June 16, 2024

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి, కాంగ్రెస్ విజయం సాధించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కూడా కాంగ్రెస్ విజయోత్సవాలు జరిగాయి. బీఆరెస్ పట్ల వైముఖ్యం ఉస్మానియా క్యాంపస్ లో కూడా కనిపించింది. ఇదొక అనూహ్యమైన మార్పు. ఉద్యోగాలు నిరుద్యోగ సమస్య పట్ల విద్యార్థులు గళమెత్తుతున్నారు. పదేళ్ళ క్రితం ఉస్మానియాలో పరిస్థితి ఇలా లేదు. అప్పట్లో ఉస్మానియా ప్రత్యేక తెలంగాణా పోరాటానికి ముఖ్య వేదికగా మారింది. విద్యార్థి గర్జనలు హోరెత్తాయి. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం నడిపిన అప్పటి టీఆరెస్ పార్టీ రాష్ట్రాన్ని సాధించింది. విద్యార్థి నాయకులు కూడా కొందరు రాజకీయాల్లోకి వచ్చారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం కేవలం విద్యాసంస్థగా మాత్రమే కాదు ఉద్యమాలకు, సామాజిక పోరాటాలకు నిలయంగా తన ప్రత్యేకత నిలబెట్టుకుంటూ వస్తోంది. ఈ సందర్భంగా ఒకసారి ఉస్మానియా విశ్వవిద్యాలయం చరిత్రను చూద్దాం.

ఉస్మానియా విశ్వవిద్యాలయం ఒకప్పటి హైదరాబాద్ సంస్థానం చరిత్రకు సాక్షి. హైదరాబాద్ సంస్థాన విలీనం నాటి రక్తపాతాల చరిత్ర, స్ధానికులకు ఉద్యోగాల ఉద్యమాలు, తెలంగాణ పోరాటం ఇలా అనేక పోరాటాలు ఉస్మానియా కళ్ళారా చూసింది. ఉస్మానియా స్థాపనలో ఉన్న ముస్లిమ్ వారసత్వ చిహ్నాలు, సాంస్కృతిక వైవిధ్యానికి పెద్ద పీట వేసిన చరిత్ర, ఇంగ్లీషు భాషలో ఆధునిక విద్యాబోధనకు ముఖ్యకేంద్రంగా మారిన పరిణామాలు… జామియా ఉస్మానియా సుదూర ప్రయాణంలో దాటిన మైలురాళ్ళు ఎన్నో.

ఉర్దూ బోధనాభాషగా భారతదేశంలో ఏర్పడిన మొట్టమొదటి విశ్వవిద్యాలయం ఉస్మానియా. అప్పటికి దేశంలో భారతీయ భాషల్లో ఏ ఒక్క భాష కూడా ఏ విశ్వవిద్యాలయంలోను బోధనాభాషగా లేదు. భారతీయ భాష ఉర్దూ బోధనాభాషగా ఏర్పడిన ఉస్మానియాలో ఇంగ్లీషు భాష తప్పనిసరిగా చదవవలసిన ఒక సబ్జక్టుగా ఉండేది. ఏప్రిల్ 26, 2017 నాటికి ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తయ్యాయి. దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన, ఘనమైన చరిత్ర కలిగిన విశ్వవిద్యాలయాల్లో ఒకటైన ఉస్మానియా సాంప్రదాయికతను, ఆధునికతల అత్యుత్తమ మేళవింపు. శతవసంతాలు పూర్తి చేసుకున్న ఉస్మానియా నూరేళ్ళ ఉత్సవాలు రాష్ట్రంలో ప్రారంభమైన నేపథ్యంలో ఉస్మానియా చరిత్ర గురించి కొంతయినా తెలుసుకోవడం చాలా అవసరం.

మాజీ ప్రధాని పి.వి.నరసింహరావు, భారతదేశం రోదసీలోకి పంపించిన మొదటి వ్యోమాగామి రాకేష్ శర్మ (అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ భూగ్రహంపై భారతదేశం ఎలా కనబడుతుందని అడిగితే ’’సారే జహాం సే అచ్ఛా‘‘ అంటూ అల్లమా ఇక్బాల్ కవితాపాదాన్ని వినిపించారు), ప్రసిద్ధ సినిమా దర్శకుడు శ్యామ్ బెనెగల్, ఆర్బీఐ మాజీ గవర్నరు వై. వేణుగోపాలరెడ్డి, మెగసేసే అవార్డు పొందిన శాంత సిన్హా, ఉర్దూ మీడియంలో వైద్యశాస్త్రం అభ్యసించిన డా.మర్రి చెన్నారెడ్డి తదితరులు ఈ విశ్వవిద్యాలయంలోనే విద్యాభ్యాసం చేశారు.

ఏప్రిల్ 26, 1917 తేదీన హైదరాబాద్ సంస్థానాన్ని పాలిస్తున్న ఏడవ నిజామ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ జారీ చేసిన ఫర్మానాతో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉనికిలోకి వచ్చింది. భారతదేశంలో అతి పాత విశ్వవిద్యాలయాల్లో ఉస్మానియా ఏడవది. దక్షిణ భారతదేశంలో మూడవది. అప్పట్లో ప్రభుత్వానికి హోం సెక్రటరీ హోదాలో పనిచేస్తున్న సర్ అక్బర్ హైదరీ విద్యాశాఖకు ఒక మెమొరాండంలో విశ్వవిద్యాలయం అవసరమని నొక్కి చెప్పాడు. ఉర్దూ బోధనాభాషగా విశ్వవిద్యాలయం ఏర్పడాలని కూడా నొక్కి చెప్పాడాయన. భారతదేశంలో ప్రజలు అధికంగా మాట్లాడే భాషగాను, సంస్థానంలో అధికారభాషగాను ఉన్న ఉర్దూయే బోధనాభాషగా ఉండాలని చెప్పాడు. నిజానికి అప్పటి వరకు దేశంలో ఇంగ్లీషు తప్ప బోధనాభాషగా మరొకటి లేదు.

నిజాం జారి చేసిన ఫర్మానాలో విశ్వవిద్యాలయ లక్ష్యాలు ఉద్దేశ్యాలు స్పష్టంగా పేర్కొన్నారు.

ప్రాచీన, ఆధునిక, ప్రాచ్య, పాశ్చాత్య విద్యాజ్ఞానాల మేళవింపుగా ఉండాలని, ప్రస్తుత విద్యావ్యవస్థలోని లోపాలు తొలగించేదిగా ఉండాలని ఫర్మానాలో నిర్దేశించాడు. ఉర్దూ బోధనాభాషగా ఉండాలని, ఇంగ్లీషు భాష నేర్చుకోవడం తప్పనిసరి చేయాలని కూడా ఫర్మానా పేర్కొంది.

మొదటి ప్రపంచయుద్ధం తర్వాతి కాలమది. అంతకుముందు 1857 ప్రథమ స్వతంత్ర సంగ్రామం విషాదాలు ఇంకా పచ్చిగానే ఉన్న కాలమది. ఉర్దూ బోధనాభాషగా ఉండాలన్న నిర్ణయం వెనుక దేశభక్తి భావాలు బలంగా పనిచేశాయి. భారతదేశంలో విదేశీభాష ప్రాబల్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు దీని వెనుక ఉంది. ఒక భారతీయ భాషను బోధనాభాషగా ఉన్నతవిద్యాబోధన ప్రారంభించిన ప్రయోగాత్మక ప్రయత్నాన్ని నోబుల్ బహుమతి గ్రహిత రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రశంసిస్తూ, ’’విదేశీభాష సంకెళ్ళు తెంచుకుని మన విద్యావ్యవస్థ మన ప్రజలకు సహజంగా అందుబాటులోకి వచ్చే రోజు కోసం నేను చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను. ఈ భాషా సమస్యకు పరిష్కారం కోసం మేము మన స్థానిక రాజ్యాల వైపు చూస్తున్నాం. చివరకు మీ రాజ్యంలో ఉన్నతవిద్యాబోధనకు ఉర్దూ బోధనాభాషగా విశ్వవిద్యాలయం ఏర్పడుతుందని తెలిసి నాకు చాలా సంతోషం కలిగింది. మీ ప్రయత్నాలకు నా సంపూర్ణ మద్దతు ఉందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.‘‘ అని రాశారు.

ప్రముఖ బ్రిటీషు విద్యావేత్త, సర్ మైకెల్ శాడ్లర్ ఈ ప్రయత్నాన్ని ప్రశంసిస్తూ లేఖ రాశాడు.

ఈ ఫర్మానా జారి అయితన తర్వాత రెండేళ్ళ లోపే మొదటి బ్యాచ్ తరగతులు గన్ ఫౌండ్రీలో ప్రారంభమయ్యాయి. 1919లో మొదట తరగతులు ప్రారంభమైన భవనం నేడు హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ నడుస్తోంది. గన్ ఫౌండ్రీ ప్రాంతంలో నిజామ్ కాలేజి రెండవ గేటు పక్కన యు.పి.హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ హాలు ఉంది. 1919లో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఇక్కడే మొదటి బ్యాచ్ ప్రారంభమైంది. ఈ భవనం మహారాజా కిషన్ ప్రసాద్ కు చెందిన భవనం. 1934లో ఉస్మానియా ప్రాంగణం నిర్మాణానికి ముందు వరకు ఇక్కడే తరగతులు జరిగేవి. దీనికి ముందు మదరస యే ఆలియా ఉంది. ఈ భవనం నుంచే ఉస్మానియా ప్రయాణం మొదలైంది. ప్రసిద్ధ ఉర్దూ కవి, తెలంగాణా సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన త్రిమూర్తులలో ఒకడైన మఖ్దూం ముహియుద్దీన్ కూడా చదువుకున్నది ఇక్కడే. ఆయన చదివిన కాలంలో తరగతులు ఎలా జరిగేవంటే, అప్పట్లో స్వంత భవనం లేదు. ఒక్కో క్లాసు ఒక్కో చోట జరిగేది. ఒక్కోసారి ఒక క్లాసు పూర్తయ్యాక విద్యార్థులు మరో క్లాసుకు వెళ్ళాలంటే రెండు మూడు ఫర్లాంగులు వెళ్ళవలసి వచ్చేది. ఇక ఉర్దూ భాష చదివే వారి పరిస్థితి మరీ విచిత్రం. మౌల్వీ అబ్దుల్ హక్ పబ్లిక్ గార్డెన్స్ లో ఏదో ఒక చెట్టుక్రింద క్లాసులు తీసుకునేవారు. వర్షం వస్తే అక్కడి నుంచి ఆబిడ్స్ లోని ఒక లైబ్రరీకి వచ్చేవారు. ప్రొఫెసర్ సజ్జాద్ ఒక హోటలులో ఉండి, విద్యార్థులను అక్కడికు పిలిచి పాఠాలు చెప్పేవారు. డాక్టర్ జోర్ మర్హూమ్, మౌల్వీ అబ్దుల్ ఖాదర్ సుర్వరీల క్లాసులు ఫతేమైదాన్ లోని ఒక భవనంలో జరిగేవి. జోర్ మర్హూమ్ విద్యార్థుల రచనాసక్తిని ప్రోత్సహించేవారు. అలా లభించిన ప్రోత్సాహంతోనే తాను ’’టాగోర్ కవిత్వం‘‘ అన్న పుస్తకం రాశానని మఖ్దూం రాసుకున్నాడు.

మొదటి సంవత్సరం విశ్వవిద్యాలయంలో ఆర్ట్స్, థియోలజీ మాత్రమే ఉండేవి. అంటే రెండు డిపార్టుమెంట్లు మాత్రమే. 225 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు. 25 మంది ఫాకల్టీ. సంస్కృతం, తెలుగు, కన్నడ, మరాఠీ, పర్షియన్, అరబీ, ఉర్దూ భాషల్లో కోర్సులు ఉండేవి. ఏ కోర్సు చదివినా ఇంగ్లీషు ఒక భాషగా అధ్యయనం చేయడం తప్పనిసరి. అప్పట్లో పరదా సంప్రదాయం సమాజంలో చాలా బలంగా ఉండేది. అందువల్ల విద్యార్థినులకు సదుపాయాలు ప్రత్యేకంగా కల్పించారు. విద్యార్థులు, విద్యార్థినుల తరగతులు వేర్వేరుగా జరిగేవి. ఒకే క్లాసులో పాఠం వినవలసి వస్తే, విద్యార్థులకు, విద్యార్థినులకు మధ్య ఒక కర్టెన్ ఏర్పాటు చేసేవారు. 1934లో యూనివర్శిటీ కోసం 566 ఎకరాలు కేటాయించడం జరిగింది. ఆర్ట్ కాలేజి భవనానికి నిజాం స్వయంగా శంఖుస్థాపన చేశారు. పనివారిని తరలించడానికి, నిర్మాణ సామాగ్రి తరలించడానికి రైల్వే ట్రాకులు ప్రత్యేకంగా వేశారు. నాలుగేళ్ళలో ఆర్ట్స్ కాలేజీ భవనం అద్భుతమైన నిర్మాణంగా పూర్తయ్యింది. ముగల్, కుతుబ్ షాహీ వాస్తు సమ్మేళనంతో కట్టిన భవనమిది. బెల్జియంకు చెందిన ఆర్కిటెక్ట్ మాన్షార్ జాస్పర్ డిజైను చేశారు. 164 పెద్ద పెద్ద గదులు, రెండున్నర లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మించిన అతిపెద్ద భవనమిది. డిజైను చేసిన మాన్షార్ జాస్పర్ పేరే తర్వాత మూసారాం బాగ్ గా మారిందని అంటారు. మెడిసిన్, ఇంజనీరింగ్, అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, పిహెచ్డీ అన్ని కోర్సుల్లోను ఉర్దూ బోధనాభాష. అవసరమైన పాఠ్యపుస్తకాల కోసం పెద్ద ఎత్తున అనువాద కార్యక్రమం జరిగింది. మెడిసిన్ కోర్సులు కూడా ఉర్దూలో నిర్వహించడానికి ఎలాంటి ఇబ్బంది కలుగలేదు.

భారతీయ భాషలో విద్యాభోధన నిర్ణయం అప్పట్లో సాహసోపేతమైన నిర్ణయం. నిజానికి ఉర్దూను ఉస్మానియా ద్వారా సెక్యులర్ భాషగా ప్రవేశపెట్టడం ద్వారా నిజామ్ చేసిన ప్రయత్నాన్ని దాట్ల కవితా సరస్వతి తన పుస్తకంలో ప్రశంసిస్తూ రాశారు. నిజానికి నిజామ్ బ్రిటీషు వారికి మిత్రుడిగా ఉన్నప్పటికీ, ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని ఉర్దూ బోధనాభాషగా ఏర్పటు చేయడం ద్వారా బ్రిటీషు వారిని సవాలు చేశాడు. బిజినెస్, సైన్సు వగైరా రంగాల్లో ఇంగ్లీషుకు ప్రాబల్యానికి విసిరిన సవాలిది. భారీ స్థాయిలో జరిగిన అనువాద కార్యక్రమమే దీనికి సాక్ష్యం. పాశ్చాత్య విద్యావ్యవస్థ ప్రభావాన్ని భారతీయీకరణకు చేసిన ప్రయత్నమిది. ఉర్దూ నిజానికి ముస్లిముల భాషగా భావించడం పొరబాటు. ఈ విషయాన్నే దాట్ల కవితా సరస్వతి తన పుస్తకం ’’ది లాంగ్వేజ్ ఆఫ్ సెక్యులర్ ఇస్లామ్‘‘లో ప్రముఖంగా రాశారు. 1830 నాటికే ఉర్దూ భారతదేశంలో పర్షియన్ స్థానాన్ని ఆక్రమించుకుంది. పాలనాయంత్రాంగంలో ఉర్దూ చెలామణిలోకి వచ్చేసింది. బిహార్, నార్త్ వెస్ట్ ప్రావిన్సెస్, సెంట్రల్ ప్రావిన్సెస్ లో చాలా చోట్ల, పంజాబ్, కశ్మీర్, హైదరాబాదుల్లో ఉర్దూ ప్రజలభాషగా గుర్తింపు పొందింది. ఈ అధికారభాషా విధానం 1900 తర్వాత కూడా కొనసాగింది. ఆ తర్వాత కొన్ని ప్రాంతాల్లో హిందీని కూడా చేర్చడం జరిగింది. దేశవిభజనకు ముందు ఉర్దూ ముస్లిముల భాషగా ముస్లిములు కూడా వాదించేవారు కాదు, హిందువులు కూడా వాదించేవారు కాదు, హిందూముస్లిమ్ సంగమానికి చిహ్నంగా ఉండేది. అందువల్లనే ఉస్మానియాలో ఉర్దూ బోధనాభాషగా ప్రవేశపెట్టడం అన్నది దేశంలో ఒక లౌకిక జాతీయ సంస్కృతిని భాషద్వారా సాధించే ప్రయత్నం. అంజుమనె తరఖ్ఖీ ఉర్దూకు నేతృత్వం వహించిన మౌల్వీ అబ్దుల్ హక్, గాంధీజీలు 1936లో అఖిల భారతీయ సాహిత్య పరిషద్ లో పాల్గొన్నారు. ముస్లిములకు ఉర్దూ మతపరమైన ప్రాముఖ్యం ఉన్న భాష కాబట్టి దానికి వారు కట్టుబడవచ్చని, అది ఖుర్ఆన్ లిపిలో (నిజానికి ఉర్దూ పర్షియన్ లిపి) ఉందని, ముస్లిమ్ రాజులు దానికి ప్రచారం ఇచ్చారని గాంధీజీ మౌల్వీతో అన్నారు. ఈ మాటల పట్ల మౌల్వీ తీవ్రమైన అభ్యంతరాలు చెప్పారు. తర్వాత గాంధీజీ తన మాటలకు విచారం వ్యక్తం చేశారు. గాంధీ వంటి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడవలసిన మాటలివి కాదని మౌల్వీ అన్నారు. మౌల్వీ అబ్దుల్ హక్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రముఖపాత్ర పోషించిన వ్యక్తి. గాంధీ వ్యాఖ్యల తర్వాత మౌల్వీ ’’మైనారిటీలుగా మార్చేసిన అనుభవమైందని‘‘ చెప్పారు. అంతేకాదు, మౌల్వీ చెప్పిన మరో మాట కూడా గమనించదగింది. ఇలాంటి రాజకీయ భేదాభిప్రాయాలను మతపరమైన ఎజెండాలకు, లౌకిక ఎజెండాకు మధ్య పోటీగా కాదు, లౌకిక ఎజెండాల మధ్య పోటీగా చూడాలని ఆయన చెప్పిన మాటలు 20 శతాబ్ధం ప్రారంభం నాటి భారతీయ జాతీయవాదాన్ని పునస్సమీక్షించవలసిన అవసరాన్ని చాటి చెబుతున్నాయి.

దాట్ల కవితా సరస్వతి తన పుస్తకంలో రాసిన మాటలు ముమ్మాటికి నిజం. ఉస్మానియా విశ్వవిద్యాలయం మతపరమైనది కాదు, ధియోలాజికల్ కూడా కాదు. అందులో ధియోలాజికల్ విభాగం ఒకటి ఉన్నప్పటికీ, దాట్ల ఇచ్చిన గణాంకాల ప్రకారం 1935లో ఉస్మానియాలో 1806 మంది విద్యార్థులు ఉన్నారు. ఆర్ట్స్ చదివేవారు 771, సైన్సు విభాగంలో 731, మెడిసిన్ లో 102, లా విభాగంలో 97, ఇంజనీరింగ్ లో 47, ధియోలజీలో కేవలం 32 మంది మాత్రమే. అంటే ధియోలజీ అనేది చాలా తక్కువ మంది మాత్రమే చదివేవారు. భారత విద్యావ్యవస్థ పునరుజ్జీవానికి ఉస్మానియా పునాదులు వేసిందని అనేకమంది విద్యావేత్తలు అభిప్రాయపడతారు. ప్రారంభంలో వారానికి మూడు రోజులు మాత్రమే తరగతులు జరిగేవి. థియోలజీ ఒక సబ్జక్టుగా ఉన్నప్పటికీ అప్పటికీ హైదరాబాదులో ఉన్న జామియా నిజామియా విద్యాసంస్థ ధియోలాజికల్ స్టడీస్ కు పేరెన్నికగన్న సంస్థ. కాబట్టి ధియోలాజికల్ స్టడీస్ ఉస్మానియాలో ప్రముఖమైనవిగా ఉండలేదు. లౌకికవిలువలను ప్రోత్సహించడమే ఎక్కువగా కనబడుతుంది.

ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్శిటీ చేపట్టిన రెండు ప్రాజెక్టులను దాట్ల ప్రస్తావించారు. ముస్లిము చరిత్రలో సెక్యులర్ ఎచీవ్ మెంట్స్ ను చాటి చెప్పడం ద్వారా భారతజాతికి ఉపయోగపడే ప్రాజెక్టులవి. ఒకటి తారీఖె హింద్ (భారత చరిత్ర), సయ్యద్ హాష్మీ ఫరీదాబాదీ రచించారు. రెండవది, తారీఖె ఇస్లామ్ (ఇస్లామ్ చరిత్ర), అబ్దుల్ హలీమ్ షరార్ రచించారు. ఇవి రెండు చరిత్ర పుస్తకాలు. ఈ రెండు పుస్తకాలు జాతీయస్థాయిలోను అంతర్జాతీయ స్థాయిలోను ముస్లిముల పాత్రను చర్చించిన పుస్తకాలు. షరార్, హాష్మీ వీరిద్దరు జాతీయవాదం, ఇస్లామ్ ఈ రెండింటి మధ్య ఈ పుస్తకాల ద్వారా పొంతన సాధించి, జాతీయ సమైక్యతకు, ఒకే జాతి అన్న భావనకు బలం చేకూర్చారు.

ప్రారంభంలో రెండు విభాగాలే ఉన్నప్పటికీ తర్వాత నెమ్మదిగా కెమిస్ట్రీ, సివిల్ ఇంజనీరింగ్, ఇంగ్లీషు, హిస్టరీ, మాథమెటిక్స్, ఫిజిక్స్, సోషియాలజీ, జియోగ్రఫీ, జూవాలజీ, బోటనీ, జియోలజీ, ఎడ్యుకేషన్, న్యాయశాస్త్రం, మెడిసిన్, అగ్రికల్చర్, వెటరినరీ ఇలా అనేక విభాగాలు ఏర్పడ్డాయి.

సర్ అక్బర్ హైదరీ ఉర్దూ మీడియంలో యూనివర్శిటీ గురించి ప్రతిపాదన పెట్టినప్పుడు రెండు అభ్యంతరాలు ముఖ్యంగా ఉర్దూ మీడియం విషయంలో వచ్చాయి. మొదటి అభ్యంతరం సంస్థానంలో మెజారిటీ ప్రజలు వివిధ భాషలు మాట్లాడేవారున్నారు. ఉర్దూ మాట్లాడేవారి సంఖ్య మైనారిటియే. రెండవ అభ్యంతరం ఉర్దూ మీడియానికి అవసరమైన పాఠ్యపుస్తకాలు లేవు. సర్ హైదరీ ఈ రెండు అభ్యంతరాలకు సరయిన జవాబిచ్చాడు. సంస్థానంలో సాధారణ ప్రజలు వివిధ భాషలు మాట్లాడుతున్నారన్నది నిజమే అయినా, ఉర్దూ మాతృభాష ప్రజల సంఖ్య మైనారిటియే అయినా ఉర్దూ సంస్థానానికి అధికారభాష కావడమే కాదు, సాంస్కృతిక భాషగా కూడా గుర్తింపు పొందిందని, సాధారణంగా కాలేజీ విద్య కోసం వచ్చే విద్యార్థుల కుటుంబాలన్నింటా ఉర్దూ చెలామణిలో ఉందని (మనం 1917 నాటి విషయాలు చర్చిస్తున్నామని గుర్తుంచుకోవడం అవసరం) అందువల్ల ఉర్దూ బోధనాభాషగా ఉండడమే మంచిదని జవాబిచ్చాడు. రెండవ అభ్యంతరం, పాఠ్యపుస్తకాలకు సంబంధించినది, యూనివర్శిటీకి అనుబంధంగా ఒక సంకలన, అనువాద విభాగాన్ని ఏర్పాటు చేయాలని, అనువాదకార్యక్రమాన్ని చేపట్టడం ద్వారా అవసరమైన పాఠ్యపుస్తకాలను రూపొందించడం కష్టం కాదని అన్నాడు. ఆయన చెప్పిన మాటలు నిజమయ్యాయి. బ్యూరో ఆఫ్ ట్రాన్సలేషన్ కేవలం ఐదు సంవత్సరాల కాలంలో చాలా సబ్జక్టులకు అవసరమైన పుస్తకాలు అనువదించింది. వైజ్ఞానిక విషయాలను బోధించడానికి ఉర్దూ భాష సామర్థ్యాన్ని అందరూ ఒప్పుకోకతప్పలేదు. హిస్టరీ ఆఫ్ ఇండియాలో రచయిత విన్సెంట్ ఏ.స్మిత్ ఈ వాస్తవాన్ని ఇలా రాశాడు:

’’వాక్యనిర్మాణంలో ఇంగ్లీషుకు సన్నిహితంగా ఉండే ఉర్దూ భాష లోని సరళత్వం, ఫ్లెక్సిబిలిటీల వల్లనూ, సంస్కృతం, హిందీ, పర్షియన్, అరబీ, ఇంగ్లీషు తదితర భాషాపదాలను కలుపుకోవడం వల్ల ఉర్దూలో ఉన్న అసాధారణ పదసంపద వల్ల ఎలాంటి భావాన్నయినా ప్రకటించే సామర్థ్యం ఉర్దూలో ఉంది. ఏ సబ్జక్టు అయినా, సాహిత్యమైనా, తత్వశాస్త్రమైనా, విజ్ఞానశాస్త్రమైనా ఉర్దూలో కష్టం కాదు.‘‘

ఉస్మానియాకన్నా ముందే ఏర్పడిన నిజామ్ కాలేజి ఉస్మానియకు అనుబంధం చేయబడింది. నిజామ్ అబ్జర్వేటరీ, మెడికల్ కాలేజి, లా స్కూలు, టీచర్స్ ట్రయినింగ్ కాలేజి ఇలా అనేక సంస్థలు ఉస్మానియాకు అనుబంధమయ్యాయి. అలాంటి సంస్థలలో దాయిరతుల్ మారిఫ్ ముఖ్యమైనది. ఇప్పుడు కూడా ఉస్మానియా ప్రాంగణంలో ఈ విభాగాన్ని చూడవచ్చు. నిజానికి దాయిరతుల్ మారిఫ్ 1888లో ఏర్పడింది. హ్యుమానిటీస్, మతం, సైన్సు, ఆర్ట్స్ లలో ప్రామాణిక అరబీ గ్రంథాలను సేకరించి, భద్రపరచడానికి, పునర్ముద్రించడానికి ఏర్పడిన విభాగం ఇది. ఆరవ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ కాలంలో ఏర్పడిన ఈ సంస్థ ప్రపంచఖ్యాతి పొందింది. ఏడవ నిజామ్ కూడా దీనికి అవసరమైన మద్దతిచ్చాడు.

బ్రిటీషువారికి నిజామ్ మిత్రుడిగా ఉన్నప్పటికీ, రెండవ ప్రపంచయుద్ధంలో అత్యధికంగా సహాయపడినవాడు నిజామే అయినప్పటికీ బ్రిటీషువారిని సవాలు చేస్తూ దేశంలో ఎక్కడా లేనివిధంగా ఇంగ్లీషును కాదని ఉస్మానియాలో ఉర్దూ బోధనాభాషగా పెట్టడం అన్నది బ్రిటీషువారికి గొంతు దిగలేదు. బ్రిటీషు ఇండియాలో హైదరాబాదు సంస్థానానికి ఒక ప్రత్యేకత ఉంది. నిజామ్ ప్రపంచంలో ధనికుడు మాత్రమే కాదు, చాలా తెలివైన రాజకీయ నాయకుడు. బ్రిటీషు ప్రాబల్యాన్ని తన చాకచక్యంతో హైదరాబాదులో చాలా పరిమితం చేశాడు. తన ప్రభుత్వాన్ని స్వతంత్రంగా నడుపుకునేవాడు, రైల్వేలు, పోస్టల్ అన్ని హైదరాబాదు ప్రభుత్వ అధీనంలోనే ఉండేవి. ఇలాంటి స్వేచ్ఛ మరో సంస్ధానానికి దేనికి అప్పట్లో లేదు. ఈ స్వేచ్ఛను ఉపయోగించుకునే నిజామ్ బ్రిటీషును సవాలు చేస్తున్నట్లు ఉర్దూ మీడియంలో యూనివర్శిటీ ప్రారంభించడంతో ఖంగుతిన్న ఆంగ్లేయులు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇచ్చిన పట్టాలు ఇతర విశ్వవిద్యాలయాలు గుర్తించకుండా చేశారు. ఇతర యూనివర్శిటీల గుర్తింపును నిజామ్ పెద్దగా పట్టించుకున్నట్లు కనబడదు. నిజానికి అప్పట్లో మిగిలిన విశ్వవిద్యాలయాల కన్నా ఉస్మానియాలో ప్రమాణాలు అత్యున్నతంగా ఉండేవని, అసంఖ్యాక పుస్తకాలు ఇంగ్లీషు నుంచి ఉర్దూలోకి అనువాదమయ్యాయని, సైన్సు లేబరెటరీలకు దేశంలో  మరెక్కడా లేనివిధంగా అత్యాధునిక సామగ్రిని నిజాం అందజేసాడని, మెడిసిన్; బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆస్ట్రానమీ, వెటరినరీ, జియోలజీ, ఇంజనీరింగ్, ఆర్ట్స్, అగ్రికల్చర్, లీగల్ తదితర శాస్త్రాలన్నింటా ఉస్మానియా అత్యున్నత ప్రమాణాలు సాధించిందని తెలుస్తోంది. దేశం ఆంగ్లపాలనలో ఉన్నంత కాలం ఈ వివక్ష కొనసాగింది. అయితే ఆంగ్ల ప్రభువుల గుర్తింపును నిజామ్ పెద్దగా పట్టించుకున్నట్లు కనబడదు.

సెప్టెంబరు 1948లో హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో విలీనమైన తర్వాత ఉర్దూ స్థానంలో ఇంగ్లీషు బోధనాభాషగా మారింది. ఉస్మానియా నేడు అతిపెద్ద విశ్వవిద్యాలయం. దాదాపు 1000 కళాశాలలు అనుబంధంగా ఉన్నాయి. ఆసియాలోనే పెద్దదని చెప్పవచ్చునేమో. దాదాపు 5,50,000 మంది విద్యార్థులు. 1977 నుంచి దూరవిద్యను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ప్రస్తుతం 12 ఫాకల్టీలు, 53 డిపార్టుమెంట్లు, 25 అండర్ గ్రాడ్యుయేట్ కార్యక్రమాలు, 75 పోస్టు గ్రాడ్యుయేట్ కార్యక్రమాలు, అనేకమంది విదేశీ విద్యార్థులతో సాంస్కృతిక సంగమంలా ఉస్మానియా కేంపస్ నేడు కనబడుతుంది.

ఉద్యమాలకు కూడా పురిటిగడ్డ ఉస్మానియా. ఒకప్పుడు వందేమాతరంపై వివాదం అక్కడ చెలరేగింది. అయితే దాట్ల కవితా సరస్వతి ఈ విషయమై రాస్తూ ఈ వివాదానికి హైదరాబాదులో స్వతంత్రపోరాటానికి సంబంధం లేదని అన్నారు. నిజామ్ అనుసరించిన హిందూ ముస్లిమ్ విధానాల ఫలితం అన్న వాదనను కూడా ఆమె ఖండించారు. 1938లో కొందరు విద్యార్థులు తమ హాస్టలు గదుల్లో వందేమాతరం పాడడం ప్రారంభించారు. ఈ గేయంలో రాజకీయ కోణాలుండడం, వివాదస్పద గేయం కావడం (స్వతంత్రానికి పూర్వం వివాదం వేరు) వల్ల దానిపై పాలనాయంత్రాంగం నుంచి అభ్యంతరాలు వచ్చాయి. ఈ గేయం వల్ల హైందవేతరుల మనోభావాలు గాయపడతాయన్న కారణం కూడా అందులో ఉంది. ఈ వివాదాన్ని హైదరాబాద్ స్టేట్ కాంగ్రేస్, హిందూమహాసభ వాడుకోవాలని ప్రయత్నించాయని, కాని వందేమాతరం కోసం పట్టుబట్టిన విద్యార్ధులు తమ సంఘర్షణ మతపరమైనది కానే కాదని అన్నారని దాట్ల రాశారు. దాట్ల దీనికి ఆధారంగా 1939 జూన్ 3 నాటి హిందూ దినపత్రిక కథనాన్ని ఉటంకించారు. ఈ వివాదం కారణంగా బహిష్కరణకు గురైన విద్యార్థులు తాము వందేమాతరం గేయానికి కట్టుబడి ఉన్నప్పటికీ తమకు హైదరాబాదు రాజ్యం పట్ల, యూనివర్శిటీ పట్ల, మతసామరస్యం పట్ల తమ నిబద్దత ఉందని స్పష్టంగా ప్రకటించారు. వారి డిమాండ్ ను హైదరాబాద్ ప్రభుత్వం నిరాకరించింది. ప్రాచీన హిందూ ధర్మంలో భాగంగా ఇటీవల రాయబడిన గేయాన్ని (వందేమాతరం రాసింది 1870లో) ఆమోదించడం సాధ్యం కాదని ప్రభుత్వం చెప్పింది. అంటే హిందూధర్మాన్ని వ్యతిరేకిస్తూ వందేమాతరానికి అభ్యంతరాలు రాలేదు.

అప్పటి నుంచి ఉస్మానియా అనేక ఉద్యమాలకు ఊపిరిగా కూడా మారింది. 1952లో హిందీ మాధ్యమంగా కేంద్రప్రభుత్వం విశ్వవిద్యాలయాన్ని స్వాధీనం చేసుకోవాలనుకున్నప్పుడు కూడా విద్యార్థులు ఉద్యమించారు. అదే కాలంలో స్ధానికులకు ఉద్యోగావకాశాల కోసం కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు నడిచాయి. డెబ్బయిలలో తెలంగాణ ఉద్యమం ఉస్మానియాలో ఉధృతంగా ఉపేసింది. నాలుగు దశాబ్దాలు తర్వాత మళ్ళీ ప్రత్యేక తెలంగాణా పోరాటంలోను ఉస్మానియా కేంద్రంగా మారింది.

హైదరాబాద్ సాంస్కృతిక, రాజకీయ పరిణామాల్లో భాగంగా నిలబడిన ఈ విద్యావనం హిందూముస్లిమ్ సామరస్య సంస్కృతికి చిహ్నంగా గర్వంగా విద్యాసేవలందిస్తోంది.

–      ఉమైర్