November 23, 2024

జమాఅతె ఇస్లామీ హింద్‌ ప్రతినిధి మండలి సమావేశం ఏప్రిల్‌ 26-30, 2023 తేదీల్లో జరిగింది. దేశంలో ప్రజాస్వామ్యం, ప్రజాస్వామిక  సంస్థల విధ్వంసం,  శరవేగంగా  పెరుగుతున్న అవినీతి, పెచ్చరిల్లుతున్న విద్వేష, మతతత్వ ధోరణులు,  స్వలింగ సంపర్కుల వివాహాలను ఆమోదించే సమస్య, సౌదీ అరేబియా ఈరాన్‌ దేశాల మధ్య దౌత్యసంబంధాల పునరుద్ధరణ వంటి జాతీయ,  అంతర్జాతీయ  అంశాలు  ఈ సమావేశంలో  చర్చకు వచ్చాయి. ఈ క్రింది తీర్మానాలు ఆమోదించడం జరిగింది.  వివ రాలు చదవండి –

ప్రజాస్వామ్యం, ప్రజాస్వామిక సంస్థల విధ్వంసం

దేశంలో ప్రజాస్వామిక విలువలు శరవేగంగా పతనమవుతున్న పరిస్థితిపై  జమాఅతె  ఇస్లామీ  హింద్‌ ప్రతినిధి మండలి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. పార్లమెంటులోను, వివిధ రాష్ట్రాల అసెంబ్లీల్లోను తగిన చర్చోపచర్చలు లేకుండానే,  అంగీకృత నియమనిబంధనలు, సంప్రదాయాలకు విరుద్దంగా ముఖ్యమైన చట్టాలు  కేవలం  మూజువాణి ఓటు ద్వారా ఆమోదించడం జరుగుతోంది.  న్యాయస్థానాల  స్వేచ్ఛా  స్వాతంత్య్రాలు  కూడా ఇప్పుడు సందేహాస్పదమైపోయాయి.  ఎలక్షన్‌  కమీషన్‌ ఆఫ్‌ ఇండియా, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మొదలైన అర్థస్వతంత్ర లేదా  స్వతంత్రప్రతిపత్తి కలిగిన ప్రజాస్వామిక సంస్థలపై కూడా ప్రభుత్వ ఒత్తిడి పెరుగుతోంది. ప్రతిపక్షాలు, విమర్శకుల గొంతు నొక్కడానికి  ప్రభుత్వ ఏజెన్సీలను ఉపయోగిస్తున్నారన్న ఫిర్యాదు సర్వసాధారణమై పోయింది. ప్రజాస్వామ్యానికి ప్రాణం వంటి భేదాభిప్రాయం ఇప్పుడు ఒక నేరమై పోయింది. దేశానికి మనస్సాక్షి వంటి మీడియా ఇప్పుడు తన ఈ ప్రత్యేకతను కోల్పోతూ ప్రభుత్వ ప్రతినిధిగా మారిపోతోంది.  చట్ట  పరిపాలన  శరవేగంగా  అంత రించిపోతోంది.  పోలీసుల  సమక్షంలోనే హత్యల సంఘటనలు,  న్యాయస్థానాలకు అతీతంగా శిక్షించే ధోరణులు, బూటకపు ఎన్‌ కౌంటర్లు, లాకప్‌ మరణాలు, క్రూరమైన నేరాల్లో శిక్షలు అనుభవిస్తున్న దోషులను విడుదల చేయడం, మతతత్వ శక్తులు బాహాటంగా ఊచకోతలు, సామూహిక అత్యాచారాలకు పాల్పడ తామని బెదిరించడం, విద్వేష వ్యాఖ్యలు-  ఈ  సంఘటనలన్నీ న్యాయప్రియుల్లో తీవ్ర ఆందోళనకు కారణమవుతున్నాయి.

ఈ పరిస్థితి తీవ్రత,  దీనివల్ల వాటిల్లే దీర్ఘకాలిక పర్యవసానాల గురించి దేశంలోని  పౌరులందరు  ఆలోచించాలని  జమాఅతె ఇస్లామీ హింద్‌   ప్రతినిధి మండలి  కోరుతోంది.  ఈ వినాశకర ధోరణులకు వ్యతిరేకంగా గొంతు విప్పాలి.  చట్టం, రాజ్యాంగం, రాజ్యాంగ విలువలను ప్రభుత్వం గౌరవించేలా, తాత్కాలిక రాజ కీయ ప్రయోజనాల  కోసం  దేశ  ప్రయోజనాలను పణంగా పెట్టకుండా పాలకులపై ఒత్తిడి తీసుకురావాలి.  న్యాయస్థానాలు ఇతర స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థల బాధ్యులు ఎట్టి  పరిస్థితు ల్లోను తమ స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు విఘాతం కలుగనీయరాదు. భయప్రలోభాలకు అతీతంగా తమ బాధ్యతలను  నిర్వర్తించాలి. ప్రతి హోదా తాత్కాలికమైనదే,  ప్రతి   మనిషి  జీవితం నశ్వరం, అశాశ్వతం అని ఈ సమావేశం గుర్తు చేస్తోంది. అల్పమైన ప్రయోజనాల కోసం ఉత్తమమైన విలువలను కాలరాచేవారు ఈ లోకంలోను  సంతోషంగా ఉండలేరు,  మరణానంతర జీవితం లోను ఆనందంగా ఉండలేరు.

దేశంలో శరవేగంగా పెరుగుతున్న అవినీతి

వివిధ జీవనరంగాలన్నింటా పెరిగిపోతున్న  అవినీతి తీవ్రత పట్ల జమాఅతె  ఇస్లామీ  హింద్‌ ప్రతినిధి  సభ  ఆందోళన వ్యక్తం చేస్తోంది.  ప్రైస్‌  వాటర్‌  హౌస్‌  కూపర్స్‌ (Price Waterhouse Coopers) సర్వే  ప్రకారం  గత  కొన్ని సంవత్సరాల్లో దేశంలోని 95 శాతం వ్యాపార సంస్థల్లో వివిధ కొత్త రకాలైన నేరాలు పెరిగి పోయాయి. తాజాగా,  కరప్షన్‌  పర్‌సెప్షన్‌  ఇండెక్స్‌ (Corruption perception index)లో భారతదేశం 85 ర్యాంకింగులో ఉంది. మనం ఇప్పటి వరకు ఈ సామాజిక రుగ్మతను తగ్గించడంలో విఫలమయ్యామని ఇది తెలియజేస్తోంది. దీని ప్రభావం తప్పనిసరిగా ప్రభుత్వ ఖజానాపై, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై పడుతుంది. ఆర్‌.బీ.ఐ 2021-22లో 1.97 లక్షల కోట్ల రూపాయల బ్యాంకింగ్‌ మోసాల గురించి సమాచారమిచ్చింది. ఈ బ్యాంకింగ్‌ మోసాలు బ్యాంకింగ్‌ పరిశ్రమ నియమనిబంధనలకు  ప్రశ్నార్థకంగా మారాయి. బ్యాంకులకు  సంబంధించి  10  లక్షల  కోట్ల రూపాయల నిరర్థక ఆస్తులను ప్రభుత్వం రైటాఫ్‌ చేయడంపై కూడా ఈ సమావేశానికి తీవ్ర ఆందోళన ఉంది. రుణాలిచ్చే నియమ నిబంధనల్లోనూ  చాలా  పెద్ద  లోపం ఉన్నట్లు  దీనివల్ల తెలుస్తోంది. వ్యాపారాలకు, పరిశ్రమలకు  రుణాలిచ్చే  ప్రత్యామ్నాయ పద్ధతులపై, వడ్డీలేని రుణాల వ్యవస్థపై విధానకర్తలు ఆలో చించడం అవసరమని కూడా దీనివల్ల తెలుస్తోంది.

ఎలక్టోరల్‌  బాండ్ల  ద్వారా  రాజకీయ  పార్టీలకు  ఫండిరగ్‌ విషయంలో కూడా జమాఅత్‌ ప్రతినిధి మండలి ఆందోళన వ్యక్తం చేస్తోంది. రిపోర్టుల ప్రకారం ఎలక్టోరల్‌ బాండ్ల స్కీము వల్ల ఇప్పటి వరకు రాజకీయ పార్టీలకు మొత్తం 10,791 కోట్ల రూపాయలు లభించాయి.  ఇందులో  చాలా పెద్ద మొత్తం కేవలం ఒకే ఒక్క రాజకీయ పార్టీ ఖాతాలోకి వెళ్ళింది. రాజకీయ పార్టీలకు వ్యాపార సంస్థల తరఫున పారదర్శకత లేనివిధంగా నిధులు సమకూర్చడం కూడా అవినీతికి మరో రూపమే. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థను కుదిపివేస్తోంది.

జీవితంలోని వివిధ  రంగాల్లో  వేళ్ళూనుకున్న అవినీతికి అసలు కారణాలు నైతిక పతనం, జవాబుదారితనం పట్ల నిర్లక్ష్య భావమని జమాఅత్‌ ప్రతినిధి మండలి అభిప్రాయ పడుతోంది.  నైతిక ఆధ్యాత్మిక విలువలు,   దైవం   ముందు  జవాబు  చెప్పుకోవలసి ఉంటుందన్న విశ్వాసం  లేకపోతే  బాధ్యతాయుత  ధోరణులను పెంపొందించడం  సాధ్యం  కాదు.  ఈ  సమస్యకు దేశంలోని సమాజ  శ్రేయోభిలాషులైన  వ్యక్తులు,  సంస్థలు  అందరు ప్రాముఖ్యం ఇవ్వాలి. పార్టీ విధేయతలు,  పార్టీ  సంబంధాలకు అతీతంగా పనిచేసి, ఈ విషయమై ప్రజల్లో చైతన్యం సృష్టించ డానికి నిరంతర ప్రయత్నాలు చేయాలి. అవినీతి నిర్మూలనకు ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని ఈ సమావేశం కోరుతోంది. విచారణ సంస్థల శక్తి  సామర్థ్యాలను  రాజకీయ ప్రత్యర్థులపై ప్రయోగించే బదులు, అసలు నేరస్తులను పట్టుకోడానికి రాజకీయ వివక్ష లేకుండా వినియోగించాలి. ఎలక్టోరల్‌ బాండ్ల పద్ధతిని పారదర్శకం చేయాలి.  చాలా హంగామా తర్వాత ఏర్పడిన లోక్‌ పాల్‌  ఇప్పుడు  కనిపించడం లేదు. లోక్‌పాల్‌ను  క్రియాశీల సంస్థగా మార్చాలి.

పెరుగుతున్న విద్వేషం, మతతత్వ ధోరణులు

దేశంలో పెరుగుతున్న మతతత్వం, విపరీతమవుతున్న విద్వేషాలపై ఈ సమావేశం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. అధికారాన్ని అందుకోడానికి,  అధికారాన్ని కాపాడుకోడానికి తేలికైన, ప్రభావవంతమైన  పద్ధతిగా  మతతత్వాన్ని విద్వేషాన్ని ప్రోత్సహించడం జరుగుతోందని జమాఅత్‌ అభిప్రాయపడుతోంది. మీడియా, విద్యాసంస్థలు, ప్రభుత్వ సంస్థలు దీనికోసం సాధనాలుగా వాడబడుతున్నాయి. ఈ  పరిస్థితిలో  అత్యంత శోచనీయమైన కోణ మేమిటంటే,  సాధారణ  రాజకీయ  నాయకులే  కాక  కొందరు కేంద్ర, రాష్ట్ర మంత్రులు కూడా విద్వేషం,   మతతత్వాల  కాగడా చేతపట్టి తిరుగుతున్నారు. పిల్లలు, యువతీ యువకులను కూడా ఈ నీచమైన పనికి వాడుకుంటున్నారు.

విద్వేషం  మతతత్వాలు  రెండువైపులా పదునున్న కత్తి వంటివి. ఒకవైపు వీటిద్వారా అధికారం లభిస్తుంది, మరోవైపు దేశంలోని అసలు సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యాలను కప్పి పుచ్చుకునే అవకాశమూ ఉంటుంది.  విద్వేషాగ్నిని  రాజేసిన భయంకర  ఫలితాలు  యావత్తు దేశం,  కొత్తతరం అనుభవించ వలసి వస్తుంది. కాని అల్పమైన తాత్కాలిక ప్రయోజనాల కోసం ఇవేవీ పట్టించుకోవడం లేదు.  ముస్లిములతో పాటు క్రయిస్తవ మైనారిటీలు, దళిత  సముదాయం కూడా ఈ మతతత్వ శక్తులకు లక్ష్యమయ్యాయి.

దేశప్రజలు ముఖ్యంగా పాలకవర్గం ఈ పరిస్థితి తీవ్రతను గ్రహించడం అవసరమని జమాఅత్‌ ప్రతినిధి మండలి భావిస్తోంది. ఈ విద్వేషాగ్ని  కొన్ని  వర్గాలకు  మాత్రమే  పరిమితంగా ఉండడం ఎన్నడూ జరగదు. ఈ విద్వేషాగ్ని వ్యాపిస్తే పూర్తి దేశంలో విస్తరిస్తుంది.  విద్వేష  ప్రసంగాల  విషయంలో సుప్రీంకోర్టు ఇటీవలి ఉత్తర్వులను జమాఅత్‌  ప్రతినిధి  మండలి స్వాగతిస్తోంది. సుప్రీంకోర్టు ఈ ఉత్తర్వులపై బలమైన సమయబద్ధమైన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తోంది.

ఈ పరిస్థితి పట్ల ఆందోళన, చింతన కలిగి ఉన్న సమాజ శ్రేయోభిలాషులు  ఈ  విద్వేషాగ్నిని  ఆర్పడానికి స్థయిర్యసాహసాలతో ముందుకు రావాలని,  సముచిత పాత్ర పోషించాలని ఈ సమా వేశం అప్పీలు చేస్తోంది. పెరుగుతున్న విద్వేషాన్ని వ్యతిరేకిస్తున్నామంటున్న రాజకీయ పార్టీలు చెప్పుకునే మాటల్లో వీసమెత్తు వాస్తవమున్నా ఆచరణాత్మకంగా చేసి చూపించవలసిన అవసరముంది. అనుచిత వ్యాఖ్యలు చేసే మంత్రులు, చట్టసభల సభ్యులకు తక్షణం ఉద్వాసన పలకాలి. మతపరమైన సభలు, రెచ్చగొట్టే ప్రసంగాలు జరిగే,  పాటలు వినిపించే బహిరంగ సభలపై కఠిన చర్యలు తీసుకోవాలి.  హింసావిద్వేషాల  చిన్నాపెద్దా కార్యక్రమాలన్నింటిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడమే కాదు, ప్రజలు కూడా తీవ్రంగా ఖండిరచడం చాలా అవసరమని తెలుసుకోవాలి. విద్వేషం, మతతత్వాలను నిరోధించడానికి జమాఅతె ఇస్లామీ హింద్‌ ఎల్లప్పుడు చురుకుగా పని చేస్తోంది.  దేశంలోని  న్యాయ ప్రియులందరూ ముందుకు వచ్చి ఈ పనిలో  జమాఅతె  ఇస్లామీ హింద్‌కు తోడ్పాటు అందించాలి.

స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టపరమైన ఆమోదం

దేశంలో స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టపరమైన ఆమోదం ఇవ్వడానికి  సంబంధించిన  విచారణపై  జమాఅత్‌ ప్రతినిధి మండలి సమావేశం తీవ్ర వ్యతిరేకత  వ్యక్తం  చేస్తోంది. ఇంతకు ముందు 2018లో అధికరణ 377ను రద్దు చేసి స్వలింగ సంపర్కా నికి చట్టబద్దత కల్పించారు. ఇప్పుడు తర్వాతి దశగా స్వలింగ సంపర్కుల వివాహాలను అనుమతించే విషయం విచారణకు వచ్చింది.  స్వలింగ  సంపర్కం అసహజమైనది,  అనైతికమైనది. ఇలాంటి అసహజ చర్య, దీనిపై ఆధారపడిన వివాహాలకు చట్ట బద్దత  కల్పించడం  భారతదేశం వంటి  ధార్మిక  సమాజానికి ఏమాత్రం సముచితమైనది కాదు.

కుటుంబం   అనేది   సమాజానికి   మూలసంస్థ.  స్త్రీపురుషుల వివాహం, పిల్లలకు జన్మనివ్వడం ద్వారా సమాజం రూపుదిద్దు కుంటుంది. కుటుంబాలు బలంగా ఉన్నప్పుడే జాతి సమాజాలు పటిష్టంగా ఉంటాయి. మనదేశంలో పటిష్టమైన కుటుంబ విలువలు, సంప్రదాయాలు ప్రపంచదేశాలకు ఆదర్శమైనవి. ఇంతకు ముందు లివిన్‌ రిలేషన్‌ షిప్స్‌ను  ఆమోదించి  మహిళలు, పిల్లల ప్రయోజనాలను  దెబ్బతీయడం  జరిగింది.   ఇలాంటి  వరుస చర్యలు తీసుకోవడం వల్ల  కుటుంబ  వ్యవస్థ  బలహీనమవుతుంది. కుటుంబం ఛిన్నాభిన్నం కావడానికి కూడా దారితీస్తుంది. లైంగిక విశృంఖలత్వానికి కారణమవుతుంది.

లైంగిక విశృంఖలత్వం, విచ్చలవిడితనాలను అదుపు చేయడానికి మన  ప్రియమైన  దేశాన్ని  దృఢమైన  నైతిక  ధార్మిక విలువలపై నిలబెట్టడానికి    దేశంలోని  సమాజశ్రేయోభిలాషులు,  చైతన్య వంతులు సాధ్యమైన ప్రయత్నాలు చేయాలని జమాఅతె ఇస్లామీ హింద్‌ పిలుపునిస్తోంది.

సౌదీ అరేబియా ` ఈరాన్‌ దేశాల మధ్య దౌత్యసంబంధాల పునరుద్ధరణ

సౌదీ అరేబియా,   ఈరాన్‌   దేశాల  మధ్య జరిగిన ఒప్పందాన్ని జమాఅతె ఇస్లామీ  హింద్‌  ప్రతినిధి మండలి స్వాగతిస్తోంది. ఈ విషయమై ఇరుదేశాలను అభినందిస్తోంది.  ఈ  రెండు  దేశాల సంబంధాలు మెరుగుపడడం పశ్చిమాసియాలో  ముస్లిం దేశాల మధ్య శాంతియుత వాతావరణానికి,  మెరుగైన వాణిజ్య సంబంధాలకు, అర్థవంతమైన పరస్పర సహాయసహకారాలకు, ముస్లిం సమాజంలో సౌభ్రాత్ర భావనలకు తోడ్పడుతుందని ఆశిస్తోంది. ఈ ఒప్పందం వల్ల సిరియా,  యమన్‌  దేశాల్లో  జరుగుతున్న రక్తపాతం,  విధ్వంసాలను  నివారించవచ్చు.  ఇరాక్‌, లెబనాన్‌ తదితర దేశాల్లో కొనసాగుతున్న  వివాదాలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. ఈ ఒప్పందం ఈ ప్రాంతంలో చిక్కుముడి పడిన సమస్యలకు మూలకారణమైన అమెరికా, ఇస్రాయీల్‌ ప్రభావాన్ని తగ్గించడానికి, సామ్రాజ్యవాద శక్తుల యుద్ధ,  వాణిజ్య, రాజకీయ ఉద్దేశ్యాలను  అడ్డుకోవడంలో  కూడా  సహాయపడుతుందని ప్రతినిధి మండలి ఆశిస్తోంది. ఈ  సామ్రాజ్యవాద శక్తులు కేవలం ఈ ప్రాంతానికే కాదు యావత్తు ఆసియా ఖండంలోను, యావత్తు ప్రపంచంలోను వర్ధమాన దేశాల స్వేచ్ఛా సార్వభౌమత్వాలకు సమస్యలు సృష్టిస్తున్నాయి. పలస్తీనా ముఖ్యంగా మస్జిదె అక్సా, గాజా, ఇస్రాయీల్‌ జైళ్ళలోను నిరంతరంగా కొనసాగుతున్న హింసాత్మక  చర్యలపై  ఈ  సమావేశం  తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. సౌదీ అరేబియా,  ఈరాన్‌  ఒప్పందం  వల్ల  పలస్తీనా సమస్య పరిష్కార ప్రయత్నాలు కూడా ఊపందుకుంటాయని ఆశిస్తోంది.

దేశాల మధ్య  సంబంధాలు  పరస్పర  చర్చలు  సంప్రదింపులు, సహాయసహకారాలు, ఉమ్మడి ప్రయోజనాల పునాదులపై నిలబడాలని జమాఅతె ఇస్లామీ హింద్‌ ప్రతినిధి సభ తన సైద్ధాంతిక విధానాన్ని పునరుద్ఘాటిస్తోంది.