కశ్మీర్ ఫైల్స్ సినిమా గురించి చాలా మందికి తెలుసు. ఈ సినిమాలో వాస్తవాలు తక్కువ ప్రాపగాండ ఎక్కువనేది అనేకమంది ఇప్పటికే విశ్లేషించి చెప్పారు. బీజేపీ రాజకీయ విజయాలకు ఈ సినిమా ఉపయోగపడుతుందని ఆ సినిమాను ప్రోత్సహించడం కూడా అందరికీ తెలిసిన విషయమే. కశ్మీర్ ఫైల్స్ సినిమా ఆడిన ధియేటర్లలో జై శ్రీరామ్, ముల్లాలందరు ఉగ్రవాదులే వంటి నినాదాలు వినిపించాయని వార్తలు కూడా వచ్చాయి. ఎన్నికల్లో ప్రాపగాండ ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పుడు లోక్ సభ ఎన్నికలు రాబోతున్నాయి. ఒక సముదాయాన్ని పరులుగా ముద్రవేసి, వారిని విలన్లుగా ప్రచారం చేస్తే అధిక సంఖ్యాక సముదాయం ఓట్లు రాబట్టుకోవడం తేలికవు తుందన్న రాజకీయ ఎత్తుగడలు ఈ ప్రాపగాండ వెనుక ఉంటాయి.
కశ్మీర్ ఫైల్స్ చూసిన తర్వాత పాతబస్తీ ఫైల్స్ తీయాలని గూడురు నారాయణరెడ్డిని కోరానని తెలంగాణ బీజేపీ నాయకుడు బండి సంజయ్ అన్నాడు. కాని సినిమా డైరెక్టర్ యాతా సత్యనారాయణ రజాకార్ ఫైల్స్ ముందు చేద్దామన్నాడని చెప్పాడు. మూవీ పోస్టరు కూడా వచ్చింది. ఈ పోస్టరులో రక్తం, హింసాకాండ ఉన్నాయి. ఒక రైఫిల్ బాయ్ నెట్ పై ఒక బాలుడి శవం ఉంది. ఈ పోస్టరు చూస్తేనే ఇది ప్రాపగాండ సినిమా అనేది అర్థమవుతుందని చాలామంది విమర్శించారు. ఇప్పుడు విద్వేష సినిమాలు తీయడం లాభసాటిగా మారింది. కశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ, 72 హూరేం లాంటి సినిమాలు వస్తున్నాయి. ఇక రజాకార్ల చరిత్ర చూస్తే 1938లో బహదూర్ యార్ జంగ్ ఏర్పాటు చేసిన పారా మిలిటరీ దళం. రజాకార్ అంటే స్వచ్ఛంద కార్యకర్త అని అర్థం. 1947 వరకు ఈ రజాకార్లు చేసింది ఏదీ లేదు. నిజాం అసఫ్ జాహీ జెండాకు సెల్యూటు కొట్టడం, పెరేడ్ చేయడం తప్ప వాళ్ళు ఏదీ చేయలేదు. బహిరంగ సభల్లో పబ్లిక్ ఆర్డర్ చూసే వాళ్ళు. 1944లో బహదూర్ యార్ జంగ్ చనిపోయారు. 1946లో రజాకార్ దళం ఖాసిం రజ్వి క్రిందికి వచ్చింది. లాతూరుకు చెందిన ఖాసీం రజ్వీ ఒక ఉన్మాది. దేశ స్వతంత్రం తర్వాత రజాకార్ దళం ఉందన్న బలంతో ఖాసీం రజ్వీ స్వతంత్ర రాజ్యం ఏర్పాటు చేయదలిచాడు. 1946 మధ్య నుంచి తెలంగాణ రైతాంగం, ఆంధ్ర మహాసభ, కమ్యునిస్టు పార్టీల నాయకత్వంలో తిరుగుబాటు చేసింది. మొదట భూకామందులపై మొదలైన పోరాటం తర్వాత నిజామ్ ప్రభుత్వంపై పోరుగా మారింది. 1947 అగష్టు నుంచి హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెసు, సోషలిస్టు పార్టీ, ఆర్యసమాజ్, హిందూ మహాసభలు గెరిల్లా యుద్ధవ్యూహాన్ని అమలు చేసి పోరాడాయి. నిజామ్ సంస్థానంలో శాంతిభద్రతల పరిస్థితి సృష్టించడం ద్వారా భారత ప్రభుత్వం సైనిక జోక్యం చేసుకునేలా చేయడం ముఖ్య ఉద్దేశ్యం.
మరోవైపు రజాకార్ మిలిషియా హైదరాబాద్ సంస్థానంలోని ప్రజలను భయభీభత్సాలకు గురి చేయడం కూడా ప్రారంభమయ్యింది. ఈ పరిస్థితులు భారత ప్రభుత్వానికి సైనిక జోక్యం చేసుకునేలా చేశాయి. సెప్టెంబర్ 13న ఈ సైనికచర్య ఆపరేషన్ పోలో పేరుతో ప్రారంభమయ్యింది. కేవలం ఐదు రోజుల్లో హైదరాబాద్ హస్తగతం అయ్యింది. ఆపరేషన్ పోలో ఒక అంతర్గత పోలీసు యాక్షన్‌గా మాత్రమే ప్రభుత్వం చెప్పింది. ఇది సైనికచర్యగా చెప్పలేదు. ఆ విధంగా ఐక్యరాజ్యసమితి జోక్యాన్ని నివారించడం జరిగింది. కాని హైదరాబాద్‌లో జరిగిన సంఘటనల నిజాలు తెలుసు కోడానికి నెహ్రూ గుడ్విల్ కమీషన్ ఏర్పాటు చేసి పంపించారు. ఈ కమీషన్ ఇచ్చిన రిపోర్టు సుందర్ లాల్ రిపోర్టు. దీన్ని ఎన్నడూ బయట పెట్టలేదు. 2013లో బ్రిటీషు చరిత్రకారుడికి ఇది దొరికింది. ఈ రిపోర్టు ప్రకారం 27 వేల నుంచి 40 వేలమంది హతమయ్యారు. ఇది చాలా తక్కువ అంచనా అని రిపోర్టు స్వయంగా పేర్కొంది. ఇతర అంచనాల ప్రకారం రెండు లక్షల నుంచి ఐదు లక్షల మంది హతమ్యారు. జనాభాలోని ముస్లిముల్లో 20 శాతం పురుషులు మరణించారని తెలుస్తోంది. ముస్లిముల దుకాణాలు దోచుకున్నారు. హత్యలు జరిగాయి. ఇదంతా హైదరాబాదులో రజాకార్లకు ప్రతీకారంగా జరిగిన చర్యలుగా కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు జరిగాయి. హైదరాబాదుపై భారత ప్రభుత్వ శ్వేతపత్రంలో ఏమన్నారంటే, హైదరాబాద్ సంస్థానం ఒక మతతత్వ రాజ్యం, విదేశీ దురాక్రమణదారుల ఏజెంట్లు స్థాపించిన రాజ్యం, ఫాసిస్టు మైనారిటీ పాలకులు పాలిస్తున్న రాజ్యం, ఇందులో మెజారిటీ సముదాయం ప్రజలకు ఎలాంటి హక్కులు ఇవ్వలేదు. ఎలాంటి స్వేచ్ఛలు లేవు.. వంటి మాటలున్నాయి. హైదరాబాదును పాలించిన ఆసఫ్ జాహీలు విదేశీయులు కాదు. ఉస్మాన్ అలీ పాషా ఏడవ నిజామ్. హైదరాబాదు ఒక ఫ్యూడల్ రాజ్యంలానే ఉండేది. చాలా వరకు భూములు దొరల చేతుల్లో ఉండేవి. 1947 వరకు నిజామ్ సంస్థానంలో మతపరమైన ఘర్షణల వాతావరణం లేదు. భారతదేశం భారత పాకిస్తాన్‌లుగా విడిపోయిన తర్వాత కూడా హైదరాబాద్‌లో కులపరమైన విభజనలు, వర్గపరమైన విభజనలు ఉండేవి కాని మతపరమైన విభజన అంతగా కనిపించదు. తెలంగాణ సాయుధ పోరాటం జమిందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగింది. కాంగ్రెసు కూడా ఈ పోరాటంలో తర్వాత పాలుపంచుకుంది. ఆసక్తికరమైన విషయ మేమిటంటే, భారత స్వతంత్ర పోరాటంలో ఎక్కడా కనిపించని విధంగానే, బీజేపీ, జనసంఘ్ లేదా ఆరెస్సెస్‌లు ఈ పోరాటం లోను ఎక్కడా కనిపించవు. ఇప్పుడు బీజేపీ తెలంగాణలో రాజకీయంగా ఎదగడానికి రజాకార్లను ఉపయోగించుకోవాలనుకుంటోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో కూడా మతం రంగు పులమడానికి ఈ శక్తులు ప్రయత్నించాయి. వరుసగా మతపరమైన ఘర్షణలు జరిగాయి. 2008లో భైంసా, మార్చి 2010లో హైదరాబాద్, అదే సంవత్సరం కరీంనగర్, 2011లో తాండూర్, మిర్యాలగూడ సిద్దిపేటలలో మతపరమైన ఘర్షణలు జరిగాయి. తెలంగాణ ఉద్యమంలో మతతత్వ రాజకీయాలు చొరబడకుండా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మతతత్వ వాతావరణం పెరగకుండా కేసీఆర్ అదుపు చేయగలిగారు. రాజాసింగ్ వంటి కొందరు నేతలు మతతత్వ వ్యాఖ్యలతో మతోన్మాదాన్ని రెచ్చగట్టే ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. రజాకార్లను, హైదరాబాద్ సంస్థానం విలీనాన్ని ఉపయోగించుకుని ఇప్పుడు బీజేపీ లాభపడాలని చూస్తోంది. విమోచనమా, విలీనమా, స్వాతంత్య్రమా అనే చర్చలో ఎవరి వాదనలు వాళ్ళు వినిపిస్తు న్నారు. ఎవరికి ఎలా కావాలో అలా చరిత్రను మార్చేస్తున్నారు. కాని రాంజీ గోండ్, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్యలు సాయుధ పోరాటంలో చేసిన త్యాగాలు ఇప్పుడు ఎంతమందికి గుర్తున్నాయి. ఫ్యూడల్ దొరలపై జరిగిన తిరుగుబాటు ఇప్పుడు ఎంతమందికి గుర్తుంది. సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన ముగ్గురిలో ఒకరు ముస్లిం అని ఇప్పుడు ఎంతమందికి గుర్తుంది. నిజామ్‌కు వ్యతిరేకంగా ధైర్యంగా రాసి చావుకు భయపడని షోయబుల్లా ఖాన్ ఇప్పుడు ఎంతమందికి గుర్తున్నాడు. ఇప్పుడు ఇదంతా హిందూ ముస్లింగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. హిందూ మెజారిటీని పాలించిన ముస్లిం పాలకులు చేసిన దుర్మార్గాలనే కథలు ప్రచారంలో ఉన్నాయి. గంగా జమునా తెహజీబ్‌కు పేరుపడిన తెలంగాణ ఈ మతతత్వ రాజకీయాలకు తగిన జవాబు చెబుతుందని చాలా మంది బలంగా నమ్ముతున్నారు.
- ఉమైర్