December 6, 2024

మణిపూర్ లో మహిళ పట్ల జరిగిన దౌర్జన్యాలను పార్లమెంటు సాక్షిగా రాహుల్ గాంధీ ప్రకటించారు. భారతమాతకీ జై అని నినాదాలు వినిపించడమే దేశభక్తిగా భావించేవారికి మణిపూర్ లో భారతమాత పట్ల ఎవరు ఎలా వ్యవహరించారో కూడా ఆయన స్పష్టంగా చెప్పాడు. అవిశ్వాసతీర్మానం సందర్భంగా మాట్లాడుతూ రాహుల్ గాంధీ బీజేపీపై తీక్షణమైన దాడి చేశాడు. మోడీ కేవలం ఇద్దరి మాట మాత్రమే వింటారని, రావణాసురుడు కూడా కేవలం ఇద్దరి మాటే వినేవాడని రామాయణంతో పోల్చారు. మేఘనాథుడు, కుంభకర్ణుల మాటే రావణాసురుడు వినేవాడని, అదేవిధంగా మోడీ కేవలం అమిత్ షా, అదానీల మాట మాత్రమే వింటారని అన్నారు. రాహుల్ గాంధీ ప్రసంగం బీజేపీని తత్తరపోయేలా, బిత్తరపోయేలా చేసిందనడానికి సాక్ష్యం వారి ప్రతిస్పందనలే. ఎందుకంటే రాహుల్ గాంధీ మాట్లాడింది మణిపూర్ పై అయితే, బీజేపీ నేతల జవాబుల్లో మణిపూర్ తక్కువ, రాహుల్ పై విమర్శలు ఎక్కువ వినిపించాయి. రాహుల్ గాంధీ తన ప్రసంగంలో మోడీని, మోడీతో పాటు ఆయన ప్రస్తావిస్తూ వస్తున్న ఇద్దరినీ లక్ష్యంగా చేసుకున్నారు.

రాహుల్ తన ప్రసంగంలో భారతదేశాన్ని ఒక స్వరంగా, ఒక గొంతుకగా వర్ణిస్తూ, ఆ గొంతును నులిమేశారని, దాన్ని హతమార్చారని తీవ్రస్వరంతో మాట్లాడారు. పార్లమెంటులో ఆయన బీజేపీపై తీవ్రమైన దాడి చేస్తూ మణిపూర్ లో బీజేపీ భారతమాతను హతమార్చిందని అన్నారు. మణిపూర్ లో అమాయకులను చంపడం, భారతమాతను హతమార్చడమే అన్నారు. అంతేకాదు, మీరు దేశద్రోహులు, మీరు దేశభక్తులు కానే కాదని సూటిగా చెప్పేశారు.

 రాహుల్ గాంధీ ప్రసంగానికి జవాబివ్వడానికి స్మృతి ఈరానీ లేచారు. ఈవిడ ప్రసంగంలో పాత సంఘటనలు, అప్పుడు మీరేం చేశారు వగైరా మాటలే తప్ప రాహుల్ లేవనెత్తిన ఒక్క ప్రశ్నకు కూడా జవాబు లేదు. ప్రధానమంత్రి మణిపూర్ పై పెదవి విప్పడం లేదెమి అన్న ప్రశ్నకు జవాబు లేదు. మణిపూర్ వెళ్ళడానికి ప్రధాని ఎందుకు సిద్ధపడడం లేదు అనే ప్రశ్నకు కూడా జవాబు లేదు. మణిపూర్ లో మహిళలను వివస్త్రలు చేసి నడిపించిన సంఘటన ప్రస్తావన లేదు. మణిపూర్ హత్యకాండల గురించి ఆమె మాట్లాడింది తక్కువ. కాని ప్రధాని మోడీ వచ్చిన తర్వాత ఎంతమంది అమ్మాయిలకు స్కూళ్ళలో ప్రవేశాలు లభించాయి? ఎంతమంది చదువుకుంటున్నారు వగైరా తమ ప్రభుత్వ గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేశారు.

రాహుల్ గాంధీ ప్రసంగం మూడు భాగాలు చేయవచ్చు. మొదటి భాగంలో ఆయన భారత్ జోడో యాత్రలో తన అనుభవాల గురించి చెప్పారు. భారత్ జోడో యాత్ర తనకు వినయం నేర్పిందని, ఇతరుల మాట వినే సహనం నేర్పిందని అన్నారు. ఆయన ప్రసంగంలో రెండవ భాగం మణిపూర్. తాను మణిపూర్ వెళ్ళానని, అక్కడి వారితో మాట్లాడానని, కాని ప్రధాని మోడీ మాత్రం మణిపూర్ వెళ్ళలేదని, ఎందుకంటే ఆయన దృష్టిలో మణిపూర్ భారతదేశం కాదని ఆరోపించారు. తాను మణిపూర్ వెళ్ళినని, కాని ఈ రోజు పాత మణిపూర్ లేదని, మణిపూర్ ను బీజేపీ రెండు ముక్కలు చేసిందని అన్నారు. మణిపూర్ లో తాను రిలీఫ్ క్యాంపులో మహిళలతో మాట్లాడానని చెప్పారు. అక్కడ ఉన్న పిల్లలతో మాట్లాడానని అన్నారు. ప్రధాని ఈ పని ఇప్పటి వరకు చేయలేదని వేలెత్తి చూపించారు. ఈ మాట నిజమే, మణిపూర్ తగలబడుతున్నప్పటికీ ప్రధాని అక్కడకు ఎందుకు వెళ్ళలేదు? అనే ప్రశ్న చాలా మందిలో ఉంది. ప్రతిపక్ష నేతలు, హర్షమందర్ వంటి సామాజిక కార్యకర్తలు మణిపూర్ వెళ్ళి అక్కడి బాధితులను పరామర్శించగలిగినప్పుడు ప్రధాని ఎందుకు వెళ్ళడం లేదన్నది ప్రధానమైన ప్రశ్న. ఈ ప్రశ్న ప్రజల్లో చాలా మందిలో ఉంది. రాహుల్ ప్రసంగాన్ని అడ్డుకోడానికి చాలా సార్లు ప్రయత్నం జరిగింది. మణిపూర్ లో ప్రస్తుతం జరుగుతున్న హింసాకాండకు కాంగ్రెస్ పార్టీ 70 సంవత్సరాల పాలనే కారణమని బీజేపీ నాయకుడు కిరణ్ జిజు అన్నాడు. తొమ్మిదేళ్ళుగా బీజేపీ అధికారంలో ఉంది. అంతకు ముందు వాజపేయి ప్రభుత్వం అధికారంలో ఉంది. అంతకు ముందు కాంగ్రేసేతర ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. అయినా 70 సంవత్సరాల కాంగ్రెస్ పాలన ఎలా? దేశంలో ప్రతి సమస్యకు 70 సంవత్సరాల కాంగ్రెస్ పాలనే కారణమంటూ ఈ తొమ్మిదేళ్ళు గడిపేశారు. ఇంకా ఎన్ని దశాబ్దాల వరకు ఈ సాకును ఉపయోగిస్తారని పలువురు వ్యంగ్యంగా విమర్శిస్తున్నారు. రాహుల్ గాంధీ మణిపూర్ విషయంలో చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని చాలా మంది బీజేపీ నేతలు సభలో హంగామా చేశారు. గతంలోనే క్షమాపణ చెప్పమంటే, తాను సావర్కర్ కాదని, తానొక గాంధీనని, క్షమాపణ చెప్పేది లేదని రాహుల్ చెప్పిన మాటలు కూడా ఇక్కడ ఒకసారి గుర్తు చేసుకోవాలి.

రిలీప్ క్యాంపులో తాను మాట్లాడిన ఒక మహిళ గురించి రాహుల్ గాంధీ ఈ సందర్భంగా చెప్పారు. ఒక మహిళ తన కళ్ళముందే తన ఒకే ఒక్క కుమారుడిని, చిన్న వయస్సులో ఉన్నవాడిని తన కళ్ళ ముందే చంపేశారని, తాను రాత్రంతా కొడుకు మృతదేహంతో రాత్రంతా మేలుకున్నానని చెప్పిందన్నారు. తాను తన ఇల్లు వాకిలి వదిలి రిలీఫ్ క్యాంపులో వచ్చానని చెప్పిన మాటలు చెప్పారు. తనతో పాడు తెచ్చుకుంది కేవలం తన కుమారుడి ఫోటో మాత్రమేనని చూపించింది. మరో క్యాంపులో ఒక మహిళను ఏమైందమ్మా అని అడిగిన వెంటనే ఆమె తనకు జరిగింది గుర్తు చేసుకుని గజగజవణుకుతూ తెలివితప్పి పడిపోయిందని అన్నారు. ఈ రెండు సంఘటనలు అక్కడి పరిస్థితులకు నిదర్శనాలని అంటూ మణిపూర్ లో బీజేపీ భారతదేశాన్ని హతమార్చిందన్నారు. ఈ వ్యాఖ్యల తర్వాత బీజేపీ నేతల హంగామా మామూలుగానే కొనసాగింది.

రాహుల్ గాంధీ నిజానికి అవిశ్వాసతీర్మానం చర్చ మొదటి రోజున చర్చను ప్రారంభిస్తారని అందరూ అనుకున్నారు. కాని ఆ రోజు పార్లమెంటుకు వచ్చిన మోడీ లోక్ సభలోకి రాలేదు. ఆ రోజు మోడీ లోక్ సభకు రావడం లేదని తెలిసిన వెంటనే కాంగ్రెస్ వ్యూహం మార్చుకుంది. రాహుల్ గాంధీ ప్రసంగంపైనే అందరి దృష్టి ఉంటుందని తెలిసిన కాంగ్రెస్ మొదటి రోజు చర్చలో రాహుల్ పేరు తొలగించి గొగోయ్ పేరు ఇచ్చింది. మోడీ సభలో ఉన్నప్పుడు ఆయన ముఖం మీదే చెప్పవలసిన మాటలు రాహుల్ చెప్పాలన్నది కాంగ్రెస్ వ్యూహం. గతంలో కూడా రాహుల్ ఇదే చేశారు. మోడీ సభలో ఉన్నప్పుడే ప్రధాని మోడీకి, అదానీకి సంబంధం ఏమిటంటూ మోడీ, అదానీల ఫోటో ప్రదర్శించి నిలదీసి మాట్లాడిన ప్రసంగం బీజేపీ శ్రేణుల్లో కుదుపులకు కారణమయ్యింది.  ఆ ప్రసంగం తర్వాతనే కేసు, కోర్టు శిక్ష, పార్లమెంటు సభ్యుడిగా సస్పెన్షన్లు వగైరా జరిగిపోయాయి. సుప్రీంకోర్టు తీర్పుతో మళ్ళీ రాహుల్ సభలోకి రాగలిగారు. ఈ సారి సభలో రాహుల్ ఖచ్చితంగా మోదీపై దాడి చేస్తారని అందరికీ తెలుసు. కాని ఇప్పుడు మోడీ గుణగానం చేయడంలో నిమగ్నమై ఉన్న ప్రధానస్రవంతి మీడియా ఈ ప్రసంగంపై ఎలా ప్రతిస్పందిస్తుందో చూడాలి.

రాహుల్ గాంధీ స్పీకర్ కు తన సభ్యత్వాన్ని పునరుద్ధరించినందుకు ధన్యవాదాలు చెబుతూనే, ఈ రోజు తన ప్రసంగంలో అదానీ గురించి మాట్లాడడానికి రాలేదన్నారు. బీజేపీ నేతలను ఉద్దేశించి మీరేం కంగారు పడకండి, నేను ఈ రోజు అదానీ గురించి మాట్లాడబోవటం లేదని వ్యంగ్యం చేశారు. కాని అదానీ పేరెత్తగానే బీజేపీ నేతలు హంగామా మొదలెట్టారు. ఇంతకు ముందు గోగోయ్ కూడా మాట్లాడుతూ, తాను మోడీని విమర్శించినా, అమిత్ షాను విమర్శించినా బీజేపీ నేతలు భరిస్తున్నారు కాని అదానీ పేరెత్తితే మాత్రం అగ్గిమీద గుగ్గిలమై పోతున్నారు, కారణమేమిటో అన్నాడు. రాహుల్ గాంధీ తన గత ప్రసంగంలో అదానీ తో మోడీ సంబంధాలు ప్రశ్నించినప్పుడు బీజేపీ నేతలకు కష్టం కలిగిందని, ఈ రోజు తాను అలాంటి కష్టం ఇవ్వడం లేదని వ్యంగ్యంగా చెప్పాడు.

రాహుల్ తన ప్రసంగంలో అదానీ ప్రస్తావన తర్వాత తీసుకువచ్చారు. కేవలం అమిత్ షా, అదానీల మాటే మోడీ వింటారని చెప్పారు. ఈ మాటలు రాహుల్ చాలా కాలంగా చెబుతూ వస్తున్న మాటలే. మోడీ కేవలం అమిత్ షా, అదానీల మాటలు తప్ప మరేమీ వినరని చాలా సార్లు ఆయన చెప్పారు. బీజేపీ ప్రభుత్వం దేశాన్ని తగలబెడుతోందని, మణిపూర్ మంటల్లో బుగ్గవుతుందని, ఇప్పుడు హర్యానాలో కూడా ఇదే జరుగుతోందని అన్నారు.

రాహుల్ గాంధీ తన ప్రసంగం నిజానికి చాలా క్లుప్తంగా ముగించారు. మణిపూర్ విషయంలో అహంకారాన్ని వదలండి, ప్రధాని అక్కడికి వెళ్ళి అక్కడి ప్రజలేమంటున్నారో వినాలని చెప్పాడు. రాహుల్ గాంధీ మణిపూర్ వైరల్ వీడియో గురించి మాట్లాడలేదు. తాను ప్రత్యక్షంగా కలుసుకుని మాట్లాడిన మహిళల గురించి చెప్పాడు. రాహుల్ గాంధీ ప్రసంగానికి జవాబివ్వడానికి స్మృతి ఈరానీ లేచారు. మణిపూర్ లో మహిళలపై అత్యాచారాలు, హింసాకాండలపై రాహుల్ గాంధీకి ఆమె జవాబీయలేదు, దానికి బదులు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తన ప్రసంగంలో అప్పుడేం జరిగింది, ఇప్పుడేం జరిగిందని మాట్లాడం ప్రారంభించారు. స్మృతి ఈరానీ ప్రసంగం కశ్మీర్ నుంచి బయలుదేరి బెంగాల్, రాజస్థాన్ మీదుగా అమేఠీకి వెళ్ళింది. మోడీ ప్రభుత్వం చేసిన గొప్ప పనుల జాబితా చెప్పడం ప్రారంభించారు. రాహుల్ గాంధీ చెప్పిన మాట ’’బీజేపీ మణిపూర్ లో భారతమాతను హతమార్చిందనే మాటపై మండిపడుతూ దేశద్రోహులన్నారు.

స్మృతి ఈరానీ కశ్మీరు గురించి మాట్లాడారు. అక్కడ జరిగిన గిరిజా టిక్కు, సరళభట్ హత్యల గురించి ప్రస్తావించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ మౌనంగా ఉందన్నారు. కాని స్మృతి ఈరానీ మరిచిపోయిందేమిటంటే, రవీష్ కుమార్ తన యూట్యూబ్ చానల్లో ఈ మాటలు స్పష్టంగా గుర్తు చేశారు. 2022లో, 2021లో కశ్మీరీ పండిట్ల హత్యలు జరిగినప్పుడు మోడీ సర్కారేం చేసింది? మోడీ అక్కడకు వెళ్ళి కశ్మీరీ పండిట్లను కలిశారా? స్మృతి ఈరానీ అక్కడకు వెళ్ళిందా? కశ్మీరీ పండిట్లు ఇక తాము లోయలో ఉండే పరిస్థితులు లేవని మొత్తుకుంటున్నప్పడు అప్పుడు మోడీ సర్కారు మంత్రులు ఏం చేశారు? కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో జరిగిన సంఘటనల జాబితా చదివారు, నిజమే అప్పుడు కూడా జరిగాయి. కాని మీ ప్రభుత్వంలో ఏం జరిగింది? అప్పుడు జరిగినట్లే మీ పాలనలోను జరిగిందా? ఇంకా ఎక్కువ జరిగిందా? రెండేళ్ళ క్రితం ఏడాది క్రితం కశ్మీరీ పండిట్ల పట్ల ఏం జరిగిందో ఒకసారి పాత వార్తలు చూస్తే చాలు అర్థమవుతుంది. కశ్మీరీ ఫైల్స్ సినిమా ప్రచారానికి బీజేపీ నేతలంతా అత్యుత్సాహంతో నడుంకట్టారు కాని కశ్మీరీ పండిట్లకు అక్కడ ఎదురవుతున్న కష్టాలను తీర్చడానికి మాత్రం ప్రయత్నించలేదు. 2022 జూన్ 1వ తేదీన రాయిటర్ వార్త ప్రకారం వంద హిందూ కుటుంబాలు కశ్మీర్ వదిలి వెళ్ళిపోయాయి. రజనీబాలా అనే టీచర్ హత్య జరిగింది.

జూన్ 3 2022 హిందూ పత్రిక కథనం ప్రకారం కశ్మీరీ పండిట్లు లోయ వదిలి తరలిపోతున్నారు. అక్టోబర్ 26, 2022 ఇండియన్ ఎక్స్ ప్రెస్ కథనం ప్రకారం షోపియన్ ఊరి నుంచి కశ్మీరీ పండిట్లు తరలిపోయారు. దశాబ్దాలుగా ఎన్నడూ లేని ప్రమాదకరమైన పరిస్థితులు ఇప్పుడు ఎదురయ్యాయి వాళ్ళకు. అంటే కశ్మీర్ ఫైల్స్ సినిమాను ప్రచారం చేస్తూ, కశ్మీరీ పండిట్ల కష్టాల గురించి మాట్లాడుకుంటూ కాలక్షేపం చేయడం తప్ప నిజంగా కశ్మీరులో పండిట్ల కష్టాలను తొలగించడానికి ఎలాంటి ప్రయత్నాలు జరగలేదు. కశ్మీరులో 350 మంది ప్రభుత్వ ఉద్యోగులు రాజీనామాలు చేసేశారు. రాజీనామా చేసినవారంతా కశ్మీరీ పండిట్లే. కశ్మీరులో పండిట్లపై దాడులకు కారణం మోడీ ప్రభుత్వమేనని అక్కడి కశ్మీరీ పండిట్ల సంఘం ఆరోపించింది. ఫ్రంట్ లైన్ మే 29 2022లో ఈ వార్త వచ్చింది. అధికరణ 370 రద్దు తర్వాత తమ కష్టాలు పెరిగిపోయాయని చెప్పారు. కశ్మీరీ పండిట్ సంఘర్ష్ సమితి అధ్యక్షుడు సంజయ్ మట్టూ అప్పట్లో చెప్పిన మాటలను రవీష్ కుమార్ తన యూ ట్యూబ్ చానల్లో ప్రస్తావించారు. తాము గవర్నర్ కలవడానికి సమయం అడిగితే అప్పాయింట్ దొరకలేదని, పండిట్లలోని వ్యాపారవేత్తలపై ఉగ్రవాద దాడులు జరిగే ప్రమాదం ఉందని ఇంటిలిజెన్స్ సమాచారం వచ్చింది. కాని ప్రభుత్వం భద్రత కల్పించలేదని అన్నాడు. స్మృతి ఈరానీకి ఈ విషయాలు తెలియవా? తమ ప్రభుత్వ నిర్వాకం తెలియదా? అయినా కాంగ్రెస్ పార్టీ గతంలో ఏదో చేసిందంటూ చెప్పడంలో అర్థమేమిటి?

మోడీ ప్రభుత్వ హయాంలో కశ్మీరీ పండిట్లకు భద్రత లభించిందా? నెలల తరబడి తమ భద్రత కోసం ధర్నాలు కూడా చేసిన వార్తలు వచ్చాయి. మోడీ ప్రభుత్వంలోని మంత్రులెవరైనా కశ్మీరీ పండిట్లను కలుసుకుని వారితో మాట్లాడారా? వారిలో నమ్మకం కలిగించారా? కశ్మీర్ ఫైల్స్ సినిమా ప్రచారానికి బీజేపీ ఐటి సెల్, బీజేపీ యంత్రాంగం, నేతలు కార్యకర్తలందరూ అత్యుత్సాహంతో పాల్గొంటారు. కాని అక్కడ పండిట్ల కష్టాల గురించి వారితో మాట్లాడడానికి మాత్రం ఎవరూ వెళ్ళలేదు. రవీష్ కుమార్ బింద్రూ అనే కెమిస్ట్ హత్య గురించి ప్రస్తావించారు. ఆయన కుమార్తె డా. శ్రద్ధా మట్టూ తాను లోయ వదిలి వెళ్ళనని అన్నారు. అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ మాత్రమే ఆమెను పరామర్శించారు. ప్రధాని లేదా మంత్రులెవరు వెళ్ళలేదు.

కశ్మీరీ పండిట్లపై తొంభయ్యవ దశకంలో జరిగిన దాడులు అమానవీయమైనవి, ఖండించదగ్గవి. అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దీనికి బాధ్యత వహించక తప్పదు. కాని ఈ కాలంలో కేవలం కాంగ్రెస్ మాత్రమే అధికారంలో లేదు. 1989 నుంచి 1990 వరకు వి.పి.సింగ్ ప్రధానిగా ఉన్నారు. 1990 నుంచి 1991 వరకు చంద్రశేఖర్ ప్రధానిగా ఉన్నారు. 1991 నుంచి 1996 వరకు పి.వి.నరసింహరావు ప్రభుత్వం ఉంది. కాని విచిత్రమేమిటంటే, బీజేపీ నేతలెవ్వరు ఈ ముగ్గురు నాయకుల పేర్లు తీసుకుని విమర్శలు చేయదు. ఈ కాలంలోనే కశ్మీరీ పండిట్లపై దాడులు కూడా జరిగాయి. కాని నెహ్రూపై మాత్రమే విమర్శలు చేస్తుంది. 2020 నుంచి 2022 మధ్య కాలంలో కశ్మీరీ పండిట్లపై దాడులు ఎందుకు జరిగాయి? ఎందుకు పండిట్ల కుటుంబాలు తరలిపోవలసి వచ్చింది? కశ్మీరి పండిట్ల సంఘం ఎందుకు నిరసనలు, ధర్నాలు నిర్వహించింది? వగైరా ప్రశ్నలకు స్మృతి ఈరానీ జవాబీయాలి. కాని ఆమె ఆ పని చేయలేదు. మణిపూర్ లో మహిళలపై దారుణాలకు జవాబివ్వడం మానేసి కశ్మీరులో ఏం జరిగిందటూ ప్రశ్నించింది. కాని కశ్మీరులో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం జరుగుతోంది అనే ప్రశ్నలు ఉండనే ఉన్నాయి. స్మృతి ఈరానీ మరిచిపోయిన మరో వాస్తవమేమిటంటే, ఢిల్లీలో, కేంద్రప్రభుత్వ పీఠం ఉన్న నగరంలోనే ఒలింపిక్స్ తదితర అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధించిన మహిళా క్రీడాకారిణులు లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ నిరసన ప్రదర్శనలు చేశారు. కాని బీజేపీ నాయకుడు బ్రిజ్ భూషన్ సింగ్ పై ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాలు కూడా స్మృతి ఈరానీ తన ప్రసంగంలో ప్రస్తావించవలసింది.

హాస్యాస్పదమైన విషయమేమిటంటే, ఇప్పుడు మణిపూర్ లో ఏం జరుగుతుందన్న చర్చకు జవాబిస్తూ గత 70 సంవత్సరాల కాంగ్రెస్ పాలన గురించి మాట్లాడడం. ప్రధాని మోడీ పదేళ్ళుగా ప్రధాని పదవిలో ఉన్నారుగా, ఏం చేశారో చెప్పాలిగా? విచిత్రమేమిటంటే మణిపూర్ పోలీసులు అస్సాం రైఫిల్స్ దళాలపై కేసు పెట్టారు. ఇదేమిటి? దీనికి నెహ్రూదే బాధ్యత అంటారా? మీడియా తమ పక్షాన ఉంది కాబట్టి ఏం చెప్పినా మీడియా చక్కగా తమకు అనుకూలంగా ప్రజల వద్దకు తీసుకువెళుతుందన్న ధీమా కూడా ఉంది.

రాహుల్ గాంధీ ఇంతకు ముందు ఒకసారి తన ప్రసంగం తర్వాత మోడీని ఆలింగనం చేసుకున్న సంఘటన చాలా మందికి గుర్తుండే ఉంటుంది. దానిపై కూడా బీజేపీ అప్పట్లో హంగామా చేసింది. ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రసంగం తర్వాత ప్రభుత్వ పక్షం వైపు ఫ్లయింగ్ కిస్ విసిరారు. దీనిపై కూడా స్మృతీ ఈరానీ మండిపడింది. ఇది పురుషాహంకార వైఖరి అని నిర్ధారించేసింది. ప్లయింగ్ కిస్ పురుషాహంకార వైఖరి అవుతుందా? చిన్నపిల్లలు కూడా ఈ పని  చేస్తుంటారే? తాత, నాయనమ్మ, అమ్మా నాన్నలకు ఫ్లయింగ్ కిస్ విసురుతుంటారు. మిత్రులు కూడా ఫ్లయింగ్ కిస్ విసురుతుంటారు. క్రీడాకారులు, సెలబ్రిటీలు కూడా అభిమానులకు ఫ్లయింగ్ కిస్ చేయడం మనకు తెలుసు. ఇది పురుషాహంకారం ఎప్పటి నుంచి? కన్నుగీటటం పై కూడా ఇలాగే హంగామా జరిగింది. కన్నుగీటటం, ఫ్లయింగ్ కిస్ ఇవి భారతీయత కాదు, విదేశీ అంటూ హంగామా చేయడంలో అర్థం ఉందా? విచిత్రమేమిటంటే ఎన్డీయే మహిళా సభ్యురాళ్ళంతా కలిసి స్పీకరుకు రాహుల్ గాంధీపై ఫిర్యాదు చేశారు. స్మృతి ఈరానీకి ఫ్లయింగ్ కిస్ గురించి మాట్లాడం గుర్తుంది కాని ప్రధాని మోడీ ఎందుకు మణిపూర్ వెళ్ళలేదన్న ప్రశ్నకు జవాబీయాలన్నది గుర్తు లేదు. మణిపూర్ లో చట్టం అన్నదే లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కేవలం ఒకటి రెండు కేసుల్లో అరెస్టులు జరిగాయి కాని 6500 పైగా కేసులున్నాయి.

కశ్మీరు నుంచి బెంగాల్ వరకు నానా విషయాలు ప్రస్తావించి మణిపూర్ పై జవాబివ్వకుండా తప్పించుకోవాలనుకున్నారు. అస్సాం రైఫిల్స్ పై కేసు ఎందుకు నమోదయ్యిందన్నది కూడా చెప్పలేదు. మణిపూర్ లో బీజేపీ ఉపాధ్యక్షుడు చిదానంద్ సింగ్ స్వయంగా అస్సాం రైఫిల్స్ పై ఆరోపణలు చేశాడు. ఒక సముదాయానికి అనుకూలంగా పక్షపాతంతో వ్యవహరిస్తుందన్నాడు. మణిపూర్ కు సంబంధించి ఇలాంటి చాలా విషయాలున్నాయి. రాహుల్ గాంధీ చెప్పిన మాటల వంటివే బీజేపీ మణిపూర్ ఉపాధ్యక్షుడు కూడా చెప్పాడు. మణిపూర్ పోలీసులు, అస్సాం రైఫిల్స్ దళాలపై కేసు పెట్టడమంటే మణిపూర్ రెండు ముక్కలైందని అర్థం కాదా? ఈ ప్రశ్నల గురించి మాట్లాడే బదులు మన్రేగా నుంచి జనధన్ యోజనా ఖాతాల వరకు సమస్తం ప్రస్తావించడం ఎందుకు?

అస్సాం రైఫిల్స్ పై కేసు విషయంలో సైన్యం మండిపడుతోంది. అసలు మణిపూర్ పోలీసులు అస్సాం రైఫిల్స్ పై కేసెందుకు పెట్టారు? అస్సాం రైఫిల్స దళాలు మణిపూర్ పోలీసుల వాహనాన్ని ఆపేసి విధులు నిర్వర్తించకుండా అడ్డుకున్నారని కేసు. మరో వైపు బీజేపీ శాసనసభ్యుడే రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాడు. సైన్యం పనిలో రాష్ట్ర ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తుందన్నాడు. రాహుల్ గాంధీ కూడా ఇదే చెప్పారు. భారత సైన్యం ఒక్క రోజులో మణిపూర్ లో శాంతిని పునరుద్ధరించగలదని, సైన్యాన్ని ఎందుకు ఉపయోగించడం లేదని ప్రశ్నించాడు. రాహుల్ గాంధీ ప్రసంగంలో ఇలాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి. కాని బీజేపీ నేతలకు రాహుల్ చివరన చేసిన ఫ్లయింగ్ కిస్ చాలా గొప్ప ఆయుధంగా మారిపోయింది. రవిశంకర్ ప్రసాద్, స్మృతి ఈరానీలు దీనిపైనే మండిపడుతున్నారు. జనతాదళ్ యునైటెడ్ సభ్యుడు లల్లన్ సింగ్ స్మృతి ఈరానీకి జవాబిచ్చాడు. ఇంత పెద్ద ప్రసంగంలో మణిపూర్ గురించి ఏమీ మాట్లాడలేదని, ఎందుకంటే అక్కడేం జరుగుతుందో తెలుసుకోనే లేదని అన్నాడు.

బీజేపీ తరఫున అవిశ్వాస తీర్మానం చర్చలో మొదట మాట్లాడింది నిశికాంత్ దూబే. ఈయన గారు స్వాతి చతుర్వేదీ, రోహిణీ సింగ్ అనే ఇద్దరు జర్నలిస్టులపై సభలో ఆరోపణలు చేశాడు. సభలో చెప్పిన మాటలపై కోర్టుకు వెళ్ళే అవకాశం లేదు. కాబట్టి నిశికాంత్ దూబేకు దమ్ముంటే ఇవే మాటలు బయటకు వచ్చి చెప్పాలని ఆ ఇద్దరు జర్నలిస్టులు సవాలు చేశారు. బీజేపీ తరఫున జవాబు లేదు. నిశికాంత్ దూబే రాహుల్ గాంధీని, సోనియాగాంధీని కించపరుస్తూ చేసిన ప్రసంగాన్ని చాల మంది ఏవగించుకున్నారు.

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ప్రజలు చాలా ఆదరించారు. గత పదిసంవత్సరాలుగా దేశంలో పెరుగుతున్న మతతత్వంతో చాలా మంది విసిగిపోయారు. రాహుల్ గాంధీ చెబుతున్న ముహబ్బత్ కి దుకాన్ మాటలు చాలా మందిని ఆకట్టుకున్నాయి. ప్రేమను పంచాలని చెప్పే రాహుల్ గాంధీని చాలా మంది ఇష్టపడుతున్నారు. నూటయాభై రోజుల పాట వేల కిలోమీటర్లు నడిచారు రాహుల్ గాంధీ. కాని ఇక్కడ అర్థం కాని విషయమేమిటంటే హర్యానాలోని నూహ్ లో హింసాకాండ జరిగింది. వేలాది మంది వేధింపులకు గురవుతున్నారు.  హర్యానా ప్రభుత్వం ఇప్పుడు అక్కడ ముస్లిములను టార్గెట్ గా చేసుకుని బుల్డోజర్లతో వారి ఇళ్ళు, హోటళ్ళు, దుకాణాలను కూలగొడుతోంది. హర్యానా ముఖ్యమంత్రి స్వయంగా ఈ ఆదేశాలిచ్చినట్లు కూడా తెలుస్తోంది. హర్యానా కాంగ్రెస్ అక్కడేం చేస్తోంది? హర్యానాలో కాంగ్రెస్ బలంగానే ఉంది. కాంగ్రెస్ కు 31 మంది శాసనసబ్యులున్నారు. బీజేపీ బలం 40. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రమే మాట్లాడుతున్నారు. వారిద్దరు కూడా ముస్లిములే. బీజేపీ ప్రభుత్వం ఈ శాసనసభ్యులపై చర్యలు తీసుకుంటోంది. కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం హర్యానా విషయంలో ఏమీ మాట్లాడలేదు. రాహుల్ గాంధీ ముహబ్బత్ కి దుకాన్ హర్యానాలో పెట్టరా? ప్రేమను పంచే కార్యక్రమాలు హర్యానాలో లేవా? హర్యానాలో ముస్లిములు ఆయన దృష్టిలో లేరా? అనే ప్రశ్నలు పుడుతున్నాయి.

మరో ప్రశ్న రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. నాసిర్, జునైద్ అనే ఇద్దరు వ్యక్తుల హత్య రాజస్థాన్ లో జరిగింది. ఈ హత్య ఫిబ్రవరిలో జరిగింది. ఇంతవరకు రాజస్థాన్ ప్రభుత్వం ఈ హత్యలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నిందితుడు మోను మనేసర్. ఈ నిందితుడే బాహాటంగా హర్యానా విహెచ్పీ ర్యాలీకి వస్తానని ప్రకటనలు కూడా ఇచ్చాడు. కాని రాజస్థాన్ ప్రభుత్వం మాత్రం అతడిని అరెస్టు చేయలేకపోయింది. హర్యానాలో అల్లర్లకు మోను మానేసర్ కూడా ఒక కారణం. మోను మానేసర్ ను అరెస్టు చేయడంలో రాజస్థాన్ సర్కారు ఎందుకు విఫలమైంది? రాహుల్ గాంధీ కూడా ఈ ప్రశ్నకు జవాబీయవలసి ఉంది.

గత పదేళ్ళుగా టీవీల్లో మతతత్వ విషం వర్షంలా కురుస్తోంది. ముఖ్యంగా ముస్లిములను విలన్లుగా చూపించే ప్రయత్నం జరుగుతోంది. కరోనా కాలంలోను ఇంకా అనేక సందర్భాల్లో ఇది స్పష్టంగా కనిపించింది. నూహ్ అల్లర్ల విషయంలో కాంగ్రెసుకు చెందిన భూపేష్ బఘేల్ ఒక్కరు మాత్రమే స్పష్టంగా తన నిరసన తెలియజేశారు. ముఖేష్ అంబానీకి చెందిన న్యూస్ 18 టీవీ చానల్ లో ఒక కార్యక్రమంలో చత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ ను పిలిచారు. న్యూస్ 18 యాంకర్ అమన్ చోప్రా నూహ్ అల్లర్ల విషయంలో అత్యంత మతతత్వ వైఖరి ప్రదర్శిస్తూ చేసిన కవరేజ్ తర్వాత నిరసనగా భూపేష్ భగేల్ న్యూస్ 18 కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఇది ప్రోత్సాహకరమైన విషయం. చాలా టీవీ చానళ్ళు ముస్లిములను విలన్లుగా చూపించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయన్నది రహస్యమేమీ కాదు. మతతత్వన్ని ప్రచారం చేస్తున్నాయన్నది కూడా రహస్యం కాదు. ఇలా మతతత్వ ఎజెండాతో పనిచేసే చానళ్ళను బాయ్ కాట్ చేయడం వంటి నిర్ణయమేదైనా కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకుంటుందా? ఈ చానళ్ళ విషయంలో కూడా రాహుల్ గాంధీ తన అభిప్రాయం చెప్పవలసి ఉంది.

మధ్యప్రదేశ్ లో బాగేశ్వర్ బాబా హిందూరాష్ట్ర గురించి మాట్లాడడమే కాదు ముస్లిం విద్వేష ప్రసంగాలు, పురుషాహంకార ప్రసంగాలు ఆయనకు మామూలే. ఇలాంటి వ్యక్తిని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నేతలు భుజాలకెత్తుకుని ఎందుకు మోస్తున్నారు? మధ్యప్రదేశ్ లో కాంగ్రెసుకు బాగేశ్వర్ అంత ముఖ్యమా? ఈ విషయంలో కూడా రాహుల్ గాంధీ తన అభిప్రాయం చెప్పవలసి ఉంది. సాఫ్ట్ హిందూత్వ వైఖరితోనే నడుస్తారా? దీనివల్ల దేశానికి ఏమైనా ప్రయోజనం ఉంటుందా? కనీసం కాంగ్రెసుకు ప్రయోజనం ఉంటుందా? సాప్ట్ హిందూత్వ వల్ల ఇంతకు ముందు తగిలిన ఎదురుదెబ్బలు చాలవా? హిందూత్వ రాజకీయాలను ఖచ్చితమైన సెక్యలుఱ్ రాజకీయాలతో ఎదిరించే ధైర్యం ఇప్పటికైనా కాంగ్రెసులో ఉందా? ఈ ప్రశ్నలకు కూడా రాహుల్ గాంధీ జవాబీయవలసి ఉంది.

మరో ముఖ్యమైన విషయం. మణిపూర్ అల్లర్లకు కారణం మెయిటీలకు గిరిజన హోదా కల్పించడం. ఈ విషయమై కాంగ్రెసు పార్టీ స్పష్టమైన వైఖరి ఎందుకు ముందే ప్రకటించలేదు. ఈ ప్రశ్నలకు కూడా జవాబీయవలసిన అవసరం ఉంది. భారత్ జోడో యాత్రలో అనేకమందిని కలుసుకున్న రాహుల్ గాంధీకి దేశంలో మతతత్వం ఎలాంటి వాతావరణాన్ని సృష్టించిందో అర్థం చేసుకునే ఉంటారు. కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ఏమిటి? మోడీని వ్యతిరేకించడం, బీజేపీని వ్యతిరేకించడం మాత్రమేనా? దేశంలో సెక్యులర్ విలువల పతనం అనేది చాలా కాలం ముందు నుంచే ప్రారంభమయ్యింది. బీజేపీ మాత్రమే దీనికి కారణం కాదు. మతతత్వ రాజకీయాలను అవసరం మేరకు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ కూడా నడిపారు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఎలాంటి విధానాలు, వైఖరి కలిగి ఉన్నారో స్పష్టం చేయాలి.

రాహుల్ గాంధీ చెప్పవలసిన జవాబులు కూడా చాలా ఉన్నాయి. కాని ఒకటి మాత్రం వాస్తవం పార్లమెంటులో ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రసంగాన్ని చూసినవారు, గతంలో బీజేపీ నేతలు పప్పూ అంటూ చేసిన హేళనలు గుర్తు చేసుకోక తప్పదు. నిర్భయంగా, ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతున్న రాహుల్ ముందు ఇప్పుడు బీజేపీ నేతలు ఢీలా పడిపోయారు. రాహుల్ ప్రసంగం ఉంటుందనే సంకోచంతోనే మొదటి రోజు మోడీ లోక్ సభకు రాలేదనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయంటే రాహుల్ ఎలాంటి స్థానం సంపాదించుకున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఆయన కేవలం కాంగ్రెస్ నాయకుడిగా మాట్లాడలేదు. మొత్తం ప్రతిపక్షాలను నడిపే నాయకుడిగా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షపదవికి రాజీనామా చేయడం మొదలు రాహుల్ లో ఒక మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. భారత్ జోడో యాత్ర ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. కేవలం మోడీని వ్యతిరేకించడమే రాజకీయం కాదన్నది కూడా ఆయన అర్థం చేసుకున్నట్లు కనిపిస్తోంది.

నష్రత్ కీ బాజార్ మే ముహబ్బత్ కీ దుకాన్ (విద్వేష బాజారులో ప్రేమల దుకాణం) అంటూ తనదైన కొత్త సరళిని ప్రచారం చేయడం మొదలు పెట్టారు. ఇది బీజేపీ రాజకీయాల పునాదులపై చేసే దాడి. ఒక గొప్ప అస్త్రాన్ని ఆయన ఎన్నుకున్నారు. రాజస్తాన్, మధ్యప్రదేశ్ లలో సాఫ్ట్ హిందూత్వ తొడుక్కోవడం వల్ల ఈ అస్త్రం మొద్దుబారి చివరకు ప్రయోజన శూన్యమయ్యే ప్రమాదం ఉంది.

–      వాహెద్