December 3, 2024

ఎన్నికలొస్తున్నాయిగా …

ఉమ్మడిపౌరస్మృతి తెరపైకి వచ్చేసింది

 

యూనిఫాం సివిల్ కోడ్ విషయంలో ధార్మిక సంస్థల అభిప్రాయాలను 22వ లా కమీషన్ ఆఫ్ ఇండియా కోరింది. కర్నాటక హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రితూ రాజ్ అవస్తీ, రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కే.టీ. శంకరన్, ప్రొ. నంద్ పాలివాల్, ప్రొఫెసర్ డి.పి.వర్మ, ప్రొఫెసర్ రాకా ఆర్య, ఎం. కరుణానిధి లాకమీషన్ సభ్యులుగా ఉన్నారు.

ఈ విషయమై ఆసక్తి ఉన్నవారు 30 రోజుల్లోగా తమ అభిప్రాయాలను తెలియజేయాలని లా కమీషన్ కోరింది. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యుడు, సున్నీ ధర్మవేత్త మౌలానా ఖాలిద్ రషీద్ ఫరంగీ మహాలీ ఈ విషయమై మాట్లాడుతూ భారతదేశంలో యూనిఫాం సివిల్ కోడ్ వల్ల వివిధ ధార్మిక నేపథ్యాలున్న వ్యక్తులపై ప్రతికూల ప్రభావాలు పడతాయని అన్నారు. మన రాజ్యాంగంలో వివిధ రాష్ట్రాలకు ప్రత్యేక ప్రతిపత్తులున్నాయని, మిజోరం, నాగాలాండ్, త్రిపుర వంటి రాష్ట్రాలు ఉదాహరణలని అన్నారు. దేశంలోని ఆదివాసీలు, గిరిజనులు తమ ఆచార సంప్రదాయాలు పాటించడానికి పూర్తి భద్రత రాజ్యంగం కల్పించిందని చెప్పారు. వాటన్నింటిని ఎలా కాదనగలమని చెప్పారు. యూనిఫాం సివిల్ కోడ్ విషయమై జమీఅతె ఇలమా యే హింద్ ఒక తీర్మానం ఆమోదించింది. ఉత్తరప్రదేశ్ లోని దేవబంద్ లో జరిగిన ఒక సమావేశంలో జమీఅత్ ఈ తీర్మానం ఆమోదించింది. యూనిఫాం సివిల్ కోడ్ వల్ల దేశంలోని సముదాయాలకు వ్యక్తిగత చట్టాలను పాటించే హక్కు లభించదని, ఇది రాజ్యాంగం ఇచ్చిన హామీలకు వ్యతిరేకమని పేర్కొన్నారు.

యూనిఫాం సివిల్ కోడ్ చర్చ అప్పుడప్పుడు దేశంలో వస్తూ పోతూనే ఉంది. కాస్త పరిశీలిస్తే ప్రతిసారి ఎన్నికలకు ముందు ఈ చర్చ మొదలవుతుందని గమనించవచ్చు. ఇప్పుడు లా కమీషన్ ఈ చర్చ ప్రారంభించింది. గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఈ విషయమై చెప్పిన మాటలు కూడా గమనార్హమైనవి. యూనిఫాం సివిల్ కోడ్ అనేది ఆదేశిక సూత్రాల్లో ఉందని, ప్రభుత్వం దీనికి కట్టుబడి ఉందని చెప్పింది. అయితే వెంటనే దీనిపై చర్చలు అవసరం లేదని కూడా చెప్పింది. ఇంతకు ముందు 2018లో లా కమీషన్ ఇలాంటి కసరత్తే చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో యూనిఫాం సివిల్ కోడ్ అవసరం లేదని, మంచిది కూడా కాదని అభిప్రాయపడింది. అప్పటికి ఇప్పటికి ఏం మారిందని మరోసారి యూనిఫాం సివిల్ కోడ్ ను తెరపైకి తీసుకువచ్చారు.

యూనిఫాం సివిల్ కోడ్ ను అమలు చేయడం ప్రభుత్వం విధిగా చేయవలసిన పని అని రాజ్యాంగంలో ఉందా? అధికరణ 44లో ఆదేశిక సూత్రాల్లో ఈ విషయం ఉంది. ఇది విధిగా చేయవలసిన పని కాదు. హఠాత్తుగా ఇప్పుడు యూనిఫాం సివిల్ కోడ్ ను తెరపైకి ఎందుకు తీసుకువచ్చారు. లోక్ సభ ఎన్నికలు 2024లో జరగబోతున్నాయి. ఎన్నికలకు ముందు యూనిఫాం సివిల్ కోడ్ అమలు చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తుందన్న అభిప్రాయం కలిగిస్తే ఎన్నికల్లో లాభం కలుగుతుందనే ఎన్నికల ఎత్తుగడలో ఇది భాగమని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. దేశంలో వివిధ ధర్మాలు వారి వ్యక్తిగత చట్టాలున్నాయి. వివాహం, విడాకులు, వారసత్వం, దత్తత, సంరక్షణ వంటి అనేక విషయాల్లో వ్యక్తిగత చట్టాల ప్రకారం నడుచుకోవాలని వివిధ సమూహాలు భావిస్తాయి. ఇలాంటి సమస్యలన్నింటిని లా కమీషన్ పరిస్కరించేస్తుందని ఎలా భావించగలం? ఎన్నికలకు కేవలం కొన్ని నెలల ముందు యూనిఫాం సివిల్ కోడ్ సమస్యను తెరపైకి తీసుకురావడంలో ఎన్నికల రాజకీయాలున్నాయని చాలా మంది విశ్లేషిస్తున్నారు.

యూనిఫాం సివిల్ కోడ్ ను కేవలం ముస్లిములే వ్యతిరేకిస్తున్నారని భావించడం తప్పు. దాదాపు 30 ఆదివాసీ గిరిజన సంఘాల ప్రతినిధులు జూన్ 24వ తేదీన సమావేశమైన యూనిఫాం సివిల్ కోడ్ గురించి చర్చించారు. గిరిజన సంప్రదాయ చట్టాలను యూనిఫాం సివిల్ కోడ్ దెబ్బతీస్తుందని వారు భావిస్తున్నారు. ఆదివాసీ సమ్మాన్వాయ్ సమితి యూనిఫాం సివిల్ కోడ్ కు వ్యతిరేకంగా నిరసనకు దిగాలని నిర్ణయించింది. ప్రతిపక్షాలు కూడా యూనిఫాం సివిల్ కోడ్ విషయంలో వ్యతిరేకత వ్యక్తం చేశాయి. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఈ విషయమై మాట్లాడుతూ తమ పార్టీ యూనిఫాం సివిల్ కోడ్ ను వ్యతిరేకించదు కానీ ఉమ్మడి పౌరస్మృతి వల్ల హిందువులకు కూడా సమస్యలు తలెత్తుతాయని అన్నారు. యూనిఫాం సివిల్ కోడ్ కేవలం ముస్లిములకు మాత్రమే సమస్య అని భావిస్తున్న వారు దీనివల్ల హిందువులకు కూడా సమస్యలున్నాయని గుర్తించాలన్నారు. కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు గోవధ నిషేధం అమలు చేయాలన్నారు. కొన్ని రాష్ట్రాల్లో గోవధ నిషేధం లేదని, గోవా ముఖ్యమంత్రిగా పనిచేసిన మనోహర్ పరిక్కర్ తమ రాష్ట్రంలో ఆవులకు కొరత వస్తే దిగుమతి చేసుకుంటామని చెప్పిన మాటలు కూడా ఉద్ధవ్ థాక్రే గుర్తు చేశారు. మొత్తం దేశంలో ఒకేమాదిరిగా గోవధ నిషేధాన్ని అమలు చేయలేకపోయిన వాళ్ళు మొత్తం దేశంలో ఒకేమాదిరి యూనిఫాం సివిల్ కోడ్ ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. కాంగ్రెసు ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఈ విషయమై మాట్లాడుతూ ఇప్పుడు హఠాత్తుగా యూనిఫాం సివిల్ కోడ్ పై లా కమీషన్ ఎందుకు చర్చ ప్రారంభించిందన్న కారణాలు స్పష్టంగా చెప్పలేదని విమర్శించా

రు. బీజేపీ విభజన రాజకీయాలే దీని వెనుక ఉన్నాయని అన్నారు. బీజేపీ మిత్రపక్షంగా ఉండి దూరమైన జనతాదళ్ యునైటెడ్ కూడా యూనిఫాం సివిల్ కోడ్ గురించి ఈ చర్చను విమర్శించింది. దేశంలో విభజన రాజకీయాలు, మతతత్వ రాజకీయాల్లో ఇది ఒక భాగమని తృణమూల్ కాంగ్రెసు విమర్శించింది. ఉద్యోగాలు ఇవ్వలేనప్పుడు, అధికధరలను తగ్గించలేనప్పుడు, ఇచ్చిన ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేకపోయినప్పుడు 2024 ఎన్నికల ప్రయోజనాల కోసం ఈ విభజన రాజకీయాలు నడుపుతున్నారని విమర్శించారు. దేశ పౌరులకు యూనిఫాం సివిల్ కోడ్ తీసుకొచ్చేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలంటూ ఆదేశిక సూత్రాల రూపంలో రాజ్యాంగం సూచిస్తోంది. కానీ చాలా కాలంగా దేశంలో ముస్లిములే కాదు చాలా మంది హిందువులు కూడా  యూనిఫాం సివిల్ కోడ్‌ను వ్యతిరేకిస్తూ వచ్చారు.

ఆదేశిక సూత్రాలను పరిశీలిస్తే, అధికరణ 45 ప్రకారం ఆరేళ్ళ లోపు పిల్లలకు పౌష్ఠికాహారం అందించాలి. ప్రాధాన్యత దృష్ట్యా ఇది చాలా ముఖ్యమైన అధికరణగా భావించాలి. ఎందుకంటే, ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రిసర్చ్ ఇనిస్టిట్యూట్ ప్రచురించిన గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలో 121 దేశాల్లో 107వ స్థానంలో ఉందని వార్త. కాబట్టి ఆదేశికసూత్రాల్లో పిల్లలకు పౌష్ఠికాహారం అందించడమన్నది అత్యంత ప్రాముఖ్యం ఉన్న అంశంగా తీసుకుని దానిపై చర్చ జరగాలి. కాని దానిపై చర్చ జరగడం లేదు. ఉమ్మడి పౌరస్మృతి గురించి వాదించే వారు ఒకే దేశం ఒకే చట్టం అనే నినాదం వినిపిస్తుంటారు. కాని ఉత్తరప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్, పంజాబ్, ఒడిశా, పుదుచ్చేరి, మధ్యప్రదేశ్, కర్నాటక, జమ్ము కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, గుజరాత్, ఢిల్లీ, బీహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో గోవధ నిషేధ చట్టాలున్నాయి. కానీ డామన్ డయ్యు, గోవాల్లో ఉన్నాయా? దేశవ్యాప్తంగా గోవధ నిషేధ చట్టం ఒకేలా ఎందుకు అమలు కావడం లేదు? అధికరణ 244 ప్రకారం ఈశాన్య రాష్ట్రాల గిరిజన తెగల ప్రజలకు ప్రత్యేక ప్రొవిజన్లున్నాయి. అక్కడ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిళ్ళున్నాయి. అయితే అరుణాచల ప్రదేశ్, నాగాల్యాండ్, మిజోరంలో కొన్ని భాగాల్లో ఇవి చెల్లవు. అలాగే షెడ్యూల్డ్ ఏరియాలలో గిరిజన తెగలకు ప్రత్యేక ప్రొవిజన్లున్నాయి.

నాగాల్యాండ్ నుంచి 2016లో ఒక వార్త వచ్చింది. ఈస్టర్న్ మిర్రర్ పత్రికలో ఆ వార్త వచ్చింది. నాగా బార్ అసోసియేషన్ యూనిఫాం సివిల్ కోడ్ కు వ్యతిరేకంగా జారీ చేసిన ప్రకటన అది. యూనిఫాం సివిల్ కోడ్ కోసం నరేంద్రమోడీ ప్రభుత్వం చేపట్టిన చర్యలు దేశంలోని సాంస్కృతిక వైవిధ్యాన్ని దెబ్బతీస్తాయని, నాగా ప్రజల సంస్కృతికి అది విఘాతమని ఆ ప్రకటన సారాంశం. నాగాలాండ్, మేఘాలయ, మిజోరం ప్రజల స్థానిక కట్టుబాట్లకు రాజ్యాంగపరమైన  రక్షణ ఉంది. ఉదాహరణకు ఆస్తులు, వారసత్వం విషయంలోను అక్కడి సంప్రదాయాలు వేరు. భారత్‌లో పౌర స్మృతులు ఉమ్మడి జాబితాలో ఉన్నాయి. అందువల్ల 1970ల నుంచి రాష్ట్రాలు తమకంటూ సొంత పౌర స్మృతులను రూపొందించుకుంటూ వస్తున్నాయి. హిందువుల్లో కొడుకులతో సమానంగా కూతుళ్లు కూడా వారసత్వ ఆస్తిలో వాటాను పొందేలా 2005లో చట్టాలను సవరించారు. కానీ దీనికంటే ముందే సుమారు అయిదు రాష్ట్రాలు అమ్మాయిలకు వారసత్వ ఆస్తిలో వాటా హక్కును కల్పిస్తూ చట్టాలు చేశాయి. వీటిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి.

బహుభార్యత్వానికి సంబంధించి ముస్లిముల పర్సనల్ లా వారికి అనుమతిస్తుంది కాబట్టి ముస్లిములు ఒకటి కన్నా ఎక్కువ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారన్న అపోహ ఎప్పటి నుంచో ఉంది. గతంలో నితిన్ గడ్కరి చేసిన వ్యాఖ్య గమనించాలి. నలుగురిని వివాహమాడడం అనాగరికమని ఆయన అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చాలా మంది యూనిఫాం సివిల్ కోడ్ చర్చ వచ్చినప్పుడు చేస్తుంటారు. దీనికి సంబంధించిన వివరాలు చూద్దాం. 1961లో మతపరంగా బహుభార్యత్వంపై జనాభా లెక్కల్లో వివరాలున్నాయి. ఆ వివరాల ప్రకారం ముస్లిముల్లో బహుభార్వత్వం తక్కువ. ముస్లిముల్లో 5.7శాతం ఉంటే, హిందువుల్లో 5.8శాతం ఉంది. బహుభార్యత్వం హిందువుల్లో చట్టపరంగా నిషిద్ధం. 1950లోనే ఈ చట్టం వచ్చింది. గిరిజనుల్లో చాలా ఎక్కువ 15.25శాతం ఉంది. 2016లో కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి మాట్లాడుతూ బహుభార్వత్వం ముస్లిముల కన్నా హిందువుల్లోనే ఎక్కువగా ఉందని అన్నారు. 1974లో ఒక సర్వే జరిగింది. ఆ సర్వే ప్రకారం ముస్లిముల్లో బహుభార్వత్వం 5.6శాతం. హిందువుల్లో 5.8శాతం. 2006లో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే జరిగింది. దేశంలో 2 శాతం భార్యలు తమ భర్తలకు మరో భార్య ఉందని చెప్పారు. బహువివాహాలనేది ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువ. 1950లో హిందూ మ్యారేజ్ యాక్ట్ ద్వారా సాధించిందేమిటి? బహుభార్యత్వాన్ని నిషేధించడం వల్ల బహుభార్యత్వం అంతం కాలేదు. కాని రెండవభార్యగా వచ్చిన మహిళకు సామాజిక, ఆర్ధిక భద్రత లేని పరిస్థితి ఏర్పడింది. పైగా మైత్రి కరార్ వంటివి వచ్చాయి. హిందూ పురుషుడు రెండవ వివాహం చేసుకునే అవకాశం లేనందువల్ల చట్టం నుంచి తప్పించుకోడానికి మైత్రికరార్ పేరుతో మరో మహిళతో స్నేహఒప్పందం చేసుకునేవాడు. ఇది మరోవిధమైన బహుభార్యత్వం. ఆ తర్వాత దాని పేరు ’’సర్వీస్ అగ్రిమెంట్‘‘గా మారింది. దానికి ఎలాంటి చట్టబద్దమైన హోదా లేదు.

గతంలో ఉత్తరాఖండ్ ఎన్నికల్లో యూనిఫాం సివిల్ కోడ్ ను బీజేపీ ఎన్నికల సమస్యగా ప్రస్తావించింది. ఎన్నికల్లో ప్రయోజనాల కోసం యూనిఫాం సివిల్ కోడ్ ప్రస్తావన అప్పుడప్పుడు తీసుకురావడం జరుగుతూనే ఉంది. కామన్ సివిల్ కోడ్ విషయంలో కేవలం ముస్లిములు మాత్రమే అభ్యంతరాలు చెబుతున్నారా? మిగిలిన వారెవ్వరూ దీనికి అభ్యంతరాలు చెప్పడం లేదా? గోవాలో పోర్చుగ్రీసు వారి కామన్ కోడ్ అమలులో ఉంది. దీని ప్రకారం వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేయడం తప్పేనిసరి. పెళ్ళి కాగానే భార్యకు భర్త సగం ఆస్తిలో హక్కు లభిస్తుంది. దేశవ్యాప్తంగా దీన్ని అమలు చేస్తే ఒప్పుకుంటారా? అవిభక్త హిందూ కుటుంబం ప్రకారం పన్నుల మినహాయింపు పొందుతున్న వారిలో చాలా వ్యాపార కుటుంబాలున్నాయి. వీరంతా కామన్ సివిల్ కోడ్ కోసం ఒప్పుకుంటారా? ఈశాన్య రాష్ట్రాల్లో గిరిజన తెగలు తమ తెగల చట్టాలనే పాటిస్తున్నాయి. వారంతా కామన్ సివిల్ కోడ్ కు సిద్ధంగా ఉన్నారా? కేరళ, కర్నాటక తదితర రాష్ట్రాల్లో వివిధ కట్టుబాట్లు సంప్రదాయాలున్నాయి. వాటన్నింటి విషయమేమిటి?

నిజం చెప్పాలంటే యూనిఫాం సివిల్ కోడ్ కు సంబంధించిన డ్రాఫ్ట్ డాక్యుమెంటు ఏదీ లేదు. లా కమీషన్ యూనిఫాం సివిల్ కోడ్ విషయమై గతంలో 16 ప్రశ్నలతో ఒక ప్రశ్నావళి జారీ చేసింది. ప్రజాభిప్రాయ సేకరణకు ఉద్దేశించిన ప్రశ్నావళి ఇది. దీని గురించి తర్వాత మాట్లాడదాం. ముందు యూనిఫాం సివిల్ కోడ్ విషయం చూద్దాం. రాజ్యాంగ నిర్మాతలు uniform అన్న పదాన్ని వాడారే కాని common అన్న పదం వాడలేదు. కామన్ అన్న పదం వాడి ఉంటే దేశవ్యాప్తంగా ఒకే చట్టం రావాలి. కాని యూనిఫాం అనే పదంలో ఒకే చట్టం అన్న భావన లేదు, ఒకేమాదిరి చట్టాలన్న భావం ఉంది. బహుళ మతాలు ఉండడం వల్ల మనదేశంలో వివిధ చట్టాలున్నాయనుకోవడం సరికాదు. చట్టాలు రాష్టానికి, రాష్ట్రానికి మారుతాయి. స్త్రీ పురుషులకు కూడా చట్టాన్ని వర్తించడంలో తేడాలున్నాయి. కాబట్టి రాజ్యాంగ నిర్మాతలు దేశవ్యాప్తంగా ఒకే చట్టం ఉండాలని భావించారనో లేక ఒకేదేశం, ఒకే చట్టం అనే భావంతో ఈ అధికరణ పెట్టారనో అనుకోలేము. ఒకేమాదిరి చట్టాలన్న భావనే అందులో ఉంది. ఇలా అభిప్రాయపడడానికి మరో కారణమేమంటే, పర్సనల్ లాకు సంబంధించి అవసరమైన శాసనాలు చేసే అధికారం పార్లమెంటుతో పాటు అసెంబ్లీలకు కూడా ఉంది.

దేశంలోని హిందువులందరికీ ఒకే చట్టం వర్తిస్తుందా? ఉత్తరాదిలో కొన్ని బంధుత్వాలు వివాహసంబంధాలకు నిషిద్ధం. కాని దక్షిణాదిన అలాంటి నిషేధాలు లేవు. నాగాలాండ్, మేఘాలయ, మిజోరం ప్రజల స్థానిక కట్టుబాట్లకు రాజ్యాంగపరమైన  రక్షణ ఉంది. ఉదాహరణకు ఆస్తులు, వారసత్వం విషయంలోను అక్కడి సంప్రదాయాలు వేరు.

ఇలాంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా యూనిఫాం సివిల్ కోడ్ తీసుకువస్తామన్న వాదనను పరిశీలించవలసి ఉంది. రాజ్యాంగ నిర్మాతలు యూనిఫాం అన్న పదం వాడడంలోనే వేర్వేరు చట్టాలు ఒకేమాదిరిగా జెండర్ జస్టిస్ సాధించే చట్టాలన్న భావం నిక్షిప్తమై ఉంది. అంతేకాని ఒకే చట్టం దేశవ్యాప్తంగా అనే భావం లేదు.

ఇంతవరకు ఉమ్మడి పౌర స్మృతి మీద కోర్టులు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వలేదు. గత 40 ఏళ్లలో భిన్న తీర్పుల్లో భాగంగా ‘దేశ సమైక్యత’కోసం ఉమ్మడి పౌర స్మృతిని తీసుకురావాలంటూ సుప్రీం కోర్టు ప్రభుత్వాలకు సూచిస్తూ వచ్చింది. అలాగే యూనిఫాం సివిల్ కోడ్ ఇప్పుడే అవసరం లేదంటూ 2018 లా కమిషన్ తన నివేదికలో పేర్కొంది. తీవ్రమైన పరిణామాలకు దారి తీసే యూనిఫాం సివిల్ కోడ్‌ను తీసుకురావడం కంటే లింగ అసమానతలను తొలగించడానికి పౌర స్మృతులకు సవరణలు చేస్తే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. తమ రాజకీయ ఎజెండాను కొనసాగించడంలో భాగంగానే ఉమ్మడి పౌర స్మృతి గురించి బీజేపీ మాట్లాడుతోందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో చాలా కాలంగా బీజేపీ అధికారంలో ఉంది. కానీ ఇంత వరకు అక్కడ యూనిఫాం సివిల్ కోడ్‌ను తీసుకురాలేదు. సాధారణ ఎన్నికలు రానున్న తరుణంలో యూనిఫాం సివిల్ కోడ్‌ గురించి చర్చలు తెరపైకి వస్తున్నాయి.

కామన్ సివిల్ కోడ్ కన్నా మనకు జెండర్ జస్టిస్ ముఖ్యం. ఉన్నతస్థానాల్లో కూర్చున్న వారు చట్టాలు చేసి క్రింది వారిపై రుద్దడం వల్ల జెండర్ జస్టిస్ సాధ్యం కాదు. సముదాయంలోనే సంస్కరణల ప్రక్రియ జరిగేలా చైతన్యాన్ని, అవగాహనను పెంచడం ద్వారా మాత్రమే మహిళా న్యాయాన్ని సాధించగలం. ఈ ప్రక్రియ క్రమేణా చట్టంగా రూపుదిద్దుకుంటుంది. స్వయంగా ముస్లిమ్ సమాజంలో ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. నికాహ్ నామా నమూనాలు విడుదల చేయడం, త్రిపుల్ తలాక్ పై ముస్లిమ్ విమెన్ పర్సనల్ లా బోర్డు ప్రయత్నాలు, భారతీయ ముస్లిమ్ మహిళా ఆందోళన్ లేవనెత్తిన సమస్యలు సముదాయంలో జరుగుతున్న ఈ ప్రయత్నాలకు నిదర్శనాలు. మహిళాన్యాయం సాధించేదిశగా ఈ ప్రయత్నాలు నెమ్మదిగా చట్టాలుగా రూపుదిద్దుకోవడం కూడా కాలక్రమంగా జరుగుతుంది. కాని రాజకీయ కారణాలతో కామన్ సివిల్ కోడ్ అని హంగామా చేస్తున్నవారు నిజానికి మహిళా న్యాయం పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదు. మతతత్వ రాజకీయాలు నడుపుతున్నారు.

గతంలో దివైర్ లో అనూషా రిజ్వి ఒక వ్యాసం రాశారు. ఇక్కడ ఆ వ్యాసంలోని కొన్ని విషయాలు ప్రస్తావించదగినవి. ఆమె ఏం రాశారంటే: దేశంలో మహిళల హక్కుల పరిరక్షణకు చాలా చట్టాలున్నాయి. ది డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్ 2005, ది ప్రివెన్షన్ ఆఫ్ డౌరీ యాక్ట్ 1961, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లోని సెక్షన్ 125 కింద మెయింటెన్స్ వగైరా. ముస్లిములకు పర్సనల్ లా ఉన్నంత మాత్రాన ముస్లిము మహిళలు ఈ చట్టాల ద్వారా ప్రయోజనం పొందలేని అడ్డంకి ఏమీ లేదు. ముస్లిమ్ మహిళలు కూడా ఈ చట్టాలను ఆశ్రయించవచ్చు. అంటే ముస్లిము మహిళల భద్రతకు రెండు విధాల అవకాశాలున్నాయి. వారు ముస్లిమ్ పర్సనల్ లా కింద తమ హక్కుల కోసం పోరాడ్డంతో పాటు, మహిళల హక్కుల పరిరక్షణకు అమలులో ఉన్న చట్టాలను కూడా ఉపయోగించుకోవచ్చు.

నిజానికి షరియా చట్టాలను అర్ధం చేసుకోవడంలో కూడా చాలా మందికి పక్షపాతం పెద్ద అడ్డంకి అవుతుంది. ఆడవాళ్ళకు మగవాళ్ళలో సగమే ఆస్తిహక్కు ఇస్తారన్న వాదన కూడా అలాంటిదే. అసలు మొన్నటి వరకు ఆస్తి హక్కు ఇవ్వని వారు ఈ వాదన చేస్తున్నారు. ఇప్పుడు సమానంగా ఆస్తి హక్కు ఇస్తున్నారా? మహిళలకు ఆస్తి హక్కు కేవలం చట్టరూపంలో కాగితాలపైనే ఉంది. ఎన్ని కుటుంబాలు సమానంగా ఆడపిల్లలకు ఆస్తిలో వాటా ఇస్తున్నాయి. ముస్లిముల్లో మాత్రం కుటుంబ ఆస్తుల పంపకంలో తప్పనిసరిగా వాటా ఇవ్వడం జరగుతుంది. ఆడపిల్లలు నిలదీసి అడిగి మరీ తీసుకుంటారు. షరియా వారసత్వ చట్టాల ప్రకారం కొన్ని సందర్భాల్లో ఆడపిల్లలకు వచ్చిన వాటా మగపిల్లలకు వచ్చిన వాటా కన్నా ఎక్కువ కూడా అవుతుంది. షరియా చట్టం ప్రకారం మహిళకు తాత, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, కుమారుల ఆస్తుల్లో వాటా ఉంది. మరో విషయమేమంటే, పిత్రార్జితం వంటి నిబంధనలేవీ ముస్లిములకు చెల్లవు. మనిషి తాను స్వయంగా సంపాదించిన ఆస్తయినా తన ఇష్టం వచ్చిన వారికి వీలునామా రాసుకునే అధికారం లేదు. అలా రాయాలనుకుంటే కేవలం 30 శాతం సంపదకు అది కూడా తన స్వార్జితమైతేనే రాయగలడు. మిగిలిన సంపదంతా ఎవరికి ఎంత వాటా నిర్ధారితమో అంత ఇవ్వవలసిందే. వీలునామా పేరుతో ఆడపిల్లలను కాదని మగపిల్లలకు ఆస్తులు రాసిచ్చే అవకాశం లేదు. కాబట్టి వారసత్వం విషయంలో అయినా షరియా చట్టం మెరుగైనదే. యూనిఫాం సివిల్ కోడ్ వస్తే అందులో వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుంటారా?

ముస్లిముల్లో అయినా సరే, పర్సనల్ లా ఇష్టం లేని వారు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద వివాహాలు చేసుకునే అవకాశం ఎలాగూ ఉంది. కామన్ సివిల్ కోడ్ ముఖ్యమా? మహిళలకు న్యాయం ముఖ్యమా అన్నది అసలు ప్రశ్న. దేశంలోని గిరిజన తెగలు, ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రత్యేక నియమనిబంధనలు, స్వయంగా అవిభక్త హిందూ కుటుంబం వంటి చట్టాలు ఇంకా ఇలాంటి ఎన్నో ప్రశ్నలు యూనిఫాం సివిల్ కోడ్ తో ముడిపడి ఉన్నాయి. కాని ఎన్నికల రాజకీయాలకు కామన్ సివిల్ కోడ్ ఉపయోగపడుతూనే వస్తోంది.

-అబ్దుల్ వాహెద్