November 12, 2024

ముస్లిం వ్యక్తిగత చట్టం ప్రకారం భర్త నెలకు ఒకసారి తలాక్ ఇవ్వడం, అలా మూడు నెలల పాటు ‘తలాక్’ ఇవ్వడం ద్వారా భార్యకు విడాకులు ఇచ్చే పద్ధతిలో అనుచితమేమీ లేదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది.

తలాక్-ఎ-హసన్ అనే పద్ధతి ద్వారా విడాకుల రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ ఒక ముస్లిం మహిళ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను కోర్టు విచారించింది. జర్నలిస్ట్ బెనజీర్ హీనా, అడ్వకేట్-ఆన్-రికార్డ్ అశ్వనీ కుమార్ దూబే ద్వారా, తన భర్త ఏప్రిల్ 19న స్పీడ్ పోస్ట్ ద్వారా తనకు మొదటి ‘తలాక్’ పంపాడని, ఆ తర్వాతి నెలల్లో రెండవ, మూడవ నోటీసులు పంపాడని ఆరోపించారు.

ఈ ప్రక్రియ వివక్షతో కూడుకున్నదని హీనా వాదించింది, ఎందుకంటే ఇలా విడాకులిచ్చే అధికారం పురుషులకు మాత్రమే ఉందని, ఇస్లామ్  విశ్వాసాలకు ఇది అనివార్యమేమీ పైగా  రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 21, 25లను కూడా ఇది ఉల్లంఘిస్తుందని పిటిషన్ లో ప్రస్తావించారు.

“మహిళలకు కూడా అవకాశం ఉంది. ఖులా ఉంది” అని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఎం.ఎం. సుంద్రేష్ వ్యాఖ్యానించారు. “పిటిషనర్లతో నేను ప్రాథమికంగా ఏకీభవించను. మరే ఇతర కారణాలకు ఇది ఎజెండాగా మారడం నాకిష్టం లేదని‘‘ అని జస్టిస్ కౌల్ అన్నారు.

2019లో  తక్షణ ట్రిపుల్ తలాక్ లేదా తలాక్-ఎ-బిద్దాను నేరంగా పరిగణించే బిల్లును పార్లమెంటు ఆమోదించింది. తక్షణ ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించినప్పటికీ  తలాక్-ఎ-హసన్ సమస్యను కోర్టు వదిలేసిందని పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది పింకీ ఆనంద్ వాదించారు. అయితే ప్రస్తుత పిటిషన్ ట్రిపుల్ తలాక్ కాదని, పిటిషనర్‌కు ఖులా,  ముబారత్ అవకాశాలుఉన్నాయని సుప్రీంకోర్టు పేర్కొంది.