వాతావరణ మార్పులు, భారీ నిర్మాణాలు, పెరిగిన వాహనాల వినియోగం, పట్టణీకరణ, పారిశ్రామిక వ్యర్థాలు తదితర కారణాల వల్ల దేశంలో గాలి విషపూరితమైంది. దేశ రాజధాని ఢిల్లీ మాత్రమే కాకుండా నేడు అనేక నగరాలు తీవ్ర వాయు కాలుష్యం కోరల్లో చిక్కుకున్నాయి. ప్రపంచ బ్యాంకు ప్రకారం… భారతదేశ జనాభాలో అత్యధిక శాతం మంది పార్టిక్యులేట్ మ్యాటర్ 2.5 నీడలో నివసిస్తున్నారు. అంటే ఇది అత్యంత హానికరమైన వాయువులను పీలుస్తూ జీవిస్తున్నారు. వాయు కాలుష్యం వల్ల మనుషుల మరణాల సంభవించడంతో పాటు దేశాల ఆర్థిక వ్యవస్థలు క్షీణిస్తున్నాయి. 2021లో వాయు కాలుష్యం వల్ల భారతదేశంలో 1.2 మిలియన్ల మంది మరణించారు. దేశం 36 బిలియన్ డాలర్లకు పైగా నష్టపోయింది.
స్వచ్ఛమైన గాలి లభ్యత మనుషుల ప్రాథమిక హక్కు. అయినప్పటికీ, వాయు కాలుష్యం వల్ల ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి ఆ హక్కు లభించడం లేదు. కార్బన్ మోనాక్సైడ్ (CO), నైట్రోజన్ డయాక్సైడ్ (NO2) మరియు సల్ఫర్ డయాక్సైడ్ వాయు కాలుష్యానికి ప్రధాన కారణాలు. ఒక వెంట్రుక కంటే ముప్పై రెట్లు సూక్ష్మంగా ఉండే ఆర్టిక్యులేట్ పదార్థం కలిగిన PM-10 మరియు PM-2.5 కణాలు శ్వాస ద్వారా మనుషుల్లోకి ప్రవేశించి రక్తంలోకి కలిసి గుండె మరియు ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతాయి. వాయు కాలుష్యం గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వంటి రోగాలకు కారణమవుతున్నది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వాయు కాలుష్యం ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది.
ప్రభుత్వం చేస్తున్న కృషి
2024 నాటికి పర్టిక్యులేట్ మ్యాటర్ 10 (PM-10) స్థాయిలను తగ్గించే లక్ష్యంతో భారత ప్రభుత్వం జనవరి 2019లో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ (NCAP)ని ప్రారంభించింది. తర్వాత లక్ష్యాన్ని 2025-26 వరకు పొడిగించారు. NCAP కింద, 2023-24లో 131 నగరాలు వాయు కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించాయి. 51 నగరాలు PM-10 స్థాయిలలో ఇరవై శాతానికి పైగా తగ్గింపును నమోదు చేశాయి. అయితే 18 నగరాలు మాత్రమే నేషనల్ యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ (NAAQS)కు అనుగుణంగా ఉన్నాయి.
వాయు కాలుష్యం కట్టడి అందరి బాధ్యత
వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి ప్రభుత్వం, పరిశ్రమలు, ప్రజలందరూ కృషి చెయ్యాలి. సంప్రదాయేతర ఇంధన వనరులను వినియోగించుకోవాలి. ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వినియోగాన్ని ఎక్కువ చేయాలి. ఫ్యాక్టరీలు ఉద్గారాలను తగ్గించేలా కఠిన నిబంధనలను అమలు చేయాలి. అడవులను పెద్ద యెత్తున పెంచి ఉన్న అడవులను సంరక్షించాలి. పర్యావరణ పరిరక్షణ, వాయు కాలుష్య నివారణ, తగ్గింపుపై విద్యార్థుల్లో అవగాహన పెంచి వారిని ఈ ప్రక్రియలో భాగస్వాములు చేయాలి. పర్యావరణ అనుకూల చర్యలను అనుసరించే పరిశ్రమలకు ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వాలి. వాయు కాలుష్య నియంత్రణ చట్టాలను సమర్థంగా, కఠినంగా అమలు చేయాలి. క్లీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయడానికి సౌర, పవన విద్యుత్తు ప్రాజెక్టులను విస్తరించాలి.
సాంకేతికత పాత్ర
వాయు కాలుష్యాన్ని తగ్గించడంలో సాంకేతికత ఒక శక్తివంతమైన సాధనం. గాలి నాణ్యతను పర్యవేక్షించడానికి ఆధునిక సెన్సార్లు, పరికరాలను వినియోగించాలి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT), కృత్రిమ మేధ(AI) ఉపయోగించి వాయు కాలుష్యం యొక్క తక్షణ ప్రభావాన్ని విశ్లేషించాలి.
ప్రజల భాగస్వామ్యం కీలకం
– ప్రైవేట్ వాహనాలకు బదులుగా ప్రజా రవాణాను ఎక్కువగా ఉపయోగించుకొనేలా ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయాలి.
– ప్లాస్టిక్ వాడకం తగ్గించడం, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలలో ప్రజలు పాల్గొనడాన్ని ప్రోత్సహించాలి.
– వ్యక్తిగత స్థాయిలో, పర్యావరణ నష్టాన్ని తగ్గించేలా ప్రజలు తమ జీవనశైలిని మార్చుకోవాలి.
– నీరు, విద్యుత్తు వృథాను నివారించాలి.
– వాహనాల అనవసర వినియోగాన్ని తగ్గించాలి.
– వ్యర్థాల రీసైక్లింగ్‌ను ప్రోత్సహించాలి.
విద్యా సంస్థలు, మీడియా పర్యావరణ సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలి. సహజ వనరుల పరిరక్షణ మనందరి ఉమ్మడి బాధ్యత అని వారికి తెలియజేయాలి. మనమంతా మన బాధ్యతలను నెరవేరుస్తూ, ఇస్లాం బోధించిన పర్యావరణ పరిరక్షణ సూత్రాలను అనుసరిస్తే, మన జీవితాలను మెరుగుపరచడమే కాకుండా, భవిష్యత్తు తరాలకు ఆరోగ్యకరమైన, సంపన్నమైన, స్వచ్ఛమైన ప్రపంచాన్ని అందించిన వారమవుతాము.
ప్రకృతితో కలిసి జీవిద్దాం
‘మరికాసేపట్లో ఈ ప్రపంచం అంతమైపోతుందని తెలిసినా మీ చేతిలో మొక్క ఉంటే దానిని నాటండి’ అని అన్నారు ప్రవక్త (స). వృక్ష సంపద విలువను తెలియజేయడానికి ఇంతకంటే గొప్ప ఉపమానం మరొకటి ఏముంటుంది. ‘ ప్రతి వ్యక్తీ ఒక మొక్క నాటినా… దాని ఫలాలను పక్షిగానీ, పశువులుగానీ, మనుషులుగానీ తిన్నా.. నాటిన వ్యక్తికి ఎంతో పుణ్యం లభిస్తుంది’ అని చెప్పి మొక్కలు నాటడాన్ని 1500 ఏళ్ల క్రితమే ప్రోత్సహించారు ముహమ్మద్ ప్రవక్త. మనిషి ఈ ధరిత్రిపై అడుగు పెట్టకముందే ఆ దైవం ఈ ప్రపంచాన్ని ఎన్నో రకాల వృక్ష జాతులతో అలంకరించాడని ఖురాన్ చెబుతుంది. వృక్ష సంపద గురించి ఇస్లాం ధర్మంలో అపార జ్ఞానసంపద ఉంది. ‘ఎవరికీ చెందని ఓ బంజరు నేలను పంట పొలంగా మార్చిన వ్యక్తికే ఆ భూమి చెందుతుంది…అని చెప్పి సేద్యాన్ని ప్రోత్సహించారు ప్రవక్త. యుద్ధ సమయంలోనూ నీడనిచ్చే చెట్లను నరకరాదని, శత్రువుకు చెందిన పంటపొలాలను నాశనం చేయకూడదని చెప్పారు. నీడనిచ్చే చెట్ల కింద మలమూత్రాలు చేయడాన్ని ప్రవక్త (స) తీవ్ర నేరంగా చెప్పారు. నదీజలాలలో మలమూత్రాలు చేసేవారిని శపించారు. దేహానికి ఆత్మ ఎలాంటిదో పర్యావరణానికి చెట్టు ఆత్మలాంటిది. మనిషికి ప్రాణవాయువు అందించే చెట్టును కాపాడుకుంటేనే మనిషి జీవితం సుభిక్షం అవుతుందంటారు ప్రవక్త.
- – తహూరా సిద్దీఖా