July 15, 2024

బహుజనసమాజ్‌ పార్టీ ఇటీవల వార్తల్లో ఎక్కడ కనబడడం లేదు. పార్టీ కార్యకలాపాలు కూడా పెద్దగా ఉన్నట్లు తెలియడం లేదు. గతవారం బహుజనసమాజ్‌ పార్టీ అధినేత్రి మాయావతి రెండు ప్రకటనలు చేశారు. ఆ రెండు ప్రకటనలు తప్ప మరెలాంటి రాజకీయ కార్యక్రమాలు బహుజనసమాజ్‌ పార్టీ నుంచి కనబడడం లేదు.

ఆ రెండు ప్రకటనలు ఏవంటే, మొదటి ప్రకటన బియస్పీ పార్లమెంటు సభ్యుడు డానిష్‌ అలీ గురించిన ప్రకటన. డానిష్‌ అలీ పై పార్లమెంటులో బీజేపీ సభ్యుడు రమేష్‌ బిధూరి చేసిన అనుచిత వ్యాఖ్యల గురించి చాలా మంది చదివే ఉంటారు. డానిష్‌ అలీని మతపరంగా కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలవి. ఆ వ్యాఖ్యలు రమేష్‌ బిధూరీ చేసినప్పుడు బియస్పీ అధినేత్రి నుంచి డానిష్‌ అలీకి ఎలాంటి మద్దతు లభించలేదు. రమేష్‌ బిధూరికి బీజేపీ వెంటనే రాజస్థాన్‌ ఎన్నికల్లో కీలక బాధ్యతలు కట్టబెట్టి సన్మానించింది. ఆ డానిష్‌ అలీని ఇప్పుడు బియస్పీ అధినేత్రి మాయావతి పార్టీ నుంచి బహిష్క రించింది. ఎందుకు సస్పెండ్‌ చేశారంటే పార్టీ వ్యతిరేక కార్యకలా పాలు చేపట్టినందుకంట? ఆ కార్యకలాపాలేమిటో చెప్పలేదు. కాని, తృణమూల్‌ కాంగ్రెస్‌ నాయకురాలు మహువా మొయిత్రాను బహిష్క రణకు సంబంధించి డానిష్‌ అలీ ఇతర ప్రతిపక్ష నేతలతో వాకౌట్‌ చేశారు. ఆ వెంటనే మాయావతి ఆయన్ను పార్టీ నుంచి బహిష్క రించింది. తాను బియస్పీ పార్టీ కోసం పనిచేశానని, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు ఎక్కడా ఎప్పుడు చేపట్టలేదని, తన నియోజకవర్గం ప్రజలే దానికి సాక్ష్యమిస్తారని డానిష్‌ అలీ ప్రకటించాడు.
డానిష్‌ అలీని బహిష్కరించడం ద్వారా మాయావతి మొత్తం ముస్లిం సమాజానికి ఒక సందేశాన్ని పంపించింది. బియస్పీ పార్టీలో ముస్లిములకు ఎలాంటి ప్రాముఖ్యమూ లేదని స్పష్టంగా చెబుతున్న సందేశమిది. ఉత్తరప్రదేశ్‌ లో ముస్లిములకు లౌకికపార్టీగా బియస్పీపై ఆశలు పెట్టుకోవడం వ్యర్థమని తెగేసి చెప్పిన నిర్ణయమిది.
లోక్‌సభ ఎధిక్స్‌ కమిటి తృణమూల్‌ కాంగ్రెస్‌ సభ్యురాలు మహువా మొయిత్రాను బహిష్కరించాలని చెప్పింది. ఈ కమిటీలో డానిష్‌ అలీ కూడా సభ్యుడు. మహువా మొయిత్రాను కమిటీలో అనుచిత మైన, అమర్యాదకరమైన ప్రశ్నలు అడగడాన్ని డానిష్‌ అలీ అడ్డు కున్నాడు. అభ్యంతర పెట్టారు. అంతేకాదు లోక్‌ సభలో ఈ విషయమై వాకౌట్‌ కూడా చేశారు. మహువా మొయిత్రా విషయంలో ప్రతిపక్ష సభ్యులు వాకౌట్‌ చేశారు. కాని డానిష్‌ అలీ తప్ప బియస్పీ సభ్యు లెవరు వాకౌట్‌ చేయలేదు. డానిష్‌ అలీ వైఖరి సహజంగానే బీజేపికి మింగుడుపడలేదు. కాని మాయావతికి కూడా నచ్చలేదు. బీజేపీకి కోపం వచ్చేలా డానిష్‌ అలీ ప్రవర్తించడం ఆమెకు అస్సలు నచ్చలేదు. కాని బీజేపీ పంచన చేరితే, ఎలా అయితే కర్నాటకలో జనతాదళ్‌ సెక్యులర్‌, కుమారస్వామి నాయకత్వంలో ఇప్పుడు జై బీజేపీ అంటుందో అలా మాయావతి కూడా బీజేపీ వైపు మొగ్గు చూపితే దళిత ఓట్లు కోల్పోవచ్చు. కాబట్టి పూర్తిగా బీజేపీవైపు మొగ్గు చూపినట్లు కనిపించకుండా, లోపాయికారిగా బీజేపీకి కోపం రాకుండా రాజకీయాలు నెట్టుకువస్తున్నారు. మాయావతి బీజేపి పట్ల ఎంత సాన్నిహిత్యం కలిగి ఉన్నారన్నదో చెప్పాలంటే, ఆమె ఎంతగా ముస్లిములకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారో చూడాలి. గత ఎన్నికల్లో మాయావతి ఓటమికి కారణం ముస్లిములు ఓటు వేయక పోవడమే అన్నది ఆమె నమ్మకం. ముస్లిములు బియస్పీని వదిలి సమాజవాది పార్టీ వైపు మొగ్గు చూపడం ఆమెకు నచ్చలేదు. అలా అని ముస్లిముల కోసం ఆమె చేసింది ఏదీ లేదు. దళితుల ఓట్లు ఎలాగూ తనకు తప్పక వస్తాయని, బియస్పీ తప్ప మరే పార్టీ దళితు లకు ఇప్పుడు ప్రత్యామ్నాయం కాదని ఆమె నమ్మకం.
కాని వాస్తవమేమిటంటే, బీజేపీ రాజకీయాలను పరోక్షంగా సమర్థి స్తున్న బియస్పీకి ఇప్పుడు దళితుల్లోను అంత పట్టు ఉన్నట్లు కనిపిం చడం లేదు. దళిత ఓట్లు కూడా ఇప్పుడు బీజేపీ వైపే వెళుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో దళితుల కోసం ఆమె ఇప్పుడు గొంతు విప్పినట్లు ఎక్కడా వినపడడం లేదు. ఉత్తరప్రదేశ్‌లో దళితుల జనాభా 20 శాతం ఉంది. ఉత్తరప్రదేశ్‌ దళితులు దేశంలో మిగిలిన రాష్ట్రా లన్నింటి కన్నా వెనుకబడిన సముదాయం. సియస్డియస్‌ సర్వే ప్రకారం 2022లో కేవలం 23 శాతం జాతవేతర దళితులు మాత్రమే బియస్పీకి ఓటు వేశారు. జాతవుల్లో తప్ప ఇతర సముదాయాల్లో బియస్పీ పలుకుబడి తగ్గిపోయింది. అంతకు ముందు 2017లో దళితుల్లో బియస్పీకి చాలా పట్టు ఉండేది. 2017లో 44 శాతం మంది బియస్పీకి ఓటు వేశారు. అంతకు ముందు 2007లో 71 శాతం మంది వాల్మీకి సముదాయం నుంచి బియస్పీకి ఓటు వేశారు. కాని 2012లో వాల్మీకి సముదాయం ఓట్లు 42 శాతానికి పడిపోయాయి. అలాగే జాతవుల ఓట్లు కూడా 2007లో 86 శాతం బియస్పీకి వచ్చాయి. కాని 2012 నాటికి 62 శాతానికి పడిపోయా యని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. అంటే బియస్పీ ఓటు బ్యాంకు క్రమేణా క్షీణిస్తోంది.
గతంలో చాలా సార్లు ముస్లిములు 50 శాతం వరకు బియస్పీకి ఓటు వేసిన చరిత్ర ఉంది. కాని బియస్పీ ముస్లిముల కోసం చేసింది ఏదీ లేదు. ముస్లిములకు బియస్పీ తప్ప మరో ప్రత్యామ్నయం ఏదీ లేదని, బియస్పీకి తప్ప మరొకరికి ఓటు వేసే పరిస్థితి లేదన్న ధీమా కూడా బియస్పీలో చాలా సార్లు కనిపించింది. అయోథ్యలో, ప్రయాగరాజ్‌ లో, మధురలో అగ్రవర్ణాల కోసం బియస్పీ పెద్ద పెద్ద కార్యక్రమాలు నిర్వహించింది. కాని ముస్లిముల కోసం ఒక్క కార్యక్రమం నిర్వహించిన ఉదాహరణ లేదు. ముస్లిములు బియస్పీ కోసం ఎంత చేసినా వారికి గుర్తింపు లభించడం కష్టమన్నది చాలా సార్లు రుజువయ్యింది. ఇటీవల బియస్పీ సభ్యుడు డానిష్‌ అలీని బిజేపీ సభ్యుడు రమేష్‌ బిధూరి పార్లమెంటులో అత్యంత అనుచితంగా తిట్టినప్పుడు మాయావతి మౌనమే నా భాష అని ఊరుకుంది. డానిష్‌ అలీ కి మద్దతుగా బియస్పీపార్టీ ముందుకు రాలేదు. బీజేపీ సభ్యుడు డానిష్‌ అలీపై చేసిన మతతత్వ వ్యాఖ్యలను విని విననట్లు మాయావతి మిన్నకున్నారు. డానిష్‌ అలీకి మద్దతుగా నిలబడే బదులు ఇప్పుడు అలీని పార్టీ నుంచి బహిష్కరించారు.
డానిష్‌ అలీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ఒక్క ఉదాహరణ కూడా పార్టీ ఇవ్వలేదు. డానిష్‌ అలీని బహిష్కరించడానికి ఒకే ఒక్క కారణం, మహువా మొయిత్రాకు మద్దతుగా డానిష్‌ అలీ నిలబడడం. అంటే బీజేపీకి వ్యతిరేకంగా డానిష్‌ అలీ గొంతు విప్పడం. డానిష్‌ అలీకి బియస్పీ ప్రధాన కార్యదర్శి రాసిన లేఖలో ఏమన్నాడంటే, అనేకసార్లు డానిష్‌ అలీకి మౌఖికంగా, అంటే డానిష్‌ అలీతో మాట్లాడుతూ (దీనికి రుజువులు దొరకడం కష్టం) పార్టీ విధానాలకు, సిద్దాంతాలకు వ్యతిరేకంగా వ్యవహరించవద్దని కోరారట. అయినా డానిష్‌ అలీ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ వచ్చారట. అలా వ్యవహరించిన సంఘటనలేమిటో చెప్పలేదు.
ఇండియా కూటమికి బియస్పీపార్టీ దూరంగా ఉందన్నది అందరికీ తెలిసిన విషయమే. డానిష్‌ అలీ బీహారు ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ ను కలవడం మాయావతికి నచ్చలేదు. ఎందుకంటే, అది బీజేపీకి నచ్చే విధానం కాదు, సిద్ధాంతమూ కాదు.
డానిష్‌ అలీకి అమ్రోహ నియోజకవర్గంలో ఓటర్ల మద్దతు ఉంది. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కుంవర్‌ సింగ్‌ తోమర్‌ ను 63 వేల మెజారిటీతో ఓడిరచారు. బియస్పీలోకి వచ్చిన తర్వాతి నుంచి పార్టీలో మైనారిటీ నాయకుడిగా పేరు సంపాదించాడు. పార్లమెంటులో 98 శాతం హాజరు ఉన్న చురుకైన పార్లమెంటేరియన్‌. పార్టీ తనను బహిష్కరించడంపై డానిష్‌ అలీ మాట్లాడుతూ తన నియోజకవర్గం ప్రజలకు తానేమిటో తెలుసని అన్నాడు. బిజేపీ ప్రజావ్యతిరేక విధానాలను వ్యతిరేకించడమే నేరమైతే ఆ పని చేస్తూనే ఉంటానని కూడా చెప్పాడు.
అలీని బహిష్కరించడం ద్వారా బియస్పీసాధించిందేమిటి? పశ్చిమ ఉత్తర్‌ ప్రదేశ్‌ లో పార్టీ మరింత బలహీనమవుతుంది. ఇంతకు ముందు సహరాన్‌ పూర్‌ జిల్లాకు చెందిన మరో ముస్లిం నాయకుడు ఇమ్రాన్‌ మసూద్‌ ను పార్టీ బహిష్కరించింది. డానిష్‌ అలీ, ఇమ్రాన్‌ మసూద్‌ ఇద్దరు ఇప్పుడు కాంగ్రేసుకు దగ్గరయ్యే అవకాశాలున్నాయి. వీరిద్దరు ఇండియా కూటమి పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. సమాజవాది పార్టీ కూడా ఈ ఇద్దరిని తనవైపు తిప్పుకునే ప్రయత్నాల్లో ఉంది.
కాని ప్రతిపక్షాల్లో అనైక్యత కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు నిజం చెప్పాలంటే ముస్లిములకు, దళితులకు ఆసరగా నిలబడే పార్టీ ఏదీ కనిపించడం లేదు. కాంగ్రెసు, సమాజవాది పార్టీలు ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి పోటీ ఇచ్చే స్థాయిలో ఉన్నాయా అంటే అనుమానమే. ఉత్తర ప్రదేశ్‌లో దళిత, ముస్లిం ఓట్లు మొత్తం 38.5 శాతం ఉంటాయి. కాని కాంగ్రెసు, సమాజవాది పార్టీల అనైక్యత ఈ ఓట్లను చీలిపోయేలా చేస్తోంది. ఇటీవల మధ్యప్రదేశ్‌ ఎన్నికల్లో కాంగ్రెసును ముంచిన కాంగ్రెసు నాయకుడు కమల్‌నాథ్‌ సమాజవాది నాయకుడు అఖిలేష్‌ యాదవ్‌ గురించి అనుచితంగా మాట్లాడడం, దానికి తగ్గట్టుగా అఖిలేష్‌ యాదవ్‌ ప్రతిస్పందించడం అందరికీ తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌, సమాజవాది పార్టీల మధ్య ఎన్నికల పొత్తు కుదురుతుందా అంటే అనుమానమే. బియస్పీ ప్రస్తుతం బీజేపీకి విరుద్ధంగా ఏదీ చేయని స్థితిలో కనిపిస్తోంది. ఏ కూటమిలోను చేరేది లేదని మాయావతి చెప్పేసింది. కాబట్టి 2024 ఎన్నికల్లో మాయావతి ఉత్తరప్రదేశ్‌లో అన్ని చోట్ల పోటీ చేయవచ్చు. అంటే బిజేపీ వ్యతిరేక ఓట్లను చీల్చవచ్చు.
దశాబ్దాల క్రితం బహుజనసమాజ్‌ పార్టీని స్థాపించిన కాన్షీరామ్‌ కేవలం దళితుల కోసం రాజకీయాలు నడిపారు. 1995లో మాయా వతి బియస్పీ అధినేత్రిగా ఇతర వెనుకబడిన వర్గాలను కూడా కలుపుకున్నారు. 1993లో సమాజవాది పార్టీలో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసి విజయాలు సాధించారు. కాని రాజకీయ స్వార్థాలతో ఈ పొత్తు కథ కంచికి వెళ్ళింది. ఆ తర్వాత బిజేపీతో పొత్తు పెట్టుకుని బియస్పీ అధికారం సంపాదించగలిగింది కాని ఆ తర్వాత బీజేపీ బలపడడానికి ఈ పొత్తే ఉపయోగపడిరది. బియస్పీ బలహీనం కావడానికి కారణం కూడా ఇదే.
మాయావతి చేసిన రెండవ ప్రకటన తన మేనల్లుడు ఆనంద్‌ను పార్టీలో వారసుడిగా ప్రకటించడం. ఆనంద్‌ ను వారసుడిగా ప్రకటించి వారసత్వ రాజకీయాలకు బియస్పీ దూరం కాదని నిరూపించేశారు. మరోవైపు బియస్పీకి పోటీగా భీంఆర్మీ పెట్టి చంద్రశేఖర్‌ ఆజాద్‌ రాజకీయాల్లో ఎదగడానికి ప్రయత్నిస్తున్నారు. కాని ఆయన ప్రయత్నాలు ఫలించడానికి ఇంకాచాలా సమయం పట్టవచ్చు. ఉత్తరప్రదేశ్‌ రాజకీయాల్లో దళితశక్తిని ప్రదర్శించిన బియస్పీ కాన్షీరాం కాలం నుంచి నేడు మాయావతి కాలం వచ్చేసరికి రాజకీయంగా పతనావస్థకు చేరుకోవడం శోచనీయం. ముస్లిం ఓట్లే కాదు, వెనుకబడిన వర్గాల ఓట్లు, దళితుల ఓట్లు కూడా పార్టీ కోల్పోతోంది. మరోవైపు ఆనంద్‌ వంటి అనుభవంలేని వ్యక్తి పార్టీని నిలబెడతాడని నమ్మే పరిస్థితులు లేవు. చంద్రశేఖర్‌ ఆజాద్‌ భీం ఆర్మీ ఉత్తరప్రదేశ్‌ లో దళిత రాజకీయాలకు కొత్త ప్రాణం పోస్తుందా? వేచి చూడాలి.

  • – అబ్దుల్ వాహెద్