హర్యానాలో అల్లర్ల వార్తలు అందరూ చదివే ఉంటారు. ఎక్కడో ఒక చోట ఏదో ఒక రూపంలో మతతత్వం మనకు రోజు కనిపిస్తూనే ఉంది. నూహ్ అల్లర్ల తర్వాత ఏం జరిగింది? గురుగ్రామ్ లో అల్లర్లు జరిగాయి. మతతత్వ సంస్థల బెదిరింపుల ప్రకటనలు వచ్చాయి. ఈ ప్రాంతంలోకి ఇతర రాష్ట్రాల నుంచి పొట్ట చేతపట్టుకుని వలస వచ్చిన ముస్లిం కార్మికులు తిరిగి తమ స్వంత ప్రదేశాలకు తరలి వెళ్ళిపోయారు. ఇప్పుడు గురుగ్రామ్ లో పరిస్థితి ఏమిటంటే, చాలా వ్యాపార సంస్థల్లో పనివారు లేరు. అపార్టుమెంట్ల వద్ద సేవలందించే సిబ్బంది లేరు.
గురుగ్రామ్ లో పారిశ్రామిక వాడల్లో ఇప్పుడు పనిచేసేవారి కొరత ఏర్పడింది. వడ్రంగులు, పారిశుద్ధ్య కార్మికులు, డ్రయివర్లు, పనిమనుషులుగా ఉన్న అనేకమంది తమ పనులు వదిలేసి వెళ్ళిపోయారు. ఒక అపార్టుమెంటులో హౌస్ కీపింగ్ స్టాఫ్ పదిమంది ఉంటే అందులో ఎనిమిది మంది వలస కార్మికులు, ముస్లిములు. ఆ ఎనిమిది మంది వెళ్ళిపోతే మిగిలిన ఇద్దరితో పనులు జరగడం లేదు. ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోతోంది. బెంగాల్, బీహారుల నుంచి వచ్చిన ఈ కార్మికులతోనే గురుగ్రామ్ లో పనులు నడిచేవి. ముస్లిం కార్మికులు వెళ్ళిపోయిన తర్వాత అధిక వేతనాలు చెల్లించి కొత్త వారిని నియమించుకోవలసి వస్తుందని, అలా అధికవేతనాలు చెల్లించడానికి సిద్ధపడినా కూడా తగిన సిబ్బంది దొరకడం లేదని చాలా మంది వాపోతున్నారు.
గురుగ్రామ్, నూహ్ లలో అల్లర్ల వల్ల గురుగ్రామ్, నూహ్ ప్రాంతాల్లో ఇప్పుడు చాలా పనులు ఆగిపోయాయి. పార్కింగ్ అటెండెంట్లు, క్యాబ్ డ్రయివర్లు, ఆఫీసులో సహాయకులు, సెక్యురిటీ సిబ్బంది ఇలా అనేక సేవల్లో ముస్లిములు పనిచేసేవారు. ఇప్పుడు వారంతా తమ తమ నెలవులకు తరలిపోయారు. గురుగ్రామ్ సర్వీస్ సెక్టార్ ఇప్పుడు కూలబడింది. మెయిడ్లు, హెల్పర్లు, వంటమనుషులు, కార్ల క్లీనర్లు, కూరగాయలు అమ్మేవాళ్ళు, పండ్లు అమ్మేవాళ్ళు, డ్రయివర్లు ఎవ్వరు ఇప్పుడు దొరకడం లేదు. మతతత్వ సంస్థల హూంకరింపులు, ఘీంకరింపులు, బెదిరింపులు చివరకు గురుగ్రామ్ లో జీవనాన్ని స్తంభించేలా చేశాయి.
ఇప్పుడు గురుగ్రామ్ లో ఉన్నత మధ్యతరగతి, ఉన్నత తరగతికి చెందిన అనేకమంది పనిమనుషులను వెదకడం కష్టమయ్యింది. రెట్టింపు కాదు మూడు రెట్లు వేతనాలు ఇవ్వాల్సి వస్తోంది. నిన్నటి వరకు మతతత్వ రాజకీయాలను పరోక్షంగా ప్రోత్సహిస్తూ వచ్చిన వారు కూడా ఈ పరిస్థితి చూపి పునరాలోచనలో పడిపోయారు. పాలనాయంత్రాంగం, ప్రభుత్వం అంతా నార్మల్ అయిపోయిందని చెబుతున్నారు. కాని సాధారణ స్థితి లేదు. అపనమ్మకాలు పెరిగిపోయాయి. కార్మికులు వలస పోవడం లేదని ప్రభుత్వం చెబుతోంది. కాని వలసపోతున్నారన్నది కనిపిస్తున్న వాస్తవం. గురుగ్రామ్ లో రోడ్లపైకి వస్తే ఆటోలు, క్యాబులు తక్కువ సంఖ్యలో ఇప్పుడు కనిపిస్తున్నాయని చాలా మంది ఒప్పుకుంటున్నారు. ఆటో, క్యాబ్ చార్జీలు ఇప్పుడు అమాంతంగా పెరిగిపోయాయి. ఇప్పుడు పనిమనుషులు రోజుకు రెండుగంటల పనికి ఏడు వేల రూపాయలు చార్జి చేస్తున్నారు. అలాగే నెలకు 30 వేల రూపాయల వరకు పనిమనుషుల కోసం మెయిడ్ సర్వీసులు వసూలు చేస్తున్నాయని తెలుస్తోంది.
సేల్స్ మ్యాన్, నౌకర్లు, సెక్యురిటీ సిబ్బంది చాలా మంది అల్లర్ల తర్వాత తమ పనులకు రాలేదు. పెద్ద పెద్ద మాల్స్ లో ఇప్పుడు సిబ్బంది కొరత పీడిస్తోంది. సిబ్బంది కోసం సర్వీస్ ఏజెన్సీలు భారీ మొత్తాలు వసూలు చేస్తున్నాయి.
మరోవైపు నిర్మాణ రంగం కుదేలయ్యింది. నిర్మాణ కార్మికులు పనులకు రావడం లేదు. చాలా మంది కార్మికులు తమ స్వంత ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ఉన్నవాళ్ళు కూడా పనులకు వెళ్ళడానికి భయపడుతున్నారు. ఎందుకంటే, మతతత్వ సంస్థల బెదిరింపులున్నాయి. ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చనే భయాలు వెంటాడుతున్నాయి.
ఇలాంటి భయోత్పాత వాతావరణాన్ని సృష్టించిన వాళ్ళెవరు? ఏ రాజకీయ ప్రయోజనాల కోసం సమాజాన్ని నిరంతరం భయం ఒడిలో బతికేలా చేస్తున్నారు? ఈ ప్రశ్నలకు జవాబులు కష్టమేమీ కాదు. ప్రతి ఒక్కరికి తెలిసిన విషయాలే. ఎన్నికలు సమీపించినప్పుడల్లా మతతత్వ రాజకీయాలు ఇలాంటి వాతావరణం సృష్టించడం దేశంలో మామూలయ్యింది. కాని ఈ భయోత్పాత వాతావరణం ఆర్థిక కార్యకలాపాలను దెబ్బతీస్తుంది. దేశాన్ని వెనక్కి నెడుతుంది.
ఎన్నికలకు ముందు మతతత్వ రాజకీయాలతో గద్దెనెక్కాలనుకునే వారు ప్రజలను ఎలాంటి ఇక్కట్లకు గురి చేస్తున్నారో ప్రజలు గ్రహించిన రోజున ఈ మతతత్వ రాజకీయాలు ఉండవు, ఈ భయోత్పాత స్థితి ఉండదు.