October 5, 2024

జమాఅతె ఇస్లామీ హింద్‌ తెలంగాణ రాష్ట్రశాఖ అధ్యక్షునిగా డాక్టర్‌ ముహమ్మద్‌ ఖాలిద్‌ ముబష్షిర్‌ను జమాఅత్‌ జాతీయ అధ్యక్షులు సయ్యిద్‌ సాదతుల్లా హుస్సేనీ నియమించారు.

హైదరాబాదుకు  చెందిన  డాక్టర్‌  ఖాలిద్‌  ముబష్షిర్‌ ఇంతకు ముందు విద్యార్థి సంఘం యస్‌.ఐ.ఓ.లో  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రశాఖ అధ్యక్షునిగా సేవలందించారు. జమాఅతె ఇస్లామీ హింద్‌ గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరాధ్యక్షునిగా కూడా ఆయన పని చేశారు.  సైన్సు  సబ్జక్టులో పి.హెచ్‌.డీ. చేసిన డాక్టర్‌ ఖాలిద్‌ ముబష్షిర్‌ ప్రముఖ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్నారు.  జమాఅతె ఇస్లామీ హింద్‌ తెలంగాణ అధ్యక్షునిగా ఆయన 2027 వరకు కొనసాగుతారు. ఇంతకు ముందు ఆయన జమాఅతె ఇస్లామీ హింద్‌, తెలంగాణ శాఖలో మానవ వనరుల విభాగం కార్యదర్శిగా అద్భుత  సేవలందించారు.  మానవ వనరుల విభాగం ద్వారా తెలుగు భాషను నేర్పడానికి ప్రయత్నించారు. ముఖ్యంగా కోవిడ్‌ కాలంలో ఆన్‌ లైన్‌ తరగతులకు రూపకల్పన చేసి, వందలాది మంది ఔత్సాహికులకు తెలుగు భాషను నేర్పే తరగతులను నిర్వహించారు. అనేక మంది తెలుగు ఉపాధ్యాయులు ఈ తరగతుల్లో బోధించారు. తెలుగు జర్నలిజం, తెలుగు సాహిత్య రచనలకు  సంబంధించి  కూడా  అడ్వాన్సు తరగతులు  ఏర్పాటు  చేయించారు. ఇదే విధంగా ఇంగ్లీషు,  ఉర్దూ,  అరబీ  భాషలు నేర్పే తరగతులతో పాటు అనేక ఇతర నైపుణ్యాలు పెంచే తరగతులకు  రూపకల్పన చేయడం ద్వారా నైపుణ్యాలను  పెంపొందించే  గొప్ప ప్రయత్నం చేశారు.  ఆ ప్రయత్నం అద్భుతమైన ఫలితాలను కూడా ఇచ్చింది.  తెలుగు, ఇంగ్లీషు భాషల్లో  అనేక  మంది తమ రచనా పటిమను పెంచు కున్నారు.

డాక్టర్‌ ఖాలిద్‌ ముబష్షిర్‌ జమాఅత్‌ రాష్ట్ర సలహామండలి సభ్యు లుగా కూడా  ఉన్నారు.  జాతీయ  స్థాయిలో జమాఅత్‌ ప్రతినిధి మండలి సభ్యులుగా కూడా ఉన్నారు.

ఆదిలాబాద్‌ జిల్లా వాస్తవ్యులైన డా. ఖాలిద్‌ ముబష్షిర్‌ గారి కుటుంబీకులు గత  అర్ధ  శతాబ్దిగా జమాఅత్‌తో  పటిష్ట  సంబంధం  ఉన్నవారు.  పసితనం నుంచే ఖాలిద్‌ ముబష్షిర్‌ ఇస్లామీయ ఉద్యమ నీడల్లో ఊపిరి పీల్చారు. ఈయన తండ్రి మర్హూమ్‌ అబ్దుల్‌ గఫూర్‌ గారు సుదీర్ఘ కాలంపాటు జామియా దారుల్‌ హుదా విద్యాపీఠంలో వార్డెన్‌గా ఉన్నారు.  అనంతరం ఆయన గుజరాత్‌ రాష్ట్ర అమీరె హల్ఖాగా కూడా సేవలందించారు.

జమాఅతె ఇస్లామీ హింద్‌ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా ఎంపికైన డాక్టర్‌ ఖాలిద్‌ ముబష్షిర్‌ కోసం జాతీయ అధ్యక్షులు సాదతుల్లా హుస్సేనీ దైవాన్ని ప్రార్థించారు. ఈ గురుతర బాధ్యత నిర్వర్తించే శక్తిసామర్థ్యాలు దైవం ఆయనకు ప్రసాదించాలని దైవాన్ని వేడుకున్నారు. ఇప్పటి వరకు తెలంగాణ జమాఅత్‌ అధ్యక్షునిగా సేవ లందించిన జనాబ్‌  హామిద్‌ ముహమ్మద్‌ ఖాన్‌ సేవలను ప్రస్తుతిస్తూ, హామిద్‌  ముహమ్మద్‌ ఖాన్‌ సేవలను  దైవం  సమ్మతించి ఆమోదించాలని ప్రార్థించారు. జనాబ్‌ హామిద్‌ ముహమ్మద్‌ ఖాన్‌ రెండు పర్యాయాలు  తెలంగాణ  జమాఅత్‌ అధ్యక్షునిగా సేవలం దించారు.

జమాఅతె ఇస్లామీ హింద్‌ తెలంగాణ అధ్యక్షునిగా డాక్టర్‌ ఖాలిద్‌ ముబష్షిర్‌ పదవీ బాధ్యతలను మే 10వ తేదీన స్వీకరించారు.