December 6, 2024

న్యాయం కోసం నిలబడడం వారి ధార్మిక బాధ్యత అని, దౌర్జన్యాలు, దుర్మార్గాలను తొలగించి న్యాయాన్ని స్థాపించడానికి ప్రయత్నించాలని జమాఅతె ఇస్లామీ హింద్ జాతీయ అధ్యక్షులు సాదతుల్లా హుస్సేనీ జమాఅత్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
దివ్యఖుర్ఆన్ కూడా ఇదే చెబుతుంది.
‘‘విశ్వసించిన ప్రజలారా! అల్లాహ్ కొరకు సత్యంపై స్థిరంగా ఉండండి. న్యాయానికి సాక్షులుగా ఉండండి. (ఏదైనా) వర్గంతో ఉన్న వైరం కారణంగా మీరు ఆవేశానికి లోనయి న్యాయాన్ని త్యజించకండి. న్యాయం చెయ్యండి. ఇది దైవభక్తికి సరిసమానమైనది’’ (దివ్యఖుర్ఆన్: 5:8)

కాబట్టి న్యాయం లేనిదే రాజ్యం లేదు. ధర్మం లేనిదే మనిషి జీవితమే లేదు. ధర్మేన హీనం ఖలు జీవితం…
ధర్మం న్యాయం చేయాలని చెబుతుంది.
న సత్యాత్పరమో ధర్మో, నానృతాత్పతకం పరమ్ – సత్యం కంటే గొప్ప ధర్మం లేదు, అనృతవచనం అంటే అబద్దం కంటే పాతకం లేదని సుభాషితాలు చెబుతున్నాయి.
ధర్మం సత్యాం పలకాలని చెబుతుంది. సత్యం న్యాయాన్ని నిలబెడుతుంది. న్యాయాన్ని నిలబెట్టడం ధార్మిక బాధ్యత.
సత్యేన ధార్వతే పృధ్వి, సత్యేన తపతీ రవీ
సత్యాన్నే భూమి ధరించింది… సత్యం వల్లనే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. కాని మనిషి సత్యాన్ని వదిలి అన్యాయాంధకారంలో కూరుకుపోతున్నాడు. న్యాయం అంటే సమన్యాయం, న్యాయం సమక్షంలో సమానత్వం. సమన్యాయాన్ని కాపాడితేనే సమాజంలో శాంతి, సుహృద్భావం, సామరస్యం, సంతోషం ఉంటాయి.
అందుకే ‘‘న్యాయధ్వజవాహకులుగా నిలబడంది’’ అనే నినాదంతో జమాఅతె ఇస్లామీ హింద్ హైదరాబాద్ నగరంలో సదస్సు నిర్వహించింది.
దివ్యఖుర్ఆన్ న్యాయం గురించి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
‘‘న్యాయధ్వజవాహకులుగా నిలబడండి. అల్లాహ్ కొరకు సాక్షులుగా ఉండండి. మీ న్యాయం, మీ సాక్ష్యం మీకూ, మీ తల్లిదండ్రులకూ, మీ బంధువులకూ ఎంత హాని కలిగించినా సరే. కక్షిదారులు భాగ్యవంతులయినా, నిరుపేదలయినా అల్లాహ్ వారి శ్రేయస్సును మీకంటే ఎక్కువగా కాంక్షిస్తాడు. కనుక మీ మనోవాంఛలను అనుసరిస్తూ న్యాయం నుండి వైదొలగకండి. మీరు గనక సాక్ష్యాన్ని వక్రీకరిస్తే, న్యాయాన్ని దాటవేస్తే, బాగా తెలుసుకోండి, మీరు చేసేదంతా అల్లాహ్ కు తెలుసు అని.’’ (4:135)
ఈ ఖుర్ఆన్ వాక్యం ప్రేరణగా జమాఅతె ఇస్లామీ హింద్ సమన్యాయం కోసం పిలుపునిస్తూ ఈ సదస్సు నిర్వహించింది.
జమాఅతె ఇస్లామీ హింద్ గత ఏడు దశాబ్దాలుగా దేశంలో ధార్మిక, సామాజిక సేవలందిస్తోంది.
జమాఅతె ఇస్లామీ హింద్ మూడురోజుల సదస్సు ముగింపు సందర్భంగా జమాఅత్ అధ్యక్షులు సయ్యద్ సాదతుల్లా హుస్సేనీ ప్రసంగం ఈ సందర్భంగా గమనార్హమైనది. న్యాయం కోసం సత్యం కోసం సాక్షులుగా నిలబడడం ప్రతి ముస్లిం బాధ్యత అని ఆయన అన్నారు. అన్యాయాలు, దౌర్జన్యాలను తొలగించి సమన్యాయస్థాపన కోసం ప్రయత్నించాలని పిలుపునిచ్చారు. నిజానికి సమాజంలో శాంతిసౌహార్థత సంతోషాల కోసం అందరూ చేయవలసిన పని ఇది.  ఒక మెరుగైన సమాజం ఏర్పడాలంటే ఈ పని అందరూ చేయవలసిన పని. అల్లర్లు, ఉద్రిక్తతలు, అన్యాయాలు లేని సమాజం ఎలా సాధ్యమో చూపించాలి. రవీంద్ర నాథ్ ఠాగూర్ తన కవితలో అలాంటి సమాజాన్నే కోరుకున్నారు.
భయాందోళనలు లేని,
తల ఎత్తుకుని బతికే
జ్ఞానం అందరికీ లభించే
సంకుచితత్వం గోడలు లేని
సత్యం లోతుల నుంచి మాటలు వినిపించే … స్వేచ్ఛా స్వరం వంటి సమాజాన్ని ఆయన తన కవితలో అభిలషించారు. అలాంటి సమాజం ఏర్పడాలంటే న్యాయాన్ని, సత్యాన్ని కాపాడడం అందరి బాధ్యత. అదే బాధ్యతను జమాఅత్ అధ్యక్షులు గుర్తు చేశారు.
జమాఅతె ఇస్లామీ హింద్ సభ్యులు కార్యకర్తలందరూ నాలుగు పనులు తప్పనిసరిగా చేయాలన్నారు. అవేమిటంటే – సత్యసందేశ ప్రచారం, సంస్కరణ, ప్రక్షాళన, సేవా కార్యక్రమాలు.
దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు మారాలంటే ప్రజాభిప్రాయాన్ని మార్చడానికి మనమందరం ధైర్యంగా, నిలకడగా ఈ ప్రయత్నాలు కొనసాగించడం అవసరమన్నారు. సమన్యాయం కోసం ప్రయత్నించడం మనందరి బాధ్యత. ‘‘న్యాయధ్వజవాహకులుగా నిలబడండి’’ అనే నినాదం వెనుక ఉద్దేశ్యం ఇదే. జమాఅత్ అధ్యక్షులు ఈ సందర్భంగా మాట్లాడుతూ నిజానికి ప్రపంచంలో దైవప్రవక్తలందరి రాక వెనుక ముఖ్యఉద్దేశ్యం సమన్యాయ స్థాపనే అన్నారు. సమన్యాయంలో న్యాయం మాత్రమే కాదు, సమానత్వం కూడా ఉంది. ఇస్లాం ధర్మశాస్త్రం చెప్పేది ఇదే. న్యాయం, సమానత్వం ఈ రెంటి మధ్య తేడా లేదు. సమాజంలో న్యాయసూత్రాల ఉల్లంఘన జరిగితే మనుషుల ధోరణులు, వైఖరులు మారిపోతాయి. ఆచరణలు మారిపోతాయి. సమతుల్యం చెడిపోతుంది. ఈ పతనాన్ని నివారించే ఏకైక మార్గం దైవం ప్రసాదించిన, ఉద్బోధించిన సమన్యాయ సూత్రాలను అమలులో పెట్టడం. ఇస్లామీయ విధానం సమన్యాయం అయితే, ఇస్లామీయ వైఖరి సమతుల్యం అని ఆయన వివరించారు.
ప్రపంచంలో ఇప్పుడు న్యాయం అడుగంటిపోతున్న పరిస్థితిని ఆయన ప్రస్తావించారు.  ఆలోచనల పరమైన అనేక అసమతుల్యాలు వ్యాపించడం వల్ల మానవజీవితం నరకతుల్యమైందని చెప్పారు. విద్వేషాన్ని ప్రచారం చేయడం, రెచ్చగొట్టడం, ద్వేషాన్ని సాగు చేయడం జరుగుతోంది. వైరాలు ప్రోత్సహించడం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో సమన్యాయం కోసం నిలబడడ వలసిన అవసరం ఉందని చెప్పారు. పరిస్థితులను చూసి నిరాశపడకుండా సంకల్పబలంతో ముందుకు సాగాలని ఉత్సాహపరిచారు. జమాఅత్ కార్యకర్తలు, సభ్యులు సమాజంలోని అన్ని వర్గాల్లో పనిచేయాలని పిలుపునిచ్చారు. రానున్న సంవత్సరం 2025 RISE గా ఆయన అభివర్ణించారు. ఇందులో R అంటే Reach Out అంటే అన్ని వర్గాల వారిని, అన్ని సముదాయాల వారిని చేరుకోవడం, ప్రజాసంబంధాలను పెద్ద స్థాయిలో పెంచుకుని సమన్యాయం కోసం పనిచేయడం. ఇందులో I అంటే ఇండివిడ్యువల్ కాంట్రీబ్యూషన్. ఇది చాలా ముఖ్యమైనది. ఎవరేం చేశారని, కాదు ప్రతి వ్యక్తి తానేం చేస్తున్నాడో ఆలోచించుకోవాలి. తన పరంగా ఎంత వరకు పనిచేశాడో బేరీజే వేసుకోవాలి. తన వ్యక్తిత్వాన్ని సమాజానికి లాభదాయకమైనదిగా మార్చుకోవడం. ఇందులో S అంటే షిఫ్ట్ ఇన్ పబ్లిక్ ఒపీనియన్. అంటే ప్రజాభిప్రాయంలో మార్పును సాధించడం. ప్రస్తుతం వ్యాపిస్తున్న విద్వేష వాతావరణాన్ని మార్చాడానికి ఇదెంతో అవసరం. సమన్యాయం, సమానత్వాల పట్ల ప్రజల్లో చైతన్యాన్ని అవగాహనను పెంచడం ద్వారా ప్రజాభిప్రాయాన్ని నిర్మాణాత్మకంగా ప్రభావితం చేయడం. ఇక చివరి అక్షరం E అంటే ఎంగేజ్ మెంట్. అంటే పెద్ద స్థాయిలో సామాజిక కార్యక్రమాలు, కార్యకలాపాలు, అన్ని సముదాయాలను కలుపుకుని, అన్ని వర్గాలతో కలిసి నడవడం. సంబంధాలు పెంచుకోవడం. అందరినీ కలుపుకుని ముందుకు సాగడం. ఈ నాలుగు పనులను ఆచరణలో పెడుతూ రానున్న సంవత్సరం 2025 RISE సంవత్సరంగా అందరూ పూనుకోవాలని పిలుపునిచ్చారు.
పరిస్థితులు నిరాశాజనకంగా ఉన్నాయన్నది నిజమే అయినా, నిరాశకు గురికారాదని, పరిస్థితుల్లో నిర్మాణాత్మక మార్పును సాధించే ప్రయత్నాలు కొనసాగించాలని ప్రోత్సహించారు. దేశంలో కాని, ప్రపంచవ్యాప్తంగా కాని పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉన్నాయన్నది వాస్తవమే, కాని పరిస్థితులకు నిరుత్సాహపడడం కార్యసాధకుల లక్షణం కాదు. పరిస్థితులను మార్చుకునే ప్రయత్నాలు చేయాలని అంటూ దివ్యఖుర్ఆన్ బోధనలు, ప్రవక్త ప్రవచనాల వెలుగులో పరిస్థితులను తట్టుకుని నిలబడాలని చెప్పారు. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయని నిందించే బదులు పరిస్థితులను అనుకూలంగా మార్చుకోడానికి, పరిస్థితుల ప్రవాహాన్ని మలుపు తిప్పడానికి ప్రయత్నించాలని ఉత్సాహం నింపారు. ప్రస్తుత కాలం పరీక్షలు, కఠినసవాళ్ళ కాలమే అయినా ప్రయత్నాలను స్థిరంగా కొనసాగించడం అవసరమన్నారు. పలస్తీనా పరిస్థితులను ఆయన ప్రస్తావించారు. గాజాలో జరుగుతున్నది మానవసంహారం. అలాంటి పరిస్థితిలో కూడా గాజా ప్రజలు త్యాగాల చరిత్రను రాసుకుంటున్నారని చెప్పారు. గాజాలో చిన్నపిల్లలు కూడా ద్వంసమైన తమ ఇంటి శిధిలాలపై కూర్చుని దుర్మార్గదౌర్జన్యాలపై గొంతు విప్పుతున్నారని చెప్పారు. త్యాగనిరతి, స్వేచ్ఛాకాంక్ష ఇవి ముస్లిమ్ సమాజానికి దివిటిల్లా దారి చూపుతాయని వివరించారు. దైవప్రవక్తలు, ప్రవక్త సహచరుల జీవితాలు కూడా కఠినసవాళ్ళతో గడిచాయని, కాని వారి సంకల్పబలం, స్థిరచిత్తం చరిత్రను మలుపు తిప్పిందని చెప్పారు.
జమాఅత్ అధ్యక్షుల ప్రసంగం ప్రస్తుతం ప్రతి ఒక్కరు అవలంబించవలసిన వైఖరి ఎలా ఉండాలో తెలియజేస్తోంది. ‘‘న్యాయధ్వజవాహకులుగా నిలబడండి’’ అనే నినాదంలో సమాజసంక్షేమం ఉంది.

– వాహెద్