November 21, 2024

జనతాదళ్ యునైటెడ్ అధినేత నితీష్ కుమార్ రికార్డు సృష్టించాడు. ఎనిమిదో సారి బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటీ ముఖ్యమంత్రిగా రాష్ట్రీయజనతాదళ్ నాయకుడు తేజస్వీ యాదవ్ ప్రమాణస్వీకారం చేశారు. నిన్నటి వరకు నితీష్ కుమార్ భారతీయ జనతాపార్టీ నాయకత్వంలోని ఎన్డీయేలో ఉండేవారు. హఠాత్తుగా ఎన్డీయేకు బైబై చెప్పేసి, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడమే కాదు, రాష్ట్రీయజనతాదళ్ తో జట్టుకట్టి మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసారు. నిజం చెప్పాలంటే బీహారులో బీజేపీ కన్నా తక్కువ సీట్లు రాష్ట్రీయ జనతాదళ్ వద్ద ఉన్నాయి. అయినా నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా బీజేపీ ఎందుకు ఒప్పుకుంది? ఇప్పుడు నితీష్ కుమార్ ఎందుకు బీజేపీ గూటి నుంచి బయటకు వచ్చేశారు? ఈ ప్రశ్నలకు జవాబులు భారత రాజకీయాల చిత్రపటాన్నిమన ముందు ఆవిష్కరిస్తాయి.

నితీష్ కుమార్ బీజేపీల మధ్య ఇలాంటి పరిస్థితి ఇదే మొదటిసారి కాదు. నితీష్ కుమార్ తీసుకున్నన్ని యు టర్న్ లు బహుశా మరో రాజకీయ నాయకుడెవ్వరు తీసుకుని ఉండరు. నితీష్ కుమార్ 2013లో బీజేపీకి గుడ్ బై చెప్పారు. అంతకు ముందు దాదాపు పది సంవత్సరాల పాటు బీజేపీ కూటమిలో కొనసాగాడు. బీజేపీకి గుడ్ బై చెప్పడానికి ముఖ్య కారణం నరేంద్రమోడీని ప్రధానమంత్రి అభ్యర్థిగా బీజేపీ ప్రచారం చేయడం. నరేంద్రమోడీ ప్రధాని అభ్యర్థిగా బీజేపీ చెప్పిన వెంటనే నితీష్ కుమార్ బీజేపీ కూటమి నుంచి బయటకు వచ్చేశారు. కాని 2014 ఎన్నికల తర్వాత జితన్ రామ్ మాంజీని ముఖ్యమంత్రి చేశారు. కాని కొద్దికాలానికే ఆయన్ను తొలగించి మళ్ళీ తాను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. 2015లో మహాఘట్ బంధన్ తో కలిసి పోటీ చేశారు. మహాఘట్ బంధన్ లో కాంగ్రేస్, ఆర్జెడిలతో కలిసి పోటీ చేసిన నితీష్ కుమార్ ఆ తర్వాత ఘట్ బంధన్ కు తూట్లు పొడిచారు. రెండేళ్ళలోనే ఘట్ బంధన్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ బీజేపీతో చేతులు కలిపారు. ఈ సారి నరేంద్రమోడీ ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ బీజేపీతో చేతులు కలపడానికి నితీష్ కుమార్ ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేదు. ఇప్పుడు మళ్ళీ బీజేపీకి బైబై చెప్పేసి ఘట్ బంధన్ లోకి మళ్ళీ వచ్చారు. ఇన్ని సార్లు రాజకీయంగా రంగులు మార్చిన మరో నాయకుడు మనకు కనిపంచడం చాలా అరుదు.

నితీష్ కుమార్ రాజకీయాల్లో నిజమైన చాణక్యం ప్రదర్శించారని చాలా మంది చెబుతారు. జనతాదళ్ యునైటెడ్ లో కూడా నితీష్ కుమార్ కు గతంలో జార్జి ఫెర్నాండజ్, శరద్ యాదవ్ ఇటీవల ఆర్సిపీ సింగ్ వంటి నాయకులతో పడలేదు. అనేకసార్లు యు టర్న్ తీసుకున్న ముఖ్యమంత్రిగా పేరున్నప్పటికీ నితీష్ కుమార్ రాజకీయంగా ఇప్పటికి కూడా బీహారులో బలమైన నాయకుడు. దీనికి ముఖ్యమైన కారణాలు మూడు.

బీహారులో 2005 తర్వాతి నుంచి జనతాదళ్ యునైటెడ్ అధికారపక్షంగా కొనసాగుతోంది. ఈ 17 సంవత్సరాల్లో 16 సంవత్సరాల కాలం నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లోను ఓట్ల శాతం చూస్తే జనతాదళ్ యునైటెడ్ కనీసం అతిపెద్ద పార్టీగా కూడా రాలేదు. మూడోస్ధానంలో ఉంది. బీజేపీ, ఆర్జెడీల తర్వాతి స్థానం మాత్రమే దక్కింది. సీట్ల విషయంలో ఇప్పుడు కూడా బీహారులో జనతాదళ్ యునైటెడ్ మూడో స్థానంలో ఉంది. అయితే బీహారులోని వెనుకబడిన కులాలు కుర్మీలు, కోరీలు, మహాదళితులు నితీష్ కుమార్ పక్షాన ఉన్నారు. వారి రిజర్వేషన్ల కోసం ఆయన పనిచేశారు. సామాజిక న్యాయం కోసం పనిచేస్తున్న నాయకుడిగా పేరు సంపాదించుకున్నారు. తేజస్వీ యాదవ్ నాయకత్వంలోని ఆర్జెడీ కన్నా నితీష్ కుమార్ నాయకత్వంలోని జనతాదళ్ యునైటెడ్ పక్షాన ఉండడమే మంచిదని వెనుకబడిన వర్గాలు భావిస్తున్నాయి. అలాగే అగ్రవర్ణాలు పట్ల, హిందూత్వ పట్ల వ్యతిరేకత లేని నాయకుడిగా కూడా పేరుంది. అలాగే ముస్లిం వ్యతిరేకత లేని నాయకుడిగా కూడా పేరుంది కాబట్టి ముస్లిం ఓట్లను కూడా చాలా వరకు తన పక్షాన తిప్పుకోగలడు.

బీహారు ఉత్తరాది రాష్ట్రం. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తదితర దక్షిణాది రాష్ట్రాల వంటిది కాదు. దక్షిణాదిలో మోడీ ప్రభావం ఉత్తరాదితో పోల్చితే చాలా తక్కువ. బీహారు పొరుగునే ఉన్న ఉత్తరప్రదేశ్ లో బీజేపీ యాదవేతర ఓట్లను తనవైపు తిప్పుకోగలిగింది. అలాగే దళిత ఓట్లను కూడా ఆకర్షించగలిగింది. కాని బీహారులో బీజేపి ఆ ఫని చేయలేకపోయింది. ఉత్తరప్రదేశ్ లో ములాయం, తర్వాత అఖిలేష్ యాదవ్ ల మాదిరిగా బీజేపీకి సవాలు విసిరి గట్టిగా నిలబడే ధైర్యం లేని నాయకుడిగా చాలా మంది నితీష్ కుమార్ గురించి చెబుతారు. కాని చాలా మంది ఆయన ప్రాక్టికల్ గా ఆలోచించే నాయకుడిగా వర్ణిస్తారు. నితీష్ కుమార్ బీహారు రాజకీయాల్లో నిలబడడానికి బీజేపీతో దాగుడుమూతలు కొనసాగించారు. కొన్నిసార్లు ప్రత్యర్థిగా నిలబడి, మరికొన్ని సార్లు చేతులు కలిపి ముఖ్యమంత్రిగా కొనసాగాడని చాలా మంది అభిప్రాయం.

బీహారులో కొత్త రాజకీయ సమీకరణాలు భారత రాజకీయాలపై ప్రభావం వేస్తాయా? రానున్న 2024 సాధారణ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం వేస్తాయన్నది ఆలోచించవలసిన ప్రశ్న. బీహారులో ఇప్పుడు జనతాళ్ యునైటెడ్, రాష్ట్రీయజనతాదళ్, కాంగ్రేసుపార్టీలు మళ్ళీ చేతులు కలుపుతున్నాయి. ఈ మూడు పార్టీలు కలిస్తే మెజారిటీ సాధించడం కష్టం కాదు. అసెంబ్లీ ఎన్నికలు 2025లో జరుగుతాయి. అంటే మూడేళ్ళ పాటు సమయం ఉంది. ఈ సమయంలో నితీష్ కుమార్ బీజేపీకి బైబై చెప్పి మహాఘట్ బంధన్ లోకి రావడం బీజేపీకి విఘాతమే. బీహారు రాజకీయాల్లో నితీష్ కుమార్ ఊతంతో బలం పుంజుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తూ వచ్చింది. మరోవైపు నితీష్ కుమార్ ను బలహీనపరచడానికి చేయవలసిన ప్రయత్నాలన్నీ చేసింది. 2020 బీహారు ఎన్నికల్లో ఈ ఎత్తుగడలు పనిచేశాయి. లోక్ జనశక్తి పార్టీ జనతాళ్ యునైటెడ్ కు బైబై చెప్పి బీహారులో చాలా స్థానాలకు పోటీ చేసింది. దీనివల్ల జనతాళ్ యునైటెడ్ ఓట్లకు గండిపడింది. లోక్ జనశక్తి పార్టీ నాయకుడు చిరాగ్ పాశ్వాన్ బీజేపీకి లాభం చేకూర్చడానికే జనతాదళ్ యునైటెడ్ తో తెగతెంపులు చేసుకున్నాడన్నది అందరికీ తెలుసు. చిరాగ్ పాశ్వాన్ ను పావుగా బీజేపీ ఉపయోగించిందన్నది నితీష్ కుమార్ కు కూడా తెలుసు. అప్పటి నుంచి బీజేపీ పట్ల నితీష్ కుమార్ గుర్రుగానే ఉన్నాడు. ఇటీవల నితీష్ కుమార్ సన్నిహితుడు ఆర్సీపీసింగ్ కూడా రాజీనామా చేసారు. ఆయన కూడా బీజేపీ ప్రోద్బలంతోనే రాజీనామా చేశాడన్నది నితీష్ కుమార్ కు తెలిసిన విషయమే. మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వాన్ని కూల్చిన మాదిరిగానే బీహారులో కూడా బీజేపీ రాజకీయాలు నడుస్తున్నాయన్నది నితిష్ కుమార్ పసిగట్టాడు.

రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడం అనేది వరసుగా జరుగుతూ వస్తున్నదే. ఉత్తరాఖండ్ తో మొదలు పెట్టి మహారాష్ట్ర వరకు జరిగింది ఇదే. ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత పార్టీ మార్పిళ్ళు కొనసాగాయి. మధ్యప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్రల్లో ఇదే జరిగింది. బీహారులో కూడా ఇదే జరగబోతుందన్న భయాలు చాలా కాలం నుంచి ఉన్నాయి.

జనతాదళ్ యునైటెడ్ ను చీల్చి బీహారులో అధికారం హస్తగతం చేసుకునే ప్రయత్నాలు చేస్తారనే ప్రమాదాన్ని ముందే పసిగట్టిన నితీష్ కుమార్ ముందు జాగ్రత్త పడ్డాడని విశ్లేషకుల అభిప్రాయం. బీజేపీకి రాంరాం చెప్పి మహాఘట్ బంధన్ లో చేరడం ద్వారా బీహారులో బీజేపీ బలం పెంచుకునే ప్రయత్నాలను కూడా దెబ్బతీశారు.

హైదరాబాదులో ఇటీవల బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం జరిగింది. దక్షిణాదిలో విస్తరించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణా ఫస్ట్, తమిళనాడు నెక్ట్స్ అనే మాటలు వినిపిస్తున్నాయి. బీజేపీ ప్రయత్నాలు ముందే పసిగట్టిన తెలంగాణా ముఖ్యమంత్రి తన అసంతృప్తిని దాచుకోలేదు. తెలంగాణాలో చాలా మంది ఏక్ నాథ్ షిండేలున్నారని ఇక్కడి బీజేపీ నాయకుడు చేసిన వ్యాఖ్య కూడా గమనించదగింది. శివసేన నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు పార్టీ మార్చిన సంఘటన ఇప్పుడు నితీష్ కుమార్, కేసీఆర్ వంటి నేతలకు ప్రమాదఘంటికలా వినిపించింది. పార్టీమార్పిళ్ళను ప్రోత్సహించి ప్రభుత్వాలను పడగొట్టే ప్రయత్నాలకు చెక్ పెట్టడం ప్రారంభించారు. మరోవైపు తమిళనాడులో ఆర్ ఎన్ రవిని గవర్నర్ గా నియమించడం ద్వారా అక్కడ స్టాలిన్ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేయడం ప్రారంభమయ్యింది. తమిళనాడులో మాజీ ఐపియస్ అధికారి కె.అన్నామలైను పార్టీ చీఫ్ గా నియమించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ ను తమవైపు తిప్పుకోవాలని ప్రయత్నించినా బీజేపీకి సాధ్యపడలేదు. ఆయన బీజేపీ పక్షాన మొగ్గు చూపించలేదు. అన్నాడిఎంకే లో కొనసాగుతున్న లుకలుకలు బీజేపీకి ఉపయోగపడతాయా? తమిళనాడు, తెలంగాణాల్లో విస్తరించే ప్రయత్నాలు జోరుగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బీహారు పరిణామాలు ముందుకు వచ్చాయి.

బీహారు పరిణామాలను జాతీయ రాజకీయాల కోణంలో చూడాలి. బీహారు రాజకీయాలు కులసమీకరణాల రాజకీయాలు. ఉత్తరప్రదేశ్ మాదిరిగా హిందూత్వ రాజకీయాలు బీహారులో లేవు. 2024 ఎన్నికల్లో మహాఘట్ బంధన్ బీహారులో బీజేపీకి గట్టి పోటీ ఇవ్వడమే కాదు, ఓడించే బలం కలిగి ఉంది. మహారాష్ట్రలో శివసేనను చీల్చి సాధించిన రాజకీయ ప్రయోజనాలకు బీహారు పరిణామాలు చెక్ చెబుతున్నాయి.

అయితే నితీష్ కుమార్, తీజస్వీ యాదవ్ ఈ నేతల మధ్య ఈ మూడేళ్ళ పాటు సంబంధాలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. బీజేపీని ఓడించాలనుకుంటే ఈ నాయకులు ఇద్దరు ఈ రెండేళ్ళపాటు బీహారులో అద్భుతమైన పరిపాలనను అందించి తమను తాము రుజువు చేసుకోవలసిన అవసరం ఉంది.

ఈ సారి తేజస్వీ యాదవ్ కూడా 2024 వరకు కనీసం ఈ పొత్తును దెబ్బతీసే పనులేవీ  చేయకపోవచ్చు. నితీష్ కుమార్ ను తేజస్వీ యాదవ్ ప్రశంసలతో ముంచేత్తాడు. ఇప్పుడు బీహారులో కూడా పాత ఫైళ్ళ బూజు దులిపే పనిలో కేంద్రసంస్థలు బిజిగా ఉంటాయని చాలా మంది అభిప్రాయం. కాని నితీష్ కుమార్ పై ఆరోపణలు సంధించడం అంత తేలిక కాదు. ఎందుకంటే, ప్రభుత్వంలో బీజేపీ కూడా ఆయనతో పాటు కలిసి పనిచేసింది. అలాగే కేంద్రం అణిచివేత చర్యలేమైనా తీసుకుంటే బీహారీ ఓటర్లు తీవ్రంగా ప్రతిస్పందించే అవకాశం ఉంది. దానివల్ల బీజేపీకి ఎన్నికల్లో మరింత నష్టం కలగవచ్చు. ఏది ఏమైనా బీహారు పరిణామాలు ప్రతిపక్షాలకు కొత్త బలాన్నిచ్చాయి. బీహారు మహారాష్ట్ర వంటిది కాదని రుజువయ్యింది.