన గర్భంలో పెట్టుకొని మోసింది ఎంతో శ్రమతోనే అతనిని కన్నది. అతనిని గర్భంలో పెట్టుకొని మోసేందుకు, అతనిచే పాలు మాన్పించేందుకు ముప్ఫై మాసాలు పట్టింది. (46:15)
తల్లి పాదాల చెంత స్వర్గం ఉంది. (మహాప్రవక్త ముహమ్మద్ (స)

 

— ముహమ్మద్ ముజాహిద్