October 30, 2024

అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవాన్ని భారత మీడియా విస్తృతంగా కవర్‌ చేసింది, ప్రధాన మంత్రి మోడీ ప్రసంగం, మొత్తం కార్యక్రమాన్ని చూపించడమే కాదు ఈ కార్యక్రమం వైభవాన్ని ఘనంగా ప్రసారం చేసింది. అయితే, ది టెలిగ్రాఫ్‌, ది హిందూ, ది వైర్‌ వంటి కొన్ని మీడియా సంస్థలు విమర్శనాత్మక దృక్పథాలను అందించాయి. నలుగురు శంకరా చార్యుల గైర్హాజరు గురించి క్లుప్తంగా ప్రస్తావించారు, విదేశీ మీడియాను చూస్తే, రాయిటర్స్‌, న్యూయార్క్‌ టైమ్స్‌, బిబిసి, వాషింగ్టన్‌ పోస్ట్‌, సిఎన్‌ఎన్‌ బ్లూమ్‌ బర్గ్‌తో సహా విదేశీ మీడియా విమర్శనాత్మక కవరేజీని అందించింది. 2024 ఎన్నికల కోసం మోడీ రాజకీయ ప్రచారంగా దీన్ని అభివర్ణించింది. మతం, రాజకీయాలు కలగలిసిపోవడాన్ని గురించి వాషింగ్టన్‌ పోస్ట్‌ ఆందోళన వ్యక్తం చేసింది.

 

ఒక కవి మనోగతం
బాబరీమస్జిదు విధ్వంసం అన్నది ఒక మస్జిదుపై లేదా ముస్లిము లపై జరిగిన దాడిగా చాలా మంది భావిస్తుంటారు. కాని నిజానికి ఆ రోజు జరిగింది దేశంలోని లౌకికవిలువలపై దాడి. అయోధ్యలో మస్జిదు కూల్చివేత అన్నది నిజానికి భారత దేశంలో లౌకికతత్వం కుప్పకూలిన రోజు. మస్జిదు కూల్చివేత కేవలం ముస్లిములను మాత్రమే బాధించింది అనుకుంటే పొరబాటు. అనేకమంది హిందువులు కూడా ఈ పరిణామాన్ని తీవ్రంగా నిరసించారు.
బహుశా చాలా మందికి జగన్నాథ్‌ ఆజాద్‌ పేరు నేడు గుర్తుండి ఉండదు. ప్రముఖ కవి. పాకిస్తాన్‌ మొదటి జాతీయగీతాన్ని రాసినవాడు. స్వయంగా ముహమ్మద్‌ అలి జిన్నా ఆయన్ను పిలిచి మరీ పాకిస్తాన్‌ జాతీయగీతాన్ని రాయించారు. డిసెంబరు 6వ తేదీన ఆయన జమ్ము నుంచి ఢల్లీికి విమానంలో వస్తున్నారు. బాబరీ మస్జిదు మొదటి గుమ్మటాన్ని కూల్చేశారని విమానంలో తెలిసింది. ఆయన నిర్ఘాంతపోయాడు. ఆగ్రహంతో కంపించి పోయాడు. విమానంలోనే తన ఆగ్రహాన్ని కవితగా మలిచాడు:
యే తూనే హింద్‌ కీ హుర్మత్‌ కే ఆయినేకో తోడా హై
ఖబర్‌ భీ హై తురేa మస్జిద్‌ కీ గుంబజ్‌ తోడ్నే వాలే
(నువ్వు భారత మర్యాదను ముక్కలు చేశావు. మస్జిదును కూల్చిన నీకు ఆ విషయం తెలుసా)
ఈ కూల్చివేత హిందూ ధర్మానికి చాలా నష్టం చేసిందని జగన్నాథ్‌ ఆజాద్‌ భావించారు. అంతర్జాతీయంగా భారత పరువు ప్రతిష్ఠ లను మంటగలిపిన చర్య ఇది. అందుకే చీకటి దినం అయ్యింది.
తేరే ఇస్‌ ఫేల్‌ సే తో ఇస్లామ్‌ కా తో కుఛ్‌ న బిగడా
మగర్‌ ఘోంపా హై ఖంజర్‌ తూనే హిందూ ధర్మ్‌ కే దిల్‌ మేఁ
(నువ్వు చేసిన పని వల్ల ఇస్లామ్‌ నష్టపోలేదు. కాని, హిందూధర్మం గుండెల్లో బాకు దించావు)
ఇధర్‌ హిందూస్తాన్‌ కా చహరా తూనే మస్క్‌ కర్‌ డాలా
ఉధర్‌ బోయే హైఁ తూనే కాంటే ఇస్కీ రాహె మంజిల్‌ మేఁ
(నువ్వు భారత ముఖచిత్రానికి మసిపూశావు. భారత ప్రగతి బాటన ముళ్ళు పరిచావు)
హిందూధర్మంలో హిందూత్వ రాజకీయాలకు ఎలాంటి చోటు లేదని జగన్నాథ్‌ ఆజాద్‌ భావించారు. బాబరీ మస్జిదును కూల్చిన వారు హిందూధర్మం అసలు విలువలను గ్రహించలేదని అనేవారు. హిందూ విలువల గురించి తెలిసినవారు ఇలాంటి పని చేయరని చెప్పేవారు.
మస్జిదు మొత్తం కూల్చివేయడం జరిగిందని తెలిసిన తర్వాత ఈ దాడి భారత సంస్కృతిపై జరిగిన దాడిగా భావించారు.
వో తహ్జబీ తసల్సుల్‌ జోథా జారీ చార్‌ సదియోఁసే
తూ సంఝా హై న రహ్ పాయేగీ ఉస్కీ దాస్తాఁ బాకీ
(నాలుగు శతాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్న సాంస్కృతిక పరంపర. ఇక ముగిసిపోతుందనుకున్నావా)
ఈ దేశ ప్రజలు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుతారని నమ్మే వారాయన:
అభీ యే సర్‌ జమీన్‌ ఖాలీ నహీ హై నేక్‌ బందోఁ సే
అభీ మౌజూద్‌ హై తూటే హువే దిల్‌ జోడ్నే వాలే
(దేశంలో మంచివాళ్ళు ఇంకా వున్నారు. పగిలిన హృదయాలను కలిపేవారు ఇంకా వున్నారు)
జరిగింది అదే. బాబరీ మస్జిదు కూల్చివేత జరిగినప్పుడు దేశం లోని నాలుగు రాష్ట్రాల్లో బిజేపి అధికారంలో వుంది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆ నాలుగు రాష్ట్రాల్లోను ఓడిపోయింది.
జగన్నాథ్‌ ఆజాద్‌ 2004లో మరణించారు.
ఇప్పుడు కూడా లౌకిక ప్రమాణాలను హృదయాలకు హత్తుకునే వారు చాలా మంది ఉన్నారు.
కోల్‌కతాలో జరిగిన ‘యాంటీ-ఫాసిస్ట్‌ గ్రాండ్‌ కాన్ఫరెన్స్‌’ అనే ర్యాలీలో వేలాది మంది ప్రజలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వం మతపరమైన అజెండా కొనసాగించడాన్ని వారు వ్యతిరేకించారు. ప్రజాస్వామిక సంఘాలు, రైతులు, విద్యార్థులు, కళాకారులు, సామాజిక కార్యకర్తల సంస్థలతో సహా 190 కి పైగా సంఘాలు ఈ ర్యాలీలో పాల్గొన్నాయి. మతతత్వ రాజకీయాల పట్ల ఆందోళన వ్యక్తం చేశాయి. శాంతి, ఉపాధి, విద్య వంటి సమస్యలను ప్రధాని నిర్లక్ష్యం చేశారని కొందరు విమర్శించారు. కలకత్తా విశ్వవిద్యాలయానికి చెందిన ఒక విద్యార్థి, ముఖ్యంగా కొత్త విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ, విద్యార్థుల పట్ల ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. చరిత్రను, రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో రక్షించడమే ఈ ర్యాలీ లక్ష్యమని చెప్పారు. పురులియాకు చెందిన ఒక కళాకారుడు ద్వేషం కంటే ప్రేమ ముఖ్యమని నొక్కిచెప్పారు.
బాబ్రీ మస్జిదు – రామ మందిరం వివాదాన్ని 2019లో చట్ట పరంగా పరిష్కరించేశామన్నారు. ఈ కోర్టు తీర్పు తర్వాత ఇలాంటి వివాదాలు ఇక ఉండవని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. నాలుగు సంవత్సరాల తరువాత ఆలయ ప్రారం భోత్సవంతో దేశంలో రాజకీయ, సైద్ధాంతిక, సామాజిక, పౌర స్వభావాన్ని మార్చే కొత్త అధ్యాయం ప్రారంభమైనట్లు కనిపిస్తోంది. రామజన్మభూమి ఉద్యమం ఒక రాజకీయ ప్రణాళిక అని 1980 ల్లోనే స్పష్టమైంది. అప్పటి నుండి భారతీయ జనతా పార్టీ కేవలం రామ మందిరం అనే ఒకే ఒక్క ఎజెండాతో ఎదిగింది. భారత రాజకీయాల్లో మతతత్వం, మెజారిటీ వాదాలకు పునాదులు అలా పడ్డాయి. బీజేపీ ఎన్నికల విజయాలు ఈ మార్పుకు సూచనలు. ప్రాణ ప్రతిష్ఠకు సంబంధించి ప్రజలలో స్పష్టమైన ఉత్సాహం చూస్తుంటే ప్రస్తుత వాతావరణం ఎలా ఉందో అర్థమవుతుంది.
ఆలయ నిర్మాణానికి అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్ణయం హిందువులకు ముస్లిములకు మధ్య దీర్ఘకాల వివాదాలకు ముగింపు పలకడంలో విఫలమైంది. ఇది నిరంతర సంఘర్షణ లకు దారితీసిందని తర్వాతి పరిణామాలను గమనిస్తే అర్థమవు తుంది.
న్యాయం జరిగిందా?
1992లో బాబ్రీ మస్జిదును కూల్చివేయడంతో అయోధ్యలో రామ మందిరానికి పునాది వేశారు. కూల్చివేత చట్టవిరుద్ధమని సుప్రీం కోర్టు 2019లో తీర్పు ఇచ్చినప్పటికీ, దీనికి బాధ్యులైన వారిని శిక్షించలేదు. భూమి హక్కుపై జరిగిన చట్టపరమైన పోరాటం చివరకు జనవరి 22న రామ మందిర ప్రతిష్ఠకు మార్గం సుగమం చేసింది. 2020 నాటి కోర్టు తీర్పులో అద్వానీ నిర్దోషిగా విడుదలయ్యారు. 2022లో ఇద్దరు ముస్లిం లిటిగెంట్లు దాఖలు చేసిన అప్పీల్ను కొట్టివేయడం జరిగింది. మూడు దశాబ్దాల పాటు సాగిన అయోధ్య కేసులో బాబరీ మస్జిదు కూల్చివేత దోషులకు శిక్షలు పడలేదు. బాబరీ మస్జిదు కేసులో సాక్ష్యాధారాల ప్రాతిపదికన తీర్పు ఇచ్చారా? లేక అధిక సంఖ్యాకుల మనోభావాల ప్రాతిపదికన తీర్పు చెప్పారా అనే ప్రశ్న ఎవరికి వారు తీర్పు పాఠం చదివి తెలుసుకోవడమే ఉత్తమం.
న్యాయస్థానం రామ మందిర నిర్మాణానికి అనుకూలంగా తీర్పు ఇచ్చి, న్యాయం గురించి ప్రశ్నలను లేవనెత్తింది. న్యాయ నిపుణులు, రిటైర్డ్‌ న్యాయమూర్తులతో సహా విమర్శకులు ఈ తీర్పును మెజారిటీ విశ్వాసాల ప్రతిబింబంగా భావించి విమర్శిం చారు. అయోధ్య తీర్పులో పాల్గొన్న న్యాయమూర్తుల నియా మకాలు, నామినేషన్లను సూచిస్తూ అనేక ఆరోపణలు వెలువడ్డాయి.
2017 లో అయోధ్య వివాదానికి వ్యక్తిగతంగా ‘‘మధ్యవర్తిత్వం’’ చేయడానికి ముందుకొచ్చిన భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జెఎస్‌ ఖేహర్‌, ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో హాజరైన పలువురు మాజీ న్యాయమూర్తులలో ఒకరు.
జస్టిస్‌ ఖేహర్‌తో పాటు, మరో ముగ్గురు మాజీ ప్రధాన న్యాయ మూర్తులు-జస్టిస్‌ వి ఎన్‌ ఖరే, జస్టిస్‌ ఎన్‌ వి రమణ, జస్టిస్‌ యు యు లలిత్‌ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
సుప్రీంకోర్టుకు చెందిన డజనుకు పైగా మాజీ న్యాయమూర్తులు కూడా హాజరైనట్లు తెలిసింది. ఈ జాబితాలో జాతీయ మానవ హక్కుల కమిషన్‌ చైర్పర్సన్‌ జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, నేషనల్‌ కంపెనీ లా అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌ చైర్పర్సన్‌ జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ ఉన్నారు.
1992లో బాబ్రీ మస్జిదు కూల్చివేత సమయంలో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వ న్యాయవాదిగా ఉన్న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఆదర్శ్‌ గోయల్‌ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. న్యాయమూర్తులు వి. రామసుబ్రమణ్యం, అనిల్‌ దవే, వినీత్‌ శరణ్‌, జ్ఞాన్‌ సుధా మిశ్రా కూడా హాజరైనట్లు తెలిసింది. అయోధ్య వివాదంలో 2010 హైకోర్టు తీర్పులో భాగమైన అలహాబాద్‌ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ సుధీర్‌ అగర్వాల్‌ కూడా ఆలయ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. అయోధ్యలోని వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని సున్నీ వక్ఫ్‌ బోర్డు, నిర్మోహి అఖాడా, రామమందిరం మధ్య మూడు భాగాలుగా విభజించా లని 2:1 నిష్పత్తిలో హైకోర్టు కోరింది. జస్టిస్‌ ఎస్‌.యు. ఖాన్‌, డి. వి. శర్మ మెజారిటీని ఏర్పాటు చేయగా, కేవలం అగర్వాల్‌ మాత్రమే హిందూ పక్షానికి అనుకూలంగా తీర్పు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భారత మాజీ అటార్నీ జనరల్‌, రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ట్రస్టీ, హిందూ పక్షం తరఫున సుప్రీంకోర్టులో వాదనలు వినిపించే బృందంలో భాగమైన సీనియర్‌ న్యాయవాది సిఎస్‌ వైద్యనాథన్‌ పాల్గొన్నారు.
కాస్త చరిత్ర
బాబ్రీ మస్జిదు కూల్చివేత 1992లో జరిగింది. ఆ తర్వాత 1993లో కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం చేసింది. ఇది అయోధ్యకు సంబంధించిన చట్టం. ఎక్విజిషన్‌ ఆఫ్‌ సర్టయిన్‌ ఏరియా ఎట్‌ అయోధ్య యాక్ట్‌ దీనిపేరు. ఈ చట్టంలోని కొన్ని నిబంధనలకు వ్యతిరేకంగా కొందరు సుప్రీంకోర్టులో కేసు వేశారు. 1994లో ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ చట్టం సరయిందేనని చెప్పింది. ఈ చట్టం వివాదాస్పద స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అధికారం కల్పించే చట్టం. సుప్రీంకోర్టుకు వెళ్ళింది ఇస్మాయీల్‌ ఫారూకీ. అందుకే దీన్ని ఫారూకీ కేసుగా కూడా వ్యవహరిస్తారు. ఈ తీర్పులో సుప్రీంకోర్టు ఇస్లాంలో మస్జిదు కీలకమైనది కాదని, నమాజు ఎక్కడైనా చేసుకునే అవకాశం ఇస్లాంలో ఉందని చెప్పింది. అంతేకాదు, అలా చెప్పడం ద్వారా వివాదాస్పద స్థలంలో హిందువులకు పూజలు చేసే అనుమతి ఇవ్వడం జరిగింది. ముస్లిముల నమాజుకు ఆంక్షలు పెట్టారు. న్యాయవాది రాజీవ్‌ ధవన్‌ ప్రకారం సుప్రీంకోర్టు రెండు మతాల మధ్య చూపించిన విభేదం సరయినది కాదు.
1994 సుప్రీంకోర్టు తీర్పులో మస్జిదు ఇస్లాంలో ముఖ్యమైనది కాదని, నమాజు ఎక్కడైనా చేసుకోవచ్చని చెప్పింది కాని విచిత్రమేమంటే నోయిడా తదితర ప్రాంతాల్లో శుక్రవారం బహిరంగ ప్రదేశాల్లో నమాజు చదవకుండా అడ్డుకోవడమే కాదు, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ వంటి బిజేపి నేతలు నమాజు మస్జిదుల్లోనే చేసుకోవాలని, బహిరంగ ప్రదేశాల్లో చేయరాదని అన్నారు. సుప్రీంకోర్టు ఒక మాట చెప్పింది, బిజేపి నేతలు మరో మాట చెప్పారు.
అసలిప్పటి వరకు బాబ్రి మస్జిదు రామజన్మభూమి వివాదంలో ఎన్ని తీర్పులు వచ్చాయన్నది కూడా ఆసక్తికరమైన అంశం. 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత హనుమాన్‌ గఢీ మహంత్‌ బాబ్రీ మస్జిదు దగ్గర ఒక అరుగును కట్టాడు. బాబ్రి మసీదు మౌజన్‌ ఫిర్యాదు తర్వాత 1861లో బ్రిటీషు ప్రభుత్వం అక్కడ మస్జిదుకు, ఆ అరుగుకు మధ్య గోడ కట్టింది. 1886 వరకు అక్కడ వివాదాస్పద ప్రాంతం ఆ అరుగు మాత్రమే. 1949 డిసెంబరు 22 అర్థరాత్రి తర్వాత అక్కడ రామ్‌లల్లా విగ్రహాలు అకస్మాత్తుగా మస్జిదులో వచ్చాయి. 1949 డిసెంబరు 29న మేజిస్ట్రేట్‌ మార్కండేయ సింగ్‌ బాబ్రి మసీదు స్థలాన్ని ఎటాచ్‌ చేసి ప్రియాదత్‌ రాంను రిసీవర్‌గా నియమించాడు. 1950లో సివిల్‌ జడ్జ్‌ చడ్డా తీర్పు మొదట వచ్చింది. వివాదాస్పద స్థలంలో విగ్రహాలను తొలగించకుండా నిషేధాజ్ఞలు జారీ చేసిన తీర్పు అది. ఆ తర్వాత 1986లో ఫైజాబాద్‌ జిల్లా కోర్టు తీర్పులో విగ్రహాలకు, భక్తులకు మధ్య ఎలాంటి బారికేడ్లు పెట్ట వలసిన అవసరం లేదని వాటిని తొలగించింది. 1992 మస్జిదు కూల్చివేత తర్వాత పివి నరసింహారావు ప్రభుత్వం కోర్టులో యథాతథ స్థితి కొనసాగించాలని కోరింది. 2001లో స్పెషల్‌ జడ్జి యస్‌.కే.శుక్లా అద్వానీ తదితరులపై కేసు కొట్టేశారు. 2003లో అలహాబాద్‌ హైకోర్టు ఆర్కియాలాజికల్‌ సర్వేతో అక్కడ తవ్వకాలు జరిపి మస్జిదుకు ముందు మందిరం ఉండేదేమో చూడమని చెప్పంది. 1994లో సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. ఇస్లాంలో మస్జిదు ఎసెన్షియల్‌ పార్ట్‌ అంటే ముఖ్యమైనది కాదని, ముస్లిములు ఎక్కడైనా, బహిరంగ ప్రదేశంలో అయినా నమాజు చేసుకోవచ్చని పేర్కొంది. 2010లో అలహాబాద్‌ హైకోర్టు తీర్పు వచ్చింది. ఈ వివాదంలో మూడు పక్షాలకు, అంటే సున్నీవక్ఫ్‌ బోర్డుకు, రామ్‌లల్లా న్యాస్‌కు, నిర్మోహీ అఖాడాకు మూడు సమానభాగాలుగా భూమి పంచింది. 2011లో సుప్రీంకోర్టు ఈ తీర్పుపై స్టే ఇచ్చింది. 2017లో అద్వానీ తదితరులపై కేసు మరలా ప్రారంభమైంది. డిసెంబర్‌ 5, 2017 నుంచి అయోధ్య వివాదంలో 13 అప్పీళ్ళపై సుప్రీంకోర్టు విచారణ ప్రారంభించింది.
ఏ.జి.నూరానీ రాసిన పుస్తకం ది బాబ్రీ మస్జిద్‌ క్వశ్చన్‌: 1528 టు 2003లో అనేక వివరాలు ఇచ్చారు. మొగల్‌ చక్రవర్తి బాబర్‌ సైనికాధికారి రామజన్మభూమి వద్ద ఉన్న మందిరాన్ని కూల్చి 1528లో రామమందిరం కట్టించాడన్నది ఆరోపణ. ఈ రామమందిరం శ్రీరామచంద్రుడి జన్మస్థలమని కూడా అంటారు. 1855లో అయోధ్యలో హిందువులకు ముస్లిములకు మధ్య దీని గురించి సాయుధ ఘర్షణ జరిగిందని అంటారు. కాని చరిత్ర కారుడు కే.యం. పనిక్కార్‌ రాసిన పుస్తకం Aఅa్‌శీఎవ శీట a జశీఅటతీశీఅ్‌a్‌ఱశీఅ: Aవశీసష్ట్రవa aఅస ్‌ష్ట్రవ Rఱంవ శీట జశీఎఎబఅaశ్రీ ూశీశ్రీఱ్‌ఱషం ఱఅ Iఅసఱa ప్రకారం 1855లో జరిగిన ఘర్షణ హనుమాన్‌ గఢీ మందిరానికి సంబంధించింది. 1857 తర్వాత బాబ్రిమస్జిదు బయట హనుమాన్‌ గఢీ మహంత్‌ ఒక అరుగు కట్టించాడు. దాన్ని రామ్‌ చబుత్రా అంటారు.1883లో మహంత్‌ రఘుబర్‌ దాస్‌ ఆ చబుత్రా వద్ద మందిర నిర్మాణం ప్రారంభిం చాడు. అభ్యంతరాల తర్వాత నిర్మాణం ఆగిపోయింది. 1885లో మహంత్‌ ఫైజాబాద్‌ జిల్లా కోర్టులో కేసు వేశాడు. కాని అక్కడ మందిర నిర్మాణానికి అనుమతిస్తే సమస్యలు తలెత్తుతాయని సబ్‌ జడ్జి పండిత్‌ హరికిషన్‌ అనుమతి నిరాకరించారు. 1886 వరకు వివాదం కేవలం చబుత్రాకు సంబంధించింది మాత్రమే. 1946లో మస్జిదును వక్ఫ్‌ ఆస్తిగా ప్రకటించడం జరిగింది.
ఆరు దశాబ్దాల క్రితం అంటే 1949 డిసెంబరులో బాబ్రీ మస్జిద్‌ లోపల శ్రీరామచంద్రుడి విగ్రహాలు పెట్టారు. పండిత్‌ అభిరామ్‌ దాస్‌ నాయకత్వంలో యాభై అరవై మంది కలిసి 1949 డిసెంబర్‌ 22 అర్ధరాత్రి తర్వాత బాబ్రిమస్జిదు లోపల విగ్రహాలు ఉంచారన్న ఆరోపణలున్నాయి. ధీరేంద్ర కే. రaా రాసిన పుస్తకం అయోధ్య ది డార్క్‌ నైట్‌లో దీనికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. ఈ కుట్ర మొత్తం మేజిస్ట్రేట్‌ గురుదత్‌ సింగ్‌ ఇంటనే జరిగిందని ఆరోపణలు వినవచ్చాయి. బాబ్రి మస్జిదులో రాముడి విగ్రహాలు ప్రత్యక్షమయ్యాయన్న వార్త విని వేలాది మంది అక్కడికి వచ్చారు. నినాదాలు చేశారు. భజనలు మొదలయ్యాయి. జిల్లా యంత్రాంగం ఏమీ చేయలేదు.
ఆ విగ్రహాల తర్వాతి నుంచి రామమందిర ఉద్యమం ప్రారంభ మైంది. ఈ రోజు దేశంలో రాజకీయాలు మలుపు తిరగడానికి కారణమైంది. 1986 ఫిబ్రవరిలో 1వ తేదీన ఫైజాబాద్‌ జిల్లా కోర్టు జడ్జి కే.యం.పాండేకు ఇక్కడ ఒక కోతి జెండాస్తంభాన్ని పట్టుకుని ఉండడం కనిపించింది. ప్రజలు దానికి పండ్లు ఇస్తు న్నారు. కాని అది తినకపోవడం చాలా విచిత్రంగా ఉందని పాండేగారు అనుకున్నారు. ఆ తర్వాత ఆయన బాబ్రీ మస్జిదు గేటు తాళాలు తెరవాలన్న కేసు విచారణకు వెళ్ళారు. కాంగ్రేసు ప్రభుత్వాలు అప్పట్లో ఉన్నాయి. ఎలాంటి శాంతిభద్రతల సమస్య ఉండదని హామీ అధికారులు ఇచ్చేశారు. భక్తులకు దర్శనం కోసం బాబ్రీ గేట్లు తెరిచేశారు. ఇలా చేయడం వల్ల కొంపలేమీ అంటుకుపోవని జడ్జిగారు వ్యాఖ్యానించారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. ఈ తీర్పు దైవికంగా ఇచ్చానని పాండే తన జీవిత కథలో రాసుకున్నాడు.
1981లో తమిళనాడులోని మీనాక్షిపురంలో 200 దళిత కుటుంబాలు ఇస్లాం స్వీకరించాయి. ఆ తర్వాత విశ్వహిందూ పరిషద్‌ నిర్వహించిన ధర్మసంసద్‌లో రామజన్మభూమి పునర్ని ర్మాణం హిందూధర్మ పరిరక్షణ లక్ష్యంగా పేర్కొన్నారు. ఆ తర్వాత కరసేవకుల బైక్‌ ర్యాలీలు జరిగాయి. విహెచ్‌ పీ రామమందిర నిర్మాణ ఉద్యమం ప్రారంభిస్తే, మరోవైపు 62 సంవత్సరాల షాబానో విడాకుల తర్వాత భరణం కోసం కేసు పెట్టింది. సుప్రీం కోర్టు అనుకూలంగా తీర్పు చెప్పింది. రాజీవ్‌ గాంధీ ముస్లిం మహిళల భరణం చట్టం చేశారు. బిజేపి వెంటనే ముస్లింల బుజ్జగింపని ఆరోపణలతో హోరెత్తించింది. ఫిబ్రవరి 1989లో విహెచ్‌ పీ శిలాన్యాస్‌ ప్రకటించింది. విరాళాలు భారీగా వచ్చాయి. దేశవ్యాప్తంగా రామశిలలు సేకరించారు. హిందువు లను బుజ్జగించడానికి రాజీవ్‌ గాంధీ శిలాన్యాస్‌కు పూర్తిగా సహకరించారు. దీనికి కారణం రాజీవ్‌ గాంధీకి ఎన్నికల్లో వెళ్ళ వలసిన అవసరం ఉండడమే. బోఫోర్సు స్కాముతో సతమత మవుతున్న రాజీవ్‌ గాంధీ శిలాన్యాస్‌కు సహకరించడం వల్ల ప్రజా మద్దతు లభిస్తుందని ఆశించారు. రామ మందిర నిర్మాణా నికి పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత వి.పి.సింగ్‌ మండల్‌ ఉద్యమానికి మద్దతిచ్చారు, దాన్ని అడ్డుకోవడానికి కమండల్‌ రాజకీయాలు మొదలయ్యాయి. అద్వానీ సోమనాథ్‌ నుంచి అయోధ్యకు రథయాత్ర చేపట్టారు. విపిసింగ్‌ ప్రభుత్వంలో ఉన్న బిజేపి అప్పుడు విపిసింగ్‌ ప్రభుత్వం పడిపోయేలా చేసింది. కరసేవకు రథయాత్ర చేస్తూ అయోధ్య బయలుదేరిన అద్వానీని 1990 అక్టోబర్‌ 9న బీహారులో లాలూ ప్రసాద్‌ యాదవ్‌ అరెస్టు చేశారు. ఆ తర్వాత బిజేపి విపిసింగ్‌ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించింది. రథయాత్ర సందర్భంగా దేశవ్యాప్తంగా అల్లర్లు జరిగాయి. అద్వానీ జైల్లో ఉన్నా సరే విహెచ్‌ పీ కరసేవకు ముందుకు వెళ్ళింది. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్న ములాయం సింగ్‌ యాదవ్‌ అయోధ్యకు ఎవరు వెళ్ళకుండా రోడ్డు రైలు మార్గాలు మూసేశారు. అయినా కరసేవకులు అయోథ్య చేరుకున్నారు. కాల్పులు జరిగాయి. పదిహేను మంది మరణించారు. చివరకు కరసేవకులు బాబ్రి మస్జిదులో రామ్‌ లల్లాకు పూజలు చేసుకోడానికి ములాయం అనుమతించారు. 1992 అక్టోబర్‌లో విహెచ్‌ పీ ధర్మసంసద్‌ నిర్ణయం ప్రకారం డిసెంబర్‌ 6వ తేదీన అయోధ్యకు కరసేవకులు బయలుదేరారు. ఆ రోజు పొద్దుట 6 గంటల నుంచే జర్నలిస్టులు కరసేవకులు అక్కడికి చేరుకున్నారు. పది గంటల వరకు అద్వానీ, మురళీ మనోహర్‌ జోషీ వంటి నేతలు కూడా చేరుకున్నారు. కరసేవ కేవలం అక్కడి అరుగును కడిగి శుభ్రం చేయడానికి మాత్రమే అన్నారు. 12 గంటలకు విజిల్‌ శబ్దం వినిపించింది. శిక్షణ పొందిన మాదిరిగా యువ కరసేవకులు బాబ్రి మస్జిదుపైకి ఎక్కి బాబ్రీ మస్జిద్‌ను కూల్చడం ప్రారంభించారు. లోపల ఉన్న రాముడి విగ్రహాలను భద్రతా దళాలు వేరే చోటికి తరలించాయి. సాయంత్రం 5 గంటల వరకు మస్జిద్‌ కూల్చివేత జరిగి పోయింది. అప్పటికప్పుడు ఒక టెంటు నిర్మించి విగ్రహాలు అక్కడ పెట్టి పూజలు కూడా ప్రారంభించారు.
బాబ్రీ మస్జిదు కూల్చివేతకు ఒక్క రోజు ముందు లక్నోలో కరసేవకులను ఉద్దేశించి వాజపేయి మాట్లాడారు. ఆయన ఏం చెప్పారో ఇంటిలిజెన్సు విభాగం రికార్డు చేసిన వీడియో ఔట్‌ లుక్‌ విడుదల చేసింది. కోర్టు తీర్పు మనకు అనుకూలంగా వస్తే మందిర నిర్మాణం సులభమవుతుంది అంటూ ఆ ప్రదేశంలో యజ్ఞానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని, రేపు ఏమవుతుందో చెప్పలేను. నేను కూడా అయోధ్య వెళ్ళాలనుకున్నాను. కాని ఢల్లీి వెళ్ళవలసి ఉంది అన్నారు.
కరసేవకు అనుమతి కేవలం భజనలు, కీర్తనలు, అక్కడ పరి శుభ్రం చేయడానికి మాత్రమే ఉంది. కాని ఒక పథకం ప్రకారం కూల్చివేత జరిగిందని అక్కడ ప్రత్యక్షంగా చూసిన పాత్రికేయులు చెప్పారు. ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఫోటో జర్నలిస్టుగా అప్పుడు పనిచేసిన ప్రవీణ్‌ జైన్‌ తాను చూసింది వివరించాడు. డిసెంబర్‌ 5వ తేదీన రిహార్సల్‌ జరిగిందని అన్నాడు. దానికి సంబంధించిన వివరాలు కూడా ఆయన తెలియజేశాడు.
వేలాది కరసేవకులు ఇందులో పాల్గొన్నారు. బాబ్రీ మస్జిదు రామజన్మభూమి వివాదం రాజకీయ రంగు పులుముకోవడం అన్నది మీనాక్షీపురంలో దళితులు ఇస్లాం స్వీకరించిన సంఘటన తర్వాత ప్రారంభమైంది. కాని ఒక విచిత్రమైన విషయమేమంటే, కరసేవలో పాల్గొన్న బల్బీర్‌ అనే కరసేవకుడు తర్వాత ముహమ్మద్‌ ఆమీర్‌గా మారిపోయాడు. పానిపట్‌లో దౌలత్‌ రామ్‌ కుమారుడు బల్బీర్‌ బాబ్రి మస్జిదు కూల్చినవాడు. ఆరెస్సెస్‌ ప్రేరణ, శిక్షణ పొందినవాడు. ఎక్స్‌ప్రెస్‌ ట్రిబ్యూన్‌ వార్త ప్రకారం అతనే కాదు అతని మిత్రుడు యోగేంద్రపాల్‌ కూడా బాబ్రి కూల్చివేతలో పాల్గొన్న కరసేవకుడు, యోగేంద్రపాల్‌ తర్వాత ముహమ్మద్‌ ఉమర్‌ అయ్యాడు. బాబ్రి కూల్చిన దోషభావన వెంటాడుతుందని అందుకే 100 మస్జిదులను పునర్నిర్మించే కార్యక్రమం చేపట్టామని అన్నాడు.
2002లో వాజపేయి ప్రభుత్వం హిందు-ముస్లింల మధ్య చర్చల కోసం అయోధ్య సెల్‌ ప్రారంభించింది. 2002లో అయోధ్య వెళ్లి వస్తున్న కరసేవకుల రైలుపై దాడి జరిగింది. దానిని తగుల బెట్టారు. ఈ ఘటనలో 58 మంది హిందువులు చనిపోయారు. దీనికి ప్రతిగా గోద్రా అల్లర్లు జరిగాయి. అందులోను వందలాది మంది ముస్లింలు చనిపోయారు. గుజరాత్‌ ఘోరకలి తర్వాత దేశంలో మతతత్వ రాజకీయాలు మరింత పెరిగాయి. 2009 జూన్‌లో లిబర్హాన్‌ కమిషన్‌ మస్జిదు కూల్చివేతపై నివేదిక ఇచ్చింది. రామమందిర ఉద్యమానికి సారధి అద్వానీ. 1990లో రథయాత్రలతో ఆయన నడిపిన ఉద్యమమే, దేశంలో మత కల్లోలాలకు, బాబ్రీ కూల్చివేతకు కారణమవ్వడమే కాదు, 1984లో లోక్‌సభలో కేవలం 2 సీట్లున్న బిజేపికి 1986లో 85 స్థానాలు లభించడానికి కారణం బాబ్రీ మస్జిదు రామజన్మ భూమి వివాదం. 1991లో 120 స్థానాలు, 1996లో అతిపెద్ద పార్టీగా 161 స్థానాలు, 1998లో 182 స్థానాలు, 1999లో 180 స్థానాలు గెలుచుకున్న పార్టీ ఆ తర్వాత రామమందిర ఉద్యమం వెనక్కి వెళ్ళడంతో, 2004లో 138 స్థానాలు, 2009లో 116 స్థానాలకు పడిపోయింది. 2014లో అచ్ఛేదిన్‌, అవినీతి నిర్మూలన వంటి నినాదాలతో 282 సీట్లు గెలుచుకుంది. అద్వానీ రథయాత్రలకు వెనుక ఉండి నిర్వహణ బాధ్యతలు చూసిన నరేంద్రమోడీ 2014లో ప్రధాని అయ్యారు. 2017 ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో కూడా బిజేపి మేనిఫెస్టోలో రామమందిర నిర్మాణం అలాగే ఉంది. ఇప్పుడు కూడా బీజేపీ రాజకీయాలు కేవలం మందిరం చుట్టు మాత్రమే తిరుగుతున్నాయి.
చేదు జ్ఞాపకాలు
ఒకప్పుడు మొఘల్‌ కాలం నాటి మస్జిదు ఉన్న ప్రదేశంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆలయాన్ని ప్రారంభించిన రోజున, 1992లో కూల్చివేసిన చారిత్రాత్మక బాబరీ మస్జిదును సోషల్‌ మీడియాలో ప్రజలు గుర్తు చేసుకున్నారు.
దీaపతీఱ వీaంjఱస, దీaపతీఱ ్గఱఅసa నaఱ హ్యాష్‌ ట్యాగులు ట్రెండ్‌ అయ్యాయి. అమెరికాలో దక్షిణాసియా చరిత్ర ప్రొఫెసర్‌ అయిన డాక్టర్‌ ఆడ్రీ టుస్క్‌, ‘‘ఈ రోజు, జనవరి 22, భారతదేశానికి, ముస్లింలకు, హిందువులకు విభిన్న విధాలుగా చీకటి రోజు’’ అని పోస్ట్‌ చేశారు. గ్లోబల్‌ పబ్లికేషన్‌ టైమ్స్‌ కోసం రాసిన తన కథనాన్ని ఆమె పంచుకున్నారు, ఇందులో బాబరీ స్థలంలో ఆలయ నిర్మాణాన్ని ‘‘హిందూ ఆధిపత్యానికి స్మారక చిహ్నం’’ గా అభివర్ణించారు. ‘‘అయోధ్య ఆలయ ప్రారంభోత్సవం భారతదేశంలోని ముస్లింలకు మాత్రమే కాదు, బహుళత్వం, మత సహనానికి కట్టుబడి ఉన్న చాలా మంది హిందువులకు కూడా ఇది చీకటి కాలాన్ని సూచిస్తుంది’’ అని ఆమె రాశారు.
గ్లోబల్‌ జర్నలిస్ట్‌ రాణా అయూబ్‌ ట్వీట్‌ చేస్తూ ‘‘ఈ రోజు అధికారంలో ఉన్నవారి క్రూరమైన మెజారిటీవాదాన్ని మాత్రమే కాదు, ఒకప్పుడు మతతత్వానికి వ్యతిరేకంగా ఉన్న వారి నిశ్శబ్దాన్ని కూడా సూచిస్తుంది’’ అని అన్నారు.
ప్రముఖ పాత్రికేయుడు ఆర్ఫా ఖానమ్‌ మాట్లాడుతూ, ‘‘1992 నాటి మతపరమైన అల్లర్ల నుండి ప్రాణాలతో బయటపడిన వ్యక్తిగా, నా చుట్టూ జరుగుతున్నది చాలా కలవరపెట్టేది, భయపెట్టేది. 1992 డిసెంబర్‌ 6, 2024 జనవరి 22 రెండిరటినీ ఒకే జీవితకాలంలో చూసినందుకు నా తరం శపించబడిరది’’ అని అన్నారు.
అయోధ్యలో ఒక వృద్ధ ముస్లిం వ్యక్తి తన సమీపంలో నిర్మిస్తున్న ఆలయం గురించి అడిగినప్పుడు బాబరీ మస్జిదును నిర్మించ డానికి ఏ ఆలయాన్ని కూల్చివేయలేదని ఒక విలేఖరితో వాదిస్తున్న వీడియో వైరల్‌ అయ్యింది. ఒత్తిడిలో ఆలయానికి అనుకూలంగా తీర్పు ఇచ్చారని ఆ వ్యక్తి చెప్పాడు.
ముంబైకి చెందిన జర్నలిస్ట్‌ పార్థ్‌ ఎమ్‌ఎన్‌ మాట్లాడుతూ ‘‘భారతదేశంలో అత్యంత రాజ్యాంగ విరుద్ధమైన సంఘటనలకు ప్రసిద్ధి చెందిన హింసాత్మక ప్రదేశం మోడీ 2024 ప్రచారానికి లాంచింగ్‌ ప్యాడ్‌ కావడం సముచితమని నేను భావిస్తున్నాను. అదే బిజెపి లక్ష్యం’’ అని ఆయన అన్నారు.
కొంతమంది సోషల్‌ మీడియా యూజర్లు అయోధ్యలో ఆలయ ప్రారంభోత్సవానికి హాజరైన ప్రముఖులను బహిష్కరించాలని కూడా పిలుపునిచ్చారు.
‘‘ఇది ఒక నాగరికతను పునరుద్ధరించడం లేదా ఒక సమాజాన్ని మేల్కొల్పడం కాదు. ఇది మెజారిటీ ఆధిపత్యాన్ని విధించడం, దేశంలోని ముస్లిం జనాభాను అధికారికంగా రెండవ తరగతి పౌరులకు తగ్గించే హిందూ రాష్ట్ర అధికారిక ముద్ర’’ అని ఎక్స్‌ యూజర్‌ సైఫ్‌ పటేల్‌ పోస్ట్‌ చేశారు.
హింసాకాండ – ఆర్థికనష్టాలు
జనవరి 22 న, అయోధ్యలో రామ మందిర ప్రాణప్రతిష్ఠ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ టెలివిజన్‌ సందేశంలో శాంతి సామ రస్యాల గురించి నొక్కి చెప్పారు. అయితే, మహారాష్ట్ర, గుజరాత్‌, మధ్యప్రదేశాల్లో హింస చెలరేగింది. వివిధ ప్రదేశాలలో ఘర్షణలు జరిగాయి. పూణేలోని ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాలో బయటి వ్యక్తులు ఒక బ్యానర్కు నిప్పు పెట్టడంతో శాంతియుత నిరసన హింసాత్మకంగా మారింది. విద్యార్థులపై దాడి జరిగిందని, కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. ముంబై శివారు ప్రాంతాలు, ఐఐటి బొంబాయి, టిఐఎస్‌ఎస్‌ ముంబైలలో కూడా ఇలాంటి సంఘట నలు జరిగాయి. హైదరాబాదులో ఒక డాక్యుమెంటరీ ప్రదర్శ నకు అంతరాయం కలిగింది, సంగారెడ్డిలో ముస్లింలకు చెందిన దుకాణాలపై దాడి జరిగింది. గుజరాత్‌లోని మెహసానాలో రామ్‌ ‘శోభ యాత్ర’ సందర్భంగా రాళ్లు రువ్వడం జరిగింది. కేరళలో విద్యార్థులు నిరసనలను ఎదుర్కొన్నప్పటికీ డాక్యుమెంటరీని ప్రదర్శించగలిగారు. ఈ సంఘటనలు పరిశీలిస్తే రామ మందిరం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా ఉద్రిక్తతలు రెచ్చగొట్టి మతపరంగా ఓటర్లను విభజించే కార్యక్రమం చురుకుగా జరుగుతుందన్నది స్పష్టమవుతోంది.
అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఇక్కడి పట్టణ మౌలిక సదుపాయాలు, ఆర్థిక వ్యవస్థలో పలు మార్పులకు దారితీసింది. ఈ అభివృద్ధి, కొత్త రోడ్లు, సౌకర్యాలు పట్టణానికి కొత్త రూపాన్ని తెచ్చినప్పటికీ, అనేక ఇళ్లు, దుకాణాలను కూల్చివేయడం జరిగింది, స్థానిక చిరువ్యాపారులు నష్టపోయారు. చాలా మంది స్థానికులు తమ కూల్చివేసిన ఆస్తులకు తగిన పరిహారం పొంద లేదు. ఆలయ నిర్మాణం ఆస్తి ధరలను, రియల్‌ ఎస్టేట్‌ లావా దేవీలను పెంచింది, అనేకమంది వ్యక్తిగతంగా ఆర్థిక నష్టాలను అనుభవిస్తున్నారు.
ముస్లింల యాజమాన్యంలోని వ్యాపారాలు, ముఖ్యంగా మాంసం వ్యాపారం అనధికారిక నిషేధాల వల్ల ఆంక్షల కారణంగా నష్టాలను చవిచూశాయి. ఈ సవాళ్లు ఉన్నప్పటికీ, కొంతమంది స్థానికులు ఆలయానికి మద్దతు ఇస్తుంటే, మరికొందరు జీవనోపాధులను దెబ్బతీశారని ఆరోపిస్తున్నారు.
స్వాతి కృష్ణ ‘ది వైర్‌’లో రాసిన వ్యాసం ప్రకారం- అయోధ్యలోని రామ మందిర నిర్మాణం వార్తలు వస్తున్నాయి, కాని తెరవెనుక భారీగా భూఆక్రమణలు కొనసాగాయి. తెరవెనుక, విశ్వ హిందూ పరిషత్‌ – రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఫ్‌ులు పెద్దస్థాయిలో భూములను తమ హస్తగతం చేసుకున్నాయని ఆమె రాశారు. దీనివల్ల బీజేపీకి ప్రయోజనం కలుగుతుందని అన్నారు. రహదారి విస్తరణ, సుందరీకరణ ప్రాజెక్టుల కోసం సుమారు 4,000 దుకాణాలు, ఇళ్ళు కూల్చివేయబడ్డాయి.
విహెచ్‌పి రామ మందిరం కోసం విరాళాలను సేకరిస్తోంది, అయోధ్యలోని చాలా పెద్ద స్థలాలు విహెచ్‌పి – ఆర్‌ఎస్‌ఎస్‌ నియంత్రణలో ఉన్నాయని, ఈ భూములను ఒత్తిడితో సహా అనేక పద్ధతులతో స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. స్థానిక బిజెపి నాయకులు అదానీ గ్రూపుతో సహా ఇతర వ్యాపార సంస్థల మధ్య భూ లావాదేవీలు వెలుగులోకి వచ్చాయి.
రామమందిర ప్రారంభోత్సవానికి హాజరు కాని అద్వానీయే ఈ రామజన్మభూమి ఉద్యమాన్ని ప్రారంభించిన నాయకుడు. 1992 డిసెంబర్‌ 6 బాబరీ కూల్చివేత తర్వాత దీన్నంతటిని ప్రారం భించిన ఎల్‌. కె. అద్వానీ, తన సన్నిహిత సహాయకుడు ప్రమోద్‌ మహాజన్‌తో, ‘‘నా ఉద్యమాన్ని నాశనం చేశారు’’ అని అన్నారని ఆరతి ఆర్‌ జెరాత్‌ క్వింట్‌ లో రాశారు.
కూల్చివేత తరువాత జరిగిన గందరగోళ సంఘటనలు అద్వానీ మాటలు నిజమని నిరూపించాయి. ఒక సంవత్సరం తరువాత, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ అనే మూడు ఉత్తరాది రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి ఓడిపోయింది.
అద్వానీ స్థానంలో అటల్‌ బిహారీ వాజపేయి అందరికీ ఆమోద మైన వ్యక్తిగా సంకీర్ణ ప్రభుత్వానికి అధిపతిగా బీజేపీ అధికారం లోకి వచ్చింది.
2014లో నరేంద్ర మోడీ పూర్తి మెజారిటీతో బీజేపీని కొత్త శిఖరాలకు తీసుకెళ్లినప్పటికీ దాని హోదా మారలేదు. ఆ సంవత్సరం పార్టీ మేనిఫెస్టోలో మోడీ ‘‘సబ్‌ కా సాథ్‌ సబ్‌ కా వికాస్‌’’, ‘‘అచ్ఛేదిన్‌’’ అని ఎన్నికల్లో పాల్గొన్నారు. ఆలయం గురించి రెండు పంక్తుల ప్రస్తావన మాత్రమే కనిపించింది.
మూడు దశాబ్దాల తరువాత, పరిస్థితి పూర్తిగా మారింది.
మూడవసారి గెలవడానికి ఇప్పుడు అదే పాత మతతత్వ ఎజెండా కావలసి వచ్చింది.
మోడీకి ఇప్పుడు ఉన్న సవాలు ఏమిటంటే పాతబడిన ఆయుధానికే మళ్ళీ పదునుపెట్టి రాజకీయ యుద్ధం చేయాలను కుంటున్నారు. ప్రతి సంస్థ – రామ్‌ మందిర్‌ ట్రస్ట్‌, బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌, విహెచ్‌పి, బీజేపీ అనుబంధ సంస్థలన్నీ-జనవరి 22న ఆలయ ప్రారంభోత్సవాన్ని ‘ది గ్రేటెస్ట్‌ షో ఆన్‌ ఎర్త్‌’ గా మార్చడానికి తీవ్రంగా కృషి చేశాయి.
బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులు దేశవ్యాప్తంగా యాత్రలు, సమావేశాలు, ర్యాలీలు, కీర్తనలు వంటి కార్యక్రమాలు నిర్వహిం చారు. రామ్‌ ధున్‌ మొబైల్‌ ట్యూన్లు వచ్చాయి. పోస్టర్లు మూలమూలన కనిపించాయి. కాషాయ జెండాలు దేశమంతా ఊరూరా, ఇంటింటా ఎగురుతున్నాయి. పండుగ వాతావరణం అందరికీ ఇష్టమే. మోడీ ఈవెంట్‌ మేనేజర్ల బృందం జనవరి 22వ తేదీ ఒక దీపావళిగా మార్చాలని భావిస్తోంది. అద్వానీ తన మందిర ఉద్యమంతో హిందూ ముస్లిం విభజన చేయగలిగారు. మోడీ తన వైఖరితో హిందువుల్లోను, సాధువులు, సంతుల్లోను విభజన తేగలిగారు.
చాలా రాజకీయ పార్టీలు, ముఖ్యంగా మస్జిదుకు తాళాలు తెరిచి, దానిని తాత్కాలిక రామాలయంగా మార్చడానికి దారి వేసిన కాంగ్రెస్‌ పార్టీ కూడా ఈ కార్యక్రమాన్ని బహిష్కరిస్తోంది.
నాలుగు ప్రధాన హిందూ పీఠాలకు నాయకత్వం వహిస్తున్న శంకరాచార్యులు, నిర్మోహి అఖాడా ప్రతిస్పందన ఆశ్చర్యకర మైనది. ఆలయ ప్రారంభోత్సవం, విగ్రహ ప్రాణప్రతిష్ఠ హిందూ సంప్రదాయాలు, ఆచారాలకు అనుగుణంగా జరగడం లేదని అందరూ ఆందోళన వ్యక్తం చేశారు. విమర్శల గురించి మోడీ అంతగా ఆందోళన చెందుతున్నట్లు కనిపించడం లేదు. ప్రతి పక్షాల బహిష్కరణ తర్వాత ఈ పార్టీలు ‘హిందూ వ్యతిరేకం’ అని ప్రచారం చేసుకునే అవకాశం లభిస్తుంది. శంకరాచార్యుల ఆందోళనలను టెంపుల్‌ ట్రస్ట్‌ కార్యదర్శి, విహెచ్‌పి నాయకుడు చంపత్‌ రాయ్‌ కొట్టిపారేశారు.
రామమందిర నిర్మాణంతో మోడీ హామీ నిలబెట్టుకున్నానని అంటారు. మరో రెండు మస్జిదులను స్వాధీనం చేసుకునే పనులు జరుగుతున్నాయి, ఒకటి మథురలోని షాహి ఈద్గా వద్ద కృష్ణ జన్మభూమి ఆలయం కోసం, మరొకటి వారణాసిలోని జ్ఞానవ్యాపి మస్జిదు. మోడీ మరిన్ని హామీలు కూడా ఇస్తున్నారు. ఇది ఎడతెగని కార్యక్రమం. ఎన్నికల్లో ప్రయోజనం పొందడానికి వేసవి వరకు ఆయన ఈ వేగాన్ని కొనసాగించగలరా అనేది ప్రశ్న. ఆర్థిక రంగంలో, ముఖ్యంగా ఉద్యోగ కల్పనలో ఆయన ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోవడాన్ని ఓటర్లు విస్మరిస్తారా? మే 2024లో మనకు తెలుస్తుంది.
2019లో నరేంద్ర మోడీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారంలోకి రావడంలో పుల్వామా విషాదం, బాలాకోట్‌ వైమానిక దాడులు ప్రధాన పాత్ర పోషించాయని మాజీ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ చాలాకాలంగా చెబుతున్నారు. ఆయన ప్రకారం, 2024 సార్వత్రిక ఎన్నికలలో అధికారాన్ని నిలుపు కోవటానికి బిజెపి ఇలాంటి ప్రయత్నం మరోసారి చేయవచ్చు అని కూడా అన్నారు. అయోధ్యలోని రామ మందిరం చుట్టూ బీజేపీ, దాని అనుబంధ సంస్థలు సృష్టిస్తున్న వాతావరణం అదే దిశలో కొనసాగుతోంది.
ఈ వాతావరణంలో బాలల హక్కుల న్యాయవాది, రచయిత్రి సురన్యా అయ్యర్‌ మాట్లాడుతూ, జనవరి 20 నుండి 72 గంటల ఉపవాసం చేసి పశ్చాత్తాపం చేసుకుంటున్నానని, ఇది ముస్లింల పట్ల ‘‘72 గంటల ప్రేమ, దుఃఖాల ప్రకటన’’ గా అభివర్ణించారు. ఆమె మొఘల్‌ వారసత్వం పట్ల గర్వంగా ఉందన్నారు. ఇలాంటి భావోద్వేగాలు కూడా శాంతియుత వాతావరణానికి మంచిది కాదు.
ఏది ఏమైనా ఇప్పుడు రాజకీయ యుద్ధానికి ఏర్పాట్లు మొదలయ్యాయి.
జనవరి 22న అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని ‘బహిష్కరించాలని’ తీసుకున్న నిర్ణయం వల్ల రాజకీయ నష్టాల గురించి చాలా విశ్లేషణలు ఇప్పుడు వస్తున్నాయి. చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు 2019లో మోడీ విజయరథాన్ని విజయ వంతంగా అడ్డుకున్నాయి. 2024లో కూడా ఇదే జరగవచ్చు. ఆ మేరకు, ఇండియా కూటమి భాగస్వాముల మధ్య విజయ వంతమైన సీట్ల భాగస్వామ్య ఏర్పాటు ఈ రాష్ట్రాల్లో బిజెపిని మట్టి కరిపించవచ్చు.
ఉత్తర భారతదేశంలో, మధ్య భారతదేశంలో, పశ్చిమ భారత దేశంలో చాలా రాష్ట్రాల్లో కాంగ్రెసు బిజెపితో ముఖాముఖి తలపడుతున్న రాష్ట్రాల్లో బీజేపీని దెబ్బతీసే స్థితిలో కాంగ్రెసు ఉందా? రాజస్థాన్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, హర్యానా, హిమాచల్‌ ప్రదేశ్‌, ఢల్లీి ఉత్తరాఖండ్లలో కాంగ్రెస్‌ 50 సీట్లను గెలుచుకుంటేనే బీజేపీ సీట్ల సంఖ్య తగ్గుతుంది. కాని ఇప్పుడు ఈ రాష్ట్రాల్లో అలాంటి పరిస్థితి లేదు.
సంఫ్‌ు పరివార్‌ మద్దతు, బలీయమైన సంస్థాగత యంత్రాంగం బీజేపీకి ఉన్నాయి. కాంగ్రెస్‌ హిందూ వ్యతిరేకం అనే ప్రచారాన్ని బీజేపీ తీవ్రస్థాయిలో చేస్తోంది. మైనారిటీ ఓట్లు కాంగ్రెస్‌ పార్టీకి పడతాయి. పెద్ద సంఖ్యలో హిందూ ఓటర్లను బిజెపి నుండి దూరం చేయడమే ఇప్పుడు కాంగ్రెసుకు కీలకం. రామమందిర నిర్మాణం అనేది హిందువుల మనోభావాలకు సంబంధించిన ఈ సమస్య విషయంలో బహిష్కరణ నిర్ణయం ద్వారా హిందూ ఓటర్లను కాంగ్రెసు దూరం చేసుకుంటుందనే ప్రచారం ఇప్పుడు మొదలయ్యింది. చాలా మంది తటస్థ విశ్లేషకులు కూడా ఈ బహిష్కరణ వల్ల కాంగ్రెసు చాలా కోల్పోతుందని అంటున్నారు. కాని విలువలు ప్రధానమైన రాజకీయాలను మనం కావాలను కుంటే ఎలాంటి వైఖరి తీసుకోవాలో అదే వైఖరి రాహుల్‌ గాంధీ తీసుకున్నారు. మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కమల్‌నాథ్‌ సాఫ్ట్‌ హిందూత్వ ద్వారా హిందూ ఓటర్లను బుజ్జగించడానికి చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. రాజస్థాన్‌, జార్ఖండ్‌లలో ఇదే జరిగింది. నిజానికి రాహుల్‌ గాంధీ బలంగా కులజన గణన గురించి మాట్లాడుతున్నప్పటికీ కాంగ్రెసు పార్టీలోని వివిధ రాష్ట్రాల నాయకులు ఈ కులజనగణను పట్టించుకున్నట్లే కనిపించడం లేదు. కాంగ్రెసు పార్టీ నేతలు తమ స్వభావాన్ని మార్చుకుని విలువలు ప్రధానంగా రాజకీయాలను కొనసాగిస్తే దీర్ఘకాలికంగా కాంగ్రెసుకు అది ప్రయోజనకరం అవుతుంది.
లౌకికవాదం?
ప్రస్తుతం పరిస్థితి ఏమిటంటే, ఒక ప్రైవేట్‌ ట్రస్ట్‌ నిర్వహించిన ప్రతిష్ఠాపన కార్యక్రమం రోజున అనేక రాష్ట్రాలు ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాయి. ఒకప్పుడు తమదే అసలైన లౌకికవాదం అని అద్వానీ వంటి బీజేపీ నేతలు చెప్పుకునేవారు. ఇప్పుడు తమదే అసలైన హిందూత్వమని కాంగ్రెసు నేతలు చెప్పుకుంటు న్నారు. పరిస్థితి ఎలా మారిందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.
అప్పుడు లౌకికవాదం ఒక నిషిద్ధపదంగా రాజకీయ పార్టీలకు మారిపోతోంది? బహుళత్వం అనేది అర్థం లేనిదిగా మారి పోతోంది.
లంబీ హై గమ్‌ కీ షామ్‌ మగర్‌ షామ్‌ హీ తో హై అన్నాడు ఫైజ్‌ అహ్మద్‌ ఫైజ్‌. ఈ చీకటి రాత్రి సుదీర్ఘమైనదే కావచ్చు. కాని వెలుగు తెరలు లేపే పగలు రాకపోదు.
లౌకికవాదాన్ని కోరుకునే వారు, శాంతియుత సహజీవనాన్ని అభిలషించేవారు సంఖ్యాపరంగా తక్కువ లేరు. అది బెంగాల్‌ ముఖ్యమంత్రి బహుళ విశ్వాస యాత్ర కావచ్చు లేదా భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర కావచ్చు. స్థిరమైన సంకల్పంతో ఈ ప్రయత్నాలు జరగవలసిన అవసరం ఉంది.