October 30, 2024

నారాయణ మూర్తి గారు యువత వారానికి 70 గంటలు పనిచేయాలన్నారు. ఆయన కూడా ’’ఇది నా దేశం‘‘ అని భావిస్తున్నారని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఈ దేశంలో 80 కోట్ల మంది ప్రభుత్వం ఇచ్చే ఉచిత ఆహారధాన్యాలపై ఆధారపడి బతుకుతున్నారు. నిరుపేదలుగా ఉన్నారు. ఉద్యోగాలు ఉన్న యువత 70 గంటలు పనిచేయడం ప్రారంభిస్తే ఈ పరిస్థితి మారిపోతుందా? యువత 70 గంటలు పనిచేయడం లేదు కాబట్టి ఈ పరిస్థితి వచ్చిందా? లేక దేశంలోని ఆర్థిక విధానాల వైఫల్యం వల్ల ఈ పరిస్థితి వచ్చిందా? ఈ లెక్చర్లిచ్చే పెద్దలు ఈ విషయం గురించి ఎందుకు మాట్లాడడం లేదు. దేశంలో బడా కార్పోరేట్ల ఆదాయం భారీగా పెరుగుతూ పోతోంది. సగటు జనం ఆదాయం రోజు రోజుకు అడుగంటిపోతోంది. దీనికి కారణం ఆర్థికవిధానాలు కాదా? పేదలు మరింత పేదలుగా మారుతున్నారు. కార్పోరేట్లు తీసుకున్న రుణాలు ఏ స్థాయిలో ఉన్నాయి. దాదాపు 14.5 లక్షల కోట్ల రూపాయల రుణాలు కార్పోరేట్లు తీసుకున్నారు. ’’ఇది మన దేశం. మనం తీసుకున్న రుణాలు నిజాయితిగా చెల్లించేద్దాం‘‘ అని కార్పోరేట్లకు ఈ పెద్దలు ఎందుకు చెప్పడం లేదు? ఎందుకంటే బ్యాంకు నుంచి రుణం తీసుకున్న పేద, మధ్యతరగతి ప్రజలు రుణం తీర్చకపోతే వారి కట్టుబట్టలు కూడా వేలానికి వస్తాయి, కాని కార్పోరేట్లకు రుణాల రద్దు సదుపాయం ఉండనే ఉంది.

దేశంలో నిరుద్యోగం పెరిగిపోయింది. అధికధరలు సగటు మనిషి నడ్డి విరగ్గొడుతున్నాయి. మతతత్వం వీరంగాలు వేస్తోంది. ఇలాంటి సమయంలో ప్రముఖులు దేశంలోని పరిస్థితుల గురించి మాట్లాడే బదులు యువతకు లెక్చర్లిస్తున్నారు. యువతకు ఉపాధి అవకాశాలు ఉన్నా లేకపోయినా, ఉద్యోగాలు దొరుకుతున్నా, దొరక్కపోయినా, ఎలా పనిచేయాలో లెక్చర్లిస్తున్నారు కొందరు పెద్దలు. ఉపాధి అవకాశాల గురించి ప్రశ్నలు వస్తున్నప్పుడు 2019లో ప్రధాని మోదీ కూడా యువతకు లెక్చరిచ్చారు. పకోడీలు అమ్మడం కూడా ఉపాధి అని చెప్పారు. ఇప్పుడు 2023లో ఇన్ఫోసిస్ కంపెనీ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి యువతకు లెక్చరిచ్చారు. యువత వారానికి 70 గంటలు పనిచేయాలన్నారు.
ఒకసారి దేశంలో పరిస్థితులన్నీ చూస్తే చాలా మంది యువత నెలకు పాతికవేలు సంపాదించడమే కష్టంగా మారింది. ఈ సంవత్సరమే ఏప్రిల్ నెలలో జయతీ ఘోష్, సిపి చంద్రశేఖర్ లు ఒక రిపోర్టు ప్రచురించారు. హిందూ బిజినెస్ లైన్ లో ఈ నివేదిక వచ్చింది. స్వయం ఉపాధి రంగంలో పనిచేస్తున్నవారెవ్వరు తమకు ఇష్టమైన పని చేయడం లేదు. ఎందుకంటే వీరి వద్ద ప్రత్యామ్నయం లేదు. దొరికిన పని చేయక తప్పదు. 2019 ఏప్రిల్ నుంచి జూన్ వరకు స్వయం ఉపాధి రంగంలో దొరికిన సంపాదన జూన్ 2022 నాటికి మరింత తగ్గిపోయింది. ఇప్పుడు కేవలం బతకడానికి చాలినంత సంపాదించుకోవడమే గగనంగా మారింది. ప్రస్తుతం తలసరి ఆదాయాన్ని చూస్తు్న్నాం కాని, ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల రేటును, సంపాదనల రేటును పోల్చి చూస్తే సంపాదనలో పెరుగుదల చాలా తక్కువ కనిపిస్తుందని జయతి ఘోష్ తెలిపారు. కాని ఈ పెద్దలేం చెబుతున్నారంటే, సంపాదన గురించి మాట్లాడకండి, సంపాదన తగ్గిపోతున్న పరిస్థితుల గురించి మాట్లాడకండి. పనిచేయడం గురించి మాత్రమే ఆలోచించండి. సరే పనిచేయడానికి రెడీ కాని పని ఎక్కడుంది? అనే ప్రశ్న కూడా అడక్కండి. అదృష్టం వల్ల పని దొరికిన వాళ్ళు పనిచేస్తూనే ఉండండి. ఈ లెక్చర్లిస్తున్న పెద్దల ఉద్దేశ్యమేమిటంటే, దేశంలో మతతత్వ రాజకీయాలు ఏ స్థాయిలో మానసిక కాలుష్యాన్ని పెంచాయంటే, దేశంలో యువత ఇప్పుడు ఆలోచించే స్థితిలో లేదని బహుశా భావిస్తూ ఉండవచ్చు. కాబట్టి పకోడీలు అమ్ముకోమని చెప్పవచ్చు, వారానికి 70 గంటలు, అంటే వారానికి ఐదు రోజులు పనిచేస్తుంటే రోజుకు 14 గంటలు, వారానికి 6 రోజులు పనిచేస్తుంటే రోజుకు దాదాపు 12 గంటలు, ఒకవేళ సెలవు లేకుండా వారం పొడవునా పనిచేస్తుంటే రోజుకు 10 గంటలు పనిచేయాలని చెప్పారు. అంటే ఇక యువతకు కుటుంబం, భార్యాపిల్లలు, తల్లిదండ్రులు, సామాజిక జీవితం ఇవేవీ ఉండకూడదన్నమాట.
నారాయణమూర్తి గారు చెప్పిన మాటలో ప్రతిపదం గమనించదగింది. “My request is that our youngsters must say, “This is my country, I want to work 70 hours a week” అంటే ’’మన యువత ’’ఇది నా దేశం, నేను వారానికి 70 గంటలు పనిచేయడానికి సిద్ధం‘‘ అని చెప్పాలి. ఇప్పుడు ఈ మాటల్లో ’’ఇది నా దేశం‘‘ అనే పదాలను కాస్త గమనించాలి. యువత 70 గంటలు పనిచేయకపోతే వాళ్ళు ఈ దేశాన్ని తమ దేశంగా భావించేవారు కాదా? ఇది నారాయణ మూర్తి గారికి కూడా వర్తిస్తుందా? వర్తిస్తుంటే ఆయన తన కంపెనీలో ఇంజనీర్లకు జీతాలు మరింత పెంచుతారా? ’ఇది నా దేశం‘ అనే షరతు తన మాటకు ఎందుకాయన పెట్టారు? దేశంలో ఉన్న వ్యక్తి ఎవరైనా ఈ దేశాన్ని తన దేశంగా భావించడం లేదా? అందరు భావస్తున్నారనే నేను అనుకుంటున్నాను. అందరూ అలాగే అనుకుంటున్నారు. ఈ దేశం మనది. మనందరిదీ. దేశం కోసం పనిచేయడం, దేశం కోసం కష్టపడడం అందరూ కోరుతున్నారు. కాని ’’ఇది నా దేశం, నేను 70 గంటలు వారానికి పనిచేస్తాను‘‘ అని చెప్పడంలో లాజిక్ ఏమిటి? ఎవరి కోసం పనిచేయాలి? తన సంపాదన కోసమైతే 8 గంటలు పనిచేసి తన కుటుంబాన్ని చూసుకోవడానికి మిగిలిన సమయం వెచ్చించాలి. అలా కాకుండా ’’ఇది నా దేశం‘‘ అనే షరతు పెట్టి కంపెనీల కోసం రోజుకు 12 నుంచి 14 గంటలు పనిచేయమని చెప్పడం వల్ల దేశానికి కాదు, ఆ కంపెనీకి లాభం కలుగుతుంది. ఇలా ఎవరైనా పనిచేస్తే వారికి జీతం ఎక్కువ ఇస్తారా? చాలా మందికి ఓవర్ టైము పేమెంట్లు ఎలాగూ ఉంటాయి. అవసరమున్న వారు ఓవర్ టైము పనిచేసి కష్టపడుతుంటారు. కాని దీనికి ’’ఇది నా దేశం‘‘ అనే షరతుకు సంబంధమేమిటి? కుటుంబ అవసరాలకు కష్టపడడం వేరు, కంపెనీ అవసరాలకు ఉద్యోగులు కష్టపడడం వేరు. కంపెనీ కోసం కష్టపడడం అంటే దేశం కోసం కష్టపడడంగా భావించాలా?
నారాయణ మూర్తి గారు యువత వారానికి 70 గంటలు పనిచేయాలన్నారు. ఆయన కూడా ’’ఇది నా దేశం‘‘ అని భావిస్తున్నారని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఈ దేశంలో 80 కోట్ల మంది ప్రభుత్వం ఇచ్చే ఉచిత ఆహారధాన్యాలపై ఆధారపడి బతుకుతున్నారు. నిరుపేదలుగా ఉన్నారు. ఉద్యోగాలు ఉన్న యువత 70 గంటలు పనిచేయడం ప్రారంభిస్తే ఈ పరిస్థితి మారిపోతుందా? యువత 70 గంటలు పనిచేయడం లేదు కాబట్టి ఈ పరిస్థితి వచ్చిందా? లేక దేశంలోని ఆర్థిక విధానాల వైఫల్యం వల్ల ఈ పరిస్థితి వచ్చిందా? ఈ లెక్చర్లిచ్చే పెద్దలు ఈ విషయం గురించి ఎందుకు మాట్లాడడం లేదు. దేశంలో బడా కార్పోరేట్ల ఆదాయం భారీగా పెరుగుతూ పోతోంది. సగటు జనం ఆదాయం రోజు రోజుకు అడుగంటిపోతోంది. దీనికి కారణం ఆర్థికవిధానాలు కాదా? పేదలు మరింత పేదలుగా మారుతున్నారు. కార్పోరేట్లు తీసుకున్న రుణాలు ఏ స్థాయిలో ఉన్నాయి. దాదాపు 14.5 లక్షల కోట్ల రూపాయల రుణాలు కార్పోరేట్లు తీసుకున్నారు. ’’ఇది మన దేశం. మనం తీసుకున్న రుణాలు నిజాయితిగా చెల్లించేద్దాం‘‘ అని కార్పోరేట్లకు ఈ పెద్దలు ఎందుకు చెప్పడం లేదు? ఎందుకంటే బ్యాంకు నుంచి రుణం తీసుకున్న పేద, మధ్యతరగతి ప్రజలు రుణం తీర్చకపోతే వారి కట్టుబట్టలు కూడా వేలానికి వస్తాయి, కాని కార్పోరేట్లకు రుణాల రద్దు సదుపాయం ఉండనే ఉంది.
తృణమూల్ కాంగ్రెసు సభ్యుడు జవాహర్ సర్కార్ ఒక ట్వీటులో ఏమన్నారంటే, ఆర్బీఐ డాటా ప్రకారం గత 9 సంవత్సరాల్లో 14.4 లక్షల కోట్ల రూపాయల రుణాలను మోడీ సర్కారు రద్దు చేసింది. గత సర్కారు 10 సంవత్సరాల్లో రద్దు చేసిన రుణం కన్నా 7 రెట్లు ఎక్కువ. మొండి రుణాలు 1.5 శాతం వరకు ఉంటాయన్నది అంతర్జాతీయంగా కూడా ఒప్పుకునే విషయం. కాని మోడీ సర్కారు హయాంలో మొండిరుణాలు 7 నుంచి 11 శాతానికి చేరుకున్నాయని ట్వీటు చేశాడు. ఈ రద్దయిన రుణాలు బడుగు, బలహీన, పేద, మధ్యతరగతి వర్గాల రుణాలు కాదన్నది కూడా గమనించాలి. ఈ వ్యవహారాల గురించి బడా పారిశ్రామికవేత్తలు ఏమంటున్నారు? దేశంలోని యువతకు లెక్చర్లిస్తున్నప్పుడు ఈ విషయాల గురించి కూడా మాట్లాడాలి కదా. ఈ వ్యవహారాలు నిజానికి దేశాభివృద్ధికి సంబంధించినవి. భారీ పారిశ్రామికవేత్తలు సమయబద్దంగా రుణాలు చెల్లిస్తే ఆర్థికవ్యవస్థలో నగదు ప్రవహిస్తుంది. దేశ ఆర్థికవ్యవస్థ మెరుగుపడుతుంది.
దేశంలో పరిస్థితి ఎలా ఉంది. ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ లో సబ్సిడీ రేటుపై కిలో 25 రూపాయలకు ఉల్లిపాయలు అందిస్తోంది. లక్నోలో జనం క్యూలు కట్టి కొన్న ఫోటో ఒక చోట వచ్చింది. టమాటాల కోసం కూడా క్యూలో నిలబడే పరిస్థితి ఉంది. ఇలా క్యూలో నిలబడే పరిస్థితి చాలా సందర్భాల్లో సగటు జనానికి ఉంది. ఈ సగటు జనం నిజానికి క్యూలో గడిపే గంటలు పనిచేస్తున్న గంటల్లో పరిగణన పొందుతాయా? లేదా? ఉల్లిపాయల కోసం, టమాటాల కోసం క్యూలో నిలబడే పరిస్థితి ఉందంటే ప్రజల ఆర్థిక పరిస్థితి అంచనా వేయవచ్చు. ముంబయిలో 2000 రూపాయల నోట్లు మార్చుకోడానికి చాంతాడంత క్యూలో జనం నిలబడి ఉన్నారు. ఢిల్లీ రిజర్వు బ్యాంకు వద్ద కూడా ఇలాంటి క్యూ కనిపించింది.  జనాన్ని క్యూలో నిలబెట్టడం ఈ ప్రభుత్వానికి బాగా వచ్చు.  ఈ క్యూల్లో గంటలు గంటలు గడిపే వారికి ’’ఈ దేశం నాది నేను వారానికి 70 గంటలు పనిచేస్తాను‘‘ అనే లెక్చరిస్తే ఎలా ఉంటుంది? ఆసుపత్రులు మొదలు, రేషను షాపులు, బ్యాంకుల వద్ద క్యూలు దర్శనమిస్తూనే ఉంటాయి. ఈ క్యూల్లో నిలబడేవారు చిన్న ఆదాయ వర్గాల ప్రజలు. కూలీలు, తక్కువ జీతాలకు పనిచేసే ఉద్యోగులు. ఈ క్యూల గురించి ఈ పెద్దలెవరు మాట్లాడరు. ఇలా క్యూల్లో నిలబడడం వల్ల ఎన్ని పనిగంటలు నష్టపోతున్నాం? ఆ నష్టానికి పరిహారం ఎవరు చెల్లిస్తారు? ఈ విషయాల గురించి ఈ పెద్దలు లెక్చర్లివ్వరు.  ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గ్యాస్ సిలిండర్ ధర 2014కు ముందు ఎంత ఉండేదో, ఇప్పుడు ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ పరిస్థితులేవైనా మీడియాలో కనిపిస్తున్నాయా?
హైదరాబాద్, ముంబయి, ఢిల్లీ ఇలా నగరాల్లో పనిచేసేవారు తమ పని ప్రదేశాలకు వెళ్ళి రావడానికి రోజుకు 2 నుంచి 3 గంటల వరకు ప్రయాణంలో గడిపే పరిస్థితి కూడా ఉంది. ఈ సమయం కూడా పనిచేస్తున్నట్లు లెక్కలోకి వస్తుందా? ముంబయి లాంటి నగరాల్లో పొద్దున్నే 4 గంటలకు లేచి పనికి పరుగెత్తవలసి ఉంటుంది. ఆదాయం అంతంత మాత్రమే. తిరిగి రాత్రికే ఇంటికి చేరుకుంటాడు. ఇలాంటి వారు రోజుకు ఎన్ని గంటలు పనిచేస్తున్నట్లు లెక్కించాలి? కుటుంబాన్ని పోషంచడానికి ఒక పని కాదు, రెండేసి, మూడేసి పనులు చేసేవారున్నారు. వారానికి 70 గంటలు కాదు, అంతకన్నా ఎక్కువగా పనిచేస్తే కాని కుటుంబం గడవని వారున్నారు. అలాంటి వారికి మీరు వారానికి 70 గంటల పని లెక్చరు ఇవ్వడం కుదరదు.
భారత ప్రభుత్వం 2018లో ఎన్నికలకు ముందు కార్పోరేట్ టాక్సు తగ్గించేసింది. అప్పుడు ఈ బడా కార్పోరేటు సంస్థల అధిపతులు సాధారణ ప్రజలకు కూడా టాక్సుల భారం తగ్గించాలని ఎవ్వరు చెప్పలేదు. 2015లో నారాయణమూర్తి గారు సంపన్నులు అధిక టాక్సులు చెల్లిస్తే దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగవుతుందని చెప్పారు. అధికాదాయం ఉన్న వారికి టాక్సులు పెంచాలని కూడా చెప్పారు. కాని 2018లో కార్పోరేట్ టాక్సు తగ్గించినప్పుడు దాన్ని ఆయన వ్యతిరేకించారా? మనీ కంట్రోల్ రిసెర్చ్ లో తెలిసిందేమిటంటే, 2012లో కొత్తగా ఉద్యోగంలోకి తీసుకున్న వారికి ఒక సాఫ్ట్ వేర్ దిగ్గజ కంపెనీలో 3.45 లక్షల రూపాయలు ఎటా చెల్లించేది. అంటే నెలకు 23 వేల రూపాయల కన్నా తక్కువ. అదే సంవత్సరం ఆ కంపెనీ సియీవో జీతం ఏటా 80 లక్షల రూపాయలు. 2022లో ఇదే కంపెనీలో ఫ్రెషర్ జీతం ఏటా 3.6 లక్షల రూపాయలయ్యింది. అంటె నెలకు 30 వేలు అయ్యింది. అదే కంపెనీ సియీవో జీతం దాదాపు 80 కోట్లు. అంటే ఈ కంపెనీల్లో సీయీవోల జీతాలు 800 శాతం కన్నా ఎక్కువ పెరిగితే, కొత్తగా ఉద్యోగాల్లోకి తీసుకుంటున్న వారి జీతం కేవలం 45 శాతం పెరిగింది.
ఇప్పుడు చాలా మంది యువకులు హోం డెలివరీ పనులు చేస్తూ చూస్తుంటాం. లేదా సేల్స్ మ్యానులుగా ఇంటింటికి తిరిగి కష్టపడడం చూస్తుంటాం. వాళ్ళు రోజు చాలా కష్టపడుతుంటారు. పొద్దంతా పని చేస్తుంటారు. అయినా వారి ఆదాయం చాలా తక్కువ. వాళ్ళు వారానికి 70 గంటల కన్నా ఎక్కువ పనిచేస్తుంటారు. సాప్ట్ వేర్ ఇంజనీర్లు, పెద్ద పెద్ద కంపెనీల సీయీవోల మాదిరిగానే ఈ చిన్న చితకా పనులు చేసుకునే వారు కూడా ఈ దేశం నాది అనుకునే పనిచేస్తున్నారు. కాని వారికి గౌరవప్రదమైన జీవితం గడిపే ఆదాయం లభిస్తుందా? మాల్ లో పనిచేసే సేల్స్ గర్ల్, సేల్స్ బాయ్ జీతమెంతో అడిగి చూడండి. రోజుకు ఎన్ని గంటలు నిలబడి పనిచేస్తారో అడిగి చూడండి. సగటు జీతం నెలకు 20 వేలు ఉండడం కూడా కష్టమే. చిన్న చిన్న కార
ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఒక చర్చ ఉంది. మనిషి పనిచేసే గంటలు తగ్గాలని, పని తర్వాత తన కుటుంబంతో గడపడానికి అవసరమైన సమయం లభించాలనే చర్చ చాలా దేశాల్లో మనం చూస్తాం. ఫ్రాన్సు ప్రభుత్వం పెన్షన్ చెల్లించడానికి ఉద్యోగులు ఒకట్రెండు సంవత్సరాలు ఎక్కువ పనిచేయాలంటే అక్కడి వారు ఒప్పుకోలేదు. భారీ ప్రదర్శనలు జరిగాయి. పని, కుటుంబం ఈ రెంటి మధ్య సమతుల్యం కోసం చాలా మంది మాట్లాడుతున్న కాలం ఇది. కాని మన దేశంలో ఈ చర్చ ఎప్పుడైనా విన్నామా? భారతదేశంలో కుటుంబ పటిష్టంగా ఉందని చెబుతుంటాం? సంస్కారాల గురించి మాట్లాడుతుంటాం, కాని కుటుంబానికి సమయం కేటాయించలేక పొద్దంతా కార్ఖానాల్లో, పనిప్రదేశాల్లో అల్పాదాయం కోసం పనిచేసి రాత్రి కేవలం కాసేపు నడుం వాల్చడానికి మాత్రమే ఇంటికి చేరుకునే అనేకమంది తమ కుటుంబాలతో సమయం గడపగలుగుతున్నారా? వారానికి 70 గంటలు పనిచేయాలని చెప్పే పెద్దలు, యువత తన కుటుంబానికి ఎలా సమయం కేటాయించగలదో ఆలోచిస్తు్న్నారా?
ఫ్రాన్సులో చట్టం ప్రకారం ఆఫీసు లో ఉన్నప్పుడే ఉద్యోగితో మాట్లాడాలి. ఆఫీసు నుంచి పని ముగించి బయటకు వెళ్ళిన తర్వాత ఆఫీసు పని గురించి ఉద్యోగిని ఫోను చేసి మాట్లాడడం కుదరదు. ఎందుకంటే అతను తన కుటుంబంతో గడిపే సమయం అది. పోర్చుగల్ లో కూడా ఇదే పరిస్థితి. ఆఫీసు సమయం అయిపోయిన తర్వాత ఉద్యోగికి ఫోను చేయరాదు.  ముసలి తల్లిదండ్రులున్న వారు ఇంటి నుంచే పనిచేసే అవకాశాలు కల్పిస్తారు. పోర్చుగల్ లో ఉద్యోగి ఇంట బిడ్డ పుడితే ఆ బిడ్డ ఎనిమిది సంవత్సరాల వయసు వచ్చే వరకు అతను లేదా ఆమె ఇంటి నుంచే పనిచేయవచ్చు. ప్రపంచంలో చాలా దేశాలు ఈ దిశగా ఆలోచిస్తు్న్నాయి. కాని కుటుంబ విలువల గురించి మాట్లాడే మన దేశంలో కుటుంబం తర్వాత ముందు మీరు వారానికి 70 గంటలు ఎద్దుల్లా పనిచేయండి లెక్చర్లు వినిపిస్తున్నాయి. కుటుంబంతో గడపకుండా అత్యధిక సమయం పనిలోనే గడిపేవారు డిప్రెషన్ కు గురవుతారనే నివేదికలు కూడా ఉన్నాయి. రెక్కడితే కాని డొక్కాడని కుటుంబాలు దేశంలో ఎన్నో ఉన్నాయి. ఒక నివేదిక ప్రకారం భారతీయులు ప్రపంచంలో అత్యధికంగా పనిచేస్తుంటారు. అతి తక్కువ వేతనాలకు పనిచేస్తారు. దేశంలో పేదరికం చాలా ఉంది.
దేశంలో కాంట్రాక్ట్ ఉద్యోగాలిప్పుడు ఎక్కువయ్యాయి. పర్మనెంట్ ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి.
రెండవ ప్రపంచయుద్ధం తర్వాత జర్మన్ నాయకులు అక్కడి పారిశ్రామికవేత్తలతో కూర్చుని దేశాన్ని ఎలా పునర్నిర్మాంచాలో అని ఆలోచించారంటే, అందరూ ఎక్కువ గంటలు పనిచేయాలని నిర్ణయించారట. ఈ మాటలు విన్నప్పుడు నిజమే కదా అనిపిస్తుంది. కాని ఇది నిజం కాదు. జర్మనీలో 1951 తర్వాతి నుంచి పనిగంటలు తగ్గిపోతూ వచ్చాయి. జపానులో కూడా పనిగంటల విషయంలో పదేళ్ళ కాలంలో చాలా హెచ్చుతగ్గులు కనిపిస్తాయి. నిజానికి పనిగంటలకు ఆర్థిక ప్రగతికి సంబంధం లేదని అంటారు. ఇప్పుడు జర్మనీలో వారానకి 28 గంటలు పనిచేయడాన్ని ఆమోదించారు. పైగా ఆదాయం 4.3 శాతం పెంచారు. ఇది జర్మనీలోని బడా పారిశ్రామికవేత్తలు, కార్మికులకు మధ్య కుదిరిన ఒప్పందం. నిజానికి 1920 నుంచే యూరపులో వారానికి 48 గంటలు పనిచేయడం ఉంది.
ప్రపంచంలో ఒకవైపు పనిగంటలను తగ్గించి ఎక్కువ మందికి పని అవకాశాలు కల్పించడం, పని, కుటుంబ జీవితాల మధ్య సమతుల్యం సాధించడం గురించి చర్చలు జరుగుతుంటే, ఇక్కడి పెద్దలు వారానికి 70 గంటలు పనిచేయాలంటున్నారు. చేద్దామన్నా చాలా మందికి ఇక్కడ పనిలేదు. అధిక గంటలు పనిచేయడం వల్ల ఉత్పాదకత పెరిగినట్లు ఎక్కడా నిదర్శనాలు లేవు. ఏది ఏమైనా భారతదేశంలో చాలా మంది అత్యధిక గంటలు పనిచేస్తున్నారని తెలుస్తోంది. పనిచేసిన జీతాలు దొరకని వారు చాలా మంది ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యువత 70 గంటలు వారానికి పనిచేయాలని చెప్పడం విచిత్రం.
నారాయణ మూర్తి ఒక పెద్ద కార్పోరేటు కంపెనీ వ్యవస్థాపకుడిగా చాలా సక్సెస్ ఫూల్. ఆయన జీవితం చాలా మందికి ప్రేరణాత్మకం. ఆయనలా సక్సెస్ ఫుల్ కావాలనుకునే వారు చాలా మంది ఉంటారు. నారాయణ మూర్తి సాధించిన విజయాలు చిన్నవి కావు. ఆయనలా సక్సెస్ సాధించాలని చాలా మంది ఆయన్ను ఆదర్శంగా తీసుకోవడంలో తప్పు లేదు.
అమెరికాలో ప్రతి కార్పోరేటు సగటున తమ ఆదాయంలో 9 శాతం కన్నా ఎక్కువ చారిటీ కోసం  ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. మనదేశంలో సగటున కార్పోరేట్ తమ ఆదాయంలో కేవలం 4 శాతం మాత్రమే చారిటీ కోసం ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. చారిటీ కోసం ఖర్చు చేయడానికి ఇష్టపడరు కాబట్టే సియస్ఆర్ చట్టం తీసుకువచ్చి కనీసం 2 శాతమైనా సమాజం కోసం ఖర్చు చేయాలని చెప్పడం జరిగింది.
మన సమాజంలో ఇప్పుడు అందరూ సక్సెస్ గురించే మాట్లాడుతున్నారు. పిల్లలు సక్సెస్ అవ్వాలని తల్లిదండ్రులు కోరుతుంటారు. యువత సక్సెస్ సాధించాలని కోరుతుంది. కాని మంచివారిగా మారాలని కోరేవారెంత మంది. సక్సెస్ కోసం యంత్రాల్లా పనిచేసే మనుషులా సమాజానికి కావలసింది. దేశానికి కావలసింది. యువతకు చేయడానికి పని, పనికి తగిన వేతనం, తగిన పనిగంటలు, పని, వ్యక్తిగత, కుటుంబ జీవితాల్లో సమతుల్యం ఉన్న సమాజం కావాలా? లేక పని… పని… పని తప్ప మరేమీ ఆలోచించలేని పరిస్థితులు కావాలా? ప్రపంచంలో ఏ దేశంలో అయినా వారానికి 70 గంటలు పనిచేయడం జరుగుతుందా? కుటుంబంలో సంపాదించే వ్యక్తి పొద్దుట పనికి వెళ్ళి రాత్రి తిరిగి వచ్చి అలసి నిద్రపోయే కుటుంబాల్లో పిల్లల గురించి ఆలోచించండి.

 – వాహెద్