April 14, 2024

జర్మనీలో శరణార్థుల సమస్యని గోరంత కొండంత చేసి జనాన్ని రెచ్చగొట్టడం జరుగుతోంది. వలసదారుల వల్ల ప్రమాదం ఉందన్న భయాన్ని పెంచుతున్నారు. ఈ మతతత్వ శక్తుల ప్రచారం వల్ల  జాత్యహంకారం,  ఇస్లామోఫోబియా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్‌-వాల్టర్‌ స్టెయిన్‌మీర్‌ మాట్లాడుతూ ఇస్లాం జర్మనీ అంతర్భాగమని నొక్కి చెప్పాడు. ఇస్లాం, ముస్లిముల మతం, వారి జీవితం, ముస్లిం సంస్కృతి జర్మనీ దేశంలో అంతర్భాగాలయ్యాయని ఆయన చెప్పాడు.  కొలోన్‌లోని అసోసియేషన్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ కల్చరల్‌ సెంటర్స్‌ 50వ వార్షికోత్సవ వేడుకలో స్టెయిన్‌మీర్‌ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్మనీలో 50 లక్షలకు పైగా ఉన్న ముస్లింల సాంస్కృతిక వైవిధ్యం కూడా జర్మనీ అంతర్భాగమే అన్నారు. మత స్వేచ్ఛ అంటే అన్ని మతాల వారి హక్కులను  పరిరక్షించడం అని స్టెయిన్‌మీర్‌ చెప్పాడు. జర్మనీ సైద్ధాంతికంగా తటస్థ దేశం. కానీ మత స్వేచ్ఛ అంటే జర్మనీ మతం లేని దేశమని అర్థం కాదు. అన్ని మతాలకు అవకాశం ఇవ్వడం అందరు మతస్తుల స్వేచ్ఛను రక్షించడం అని చెప్పాడు. జర్మనీలో జాత్యహంకారం, ఇస్లామోఫోబియా పెరిగిపోయాయని ఇటీవల ఒక నివేదిక వచ్చిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జర్మనీలో 2022లో మొత్తం 898 ముస్లిం వ్యతిరేక సంఘటనలు నమోదయ్యాయి, అయితే రిపోర్టు కాని కేసుల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుంది, జూన్‌లో బెర్లిన్‌కు చెందిన ప్రభుత్వేతర సంస్థ, అలయన్స్‌ ఎగైనెస్ట్‌ ఇస్లామోఫోబియా  నివేదిక ప్రకారం. జర్మనీలోని ముస్లింలకు జాత్యహంకారం ఎదుర్కోవడం నిత్యకృత్యమైపోయింది. 84 మిలియన్లకు పైగా జనాభా ఉన్న జర్మనీ పాశ్చాత్య దేశాల్లో  ఫ్రాన్స్‌ తర్వాత ముస్లిం జనాభాను అత్యధికంగా కలిగి ఉన్న రెండవ దేశం.