October 5, 2024

 

తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ కూడా విడుదలై ఎన్నికలకు పార్టీలు సన్నద్ధమై ప్రచారాలు మొదలు పెట్టాయి. ఆంధ్రప్రదేశ్‌లో కూడా తెలంగాణాతో పాటు ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న పుకార్లు పెద్దగానే వినిపించాయి. నిజమే అన్నట్టు రెండు ప్రాంతీయ పార్టీలు వివిధ రూపాల్లోప్రచారం మొదలు పెట్టాయి. నంద్యాలలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పర్యటన ప్రచారంలో పెద్ద ఎత్తున కదలిక తెచ్చింది. ఆయన అరెస్టు కావడంతో ఆపార్టీ ప్రచార షెడ్యూల్‌ కాస్త వెనకబడిరది. అన్నీ నియోజకవర్గాలలో ఈవియంలు  చేరుకోవడం, వాటి పరిశీలన, ఉద్యోగుల బదిలీలపై ఆంక్షలు లాంటి అంశాలు ఎన్నికల కోలాహలం గుర్తు చేస్తున్నాయి. ఏమైనా మరో ఆరు నెలల్లో ఆంధ్రప్రదేశ్‌ లో కూడా ఎన్నికలు తప్పవు.

అయితే రాజకీయ పార్టీలు, కార్యకర్తల్లో తప్ప ప్రజల్లో ఎన్నికల చాటింగ్‌ అనుకున్నంత హుషారుగా రెండు తెలుగు రాష్ట్రాలలో లేదనే చెప్పాలి. టీ హోటళ్లలో తదితర పబ్లిక్‌ స్థలాలలో రాజకీయ చర్చ అగుపించడంలేదు. టీవీ డిబేట్‌లలో కూడా ఇంకా రసవత్తర చర్చ మొదలు కాలేదని చెప్పాలి. మరీ ముఖ్యంగా రెండో అతి పెద్ద జనసమూహం అయిన ముస్లిం మైనారిటీలలో అనుకున్నంత జోష్‌ లేదనే చెప్పాలి. ఎవరు గెలిస్తె మాకేంటి అని కొందరైతే, ఎటు అప్పటికి వచ్చే తాయిలాలు సరేసరి. కాని మైనార్టీలలో మేధావి వర్గం, ముస్లిం ఓట్లను ప్రస్తుతానికి సంఘటిత పర్చకపోయిన కొన్ని పార్టీలకు ఓటేయకుండా నిలువరించే ప్రయత్నంలో సఫలీకృతం అయ్యారని చెప్పుకోవచ్చు.
తెలంగాణాలో ప్రస్తుతానికి భారతీయ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) ముస్లింలకు అనుకూలంగా ఉంది. బీజేపీకి వ్యతిరేకంగా నిలబడటం, సెక్రటేరియట్‌ మస్జిద్‌ పునర్నిర్మాణం, మతకలహాలు లేకపోవడం, పెద్దగా పన్నులు వేయక పోవడం బీఆర్‌ఎస్‌ పార్టీ అందరి మన్ననలు పొందుతూ మరీ ముఖ్యంగా లౌకికతత్వం ప్రదర్శిస్తుంది. కాకపోతే ముస్లింలకు ఇస్తానన్న 12 శాతం రిజర్వేషన్లు, కొన్ని చోట్ల మస్జిద్‌లు తెరవకపోవడం ఉదాహరణకు గోల్కొండలో లేని దేవాళయం ప్రారంభమైతే, అక్కడున్న మస్జిద్‌ తెరవలేక పోవడం. అడపాదడపా ఓవైసితో కలిసి బీజేపికి బీ టీమ్‌ అనే విమర్శలు ప్రభుత్వ గృహాల కేటాయింపులో ముస్లిం లకు తగిన ప్రాధాన్యత లేకపోవడం, పాత నగరాభివృద్ధికి తెలంగాణా ప్రభుత్వం తగిన లాంగ్‌ టర్మ్‌ ప్రణాళిక రచించ లేదన్నది వాస్తవం. ఆర్టీసి, పోలీస్‌ హోమ్‌ గార్డ్స్‌ తదితర ఉద్యోగాల్లో ముస్లింల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు తెలుస్తుంది. ఉర్దూ భాషా కేంద్రంగా విరజిల్లిన హైదరాబాద్‌కు పూర్వవైభవం తీసుకొని రావడంలో కూడా బీఆర్‌ఎస్‌ అనుకున్నంత కృషి చేయటం లేదని ఉర్దూ సాహితి ప్రియులు కినుక వహించా రన్నది కూడా వాస్తవం. కాంగ్రెస్‌ పార్టీని అభిమానించే ఓ వర్గం ముస్లింలు బీఆర్‌ఎస్‌కు మైనస్‌ పాయింట్స్‌ అని చెప్పుకోవచ్చు. అయితే ఈసారి మరో నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఓ మహిళతో సహా ముస్లిమేతరులకు సీటిచ్చి మజ్లిస్‌ కొత్త ఒరవడి చూపిస్తోంది. తెలంగాణాలోని ఇతర జిల్లాలలో తమ అభిమానులు ఉన్న చోట మరో ఐదు చోట్ల అభ్యర్ధులను నిలపాలని ఆలోచనలో యంఐయం ఉన్నట్లు తెలుస్తుంది. మతతత్వ బిజెపిని నిలువరించటానికి ముస్లింలు ఇతర ప్రజాస్వామ్య వాదులు ఈ సారి బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, యంఐయం పార్టీ వైపు మొగ్గు చూపవచ్చు. అయితే ఏ పార్టీ ముస్లింలకు ఎన్ని సీట్లు ఇచ్చింది అన్నది కూడా ముస్లిం ఓట్లర్లకు ప్రభావితం చేసే అంశమే!
ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న రెండు ప్రధాన ప్రాంతీయ పార్టీలైన వైయస్సార్‌ పార్టీ, తెలుగుదేశం పార్టీలే ప్రస్తుతం ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థి పార్టీలు కూడా. ప్రస్తుతానికి ఇక్కడ బీజేపి అనుకున్నంత ప్రాచుర్యం కాని, క్యాడర్‌ కాని తయారు చేసుకోలేదు. పోటి చేసే ప్రాబల్యం కూడా సంతరించుకోలేదు. అందుకే బీజేపి తరపున పోటీ చేయాలన్న అభ్యర్థులు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ముందుకు రాలేక ఇతర పార్టీలు చూసుకుంటున్నారు. ఇక కాంగ్రెస్‌ కు పాత ఓటు బ్యాంకు ఉన్న వారిని సంఘటిత పరిచే నాయకత్వం లేదని చెప్పాలి. ఇప్పట్లో అధికారం సాధ్యం కాదు కాబట్టి ఆ పార్టీ కోసం ఖర్చు పెట్టుకుని పార్టీని నడిపించే గట్టి రథసారధి లేరు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధిగా నిలబడి ప్రధాన ప్రాంతీయ పార్టీలను ఎదుర్కోవాలంటే గట్టి అభ్యర్ధులు కావాలి. కర్నాటకలో ఎద్దోలు కర్నటక విధానంలో ‘జాగో ఆంధ్ర’ నినాదంతో ఇండియా కూటమి కోసం కొందరు మేధావులు కే.యం.సుభాన్‌ నాయకత్వంలో ఓ ప్రయత్నం కూడా మొదలు పెట్టారు. టీడీపీ, వైసిపి పై వెగటు కలిగిన ఓటరు సహజంగానే మరో ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. టిడిపి, వైసిపి బీజేపికీ అనుకూలంగా ఉంటాయన్నది నిర్వివాదాంశం.

బీజేపి పాలిత రాష్ట్రాల కన్న ఆంధ్రప్రదేశ్‌ ఎంపీలు ముందుండి పార్లమెంటులో బీజేపికి మద్దతిస్తున్నారు. ఇక్కడ ముస్లింలకు బుజ్జగిస్తూనే కేంద్రంలో నల్ల పౌరసత్వ చట్టాలకు మద్దతు, ఆర్టికల్‌ 370 రద్దు, యూనిఫాం సివిల్‌ కోడ్‌ లాంటి అన్ని చట్టాలకు టిడిపి, వైపిసి మద్దతిస్తున్నాయి. ఈ సారి బీజేపి హిందూ రాష్ట్ర భూమిక పోషిస్తే ఈ రెండు పార్టీలు బీజేపికి సపోర్ట్‌ ఇవ్వవని గ్యారెంటీ లేదు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన మంత్రి వర్గంలో ఎన్నికల ముందు ఆర్నెల్ల వరకూ ఒక్క ముస్లింకు తీసుకోలేదు. ఇస్లామిక్‌ బ్యాంక్‌ ఎన్నికల ప్రణాళికలో ప్రకటించి అమలు చేయలేదు. ప్రస్తుత ముఖ్యమంత్రి సైతం ఇస్లామిక్‌ బ్యాంక్‌, మధ్యం నివారణ ఎన్నికల ప్రణాళికలో ప్రకటించి అమలు ఊసే లేదు. ఇలా రెండు ప్రాంతీయ పార్టీలు ముస్లింలను ఆకట్టుకోలేదన్నది వాస్తవం.

ప్రస్తుతం ముస్లింలు ‘ఇండియా కూటమి’ వైపు లేదా మరో ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. అందుకే ప్రస్తుతానికి ముస్లింలు గుంభనంగానే ఉన్నారు. భవిష్యత్తులో రాబోయే ప్రమాదాల దృష్ట్యా కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వం బలమైందిగా, లౌకికత్వం, ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి పాలించేదిగా ఉండాలని, దేశ ఐక్యత కాపాడే రాజకీయ పార్టీ కావాలని చూస్తున్నారు. ప్రాంతీయ పార్టీలు ఎంత భరోసా కలిగిస్తాయి లేదా మతతత్వ బీజేపికి వ్యతిరేకంగా ఉంటాయి అని ఆలోచిస్తున్నారు. వామపక్షాలు లేదా స్వతంత్య్ర అభ్యర్థులు, ఎస్డిపిఐ, వెల్ఫేర్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా లాంటి పార్టీల మ్యానిఫెస్టోలు, అభ్యర్ధుల వైపు కూడా చూస్తున్నారు. ప్రస్తుతానికి తమకు అనుకూలమైన, తమ ఉనికిని కాపాడే పార్టీ, ఆయా పార్టీల్లో తమకు లభించేస్థానాలు బేరీజు వేస్తున్నారు. అయితే ముస్లింలు ఎప్పుడు ఓట్లు ఇవ్వడము కాదు, ఓట్లు తీసుకునే స్థాయికి ఎదగాలి. మంచి రాజకీయ శక్తిగా, మంచి నాయకత్వం సంతరించుకోవాలి. ఇప్పటికి రెండు తెలుగు రాష్ట్రాలలో యాభై స్థానాల జయాపజయాలు ముస్లింలు మాత్రమే నిర్ధారించగలరు. మరో యాభై స్థానాలు ముస్లిం ఓటర్లు కీలకంగా వ్యవహరించగలరు. కాని తమ బలం అంచనా వేయడంలో, తమ సంఘటిత శక్తి ప్రదర్శింటంలో ముస్లింలు చొరవ చూపటం లేదు. పార్టీల్లో నాయకులుగా ఉన్నవారు తమ అధికారం కోసమే పనిచేస్తున్నారు. ఏమైనా రాబోవు పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో గుంభనంగా ఉన్న ముస్లిం ఓటర్లు ఏం చేస్తారో వేచి చూడాలి.

షేక్ అబ్దుల్ సమద్ నంద్యాల

Related News