అజ్మీర్ లో ఉన్న దర్గా ఒక శివమందిరం అనే కేసును రాజస్థాన్ న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఉత్తరప్రదేశ్ లోని సంభల్ లో షాహీ జామా మస్జిద్ వివాదం ఒకవైపు కొనసాగుతున్నప్పుడే ఈ వార్త కూడా వచ్చింది. సంభల్ వివాదం హింసాత్మకమయ్యింది. ఐదుగురు అమాయకుల ప్రాణాలు పోయాయి. బాబరీ వివాదంలో ఎన్ని ప్రాణాలు పోయాయో ఇక్కడ ప్రస్తావించడం చర్విత చరణమే.
హిందూసేన నాయకుడు విష్ణు గుప్త న్యాయస్థానంలో అజ్మీర్ దర్గాపై పిటీషన్ వేశాడు. సూఫీ ఖాజా మొయినుద్దీన్ చిష్తీ దర్గా దేశంలో ప్రముఖ దర్గాల్లో ఒకటి. విశేషమేమిటంటే అజ్మీర్ దర్గాకు వెళ్ళేవారిలో ముస్లిమేతరులు కూడా పెద్ద సంఖ్యలో ఉంటారు. ఇప్పుడు అజ్మీర్ దర్గా ను శివమందిరంగాను, సంకట్ మోచన్ మహాదేవ్ టెంపుల్ గాను ప్రకటించాలనే రాజకీయాలు మొదలయ్యాయి. దేశంలో బాబరీ రాజకీయాలు కొనసాగించడానికి కావలసినన్ని స్థలాల జాబితా సిద్ధంగా ఉందని తెలుస్తూనే ఉంది. ఇప్పుడు దర్గాలో సర్వే చేయించాలని, హిందువులకు అక్కడ పూజలు చేసుకునే అనుమతి ఇవ్వాలని పిటీషనర్ కోరాడు. మస్జిదులో జై శ్రీరామ్ నినాదాలిస్తే తప్పేంటని స్వయంగా న్యాయమూర్తే వ్యాఖ్యానించిన వాతావరణంలో జీవిస్తున్నాం కాబట్టి ఈ సర్వే ఆదేశాలు త్వరలోనే రావచ్చు.
అజ్మీర్ దర్గా విషయంలో సుప్రీంకోర్టు కల్పించుకోవాలని ఆప్ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ కోరారు. ఎందుకంటే దేశంలో ఆరాధనాలయాల పరిరక్షణ చట్టం ఒకటి ఉంది. ఈ చట్టాన్ని 1991లో చేశారు. ఈ చట్టం ప్రకారం, బాబరీ మస్జిద్ అప్పటికే వివాదంలో ఉంది కాబట్టి, బాబరీ మస్జిద్ తప్ప దేశంలోని ఇతర ఆరాధనాలయాలన్ని 1947 అగష్టు 15వ తేదీన ఎలా ఉన్నాయో అలాగే ఉంచాలి. వాటిని మార్చడానికి ప్రయత్నించరాదు. మతసామరస్యాన్ని కాపాడ్డానికి, మస్జిద్ మందిర్ వివాదాలను అడ్డుకోడానికి చేసిన చట్టం ఇది. ఇప్పుడు ఈ చట్టాన్ని ఎవరు పట్టించుకుంటున్నట్లు కనిపించడం లేదు. మస్జిద్ మందిర్ వివాదాలు రాజేయడానికి ఒక జాబితా సిద్ధంగా పెట్టుకున్న శక్తులు ఈ పని కొనసాగిస్తూనే ఉన్నాయి. వారణాసిలోని గ్యానవాపి మస్జిదు, మధురలోని షాహీ ఈద్గా, మహారాష్ట్రలోని హాజి మలంగ్ దర్గా, సంభల్ లోని షాహీ మస్జిదు, కుతుబ్ మినార్, తాజ్ మహల్ ఇలా ఈ జాబితా చాలా పెద్దది.
అజ్మీర్ దర్గా గత 800 సంవత్సరాలుగా ఉంది. మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది. భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మాత్రమే కాదు, ప్రస్తుత ప్రధాని మోడీ కూడా అజ్మీర్ దర్గాకు చాదర్ పంపించారు. కాని ఇప్పుడు దేశంలో మస్జిదులు, దర్గాల సాకుతో మతతత్వ విద్వేషం సాగు చేసే ప్రయత్నాలు తీవ్రస్థాయిలో జరుగుతున్నాయి. మజ్లిస్ నాయకుడు ఒవైసీ ఈ విషయం గురించి మాట్లాడుతూ కింది కోర్టులు ఆరాధనాలయాల చట్టాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.
బాబరీ మస్జిద్ వివాదం కూడా ఇలా కోర్టు కేసులతోనే మొదలయ్యింది. మతఉద్రిక్తతలకు కారణమయ్యింది. బీజేపీకి ఎన్నికల రాజకీయాల్లో ఉపయోగపడింది. ఈ క్రమంలో అనేకమంది ప్రాణాలు కోల్పోయారు.
ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో ఏం జరుగుతుందో కాస్త గమనించండి. సంభల్, బహ్రాయిచ్ రెండు ఉత్తరప్రదేశ్ లోనే ఉన్నాయి. అక్టోబర్ లో బహ్రాయిచ్ లో మతఘర్షణలు జరిగాయి. ప్రాణాలు పోయాయి. ఇప్పుడు సంభల్ లో మతఘర్షణలు జరిగాయి. ప్రాణాలు పోయాయి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో మతతత్వ ఉద్రిక్తలు పెంచే ప్రయత్నాలు పథకం ప్రకారం జరుగుతున్నాయా అన్న అనుమానాలు పెరుగుతున్నాయి. ముజఫ్ఫర్ నగర్, బరేలీ, అలీగఢ్ … ఉత్తరప్రదేశ్ మతఘర్షణల చరిత్ర మన ముందుంది.
ఈ మతతత్వ రాజకీయాలను గమనిస్తే స్పష్టంగా అర్థమయ్యేది ఒక్కటే. ఒక సముదాయాన్ని విలన్లుగా మార్చి చూపించడం ద్వారా ఎన్నికల ప్రయోజనాలు పొందడం ఒక ఫార్మూలాగా మారింది.
ఇప్పుడు పత్రికలు, మీడియా మాట్లాడుతున్న భాష కూడా మతతత్వ రాజకీయాలకు ఉపయోగపడే భాషగానే వినిపిస్తుంది. ఒక వర్గాన్ని విలన్లుగా చూపించడంలో మీడియా కూడా తన వంతు పాత్ర పోషిస్తోంది. ధర్మాన్ని కాపాడాలంటూ మీడియా కూడా ఈ రాజకీయ క్రీడలో సమానస్థాయిలో కనిపిస్తోంది. ఇప్పుడు మీడియా అంటే గోదీ మీడియా అనే మాట వినిపిస్తున్న నేపథ్యంలో మీడియా నుంచి అంతకన్నా ఎక్కువ ఆశించలేం.
సంభల్ లో ఏం జరిగింది. అక్కడి జామా మస్జిదు అసలు మస్జిదు కాదు మందిరం అంటూ పిటీషన్ వేశారు. క్షణం ఆలస్యం చేయకుండా కోర్టు సర్వేకు ఆర్డర్ వేసింది. అంతే వేగంగా అధికారులు సర్వే కూడా చేయించారు. ఇంత వేగంగా న్యాయస్థానాల్లో కేసులు నడవడం కాస్త ఆశ్చర్యం కలిగించడం లేదా? ఏది ఏమైనా మొదటిసారి సర్వే శాంతియుతంగా జరిగిన తర్వాత కూడా రెండవసారి సర్వే ఎందుకు చేయించాలనుకున్నారు. రెండవసారి సర్వే జరుగుతున్నప్పుడు హింసాత్మక పరిస్థితి ఎందుకు ఏర్పడింది. అసలు రెండవసారి సర్వే అవసరమేమొచ్చింది? సుప్రీంకోర్టు ఈ విషయాలను పరిశీలించడం అవసరమా కాదా? ఏ రోజు పిటీషన్ వేశారో అదే రోజు ఆదేశాలు ఎలా వచ్చేశాయి? దీనిపై అనేకమంది ప్రశ్నలు సంధిస్తున్నారు.
గ్యానవాపి వివాదాన్ని రాజేసిన వకీలు హరిశంకర్ జైన్ ఈ వివాదంలోను పిటీషనర్. కొందరు ఒక పథకం ప్రకారం ఈ వివాదాలు సృష్టిస్తున్నారని అర్థం కావడం లేదా? 1526లో మందిరాన్ని కూల్చి మస్జిదు నిర్మించారని అంటున్నారు. బాబరీ మస్జిద్ వివాదంలో మందిరాన్ని కూల్చి మస్జిద్ కట్టారన్నది నిరూపించారా? రుజువులు చూపించారా?
సంభల్ మస్జిదుపై పిటీషన్ వేసిన కొన్ని గంటల్లోనే సర్వే ఆదేశాలు అక్కడి సివిల్ జడ్జి ఆదిత్యసింగ్ జారీ చేశారు. న్యాయం ఎంత వేగంగా పనిచేస్తుందో అని ఆశ్చర్యపోవడం మన వంతయ్యింది.
ఆప్ పార్టీ నాయకుడు సంజయ్ సింగ్ ఈ విషయమై మాట్లాడుతూ, మధురలో సర్వే చేయించారు, ప్రశాంతంగా జరిగింది. కాశీలో సర్వే చేయించారు, ప్రశాంతంగా జరిగింది. ఇక్కడ హింసాకాండ ఎలా జరిగింది? ఇది ఇక్కడి ప్రభుత్వం చేయించిన ఘనకార్యం అన్నాడు. కుట్రపూరితంగా చేయించిన హింసాకాండ అని ఆరోపించాడు. పిటీషన్ వేసిన వెంటనే, మరో పక్షం వాదన వినకుండా ఆదేశాలు న్యాయస్థానం ఇచ్చేయడం, మరుక్షణం సర్వే ప్రారంభం కావడం … ఇలా సాధారణ ప్రజల విషయంలో న్యాయస్థానాలు వేగంగా పనిచేయడం చూశామా అని ప్రశ్నించారు.
మొదటి సర్వే ప్రశాంతంగా జరిగింది. కాని ప్రశాంతంగా సర్వే జరగడం కాదుకదా మతశక్తులు కోరుకుంటుంది. రెండవసారి సర్వే చేయించారు. సర్వే టీముతో పాటు మతపరమైన నినాదాలిస్తూ కొందరు నడుస్తున్న వీడియో వచ్చింది. సర్వే టీముతో పాటు మతపరమైన నినాదాలిస్తున్న వాళ్ళు సర్వే టీము సభ్యులా? ఎవరు వాళ్ళు? వాళ్ళను ఎవ్వరు అడ్డుకోలేదు. వాళ్ళు కూడా సర్వే టీము సభ్యులా? అంటే సర్వే టీము ఒక మతానికి సంబంధించిన వారిదా? హింసాకాండను ఎలా రెచ్చగొట్టారో ఇదంతా గమనిస్తే స్పష్టంగా అర్థమవుతుంది.
కాంగ్రెసు నేత సుప్రీయి శ్రినేత్ ఈ విషయం గురించి మాట్లాడుతూ మణిపూర్ లో మంటలు పెట్టిన బీజేపీ ఇప్పుడు దేశమంతా మంటపెట్టాలని చూస్తోందన్నారు. ముస్లిములపై బీజేపీ ద్వేషం వల్లనే ఈ హింసాకాండ అని చెప్పారు. సర్వే టీముతో పాటు మతపరమైన నినాదాలిచ్చిన వారి గురించి, పోలీసుల వైఖరి గురించి ఆమె ప్రస్తావించారు. వివాదాలు సృష్టించే ఒక ఫార్మూలా కనిపెట్టారని. క్రింది కోర్టులో పిటీషన్ వేస్తారు … సర్వే ఆర్డర్ వస్తుంది … మస్జిదుల్లో నినాదాలతో వెళతారు… ఘర్షణ జరుగుతుంది… బీజేపీ నేతలకు మతరాజకీయాల అవకాశం దొరుకుతుందని చెప్పారు.
ఇదంతా గమనిస్తే పాలనాయంత్రాంగం, పోలీసు యంత్రాంగం కూడా మతతత్వ శక్తులకు తోడయ్యిందని కొందరు విశ్లేషిస్తున్నారు. రాహుల్ గాంధీ చేసిన ట్వీటు గమనించదగింది. సంభల్ వివాదంలో రాష్ట్రప్రభుత్వం పక్షపాతంతో వ్యవహరించిందని స్పష్టంగా ఆయన చెప్పారు. హిందూ ముస్లింల మధ్య చిచ్చుపెట్టే చర్యలు రాష్ట్రానికి, దేశానికి మంచిది కాదని ఆయన చెప్పారు. అఖిలేష్ యాదవ్ కూడా తన ట్వీటులో సర్వే పేరుతో ఉద్రిక్తతలు రెచ్చగొట్టే ప్రయత్నాలను సుప్రీంకోర్టు వెంటనే గమనించాలని కోరారు. ఈ మతఘర్షణలు ప్రభుత్వం చేయించిన మతఘర్షణలని నిర్మొహమాటంగా చెప్పారు.
సుప్రీంకోర్టు వెంటనే జోక్యం చేసుకుంటుందా? దేశంలో బుల్డోజర్ ప్రయోగాలు జరుగుతున్నా సుప్రీంకోర్టు చాలా కాలం తర్వాత కాని దీనిపై స్పందించలేదు. సర్వే పేరుతో జరుగుతున్న ఈ మతరాజకీయాలను వెంటనే సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోవడం అవసరమా కాదా? విచిత్రమేమిటంటే, సుప్రీంకోర్టు ఆదేశాల వల్లనే క్రింది కోర్టులు ఈ సర్వే ఆదేశాలిస్తున్నాయని కొందరు వివరిస్తున్నారు.
మస్జిదు క్రింద ఏముంది? ఏ మందిరం దాగి ఉంది? ముస్లిముల జనాభా పెరిగిపోతోంది. గజ్వాయే హింద్ పథకాలేస్తున్నారు… ఇలాంటి ప్రచారాలతో ముస్లిములను విలన్లుగా చూపించే ఈ రాజకీయాలు ఇంకెంత కాలం నడుపుతారు? దీనివల్ల ఎవరికి ప్రయోజనం. ప్రతి మస్జిదులో శివలింగాన్ని చూడరాదని ఆరెస్సెస్ అధినేత మోహన్ భాగవత్ చెప్పిన మాటలు ఇప్పుడెవరికైనా గుర్తున్నాయా? ఆయన ఆ మాటలు సీరియస్ గా చెప్పారా? లేక ఒకప్పుడు అమిత్ షా చెప్పినట్లు ఈ మాటలు కేవలం జుమ్లాలు మాత్రమేనా. ఆయన సీరియస్ గా చెప్పినా దేశంలో మతతత్వ శక్తులు ఆయన్ను సీరియస్ గా తీసుకోవడం మానేశారా?
సంభల్ హింసాకాండ తర్వాత మోహన్ భాగవత్ ఎలాంటి ప్రకటన చేయలేదన్నది కూడా గమనించాలి.
కుతుబ్ మినార్, తాజ్ మహల్ వగైరాలపై కూడా ఇలాంటి వివాదాలు రాజేసే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. తాజ్ మహల్ వ్యవహారాన్ని పెద్ద వివాదంగా మార్చే ప్రయత్నం చాలా జరుగుతోంది. ఈ కట్టడాలన్నీ మందిరాలుగా మార్చేస్తే దేశంలో సమస్యలన్నీ పరిష్కారమైపోతాయని జనం నమ్ముతున్నారా? నిజానికి ఆరాధనాలయాల చట్టం ప్రకారం ఈ వివాదాలు తలెత్తనే కూడదు. కాని ఈ వివాదాల వార్తలతోనే మీడియా మారుమోగి పోతోంది. ఈ వివాదాలు నడుస్తున్న జిల్లాలోని కాలేజీల్లో, స్కూళ్ళలో టీచర్లు పూర్తి సంఖ్యలో ఉన్నారా? ఆసుపత్రుల పరిస్థితి ఏమిటి? ప్రభుత్వాసుపత్రుల్లో ఎంతమంది డాక్టర్లున్నారు? ఇలాంటి సర్వేలు ఎవరు చేయించరు? చేయాలని ఎవరు అడగరు. కాని మస్జిదు క్రింద మందిరం ఉందో లేదో సర్వే చేయించాలనగానే తక్షణం అందరూ నడుం కట్టి ముందుకొచ్చేస్తారు. ఒకవైపు అదానీ కేసు వార్తలు వస్తున్నాయి. కాని ఈ వివాదాలు, మతఘర్షణల వార్తల్లో అవి కొట్టుకుపోతున్నాయి.
సుప్రీంకోర్టు చూస్తుండగానే బుల్డోజర్ రాజకీయాలు నడిచాయి. బుల్డోజర్ నినాదాలు మిన్నంటాయి. సుప్రీంకోర్టు చాలా కాలం చూస్తూ గడిపింది. ఇది మితిమీరి పోయిన తర్వాత కాని సుప్రీంకోర్టు దీనిపై అంకుశంపెట్టలేదు. ఇప్పుడు ఈ సర్వేలపై సుప్రీంకోర్టు ప్రతిస్పందిస్పుందా? నిజానికి డి.వై.చంద్రచూడ్ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ఆయన నేతృత్వంలోని ధర్మాసనం ఇచ్చిన ఆదేశాల వల్లనే క్రింది కోర్టులు ఇప్పుడు ఈ సర్వే ఆదేశాలిస్తున్నాయనొ చాలామంది అంటున్నారు. గ్యానవాపి మస్జిదులో శివలింగం ఉందనే కేసు సందర్భంగా వారణాసి క్రింది కోర్టు సర్వే చేయించాలని ఆదేశించింది. మస్జిద్ కమిటీ దీన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టు వెళ్ళింది. ఈ కేసులో ఆయన నేతృత్వంలోని ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలే సర్వేలకు కారణమయ్యాయి. దేశంలో ఆరాధనాలయాల చట్టం ఎందుకుంది? మస్జిద్ మందిర్ వివాదాలు తలెత్తకుండా చూడ్డానికి ఉద్దేశించిన ఈచట్టం పరిస్థితి ఏమిటి? ఇప్పుడు రోజుకో వివాదం పుట్టుకు వస్తోంది. ఈ సర్వేల వల్ల మతరాజకీయాలకు కావలసినంత సామాను లభిస్తోంది. మీడియాలో వచ్చే రకరకాల వార్తలు, మీడియా చర్చలు దేశంలో మత ఉద్రిక్తతల వాతావరణానికి కారణమవుతాయి.
క్రింది కోర్టు ఒక మస్జిద్ క్రింద మందిరం ఉండేదా అన్న వివాదం విషయంలో సర్వే ఆదేశాలివ్వగానే ఆ ప్రాంతంలో మతసామరస్య వాతావరణం వెంటనే దెబ్బతింటుంది. మస్జిదు క్రింద మందిరం ఉండేదంట అనే చర్చలు కార్చిచ్చులా వ్యాపిస్తాయి. వివాదం ముదిరి ఘర్షణల స్థాయికి చేరుకుంటుంది. దీనివల్ల సగటు ప్రజలకు ఏమైనా లాభం కలిగిందా?
దేశంలో రాజకీయాలను గమనిస్తే ఎవరికి లాభం కలిగిందో తెలుస్తుంది. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. హర్యానా, మధ్యప్రదేశ్ మాదిరిగానే మహారాష్ట్ర కూడా బీజేపీ గెలుచుకుంది. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ గెలుస్తుందనుకున్నారు. కాని బీజేపీ తీసుకువచ్చిన లాడ్లీ బహెన్ యోజనతో మహిళల ఖాతాలో డబ్బులేశారు. అదే వ్యూహం ఇక్కడ మహారాష్ట్రలో అమలు చేశారు. లాడికి బహెన్ యోజన క్రింద మహారాష్ట్రలో మహిళల ఖాతాలో డబ్బులేశారు. పోలింగ్ కు ముందు ప్రతి ఒక్కరి ఖాతాలో ఏడున్నర వేల రూపాయలు ట్రాన్స్ ఫర్ అయ్యాయి. మహారాష్ట్రలో దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న మహిళల కన్నా రెండున్నర రెట్లు ఎక్కువ మంది మహిళల ఖాతాల్లో డబ్బులేశారు.
గమనించవలసిన విషయమేమిటంటే దేశంలో కేవలం 50శాతం మంది మాత్రమే మూడుపూటల భోజనం చేయగలిగిన స్థితిలో ఉన్నారు. పోషకాహారం లభించని వారు చాలా మంది ఉన్నారు. మహారాష్ట్రలో 21 శాతం మంది మరాఠాలు దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నారు. మహారాష్ట్రలో ఈ సంవత్సరం మొదటి ఆరునెలల్లో 1267 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రజల్లో ఇంత పేదరికం ఉన్నప్పుడు ప్రజల ఖాతాలో డబ్బులేస్తే ఎంత సంతోషిస్తారో వేరే చెప్పనవసరం లేదు. గమనించవలసిన విషయమేమిటంటే, రాహుల్ గాంధీ 2019 ఎన్నికల్లో న్యాయ్ స్కీము గురించి ప్రస్తావించినప్పుడు తాయిలాలు పంచిపెట్టి దేశఆర్థికవ్యవస్థను నాశనం చేసే స్కీముగా విమర్శించిన సోకాల్డ్ మీడియా… మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో ఈ మనీ ట్రాన్స్ ఫర్ స్కీమును మాస్టర్ స్ట్రోక్ అంటూ ప్రశంసిస్తోంది. హర్యానా ఎన్నికల్లో, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో, మహారాష్ట్ర ఎన్నికల్లో ఈ తాయిలాల వాగ్దానాలే గెలిపించాయి.
ఇప్పుడు జరుగుతున్నది ఇదే. ప్రజలను పేదలుగా నిరుపేదలుగా మార్చడం. నిరుద్యోగాన్ని పెంచడం. మతరాజకీయాలు చేసి మతఘర్షణల వాతావరణం సృష్టించి మస్జిద్ మందిర్ వివాదాల్లో ప్రజలు, దేశంలోని యువత తలమునకలై పోయేలా చేయడం. దారిద్రం, నిరుద్యోగంలో కూరుకుపోయిన వారికి ఎన్నికలకు ముందు ఖాతాల్లో డబ్బులేసి సంతోషపెట్టడం. ఎన్నికల్లో గెలవడం. ఎన్నికల్లో గెలవడానికి మతరాజకీయాలను కొనసాగించడం. వివాదాలు రాజేయడం, ప్రజలను వివాదాల్లో ముంచి పేదరికాన్ని పెంచడం. తాయిలాలు పంచిపెట్టి సంతోషపెట్టి ఎన్నికలు గెలవడం.
బాబరీ నుంచి అజ్మీర్ దర్గా వరకు వివాదాల్లో ఎవరికి ప్రయోజనం కలిగిందో ఇంకా వివరించవలసిన అవసరం లేదనుకుంటాను.
– వాహెద్