October 30, 2024

‘‘ఏ పాలకుడైతే తన నిర్ణయమే తుది నిర్ణయమని భావిస్తాడో అతడు అన్ని రకాల సంక్షోభాలకు కారకుడవుతాడు. ప్రజల అభిమానాన్ని కోల్పోతాడు’’ అంటాడు శుక్రాచార్యుడు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, మారుతున్న పరిస్థితులకు తగ్గట్లుగా తనను తాను మార్చుకొని ప్రజా సంక్షేమాన్ని కోరే పాలకుడిని ప్రజలు ఎల్లప్పుడు ఆదరిస్తారు. రాజరిక వ్యవస్థను కూలదోసి ప్రజాస్వామ్య విధానాలకు ప్రజలు అలవాటుపడ్డ తరుణంలో అక్కడక్కడ నేటికి కూడా కొద్దిమంది నియంత పాలనకు తెరలేపి అప్రతిష్ట మాటగట్టుకొని చివరికి ప్రజల చేతిలో భంగపడి రాజకీయాల నుండి శాశ్వతంగా నిష్క్రమించిన నాయకులను కూడా చూస్తున్నాం. ఇటీవలే రాష్ట్ర శాసన సభకు జరిగిన ఎన్నికల్లో పాత ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించి కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఈ క్రమంలోనే కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. గత ప్రభుత్వ ఓటమికి కారణాలు ఎన్ని ఉన్నా ప్రస్తుత ప్రభుత్వ విజయానికి అవన్నీ సానుకూల అంశాలుగా పనిచేశాయి. వెరసి తెలంగాణ ప్రజల ఆకాంక్షను కొత్త ప్రభుత్వం పూర్తి చేయాల్సి ఉంది. గత ప్రభుత్వం అసంపూర్ణంగా ఉంచిన కొన్ని అంశాలను ఇప్పుడు చర్చిద్దాం.
విద్యా విధానం
తెలంగాణ విద్యా విధానం దేశానికే రోల్‌ మోడల్‌ అని ఢంకా బజాయించింది గత ప్రభుత్వం. ప్రైవేటు విశ్వ విద్యాలయాల మీద వున్న శ్రద్ధ ప్రభుత్వ విద్యా విధానం మీద పెట్టలేక పోయింది. ఫలితంగా తెలంగాణలో విద్యా వ్యవస్థ గాడి తప్పింది. ప్రాధమిక పాఠశాల నుండి విశ్వ విద్యాలయాల వరకు బోధించేవారు లేక విద్యా సంస్థలు కూనరిల్లి పోయాయి. రాష్ట్రంలో ఏకోపాధ్యాయ పాఠశాలలు సుమారు ఎనిమిది వేలు ఉన్నట్లు అధికారుల అంచనా. అదేవిధంగా బాలికలకు మూత్ర శాలలు, మరుగుదొడ్లు లేని పాఠశాలలు అంటూ ఆ మధ్య కాలంలో పత్రికలలో పతాక శీర్షికల్లో చదివాం. ఇటీవలే హైకోర్ట్‌ రాష్ట్ర రాజదాని హైదరాబాద్‌ సరూర్‌ నగర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో బాలబాలికలకు మూత్రశాలలు, మరుగుదొడ్లు కట్టించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. అంతెందుకు ఆదిలాబాద్‌, యాదాద్రి భువనగిరి జిల్లాలో నేటికి కొన్ని చోట్ల బడికి వెళ్ళాలంటే వానకాలంలో వాగులు, పిల్లకాలువలు దాటుకుంటూ వెళ్తున్న పిల్లల్ని చూస్తూనే ఉన్నాం. ‘‘గురువులేని విద్య రాణించదు’’ అన్నట్లు, పాఠశాల స్థాయి నుండి యూనివర్సిటీల వరకు ఖాళీగా వున్న అన్ని టీచర్‌ పోస్టులను తక్షణమే భర్తీచేసి విద్యార్ధులకు నాణ్యమైన విద్యను అందించాలి, ప్రైవేటు విద్యపై నిరంతరం నిఘా, నియంత్రణ, పర్యవేక్షణ చేయాలి. స్కాలర్షిప్లు, ఫీజు రీయంబర్స్మెంటు, హాజరు శాతం 75% పైగా ఉన్న వారికే ఇవ్వాలి లేనిపక్షంలో నిధుల దుర్వినియోగం జరిగే ఆస్కారం వుంది. ప్రభుత్వ విద్యను ప్రోత్సహించి, తల్లిదండ్రులను ఆ దిశగా చైతన్యం చేయాలి. హాస్టళ్ళలో కూడా మెరుగైన సదుపాయాలు రుచికరమైన భోజన సదుపాయాలు కల్పించాలి. ‘‘ఉత్తమ విద్యా విధానం ఉన్నచోట ఉత్తమ సమాజం నిర్మించబడుతుంది’’ అంటాడు అరిస్టాటిల్‌. అలాంటి సమాజ నిర్మాణానికి తరగతి గది కేంద్ర బిందువు కావాలి. ఉత్తమ విద్య ద్వారానే ఉపాధి కల్పన, సృజనాత్మక ఆలోచనలు, విలువైన మానవవనరులు, ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయి. పక్కా ప్రణాళికతో కూడిన మంచి విద్యా విధానమే మొత్తం సమాజాన్ని ప్రభావితం చేస్తుందనేది గమనించాలి.
ఉద్యోగాల కల్పన
గత ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా బిస్వాల్‌ కమిటి రాష్ట్రంలో ఒక లక్ష తొంబై ఏడు వేల ఉద్యోగాలు ఖాళీగా వున్నాయని నివేదికను ఇచ్చినట్లు సాక్షాత్తు గత ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రస్తుత ప్రభుత్వం దశలవారీగా వాటన్నింటిని భర్తీచేసి వివిధ శాఖల పనితీరును పటిష్టం చేయాలి. గ్రూప్‌` 1, గ్రూప్‌ -2, గ్రూప్‌ -3, గ్రూప్‌-4, డిగ్రీ లెక్చరర్లు, జూనియర్‌ లెక్చరర్లు, పాలిటెక్నిక్‌ లెక్చరర్లు, టీచర్‌ పోస్టులు, ఇతర శాఖలకు సంబంధించిన అన్ని రకాల పోస్టులను తక్షణమే గుర్తించి ుూూూజని ప్రక్షాళన చేసి సమర్ధులను బోర్డు సభ్యులుగా నియమించి పారదర్శకమైన విధానాన్ని పాటించి నిరుద్యోగులలో నెలకొన్న నిరాశను, కొత్త ప్రభుత్వం తొలగించే ప్రయత్నం చెయ్యాలి.
గత ప్రభుత్వ పథకాల రద్దు/ సమీక్ష
గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన లోపభూయిష్టమైన ధరణి, రైతుబంధు, దళిత బంధు, బెల్టు షాపులు మొదలగు పథకాలు విచ్చలవిడిగా వున్నా మద్యం దుకాణాలను దశలవారిగా తగ్గించే ప్రయత్నం చెయ్యాలి. ప్రజలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ప్రభుత్వం కూడా సుస్థిరంగా ఉన్నట్లు భావించాలి. ప్రజలు ఇబ్బందులకు గురైతే ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తారు. కాబట్టి ప్రజలకు లేదా యువతను వారి స్వశక్తి మీద ఆధారపడి జీవించేలా ఉపాధి కల్పన కేంద్రాలు నెలకొల్పి శిక్షణ ఇవ్వాలి. రాష్ట్రంలో ఎలాంటి మాదక ద్రవ్యాలు దొరకకుండా పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటుచేసి డ్రగ్స్‌తో దొరికిన పక్షంలో శిక్షలు విధించేలా చర్యలు తీసుకోవాలి. దీనికి పోలిస్‌ యంత్రాంగం పూర్తిగా క్రియాశీలంగా వ్యవహరించాలి.
అభివృద్ధి సంక్షేమం అన్ని ప్రాంతాలకు సమానంగా విస్తరించాలి
ప్రాంతం ఏదైనా కావచ్చు, వ్యవసాయికంగా, పారిశ్రామికంగా, వెనుకబడిన ప్రాంతాలైన ఆదిలాబాద్‌, మహబూబ్‌ నగర్‌ ఇతర జిల్లాలకు కూడా సమాన భాగస్వామ్యం కల్పించి, జాతీయ స్థాయి ప్రాజెక్టులు, అంతర్జాతీయ స్థాయి ప్రాజెక్టులు వచ్చేవిధంగా కృషి చేసి వెనుకబడ్డ ప్రాంతాలకు అభివృద్ధిలో సమాన భాగస్వామ్యం కల్పించాలి. రోడ్డు, పాఠశాలలు, వైద్యశాలలు, పేదలకు ఇండ్లు, త్రాగునీరు, కరెంటు సదుపాయం కల్పిస్తే సహజంగానే ఆ ప్రాంతంలో మెరుగైన సౌకర్యాలు అందుతున్నట్లుగా భావించాల్సి వుంటుంది. గత ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం కొంతమేరకు చేసినప్పటికి చాలా విషయాల్లో నిర్లక్ష్యం ప్రదర్శించినందు వల్ల ప్రస్తుత ప్రభుత్వం ఆ లోటును భర్తీచేస్తూ అభివృద్ధిలో సబ్బండ వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాలి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి పది సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా ప్రాంతాల వారీగా చేయాల్సినవి, పురోగతిలో ఉన్నవి, పూర్తిగా పెండిరగ్‌లో వున్నవి ఇలా విభజించుకొని ప్రాధాన్యతా రంగాలను బట్టి నిధులు కేటాయించి దశలవారీగా అభివృద్ధి వైపు రాష్ట్రాన్ని మళ్ళించాలి. ఈ విషయంలో ప్రతిపక్షాల నిర్మాణాత్మకమైన సూచనలు, సలహాలు స్వీకరించి అధికార పక్షం పాటించాలి, అమలు చేయడానికి కృషిచేయాలి. ప్రతిపక్షాల అంటే శత్రుపక్షం అన్న భావన అధికార పక్షం తొలగించుకోవాలి.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు దశలవారిగా అమలుపర్చాలి
ముందుగా ఈ ప్రభుత్వం ఎలాంటి హామీలు ఇచ్చిందో ఒకసారి చూద్దాం 1) మహాలక్ష్మి పథకం, మహిళలకు ప్రతినెలా 2500, 500 రూపాయలకే గ్యాస్‌ సిలిండర్‌, ఆర్టిసీ బస్సులో ఉచిత ప్రయాణం 2) రైతు భరోసా క్రింద ప్రతి రైతుకు 15,000/- కౌలు రైతులకు, 12,000/- వ్యవసాయ కూలీలకు, వరి పంటకు 500 బోనస్‌ 3) గృహజ్యోతి క్రింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత కరెంటు 4) ఇందిరమ్మ ఇండ్లు ఇల్లు లేని వారికి ఇంటి స్థలం 5 లక్షల రుణం, ఉద్యమ కారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం 5) యువ వికాసం క్రింద విద్యార్ధులకు 5 లక్షల నగదు ప్రోత్సాహం. చేయూత పథకం క్రింద వృద్ధులకు నెలకు 4000 పెన్షన్‌, 6) రూ.10 లక్షల రాజీవ్‌ ఆరోగ్యశ్రీ బీమా. ఇందులో అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, రూ.10 లక్షల రాజీవ్‌ ఆరోగ్యశ్రీ బీమా అమలు చేసింది. నా అభిప్రాయం ప్రకారం ఆర్టీసీ బస్సుల్లో మహిళలను కేవలం పల్లెవెలుగు బస్సులకు మాత్రమే పరిమితం చేసి, లేదా దారిద్రరేఖకు దిగువన ఉన్న వారిని గుర్తించి వారికి ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం మంచింది. లేనిపక్షంలో ఈ పథకం విమర్శలకు గురయ్యే ఆస్కారం ఉంది. ఇక మిగిలిన పథకాలకు ఎంతమంది అర్హులు, ఎంత ఖర్చు అవుతుందనేది రెవిన్యూ ఆదాయం ఎంత, వ్యయం ఎంత అనేది అధికారికంగా అంచనాలు రూపొందించి దశలవారీగా సంక్షేమ పథకాలు అమలు చేయాలి. లేనిపక్షంలో గత ప్రభుత్వం చేసిన అప్పుల వడ్డీలు చెల్లించడానికి రాష్ట్ర రెవిన్యూ ఆదాయం సగంపైగా వెళ్తుందని అధికారుల లెక్కలు తెలియజేస్తున్నాయి. కాబట్టి గత ప్రభుత్వ పథకాలను కొన్నింటిని రద్దుచేసి, కొత్త ప్రభుత్వం ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చెయ్యాలి. ‘‘వ్యక్తి స్వేచ్చను పరిరక్షించేది ఉత్తమ ప్రభుత్వం. ప్రజల హక్కులకు సంపూర్ణ రక్షణ కల్పించి వారిలో రాజకీయ పరిజ్ఞానాన్ని పెంపొందిచుట ద్వారా సంపూర్ణ వికాసానికి తోడ్పడే ప్రభుత్వం ఉత్తమమైనద’’ని బ్రిటిష్‌ తత్త్వవేత్త జాన్‌ స్టువర్ట్‌ మిల్‌ అంటాడు. తెలంగాణ సమాజం ఎన్నో నిర్భంధాలను, బలిదానాలను, అవమానాలను భరించింది. ఇకముందు అలా జరుగకుండా ప్రజాకాంక్ష మేరకు కొత్త ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందని ఆశిద్దాం.