November 22, 2024

మరోమస్జిదుపై కన్నేసిన మతతత్వం

 

ఈ జాబితా చాలా పెద్దదే. ఇప్పుడు మరో సరికొత్త వివాదం మన ముందుకు వచ్చింది. ఇలాంటివి మరికొన్ని భవిష్యత్తులో రావచ్చు. నిరంతరం రెండు వర్గాల మధ్య ఘర్షణాత్మక వాతావరణాన్ని కొనసాగించడానికి కావలసిన సరంజామా మతతత్వ శక్తుల చేతుల్లో ఉంది.

విచిత్రమేమిటంటే, జూన్ నెలలో ప్రధాని మోడీ అమెరికా పర్యటన నుంచి వెనక్కు వస్తున్నప్పుడు ఈజిప్టులో ఆగారు. కైరోలోని 1000 సంవత్సరాల పురాతన మస్జిదు ఇమామ్ అల్ హకీం బిన్ అమ్రల్లా మస్జిదును సందర్శించారు.

జులై నెలలో ఇక్కడ ఇండియాలో 800 సంవత్సరాల చరిత్ర ఉన్న పురాతన జుమా మస్జిదులో ముస్లిముల నమాజులపై నిషేధాజ్ఞలు విధించారు.

విదేశీ ముస్లిములతో స్నేహం స్వదేశీ ముస్లిములతో వైరం ఇదేనా నవభారతం.

ఈ కొత్త వివాదం ఏమిటంటే –

మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వమే నడుస్తుందని చెప్పాలి. మహారాష్ట్రలోని జల్గాంవ్ పట్టణంలో 800 సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన మస్జిదు ఉంది. ఈ జుమ్మా మస్జిదులో రోజు ఐదుపూటల నమాజులు జరుగుతూ వస్తున్నాయి. ఈ ఆస్తి వక్ఫ్ బోర్డు క్రింద రిజీష్టరైన ఆస్తి.

హఠాత్తుగా జిల్లా కలెక్టరు ఇక్కడ ముస్లిములు నమాజు చేయకుండా నిషేధాజ్ఞలు జారీ చేశాడు. ఒక హిందూత్వ సంస్థ ఫిర్యాదు మేరకు ఈ నిషేధాజ్ఞలు జారీ చేసినట్లు తెలుస్తోంది. సీఆర్పిసీ 144 సెక్షన్ క్రింద నిషేధాజ్ఞలు జారీ చేయడం జరిగింది. మస్జిదు వివాదాస్పదమయ్యిందని, అందువల్ల అక్కడ పోలీసు బలగాలను మోహరించి, తహసిల్దారును అక్కడి వ్యవహారాల చార్జి తీసుకోవాలని ఆదేశించాడు. ఈ నిషేధాజ్ఞలను ఔరంగాబాద్ హైకోర్టు బెంచ్ లో సవాలు చేయడం జరిగింది. ఔరంగాబాద్ బెంచ్ ఈ నిషేధాజ్ఞలను తొలగించింది, కాని ఈ 800 సంవత్సరాల పాత మస్జిదు వివాదాస్పద కట్టడంగా మార్చే ప్రక్రియ మతతత్వ శక్తులు ప్రారంభించాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

బాంబే హైకోర్టుకు ఔరంగాబాద్ ధర్మాసనం ఈ నిషేధాజ్ఞలపై స్టే విధించింది. జుమా మస్జిదు తరఫున కేసు వాదించిన అడ్వకేట్ యస్.యస్.కాజీ క్లారియన్ వార్తాసంస్థతో మాట్లాడుతూ మస్జిదు యథాతథస్థితిని కోర్టు పునరుద్ధరించిందని, జిల్లా కలెక్టరు ఉత్తర్వులపై స్టే ఇచ్చిందని తెలిపారు. జులై 11వ తేదీన జిల్లా కలెక్టరు ఈ మస్జిదులో నమాజును నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మస్జిదు రిజిష్టరైన వక్ఫ్ ఆస్తి. 1861 సంవత్సరం నుంచి ఈ మస్జిదులో నమాజులు జరుగుతున్న ఆధారాలు కోర్టుకు నివేదించడం జరిగింది. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మస్జిదును ప్రాచీన, చారిత్రక కట్టడంగా గుర్తించింది. ప్రభుత్వం కాపాడవలసిన కట్టడాల జాబితాలో ఇది ఉన్నది. ఈ మస్జిదు యాజమాన్యం ట్రస్టుకు, ప్రభుత్వానికి ఉమ్మడిగా ఉంది. పాలనాయంత్రాంగానికి, ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు ఇక్కడ నమాజులపై ఎలాంటి అభ్యంతరాలు లేవని చెప్పే పత్రాలు కూడా ఉన్నాయని అడ్వకేట్ కాజీ వివరించారు. మస్జిదు ట్రస్టు ఈ చారిత్రక కట్టడాన్ని కాపాడే పూర్తి ప్రయత్నాలు చేస్తోంది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నుంచి కూడా ఎన్నడూ ఎలాంటి ఫిర్యాదులు లేవు. ప్రభుత్వం నుంచి కూడా ఎన్నడూ ఎలాంటి ఫిర్యాదులు లేవు. కాని హఠాత్తుగా ఒక కొత్త సంస్థ పేరుతో ఆరెస్సెస్, విహెచ్పీ కార్యకర్త ఒకరు చేసిన ఫిర్యాదుతో నమాజులపై నిషేధం విధించడం న్యూ ఇండియాలోనే సాధ్యమయ్యింది.

ఈ మస్జిదు శతాబ్ధాల చరిత్ర కలిగిన మస్జిదు. హఠాత్తుగా దీనిపై వివాదం మొదలయ్యింది. నిజానికి 1980 దశకానికి ముందు బాబరీ మస్జిదు వివాదం గురించి దేశంలో చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. దక్షిణాది రాష్ట్రాల్లో బహుశా ఎవ్వరికీ దీని గురించి తెలియదు. కాని ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఇప్పుడు ఇలాంటి మరిన్ని వివాదాలను రాజేసే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి.

రిజిస్ట్రేషన్ కూడా లేని ఒక సంస్థ, ’’పాండవవాడ సంఘర్ష్ సమితి‘‘ అనే సంస్థ ఈ మస్జిదుపై ఒక ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు చేసినవ్యక్తి పేరు ప్రసాద్ మధుసూదన్ దండావతే. జల్గాంవ్ జిల్లా కలెక్టరు అమన్ మిట్టల్ కు ఈ ఫిర్యాదు పంపించాడు. మే నెలలో ఈ ఫిర్యాదు కలెక్టరుకు అందింది. ఈ ఫిర్యాదు చేసిన వ్యక్తి మధుసూదన్ దండావతె ఆరెస్సెస్ సభ్యుడిగా అతని ఫేస్ బుక్ ప్రొఫైల్ చెబుతందని ది వైర్ వార్తా సంస్థ రాసింది. ఆరెస్సెస్ లోనే కాదు, విశ్వహిందూపరిషద్, భజరంగ్ దళ్ సంస్థల్లోను ఇతనికి సభ్యత్వం ఉంది. ఈ మస్జిదు ఒక హిందూ ఆరాధనాలయం స్థలంలో కట్టారు కాబట్టి ఇది అక్రమమైనదని, దీన్ని వెంటనే అధికారులు స్వాధీనం చేసుకోవాలని ఫిర్యాదులో కోరాడు. ఈ జుమా మస్జిదు ట్రస్ట్ ఆ స్థలాన్ని అక్రమంగా ఆక్రమించుకుందని చెప్పాడు.

జుమా మస్జిదు ట్రస్ట్ సబ్యులను దివైర్ వార్తా సంస్థ కదిలించినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే జూన్ నెలలో తమకు నోటీసు వచ్చిందని, అప్పటి వరకు అస్సలు ఈ విషయమేదీ తమకు తెలియదని చెప్పారు. అప్పటికి కలెక్టరు గారు ఈ ఫిర్యాదు విషయంలో విచారణ చేస్తున్నాడు. కాని ఎవరి గురించి విచారణ చేస్తున్నాడో వారికి మాత్రం ఈ విషయాలేమీ చెప్పలేదు. జులై 11వ తేదీన చాలా స్వల్ప సమయం ఇచ్చి జుమా మస్జిదు ట్రస్ట్ నుంచి వివరణ కోరారు. ఆ వెంటనే నిషేధాజ్ఞలు జారీ చేశారు.

మస్జిదు కమిటీతో పాటు వక్ఫ్ బోర్డు, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాలకు కూడా కలెక్టరు నోటీసులు పంపించేశారు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ విషయమై ప్రతిస్పందిస్తూ మస్జిదు ట్రస్టు వాదనను సమర్థించింది. ఇది చాలా పురాతన కట్టడమని పేర్కొంది. ఈ కట్టడం విషయంలో ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రమేయం 1986 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి నమాజులు అక్కడ జరుగుతూనే ఉన్నాయని తెలియజేసింది. ప్రాచీన కాలం నుంచి ఈ మస్జిదును ముస్లిములు నమాజుల కొరకు ఉపయోగిస్తున్నారని కూడా చెప్పింది. వక్ఫ్ బోర్డు డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జునైద్ సయ్యాద్ బోర్డు ప్రతిస్పందన తెలియజేస్తూ వక్ఫ్ ఆస్తులకు సంబంధించి వివాదాల్లో వక్ఫ్ బోర్డు కాకుండా మరే ప్రభుత్వ విభాగం కూడా జోక్యం చేసుకునే వీలులేదని సంబంధిత చట్టాన్ని ఉటంకించినట్లు తెలుస్తోంది. వక్ఫ్ చట్టాన్ని ప్రస్తావిస్తూ వక్ఫ్ బోర్డు కలెక్టరుకు ఈ వివాదంపై విచారణ నిర్వహించే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించింది. ఆ మస్జిదు వద్ద నిషేధాజ్ఞలు జారీ చేయడం ద్వారా కలెక్టరు వక్ఫ్ ట్రిబ్యునల్ పనుల్లో జోక్యం చేసుకున్నారని, ఇది ఆయన అధికారాలను అతిక్రమించడమేనని వక్ఫ్ బోర్డు ప్రతినిధులు అంటున్నారు. ఇక్కడ శాంతిభద్రతల పరిస్థితులేమైనా తలెత్తితే కలెక్టరు పరిస్థితిని చెక్కదిద్దడానికి ప్రయత్నించడం చేయవచ్చు, వివాదానికి సంబంధించిన అధికారాలన్నీ వక్ఫ్ బోర్డుకు మాత్రమే ఉంటాయని స్పష్టం చేశారు. నిజానికి వక్ఫ్ బోర్డు ఈ విషయాన్ని ముందుగానే కలెక్టరుకు తెలియజేసిందని, అయినా కలెక్టరు పట్టించుకోకుండా తన అధికారాలను అతిక్రమించి నిషేధాజ్ఞలు జారీ చేశారని అన్నారు.

మస్జిదు ట్రస్టు ఈ నిషేధాజ్ఞలను కోర్టులో సవాలు చేసింది. స్వతంత్రానికి పూర్వం నాటి పత్రాలను కూడా ఆధారాలుగా చూపించింది. బ్రిటీష్ ఇండియన్ గవర్నమెంటు ఉన్నప్పటి కోర్టు ఉత్తర్వులను కూడా చూపించింది. 1960 తర్వాత కూడా అనేక సందర్భాల్లో డాక్యుమెంట్లు అప్డేట్ చేయడం జరిగింది. చారిత్రక మస్జిదుగా ఇది గుర్తింపు పొందింది. అంతేకాదు, మస్జిదు ట్రస్టు ప్రతినిధులకు తమ వాదన వినిపించే అవకాశం కూడా కలెక్టరు ఇవ్వలేదని వారన్నారు. ఎవరో ఒక ఫిర్యాదు చేసిన సాకుతో నిషేధాజ్ఞలు జారీ చేశారు.

ఈ మస్జిదు మహారాష్ట్రలోని జల్గాంవ్ జిల్లాలో ఉన్న ఇరాందోల్ పట్టణంలో ఉంది. మస్జిదు నిర్మాణం ఒక మందిరంలా ఉంది కాబట్టి ఇది మందిరమేనని,  దీన్ని గుడిగా గుర్తించాలని దండావతె అనే ఆరెస్సెస్ వ్యక్తి చేసిన ఫిర్యాదు సాకుతో కలెక్టరు వెంటనే అత్యుత్సాహంగా నిషేధాజ్ఞలు విధించడం ఏం సూచిస్తోంది?

ఇరాందోల్ పట్టణం అంజనీ నది ఒడ్డున ఉంది. ముంబయి మహానగరానికి 350 కి.మీ.దూరంలో ఉంది. పాండవవాడ సంఘర్ష్ సమితి అనే సంస్థకు చెందిన మధుసూదన్ దండావతె ఈ మస్జిదు నిర్మాణం గుడిలా ఉంది కాబట్టి ఇది గుడేనంటూ ఫిర్యాదు చేశాడు. మస్జిదులో నమాజును నిషేధిస్తూ జల్గాంవ్ కలెక్టరు మస్జిదు తాళాలను ఇరాందోల్ మునిసిపల్ కౌన్సిల్ చీఫ్ ఆఫీసర్ కు అప్పజెప్పాలని నోటీసు పంపించాడు.

హిందూత్వ సంస్థలు ఈ మస్జిదును వివాదాస్పదం చేయడానికి 1980 నుంచి ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాయి. పాండవులు అరణ్యవాసంలో ఇక్కడ కొంతకాలం గడిపారని, ఈ కట్టడం వారికి సంబంధించిందని వాదిస్తున్నారు. ఇలాంటి వాదనలే బాబరీ మస్జిదు వివాదం వెనుక కూడా మనకు కనిపిస్తాయి. 1980ల్లో బాబరీ మస్జిద్ వివాదం గురించి ఎవరికీ తెలియదు. కాని తర్వాత నెమ్మదిగా ఈ వివాదం గురించి పూర్తి దేశానికి తెలిసేలా చేశారు. బాబరీ వివాదం ప్రారంభమైంది కూడా మస్జిదులో విగ్రహాలను తీసుకెళ్ళి అర్థరాత్రి ఉంచడం ద్వారా ప్రారంభించారన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఇరాందోల్ పట్టణంలో ఈ ప్రాచీన మస్జిదును వివాదాస్పదం చేయడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఇలాంటి ప్రయత్నాలే జ్ఞానవాపి మస్జిదు విషయంలోను జరుగుతున్నాయి. అక్కడ శివలింగం ఉందంటూ ప్రచారం మొదలు పెట్టారు.

మస్జిదులపై కన్నేసి గుడిని కూల్చి మస్జిదు కట్టారని వాదించడం ఇప్పుడు ఎక్కడ విన్నా వినిపించే మాటగా మారింది. గత సంవత్సరం గార్డియన్ పత్రికలో హన్నా ఎల్లీస్ పీటర్సన్ ఈ విషయమై ఒక వ్యాసాన్ని రాశారు. ఆ వ్యాసంలో చాలా వివరాలున్నాయి. ఉత్తరప్రదేశ్ లోని బదాయూ పట్టణంలో షమ్సీ జామా మస్జిదు ఉంది. ఈ మస్జిదు కూడా దాదాపు 800 సంవత్సరాల చరిత్ర కలిగిన మస్జిదు. ఇది హిందువుల గుడి అని, మస్జిదుగా మార్చేశారన్న వాదనలు మతతత్వ శక్తులు వినిపిస్తుంటాయి. 1856 నుంచి ఈ మస్జిదుకు సంబంధించిన రికార్డులున్నాయి. కాని రికార్డులుంటే ఏం లాభం, జల్గాంవ్ మస్జిదు రికార్డులున్నాయి. అయినా కలెక్టరు నిషేధాజ్ఞలు జారీ చేయడానికి ఏవీ అడ్డంకులు కాలేదు. బదాయూ పట్టణంలోని మస్జిదుపై కూడా కోర్టు కేసు వేశారు. మస్జిదు డోమ్ లోపల కమలం పువ్వు పెయింటు ఉందని, మస్జిదులో ఒక రహస్య గదిలో విగ్రహాలను పాడేశారని ఇలాంటి చాలా కథలు వినిపిస్తున్నాయి. మస్జిదు డోమ్ లోపల ఉన్నది దివ్యఖుర్ఆన్ కాలీగ్రఫీ అని, మస్జిదులో రహస్యగదులేవీ లేవని గార్డియన్ పత్రికలో ఈ వ్యాసం రాసిన హన్నా ఎల్లీస్ పీటర్సన్ తాను వెళ్ళి చూసిన విషయాలు రాశారు. ముస్లిముల పాలనా కాలంలో హిందువులపై దౌర్జన్యలు చేశారని, గుడులను మస్జిదులుగా మార్చేశారని వాదించేవారు చాలా మంది ఉన్నారు.

బదాయూ పట్టణంలోని ఈ మస్జిదే కాదు మొత్తం 3000 మస్జిదుల జాబితా తమవద్ద ఉందంటూ మతతత్వ శక్తులు గతంలో చాలాసార్లు ప్రకటించారన్నద గుర్తుంచుకోవాలి. 2014లో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాతి నుంచి ముస్లిములపై అణిచివేతలు పెరుగుతున్నాయని ఇప్పటికే చాలా మంది విమర్శిస్తున్నారు. చరిత్రను మార్చేసే ప్రయత్నాలు మరోవైపు జరుగుతున్నాయి. మొగల్ పాలనాకాలాన్ని అంధకారంగా చిత్రించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంకోవైపు దేశవ్యాప్తంగా వివిధ మస్జిదులను వివాదాస్పదం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. 1947 తర్వాత ఆరాధనాలయాల చట్టం ఉన్నప్పటికీ కోర్టులు కేసులను అనుమతిస్తున్నాయి. చివరకు షాజహాన్ కట్టించిన తాజ్ మహల్ పై కూడా కేసు వేశారు. ఇది హిందువులు పూజలు చేసుకునే గుడి అన్నారు. 2019లో సుప్రీంకోర్టు బాబరీమస్జిదును హిందువులకు అప్పగించిన తీర్పు తర్వాతి నుంచి ఈ ధోరణి మరింత పెరిగింది. 2022లో గుర్గాంవ్ లోని భోరాకలాన్ ఊరిలో  ఒక మస్జిదుపై దుండగుల గుంపు దాడి చేసింది. దాదాపు 200 మంది దాడి చేసి లోపల ప్రార్థనలు చేస్తున్న వారిని భయభ్రాంతులకు గురి చేశారు. అక్కడ నమాజులు చేస్తున్న వారిని ఊరి నుంచి బహిష్కరిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. అలాగే కర్నాటకలో గత సంవత్సరం ఒక మదరసాలో మతతత్వ దుండగుల గుంపు చొరబడి విగ్రహాలను అక్కడ బలవంతంగా ఉంచి పూజలు చేసింది. ఈ సంఘటన బీదరులో జరిగింది.

మధురలో 1670లో ఔరంగజేబు కట్టించిన షాహీ ఈద్గా పై 12 కేసులున్నాయిప్పుడు. అది శ్రీకృష్ణుడు జన్మించిన ప్రదేశమని వాదిస్తున్నారు. హిందువుల గుడిని కూలగొట్టి మస్జిదు కట్టారని వాదిస్తున్నారు. వారణాసిలో జ్ఞానవాపీ మస్జిదు ఒక శివాలయం అని, దాన్ని కూల్చి మస్జిదు కట్టారని అక్కడ ఒక శివలింగం ఉందంటూ కొందరు మహిళలు పూజలు చేసుకునే అనుమతి ఇవ్వాలని కోర్టుకు వెళ్ళారు. ఆ కేసు గత సంవత్సరం వార్తల్లో ప్రధానంగా నిలిచింది.

కోర్టు కేసులతో వివాదాలు సృష్టించడం ఒకవైపు కొనసాగుతంటే మరోవైపు కూల్చివేతలు కూడా కొనసాగుతున్నాయి. ప్రయాగరాజ్ గా ఇప్పుడు పేరు మార్చబడిన అలహాబాద్ పట్టణంలో 16వ శతాబ్ధానికి చెందిన షాహీ మస్జిదును జనవరిలో కూలగొట్టారు. రోడ్డు విస్తరణ పేరుతో బుల్డోజర్లు తీసుకొచ్చి కూల్చివేత నిర్వహించారు. నిజానికి శతాబ్దాల చరిత్ర ఉన్న ఒక కట్టడాన్ని కూలగొట్టడం మరో దేశంలో అయితే ఎంతో సంచలనానికి కారణమయ్యేది, కాని ఉత్తరప్రదేశ్ లో ఇప్పుడు బుల్డోజర్లు నిర్మాణాలను కూలగొట్టడం అనేది సర్వసాధారణం. అందువల్ల ఇది వార్తల్లో కూడా పెద్దగా కనిపించలేదు. గత సంవత్సరం నవంబరులో 300 సంవత్సరాల చరిత్ర కలిగిన మస్జిదును కూడా కూల్చారు. ఉత్తరప్రదేశ్ లోని ముజఫ్ఫర్ నగర్ జిల్లాలోని ఈ మస్జిదును కూడా రోడ్డు విస్తరణ కోసం కూలగొట్టారు.

మస్జిదులపై కోర్టు కేసులు, రోడ్డు విస్తరణ కోసం కూల్చివేతలు, ముస్లిం పేర్లున్న ప్రాంతాల  పేర్లు మార్చడం,  ముస్లిం పాలకుల చరిత్రను వక్రీకరించడం, సిలబసు నుంచి తొలగించడం, హరిద్వార్ ధర్మసంసద్, ఢిల్లీ స్టేడియంలలో బాహాటంగా ముస్లిములపై హింసాదౌర్జన్యాలకు పిలుపునివ్వడం, లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్, యుపియస్సీ జిహాద్, టమాటా జిహాద్, ఎరువుల జిహాద్ (ఫర్టిలైజర్ జిహాద్), కరోనా జిహాద్… ఈ జాబితా కూడా చాలా పెద్దదే, ఇవే దేశంలో ఇప్పుడు వినిపిస్తున్న, కనిపిస్తున్న పరిస్థితులు.

కొసమెరుపు:

భారత ప్రధాని నరేంద్రమోడీ అమెరికాలో మాట్లాడుతూ దేశంలో కులమత వివక్ష పక్షపాతాలనేవి మచ్చుకు కూడా లేవని అన్నారు. అమెరికా నుంచి వస్తూ కైరోలో వెయ్యేళ్ళ చరిత్ర కలిగిన మస్జిదును సందర్శించారు.

                                    – వాహెద్