January 28, 2025

ప్రధాని మోడీ ఇటీవల ప్రసంగాల్లో చెబుతున్న మాట, కాంగ్రెసు పార్టీ ఓబీసీ రిజర్వేషన్లను ముస్లిములకు పంచేస్తుందని చెప్పడం. హిందువుల ఆస్తులు ముస్లిములకు పంచేస్తుందని, ఓబీసీ రిజర్వేషన్లను ముస్లిములకు పంచేస్తుందని దేశప్రజలను భయపెడుతున్నారు. ఇది కొత్త ఎత్తుగడ కాదు. 2015 బీహారు ఎన్నికల్లోను ఇలాంటి మాటలే చెప్పారు.  మోడీ కేవలం కాంగ్రెసుపై మాత్రమే దాడి చేయడం లేదు, దేశంలోని ముస్లిం సముదాయంపై దాడి చేస్తున్నారు. అమిత్ షా ముస్లిములకు రిజర్వేషన్లు రద్దు చేస్తామని కూడా ప్రకటించారు.
ఈ వ్యాఖ్యలు బాధ్యతారహితంగా చేస్తున్న వ్యాఖ్యలు. వృత్తిరీత్యా గుర్తించిన వెనుకబడిన సముదాయాలు ముస్లిముల్లోను ఉన్నాయి. పస్మాందా ముస్లిములుగా అంటే ముస్లిముల్లో వెనుకబడిన సముదాయాలుగా వీరికి కూడా రిజర్వేషన్ల యోగ్యత ఉంది. ఈ రిజర్వేషన్లు ఇప్పుడు కొత్తగా వచ్చినవి కావు. చాలా కాలంగా ఉన్నవే. బీహారులో ఈ రిజర్వేషన్లు 1970 నుంచి ఉన్నాయి. మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో బీజేపీ గత 15 సంవత్సరాల నుంచి అధికారంలో ఉంది. స్వయంగా మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా 12 సంవత్సరాలు పనిచేశారు. గుజరాత్ లోని 22 ముస్లిం వెనుకబడిన సముదాయాలకు రిజర్వేషన్లున్నాయి. అప్పట్లో ఈ రిజర్వేషన్ల గురించి ఒక్క ముక్క మోడీ మాట్లాడలేదు. మధ్యప్రదేశ్ లో 27 ముస్లిం వనుకుకబడిన సముదాయాలకు రిజర్వేషన్లున్నాయి. వాటి గురించి మోడీ ఎన్నడూ మాట్లాడలేదు.
గమనించవలసిన విషయమేమిటంటే, మోడీ ప్రధానిగా వచ్చిన కొత్తలో ఓడిశాలో జరిగిన కాంక్లేవ్ లో మోడీ స్వయంగా ముస్లిముల్లో వెనుకబడిన సముదాయాలున్నాయన్న మాట చెప్పారు. ముస్లిం ఓబీసీలకు కూడా ప్రయోజనాలు అందాలని చెప్పారు. 2022లో మోడీ పస్మాందా ముస్లిములను బీజేపీవైపు తిప్పుకోవాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. స్నేహయాత్రలు ప్రారంభించారు. అప్పట్లో ఆల్ ఇండియా పస్మాందా ముస్లిం మహాజ్ వ్యవస్థాపకుడు అలీ అన్వర్ మాట్లాడుతూ తమకు స్నేహయాత్రలు అవసరం లేదని, సమ్మాన్ కావాలని కూడా వ్యాఖ్యానించారు. చివకు పస్మాందా ముస్లిములకు స్నేహమూ లభించలేదు, సమ్మాన్ కూడ లభించలేదు. స్నేహయాత్రలు ప్రారంభం కానేలేదు. మోడీ గ్యారంటీల మాదిరిగా…
ఇప్పుడు మోడీ ముస్లిం సముదాయంలో పస్మాందా ముస్లిములకు అంటే వెనుకబడిన సముదాయాలకు ఇచ్చిన రిజర్వేషన్లపై దాడి చేస్తున్నారు. రెండేళ్ల క్రితం మోడీ గ్యారంటీల్లాంటి మాటలు విన్న ఈ సముదాయాలు ఇప్పుడు మోడీని ఎలా చూస్తున్నాయి? ముఖ్యంగా మోడీ మాటలు నమ్మి బీజేపీలో చేరిన కొందరు ముస్లిములు ఇప్పుడు ఏమనుకుంటున్నారో?? 2022లోనే ఒకవైపు మోడీ స్నేహయాత్రల గురించి కూడా మాట్లాడారు, మరోవైపు మైనారిటీలకు ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్పులు, పోస్టు గ్రాడ్యుయేట్ స్కాలర్ షిప్పులు రద్దు చేశారు. అంతకు ముందు నిజానికి ఈ స్కాలర్ షిప్పులను పెంచుతామని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. మోడీ గ్యారంటీల్లాంటి మాటలివి. ఈ స్కాలర్ షిప్పుల వల్ల ప్రయోజనం పొందింది ముఖ్యంగా పస్మాందా ముస్లిములే. మోడీకి గ్యారంటీ ఎలాంటిదో వాళ్ళు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు.
అంతెందుకు యోగీ ఆదిత్యనాథ్, హేమంతబిశ్వ శర్మ  తీసుకున్న చర్యల వల్ల మదరసాలు మూతపడ్డాయి. నిజానికి ఈ మదరసాలు పస్మాందా ముస్లిం పేద కుటుంబాల పిల్లల విద్యాభ్యాసానికి తోడ్పడేవి. ఈ మదరసాల్లో ఉచిత భోజన వసతి సదుపాయాలతో పేద పిల్లలకు విద్యాభ్యాసం జరిగేది. ఈ పేదపిల్లలు వెనుకబడిన ముస్లిం సముదాయాలకు చెందినవారే ఎక్కువ. ఈ పస్మాందా ముస్లిం సముదాయాల కోసమే మోడీ స్నేహయాత్రలని ఇంతకు ముందు చెప్పింది. వారి ప్రయోజనాలనే దెబ్బతీశారు.
త్రిపుల్ తలాక్ చట్టం తీసుకువచ్చి తాను ముస్లిము మహిళలకు చాలా ఒరగబెట్టానని చెప్పింది కూడా ఆయనే. ముస్లిముల్లో వెనుకబడిన సముదాయాలకు రిజర్వేషన్లు ఇచ్చానని కూడా ఆయన గతంలో చెప్పుకున్నాడు. రెండేళ్లక్రితం ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యులో ఈ మాటలున్నాయని వైర్ వార్తాసంస్థ రాసింది.
ఆర్జెడీ నాయకుడు లాలూ యాదవ్ తాను ముస్లిం కోటాను సమర్థిస్తున్నాని బాహాటంగా ప్రకటించాడు. తర్వాత ఆయన సామాజిక వెనుకబాటు ఆధారంగా ఈ రిజర్వేషన్లను సమర్థిస్తున్నానని వివరణ ఇచ్చుకోవలసి వచ్చింది.
కాంగ్రెసు మేనిఫెస్టోలో ముస్లిములకు రిజర్వేషన్లు ఇస్తానని చెప్పిందని, అందుకోసం ఓబీసీ రిజర్వేషన్లలో కోత పెడతారని బీజేపీ చేస్తున్న ప్రచారం పచ్చి అబద్దమని కాంగ్రెసు మేనిఫెస్టో చూస్తే అర్థమవుతుంది. నిజానికి కాంగ్రెసు మేనిఫెస్టో సచార్ కమిటీ నివేదిక గురించి కూడా ప్రస్తావించలేదు. భారతదేశంలో ముస్లిముల వెనుకబాటుతనానికి సంబంధించి అత్యంత ముఖ్యమైన నివేదిక ఇది. అలాగే బీజేపీ మౌలానా ఆజాద్ స్కాలర్ షిప్పులను నిలిపేసింది. వాటిని పునరుద్ధరించే మాట ఒక్కటి మాత్రమే కాంగ్రెసు మేనిఫెస్టోలో మైనారిటీలకు సంబంధించిన ఒకే ఒక్క మాట.
మోడీ ముస్లిములకు రిజర్వేషన్లపై చేస్తున్న గగ్గోలు మాదిరి ప్రసంగాలకు కాంగ్రెసు తరఫునుంచి ఎలాంటి జవాబు రావడం లేదు. కాంగ్రెసు ఈ చర్చలోకి రాకూడదని నిర్ణయించుకున్నట్లు కనబడుతుంది. ఈ చర్చలోకి వస్తే, మతపరమైన విభజనపెంచే అవకాశాలు బీజేపీ ఐటీ సెల్ కు ఇవ్వడమే అవుతుందని, దానివల్ల అబద్దాలు మరిన్ని ప్రచారంలోకి వస్తాయన్న భయం కాంగ్రెసులో ఉన్నట్లు కనబడుతుంది. అబద్దాలు మరిన్ని ప్రచారంలోకి వస్తే మీడియాలో ఈ చర్చ మరింత ఉధృతంగా మోడీ మాటలను మరింత ప్రచారంలో పెట్టేలా కొనసాగుతోంది. కాంగ్రెసు మౌనం వల్ల జరుగుతున్నదేమిటంటే, ముస్లిముల్లో వెనుకబడిన సముదాయాలకు రిజర్వేషన్లంటే అవి అవాంఛనీయమైనవన్నట్లు, మతం ఆధారంగా రిజర్వేషన్లన్నట్లు, రాజకీయంగా వేర్పాటు ప్రోత్సహించే చర్యలన్నట్లు ప్రచారం చేసే అవకాశం మీడియాకు లభిస్తోంది.
ఇక్కడ ఆలోచించవలసిన విషయమేమిటంటే, ప్రస్తుత రాజ్యాంగ చట్రంలో ముస్లిముల్లోని కొన్ని సముదాయాలకు రిజర్వేషన్లు ఉన్నాయా? ముస్లిములు మతప్రాతిపదికన రిజర్వేషన్లు కోరుతున్నారా?
ముస్లిముల్లోని కొన్ని సముదాయాలకు రిజర్వేషన్లు వారి మతం కారణంగా ఇవ్వడం జరగలేదు. ఈ సముదాయాల వెనుకబాటుపై డాటా సేకరించి, డాటా ఆధారంగా, సామాజిక వెనుకబాటు ఆధారంగా వారిని వెనుకబడిన సముదాయాల జాబితాలో చేర్చడం వల్ల రిజర్వేషన్లు ఇస్తున్నారు. ఈ సముదాయాలకు రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల యస్సీ, యస్టీ, ఓబీసీలకు ఇప్పటి వరకు ఇవ్వబడుతున్న రిజర్వేషన్లపై దీని ప్రభావం ఏమాత్రం పడదు. మండల్ కమీషన్ తర్వాత అనేక ముస్లిం సముదాయాలను ఓబీసీల్లో చేర్చడం జరిగింది. ముస్లింలో వెనుకబడి సముదాయాలకు అనేక రాష్ట్రాల్లో రిజర్వేషన్లున్నాయి. కేరళ, తమిళనాడు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలతో సహా ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా ఇవి ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి కాలంలో ఇక్కడి ముస్లిం వెనుకబడిన సముదాయాలకు రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. ఈ రిజర్వేషన్ల వల్ల ఇతర ఓబీసీల రిజర్వేషన్లపై ఎలాంటి ప్రభావమూ పడలేదు. ఈ రిజర్వేషన్ల వివరాలను పరిశీలిస్తే అది స్పష్టంగా అర్థమవుతుంది.
కర్నాటకలో రిజర్వేషన్ల గురించి మోడీ చెప్పారు. ఏప్రిల్ 25, 2023వ తేదీన కర్నాటకలో బీజేపీ ప్రభుత్వం స్వయంగా సుప్రీంకోర్టుకు చెప్పిన మాటలేమిటంటే, రాష్ట్రంలోని 4 శాతం రిజర్వేషన్లు రద్దుచేసే ఆలోచన తమకులేదని చెప్పింది. ఓబీసీ జాబితాలోని 2 బి కేటగిరిలో కర్నాటకలో ఈ రిజర్వేషన్లున్నాయి. ఇప్పుడు ఎన్డీయే మిత్రపక్షంగా ఉన్న జేడీయస్ ఈ రిజర్వేషన్లను బలంగా సమర్థించింది. మోడీ చెప్పే మాటలకు అర్థముందా? ఒకవైపు ఆయన మిత్రపక్షాలు ఈ రిజర్వేషన్లను సమర్థిస్తున్నాయి. మరోవైపు ఆయన స్వయంగా కూడా ఈ రిజర్వేషన్లకు అనుకూలంగా గతంలో మాట్లాడి ఉన్నారు. బీజేపీ ప్రభుత్వమే స్వయంగా సుప్రీంకోర్టులో ఈ రిజర్వేషన్లు తొలగించే ఉద్దేశ్యం లేదని చెప్పింది.
ఆంధ్రప్రదేశ్ తెలంగాణా రాష్ట్రాల్లో బీజేపీకి మిత్రపక్షం తెలుగుదేశం. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే ముస్లిములకు ఓబీసీ కేటగిరిలో లభిస్తున్న 4 శాతం రిజర్వేషన్లు కాపాడతానని చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పాడు. అంతేకాదు, ముస్లిముల ప్రయోజనాలు కాపాడతామని కూడా ఆయన చెప్పాడు. దీనిపై మోడీ నోరిప్పలేదు ఎందుకని?
ఎన్నికల రాజకీయాల్లో ఎప్పటికెయ్యది ప్రస్తుతమో ఆ మాటలు చెప్పి, అవసరమైనప్పుడు పస్మాందా ముస్లిములను నేను ఆదుకుంటానని వారి ఓట్లను కొల్లగొట్టే ప్రయత్నం చేశారు. మిత్రపక్షాలు ముస్లిం వెనుకబడిన సముదాయాలకు రిజర్వేషన్లపై స్పష్టమైన మాటలు ఒకవైపు చెబుతున్నయన్నది స్పష్టంగానే తెలుసు. మరోవైపు ముస్లిములకు రిజర్వేషన్లు ఇచ్చి ఓబీసీల రిజర్వేషన్లను కొల్లగొడతారని ప్రచారం చేస్తున్నారు. ఏ పస్మాందా ముస్లిముల గురించి గతంలో మాట్లాడారో ఆ పస్మాందా ముస్లిములకు లభిస్తున్న రిజర్వేషన్లనే బూచీగా చూపిస్తూ మెజారిటీ ప్రజల్లో భయాందోళనలు రెచ్చగొట్టి, మతవిద్వేషాన్ని ప్రచారం చేసి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు. ఈ రాజకీయాలకు ఏ పేరు పెట్టాలి.

– వాహెద్