ఒరేయ్ అబ్బాయ్! ‘‘అమ్మ, నాన్నలో ఎవరు గొప్పవారు?’’
‘భలే ప్రశ్న అడిగావు బాబాయ్. మన శరీరంలో గుండె, ఊపిరితిత్తులలో ఏది మేలైంది? అని అడిగితే ఏం సమాధానం చెబుతావు’.
రెండూ మేలైనవే. ఏ ఒక్కటి లేకపోయినా మనం బతకలేము కదా.
నిజం చెప్పావు బాబాయ్. అలాగే అమ్మ నాన్నలలో ఎవరి గొప్పదనం వారిదే. వారిలో ఏ ఒక్కరు లేకపోయినా నువ్వు ఉండవు. నేను ఉండను. అసలు మానవ మనుగడే ఉండదు.
‘అదికాదు అబ్బాయ్. ఈ రోజు మౌలానా గారు నాన్న కన్న అమ్మ మూడు రెట్లు ఎక్కువగా సేవకు అర్హురాలు’ అని చెప్పారు.
నిజమే బాబాయ్, మనం ఈ లోకంలోకి తీసుకొని రావడంలో, మనల్ని పెంచి పోషించడంలో అమ్మ పోషించే పాత్రను బట్టి ఆమెకు ఆ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అలా అని నాన్న పాత్ర తక్కువేమీ కాదు కదా బాబాయ్.
అమ్మ విత్తనం నాటితే, నాన్న ఓ తోటమాలిలా ఆ మొక్క ఒక చెట్టులా మార్చడానికి రాత్రి పగలు కష్టపడతాడు.
నిజమే అబ్బాయ్. మా ఇంటి పక్క అతను తన పిల్లలు తనలా కష్టపడకూడదని తన ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదిస్తాడు. మొన్న ఒకసారి జ్వరం వచ్చినా పనికి వెళుతున్నాడు. ‘‘ఎందుకయ్యా ఇంత జ్వరంలో పనికి వెళుతున్నావు?’’ అని అడిగితే, ‘పిల్లల ఫీజులు కట్టాలి బాబాయ్’ అని అన్నాడు.
నువ్వు మాత్రం ఏం తక్కువ తిన్నావు బాబాయ్. నీ ముగ్గురు పిల్లల కోసం ఎంతగా కష్టపడేవాడివి. ఏదైనా తినమని ఇస్తే చాటుగా దాచుకుని పిల్లల కోసం తీసుకుని వెళ్ళేవాడివి గుర్తుందా.
‘నిజమే అబ్బాయ్. తన పిల్లల సుఖసంతోషాల కోసం తండ్రి పడే తపన వర్ణనాతీతం. తాను తినకుండా తన పిల్లల కడుపు నింపాలని ఆరాటపడతాడు. ఉన్నంతలో తన పిల్లలు సమాజంలో తలెత్తుకుని తిరగాలని ఆశిస్తాడు’.
అవును బాబాయ్. కాని పిల్లలు తాము ఎదిగిన తర్వాత తమ కోసం తమ సర్వస్వాన్ని త్యాగం చేసిన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నారు.
నిన్న మౌలానా గారు చాలా మంచి విషయాలు చెప్పారు.
తల్లిదండ్రుల సేవలోనే స్వర్గం ఉంది. వారి నిరాదరణలోనే నరకం ఉంది.
తండ్రి సంతోషంలోనే అల్లాహ్ సంతోషం ఉంది.
నేడు నాది నాది అనేదంతా మీ తండ్రి భిక్షనే. బాల్యంలో నిన్ను కంటికి రెప్పలా కాపాడి, తాను తినకుండా త్రాగకుండా, నిన్ను పెంచి పోషించడం వల్లే నేడు మీరు ఈ స్థితిలో ఉన్నారు. మిమ్మల్ని చదివించడం కోసం తన రక్తాన్ని చెమటగా చిందించడం వల్లే నేడు మీరు ఇలా డాబుసరిగా జీవిస్తున్నారు. కనుక మీరు, మీ సంపద మొత్తం మీ తండ్రిదే అని ప్రవక్త ముహమ్మద్(స) తెలిపారు అని చెప్పారు.
అవును బాబాయ్. ఇస్లాంలో సృష్టికర్త అయిన దేవుని తరువాతి స్థానం తల్లిదండ్రులకు ఇవ్వడం జరిగింది.
ఖురాన్‌లో అల్లాహ్ తల్లిదండ్రులతో ఎలా వ్యవహరించాలో చెబుతూ, మీ తల్లిదండ్రులలో ఒక్కరు కాని ఇద్దరు కాని ముసలి వారై ఉంటే, వారిని ‘‘ఉఫ్’’ అని కూడా అనకండి. వారితో చీదరించుకుంటూ మాట్లాడకండి. వారి కన్న హెచ్చు స్వరంతో మాట్లాడకండి. ఇంకా వారికై ఇలా ప్రార్థించండి, ఓ దైవమా! వారిని కరుణించు. ఏ విధంగానైతే వారు చిన్నతనంలో మమ్మల్ని లాలించారో పోషించారో… అని ప్రార్థించండి.
ఒక్క ఇస్లామ్‌లో అని కాదు బాబాయ్, ప్రతి ధర్మమూ తల్లిదండ్రుల పట్ల మంచితనంతో వ్యవహరించాలి అనే చెప్పింది.
తల్లిదండ్రుల పట్ల మంచితనంతో వ్యవహరిస్తూ ప్రేమాను రాగాలను పంచుతూ ఉండే ఇల్లు స్వర్గం లాంటిది. అలాంటి ఇల్లు సకల శుభాలకు, సుఖసంతోషాలకు నిలయం అవుతుంది అని అంటే అతిశయోక్తి కాదు బాబాయ్.
నిజమే అబ్బాయ్. నేటి యువతరం ఈ విషయాన్ని మరచి ప్రాపంచిక మాయలో పడి ఆనందం కోసం సుఖసంతోషాల కోసం పరితపిస్తున్నారు.
తల్లిదండ్రుల దీవేనలతో ఇల్లు సుఖసంతోషాలకు నిలయం అవుతుంది. ముఖ్యంగా తల్లిదండ్రులు ముసలి వారై పోయిన ప్పుడు తమ పిల్లలు ఆప్యాయతానురాగాల పలుకుల కోసం పరితపిస్తుంటారు. నాన్న గారు, మామయ్య గారు, తాతగారు అన్న ప్రేమ పూర్వకంగా పిలిచే పిలుపులో బూస్ట్ కన్న వంద రేట్ల ఏనుగుల బలం నింపుతుంది.
అవును అబ్బాయ్, చిన్నప్పుడు చాక్లెట్ చూసి ఎలా మురిసి పోయేవారమో అలాగే ముసలితనంలో వారి చిన్న చిన్న అవసరాలు తీర్చిస్తే వారు అలాగే మురిసిపోతారు.
ముఖ్యంగా తండ్రి, పైకి గంభీరంగా కనిపిస్తాడు. పైకి ఏది చెప్పుకోడు. అలాంటి తండ్రి మనసెరిగి మసలుకోవాలి.
అవును అబ్బాయ్. ఈ మధ్య కాలంలో పర్యావరణ దినోత్సవం, తల్లిదండ్రుల దినోత్సవం, మదర్స్ డే, ఫాదర్స్ డే, ఆ డే, ఈ డే అని జరుపుకుంటున్నారు కదా. కనీసం ఫాదర్స్ డే రోజున అయిన తండ్రితో మంచితనంతో వ్యవహరించాలి. ఆ ఒక్క రోజు అయిన ఆయన ఇష్టానికి అనుగుణంగా ఇంటిల్లిపాదీ కల్మషం లేని మనసుతో వ్యవహరిస్తే బాగుంటుంది కదరా.
అవును బాబాయ్ ఆ ఒక్క రోజే కాదు తండ్రి జీవించి ఉన్నంత కాలం అలాగే వ్యవహరించాలి.
జాగ్రత్త! ఈ జీవితం శాశ్వతం కాదు. మరణం తధ్యం. మరణా నంతరం మనం మన కన్నవారితో ఎలా వ్యవహరించామో జవాబు చెప్పుకోవలసి ఉంటుంది.
మౌలానా గారు చెప్పినట్లు, తల్లిదండ్రులే మన స్వర్గం. తల్లి తండ్రులే మన నరకం. అంటే వారితో మంచిగా వ్యవహరిస్తే స్వర్గం. చెడుగా వ్యవహరిస్తే నరకం అన్నమాట.
ఏది ఏమైనా నీ దగ్గర కాసేపు కూర్చుంటే లోకాన్నే మరచి పోయినట్లు ఉంటుంది అబ్బాయ్.
అవును ఈ వారం గీటురాయి ఇంకా రాలేదా.
లేదు బాబాయ్ రాగానే ఇస్తానులే.
అలాగే ఉంటాను అబ్బాయ్.
అలాగే బాబాయ్. ఫీ అమానిల్లాహ్.
——————————————————
– మన అస్తిత్వానికి మరో రూపం నాన్న.
– సమస్యల సుడిగుండలో చిక్కుకుపోకుండా రక్షణ వలయంలా అడ్డు నిలిచేవాడే నాన్న.
– కష్టాలు కన్నీళ్ళు దిగమింగుకుని, మనకు ఆనందాన్ని పంచే వాడే నాన్న.
– జీవితాంతం గుండెల్లో మోసేవాడు, మన జీవితానికి పూల బాట వేసేవాడు నాన్న.
– నాన్న, నా అనే ప్రతిదానికీ పరోక్ష అధికారివి నువ్వే నాన్న.
అబ్దుల్ బాసిత్ కొత్తగూడెం