January 27, 2025

ఆ విషయం తెలుసుకున్నప్పట్నుంచి నా మనస్సు భగ్గుమంటు న్నది. నాలో ఆశ్చర్యం, ఆగ్రహం, ఆవేదనలు  ముప్పిరిగొల్పుతు న్నాయి.

ఛీచీ.. మరీ ఇంత విశృంఖలత్వమా? ఇంత బరితెగింపా. సిగ్గు, లజ్జా, నీతి నియమాలను గాలికొదిలేసి నైతిక విలువలను దిగజార్చి ఇంత  బహిరంగంగా బరితెగించడమా? వీరిని అడ్డుకునే వారు ఎవరూ లేరా? మన సమాజం ఎటు పోతోంది??

హైదరాబాద్‌ నగరంలో నివాసముంటున్న మేము మా సౌకర్యార్థం మరో అపార్ట్‌మెంట్‌కి మారవలసి వచ్చింది. అది మంచి నివాస యోగ్యమైన ప్రదేశమని భావించాము. ఎందుకంటే అపార్ట్‌ మెంట్‌కు సమీపంలోనే కూరగాయల మార్కెట్‌, షాపింగ్‌ మాల్‌, నిత్యావసర వస్తువుల షాపులు, అన్నిటికంటే ముఖ్యంగా ఓ పేరున్న దవాఖానా కూడా ఉంది. మంచి ప్రాంతంలో ఇల్లు దొరికిందని  సంతోషించాము. ఇల్లు కూడా సకల సౌకర్యవంతంగా ఉంది. కానీ ఆ ఆనందం కొద్దిరోజుల్లోనే హరించుకaషుపోయింది.

మా అపార్ట్‌మెంట్‌ ఒక చిన్న సందులో ఉంది. ఆ సందులో మా అపార్ట్‌మెంట్‌ ఎదురుగా ఓ చిన్న హోటల్‌/ లాడ్జి ఉంది. అక్కడ భోజనం లేదా తిండి పదార్థాలు వంటి వసతుల్లేవు. అక్కడ అనైతిక చర్యలు జరుగుతున్నాయి.

బాహాటంగా జరుగుతున్న ఈ లజ్జాకరమైన వ్యాపారం గురించి తెలుసుకుని సిగ్గుతో నా తల తిరిగిపోయింది.

వీరిని ఎవరూ అడ్డుకోలేరా?? ఇది నవ నాగరికత కలిగిన పాశ్చాత్య దేశమా? లేదా సంస్కృతి సంప్రదాయాలకు నిలయమైన మన భారతదేశమా?? ప్రస్తుతం మన సమాజం ఎదుర్కొంటున్న రుగ్మతల్లో ఇలాంటి అనైక చర్యలు ఒకటి.

అక్కడ నివసించడం తగదని, విచ్చలవిడితనం పేట్రేగిపోతున్న ఆ ప్రదేశంలో ఎదుగుతున్న మా పిల్లల క్షేమం దృష్ట్యా మరో ఇంటి కోసం అన్వేషణ ప్రారంభమైంది.

మేము ఇంటికోసం వెతుకుతున్న సమయంలో మరో కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయి. చదువుకోసమని నగరానికి వచ్చిన కొంతమంది మగ పిల్లలు, ఆడపిల్లలు కలిసి ఒకే ఇంట్లో బస చెయ్యడం. అంటే ఒకేచోట వండుకోవడం, తినడం, పడుకోవడం అన్నమాట. ఇలాంటి వాటిని అసలు వారి తల్లిదండ్రులు ఎలా అనుమతిస్తున్నారు. పరస్పరం ఒకరినొకరు ఆకర్షణకు లోనయి చెడు మార్గాలు పట్టవచ్చు.

ఈ సంస్కృతి అమెరికా వంటి పాశ్చాత్యదేశాలలో కొనసాగుతున్నది. సర్వీస్‌ అపార్ట్‌మెంట్‌లు వంటివి ఉన్నాయి. కానీ ఆ విష సంస్కృతి ఇక్కడ కూడా దాపురించడం వింతను గొల్పింది.

అలా యువతీ యువకులు రాత్రింబవళ్ళు కలిసిమెలిసి గడపడం సమంజసమా? ఈ సమాజం ఆరోగ్యకరంగానూ విజయవంతంగానూ ముందుకు సాగాలంటే కొన్ని విలువలను ముఖ్యంగా నైతిక విలువలను పాటించాలి.

అందుకే మహాప్రవక్త(స) మానవీయ విలువలు, నైతిక విలువలకు ఎంతో ప్రాముఖ్యతనిచ్చారు. ఎక్కడ అనైతికం ప్రబలుతుందో అక్కడ అశాంతి, అసహనం చోటు చేసుకుంటాయి.

ఈ విశృంఖలతను అరికట్టలేకపోతే రాబోయే కాలంలో మరింత విజృంభించవచ్చు. నైతిక విలువలు మరింత దిగజారిపోతే ఎన్నో అనర్థాలు జరుగుతాయి. నేరాలు పెరిగిపోతాయి. సమాజంలో అశాంతి, దుర్మార్గపు చర్యలు, అధర్మం చోటు చేసుకుంటాయి.

భవిష్యత్తులో మన పిల్లలు లేదా నవతరం దీని బారిన పడకుండా మంచి సమాజాన్ని నిర్మించాలి. ధార్మిక విద్య వైపు మళ్ళించాలి. పెంపకం బాగుండాలి. పాపపుణ్యాల విచక్షణను నేర్పించాలి.