వింతల నిలయం మహాసముద్రం
భూమిపై మూడొంతులు సముద్రమే ఉంది. మహా సముద్ర అందాలు చూడ్డానికి రెండు కళ్లూ సరిపోవు. అలలు వినిపించే పాట వినడానికి రెండు చెవులూ సరిపోవు. సాగర ఘోషలోని అనంత రహస్యాలసు ఛేదించేందుకు మన పంచేంద్రియాలకు వున్న శక్తి ఏ మాత్రం సరిపోదు ..అద్భుతమైన సౌందర్యానికి .. అనంతమైన ఆశ్చర్యాలకు.. దిగ్భ్రాంతి గొలిపే వింతలకు, భీతిగొలిపే జీవులకు నిలయం మహాసముద్రం. కొన్నేళ్ళ క్రితం సముద్రంలో ఒక వింత భూకంపం వచ్చింది. ఈ భూకంపం సముద్రంలో వచ్చింది కాబట్టి ఎవరికి తెలియదు. కాని ఈ భూకంపం సృష్టించిన అలలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. అసలు భూకంపం వల్లనే ఈ అలలు వచ్చాయా? లేక వేరే కారణాలున్నాయా అన్నది కూడా శాస్త్రవేత్తలు కనిపెట్టలేకపోయారు. ఆఫ్రికా మడగాస్కర్ల మధ్య ఉన్న మయోటే దీవికి 15 మైళ్ళ దూరంలో పుట్టిన ఈ అలలు ప్రపంచమంతా విస్తరించాయి. 20 నిముషాల పాటు కనిపించి మాయమయ్యాయి. ఇలాంటి ఎన్నో వింతలకు నిలయం అంబోధి.
సాధారణంగా అలలు తీరంవైపుకు వచ్చి ముగుస్తాయి. కాని కొన్నిసార్లు సముద్రంలో చదరంగం బల్ల మాదిరిగా చతురస్రపు అలలలు కూడా కనిపిస్తాయి. ఇవి చాలా అరుదు. అలాగే చాలా ప్రమాదకరమైనవి. ఈ అలలను గమనిస్తే సముద్రజలాల్లో ఒక గ్రిడ్ మాదిరిగా చతురస్రపు బలాలు పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ చతురస్ర అలలు కనబడితే వెంటనే అక్కడ ఈదుతున్నవారు బయటకు వచ్చేయడం మంచిది. ఎందుకంటే, ఈ అలల తర్వత చాలా బలమైన పోటు వచ్చే ప్రమాదం ఉంటుంది.
మన దేశంలో తూర్పున ఉన్న బంగళాఖాతం, పశ్చిమాన ఉన్న అరేబియా సముద్రం, దక్షిణాన ఉన్న హిందూ మహా సముద్రం కన్యాకుమారిలో ఒకేచోటున కలుసుకుంటాయి. మూడు సముద్రాల అలలు ఎగిసిపడుతూ ఒకదానితో ఒకటి ఢీకొంటు పరుగులెత్తే దృశ్యం అనుపమానం. తీరప్రాంతాన నిలబడి ఈ అలల సౌందర్యాన్ని, దూకుడుని చూస్తూ సర్వం మరచిపోగలం. ఇక సముద్రపు ఒడ్డున నిలుచుని సూర్యోదయాల్ని, సూర్యాస్తమ యాల్ని చూడటం జీవితకాలపు జ్ఞాపకంగా ఉండిపోతుంది. సాధారణంగా సముద్రాలున్న చోట్ల సూర్యోదయాన్ని లేదంటే సూర్యాస్తమయాన్ని మా
త్రమే చూడగలం. రెండిటినీ ఒకేసారి చూడగలగటం కన్యాకుమారిలోనే సాధ్యమవు తుంది.
రెండు సముద్రాలు ఒకదానితో ఒకటి కలిసిపోయేటందుకు ఆయన వాటిని వదలిపెట్టాడు. అయినా వాటిమధ్య ఒక తెర అడ్డంగా ఉన్నది. అవి దానిని అతిక్రమించవు.(దివ్యఖుర్ఆన్ 55: 19-20)
ఆకట్టుకునే సముద్రజీవులు కండ్లముందు నుంచి వెళ్తుంటే.. వింతైన చేపలు మన చుట్టూ తిరుగుతుంటే ఆ అనుభవం అద్భుతం. రంగురంగుల జలచరాలను చూస్తూ విందు ఆరగించే అనుభూతిని మరిచిపోగలమా? నీలిరంగు సముద్రాన్ని ఆస్వాదిస్తూ, సముద్రంలోపలే నిద్రపోతే.. ఎంత బాగుంటుంది. ఇలాంటి తిరుగులేని అందమైన ప్రదేశాలే అండర్ వాటర్ రెస్టారెంట్స్. కొన్ని సంపన్న దేశాలు సముద్రం లోపల రెస్టారెంట్లను, హోటళ్లను నిర్మిస్తున్నాయి. సౌత్ ఆఫ్రికా, మాల్దీవ్స్, కాలిఫోర్నియా, ఫ్లోరిడా, ఫిజి దేశాల్లో అండర్ వాటర్ రెస్టారెంట్లకు డిమాండ్ ఉంది. తాజాగా యూరప్ కూడా అండర్ పేరుతో వాటర్ రెస్టారెంట్‌ను ప్రారంభించి ఆ లిస్ట్ లో చేరింది. . మొదటి రెస్టారెంట్ మాత్రం మాల్దీవ్స్ లో 2005లో ప్రారంభమైంది. సముద్ర నీటి ఉపరితలం నుంచి 5 మీటర్ల లోతులో ఈ రెస్టారెంట్ ఉంటుంది. 180 డిగ్రీల కోణంలో ఉన్న గ్లాస్ నుంచి సముద్ర దృశ్యాన్ని, జీవులను చూడొచ్చు.
సముద్రం మనిషిని ఎంతో ఆకర్షిస్తోంది. ఇటలీలో సముద్ర గర్భాన పండ్ల తోట పెంచుతున్నారు. నెమో గార్డెన్‌లని అంటున్నారు.. తమలపాకు, స్ట్రాబెర్రీ, చిక్కుడు, అల్లం, పాలకూర పంట వేశారు. సవోనా తీరంలో 10 నుంచి 36 అడుగుల కింద నీళ్లల్లో వీటిని నిర్మించారు. నిరంతరం వీటిని పరిశీలిస్తున్న శాస్త్రవేత్తల బృందానికి ఆశించిన ఫలితాలే వస్తున్నాయి. గ్రీన్‌హౌస్‌లోని వాతావరణానికి ఆకర్షితమైన సముద్రజీవులు అక్కడ తల దాచుకుంటున్నా మొక్కల్ని మాత్రం పాడు చేయకపోవడం గమనార్హం. మనమూ భూమిని ఇలా పాడుచేయకుండా ఉంటే ఎంత బాగుండేది.
మెక్సికోలోని రివియెర మాయా సముద్రగర్భంలో ‘కెన్‌క్యున్’ అనే మ్యూజియం ఉంది. సముద్ర తలం నుంచి 28 అడుగుల లోతులో దాదాపు 500 శిల్పాలున్నాయి. సముద్రపు అడుగున ఉన్న మ్యూజియాల్లో ఇది అతి పెద్దది కావడం విశేషం. ఈ విగ్రహాలను చూడాలంటే స్కూబా డైవింగ్ రావాల్సిందే. రంగు రంగుల చేప పిల్లలు, రకరకాల జలచరాలు.. వాటి మధ్యలో వివిధ భంగిమల్లో ఆకట్టుకునే శిల్పాలు.. అదో అద్భుత ప్రపంచం. ఈ మ్యూజియానికి సమీపంలో పగడపు దిబ్బలు ఉన్నాయి. ప్రపంచంలోనే రెండో అతి పెద్ద పగడపు దిబ్బలు ఇవి. సుమారు 1000 కిలోమీటర్ల విస్తీర్ణంలో పగడపు దిబ్బలు ఉన్నాయి. సొరచేపలు, తిమింగలాల వంటి అతి పెద్ద జలచరాలకు ఈ పగడపు దిబ్బలు నిలయం.
సముద్రం అనేక వింతలకు నెలవు. అలాంటి వింతల్లో కలవని సముద్ర జలాల వింత కూడా ఒకటి. గల్ఫ్ ఆఫ్ అలస్కా దగ్గర రెండు మహాసముద్రాలు కలుస్తాయి. ఈ కలయిక ఒక అద్భుతం. రెండు మహాసముద్రాలు కలుస్తాయి కానీ.. నీరు మాత్రం కలువదు.
అది వివరించడం సాధ్యం కాని వింత. సోషల్ మీడియా, ఇంటర్నెట్ లో ఈ సముద్రాలకు సంబంధించిన ఎన్నో వీడియోలు, ఫోటోలు చూసినట్టయితే అన్నిటిలోనూ ఈ రెండు మహాసముద్రాలు కలుసుకోవడం చూడవచ్చు. కానీ రెండు సముద్రాల నీళ్ల రంగు పూర్తిగా వేర్వేరుగా ఉంటుంది. సాధారణంగా నీళ్లు ఎలా ఉన్నప్పటికీ వేరే నీటితో కలిసిపోతాయి. కానీ రెండు మహాసముద్రాల నీళ్లు ఒకదానితో మరొకటి కలవకపోవడం ఒక మిస్టరీగా మిగిలింది. ఈ రెండు మహాసముద్రాల జలాలు తమ తమ రంగులను అలాగే నిలుపుకుంటాయి. ఒక నీరు హిమానీనదం నుంచి వచ్చింది. దీని నీరు లేత నీలం రంగులో కనిపిస్తుంది. మరో సముద్రంలో నదుల నుంచి వచ్చిన నీటి రంగు ముదురు నీలంగా ఉంటుంది. ఎక్కడైతే రెండు మహాసముద్రాలు కలుస్తాయో అక్కడ ఒక నురగ అడ్డుగోడగా ఏర్పడుతుంది. అక్కడ రెండిటి విభజన రేఖను స్పష్టంగా గుర్తించవచ్చు.చాలా మంది పరిశోధకులు ఈ ప్రాంతంలో రీసెర్చ్ చేశారు. కానీ ఎవరూ దీనికి సరైన సమాధానం కనిపెట్టలేకపోయారు. రెండు సముద్రాల నీటి సాంద్రత, ఉష్ణోగ్రత, హిమానీనదం నీటి లవణీయత, తీరప్రాంత నీటి లవణీయతల మధ్య తేడాల వల్ల రెండు సముద్రాల నీళ్లు ఒకదానితో ఒకటి కలవడం లేదని కొందరు చెప్పారు.
రెండు సముద్రాలనూ కలిపి ఉంచినవాడు ఆయనే. ఒకటేమో రుచికర మైనది, మధురమైనదీను. రెండోది చేదైనది, ఉప్పైనదీను. ఆ రెంటి మధ్య ఒక తెర అడ్డంగా ఉన్నది. అది వాటిని కలసిపోకుండా ఆపి ఉంచే అవరోధం. (దివ్యఖుర్ఆన్ : 25:53)
సముద్ర వింతల్లో మరో వింత ఒడిశాలోని భువనేశ్వర్‌కి దాదాపు రెండు వందల కిలోమీటర్ల దూరంలో, భిలాస్‌పూర్ నగరానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న చండీపూర్ బీచ్. ఇదొక విచిత్రమైన బీచ్. ఎందుకంటే ఈ బీచ్ రోజులో రెండుసార్లు మాయమైపోతూ ఉంటుంది. ఇది వెన్నెలపై ఆధారపడి ఉంటుంది. చూస్తుండగానే సముద్రంలోని నీరు మెల్లగా వెనక్కి వెళ్లిపోవడం మొ
దలుపెడుతుంది. అలా వెనక్కి వెనక్కి వెళుతున్న అలలు ఒకటీ రెండు కాదు ఏకంగా అయిదు కిలోమీటర్ల వెనక్కి వెళ్లిపోవడం వల్ల మన కళ్ల ముందు అప్పటి వరకు కనిపించే సముద్రం క్షణాల్లో మాయమైపోయి ఎక్కడో అల్లంత దూరంలోకి వెళ్ళిపోతుంది. రోజుకు కనీసం రెండు సార్లు అక్కడి సముద్రం అయిదు కిలోమీటర్ల వెనక్కి వెళ్లిపోయి మళ్లీ కొంత సమయం తర్వాత ముందుకు వచ్చేస్తుంది. ఇలా సముద్రం నీరు హఠాత్తుగా వెనక్కి వెళ్లిపోవడం వల్ల మనకి ఇసుక పర్రలు స్పష్టంగా కనిపిస్తాయి. అలాగే గులకరాళ్లు, శంఖాలు, సముద్రం అడుగున మనం సాధారణంగా చూడని అనేక వింత వస్తువులు, సామగ్రి కనిపిస్తాయి. అలాగే ఆ ప్రాంతంలో ఎక్కువగా ఉండే ‘రెడ్‌క్రాబ్స్’ అనబడే ఎర్ర పీతలు లెక్కకు మిక్కిలిగా కనిపిస్తాయి.
సముద్రంలో మరో వింత.. భయంకరమైన వింత బెర్ముడా ట్రయాంగిల్. అనేక ఓడలు, విమానాలు ఈ ప్రాంతంలో అంతుబట్టని విధంగా ప్రమాదాలకు గురయ్యాయి. అట్లాంటిక్ సముద్రంలో మియామి, సాన్ యువాన్, ప్యూర్టోరికో మధ్యన గల ప్రాంతానికి బెర్ముడా ట్రయాంగిల్ అని పేరు. ఇక్కడికి రాగానే ఎంతటి బరువైన ఓడ అయినా, ఎంతటి విమానం అయినా సరే సముద్రం ఒడిలోకి వాలిపోవాల్సిందే. ఇలా జరగడానికి కారణం అక్కడ భయంకరమైన సముద్రజీవులు ఉన్నాయని, ఏలియన్స్ ప్రభావం ఉందని చాలా పుకార్లు ఉన్నాయి. అయితే, ఆ ప్రమాదాలకు కారణం ‘రాకాశి అలల ‘ని శాస్తవేత్తలు అంటున్నారు.
మరో వింత చైనాలోని బీజింగ్‌లో మృత సముద్రంగా పిలిచే యెన్‌చెంగ్ సాల్ట్ సరస్సు గులాబీ రంగులోకి మారింది. సముద్రానికి ఓ వైపు పూర్తిగా పింక్ కలర్‌లోకి మారి సందర్శకులని ఆకట్టుకుంటున్నది. సముద్రంలో ఉండే డ్యునలీల్లా సెలీనా కారణంగా ఈ జలాలు గులాబీ రంగులోకి మారినట్లు పరిశోధకులు చెబుతున్నారు. వంతెనకు ఓ వైపు ఆకుపచ్చ రంగు, మరోవైపు గులాబీ రంగుతో కనువిందు చేస్తున్నది.
కేరళ వరదలు ఆ రాష్ర్టానికి విషాదం మిగిల్చినా.. ఓ అద్భుతాన్ని సృష్టించాయి. మళప్పురం ప్రాంతంలోని పొన్నాని బీచ్ కూడా వరద ప్రభావానికి గురైంది. భారీ ఎత్తున కొట్టుకువచ్చిన ఇసుక పొన్నాని తీరంలో మేటలు వేసింది. అది ఎలా ఉందంటే.. సముద్రాన్ని చీల్చినట్లుగా. అర కిలోమీటర్ వరకూ ఓ రహదారే ఏర్పడింది. ప్రకృతి సహజంగా ఏర్పడిన అద్భుతమిది.
ప్రపంచంలో సముద్రాలన్నీ నీలిరంగులోనే ఉండవు. ఏడురంగుల్లోను సముద్రాలున్నాయి. గులాబీ రంగులో కూడా ఉన్నాయి. నల్లసముద్రం కూడా ఉంది. బంగారంలాంటి పసుపు సముద్రం కూడా ఉంది.
పశ్చిమ ఆస్ట్రేలియాలోని మిడిల్ ద్వీపంలో గులాబీ రంగులో ఉండే హిల్లియర్ సరస్సు ఉంది. దీని చుట్టూ యూకలిప్టస్, పేపర్ బ్యాక్ చెట్లు ఉంటాయి. దక్షిణ సముద్రం నుంచి ఈ సరస్సును విడదీసినట్లుగా ఉంటాయి. ఈ హిల్లియర్ లేక్.. మెరిసే గులాబీ రంగులో ఉండటం వల్ల అనేకమంది శాస్త్రవేత్తలు, పర్యాటకులను ఆకర్షిస్తున్నది. డున లైలా సలీనా అనే సూక్ష్మక్రిముల వల్ల ఈ రంగు వచ్చిందని కొందరు అంటుంటే.. హాలో ఫిలిక్ క్రిములు ఉప్పు కయ్యలపై పేరుకొని ఉండటం వచ్చిందని మరికొందరు అంటున్నారు.
సొకొట్రా హిందూ మహాసముద్రం లోని ఒక ఒక వింత దీవి. ‘ఏలియన్ ల్యాండ్’ అని దీన్ని పిలుస్తారు. ఈ దీవిలో రక్తం కక్కే చెట్లు ఉంటాయని ప్రతీతి. భూమిపై మరెక్కడా కనిపించని జంతువులు, వాతావరణం అంతా భలే వింతగా ఏదో వేరే గ్రహం మీద ఉన్నట్టు అనిపిస్తుంది. ‘యెమెన్’ దేశంలో ఈ దీవి ఉంది. ఇక్కడ 840 వృక్షజాతులు ఉన్నాయి. అందులో దాదాపు 307 జాతులు భూమిపైన మరెక్కడా కనిపించవు. ఆశ్చర్యం కలిగించేది గొడుగు చెట్టు. ఇది పనిగట్టుకుని కత్తిరించిన గొడుగులా ఉంటుంది. దీన్నంతా ‘డ్రాగన్స్ బ్లడ్ ట్రీ’ అంటారు. ఎందుకంటే ఈ చెట్టు కొమ్మలను విరిచినపుడు అందులో నుంచి రక్తం రంగులో ఉండే ఎర్రని ద్రవం బయట కొస్తుంది. ఈ దీవిలో ఎక్కువగా కనిపించే మరో వింత చెట్టు ‘డెసర్ట్ రోజ్’ దీని కింది కాండం ఉబ్బెత్తుగా, ఏనుగు కాలులా తమాషాగా ఉంటుంది. ఈ దీవిలో ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ వాతావరణాన్ని తట్టుకోవడానికే ఇక్కడి చెట్లు అలా పరిణామం చెందాయి. ఇక్కడ 140 జాతుల పక్షులు, 30 సరీసృప జాతులు అబ్బురపరుస్తాయి. అందులో కాళ్లులేని బల్లి విచిత్రంగా ఉంటుంది. ఓ ఊసరవెల్లి జాతితో పాటు ఓ రకం గబ్బిలం ఇక్కడ మాత్రమే జీవిస్తాయి.
సాధారణంగా సముద్రజలాలు చాలా ఉప్పగా ఉంటాయి. తాగడానికి పనికిరావు. ఒక్క బాల్టిక్ సముద్రం నీళ్లు మాత్రం మినహాయింపు. అట్లాంటిక్ మహా సముద్రంలో భాగమైన ఈ బాల్టిక్ నీళ్లు ఇంచుమించు మంచినీళ్లలా ఉంటాయి. ఎందుకంటే ఈ నీటిలో ఉప్పుశాతం సగటున 1 కంటే తక్కువ. అందుకే మంచినీటిలో మాత్రమే జీవించే జీవులు అక్కడ హాయిగా బతికేస్తుంటాయి. అవసరార్థం మనుషులు కూడా ఈ నీటిని తాగుతుంటారు
బాల్టిక్ నీటి తియ్యదనానికి కారణం రెండు వందల నదులు ఈ సముద్రంలో కలుస్తుండటమే.
మరో విచిత్రమైన సముద్రం మృత సముద్రం. మృత సముద్రం నీటిలో మనిషి మునిగిపోడు. ఎందుకంటే అక్కడ నీటి సాంద్రత చాలా ఎక్కువ. అందువల్లే ఆ నీటిలో మనిషి తేలుతాడు. అధిక స్థాయి ఉప్పదనం వల్ల ఆ నీట్లో జీవులేవీ బతకలేవు. మృత సముద్రపు నీటిలో 35 శాతం ఉప్పదనం ఉంది. అందుకే ఏవో కొన్ని సూక్ష్మ జీవులు తప్ప చేపలు, తాబేళ్ల వంటివి జీవించలేవు. మృత సముద్రంలో అంత ఉప్పుకి కారణం ఆ సముద్రం భూమి మీద 1200 అడుగుల దిగువన ఉండటమే. అందులోకి నీరుచేరటమే కానీ పోవడం ఉండదు. పైగా ఆ నీరు ఆవిరయ్యే శాతం ఎక్కువ. మృత సముద్రంలోఎవరూ మునిగిపోరు కాబట్టి ఎలాంటి ప్రమాదాలు జరగవని అనుకోవడానికీ లేదు. సాధారణంగా సముద్రం నీలిరంగులో ఉంటుంది. కాని అన్ని సముద్రాలు అలా లేవు. పసిఫిక్ సముద్రంలో భాగమైన ఎల్లో సీ చైనాలో ఉంది. దగ్గర్లోని గోబీ ఎడారి నుంచి కొట్టుకొచ్చే ఇసుక రేణువులు చేరినందుకే ఇక్కడి నీరు బంగారుపసుపు రంగులోకనిపిస్తుంది. రష్యాకు వాయువ్యంగా ఉన్న వైట్ సీ ఆర్కిటిక్ మహాసముద్రంలో ఓ భాగం. ఏడాదికి ఆరునెలలు ఇక్కడి నీళ్లు గడ్డకట్టుకుపోయి తెల్లగా కనిపిస్తాయని అలా పిలుస్తారు. అట్లాంటిక్ మహాసముద్రంలో బ్లాక్ సీ టర్కీ ఉక్రెయిన్ దేశాల మధ్యఉంది. సల్ఫేట్, నైట్రేట్ ఖనిజాలతో మిథేన్ వాయువు జరిపే రసాయనిక చర్యవల్ల నల్లగా కనిపిస్తుంది.
జెల్లీ ఫిష్ తరగతికి చెందిన కొన్ని రకాల హైడ్రాలపై జరిపిన అధ్యయనాలు శాస్త్రవేత్తలను బిత్తరపోయేలా చేశాయి. హైడ్రా సుమారు 10,000 సంవత్సరాలపాటు బతకగలదు. అలాగే సీ ఎనెమోన్స్ సముద్రాలలో మరీ ఎక్కువగా లోతులేని చోట శిలలు, పగడపు దిబ్బల ఉపరితలాలకు అతుక్కుని ఉంటై. జెల్లీ చేపల జాతికి సంబంధించిందే ఈ ప్రాణి కూడా. ఒక చేప సాధారణ జీవితకాలానికి అనేక రెట్లు అధిక కాలం ఇవి జీవిస్తున్నాయి. సీ ఎనిమోన్స్‌కు అసలు వృద్ధాప్యం అంటే ఏమిటో తెలియదు. అనుకూలమైన వాతావరణం కొనసాగినంత కాలం వీటి జీవితాలకు తిరుగుండదు. సీ ఎనిమోన్స్ జీవితకాలం అసాధారణం. ఒక అంచనా ప్రకారం కనీసం 100 సంవత్సరాలు జీవిస్తున్నట్లు తేలింది.
(వారి కర్మలకు) ఒక లోతైన సముద్రంలోని చీకటిని ఉపమానంగా చెప్పవచ్చు. దాని (ఆ చీకటి) పై ఒక అల వ్యాపించి ఉన్నది. దానిపై మరొక అల, దానిపై మేఘం, చీకటిపై చీకటి. మనిషి తన చేతిని బయటకు సాచితే, దానిని కూడ చూడలేడు. ఎవరికి అల్లాహ్ తన వెలుగును ప్రసాదించడో, అతనికి మరే వెలుగూ లేదు.(దివ్యఖుర్ఆన్)
—