November 22, 2024

విద్వేషాన్ని సాగు చేస్తే

విషవృక్షాలే పెరుగుతాయి

జులై 31వ తేదీన జైపూర్ నుంచి ముంబయి వెళుతున్న సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లో చాలా మంది ప్రయాణీకులు నిద్రపోతున్నారు. రైల్లో భద్రత కోసం నియమంచబడిన కానిస్టేబుల్ చేతన్ సింగ్ తన తోటి కానిస్టేబులుపై దాడి చేశాడు. తర్వాత తన పై అధికారిని కాల్చి చంపాడు. ఆ తర్వాత ముస్లిములను పేర్లడిగి కాల్చి చంపాడు. ఈ మొత్తం వ్యవహారాన్ని ప్రయాణీకుడు ఒకరు వీడియో తీశారు. సోషల్ మీడియాలో ఈ వీడియో కూడా వచ్చింది.

పఠానీ సూట్ తొడుక్కుని గెడ్డం ఉన్న ఒక ప్రయాణీకుడిని కాల్చి చంపిన తర్వాత ప్రయాణీకులతో మాట్లాడుతూ ’’ఓటేయాలనుకుంటే, భారతదేశంలో ఉండాలనుకుంటే, నేను చెబుతున్నాను, మోడీ, యోగీ వీళ్ళిద్దరే… అంటున్న మాటలు కూడా ఆ వీడియోలో వినిపిస్తున్నాయి.

హత్యకు గురైన నలుగురిలో ఒకరు సబినస్పెక్టర్ తిక్కారామ్ కాగా మిగిలిన ముగ్గురు ముస్లిములు. కాని చేతన్ సింగ్ ను కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు ఈ వీడియో గురించి ఎక్కడా రిమాండు లో ప్రస్తావించలేదు. ఈ నేరం మతతత్వ, విద్వేష నేరం అన్నది స్పష్టంగా వీడియోలో కనిపిస్తోంది. చేతన్ సింగ్ పాపం మానసిక సమస్యతో బాధపడుతున్నాడట. అందువల్ల ఇలా చేశాడట. కోర్టు విచారణ సమయంలో జర్నలిస్టులను కూడా అక్కడ అడ్డుకున్నారు. అనుమతించలేదు. రైల్వే శాఖ ఈ నేరంలో మతతత్వ విద్వేష నేరాన్ని అస్సలు గుర్తించనే లేదు. పైగా హత్యకు గురైనవాళ్ళలో హిందువులు, ముస్లిములు ఉన్నారని చెప్పింది. హత్యకు గురైన హిందువు ఒక్కడే. అతను చేతన్ సింగ్ పై అధికారి. మిగిలిన ముగ్గురు ముస్లిములే. చేతన్ సింగ్ పై అధికారి హిందువు కావడం యాధృచ్ఛికం. పై అధికారిపై కోపంతో కాల్చి చంపిన వాడు ఆ తర్వాత కేవలం ముస్లిములనే ఎందుకు టార్గెట్ చేసుకున్నాడన్నది ఆలోచించవలసిన విషయం. పేరు అడిగి మరీ టార్గెట్ ను ఎన్నుకుని చంపాడన్నది స్పష్టంగా వార్తల్లో వచ్చింది. ఈ ప్రశ్నకు రైల్వే శాఖ నుంచి కాని మరెక్కడి నుంచి కానీ జవాబు లేదు.

పోలీసు రిమాండ్ కాపీలో ఏముందంటే, వైర్ వార్తా సంస్థ ప్రకారం, చేతన్ సింగ్, మీనా, అమన్ ఘనశ్యామ్ ఆచార్య, నరేంద్రపర్మార్ లు ఆ రోజు డ్యూటీలో ఉన్నారు. కొద్ది సేపటి తర్వాత చేతన్ సింగ్ తనకు ఒంట్లో బాగోలేదని పై అధికారి మీనాకు చెప్పాడు. తాను రైలు దిగి వెళ్ళిపోతానని అన్నాడు. కాసేపటికి డ్యూటీ అయిపోతుంది, కాసేపాగు అన్నాడు మీనా. కాని చేతన్ సింగ్ తాను వెళ్ళిపోతానని పట్టుబట్టి మరో పై అధికారికి ఫోను చేయించాడు. ఆ పై అధికారి కూడా డ్యూటీ పూర్తి చేయాలని చెప్పాడు. ఆ తర్వాత చేతన్ సింగ్ మీనాపై కాల్పులు జరిపి చంపేశాడు. ఆ తర్వాత ముస్లిములను గుర్తించి వారిని చంపడం మొదలు పెట్టాడు. తన పై అధికారిపై కోపంతో అతన్ని చంపిన చేతన్ సింగ్, ఆ తర్వాత ముస్లిములను ఎందుకు టార్గెట్ చేశాడు. అంతేకాదు, చంపేసిన ఒక ముస్లిం మృతదేహం ముందు నిలబడి మోడీ,యోగీలు ఇద్దరే…అంటూ చెప్పిన మాటలను ఎలా అర్థం చేసుకోవాలని జుట్టు పీక్కోవలసిన పనిలేదు. గతంలో జరిగిన సంఘటనలను కాస్త పరిశీలిస్తే చాలు.

బిల్కిస్ బాను అత్యాచారం, మూడేళ్ళ ఆమె కుమారుడి హత్య కేసులో ఏం జరిగింది? నేరస్తులను చివరకు వదిలేశారు. పైగా వారికి ఘనస్వాగతాలు లభించాయి. గోరక్షణ పేరుతో మూకహత్యలకు పాల్పడిన నేరస్తులకు మంత్రి హోదాలో జయంత్ సింగ్ కలుసుకుని, సన్మానించి మిఠాయిలు తినిపించాడు. టెర్రరిస్టు కేసు ఉన్నప్రజ్ఞాసింగ్ ఠాకూరుకు బీజేపీ టిక్కెట్టు ఇచ్చి సత్కరించింది. ఇలాంటి ఉదాహరణలెన్నో చేతన్ సింగ్ కళ్ళెదుట ఉన్నాయి. తన పై అధికారిపై కోపం వచ్చి చంపినా, ఆ తర్వాత కొంతమంది ముస్లిములను చంపేసి, మోడీ, యోగీలకు జై కొడితే తనకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్న ధైర్యమూ అతనికి ఈ సంఘటనల వల్ల వచ్చేసి ఉంటుంది.

మోడీ, యోగీలకు జై కొడుతూ, ముస్లిములను బెదిరిస్తూ చేతన్ సింగ్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వచ్చేసింది. పోలీసులకు దొరకలేదంటే నమ్మలేం. కాని రిమాండు రిపోర్టులో ఈ ప్రస్తావనే లేదని వైర్ వార్తాసంస్థ తెలిపింది. ఈ సంఘటన తర్వాత బీజేపీ ఎమ్మెల్యే మనీషా చౌదరీ మాట్లాడుతూ నిందితుడికి డిప్రషన్ వంటి మానసిక సమస్యలున్నాయేమో చూడాలన్నారు. సోషల్ మీడియాలో చేతన్ సింగ్ వీడియోను ప్రభుత్వం తొలగించేలా చర్యలు తీసుకుంది.

దేశంలో గత కొంతకాలంగా అలుముకున్న విద్వేష వాతారణం ఎలాంటి భయంకరమైన సమాజాన్ని మన ముందుకు తీసుకువచ్చిందో ముంబయి వద్ద రైల్లో ప్రయాణీకులను ఒక రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు కానిస్టేబుల్ కాల్చిచంపిన సంఘటనలో కనిపించింది. ఆ కానిస్టేబుల్ కాల్చి చంపిన నలుగురిలో ముగ్గురు ముస్లిములు. గెడ్డం, దుస్తులతో ముస్లిములుగా కనిపిస్తున్నవారిని పేరు అడిగి మరీ కాల్చి చంపాడు.

చాలా రోజుల క్రితం ఆమిర్ ఖాన్ భార్య కిరణ బేడీ చెప్పిన ఒక మాట మీద చాలా రభస జరిగింది. అసహనం, అభద్రత అలుముకున్న వాతావరణంలో తన కుమారుడి విషయంలో ఆమె భయపడుతున్నట్లు మాట్లాడింది అప్పుడు. ఆ వెంటనే మన సోకాల్డ్ దేశభక్తులు ఆమిర్ ఖాన్ మీద విరుచుకుపడ్డారు. కాని ఈ రైలు సంఘటన ఏం చెబుతుంది.

స్క్రోల్ వార్తా సంస్థ ఒక కథనాన్ని ప్రచురించింది. ఆ కథనం ప్రకారం చాలా మంది ముస్లిములు ఇప్పుడు ఇదేవిధంగా భయపడుతున్నారు. ఆ రైలు సంఘటన మాదిరిగా ఎప్పుడైనా, ఎక్కడైనా తమపై దాడి జరగవచ్చన్న భయాలు అలుముకున్నాయి. గోరక్షక దళాల పేరుతో ఇప్పటి వరకు జరిగిన మూకహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు రైల్లో భద్రత కోసం నియమించబడిన కానిస్టేబుల్ కూడా తన ఆయుధం ఎక్కుపెట్టి పేర్లు అడిగి చంపేసే పరిస్థితి వచ్చింది. స్క్రోల్ వార్తా సంస్థ చాలా మందిని ఈ సంఘటన తర్వాత ఇంటర్వ్యు చేసింది. చాలా మంది అలాంటి దాడి తమపై జరుగుతుందన్న భయంతో ఉన్నారని తెలిసింది. ఈ వాస్తవాలు ఎలాంటి భారతదేశాన్ని మనముందుంచుతున్నాయి.

ముస్లిం ప్రయాణీకులను చంపి, ఆ శవం ముందు నిలబడి కానిస్టేబుల్ చేతన్ సింగ్ ప్రధాని నరేంద్రమోడీని, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ను పొగుడుతున్న వీడియో, ఇండియాలో ఉండాలంటే, ఇండియాలో బతకాలంటే మోడీ, యోగీలు ఇద్దరే దిక్కు అంటున్న వీడియో కూడా బయటకు వచ్చింది. ఇలాంటి విద్వేష నేరాలు తరచు జరుగుతుండడం అందరం చూస్తూనే ఉన్నాం. అన్వర్ అనే వ్యక్తి గురించి స్క్రోల్ వార్తా సంస్థ రాసింది. ఈ రైలు సంఘటన వార్త వచ్చిన తర్వాత అన్వర్ తన సోదరుడు సాద్ కు ఫోను చేశాడు. సాద్ గురుగ్రామ్ మస్జిదులో ఇమాముగా పనిచేస్తున్నాడు. మంగళవారం సాయంత్రం రైల్లో తన స్వంత ఊరు బీహారుకు వెళ్ళాలని ప్లాను వేసుకున్నాడు. అన్వర్ అతనికి ఫోను చేసి రైలు సంఘటన తర్వాత ఈ ప్రయాణంలో భద్రత లేదని ప్రయాణం వాయిదా వేసుకోమన్నాడు. కాని జరిగిందేమిటంటే, రైలు ప్రయాణం సాద్ వాయిదా వేసుకున్నాడు, కాని గురుగ్రామ్ అల్లర్లలో మతోన్మాద శక్తుల చేతుల్లో సాద్ హతమయ్యాడు. అన్వర్ సోమవారం రాత్రి తన సోదరుడు సాద్ తో రైలు ప్రయాణం సురక్షితం కాదని చెప్పిన కొన్ని గంటలకే ఈ దాడి జరిగింది. సాద్ హతమయ్యాడు. ఆమిర్ ఖాన్ భార్య కిరణ్ తన పిల్లల గురించి భయపడుతూ చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయా? దేశంలో ముస్లిములపై దాడులు ఎలా ఎప్పుడు ఎందుకు జరుగుతాయో ఎవరు చెప్పలేని వాతావరణం కనబడడం లేదా?

ఈ సంఘటన తర్వాత రైల్వేల నుంచి వచ్చిన ప్రకటన ప్రకారం కానిస్టేబుల్ చేతన్ సింగ్ కు ఎలాంటి మానసిక సమస్యలు లేవు. డిపార్టుమెంటులో జరిగే మెడికల్ ఫరీక్షల్లో అలాంటి మానసిక సమస్య ఏదీ ముందుకు రాలేదు. కాని కొన్ని గంటల్లోనే ఆ ప్రకటనను వెనక్కు తీసేసుకున్నారు. ఇప్పుడు మానసిక రుగ్మతల విషయంలో ఆలోచిస్తున్నారు.

నెలల తరబడి మణిపూర్ తగలబడుతున్నప్పటికీ పెదవి విప్పని మోడీ ఈ రైలు సంఘటన గురించి మాట్లాడతారని ఆశించడం అత్యాశే అవుతుంది. ఒక సందర్భంలో ఆయన గుజరాత్ అల్లర్లలో చనిపోయిన వారి గురించి మాట్లాడుతూ కుక్కపిల్ల చనిపోయినా బాధపడడం సహజమే కదా అంటూ చేసిన వ్యాఖ్యలు చాలా మందికి గుర్తుండే ఉంటాయి. కాబట్టి మోడీ ఇప్పుడు ఈ సంఘటన గురించి మాట్లాడతారని అనుకోవడం పొరబాటు.

ఇది ఒక దురదృష్టకరమైన సంఘటన మాత్రమే. అంతకు మించి ప్రభుత్వం కాని, ప్రభుత్వంలోని పెద్దలు కాని దీనికి అంతకు మించి ప్రాముఖ్యం ఇవ్వరు. హర్ష్ మందర్ వైర్ లో రాసిన ఒక వ్యాసంలో ఒక ప్రధాని ఎలా ప్రతిస్పందించాలో రాశారు. కాని అవన్నీ ఆశించడం అత్యాశే అన్నది ఆయనకు కూడా తెలుసు. తన కార్యాలయంలో వచ్చిన ఒక ముస్లిం మహిళ వ్యక్తం చేసిన భయాల గురించి రాశారు. ఈ భయాలు ఇప్పుడు ముస్లిములందరిలోను ఉన్నాయి. ఎప్పుడైనా, ఎవరిపైనైనా దాడి జరగవచ్చు. అలా జరగదని గట్టిగా చెప్పే నాయకుడు ఒక్కడైనా కనిపిస్తున్నాడా? ఇధా మనం కోరుకున్న స్వతంత్ర భారతం?

అమెరికాలో ఒక పోలీసు చేతుల్లో నల్లవ్యక్తి జార్జి ఫ్లాయిడ్ హత్య జరిగినప్పుడు అమెరికా అధ్యక్షుడిగా ఉన్నది డోనాల్డ్ ట్రంప్. ఆయన కూడా శషభిషలు లేకుండా ఈ సంఘటనను ఖండించి, బాధిత కుటుంబానికి సానుభూతి చెప్పారు. ఫ్రాన్సులో మొన్న ఒక ముస్లిం ప్రవాస బాలుడు పోలీసు కాల్పుల్లో మరణించినప్పుడు ఫ్రాన్సు ప్రధాని నిర్మొహమాటంగా పోలీసుల చర్యను ఖండించారు. కాని, ధర్మభూమి, కర్మభూమిగా పేరుపడిన మన దేశంలో భయంకరమైన, అమానుషమైన, దుర్మార్గమైన నేరాలు జరిగినప్పుడు కూడా నేతలు నోరిప్పకపోవడానికి కారణాలేమిటి?

ఆ కానిస్టేబుల్ పేరు చేతన్ సింగ్ కాకుండా ఏదన్నా ఖాన్ అయి వుంటే, మరణించిన వారి పేర్లు ముస్లిముపేర్లు కాకుండా ఉన్నట్లయితే ఏమయ్యేదో ఒకసారి ఆలోచించండి. రాజకీయాలు ఎలాంటి మతతత్వ రంగు పులుముకునేవో ఒకసారి ఆలోచించండి. ఇది టెర్రరిస్టు దాడిగా మీడియా చానళ్ళలో చర్చలు మారుమోగిపోయేవి.

ఇప్పుడు చేతన్ సింగ్ కు అతని నేరానికి ఏ శిక్ష పడినా… లేక కొంతకాలం తర్వాత బిల్కిస్ బాను నేరస్తుల మాదిరిగా కాలరెగరేసుకుని విడుదలైనా … ఆలోచించవలసింది అది కాదు… ఎలాంటి వాతావరణం ఇప్పుడు అలుముకుంది? ఇది భయోత్పాత వాతావరణానికి కారణాలేమిటి? కారకులెవరు? ఈ ప్రశ్నలు ఆలోచించవలసినవి.

–      వాహెద్