July 15, 2024

తెల్లవారుజామున కోడి కూతకంటే ముందే వీధిలోని వారు లేచారు ఇల్లు శుభ్రం చేసుకునే వారు శుభ్రం చేసుకుంటు న్నారు. ఇంటిముందు కల్లాపి చల్లేవారు చల్లుతున్నారు. ఈ వీధిలో రాజు అనే యువకుడు వ్యవసాయ అనుబంధ డిగ్రీ చేసి ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. వ్యవసాయంలో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ వ్యవసాయ పనులు కూడా చేస్తూ ఉంటాడు. తల్లిదండ్రుల ఆశ ఇతన్ని వ్యవసాయ అధికారి చేయాలని. తల్లిదండ్రుల ఆశలను నిజం చేయాలని అహర్నిశలు శ్రమిస్తూ ఉన్నాడు. తెల్లవారుజామున లేచి వాకింగ్‌కు బయలు దేరాడు. దారి మధ్యలో కనపడిన రాళ్లు రప్పలను పక్కకు వేసి పోతున్నాడు. వీధిలోని మహిళలు చెత్త కుండీలో కాక కాలువలో చెత్తను వేస్తుంటే వారిని వారించి చెత్త కుండీలో వేసేలా చేశాడు ఓ ముసలామె వెయ్యలేకపోతే తనే చెత్తకుండీలో వేసి వచ్చాడు. పర్యావరణ ప్రేమికుడు పర్యావరణానికి హాని కలిగితే సహించలేడు.
ఒక మంచి రోజు చూసుకొని సమీప గ్రామాల ప్రజలను రైతులను ఏకం చేసి వారి ఊరులో ఓ పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. సభకు ప్రత్యేక అతిధులుగా వారి ఊరి సర్పంచ్‌ను, విశిష్ట అతిథులుగా వ్యవసాయ అధికారులను ఆహ్వానించాడు. సభకు చాలామంది రైతులు యువకులు, మహిళలు హాజరయ్యారు.
సభలో సర్పంచ్‌ మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే పల్లె పచ్చగా ఉంటుంది అన్నారు. వ్యవసాయ అధికారులు వ్యవసాయంలో కష్టనష్టాలను చీడపీడలను, పంటకు పురుగు పడితే కలుపును ఎలా ఎదుర్కోవాలో మెలకువలు జాగ్రత్తలు చెప్పారు.
రాజు తన ఉపన్యాసాన్ని మొదలుపెట్టాడు. వేదిక మీద పెద్దలందరికీ సభకు హాజరైనందుకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాడు.
వాతావరణంలో మార్పులు ప్రకృతిలో ఆ సమతౌల్యతకు కారణం మనుషులే. మన బతుకులు అన్ని తెల్లారిపోవడానికి కారణం మన అత్యాశయే. అంతరిక్షంలో ఉపగ్రహాలను పంపగలిగే మేధస్సును సంపాదించగలిగిన మనిషి భూమి మీద సాటి మానవులతో ప్రకృతితో ఎలా మసలుకోవాలో తెలుసుకోలేక పోతున్నాడు
కాలుష్యం వల్ల పర్యావరణానికి జరిగే హాని వ్యవసాయంలో రసాయనాల అతి వాడకం వల్ల ఉత్పన్నమయ్యే ఇబ్బందులను వివరిస్తున్నాడు. రసాయన ఎరువుల వాడకంలో కూడా రైతులు సమతుల్యత పాటించకపోవడం వలన దిగుబడులు తగ్గుతు న్నాయి. నత్రజని ఎరువు అధికంగా వాడుట వలన శాఖీయ పెరుగుదల ఎక్కువై, పంట బలహీనమై సులభంగా క్రిమి కీటకాలు ఆశించుటకు దోహదం చేస్తుంది.
భాస్వరం పైరు పెరుగుదలను పెంచుతూ భూమిలో నుండి పోషక పదార్థాలను సక్రమంగా తీసుకొనుటకు వీలు కలుగ జేస్తుంది. పంట కూడా సరిjైున సమయానికి పరిపక్వానికి వస్తుంది.
పొటాష్‌ పైరును దృఢంగా పెరుగుటకు దోహదం చేస్తూ గింజ గట్టిదనం, బరువు పెంచుతుంది. అంతేకాక బెట్ట, క్రిమి కీటకాదులను తట్టుకొనుటకు తోడ్పడుతుంది. సంవత్సరాల తరబడి రసాయనిక ఎరువులు మాత్రమే వాడితే భూములు పంట యోగ్యతకు పనికిరాకుండా పోతాయి. కాబట్టి భూసార పరీక్ష ఫలితాలననుసరించి వేసి పోషక పదార్థాల ఉపయోగం సమర్థవంతంగా జరిగేందుకు, భూపరిస్థితి మెరుగుపడుటకు, అధిక దిగుబడి సాధించుటకు సమతుల్య, సమగ్ర పోషక- యాజమాన్యం అవసరం అని వివరిస్తున్నాడు.
నాడు పంట పొలాలలో ప్రవహించే నీరును, మంచినీరుగా త్రాగేవారు. కానీ పంటలన్నీ రసాయనాలమయం అవ్వడం వల్ల మనుషులు తాగడం మాట అటు వుంచి, పక్షులు తాగడం వల్ల అవి మరణిస్తూ ఉన్నాయి. రసాయనాల అతి వాడకం వల్ల ఆహార పదార్థాల విషతుల్యమై అనేక రోగాల బారిన పడుతున్నారు మనుషులు.
పూర్వం ప్రతి పల్లెలో నదుల్లో, కాలువలలో పశువులు కడుగుతు ఉంటారు ఓ పక్క. మనషులు స్నానాలు చేస్తుంటారు ఓ పక్క. అయినా అప్పుడు అనారోగ్యం బారిన పడలేదు. కానీ పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు వదిలే విష వాయువులు నదుల్లోకి కాలువల్లోకి వదలడం వల్ల ఆ నీరు త్రాగిన పశువులు అనారోగ్యం బారిన పడటం సాధారణమైపోయింది. ఇందులో ఈత కొట్టే చిన్న పిల్లలు చర్మవ్యాధులకు గురి అవుతున్నారు. మనిషి అత్యాశ ప్రకృతితో పాటు మానవాళినీ నాశనం చేసే దిశగా పరిగెడుతుంది. ఇటువంటి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలను మనుషులు నివాసయోగ్యం కానీ భూములలో దూరంగా నిర్మించాలి. ఇంకా పెద్ద పెద్ద మోటార్‌ వాహనాలు వదిలే కర్బన పొగ వల్ల పర్యావరణానికి హాని జరుగు తుంది. చెత్తాచెదారాన్ని ప్లాస్టిక్‌ను ఎక్కడపడితే అక్కడ పడేయడం వల్ల అవి తిన్న పశువులు ప్లాస్టిక్‌ జీర్ణం కాక కడుపు ఉబ్బి అనారోగ్యంతో చనిపోవడం జరుగుతుంది. పర్యావరణాన్ని పరిరక్షించాలి అనుకుంటే ముందుగా ప్లాస్టిక్‌ నిషేధించి ప్రజలకు మేలు చెయ్యాలి. నదులలో పాత దుస్తులను, దండలను, పూలను, వ్యర్థాలను వదిలేయడం సహించరానిది. భారతదేశంలో నదిని పవిత్రంగా దేవతగా భావిస్తూ కూడా ఇలా చేయడం చాలా అన్యాయం. ఇలా చెప్తూ ఓజోన్‌ పొర గురించి క్షుణ్ణంగా అందరికీ వివరించాడు. ఓజోన్‌ పొర భూమికి రక్షణ కవచంలా ఉంది. మనం మితిమీరిన స్థాయిలో ఇంధనాల్ని వాడడం వల్ల నత్రజని ఆక్సైడ్‌లు వాతావరణంలో పేరుకుపోతాయి. మితిమీరిన మోతాదులో ఎయిర్‌ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు వాడితే అందులో ఉపయోగించే ఫ్రి˜యాన్‌ వంటి ఫ్లోరీన్‌ సంబంధిత వాయువుల పరిమాణం గాలిలో ఎక్కువ అవుతుంది. టైర్లు, రబ్బర్లు, ఇతర ఆధునిక ప్లాస్టిక్‌లు వాడడం వల్లనూ, వాటిని కాల్చినపుడు క్లోరీన్‌ సంబంధిత సేంద్రియ పదార్థాలు వాతావరణంలో పెరుగుతాయి. ఇలా నత్రజని, సల్ఫర్‌ ఆక్సైడ్‌లు, క్లోరోఫ్లోరో కార్బన్‌ పదార్థాలు ఎక్కువయితే వాతావరణంలో మునుపెన్నడూ జరగని విధంగా రసాయనిక చర్యలు జరుగుతాయి. భూమి మీద కాలుష్యం పెరిగికొద్ది ఓజోన్‌ పొర పలచన అవుతుంది. ప్రకృతి విపత్తులు విరుచుకుపడతాయి. మనుషులు ఇలా చేస్తూ పోతే బతుకులు తెల్లారక కుండా ఉంటాయా అంటూ ముగించాడు. పర్యావరణ పరిరక్షణకు ఇలా పనిచేసేవారి అవసరం నేడు ఉంది.

అయూబ్ బాషా