November 22, 2024

(అబుల్ ఫౌజాన్ గ్రంధం..ఔరంగజేబ్ చరిత్ర కెక్కని చారిత్రక కోణాలు పుస్తకంపై ప్రముఖ రచయిత, విమర్శకుడు రజాహుస్సేన్ రాసిన పంక్తులు)

ఔరంగజేబు హిందీ భాషకు వ్యతిరేకి’ అన్నవిమర్శ వుంది.ఔరంగజేబు నిజంగా హిందీ భాషకు వ్యతిరేకా? అంటే ‘కాదు ‘అనే సమాధానం వస్తుంది.

నిజానికి ఔరంగజేబు హిందీ భాషాభిమాని. తన కుమారులు, కుమార్తెలకు హిందీ భాషను నేర్పించాడు. ఔరంగజేబు కుమార్తె జేబున్నీసా పారశీక కవి. అంతే కాదు ఆమె హిందీలో కూడా కవిత్వం చెప్పేది. ఆమె హిందీ కవితా సంపుటి ‘నైన్ విలాస్ ‘ను ఔరంగజేబు స్వయంగా ఈ కింది దోహాలో ప్రశంసించాడు.

“జైబున్నీసా జహామె దుక్తరె ఆలంగీర్…

నైన్ విలాస్వవిలాస్ మె ఖాస్ కరి తహరీర్ “

ఔరంగజేబ్ సమకాలీన చారిత్రక గ్రంథాలైన ‘ఆలంగీర్ నామా ‘, ‘ ముంతఖబుల్ లుబాబ్ ,బర్నియేర్ యాత్రా వృత్తాంతాల్ని పరిశీలిస్తే హిందీ పట్ల ఔరంగజేబు కున్న అభిరుచి, అభిమానం తెలుస్తుంది.

ఔరంగజేబ్ హిందీ భాష సమర్థకుడే కాదు .. సంరక్షకుడు కూడా. ఆయన వారంలో మూడు రోజులు తన మహలులో నిర్వహించే సాహిత్య గోష్టిలో హిందీ సాహిత్య ప్రసక్తి కూడా వచ్చేది.

అంతే కాదు, తనరాజ్యానికి సంబంధించిన ఎన్నో ఫర్మానాల్ని హిందీలో జారీ చేశాడు.(యదూనాథ్ సర్కార్ )

చిత్రసేన్ అనే చరిత్రకారుడు ఔరంగజేబ్ హిందీ భాషాభిమానాన్ని గురించి ఏం రాశాడో చూడండి.

“,ఔరంగజేబ్ హిందీ ప్రేమికుడు. అతను స్వయంగా హిందీ భాషలో కవిత్వం రాశాడు. హిందీ కవుల్ని

ఘనంగా సమ్మానించాడు. ‘వరండ్ ‘ అనే ఓ హిందీ కవికి ఔరంగజేబ్ నెలకు 10 రూపాయలిచ్చేవాడు.

ఆచార్య చంద్ బలిపాండే ఇలా అన్నారు.

“ఔరంగజేబ్ హిందీ భాష పోషకుడు. మొగలు రాకుమారులకు హిందీనేర్పించేవారు. ఆయనెప్పుడూహిందీ భాషను వ్యతిరేకించ లేదు. అంతే కాదు హిందీని సరళం చేయాలని కూడా చెప్పేవాడు “.

చరిత్రకారుడు అల్లామ షిబ్లి కూడా ఔరంగజేబ్ హిందీ భాషాభిమానం గురించి ఇలా రాశారు.

“ఔరంగజేబ్ కాలంలో హిందీ (బ్రిజ్)భాష ఎంతగానో అభివృద్ధి చెందింది. నాటి ముస్లింలు హిందీ భాషల్లోని అనేక గ్రంథాల్ని వివిధ భాషల్లోకి అనువదించారు. నిజానికి ఔరంగజేబుకాలంలో హిందీకి లభించిన ఆదరణ ఇతరుల కాలంలో లభించలేదు “ .!

ఔరంగజేబు దక్కన్ లో సుదీర్ఘకాలం వున్నాడు. కొందరు సైనికుల భార్యలు తమ భర్తల్ని ఢిల్లీ

నుంచి దక్కన్ కు తీసుకు వెళ్ళాడని పేర్కొంటూ బాధల్ని హిందీ కవిత్వంలో చెప్పుకున్నారట.

దానికి ఔరంగజేబ్ “,బైఠీ రహో ఖరార్ సే మన్ మే రాఖోధీర్…

సాహెబ్ సే బిన్నతికరో జో భూరే ఆలంగీర్ “.

(ఎందుకలా మీరంతా బేలలై పోతారు.ఓపికతో నిరీక్షించండి.

ఆలంగీర్ తిరిగి రావాలని దేవుడ్ని ప్రార్థించండి )

ఔరంగజేబు దర్బారులోని రాజపుత్ర మున్సబుదారు రాజా జస్వంత్ సింగ్ కూడా హిందీలో కవిత్వం రాసేవాడు. భాషాభూషణ్ పేరుతో అతనొక గ్రంధాన్ని కూడా రచించాడు.

ఇంత చెప్పాక కూడా ఔరంగ జేబ్ ను హిందీ వ్యతిరేకి అనొచ్చా?