మోడీ ప్రభుత్వం ఈసారి ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయా? అందులోను ఇండియా కూటమి రోజు రోజుకు బలపడుతున్న సూచనలున్నప్పుడు ఎన్నికల్లో గెలవాలంటే ఏదో ఒకటి చాలా పెద్దగా చేయడం అవసరం. ఇండియా కూటమి ఏర్పడిన తర్వాత బీజేపీ ఈసారి ఎన్నికల్లో గెలవడం అంత సులభం కాదని పలు విశ్లేషణలు వస్తున్నాయి. ఎన్నికలు గెలవాలంటే సరిహద్దుల వద్ద, లేదా సరిహద్దు ఆవల, లేదా సరిహద్దు లోపల ఏదో ఒక పెద్ద సంఘటన, పెద్ద వ్యవహారం ముందుకు రావాలి.
దైనిక్ జాగారణ్ పత్రికలో ఇటీవల ఒక వార్త వచ్చింది. పాకిస్తాన్‌పై సర్జికల్ స్ట్రయిక్ 2 జరిగిందని ఒక అబద్దపు వార్త ప్రచురించింది. కాని సైన్యం ఈ వార్త అబద్దమని ప్రకటించింది. దాంతో మరో ఎత్తుగడ అవసరమయ్యింది. ఇప్పుడు సరిహద్దుల్లోపలే ఏదో ఒకటి చేయాలనుకున్నారేమో అందుకే సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు ఐదు రోజుల ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశాల్లో ఒకే దేశం ఒకే ఎన్నిక అనే బిల్లును ప్రవేశపెడతామంటున్నారు. దీనివల్ల ప్రజలకు ఏమన్నా లాభమా? లోక్ సభ, శాసనసభల ఎన్నికలు వేర్వేరుగా జరిగితే ప్రజల వద్ద ఆప్షన్లు ఉంటాయి. లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన పార్టీ కేంద్ర ప్రభుత్వంలో తీసుకునే నిర్ణయాలు ప్రజలకు నచ్చకపోతే శాసనసభ ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ది చెప్పే అవకాశం ఉంటుంది. ఒకే ఎన్నిక అంటూ లోక్ సభకు, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు పెట్టేస్తే ఈ అవకాశం ప్రజలు కోల్పోతారు. కర్నాటకలో ఇదే జరిగింది కదా. ఏటా దేశంలో ఏదో ఒక రాష్ట్రంలో ఏదో ఒక ఎన్నిక జరుగుతూనే ఉంటుంది. ఈ ఎన్నికల్లో పార్టీలు అనేక హామీలు ఇస్తుంటాయి. చివరకు మనీ ట్రాన్స్‌ఫర్ తాయిలాలు కూడా ఇస్తాయి. ఎన్నికల భయం ఉండడం వల్లనే నల్లచట్టాలు కూడా రద్దయిపోతాయి. ఉదాహరణకు వ్యవసాయ చట్టాలనే తీసుకోండి. ఉత్తరప్రదేశ్ ఎన్నికల భయం లేకపోతే ఈ చట్టాలను వెనక్కి తీసుకుని ఉండేవారా? వందలాది మంది రైతుల మరణాలు చోటు చేసుకున్నప్పటికీ రైతు ఆందోళన సుదీర్ఘంగా కొనసాగినప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లు ఊరుకున్న ప్రభుత్వం ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఎన్నికలు రావడం వల్లనే కదా వెంటనే నిర్ణయం తీసుకుంది. అలాగే, కేవలం ఐదేళ్ళకు ఒకసారి మాత్రమే లోక్ సభ, శాసనసభ ఎన్నికలన్నింటిని కలిపేసి నిర్వహిస్తే ప్రజలకు అవకాశాలు తగ్గిపోతాయి. కాబట్టి ఇందులో ప్రజలకు లాభమేమీ లేదు. పార్టీలు ఎన్నికల్లో గెలవడానికి ఏదో ఒక సమస్యను ముందుకు తెస్తుంటాయి. సరిహద్దుల్లో ఉద్రిక్తలు పెరుగుతాయి. పుల్వామా విషయంలో ఇప్పుడు బయటపడుతున్న విషయాలు చూస్తే అర్థం కావడం లేదా. పుల్వామా దాడి జరిగినప్పుడు జమ్ము కశ్మీరు గవర్నర్‌గా ఉన్న సత్యపాల్ మలిక్ ఇప్పుడు పుల్వామా గురించి అనేక విషయాలు బయటపెడుతున్నారు. పుల్వామా దాడి తర్వాత మారిన పరిస్థితులే కదా మోడీ ప్రభుత్వం మరోసారి ఎన్నికవ్వడానికి కారణం. ప్రజల భావావేశాలను రెచ్చగొట్టి ఓట్లు దండుకోవడం పార్టీలకు తేలిక.
ఐదేళ్ళకు ఒక్కసారే ఎన్నికలు జరిగేదయితే, ఒకసారి ఓటు వేసిన తర్వాత ఇక ఐదళ్ళ వరకు ప్రజలకు అవకాశమే ఉండదు. ఒకే దేశం ఒకే ఎన్నిక వల్ల ఎన్నికలకు అయ్యే ఖర్చు తగ్గిపోతుందని చాలా మంది చెబుతారు. కాని ఈ మాటలో వాస్తవం ఎంత? ఎన్నికల్లో టీచర్లు డ్యూటీ చేస్తారు? వారికి జీతాలు ఎన్నికలు లేని కాలంలో కూడా చదువు చెప్పినందుకు చెల్లించాల్సిందే. ఎలక్షన్ డ్యూటీ చేసినందుకు సిబ్బందికి ప్రత్యేకంగా జీతాల చెల్లింపులేమీ ఉండవు. అలాగే ఎన్నికల కమీషన్ సిబ్బందికి కూడా ఏడాది మొత్తం జీతాలు ఉంటాయి. కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే జీతాలు చెల్లించడం జరగదు. ఈ ఖర్చులేవీ ఒకే ఎన్నిక వల్ల తగ్గేవి కావు. కేవలం ట్రాన్స్‌పోర్టేషన్ ఖర్చు మాత్రమే పెరుగుతుంది. పార్టీలకు ఖర్చు పెరుగుతుంది. ప్రతిసారి ఎన్నిక వస్తే పార్టీ ప్రచారానికి అయ్యే ఖర్చు పెరుగుతుంది. ఎన్నికల్లో అసలు ఖర్చు ఇదే.
ఈ ఖర్చుకు ప్రజలకు సంబంధమేమిటి? లోక్‌సభ, శాసనసభల ఎన్నికలు వేర్వేరుగా జరిగితే పార్టీలు వేర్వేరుగా ప్రచారం చేయాలి. ర్యాలీలు వేర్వేరుగా తీయాలి. ప్రసంగాలు చేయాలి. పార్టీలకు వేర్వేరు ఎన్నికలయితే ఖర్చు పెరుగుతుంది. ఇది కాకుండా ఎన్నికల్లో ధన ప్రవాహం సంగతి తెలిసిందే. ఈ ఖర్చు కూడా పార్టీకి భరించవలసి వస్తుంది. అభ్యర్థులు తమ ఖర్చులు తామే చేస్తారు. పార్టీలు తమ ఖర్చు తామే భరించాలి. ఈ ఎన్నికల ప్రచారం సందర్భంగా చాలా మందికి ఉపాధి కూడా లభిస్తుంది. ఒకవిధంగా చెప్పాలంటే పార్టీల ఖర్చు పెరుగుతుంది కాని ప్రజల్లో చాలా మందికి కాస్త సంపాదించుకునే వివిధ పనులు దొరుకుతాయి. చీరల పంపిణీ, డబ్బు పంపిణీ, దానికి తోడు పూలమాలలు కొనడాలు, జెండాలు, ఇవన్నీ ఎవరికో ఒకరికి ప్రజలకు కొంత సంపాదించుకునే అవకాశం కల్పించేవే కదా. టెంటులు వేసేవాళ్ళకు, పూలు అమ్మేవాళ్ళకు, ఇంకా అనేక మందికి పనులు దొరుకుతాయి. కాబట్టి వేర్వేరు ఎన్నికల్లో ప్రజలకు లాభమే కాని నష్టం లేదు. ఒకే నాయకుడి చరిష్మాపై ఆధారపడి ఎన్నికల్లో పోటీ చేసే పార్టీకి వేర్వేరు ఎన్నిలైతే ఖర్చు ఎక్కువే. నష్టమూ ఎక్కువే. ప్రస్తుతం దేశంలో అత్యంత ధనికపార్టీ బీజేపీ. 2021-22 సంవత్సరంలో ఆరువేల కోట్లకు పైబడి చందాలు బీజేపీకి వచ్చాయి. ఇప్పుడు ఆలోచించండి. బీజేపీ పార్టీ నిధులను ఉపయోగించి ఏదన్నా ప్రాంతంలో రోడ్లు మరమ్మత్తు చేయించిందా? ఏదన్నా అభివృద్ధి కార్యక్రమం పార్టీ ఫండ్ నిధులు వెచ్చించి చేయిస్తుందా? అలాజరగడం లేదు. అబివృద్ధి పనులన్నీ ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు పెడతారు. పార్టీ ఏది కూడా తన పార్టీ ఫండ్ నుంచి అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు చేయడం ఉండదు.
వేర్వేరు ఎన్నికలు జరిగి పార్టీల ఖర్చు పెరిగితే దానివల్ల ప్రజలకు వచ్చిన నష్టమేమీ లేదు. పార్టీ ఏదన్నా కాని పార్టీ ఫండ్ కేవలం ప్రచార కార్యక్రమాలకు వినియోగిస్తాయి. ర్యాలీలకు, పోస్టర్లకు, ఈ నిధులు ఖర్చు పెడతాయి. అందువల్ల వాటికి ఖర్చు పెరుగుతుంది. అంటే ఎన్నికలు జరిగినప్పుడల్లా మార్కెటులోకి ఈ డబ్బు వస్తుంది. ఇది ప్రజలకు లాభమే కదా. చాలా రాజకీయ పార్టీల నేతల వద్ద నల్లడబ్బు ఉందన్నది బహిరంగ రహస్యమే. ఈ నల్లడబ్బు ఎన్నికలప్పుడు మార్కెట్లోకి వస్తుంది. వేర్వేరుగా ఎన్నికలు జరిగితే ఈ నల్లడబ్బు బయటకు తీయడం ఆటోమేటిగ్గా జరిగిపోతుంది. అలా కాకుండా ఐదేళ్ళకు ఒకసారి మాత్రమే ఒకే ఎన్నిక జరిపితే ఐదేళ్ళ వరకు ఈ నల్లడబ్బు బ్లాక్ అయిపోయి పడి ఉంటుంది. మార్కెటులోకి రాదు. కాబట్టి వేర్వేరుగా ఎన్నికలు జరిగితే పెరిగే ఖర్చు ప్రభుత్వానికి కేవలం రవాణా ఖర్చు మాత్రమే. ఇంత పెద్ద దేశం ఆ మాత్రం ఖర్చు భరించడం కష్టమేమీ కాదు.
వేల కోట్ల రూపాయల రుణాలను రద్దు చేసే ప్రభుత్వం ఎన్నికలకు అయ్యే రవాణా ఖర్చులను భరించలేదా? నిజానికి ఒకేసారి ఎన్నికలు జరపాలంటే ఖర్చు మరోవైపు ప్రభుత్వానికి పెరుగుతుంది. ఈవియం మెషిన్లు కావాలి. కొత్త ఈవియంలు కొనాలి. ఈ ఖర్చు వేలకోట్లలోనే ఉంటుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 60 వేల కోట్లు ఖర్చయ్యాయి. ఇవన్నీ ఎన్నికల కమీషన్ చేసిన ఖర్చుల్లోవి కావు. ఇందులో అభ్యర్థులు చేసిన ఖర్చు కూడా ఉంది. లోక్‌సభ పోటీకి అభ్యర్థి 5 కోట్లు ఖర్చు పెడతాడని అంచనా. ఇప్పుడు ఎంతమంది అభ్యర్థులు ఉన్నారో అంత ఖర్చు లేక్కేసి చూడండి. ఎవరికి ఎక్కువ ఖర్చు అవుతుందో తెలిసిపోతుంది. పార్టీల ఖర్చు పెరుగుతుంది. ఒకే దేశం ఒకే ఎన్నికలు వస్తే ప్రజలకు నష్టమే. ప్రతి ఎన్నికకు ముందు పెట్రోలు ధరలు తగ్గడం, గ్యాస్ సిలిండరు ధరలు తగ్గడం ఉండదు. లోక్‌సభ, శాసనసభ ఓట్లు ఒకేసారి సంపాదించుకున్న తర్వాత పార్టీలు ఇక ఐదేళ్ళ వరకు కనిపించవు. ఇష్టారాజ్యం చెలాయిస్తాయి. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, తెలంగాణలో పార్టీకి వెన్నులో వణుకు వస్తోంది. 2024 ఎన్నికలకు ముందు ఈ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే ఇక మోడీ మ్యాజిక్ 2024లో కూడా పనిచేయదు. అందుకే ఐదు శాసనసభల ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికలు కూడా కలిపి జరిపేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉండొచ్చు. ఒకే దేశం ఒకే ఎన్నిక వస్తే ప్రాంతీయ పార్టీలు దెబ్బతింటాయి. కేవలం జాతీయ పార్టీలకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇండియా కూటమిలోని ప్రాంతీయ పార్టీలను దెబ్బతీయడానికే ఈ కొత్త వాదన బయటకు తీశారు. లోక్‌సభ, శాసనసభ ఎన్నికలు ఒకేసారి జరిగితే ఓటర్లు రెండు ఎన్నికల్లోను ఒకే పార్టీకి ఓటేసే అవకాశాలు ఎక్కువని విశ్లేషణలు చెబుతున్నాయి.
అసలు జమిలి ఎన్నికలు ప్రస్తుతం సాధ్యమా అనే ప్రశ్న కూడా ఉంది. లోక్‌సభకు, రాష్ట్రాల శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ ఏండ్లుగా ప్రతిపాదిస్తూనే ఉన్నది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు మొదలుకానున్న నేపథ్యంలో ‘ఒకే దేశం-ఒకే ఎన్నికలు’ సాధ్యాసాధ్యాల పరిశీలన నిమిత్తం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో కేంద్రప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది.
1952లో తొలి సాధారణ ఎన్నికలు మొదలుకొని, 1967 వరకు లోక్‌సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు చాలావరకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. అయితే అనంతర కాలంలో సుస్థిర ప్రభుత్వాలు ఏర్పడకపోవడం, గడువుకు ముందే పలు రాష్ట్రాల శాసనసభలను బర్తరఫ్ చేయడం తదితర కారణాలతో జమిలి ఎన్నికలు పట్టాలు తప్పాయి. దీంతో లోక్‌సభ, అసెంబ్లీలకు వేర్వేరుగా ఎన్నికలు జరపడం మొదలైంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే చాలా రాష్ట్రాల చట్టసభలను గడువు కంటే ముందే రద్దు చేయాల్సి ఉంటుంది. మరికొన్నింటి కాలవ్యవధిని పొడగించాల్సిన అవసరమూ ఉండొచ్చు. జమిలి ఎన్నికలను నిర్వహించాలంటే దానికి సంబంధించిన బిల్లు తొలుత పార్లమెంట్ ఆమోదం పొందాల్సి ఉంటుంది.
జమిలి ఎన్నికలు జరుగాలంటే దాదాపు ఐదు రాజ్యాంగ సవరణలు, ప్రజా ప్రాతినిధ్య చట్టంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉన్నదని 2018లో లా కమిషన్ అభిప్రాయ పడింది. జమిలి ఎన్నికలకు సంబంధించి రాజ్యాంగ సవరణలతో కూడిన బిల్లును పార్లమెంట్ ఉభయ సభలు కనీసం 67 శాతం సానుకూల ఓట్లతో ఆమోదించాల్సి ఉంటుంది. అంతేకాకుండా.. ఎన్నికల అంశం ఉమ్మడి జాబితాలో ఉన్న నేపథ్యంలో ఈ బిల్లుకు దేశంలోని కనీసం సగం రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోద ముద్రవేయాలి. కాబట్టి జమిలి ఎన్నికలనే చర్చ మాత్రమే ఇప్పుడు జరుగుతుంది కానీ ఇది సాధ్యం కావడం చాలా కష్టమని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.