భారతదేశం నా మాతృభూమి. భారతీయులందరూ నా సహోదరులు…
స్కూల్లో చదువుతున్నప్పుడు భుజానికి పుస్తకాల సంచి వేసుకుని స్కూలు అసెంబ్లీలో ఈ ప్రతిజ్ఞ చదివిన జ్ఞాపకాలు చాలా మందికి ఉండే ఉంటాయి. అందరం భారతీయులం అని గర్వంగా చెప్పుకునేవాళ్ళం. కాని ఇప్పుడు అందరూ హిందువులని చెప్పుకోవాలనే వాదన మొదలయ్యింది.
మరోసారి హిందూ పదం చర్చల్లోకి వచ్చింది. ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ దేశంలో నివసిస్తున్న వారంతా హిందువులే అన్నారు. అందరి ఢిఎన్ఏ ఒక్కటేనన్నారు. ఛత్తీస్గఢ్ లోని అంబికాపూర్ లో స్వయంసేవకుల సమావేశంలో ఈ మాటలు చెప్పారు.
ఇంకా ఏమన్నారంటే – నలభైవేల సంవత్సరాల ప్రాచీన అఖండభారతానికి చెందిన వారందరి డిఎన్ఏ ఒక్కటే అన్నారు.
అఖండ భారతం:
ఈ మాటలు విన్న తర్వాత మనసులో తలెత్తే ప్రశ్న ఏమిటంటే, నలభై వేల సంవత్సరాల క్రితం భారతదేశం నైసర్గిక స్వరూపం ఏమిటి? అఖండ భారతదేశం అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి విస్తరించి ఉండేది? ఈ ప్రశ్నలకు కూడా ఆయన జవాబిచ్చారు.
పశ్చిమ కాబూల్ నుంచి చింద్విన్ నది తూర్పు వరకు, టిబెట్ తూర్పు నుంచి శ్రీలంక వరకు అంతా అఖండ భారతదేశంగా ఉండేదన్నారు. ఈ ప్రాంతంలోని ప్రజలందరి డిఎన్ఏ గత 40వేల సంవత్సరాల నుంచి ఒక్కటే అన్నారు. ఈ మాటలను ఎలా అర్థం చేసుకోవాలి?
ఈ విశాల ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న దేశాల్లోని ప్రజలందరూ హిందువులే అని ఆయన చెబుతున్నట్లు అర్థం చేసుకోవాలా?
ఈ మాటలను మరికాస్త అర్థం చేసుకోడానికి ఏప్రిల్ నెలలో ఆయన చేసిన వ్యాఖ్యలను కూడా పరిశీలించాలి. హరిద్వార్ లో ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ మరో పది పదిహేను సంవత్సరాల్లో అఖండ భారత్ కల నిజమవుతుందన్నారు. ఈ వ్యాఖ్యలపై అప్పుడు రాజకీయ దుమారం లేచింది.
సావర్కర్ అఖండ భారతం గురించి 1937లో చెప్పారు. ఆయన ప్రకారం కశ్మీర్ నుంచి రామేశ్వరం వరకు, ప్రస్తుతం పాకిస్తాన్ లోని సింథ్ నుంచి అస్సాం వరకు. అరెస్సెస్ దృష్టిలో అఖండ భారత్ అంటే అఫ్గనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్, టిబెట్, భూటాన్, నేపాల్, అక్సాయ్ చిన్ అన్ని కలిసిన ప్రాంతం.
మధ్యాసియాలోని తాష్కెంట్, సమర్ఖండ్ ప్రాంతాలు కూడా కొందరు కలిపేస్తారు. ఈ ప్రాంతంలోని దేశాలన్నింటిలోను ఉంటున్న ప్రజలందరు ఆరెస్సెస్ ప్రకారం హిందువులని అనుకోవాలా?
ఇలాంటి చాలా ప్రశ్నలు ఇప్పుడు తికమకపెడుతున్నాయి. ఇక్కడ ఆసక్తికరమైన మరో విషయమేమిటంటే, ఆరెస్సెస్ అఖండ భారత్ అనే పదం ఉపయోగిస్తోంది. భారత్ అనే పదాన్ని వాడుతున్నప్పుడు ఇక్కడి ప్రజలందరినీ భారతీయులుగా పిలిస్తే ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు, వివాదాలు లేనప్పుడు హిందూ అనే పదాన్ని పనిగట్టుకుని పదే పదే చర్చల్లోకి తీసుకురావడం ఎందుకు?
మోహన్ భగవత్ తన ప్రసంగంలో చెప్పిన మరి కొన్ని మాటలేమిటంటే ’’మేం ఈ విషయాన్ని 1925 (ఆరెస్సెస్ ఏర్పడిన సంవత్సరం) నుంచి చెబుతున్నాం. భారతదేశంలో నివసించే వారంతా హిందువులే అంటున్నాం. భారతదేశాన్ని మాతృభూమిగా భావిస్తూ భిన్నత్వంలో ఏకత్వ సంస్కృతిలో జీవించేవారు, వారి మతం, సంస్కృతి, భాష, ఆహారఅలవాట్లు, సిద్ధాంతాలు ఏమైనా గాని వారంతా హిందువలే‘‘ అన్నారు.
వాళ్ళంతా భారతీయులే అని చెప్పి ఉంటే ఎంతో బాగుండేది. కాని హిందూ అనే పదాన్ని చర్చలో ఉంచడంలోనే అసలు రాజకీయం దాగి ఉంది.
దేశభక్తి:
మోహన్ భగవత్ 2021 జనవరిలో చెప్పిన మాటలు కొన్ని ఇక్కడ గమనించాలి. గాంధీజీపై రాసిన క పుస్తకావిష్కరణఱ సభలో మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే, ’’నా మతం నుంచి నాకు దేశభక్తి లభించిందని గాంధీజీ అన్నారు. కాబట్టి మీరు హిందువైతే మీరు ఆటోమేటిగ్గా దేశభక్తులైపోతారు … ఒక హిందువు దేశద్రోహి కాలేడు‘‘.
మోహన్ భగవత్ అప్పుడు చెప్పిన మాటలకు అర్థమేమిటి? హిందువు ఆటోమేటిగ్గా దేశభక్తుడయితే, దేశంలోని ప్రజలంతా హిందువులైతే, దేశద్రోహం కేసులు నమోదైన వారెవరు? శత్రుదేశాలకు సైనిక రహస్యాలు అమ్ముతూ పట్టుబడిన వారెవరు?
ఇలాంటి కేసులు అడపాదడపా పత్రికల్లో కనబడుతూనే ఉన్నాయి. ఉదాహరణకు ఈ సంవత్సరం జులైలో శాంతిమొని రాణా అని సైనికుడిని ఇలాంటి కేసులోనే అరెస్టు చేశారు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన వార్త. 2010లో ఇండియాటుడే వెబ్ సంచికలో పిటిఐ ఆధారంగా ఇలాంటి కేసుల గురించి రాశారు. మాధురీగుప్తా, సుఖ్ జిందర్ సింగ్, మన్మోహన్ శర్మ, రబీందర్ సింగ్, అశోక్ సాథే లాంటి అనేక పేర్లు ఆ కథనంలో ఉన్నాయి. ఆటోమేటిక్ దేశభక్తి ఏమయ్యింది?
భిన్నత్వంలో ఏకత్వం:
మోహన్ భగవత్ తన ప్రసంగంలో భిన్నత్వంలో ఏకత్వం సంస్కృతి గురించి మాట్లాడారు. చాలా చక్కని మాటలు చెప్పారు. ఇటీవల వచ్చిన ఒక వార్త ఏమిటంటే, మైసూరు కొడగు లోక్ సభ ఎం.పీ ప్రతాప్ సిన్హా ఒక బస్ షెల్టరును అధికారులు కూల్చకపోతే తానే కూలగొడతానని అన్నాడు. కారణమేమిటంటే, ఆ బస్ షెల్లరు డిజైనులో పైకప్పు మూడు గుమ్మటాల డిజైనులో చేశారు. గుమ్మటాల డిజైను ఉంటే అది మస్జిదులా కనిపిస్తుందని, దీన్ని సహించేది లేదని బీజేపీ ఎం.పీ.గారు సెలవిచ్చారు. ఆరెస్సెస్ మాతృసంస్థ నుంచి వచ్చిన బీజేపీ ఎం.పీగారి ఈ వైఖరి భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనమా?
జనాభా:
గత నెలలో ఆరెస్సెస్ నాయకుడు దత్తాత్తేయ హోసబలే ఒక పత్రికాసమావేశంలో మాట్లాడుతూ చెప్పిన మాటలు కూడా ఇక్కడ ప్రస్తావించాలి. భారతదేశంలో జనాభా సమస్య గురించి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన భారతదేశంలో హిందువుల జనాభా తగ్గిపోతుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి ముఖ్యమైన కారణం మతమార్పిళ్ళని అన్నారు. మతప్రాతిపదికన జనాభా సమతుల్యం అవసరమని కూడా చెప్పారు. దేశవిభజనను కూడా ప్రస్తావించారు.
దేశంలో ఉన్నవారంతా హిందువులే అయితే హిందువుల జనాభా తగ్గిపోతుందంటూ ఆయన చెప్పిన మాటలను ఎలా అర్థం చేసుకోవాలి?
కర్నాటకలో వివాదం:
కర్నాటక కాంగ్రెసు శాసనసభ్యుడు సతీష్ జర్కిహోలి ఇటీవల చేసిన వ్యాఖ్యల తర్వాత ఆరెస్సెస్ అధినేత దేశంలో ప్రజలంతా హిందువులే అనే వ్యాఖ్య చేశారన్నది గమనించాలి. సతీష్ జర్కిహోలి ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ హిందూ అన్న పదాన్ని సృష్టించింది పర్షియన్లని అన్నారు. ఈ పదాన్ని బలవంతంగా మనపై రుద్దారని కూడా చెప్పారు. దీనిపై బీజేపీ గగ్గోలు చేసింది. సాఫ్ట్ హిందూత్వ మంత్రాన్ని ఇప్పుడు ప్రతిపార్టీ జపిస్తుంది కాబట్టి కాంగ్రెసు పార్టీ కూడా సతీష్ వ్యాఖ్యలను తప్పుపట్టింది. కాని ఆయన మాత్రం తాను చెప్పిన మాటల్లో తప్పులేదని, హిందూ పదం పర్షియన్లు వాడిందని చెప్పడానికి చాలా రికార్డులున్నాయని అన్నాడు. స్వామీ దయానందసరస్వతి రాసిన సత్యార్థ ప్రకాశ, డా.జి.యస్.పాటిల్ రాసిన బసవభారత, బాలగంగాధర తిలక్ నడిపిన కేసరి పత్రికలతో పాటు వికీపీడియాను కూడా ఆయన కోట్ చేశాడు. వికీపీడియాలో ఎవరైనా చూడవచ్చు.
మోహన్ భగవత్ 2014లో కూడా ఇలాటి వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ప్రజలందరూ హిందువులే అన్నారు. అప్పుడు సీనియర్ కాంగ్రెసు నాయకుడు దిగ్విజయ్ సింగ్ ఈ మాటలపై వ్యాఖ్యానిస్తూ హిందూ అనే పదం మతగ్రంథాల్లో కనిపించదని అన్నారు. దేశం పేరు భారతదేశమని, మనం పూజలు చేస్తున్నప్పుడు కూడా భారతఖండే జంబూద్వీపే అంటామని వివరించారు. రాజ్యాంగం కూడా దేశాన్ని భారతదేశంగా పిలుస్తుంది. మనమంతా భారతీయులమని అన్నారు. అసలు హిందూ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? మనమంతా సనాతనధర్మావలంబికులం అన్నారు.
నిర్వచనం:
విచిత్రమైన ఒక వార్త 2015లో హిందూ పత్రికలో వచ్చింది. ఆ వార్త ఏమిటంటే, చంద్రశేఖర్ గౌర్ అనే వ్యక్తి అడిగిన ఆర్టిఐ ప్రశ్నకు మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన సమాధానం అది. వివరాల్లోకి వెళితే హిందూ అనే పదానికి అర్థం, నిర్వచనాలను భారత రాజ్యాంగం ప్రకారం తెలియజేయాలని ఆయన అడిగితే అలాంటి సమాచారమేదీ తమ వద్ద లేదని జవాబు వచ్చింది.
ప్రభుత్వం వద్ద ఎలాంటి నిర్వచనం లేదని ఒకవైపు వార్త వస్తే మరోవైపు దేశంలో 80 శాతం హిందువులే కాబట్టి వారిదే ప్రాబల్యం అనే వాదన వినిపిస్తున్నారు.
హిందీ హై హమ్:
ప్రముఖ ఉర్దూ కవి, సారే జహాం సే అచ్ఛా హిందూసితాం హమారా వంటి అద్భుతమైన గీతాన్ని రచించిన అల్లమా ఇక్బాల్ ఆ గీతంలో ’’హిందీ హై హమ్, వతన్ హై హిందూసితాం హమారా‘‘ అని రాశాడు. అంటే భారతదేశంలో ఉంటున్న మనమందరం హిందీ అన్నాడు. ఆయన హిందూ రాయలేదు? ఎందుకంటే హిందూకి, హిందీకి మధ్య ఉన్న తేడా ఆయనకు తెలుసు కాబట్టి.
ఛందస్సు పరంగా కూడా అక్కడ హిందీ అన్న పదం వాడినా, హిందూ అన్న పదం వాడినా తేడా లేదు. అయినా ఆయన హిందీ అన్న పదమే వాడాడు. తత్వవేత్తగా పేరుగడించిన ఇక్బాల్ కు ఈ భారతదేశం హిందూస్తాన్ కాబట్టి ఇక్కడి వారంతా హిందువులే అని భగత్ గారికి ఉన్నంత అవగాహన లేదా? ఒక భాష (హిందీ) పేరును మనుషులకు కూడా వర్తించాడు.
హిందీ భాషను సూచించడానికి మాత్రమే కాదు, భారతీయులని సూచించడానికి కూడా హిందీ అన్న పదం వాడుతారు. గల్ఫ్ దేశాల్లో భారతీయులను హిందీ అనే పిలుస్తారు. హిందూ అని పిలవరు. అందుకే ఇక్బాల్ హిందీ అన్న పదం వాడాడు. పాకిస్తాన్ వాడిని పాకిస్తానీ అంటారు, బ్రిటన్ వాడిని బ్రిటాన్వీ అంటారు, జపాన్ వాడిని జపానీ అంటారు, రష్యా వాడిని రూసీ అంటారు, మిశ్ర్ (ఈజిప్టు) వాడిని మిశ్రీ అంటారు. ఇది భాషా సంప్రదాయం. ఇది ఇక్బాల్ కు తెలుసు కాబట్టి హిందీ అన్న పదం వాడాడు.
గమనించవలసిన మరో ముఖ్యవిషయమేమంటే, హిందూ అన్న పదం నేడు మతవర్గాన్ని సూచించే పదంగా స్థిరపడిపోయింది. హిందూత్వ అన్న పదం దాన్నుంచే కదా పుట్టింది. అలాంటప్పుడు భారతదేశంలో పుట్టిన వారంతా, వాళ్ళు ముస్లిములైనా, క్రయిస్తవులైనా, శిఖ్ఖులైనా, పార్శీలైనా, బౌద్ధులైనా అంతా హిందువులే అనడంలో ఔచిత్యముందా?
ఔచిత్యముందో లేదో మరి కొన్ని కోణాల నుంచి కూడా చూద్దాం.
భారతదేశ చట్టాల్లో ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అని ఒకటి ఉంది. ఇండియన్ అంటే మోహన్ భగత్ గారి ప్రకారం హిందూ కాబట్టి ఆ చట్టాన్ని హిందూ ఎవిడెన్స్ యాక్ట్ అని పిలుద్దామా? అప్పుడు ఆ చట్టం ఎవరికి వర్తిస్తుంది? ఎందుకంటే మనకు మరో చట్టం కూడా ఉంది ’’హిందూ మ్యారేజ్ యాక్ట్‘‘ ఈ చట్టం ఎవరికి వర్తిస్తుంది. హిందువులు అనగా భారతీయులందరూ అని మోహన్ భగత్ గారు సెలవిచ్చారు కాబట్టి ఆ చట్టాన్ని ముస్లిమ్, క్రయిస్తవ, బౌద్ధ మతాల తేడా లేకుండా భారతీయులందరికీ వర్తింపజేస్తారా? హిందూ ఉమ్మడి కుటుంబ చట్టం కూడా ఉంది. దాన్ని కూడా అందరికీ వర్తింపజేస్తారా? ఆ చట్టం ప్రకారం ఆదాయపు పన్నులో రాయితీ అందరికీ వర్తిస్తుందా? మన రాజ్యంగాన్ని ఇండియన్ కానిస్టిట్యూషన్ అంటాం. ఇక్కడ కూడా ఇండియన్ అనే పదానికి సమానార్థంలో హిందూ పదాన్ని వాడేద్దామా?
అలాగే మనం ఇండియన్, భారతీయ అనే పదాల స్థానంలో ప్రతి చోట హిందూ అనే పదాన్ని వాడగలమా? ఇండియన్ ఆర్మీ, భారత సైన్యం అనే బదులు హిందూసేనా అందామా? దేశంలో, సమాజంలో దీనివల్ల పడే ప్రభావమేమిటి?
గమనించవలసిన మరో వాస్తవమేమంటే, ఏదైనా ధరఖాస్తు నింపుతున్నప్పుడు నేషనాలిటి కాలమ్ లో ముస్లిములు ఇండియన్ అని రాస్తారు, రెలిజియన్ కాలంలో ఇస్లాం అని రాస్తారు. అదే హిందువులయితే ఏం రాయాలి? నేషనాలిటి కాలమ్ లో ఇండియన్ అని కాక హిందూ అని రాయాలా? అలా రాస్తే రెలిజియన్ కాలమ్ లో ఏం రాయాలి? ఏ మతానికి చెందిన వారుగా చెప్పుకుంటారు? ఈ సమస్య ఎందుకు తలెత్తుతుందంటే హిందూ అన్న పదం ఒక మతాన్ని సూచించే పదంగా స్థిరపడిపోయింది కాబట్టి. భారతదేశంలోని పౌరులను భారతీయులని పిలిస్తే, ఇదే పేరు రాజ్యాంగం కూడా చెబుతోంది, అప్పుడు ఎలాంటి సమస్య మన ముందుకు రాదు. కాని సమస్యలు సృష్టించకపోతే రాజకీయాలు నడవవు.