July 27, 2024

రిపోర్టర్స్‌ వితౌట్‌ బార్డర్స్‌ 2023 సంవత్సరం పత్రికాస్వేచ్ఛ సూచికను తయారు చేసింది. మొత్తం 180 దేశాల జాబితాలో భారతదేశం ఇప్పుడు 161వ స్థానంలో ఉంది. పత్రికల పట్ల భారత ప్రభుత్వ వైఖరిని ఈ నివేదిక తీవ్రంగా విమర్శించింది. ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోడీని విమర్శించే, బీజేపీని విమర్శించే పత్రికల పట్ల ప్రభుత్వ వైఖరిని నిరసించింది. భారతదేశానికి సంబంధించి సెక్యూరిటీ ఇండికేటర్‌ తరగతిలో 172వ స్థానంలో ఉండడం మరింత విచారకరమైన విషయం.

భారతదేశంలో పత్రికాస్వేచ్ఛ పరిస్థితి ఎంతగా పతనమయ్యిందో చెప్పే వార్త ఇది. రిపోర్టర్స్‌ వితౌట్‌ బార్డర్స్‌ 2023 సంవత్సరం పత్రికాస్వేచ్ఛ సూచికను తయారు చేసింది. మొత్తం 180 దేశాల జాబితాలో భారతదేశం ఇప్పుడు 161వ స్థానంలో ఉంది. పత్రికల పట్ల భారత ప్రభుత్వ వైఖరిని ఈ నివేదిక తీవ్రంగా విమర్శించింది. ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోడీని విమర్శించే, బీజేపీని విమర్శించే పత్రికల పట్ల ప్రభుత్వ వైఖరిని నిరసించింది. భారతదేశానికి సంబంధించి సెక్యూరిటీ ఇండికేటర్‌ తరగతిలో 172వ స్థానంలో ఉండడం మరింత విచారకరమైన విషయం. అంటే జర్నలిస్టుల భద్రత విషయంలో ప్రపంచంలో మనకన్నా దిగువస్థాయిలో కేవలం ఎనిమిది దేశాలు మాత్రమే ఉన్నాయి. అంటే అఫ్గానిస్తాన్‌ కూడా మనకన్నా మెరుగ్గా, 152వ స్థానంలో ఉంది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఇప్పుడు పత్రికా స్వేచ్ఛ ఎలాంటి దయనీయ స్థితిలో ఉందో దీన్ని బట్టి తెలుస్తోంది. రిపోర్టర్స్‌ వితౌట్‌ బార్డర్స్‌ నివేదిక ప్రకారం జర్నలిస్టులపై హింసాకాండ, రాజకీయ పక్షపాతంతో కూడుకున్న మీడియా, మీడియా యాజమాన్యం టైమ్స్‌ నౌ, హెచ్‌ టీ మీడియా, ది హిందూ గ్రూప్‌, నెట్వర్క్‌ 18 వంటి కొందరి చేతుల్లో మాత్రమే ఉండడం, ప్రభుత్వానికి, మీడియా యాజమాన్యాలకు మధ్య పరస్పర లాభాల మిలాకతు చర్యలు, మోడీకి వ్యక్తిగత మిత్రుడైన ముఖేశ్‌ అంబానీకి దాదాపు 70 మీడియా సంస్థల యాజమాన్యం ఉండడం, ఈ మీడియా సంస్థలకు దాదాపు 80 కోట్ల భారతీయులు ప్రేక్షకులుగా ఉండడం వంటి అనేక విషయాలను ప్రస్తావించింది. జర్నలిస్టులను వేధించడానికి కేసులు పెట్టడం కూడా జరుగుతుంది. దేశద్రోహం, క్రిమినల్‌ పరువునష్టం, జాతీయభద్రతను ప్రమాదంలో నెట్టడం వంటి ఆరోపణలతో ప్రభుత్వాలు జర్నలిస్టులపై కేసులు పెడుతున్నాయి. ఈ విషయమై ఏమైందంటే, సైద్ధాంతికంగా భారతచట్టాలు రక్షణ కల్పించేవని చెప్పుకున్నప్పటికీ ఆచరణలో ప్రభుత్వాన్ని విమర్శించే జర్నలిస్టులపై కేసులు పెడుతూనే ఉన్నారు. జాతివ్యతిరేక శక్తులుగా ముద్రలు వేస్తున్నారు అని ఈ నివేదిక పేర్కొంది. దక్షిణాసియాలో చూసినా, బంగ్లాదేశ్‌ ఒక్కటే మనకన్నా 163వ స్థానంలో వెనుకబడి ఉంది. పాకిస్తాన్‌ కూడా 150వ స్థానంలో మెరుగ్గానే ఉంది. తాలిబాన్ల పాలనలో ఉన్న అఫ్గానిస్తాన్‌ కూడా మనకన్నా మెరుగ్గా 152వ స్థానంలో ఉండడం ఆశ్చర్యం. భారత మీడియా సంస్థల్లో చాలా వరకు అగ్రవర్ణాలకు చెందిన వారే సీనియర్‌ స్థానాల్లో ఉన్నారని ఈ పక్షపాతం మీడియా కంటెంటులో కూడా కనిపిస్తుందని నివేదిక పేర్కొంది. మహిళా జర్నలిస్టులు ఆన్‌ లైనులో ఎదుర్కునే వేధింపులను కూడా పేర్కొంది. పత్రికాస్వేచ్ఛ విషయంలో అంతర్జాతీయ సూచికల్లో మన స్థానం దిగజారడమంటే ప్రజల ప్రాథమిక హక్కులకు కూడా విఘాతమని అర్థం చేసుకోవాలి.