December 6, 2024

పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధంలో ఇస్రాయీల్‌ ఫేకు వార్తల ఫ్యాక్టరీ రాత్రింబవళ్ళు పనిచేస్తోంది. ఒక ఫేక్‌ వీడియోలో ఆసుపత్రిలో ట్యూబులతో ఉన్న ఒక వ్యక్తిని చూపించారు. ఆ వ్యక్తి ఒక యాక్టరని, పాలస్తీనా బాధితుడిగా నటిస్తున్నాడని ప్రచారం మొదలు పెట్టారు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు కూడా పాలస్తీనాలో మరణాల సంఖ్య గురించి వస్తున్న వార్తలను తాను నమ్మలేనంటూ తన వైఖరి బయటపెట్టుకున్నాడన్నది కూడా గుర్తుంచుకోవాలి.

ఏది ఏమైనా ఆసుపత్రిలో ట్యూబులు తగిలించి బెడ్డుపై ఉన్న వ్యక్తి నటుడంటూ ప్రచారం మొదలు పెట్టారు. ఇస్రాయీల్‌కు చెందిన అధికారిక ట్విట్టరు ఖాతా ఈ వీడియోను ప్రచారంలో పెట్టింది. ఈ వీడియోలో ఏముందంటే, మొదటి క్లిప్పులో హమాస్‌ దాడికి సంతోషిస్తూ గాజా వీధుల్లో నడిచి వెళుతున్న ఒక వ్యక్తిని చూపించారు. ఆ తర్వాతి ట్వీటులో ఆసుపత్రిలో ఉన్న వ్యక్తిని చూపిస్తూ అతను యాక్టింగ్‌ చేస్తున్నాడని ప్రచారం చేశారు. ఆల్ట్‌ న్యూస్‌ నిజనిర్ధారణలో తెలిసిందేమిటంటే, మొదటి క్లిప్పులో ఉన్న వ్యక్తి పేరు సాలెహ్ అల్‌ జఫారవీ. ఇన్‌స్టాగ్రాంలో అతను గాజాకు సంబంధించిన అనేక వీడియోలను షేరు చేస్తుంటాడు. అతనికి ఒక యు ట్యూబ్‌ చానల్‌ కూడా ఉంది. అందులో తన మ్యూజిక్‌ వీడియోలు పెడుతుంటాడు. అతను గాజాలో పాడుతూ వెళుతున్న వీడియో అగష్టు 19 నాటిదిగా తెలిసింది. ఇక రెండవ వీడియో విషయానికి వస్తే అది కూడా జులై 24 నాటిది. వెస్ట్‌ బ్యాంకులోని నూర్‌ షామ్స్‌ శరణార్థి శిబిరంపై ఇస్రాయీల్‌ అప్పుడు చేసిన దాడిలో ముహమ్మద్‌ జెందిక్‌ అనే 16 సంవత్సరాల కుర్రాడు కాలు పోగొట్టుకున్నాడు. అతడిని ఆసుపత్రిలో చేర్చారు. ఈ రెండు వీడియోలు తీసిన కాలం వేరు, వీడియోల్లో ఉన్న వ్యక్తులు వేర్వేరు. పైగా ఆసుపత్రిలో గాయాలతో చికిత్స పొందుతున్న పాలస్తీనా యువకుడు వెస్ట్‌ బ్యాంకులో ఇస్రాయీల్‌ దాడుల్లో కాలు పోగొట్టుకున్న వాడు. ఇలా ఇస్రాయీల్‌ చేసిన దాడుల్లో మరణించిన వారెంతమందో. ఈ సమస్య హమాస్‌ దాడి తర్వాత ప్రారంభం కాలేదు. కాని ఈ ఫేకు వార్తలతో తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చాలా హుషారుగా చాలా మంది చేస్తున్నారు. ఇస్రాయీల్‌ సాధారణ ప్రజలపై, ఆసుపత్రులపై దాడులు చేస్తూ పసిపిల్లలను చంపుతున్న ఇస్రాయీల్‌ పట్ల ప్రజాభిప్రాయాన్ని మలచడానికి రకరకాల ఫేకు వార్తలు ప్రచారంలో పెడుతున్నారు.
అలాంటి మరో వార్త ఏమిటంటే, తెల్లటి వస్త్రాల్లో చుట్టబడి ఉన్న ఒక వ్యక్తి ఫోటో వైరల్‌ చేశారు. అంటే శవంలా కనిపిస్తున్న వ్యక్తి ఫోటో. కాని ఆ వ్యక్తి తన మొబైల్‌ వాడుతున్నట్లు ఫోటోలో కనిపిస్తుంది. పాలస్తీనీయులు చాలా మంది చచ్చిపోయినట్లు అబద్దపు మరణ వార్తలు ప్రచారం చేస్తున్నారని, నిజానికి మరణించ లేదని బతికే ఉన్నారని ప్రచారం మొదలుపెట్టారు. బూమ్‌ వార్త సంస్థ నిజనిర్ధారణలో తెలిసిందేమిటంటే, ఈ ఫోటో థాయిలాండ్‌లో 2022లో జరిగిన ఒక హలోవీన్‌ పార్టీకి సంబంధించిన ఫోటో. ఇస్రాయీల్‌, హమాస్‌ మధ్య యుద్ధానికి ఈ ఫోటోకు సంబంధమే లేదు. గాజా ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకారం 7 వేల మంది మరణించారు. కాని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ఈ మాటలు నమ్మశక్యంగా లేవు. ఇవి నమ్మశక్యం కాదని చెప్పడానికి ఇలాంటి లేకి, వెకిలి వైరల్‌ వార్తలు ప్రచారం చేసి ఇస్రాయీల్‌ మాటలను, అమెరికా మాటలను నమ్మించ డానికి ప్రయత్నిస్తున్నారు.
ఇలాంటిదే మరో వార్త వచ్చింది.

సిరియాకు సంబంధించిన మూడు ఫోటోలు ప్రచారంలో పెట్టారు. ఈ మూడు ఫోటోలు వేర్వేరు ఫోటోలు. ప్రతి ఫోటోలో ఒక చిన్నపిల్లను కాపాడి ఒక వ్యక్తి ఎత్తుకుని వెళుతున్నట్లు ఉంది. ఒకే అమ్మాయిని మూడు సార్లు ముగ్గురు ఎలా కాపాడారో చూడండంటూ వెకిలి హాస్యంతో కూడిన వైరల్‌ వార్త ప్రచారంలో పెట్టారు. ఇస్రాయీల్‌కు మద్దతు పలుకుతున్న ఖాతాలు ఈ వెకిలి ప్రచారం చేశాయి. పాలస్తీనీ యులు తమ పిల్లలు గాయపడ్డారని చెప్పడానికి ఫేక్‌ ఫోటోలు ప్రచారం చేస్తున్నారంటూ ఈ వైరల్‌ ప్రచారం మొదలు పెట్టారు. ఆ మూడు చిత్రాల్లో ఉన్న అమ్మాయి ధరించిన దుస్తులు ఒకే మాదిరి ఉన్నాయి. చింపిరి జుత్తు ఉంది. ముఖం దుమ్ము కొట్టుకుని ఉంది. బూమ్‌ నిజనిర్ధారణలో తెలిసిందేమిటంటే ఈ ఫోటో 2016 సిరియాలోని అలెప్పోలో జరిగిన యుద్ధం నాటి ఫోటోలు. అలెప్పోలో తిరుగుబాటు దారులు ఆక్రమించుకున్న ప్రాంతంలో ఒక చోట జరిగిన బాంబుదాడిలో 16 మంది మరణిం చారు. ఆ ఒకే సంఘటనకు సంబంధించినవి ఆ మూడు ఫోటోలు. ఆ అమ్మాయిని శిధిలాల్లోంచి కాపాడి సహాయక బృందం తీసుకువచ్చి ఒకరి తర్వాత ఒకరికి అప్పగిస్తూ సురక్షిత ప్రాంతానికి చేర్చిన ఫోటోలు అవి. పశ్చిమాసియా యుద్ధంలో ఇక్కడి మతతత్వ శక్తులు విద్వేష చిచ్చుపెట్టి చలి కాగడానికి, ఎన్నికల ప్రయోజనాలు పొందడానికి ప్రయత్నిస్తున్నాయి.
కేరళలో పాలస్తీనాకు మద్దతుగా ఒక ర్యాలీ జరిగింది. దీనికి సంబంధించి ఒక వీడియో వైరల్‌ అయ్యింది. ఈ ర్యాలీలో నిరసన కారులు చేతపట్టిన జెండా ఇటలీ జాతీయ జెండా అంటూ ప్రచారం చేశారు. భారతీయ జనతా యువ మోర్చాకు చెందిన తాజిందర్‌ పాల్‌ సింగ్‌ బగ్గా ఈ క్లిప్పును ట్వీటు చేశాడు. గతంలో కూడా బీజేపీకి చెందిన ఈ బగ్గా అనేకసార్లు ఫేక్‌ వార్తలు ప్రచారంలో పెట్టిన ఘనుడు. దేశంలో పెరిగిపోతున్న ఇస్లామిక్‌ రేడికలిజం అంటూ బీజేపీ ప్రతినిధి అనిల్‌ కే ఆంటోనీ కూడా దీన్ని రీట్వీటు చేశాడు. కాని ఈ ప్రచారం చేసినవాళ్ళు ఆ జెండా లపై వెల్ఫేర్‌ పార్టీ, కేరళ అని ఉన్న పదాలు చదవలేదు. చదివినా చదవనట్టు నటించారు. మతం చిచ్చుపెట్టడానికి వాడుకోవాలను కుంటున్నప్పుడు ఇలాంటివి కనిపించవు. ఆల్ట్‌ న్యూస్‌ నిజ నిర్ధారణలో ఈ జెండాలు వెల్ఫేర్‌ పార్టీ జెండాలని తెలిసింది. ఇక్కడ మతతత్వ శక్తులు ఫేకు వార్తలను ప్రచారంలో పెట్టడం ఎప్పటి మాదిరిగానే కొనసాగుతూనే ఉంది. హిందుమతం గురించి అనుచితంగా మాట్లాడుతున్న ఒక వ్యక్తి వీడియో ఒకటి వైరల్‌ అయ్యింది. తనను తాను ముస్లింగా ఆ వ్యక్తి చెప్పుకున్నాడు. తలపాగా చుట్టుకున్న ఆ వ్యక్తి తనను తాను జావేద్‌ హుస్సేన్‌ అని చెప్పుకున్నాడు. హిందూమతం గురించి, బ్రాహ్మల గురించి వీడు అవాకులు చెవాకులు వాగుతుంటే పక్కనుంచి మరొకరి గొంతు వినిపిస్తుంది. ఈ గొంతు వ్యక్తి కనిపించడు. కాని ఈ అవాకులు చెవాకులను వ్యతిరేకిస్తూ తాను హిందువు కాబట్టి చాలా శాంతిగా వింటున్నానని అంటున్నాడు. బూమ్‌ వార్తసంస్థ నిజనిర్ధారణలో ఇది హరిద్వార్‌కు చెందిన వీడియోగా తెలిసింది. హరిద్వార్‌ పోలీసు అధికారితో మాట్లాడితే ఆయన అసలు విషయం చెప్పాడు. ఆ వ్యక్తి ముస్లిం కాదు. ఈ అవాకులు చెవాకులు పేలిన వ్యక్తి కూడా తర్వాత తాను తాగిన మత్తులో ముస్లింగా చెప్పుకున్నానని, తన పేరు దిలీప్‌ బాఘేల్‌ అని ఒప్పుకున్నాడు. కాని సుదర్శన్‌ న్యూస్‌ జర్నలిస్టు సాగర్‌ కుమార్‌ అనేవాడు మాత్రం ‘‘నా ఉత్తరాఖండ్‌ను కాపాడండి’’ అంటూ మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా ఈ క్లిప్పును ప్రచారంలో పెట్టాడు. ఈ వీడియో వచ్చిన తర్వాత పోలీసులు దీనిపై విచారణ చేసి నిజాలు బయట పెట్టారు. కొందరు ఆ వ్యక్తిని తాగించి హిందూ మతంపై అవాకులు చెవాకులు పేలేలా ప్రోత్సహించారని, ఆ తర్వాత వీడియో తీసి ప్రచారంలో పెట్టారని, కేసు విచారిస్తు న్నామని తెలియజేయడమే కాదు, ఈ విషయాన్ని ట్వీటు చేసి ప్రజలకు తెలియజేశారు.
ఇంకో ఫేకు వార్తలో బస్సుస్టాపు గురించి జరిగిన గొడవకు మతం రంగు పులిమి ప్రచారంలో పెట్టారు. ఇది కేరళలోని కసారాగోడ్‌లో జరిగిన సంఘటన. కొందరు విద్యార్థినులు ఒక మహిళతో ఒక ప్రయివేటు బస్సులో ఘర్షణ పడుతున్న వీడియో వైరల్‌ అయ్యింది. ఆ విద్యార్థినులు బస్సును తమ కాలేజీ వద్ద ఆపాలని చెబుతున్నారు. ఆ మహిళ దానికి ఒప్పుకోవడం లేదు. కాని ఈ వీడియోను ప్రచారంలో పెట్టి బురఖా ధరించిన ముస్లిం మహిళలు బురఖా లేని హిందూ మహిళను అందరిలో అవమా నిస్తున్నారని ప్రచారం చేశారు. బూమ్‌ నిజనిర్ధారణ కోసం సంబంధిత పోలీసులను సంప్రదించింది. పోలీసులు ఈ వైరల్‌ ప్రచారాన్ని అబద్దంగా చెప్పారు. కొందరు విద్యార్థినులు తమ కాలేజీ వద్ద బస్సు ఆపాలని కోరారని, ఒక మహిళ అభ్యంతరం చెప్పిందని దానికి సంబంధించిన ఘర్షణగా చెప్పారు. ఆ విద్యార్థినులందరూ బురఖాలు ధరించిన ముస్లిం అమ్మాయిలు. ఆ మహిళ చీర కట్టుకున్న మహిళ. బురఖా ధరించిన అమ్మాయలకు సంబంధించిన వీడియో కాబట్టి మతతత్వ శక్తులకు ఫేకు వార్తలు ప్రచారం చేసే అవకాశం దొరికింది. ఇలాంటి ఫేకు వార్తలను నమ్మితే ఎలాంటి విద్వేష భారతం భవిష్యత్తులో మనకు కనబడుతుందో ప్రజలంతా ఆలోచించాలి.