November 21, 2024

అమెరికా చెప్పుకోడానికి మాత్రమే అగ్రరాజ్యం. పేరుకు మాత్రమే సూపరు పవరు. నిజం చెప్పాలంటే అమెరికా చేతిలో పవరు లేదు. సూపరు కానే కాదు. ఈ మాటలు నేను చెబుతుంటే మీకు ఆశ్యర్యంగా ఉండొచ్చు. కాని వాస్తవాలివి.
ఇస్రాయీల్ నుంచి వస్తున్న వార్తలు విన్నప్పుడు ఇలాగే అనిపిస్తుంది. ఎందుకంటే, ఐక్యరాజ్యసమితి వల్లనే ఇస్రాయీల్ అనే దేశం ఉనికిలోకి వచ్చింది. ఐక్యరాజ్యసమితి తీర్మానాలే లేకపోతే అంతర్జాతీయంగా ఇస్రాయీల్ అనే దేశం కూడ లేదు. కాని ఇప్పుడు ఆ ఇస్రాయీల్ స్వయంగా ఐక్యరాజ్యసమితిపై కన్నెర్ర జేస్తోంది. ఐక్యరాజ్యసమితి సంస్థనే నిషేధించింది. ఐక్యరాజ్యసమితి సంస్థనే ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఇప్పుడు ఐక్యరాజ్యసమితి సంస్థపై కూడా  ఉగ్రవాద సంస్థ అనే ముద్ర పడుతుందంటే అసలు ఉగ్రవాదం అంటే ఏమిటో? ఎవరికి అర్థం కాని విషయమైపోయింది.

ఐక్యరాజ్యసమితికి సంబంధించిన సంస్థను ఇస్రాయీల్ ఇలా ఉగ్రవాద సంస్థగా ప్రకటించవద్దని, నిషేధించవద్దని అమెరికా చెప్పింది. చెప్పిందనే బదుల బతిమాలుకుందంటే సరయిన పదం అవుతుంది. కాని అమెరికా చెప్పిన మాటలకు ఇస్రాయీల్ పూచికపుల్ల పాటి విలువ కూడా ఇవ్వలేదు. నిజం చెప్పాలంటే ఇస్రాయీల్ దృష్టిలో అమెరికాకు గడ్డిపోచంత విలువ కూడా లేదు. ఎందుకంటే, ఇప్పటి వరకు అమెరికా చెప్పిన ఒక్క మాటైనా ఇస్రాయీల్ విన్న ఉదాహరణ లేనే లేదు. అమెరికా ఇప్పుడు అగ్రరాజ్యం, సూపర్ పవరు అని చెప్పుకోవడం హాస్యాస్పదం. ఐక్యరాజ్యసమితికి సంబంధించిన సంస్థను నిషేధించకుండా, ఉగ్రవాద సంస్థగా ఇష్టమొచ్చినట్లు ఇస్రాయీల్ ప్రకటిస్తుంటే అడ్డుకోలేని అమెరికా ఒక నిస్సహాయ దేశం. అమెరికా ఎంత నిస్సహాయమైన స్థితిలో ఉందంటే ఇస్రాయీల్ చెప్పింది విని తలూపడం తప్ప మరేమీ చేయలేని స్థితిలో ఉంది.
ఇస్రాయీల్ గత సంవత్సర కాలంగా అమెరికా నుంచి బిలియన్ల కొద్ది సహాయం తీసుకుంది. ఇంకా ఈ సహాయం కొనసాగుతూనే ఉంది. ఇస్రాయీల్ కు అమెరికా ఎంత సహాయపడుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నిజం చెప్పాలంటే ఇస్రాయీల్ ఉనికి అమెరికా సహాయంపై ఆధారపడి ఉంది. కాని ఇస్రాయీల్ కన్నెర్ర చేస్తే గజగజలాడే స్థితిలో అమెరికా రాజకీయాలున్నాయి. కమలా హారిస్ కాని, డోనాల్డ్ ట్రంప్ కాని ఇద్దరు కూడా ఇస్రాయీల్ అడుగులకు మడుగులొత్తేవారే. అమెరికా ప్రజలు ఈ దయానీయ స్థితిని భరించక తప్పడం లేదు.
ఇస్రాయీల్ కు ఆత్మరక్షణ హక్కు ఉందని అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఇప్పుడు అమెరికా ఎన్నికల పోటీలో దిగుతున్న కమలా హారిస్, డోనాల్డ్ ట్రంప్ లు గొంతు చించుకుని, అలుపెరుగక చెబుతున్నారు. ఇస్రాయీల్ చేసేదంతా ఆత్మరక్షణే అంటూ ఇస్రాయీల్ కొనసాగిస్తున్న నరమేధాలను, హత్యాకాండలను మరిచిపోండని ప్రపంచానికి చెబుతుంటారు. కాని స్వయంగా అమెరికాలోని పత్రికలే ఇస్రాయీల్ చేస్తున్నది జాతిహననం అని చెప్పాయి.
ఇస్రాయీల్ ఆత్మరక్షణ కోసం ఇదంతా చేస్తుందా? ఐక్యరాజ్యసమితికి సంబంధించిన సంస్థను నిషేధించడం, ఉగ్రవాద సంస్థగా ప్రకటించడంలో ఎలాంటి ఆత్మరక్షణ చర్యలున్నాయో అమెరికా అధ్యక్షులుగారే సెలవిచ్చి ప్రపంచానికి అర్థమయ్యేలా చెప్పాలి. ఐక్యరాజ్యసమితి ప్రధానకార్యదర్శి అంటోనియో గుటెరస్ ఇస్రాయీల్ లో ప్రవేశించకుండా నిషేధించడం ద్వారా ఇస్రాయీల్ సాధించిన ఆత్మరక్షణ ఏమిటో కూడా ఘనత వహించిన బైడెన్ గారే ప్రపంచానికి అర్థమయ్యేలా చెప్పాలి.
అక్టోబర్ 28న ఇస్రాయీల్ పార్లమెంటు రెండు చట్టాలు చేసింది. ఈ చట్టాల ప్రకారం  గాజాలో యుద్ధబాధితుల కోసం సహాయకార్యక్రమాలు చేపడుతున్న ఐక్యరాజ్యసమితి సంస్థ యుఎన్ఆర్ డబ్ల్యు ఏ ను ఇస్రాయీల్ అడ్డుకోవచ్చని అధికారాలిచ్చే చట్టం ఒకటి. యుద్ధంలో బాధితులైన సాధారణ ప్రజలు, పిల్లలు మహిళలను ఐక్యరాజ్యసమితి సంస్థ ఆదుకుంటే ఇస్రాయీల్ కు వచ్చిన కష్టమేమిటి? ఇప్పటి వరకు ఇస్రాయీల్ చేసిన యుద్ధంలో గాజాలో అమాయక పిల్లలను చంపడం, ఆసుపత్రులపై బాంబులేసి నాశనం చేయడం, స్కూళ్ళపై బాంబులేయడమే తప్ప యుద్ధం చేసిందెక్కడ. హమాస్ పై యుద్ధమని చెప్పి సాధారణ పాలస్తీనా ప్రజలను ఊచకోత చేస్తుందన్నది ఇప్పుడు అమెరికా పత్రికలే రాస్తున్నాయి. హమాస్ ఎలాంటిదలాగే ఉంది. దాడులు కొనసాగిస్తూనే ఉంది. హమాస్ చేతుల్లో బందీలుగా ఉన్న ఇస్రాయీల్ పౌరులను విడిపించుకోవడం కూడా ఇస్రాయీల్ చేయలేకపోయింది. చేసిందేమిటంటే సాధారణ ప్రజలను చంపడం. ఇది యుద్ధమా? పైగా యుద్ధంలో బాధితులైన సాధారణ ప్రజలను ఆదుకునే ఐక్యరాజ్యసమితిని అడ్డుకోవడం ఇస్రాయీల్ ఆత్మరక్షణ అని అమెరికా చెబుతుంది. మనం వినాలి.
ఇక ఇస్రాయీల్ చేసిన రెండో చట్టం ప్రకారం ఇస్రాయీల్ కు చెందిన అధికారులు లేదా  సంస్థలు యుఎన్ఆర్ డబ్ల్యుతో సంబంధాలు పెట్టుకోరాదని నిషేధం విధించిన చట్టం. విచిత్రమేమిటంటే ఐక్యరాజ్యసమితికి చెందిన యుఎన్ఆర్ డబ్ల్యు అంటే The United Nations Relief and Works Agency అనే సంస్థకు హమాస్ కు తేడా లేదని రెండు ఒక్కటే అని ఇస్రాయీల్ చెబుతోంది. అమెరికా వింటుంది. మనల్ని నమ్మమంటుంది.
ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ప్రపంచంలో వివిధ దేశాల మధ్య సయోధ్య కోసం ఏర్పడిన ఐక్యరాజ్యసమితికి సంబంధించిన సంస్థపైనే ఉగ్రవాద ఆరోపణలు చేస్తే, ఐక్యరాజ్యసమితి సంస్థనే నిషేధించడం జరిగితే ఇక అంతర్జాతీయ శాంతి కోసం ఐక్యరాజ్యసమితి అనే సంస్థ ఉండడమూ, దాంట్లో వివిధ దేశాలు సభ్యదేశాలుగా ఉండడంలో అర్థమేముంది? ఈ చట్టం గురించి ఇస్రాయీల్ ఐక్యరాజ్యసమితికి సమాచారం పంపిన తర్వాత ఈ చట్టం అమలులోకి వచ్చేస్తుంది. ఈ విషయమై యుఎన్ఆర్ డబ్ల్యు ప్రతినిథి జూలియో మాట్లాడుతూ ఇదొక విపత్కర పరిస్థితి అన్నారు. ఎందుకంటే గాజాలో మానవీయ సహాయసహకారాలు అందిస్తున్న అతిపెద్ద సంస్థ యుఎన్ఆర్ డబ్ల్యు. ఈ సంస్థను ఇక్కడ పనిచేయకుండా అడ్డుకుంటే, ఈ సంస్థ చేసేపని చేయగల సామర్థ్యం మరో సంస్థకు లేదు. అంటే ఇస్రాయీల్ కోరుకునేది పాలస్తీనా ప్రజలకు ఎలాంటి సహాయమూ అందరాదు. నిజానికి ఇస్రాయీల్ చేస్తున్నది అక్కడ హమాస్ తో యుద్ధం కాదు. హమాస్ తో యుద్ధం సాకుతో పాలస్తీనా ప్రజలను సామూహికంగా చంపే హత్యాకాండ కొనసాగిస్తోంది. ఇది ఎంత విచిత్రమైన పరిస్థితి అంటే, ఐక్యరాజ్యసమితి పుణ్యం కొద్ది ఉనికిలోకి వచ్చిన దేశం, ఐక్యరాజ్యసమితి లో సభ్యదేశం, ఐక్యరాజ్యసమితికి చెందిన సంస్థను ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. అది కూడా మానవీయ సహాయసహకారాలు అందించే సంస్థను నిర్మూలించే కార్యక్రమాలు చేపట్టింది.
గ్లోబల్ ఆర్డర్ గురించి గొప్పగా మాట్లాడే అగ్రరాజ్యం, దానికి వంతపాడే పాశ్చాత్యదేశాలు ఐక్యరాజ్యసమితికి పట్టిన ఈ దుర్గతి గురించి ఏమన్నా చెబుతున్నారా? వారి మాటలేవీ ఎక్కడా వినబడడం లేదు. అమెరికా … ఈ సంఘటనపై చాలా ఆందోళన, విచారాలు వెలిబుచ్చింది. అంతకన్నా పాపం ఒక నిస్సహాయ దేశం ఏం చేయగలదు? లక్షలాది పాలస్తీనీయులు, ముఖ్యంగా గాజా వాసులు ఇప్పుడు అన్నపానీయాలతో పాటు విద్యావసతి కోసం యుఎన్ఆర్ డబ్ల్యుపై ఆధారపడి ఉన్నారు. ఈ మాటలు కూడా అమెరికా చెప్పింది. కాని పాపం ఏం చేయలేని నిస్సహాయస్థితిలో ఉంది. జర్మని, ఫ్రాన్స్, ఇటలీ, కెనడా, జపాన్, దక్షిణ కోరియా తదితర దేశాలు కూడా ఒక సంయుక్త ప్రకటనలో ఇస్రాయీల్ ను ఐక్యరాజ్యసమితికి చెందిన సంస్థపై నిషేధం విధించరాదని చెప్పాయి. ఈ దేశాలు అంతకన్నా చేసేది కూడా ఏమీ లేదు. ఈ దేశాలన్నీ ఇస్రాయీల్ మిత్రదేశాలు. యుఎన్ఆర్ డబ్ల్యు పై నిషేధం అంతర్జాతీయ చట్టానికి విరుద్దమని చెప్పిన దేశం టర్కీ. యురోపియన్ యూనియన్ ప్రతినిధి జోసెఫ్ బొరెల్ కూడా చాలా విచారం వెలిబుచ్చారు. ఐర్లాండ్, నార్వే, స్లోవేనియా, స్పెయిన్ దేశాలు ఈ ఏడాదే పాలస్తీనా ప్రత్యేక దేశానికి గుర్తింపునిచ్చిన దేశాలు. ఈ దేశాలు ఇస్రాయీల్ చర్యలను ఖండిస్తూ ప్రకటనలు చేశాయి. బెల్జియం కూడా తీవ్రంగానే ప్రతిస్పందించింది.
ఇస్రాయీల్ ఏం చేసినా ఐక్యరాజ్యసమితిలో చెల్లుతుంది. ఎందుకంటే అమెరికా అనే సోకాల్డ్ అగ్రరాజ్యం ఇస్రాయీల్ అడుగులకు మడుగులొత్తుతుంది. ఇంతకు ముందు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి అంటోనియో గుటెరస్ ఈరాన్ ను విమర్శించలేదనే కారణం చూపించి ఆయన ఇస్రాయీల్ లో ప్రవేశించకుండా నిషేధం విధించారు. గుటెరస్ కూడా ఇస్రాయీల్ చట్టాలపై వ్యాఖ్యానిస్తూ చాలా విచారకరమైన చర్యలన్నారు. ఈ చట్టాలు పాలస్తీనా శరణార్థులను లక్ష్యంగా చేసుకున్న చర్యలన్నారు. ఈ సమస్యను ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో చర్చకు పెడతామన్నారు.
The United Nations Relief and Works Agency లేదా యుఎన్ఆర్ డబ్ల్యు గాజాలో సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. 19 లక్షలకు పైబడి పాలస్తీనా పౌరులు ఇస్రాయీల్ దమనకాండల వల్ల తమ ఇళ్ళు వాకిళ్ళు వదిలి ఇక్కడ శరణార్థులుగా జీవిస్తున్నారు. గాజాలో ఆహారకొరత ఉంది. మంచినీటి కొరత ఉంది. ఔషధాలు లభించడం లేదు. ఆకలి చావులు, వ్యాధుల సమస్యలున్నాయి. గాజాలో భయంకరమైన పరిస్థితులున్నాయి. ఏడాదిగా ఇస్రాయీల్ కొనసాగిస్తున్న యుద్దం వల్ల వేలాది మంది పిల్లలు, మహిళలు మరణించారు. అనేక కుటుంబాలు నాశనమయ్యాయి. అంతర్జాతీయంగా అనేక దేశాలు ఇస్రాయీల్ వైఖరిని నిస్సందేహంగా విమర్శించాయి. విమర్శించిన వారిలో అమెరికా పాశ్చాత్యదేశాలు కూడా ఉన్నాయి. కాని ఇస్రాయీల్ ని అడ్డుకోడానికి చేసింది ఏదీ లేదు. నిస్సహాయ దేశాలు కదా.
అమెరికా విదేశాంగ మంత్రి అంటోని బ్లింకెన్ గారు ఇస్రాయీల్ ప్రధాని నెతన్యాహును కలిసి గాజాలో సహాయసామగ్రి సరఫరాకు సహాయపడాలని కోరారట. కోరారో, వేడుకున్నారో మనకు తెలియదు. కాని ఇస్రాయీల్ మాత్రం సహాయకార్యక్రమాలు చేస్తున్న సంస్థను నిషేధించి అమెరికాకు ఎంత విలువ ఉందో ప్రపంచానికి చెప్పింది.
గత సంవత్సరం హమాస్ చేసిన దాడుల్లో యుఎన్ఆర్ డబ్ల్యు కార్యకర్తలు కూడా కొందరున్నారని ఇస్రాయీల్ చెబుతోంది. కాని ఇస్రాయీల్ చెప్పిన మాటలేవి ఇంతవరకు నిజాలుగా నిరూపితం కాలేదు. చెప్పినవన్నీ అబద్దాలే. చిన్నపిల్లల గురించి ఇస్రాయీల్ చెప్పింది అబద్దం. అదే అబద్దాన్నినిస్సిగ్గుగా అమెరికా అధ్యక్షుడు కూడా మళ్ళీ చెప్పాడు. హిజ్బుల్లా బంగారం గురించి ఇస్రాయీల్ చెప్పింది. అది కూడా అబద్దమని తేలింది. ఇలాంటి అబద్దాలు చాలా ఉన్నాయి. హమాస్ దాడుల్లో ఐక్యరాజ్యసమితికి చెందిన సంస్థ కార్యకర్తలున్నారని ఇస్రాయీల్ చెబుతుంటే దానికి ఆధారాలేమిటి? అబద్దాల పుట్ట వంటి ఇస్రాయీల్ మాటలెవరు నమ్మగలరు?
యుఎన్ఆర్ డబ్ల్యు ఈ విషయమై స్పష్టత కూడా ఇచ్చింది. తమ కార్యకర్తల్లో అనుమానాస్పదంగా ఎవరైనా ఉంటే వెంటనే తొలగిస్తామని వివరణ కూడా ఇచ్చింది. ఇస్రాయీల్ ఆరోపణల తర్వాత జరిగిందేమిటంటే, యున్ ఆర్ డబ్ల్యుకు విరాళాలిచ్చే వారు కొంత మంది విరాళాలు ఆపేశారు. తర్వాత ఇలా విరాళాలు ఆపేసిన వారు మళ్ళీ కొందరు విరాళాలు కొనసాగించడం ప్రారంభించారు. యుఎన్ ఆర్ డబ్ల్యు హమాస్ కోసం పనిచేస్తుందని ఇస్రాయీల్ కు అనుమానాలుంటే, ఆ సంస్థ స్థానంలో మరో సంస్థకు అనుమతిని ఇచ్చే అవకాశాలు చట్టంలో ఉండాలి. కాని ఇస్రాయీల్ ఛేసిన చట్టంలో గాజాలోని శరణార్థుల సహాయసహకారాలకు ఎలాంటి సంస్థలను అనుమతించేది అవకాశమే లేదు. అంటే ఇస్రాయీల్ కోరుకునేది ఏమిటో స్పష్టంగా అర్థమవుతోంది. చిన్నపిల్లలు చదువుకునే స్కూళ్ళపై, ఆసుపత్రులపై, జర్నలిస్టులున్న ఇళ్ళపై బాంబులు వేసి అదే యుద్ధమని, ఆత్మరక్షణ అని చెప్పుకునే ఇస్రాయీల్ వంటి అమానుష దేశం యుద్ధబాధితుల సహాయసహకారాలను అనుమతించడం జరుగుతుందా? ఇస్రాయీల్ చేస్తున్నది హమాస్ పై యుద్ధం కాదు. గాజాలో పాలస్తీనా పౌరులందరిని హతమార్చే జాతి హననం.
ఇప్పుడు ఇస్రాయీల్ చేసిన ఈ చట్టాల తర్వాత ఐక్యురాజ్యసమితితో ఇస్రాయీల్ సంబంధం తెగిపోయిందని చెప్పాలి. 1947లో ఐక్యరాజ్యసమితి వల్లనే ఇస్రాయీల్ అనే దేశం ఉనికిలోకి వచ్చింది. అప్పట్లో పాలస్తీనా గా ఉన్న దేశాన్ని అరబ్బు ప్రాంతం, యూదప్రాంతంగా రెండు ముక్కలు చేసి ఇస్రాయీల్ దేశాన్ని ఐక్యరాజ్యసమితి తీర్మానం ఆధారంగా ఏర్పాటు చేశారు. ఆ వెంటనే ఇస్రాయీల్ దమననీతి ప్రారంభమైంది. అప్పట్లోనే దాదాపు ఏడున్నర లక్షల మంది పాలస్తీనా ప్రజలు తమ దేశాన్ని కోల్పోయి, ఇళ్ళు వాకిళ్ళు వదిలి శరణార్థులయ్యారు. నక్బాగా ఈ సంఘటనను పిలుస్తారు. పాలస్తీనా చరిత్రలో ఇది అతిపెద్ద సంఘటన. అదే సంవత్సరం యుఎన్ఆర్ డబ్ల్యు స్థాపించబడింది. అప్పట్లోనే ఇస్రాయీల్ కు కూడా ఐక్యరాజ్యసమితిలో సంపూర్ణ సభ్యదేశంగా స్వీకరించడం కూడా జరిగింది. అప్పుడు ఏర్పడిన యుఎన్ఆర్ డబ్ల్యు అప్పటి నుంచి పాలస్తీనా శరణార్థుల కోసం పనిచేస్తోంది.  అప్పుడు ఏడున్నర లక్షల మంది పాలస్తీనీయులు శరణార్థులయ్యారు. ఇప్పుడు తమ దేశంలోనే 20 లక్షల మంది పాలస్తీనా ప్రజలు శరణార్థులయ్యారు. గాజా, వెస్ట్ బ్యాంక్, జెరుసలేం, జోర్డన్, లెబనాన్ లలో కూడా యుఎన్ఆర్ డబ్ల్యు పనిచేస్తోంది.
అసలు పాలస్తీనీయులను శరణార్థులుగా గుర్తించడాన్ని కూడా ఇస్రాయీల్ వ్యతిరేకిస్తోంది. పాలస్తీనా భూభాగం నుంచి వారిని తరిమేసిన ఇస్రాయీల్  ఈ శరణార్థులకు తిరిగి వచ్చే హక్కు అధికారాలు లేవంటుంది. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి గుటెరస్ స్వయంగా ఇస్రాయీల్ ప్రధానికి లేఖ రాసి పాలస్తీనా శరణార్థులకు సహాయమందిస్తున్న యు ఎన్ ఆర్ డబ్ల్యు సంస్థపై నిషేధ చట్టం చేయవద్దన్నారు. కాని ఎవరేం చెప్పినా ఇస్రాయీల్ ప్రధాని వినడం లేదు. అమెరికాలో పన్నులు కట్టే వారి డబ్బు ఇస్రాయీల్ కు సరఫరా అవుతున్నంత కాలం ఇస్రాయీల్ ఎవరి మాట వినదు. గాజాలో 190 మంది ఐక్యరాజ్యసమితి కార్యకర్తలను ఇస్రాయీల్ హతమార్చింది. అనేక కార్యాలయ భవనాలను ధ్వంసం చేసింది.  ఐక్యరాజ్యసమితీ నడిపే స్కూళ్ళపై కూడా బాంబులు వేసి ధ్వంసం చేసింది. యుఎన్ఆర్ డబ్ల్యు పై ఇస్రాయీల్ చేస్తున్న విషప్రచారాన్ని ప్రపంచం చూస్తోంది. ఐక్యరాజ్యసమితికి చెందిన ఈ సంస్థ ప్రతినిధులు చెబుతున్న మాటలు వింటుంది. కాని ఎవరూ ఏమి చేయడం లేదు. అంటే ఇస్రాయీల్ ఇష్టారాజ్యంగా వ్యవహరించినా కేవలం విచారాలు వ్యక్తం చేయడం తప్ప ఎవరు చేసేది ఏదీ లేదు. అంతకు ముందు గాజాలో, జెరుసలేంలో, వెస్ట్ బ్యాంకులో ఇస్రాయీల్ నిరంతరాయంగా కొనసాగిస్తూ వచ్చిన దమనకాండ విషయంలో కూడా ఇదే జరిగింది. ఆ తర్వాతనే హమాస్ దాడి జరిగిందన్నది గుర్తించాలి. కేవలం హమాస్ దాడితో ఇదంతా ప్రారంభమైందనుకునే వారు ఇదంతా మరిచిపోతున్నారు. హమాస్ దాడి తర్వాత కూడా ఇస్రాయీల్ చేస్తున్నది హమాస్ పై యుద్ధం కాదు. పాలస్తీనా ప్రజలపై యుద్ధం. సాధారణ ప్రజలను చంపుతోంది. గాయపడిన వారు మందులు వైద్యం లేకుండా మరణించేలా ఆసుపత్రులపై బాంబులు వేస్తోంది. పాలస్తీనా ప్రజలకు పచ్చి మంచినీళ్ళు కూడా లభించకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తోంది.
గాజాలో సాధారణ ప్రజలకు ఎలాంటి సహాయం లభించకుండా చేయాలనేదే ఇస్రాయీల్ ప్రయత్నం. సామూహికంగా పాలస్తీనా ప్రజలందరినీ శిక్షించి, తన ఆధిపత్యం కొనసాగించాలనేదే అసలు ప్రయత్నం. కాని దీని వల్ల మరింత మంది హమాస్ పట్ల ఆకర్షితులవుతున్నారు. హమాస్ నాయకులను చంపిన ప్రతిసారి ఇస్రాయీల్ ఇక హామాస్ ను తుడిచిపెట్టేశామని చెబుతుంది. మళ్ళీ హమాస్ తలెత్తి నిలబడుతోంది. నెతన్యాహు వంటి నాయకుడి అధికార పిపాస ఇస్రాయీల్ దేశాన్ని నిరంతర యుద్ధంలో మునిగేలా చేస్తోంది.
హమాస్ వద్ద బందీలుగా ఉన్న ఇస్రాయీల్ పౌరుల పరిస్థితేమిటి. వారి కుటుంబ సభ్యులు ఇస్రాయీల్ ప్రధానిని కలవడానికి గత ఆరునెలలుగా ప్రయత్నాలు చేస్తున్నా ఎవరికి అనుమతి ఇవ్వలేదు. ఇస్రాయీల్ ప్రధాని ప్రసంగాన్ని ఈ కుటుంబాలు అడ్డుకుని సభలో హంగామా చేసిన వార్తలు కూడా వచ్చాయి. కాని నెతన్యాహు మాత్రం బంధీలను విడిపించుకునే ప్రయత్నాలు చేయడం లేదు. యుద్ధాలు కొనసాగిస్తూ ఉంటే తన అధికారం పదిలంగా ఉంటుందని చూస్తున్నాడు. ఐక్యరాజ్యసమితిలో నెతన్యాహు ప్రసంగాన్ని అమెరికా దాని మిత్రపక్షాలు తప్ప మిగిలిన దేశాలన్నీ బహిష్కరించి వాకౌట్ చేశారు. ఖాళీ సభలో నెతన్యాహు చేసిన ప్రసంగాన్ని, గొప్ప ప్రసంగంగా అమెరికా పాశ్చాత్య మీడియా ప్రచారం చేసుకుంది.
ఇప్పుడు అమెరికాలో ఎన్నికలు జరుగుతున్నాయి. కమలా హారిస్ ఈ సారి ఎన్నికల్లో ఓడిపోతే దానికి పెద్ద కారణం ఇస్రాయీల్ కు బైడెన్ ఇస్తున్న మద్దతు. ఈ సారి డెమొక్రటిక్ పార్టీ ఓడిపోతే దానికి కారణం ఇస్రాయీల్. కమలా హారిస్ కూడా ఇస్రాయీల్ కు ఇస్తున్న మద్దతును సమర్ధిస్తూ చాలా సార్లు మాట్లాడారు. కాని డోనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చినా ఇస్రాయీల్ మద్దతు విషయంలో ఇదే విధానాన్ని పాటిస్తారన్నది అందరికీ తెలిసిన విషయమే. పైగా ట్రంప్ మరింత ఎక్కువగా ఇస్రాయీల్ పక్షపాతిగా నిలబడతాడు. ఏది ఏమైనా ఇప్పుడు ప్రపంచంలో సమీకరణాలు మారిపోతున్నాయి. ఈరాన్, సౌదీల మధ్య సయోథ్య కుదిరింది. అమెరికాను ఇప్పుడు సౌదీ అంతగా నమ్మడం లేదు. మరోవైపు టర్కీ నాటోకు బై బై చెప్పడానికి సిద్ధపడుతోంది. మిలటరీ డ్రోన్ల విషయంలో ఇప్పుడు టర్కీకి ప్రపంచంలో ఎదురు లేదు. అమెరికా మార్కెటును టర్కీ లాగేసుకుంది. అమెరికా డాలర్ కు సవాళ్ళు ఎదురవుతున్నాయి. బ్రిక్స్ బలపడుతోంది. ఇస్రాయీల్ బెదిరింపులకు ఈరాన్ బెదరడం లేదు సరికదా, ఇస్రాయీల్ పై ప్రత్యక్ష దాడులతో ఇస్రాయీల్ సైనిక సామర్థ్యంలో వాస్తవమెంతో ప్రచారమెంతో ప్రపంచానికి తెలియజేసింది. ఇస్రాయీల్ ప్రతిదాడిని ఈరాన్ ఎదుర్కున్న తీరు కూడా ప్రపంచంలో చర్చనీయాంశం అయ్యింది. అమెరికా గొప్పగా చెప్పుకునే ఎఫ్ 35 యుద్ధవిమానాలు ఈరాన్ నుంచి తోకముడిచి వెనక్కు తగ్గవలసి వచ్చిందన్న వార్తలు అమెరికా యుద్ధవిమానాల ప్రతిష్ఠను దెబ్బతీశాయి. హిజ్బుల్లా, హమాస్ చేస్తున్న దాడులు ఇస్రాయీల్ ఐరన్ డోమ్ బలమెంతో బీటలెన్ని ఉన్నాయో ప్రపంచానికి చెప్పాయి. ఇప్పుడు చాలా వాస్తవాలు ప్రపంచదేశాల ముందుకు వచ్చాయి. ఇస్రాయీల్ ఎలాంటి అమానుష దేశమో, ఎలా పసిపిల్లలను మహిళలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తుందో కూడా ప్రపంచానికి తెలిసింది.
మధ్యప్రాచ్యంలో రగులుతున్న ఈ మంటలు త్వరలో ఆరి పాలస్తీనా సమస్యకు శాశ్వత పరిష్కారం లభించాలని కోరుకుందాం.

– వాహెద్