
ఫిభ్రవరి 14 సమీపిస్తుందంటే చాలు షాపింగ్ మాళ్లన్నీ గులాబీ గుభాళింపులతో.. గుండె ఆకారాలతో నిండిపోతాయి. యువతరం గుండెల్లో ప్రేమచిగురిస్తుంది. ఏటా ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే పేరుతో ప్రేమికుల దినోత్సవాన్ని యువతరం ఎంతో ఉత్సాహంగా జరుపుకోవడం ఇక్కడి సంస్కృతిలో భాగమైపోయింది. ప్రేమను వ్యక్తం చేసుకోవడానికి ఈ రోజు జరిగే అసాంఘిక కార్యకలాపాల గురించి రాయాలంటేనే జుగుప్స కలుగుతుంది. మనయువతరాన్ని పెడమార్గం పట్టించేందుకు, మన యువతరాన్ని నిర్వీర్యం చేసేందుకు చాపకింద నీరులా వాలెంటైన్స్ డే ఎన్నో దశాబ్దాలక్రితం ఇక్కడ ప్రవేశించింది. ప్రేమికుల దినోత్సవం పేరుతో మొదలైన ఈ వాలెంటైన్స్ డే పెంచిపోషిస్తున్న అనర్థాలను, వాటి చేదుఫలాలను మనం ప్రస్తుతం అనుభవిస్తున్నాము.
కళాశాలల్లో జరిగే ఉన్మాదాల గురించి ఏమని చెప్పను. ప్రేమించలేదని అమ్మాయిల గొంతుకోసి కడతేర్చడం. తనకు దక్కనిది మరెవ్వరికీ దక్కదన్న రాక్షసత్వం ఈ అనైతిక ప్రేమకు ఉంటుంది. ప్రేమ విష కౌగిలిలో ఎంతోమంది ఆడబిడ్డలు రక్తమోడుతున్నారు.
ఇలాంటి హేయమైన దినోత్సవాల వల్ల సామాజిక జాడ్యాలు పేరుకుపోతున్నా మనం నిస్సహాయులమై ఉండిపోవడం మరింత విషాదకరం. పట్టుమని పదేళ్లు నిండని అమ్మాయిలు గర్భందాలుస్తున్నారని అధ్యయనాలు ప్రమాదఘంటికలు మోగిస్తున్నాయంటే ఇలాంటి పాశ్చాత్య సంస్కృతి పుణ్యమేకదా మరి. యువతీ, యువకులు బాధ్యతమరిచి అశ్లీలానికి, చెడుతిరుగుళ్లకు బానిసవడం వల్ల భవిష్యత్తును బుగ్గిపాలు చేసుకుంటున్నారు. దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న యవతరమున్న మనదేశం వైపు ఎన్నో దేశాలు చూస్తున్నాయి. అలాంటిది మనదేశ యువత అరువుతెచ్చుకున్న కుసంస్కృతిని అక్కున చేర్చుకోవడం అవివేకమే. సత్యనాదెళ్ల, సుందర్ పిచాయ్ లాంటి యువకులు విదేశాల్లో మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి సంస్థల్లో సీఈవోలుగా రాణిస్తున్నారంటే మనదేశ యువశక్తి సామర్థ్యాల గురించి మనం ఒకసారి గమనంలోకి తీసుకోవాలి. ఇలాంటి దినోత్సవాలను, యువతరాన్ని అపమార్గం పట్టిస్తున్న పాశ్చాత్య పెడధోరణులను అడ్డుకుంటే ఎందరో సత్యనాదెళ్లలను, సుందర్ పిచాయ్ లను సిద్ధం చేయవచ్చు. ప్రపంచానికి విశ్వగురువుగా మనదేశాన్ని నిలపవచ్చు. ఈ పనికి ధార్మిక సంస్థలే పూనుకోవాలి. మన యువశక్తి సామర్థ్యాలు నిర్వీర్యం కాకుండా పదునుపెట్టుకున్నప్పుడే మనదేశం అభివృద్ధిపథంలో దూసుకుపోతుంది.
మనదేశంలో ఉన్న ఆధ్యాత్మిక సంపదతో మనదేశాన్ని, మన యువతరాన్ని సుసంపన్నం చేసుకోవచ్చు. పురోగతిలో నడిపించవచ్చు. వేదాలు, ఉపనిషత్తులు, బైబిల్, ఖుర్ఆన్ లాంటి భగవంతుని ప్రబోధనలకు నిలయం. ధార్మిక బోధనల్ని మనదేశ యువత ఆచరించేలా ప్రేరణ కల్పిస్తే చాలు నైతికతలో పురోగమించవచ్చు. అభివృద్ధిలో అంతరిక్షం ఎత్తుకు ఎదగవచ్చు.
ఒక్కరోజు జరుపుకునే ప్రేమకు ఇస్లామ్ లో తావులేదు.
వివాహ బంధంతో ఒక్కటై నిండు నూరేండ్లు భార్యాభర్తలుగా జీవితం కొనసాగించాలి. సామాజికంగా అటువంటి ఆలూమగల ప్రేమే సర్వదా ఆమోదయోగ్యం, అభిలషణీయం. పెళ్లికాని ఇద్దరు యువతీయువకుల ప్రేమ వ్యక్తిత్వంపై మాయని మచ్చే అవుతుంది. గత ప్రేమికుల దినోత్సవం రోజు ఒకరితో మరి ఈ ప్రేమికుల దినోత్సవం నాడు ఒకరితో. వచ్చే లవర్స్ డే రోజు ఇంకెవరితోనో..? ఈ తరహా ప్రేమలు సమాజానికి చేటుచేస్తాయి. మన కుటుంబ వ్యవస్థను బీటలు వారుస్తాయి. ఇలాంటి ప్రేమలు యాసిడ్ దాడులకు, లైంగిక దాడులకు, హత్యలకు, ఆత్మహత్యలకు దారితీస్తాయన్నది మనం రోజూ పత్రికల్లో చూస్తున్నాము. ఇలాంటివే ప్రస్తుత సమాజంలో ప్రేమ పేరుతో జరుగుతున్న వైపరీత్యాలు. ఈ సందర్భంగా పాశ్చాత్య సంస్కృతులను గుడ్డిగా అనుసరించడం వల్ల మనదేశ సంస్కృతి సంప్రదాయాలు పతనమైపోతాయి. మహిళలపై దాడులు సహా పలు సమస్యలకు కారణం అవుతాయి. వాలెంటైన్ డే ఏ గడ్డపై పురుడుపోసుకుందో ఆయా దేశాలే వాలెంటైన్స్ డేను వ్యతిరేకిస్తున్నాయి. ‘లవ్ లాటరీ’ విద్వేషాలకు దారితీస్తుండడంతో ఫ్రాన్స్ లాంటి పాశ్చాత్య దేశం కూడా వాలెంటైన్స్ డే ను అక్కడి ప్రభుత్వం నిషేధించింది. ఏ దేశాలనుంచి ఈ సంస్కృతిని అరువుతెచ్చుకున్నాయో ఆయా దేశాల్లో ఈ వాలెంటైన్స్ డే ని అక్కడివారు తీవ్రంగా నిరసిస్తున్నా మన దేశంలో ఈ రోజును ఘనంగా స్వాగతించడమే కాదు వారం రోజులపాటు జరుపుకోవడం మహా విషాదమే అవుతుంది.
ఇస్లామ్ ప్రేమకు పెద్దపీట వేసింది. భావోద్రేకాలను చాటుకోవడాన్ని ఇస్లామ్ ధర్మం ఎంతగానో గౌరవిస్తోంది. ప్రేమ సరైన పంధాలో ఉండాలి. పెళ్లికాని యువతీయువకులు విచ్చలవిడి కలయికోసం ప్రేమపేరుతో ఒక్కరోజును ప్రత్యేకించుకుని అనైతిక పనులకు పాల్పడటాన్ని ఇస్లామ్ ధర్మం తీవ్రంగా ఎండగడుతోంది. ఒక ఏడాది ఒక అమ్మాయి ఒక అబ్బాయితో; మరో ఏడాది మరో అబ్బాయితో. సంవత్సరాలు మారినట్లుగానే అబ్బాయిలు, అమ్మాయిలు తమ ప్రేమికులను మార్చేస్తున్నారు. ఇలాంటి ప్రేమికుల దినోత్సవాలతో మనదేశ సంప్రదాయాలను చేజేతులా వినాశనం పాలు చేసుకుంటున్నాము. మన దేశంలో వివాహ వ్యవస్థకు ఎనలేని విశిష్టత ఉంది. అన్నికులాలు, మతాల వారంతా వివాహానికి ఎంతో ప్రాముఖ్యతనిస్తారు. ఈ వాలెంటైన్ డే వివాహ వ్యవస్థను నిర్వీర్యం చేస్తోంది. ప్రేమ పునాదులను కుళ్లబొడుస్తోంది. అశ్లీలాన్ని, అనైతికతను వ్యాపింపజేసే వాలెంటైన్ డే ప్రేమకు సంకేతంగా జరుపుకోవడం విషాదకరం.
అన్యోన్య దంపతులకు రోజూ ప్రేమికుల దినోత్సవమే..
జీవితాంతం ప్రేమాప్యాతలతో ఒకరినొకరు తెలుసుకుని, ఎంతో అన్యోన్యంగా గడిపిన జంటకు చావనేదే ఉండదు. చనిపోయాక కూడా మరణమనేదేలేని పరలోక రాజ్యంలోనూ కలిసి జీవించే గొప్ప భావనను ఇస్లామ్ కల్పిస్తోంది. ప్రపంచంలో ఏ దంపతులైతే అన్యోన్యంగా ఒకరికొకరు ప్రాణానికి ప్రాణంగా దాంపత్య జీవితాన్ని గడిపారో అలాంటి వాళ్లు పరలోకంలోనూ దంపతులుగా ఉంటారని ముహమ్మద్ ప్రవక్త (స) గొప్ప శుభవార్తనిచ్చారు. మరణంతో ముగిసేది నిజమైన ప్రేమకాదని చనిపోయాక స్వర్గసీమలోనూ వారిద్దరూ దాంపత్య జీవితం గడుపుతారని చెప్పి ప్రవక్త (స) ప్రేమను అందలమెక్కించారు. అన్యోన్యంగా గడిపే భార్యాభర్తలకు రోజూ ప్రేమికుల దినోత్సవమే.
ప్రేమపాత్రులెవరు?
భర్త తన వైపు చూసినప్పుడు చిరునవ్వు చిందించడం, భర్త బయటికి వెళ్లేటప్పుడు ప్రేమతో నవ్వుతూ సాగనంపడం ఉత్తమ భార్య లక్షణం. భార్య దృష్టిలో ఉత్తమంగా మెలిగేవాడే సమాజం దృష్టిలో ఉత్తముడు. భార్యాభర్తల అన్యోన్యతను పెంపొందించే ఇలాంటి ఎన్నో బోధనలు ఇస్లామ్ లో కోకొల్లలు. ఈ బోధనల్ని ఆచరణలో పెడితే రోజూ ప్రేమికుల దినోత్సవమే. ? ప్రతీ ఘడియలోనూ ప్రేమను పంచే ఆలూమగల హృదయంలో ఎనలేని ప్రశాంతత, సంతృప్తి రాజ్యమేలుతాయి.
తల్లిదండ్రుల వంక ప్రేమతో చూడటం కూడా సదాచరణేనన్నారు ప్రవక్త మహనీయులు. వారిలో ఒకరు కానీ ఇద్దరు కానీ ముసలివారై ఉంటే వారి ముందు విసుగ్గా ఉఫ్ అని కూడా అనకూడదని ఖుర్ఆన్ హెచ్చరిస్తోంది. కనీపెంచిన అమ్మానాన్నల్ని ప్రేమతో ఆదరించాలని ఖుర్ఆన్ పేర్కొంటోంది. అమ్మపాదాల కింద స్వర్గముందని, స్వర్గద్వారాలలో తండ్రి ముఖద్వారమని చెప్పి తల్లిదండ్రుల ప్రేమకు పెద్దపీట వేశారు ప్రవక్త మహనీయులు. తల్లిదండ్రుల్ని ప్రేమిస్తే రోజూ మనకు ప్రేమదినోత్సవమే. మనం ప్రేమను వ్యక్తపరచడానికి ఒకరోజును ప్రత్యేకించుకోవడమా? ప్రతీ ఘడియా ప్రేమను పంచే హృదయం మనది.
మన ప్రేమకు ఈ ప్రపంచంలో మొదటి అర్హురాలు అమ్మ. ఈ లోకంలో అమ్మ తరువాతి స్థానం మన నాన్నది. ఆ తరువాత భార్యా, పిల్లలు, బంధుమిత్రులు, ఇరుగు పొరుగువారు. వీరందరికీ మనం ప్రేమను పంచుతున్నామా?
తల్లి నవమాసాలు మోసి ప్రసవవేదన భరించి కంటుంది. రెండేళ్లదాకా తన రక్తాన్ని పాలగా మార్చి పోషిస్తుంది. మాతృప్రేమకు సాటిఏదీ లేదు ఈ ప్రపంచంలో.
ఒక నిరుపేద బక్కచిక్కిన కూలీవాడు వయస్సు మీదపడినా చెమటోడ్చి తన భార్యాపిల్లల్ని పోషిస్తాడు. పిల్లల పట్ల తండ్రి చూపే ప్రేమకు ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి.
పిల్లల కళ్లల్లో సిగ్గు బిడియాల కాటుక రాయాలి
పిల్లల కళ్లల్లో సిగ్గు, బిడియాలనే కాటుకను రాయండి. సిగ్గుబిడియాలే విలువైన ఆభరణాలు. ఎందుకంటే సిగ్గూబిడియాలు లేనివారే అశ్లీలానికి, అనైతిక చేష్టలకు ఒడిగడతారు. చెడు చూపు అశ్లీలానికి మూలం. అశ్లీలపనులకు, వ్యభిచారానికి చెడుచూపే తొలిమెట్టు. పురుషులు పరస్త్రీలపై చెడుచూపుతో చూడటం, స్త్రీలు పరాయి పురుషులవంక కళ్లల్లో కళ్లుపెట్టి చూడటం చాలా ప్రమాదకరం. మన వ్యక్తిత్వాలను నిర్వీర్యం చేయడంలో ఈ చూపుల చౌర్యమే కీలకపాత్ర పోషిస్తుంది. మన హృదయాన్ని జ్యోతిర్మయం చేయాలంటే మన చూపులను క్రిందికి వాల్చి ఉంచాలి. ఎవరి చూపులైతే కిందకు వాలి ఉంటాయో అలాంటి వారిని ప్రపంచమంతా ఏకమైనా ఎలాంటి నష్టమూ చేకూర్చలేరు. ఎవరి చూపుల్లోనైతే స్సిగ్గు, సిగ్గు, బిడియాలుండవో అలాంటి వారిని ఎవరూ కాపాడలేరు. అలాంటి వారి మనస్సును ఎవ్వరూ మార్చలేరు. మన కళ్లతో తప్పుడు విషయాలను చూడటం వల్ల పాపాలకు బానిసవ్వాల్సి ఉంటుంది. చూపులను కిందికి వాల్చి ఉంచడం వల్ల ఎనలేని శక్తివంతమైన వ్యక్తిత్వం అలవడుతుంది. దేవుని సింహాసనాన్ని చేర్చే శక్తి సొంతమవుతుంది. దేవదూతలు కూడా అతని ముందు తలొగ్గుతాయి. సూర్యచంద్రుల వెలుగు కూడా ఇలాంటి వారి కంటి వెలుగు ముందు చిన్నబోతుంది. ఈ దివ్వతేజస్సును పొందాలంటే మన చూపులను కాపాడుకోవడమే శరణ్యం.