December 6, 2024
(ప్రముఖ రచయిత, విమర్శకుడు రజాహుస్సేన్ రాసిన పంక్తులు)
“అబుల్ ఫౌజాన్ “గ్రంథంలో ఔరంగజేబు వ్యక్తిత్వం..గుణగణాలు….!!
ఔరంగజేబు అనగానే ఓ దుర్మార్గుడు,దుష్టుడు, తండ్రిన చంపిన హంతకుడిగా చిత్రీకరించారు నల్లకళ్ళజోడు ధరించి చరిత్ర రాసిన కొందరు చరిత్రకకారులు . నిజానికి ఔరంగజేబు సుగుణశీలి. వినయసంపన్నుడు భగవంతుడి పట్ల భయభక్తులు కలిగిన వాడు. అత్యంత నిరాడంబరుడు, ప్రభుత్వసొమ్ము  ఆశించని పాలకుడు, ప్రజాసంక్షేమం కోసం పాటుపడిన పాదుషా.దురదృష్టం ఏమంటే చరిత్రలో ఔరంగజేబుపై దుమ్ముచల్లి, అతని వ్యక్తిత్వాన్ని మసకబార్చారు. ఔరంగజేబుపాలన, జీవన శైలి, ఆయన గుణగణాలు ఎంతో గొప్పవి.  పదుగురికిఆదర్శప్రాయమైనవి. ఔరంగజేబ్ మొదటి జామునే నిద్రించేవాడు. రెండో జాము భుక్తి సంపాదనకోసం టోపీలు కుట్టేవాడు. ఖురాన్ ప్రతులు రాసేవాడు మూడో జాము ప్రజల కష్టసుఖాలను తెలుసుకోడానికి మారువేషంలో తిరిగేవాడు. సమకాలీన చరిత్ర కారుడు ముస్తఅద్ ఖాన్ ఔరంగజేబు గురించి ఇలా రాశాడు.
*”ఔరంగజేబ్ ధార్మికుడు.సున్నీ ధార్మిక భావనల్ని తు.చ తప్పకుండా ఆచరించేవాడు.ఎల్లప్పుడూ వుజూతో వుండి నమాజు ప్రారంభ సమయంలోనే మస్జీదులో జనం మధ్య సంచరించేవాడు. జకాత్ చెల్లించమని ఆదేశించేవాడు. ఆయన హజ్ యాత్ర చేయలేకపోయాడు. అయితే హజ్ యాత్రికుల కోసం నిధులు పంపేవాడు. వివాహిత భార్యలతో తప్ప పరస్త్రీలనుకన్నెత్తిచూడలేదు. నిషేధితాలకు, వ్యసనాలకు దూరంగా ఉండేవాడు. దర్బారులో పరనింద,చాడీలు చెప్పడం,నిషేధం. ఆయన మహా సామ్రాజ్యానికి పాదుషా అయినాఎప్పుడూ వెండి,బంగారు పళ్ళాలు వాడలేదు. ఇసుమంత గర్వం కూడా లేనివాడు. సొంత పగ, ప్రతీకారం కోసం ఎవరినీచంపలేదు.పేదలు, అవసరార్థులు, బాటసారులకోసం దాన కేంద్రాల్ని ,వసతి గృహాల్ని ఏర్పాటు చేశాడు. నిత్యావసర సరుకుల పై రహదారి పన్నుని ఎత్తేశాడు.”.!!
ఔరంగజేబ్ ను తీవ్రంగా విమర్శించే జదూనాథ్ సర్కార్ అనే చరిత్రకారుడు కూడా ,ఆయన సుగుణాల్ని వల్లెవేయక తప్పలేదంటే ఔరంగ జేబ్ వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకోవచ్చు.
“*అతను గొప్ప వీరుడు.అతని వీరత్వంలో వివేక వివేచనాలు, దూరాలోచన, మరియు  స్థిరత్వాలున్నాయి. అతను నిర్భయుడు. అన్ని సుగుణాలు ఆయనలో వుండేవి.విద్యాధికుడు. ఇతరులతో మాట్లాడేటప్పుడు నాలుకను నియంత్రించుకునేవాడు. ఎన్నడూ హద్దుల్ని అతిక్రమించలేదు. తెలివి,యోగ్యత, అణకువ ఆయనకుసహజంగాఅబ్బాయి. వ్యక్తిగత జీవితం, దుస్తులు ఆహార వ్యవహారాలు అతి సామాన్యంగా వుండేవి.పరిపాలనలో అహర్నిశం కష్టపడేవాడు. అతను బుద్ధి సూక్ష్మత, నైతికత మరియు ఘనకార్యాల విషయంలో ఆసియాకు సంబంధించిన మహాపరిపాలకుల్లో ఒకడిగా పరిగణింప బడతాడు.(హిస్టరీ ఆఫ్ ఔరంగజేబ్, వాల్యూం5,పే.362..324)
రాజుల్లో,పాదుషాల్లో సహజంగా కనబడే అహంకారం,డాబు,దర్పం మచ్చుకు కూడా లేని వాడు ఔరంగజేబ్. ఆలోచన, ఆచరణకు మధ్య సమన్వయం సాధించిన పాదుషా అతను. చెప్పేదొకటి,చేసేదొకటి కాకుండా,తాను ఏది ఆచరించేవాడో,దాన్నే చెప్పేవాడు.ఏది చెప్పే
వాడో దాన్నే అమలు చేసేవాడు.భేషజాల్లేని వ్యక్తిత్వం.తన కాలంలో విద్య కూడా ప్రాక్టికల్  గా వుండేలా జాగ్రత్తలు తీసుకున్నాడు.అక్కరకు రాని విద్యకు చెల్లు చీటీ ఇచ్చాడు. మనకు ఏదికావాలో,దాన్నందించేదే నిజమైన విద్య అనేవాడు. అలానే అమలు చేశాడు కూడా.
ఓ చారిత్రక సందర్భంలో ఔరంగజేబ్ విద్య గురించి తన గురువుకు రాసిన ఓ లేఖను కె.శ్రీనివాస్ సూఫీ కవిత్వీకరించాడు. ఇప్పుడు సందర్భం కాబట్టి పాఠకులకోసం ఇక్కడ ఇస్తున్నాను.
ఔరంగజేబు ఉత్తరం..
నేర్పిందేంటి
నేను నేర్చిందేంటి..
ప్రపంచాన్ని
అరచేతి పుస్తకంగా ప్రేమించటం మానేసి
పాఠం పేరుతో పుస్తకాల పుటల్లో విశ్వ దర్శనం ఏంటి..?
పావురాలను సమాజం అధ్యయనం దిశగా ఎగరేయటం వదిలేసిశిక్షణ సాకుతో తరగతి గదుల్లో పక్షుల బాల్యం బందీ ఏంటి..?
మొదట పోర్చు గల్లు ఆ తదుపరి హాలాండు.
తరువాత ఇంగ్లాండు హిందూ రాజులు
అందరికంటే గొప్ప అని ఫ్రాన్సు, స్పెయినూ చిన్న అని మాతృ భాషను ప్రజలు మాట్లాడే భాషను విస్మరించి
అరేబియన్ పరభాషను నాపై రుద్దటమేంటి రాజ్య వంశ చరిత్రలు దాడులూ
దండ యాత్రలు సింహాసనాలు మట్టి చరిత్రను
గుట్టలుగా తవ్వితీసి వర్తమాన వారథినిర్మించటం ఏంటి..?
నేర్పిన పాఠం రాజ్య పరిపాలనా దక్షతకు దోహద పడకపోతే..
శతృ దాడినుండి రాజ్యాన్ని రక్షించే
మెలకువ వివరించక పోతే
నువ్వు యుద్ధానికే పుట్టిందని నా ఖడ్గానికి జ్ఞానోదయం కావించక పోతే
కష్ట నష్టాలకుకుంగిపోని స్థిత ప్రజ్ఞత అలవరచకపోతే
అలెగ్జాండర్తన గురువు అరిస్టాటిల్ నుంచి పొందిన తాత్వికత నాకు నేర్పించక పోతే..
నేర్పిందేంటి నేను నేర్చిందేంటి.. నా గురువుగా
ఈ రాజ్యంలో మీకే ప్రత్యేక స్థానం లేదు ఏదో గ్రామానికి వెళ్ళి పౌర జీవనం గడపండి రోజూ
ఒక కొత్త పాఠం నేర్చుకోండి..!
( ఔరంగ జేబు తన గురువు ముల్లా సాబ్ కు రాసిన ఉత్తర సారాశం)!
అబుల్ ఫౌజాన్ ఈ గ్రంథాన్ని ఆషామాషీగా యేం రాయలేదు. కొన్ని సంవత్సరాల చరిత్రను శోథించాడు. పాత డాక్యుమెంట్లు పరిశోథించాడు.
వాటి ఫలితమే.. ఈ ” ఔరంగజేబు” 621 పేజీల ఉద్గ్రంథం.
*ఎ. ర‌జాహుస్సేన్..!!