November 21, 2024

ముహమ్మద్‌ ప్రవక్తపై కవి సమ్మేళనంలో ముస్లిం కవులు, కవయిత్రుల కన్నా హిందువులుగా జన్మించిన తెలుగు కవులు అధిక సంఖ్యలో పాల్గొనటం ఈ సభకున్న ఒక విశేషమని నాళేశ్వరం శంకరం అన్నారు. మతోన్మాదం వెయ్యికాళ్ళ జెర్రిలాగా విస్తరిస్తున్న సందర్భంలో సమైక్య భావనకు ముగ్గు పోస్తున్న ఇలాంటి సభల అవసరం ఎంతో ఉందన్నారు. ముహమ్మద్‌ ప్రవక్త(స) జీవితం ప్రభోధాత్మకమైందని, తన ఇంటి దీపానికి తగినంత చమురు కూడా లేక పోయినా ‘సమస్త ప్రజల హృదయాలలో ప్రేమ అనే చమురుతో జీవితాంతం ప్రేమజ్యోతిని వెలిగించిన వారని ప్రముఖ కవి నాళేశ్వరం శంకరం చెప్పారు.
తెలుగు యూనివర్సిటీ పూర్వ రిజిస్టార్‌ మాట్లాడుతూ మిలాద్‌ ఉన్నబి సందర్భంగా విశ్వ కారుణ్యమూర్తి ముహమ్మద్‌ సల్లల్లాహు అలైహి వ సల్లం అంశంపై నిర్వహించిన కవి సమ్మేళనం మత సామరస్యానికి ప్రతీక అన్నారు.
మహమ్మద్‌ ప్రవక్త ఎంతో దయామయులని, ఆయన అనాగరికు లయిన అరబ్బులను క్రమశిక్షణ నేర్పారని, పశువుల కాపరులను గవర్నర్లుగా చేశారని ఆయన సత్యసంధత వల్ల, నిజాయితీ వల్ల ప్రజలు ఎంతో ప్రభావితులై ఆయన ప్రతి మాటను నమ్మి విశ్వాస వంతులయ్యారని అన్నారు.
కళా రత్న బిక్కికృష్ణ మాట్లాడుతూ విశ్వకారుణ్యమూర్తి ముహమ్మద్‌ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మిలాద్‌ ఉన్న బి సందర్భంగా నిర్వహిస్తున్న ఈ కవి సమ్మేళనానికి రెండు రాష్ట్రాల నుండి 100 మంది కవులు, కవయిత్రులను ఆహ్వానించి కవి సమ్మేళనం నిర్వహించడం మామూలు విషయం కాదు. అందుకు అబ్దుల్‌ రషీద్‌ గారిని అభినందిస్తున్నాను అన్నారు. అబ్దుల్‌ రషీద్‌ గారు వాట్సాప్‌ ద్వారా ఇస్లాం గురించి రాస్తున్న విషయాలు చదివినప్పుడు దైవప్రవక్త ముహమ్మద్‌ సల్లల్లాహు అలైహి వ సల్లం ఎంత దయా మయులో కరుణామయులో తెలిసిందన్నారు.
ఈ కవి సమ్మేళనంలో నిజామాబాద్‌ కు చెందిన కవి రచయిత తొగర్ల సురేష్‌ గారు రచించిన ఒక కొమ్మకు పూసిన… పుస్తకాన్ని కళా రత్న బిక్కికృష్ణ గారు ఆవిష్కరిస్తూ ఈ ధార్మిక సభలో సురేష్‌ గారు తన పుస్తకాన్ని ఆవిష్కరింప చేయడం మతసామరస్యానికి మచ్చుతునక అన్నారు.
సినీ గీత రచయిత డా. సాధనాల వెంకటస్వామి నాయుడు మాట్లా డుతూ, ఇంత మంచి కవి సమ్మేళనానికి నన్ను ఆహ్వానించినందుకు అబ్దుల్‌ రషీద్‌ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. ఉదయం 10 నుండి సాయంత్రం 6:30 వరకు నిరంతరాయంగా కొనసాగిన ఈ కవి సమ్మేళనం మరువలేని మధురానుభూతి అని చెప్పారు.
విశిష్ట అతిథిగా పాల్గొన్న ఆంగ్లానువాదకులు మంతెన దామోదరాచారి ఒక సెషన్‌కు అధ్యక్షత వహించారు. విశ్వకారుణ్య మూర్తి ముహమ్మద్‌ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితం అందరికీ ఆదర్శప్రాయమని ఆయనను అనుసరించే వారు ధన్యులని తమ ప్రసంగంలో పేర్కొన్నారు.
కవయిత్రి, గేయ రచయిత్రి గిడుగు కాంతి కృష్ణ, మేటివేషనల్‌ స్పీకర్‌ డాక్టర్‌ ఆలపాటి, కవి, జర్నలిస్ట్‌ మోటూరి నారాయణరావు తదితరులు ప్రసంగించారు.
ఇదార అదబ్‌ ఇస్లామీ హింద్‌ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. అధ్యక్షులు జనాబ్‌ షుఅయ్‌ బ్‌ ఉల్‌ హఖ్‌ తాలిబ్‌ పర్యవేక్షకు లుగా పాల్గొన్న ఈ కవి సమ్మేళనంలో ఇదార అదబ్‌ ఇస్లామీ హింద్‌ జాతీయ ఉపాధ్యక్షులు సౌత్‌ ఇండియా, ఖాజా మసీహ్ ఉద్దీన్‌ అబూ నబీల్‌ సమన్వయకర్తగా వ్యవహరించారు. జమాతె ఇస్లామీ హింద్‌ తెలంగాణ రాష్ట్ర సలహా మండలి సభ్యులు జనాబ్‌ సాదిక్‌ అహ్మద్‌ విశ్వ కారుణ్యమూర్తి ముహమ్మద్‌ సల్లల్లాహు సల్లం గారి జీవిత చరిత్రపై ప్రసంగించి సభికులను అలరించారు. ఈ కవి సమ్మేళనానికి కన్వీనర్‌ గా ముహమ్మద్‌ అబ్దుల్‌ రషీద్‌ వ్యవహరించారు.