November 27, 2024

Caucasian businessman showing clock. Time Management

మనం ఎన్నోసార్లు కొంతమందిని చూసి ఆశ్చర్యానికి గురవుతూ ఉంటాము. ప్రపంచంలోని కొంతమంది ప్రజలు తక్కువ సమయంలో ఎన్నో ఘనకార్యాలు చేసి ఉంటారు. వారు ఏ రంగానికి చెందిన వారైనా కావచ్చు. విద్యార్థులు కావచ్చు, ఉపాధ్యాయులూ కావచ్చు. యజమానులు కావచ్చు, కూలివారు కావచ్చు, రాజకీయ నాయకులూ కావచ్చు. లేదా వ్యాపారులూ కావచ్చు. సామాజిక కార్యకర్తలూ కావచ్చు లేదా కంపెనీల స్థాపకులు కావచ్చు. వీరు తమ జీవితంలోని ప్రారంభ కాలంలోనే లేదా పని ప్రారంభించిన అతి కొద్ది సమయంలోనే తన లక్ష్యం కంటే కూడా ఎన్నో రెట్లు అధికంగా ముందుకు దూసుకుపోతారు. ఇలాంటి వారికి వాస్తవంగా పుట్టుకతోనే కొన్ని ప్రత్యేక నైపుణ్యాలను కలిగి ఉంటారు. ఇవి వారి ప్రభువు తరఫు నుంచి వారికి లభించి ఉంటాయి. కాని వారికి నైపుణ్యాలు లభించి ఉండటం మాత్రమే వారి లక్ష్యసాధనలో ముందుకు దూసుకుపోవటానికి వారికి సరిపోవు. దానితోపాటు సమయాన్ని సరైన రీతిలో వినియోగించు కోవటం, ప్రణాళికను సిద్ధం చేసుకుని దాని ప్రకారం పూర్తిగా పని చెయ్యటం తప్పనిసరి అవుతుంది. దానికారణంగానే అది వారికి సాధ్యమవుతుంది.

వారికి కూడా అందరితోపాటు ప్రతి దినానికి ఇరవై నాలుగు గంటలు మాత్రమే లభిస్తాయి. ఒకవేళ మనం కూడా ఆ ఇరవై నాలుగు గంటలను ప్రణాళికాబద్ధంగా వినియోగించినట్లయితే మనం కూడా ఏదో ఒక పెద్ద కార్యాన్ని తక్కువ సమయంలోనే చెయ్యగలుగుతాం. మనం ఏ కార్యానికైతే సమయాన్ని నిర్ణయి స్తామో ఆ సమయం ప్రకారమే గనక మనం ఆ కార్యాన్ని నెరవేర్చి నట్లయితే అప్పుడే దాన్ని మనం సరైన రీతిలో పూర్తి చేశామన్న మాట. అప్పుడే మనం సాఫల్యాన్ని పొందుతామన్నది సత్య విషయం. ప్రణాళికను సిద్ధం చేసుకున్న తరువాత దానిని పూర్తిగా పాటించకపోవటం కారణంగా మనిషి అసాఫల్యానికి గురవుతాడు.
ఒక విద్యార్థికి అతను తన చదువును సరైన రీతిలో పూర్తి చెయ్యటానికి ఒక ప్రణాళిక అనేది తప్పనిసరి అవుతుంది. ఒకవేళ అతను ఒక ప్రణాళిక తయారు చేసుకోకపోయినట్లయితే అతను సమయాన్ని సరైన రీతిలో వినియోగించుకోలేడు. అదేవిధంగా ఒక ఉద్యోగి కూడా తన వ్యక్తిగత కార్యాలను, తన కార్యాలయ కార్యాలను రెండిరటినీ ఒక ప్రణాళికాబద్ధంగా చెయ్యకపోయి నట్లయితే అతను రెండు రంగాలలోను విఫలుడవుతాడు. అదేవిధంగా ఒక వ్యాపారి అయినా, ఒక ఉపాధ్యాయుడైనా, ఒక రాజకీయ నాయకుడైనా, ఒక సంస్థకు యజమాని అయినా, ఒక మామూలు కూలీ వాడైనా, ఒక ఇల్లాలు అయినా అందరికీ ప్రణాళిక అనేది తప్పకుండా కావలసిందే.
ప్రణాళిక అనేది చిన్నదైనా సరే, పెద్దదైనా సరే దాని విలువ ఎంత మాత్రమూ తగ్గదు. ప్రణాళిక ద్వారా మంచి ఫలితాలు పొందదలిస్తే ప్రణాళికను తన జీవితానికి సంబంధించిన ప్రతి పని కోసం అలవాటు చేసుకోవాలి. అప్పుడు దాని ఫలితాలు చూసిన ప్రతి ఒక్కరూ ప్రణాళికాబద్ధంగా జీవితం గడపటానికి సిద్ధమవుతారు.
ప్రణాళిక అంటే టైమ్‌టేబుల్‌. మనం చెయ్యవలసిన కార్యాల ఒక పట్టిక ఉంటుంది. దానికి ఒక నిర్ణీత కాలం వరకు పూర్తి చెయ్యటానికి ఒక కార్యక్రమం తయారు చెయ్యబడుతుంది. ఈ ప్రణాళిక అనేది ప్రతి మనిషికి సంబంధించి వేర్వేరుగా ఉంటుంది. అది కొన్ని సంవత్సరాలకు సంబంధించింది అయి ఉంటుంది. లేదా కొన్ని నెలలకు లేదా కొన్ని రోజులకు లేదా ఒక దినానికి సంబంధించినది కూడా ఉండవచ్చు.
ప్రణాళికకు సంబంధించిన కొన్ని ప్రత్యేక విషయాలను విద్యా వేత్తలు, ప్రముఖులు వేర్వేరు విధాలుగా వర్ణించారు. మనిషి గనక ఒకవేళ ప్రణాళికాబద్ధంగా పని చేసినట్లయితే అతను ఊహించిన దానికంటే అధిక లాభాలను పొందగలుగుతాడు. మనిషి ప్రణాళికాబద్ధంగా వినియోగించిన ఒక్క నిమిషం ఇంకా చెయ్యబోయే కార్యాల పది నిమిషాలను మిగిల్చుతుంది. అంటే దాని అర్థం, మీరు గనక ప్రణాళికాబద్ధంగా పని చేసినట్లయితే అది మీకు తక్కువ సమయంలో ఎక్కువ పని చేసే సమర్థులుగా తీర్చిదిద్దుతుంది.
పనులకు సంబంధించిన ప్రణాళిక అసలు ఎందుకు తయారు చేసుకోవాలి అనే ప్రశ్నకు జవాబుగా ఎన్నో లాభాలను చూపించ వచ్చు.


మనిషి బలహీనత ఏమిటంటే, అతను ఏదైనా కార్యాన్ని చెయ్యదలచుకున్నప్పుడు అతని మనసులో ఎన్నో ఆలోచనలు రేకెత్తుతాయి. అవి మనకు అసలు లక్ష్యం నుంచి ఆపుతూ ఉంటాయి. ప్రత్యేకంగా ఒక మంచి కార్యాన్ని చెయ్యదలచుకున్న ప్పుడు దాన్ని ఆపటానికి షైతాన్‌ తన పూర్తి శక్తిని వినియోగించి ఆటంకపరుస్తాడు. అతడు కేవలం ఆలోచనలను రేకెత్తించగలడు. కాని చెయ్యి పట్టుకుని ఆపలేడు. అల్లాప్‌ా మనిషికి ప్రణాళికను ఎందుకు నేర్పాడంటే అతను దానిద్వారా షైతాన్‌ను ఓడిరచ టానికి. మనిషి తన కార్యాల ప్రణాళికను తయారు చేసుకున్న ట్లయితే అతను ఒక పని తరువాత మరొక పనిని చకచకా పూర్తి చేసుకుంటూ పోతాడు. అతనికి మధ్య మధ్యలో విరామ సమయం చాలా తక్కువగా ఉంటుంది. అతను ఈ విధంగా పనులలో నిమగ్నమై ఉన్న కారణంగా షైతాన్‌ ప్రలోభాలకు తక్కువగా గురికావటం జరుగుతుంది.
ప్రణాళిక అనేది మనిషిని తన కార్యాలలో వివేకాన్ని నేర్పుతుంది. ఆలోచించి, అర్థం చేసుకునే అవకాశాన్ని ఇస్తుంది. ఆచరణ మైదానంలో దూకే ముందు ముందుకు పోవటం మంచిదా? వెనుకకు మళ్ళించటం మంచిదా అని. దానికోసం కావలసిన శక్తియుక్తులు తన వద్ద ఉన్నాయా లేదా అని, తన శక్తియుక్తులకు సరైన విధంగా వినియోగిస్తున్నామా లేదా అనేది ఆలోచించేలా చేస్తుంది.
ప్రణాళిక ద్వారా మనిషి సంకల్పం కోసం తక్కువ శక్తిని వినియోగించి ఎక్కువ కార్యాలను నెరవేర్చగలుగుతాడు. మనిషి సంకల్పం అనేది ఒక ముఖ్యమైన నిధి. అది చాలా తక్కువగా కూడా ఉంటుంది. కనుక దానిని ఆలోచించి మరీ వినియో గించాలి. ప్రణాళికాబద్ధంగా కార్యాలను సిద్ధపరచుకున్నట్లయితే తన ద్వారా ఒక పని తరువాత మరొక పని దానంతట అదే అయిపోతూ ఉంటాయి. అంటే అవన్నీ అతని మనసులో ఆ విధంగా ప్రణాళిక ద్వారా పొందుపరచబడి ఉంటాయన్నమాట.
ప్రణాళిక తయారు చేసుకునేటప్పుడు మనిషి హృదయంలో ఒక ఉద్యమం రూపుదిద్దుకుంటుంది. అతను గనక ఆ పనులను పూర్తి చేసుకుంటూ పోయినట్లయితే అతనికి ప్రశాంతత కలుగు తుంది. దాని తరువాత మళ్ళీ రెండవ పని, మూడవ పని ఒకదాని తరువాత ఒకటి దానికంతటి అవే అయిపోయినట్లుగా అనిపిస్తాయి.
ప్రణాళిక కారణంగా మనిషి హృదయంలో నమ్మకం అనే శక్తి అధికమవుతుంది. మనిషి తనను తాను నమ్ముతాడు. తమ కార్యాలను తాము ఒక ప్రణాళిక ప్రకారం చేసుకుంటూ పోయినట్లయితే తన మీద తనకు నమ్మకం అధికమవుతూ ఉంటుంది. ఆ నమ్మకంతో మనిషి జీవితం చిన్నచిన్న కార్యాలతో మొదలైనప్పటికీ పెద్ద పెద్ద కార్యాలను సైతం అతను సునాయాసంగా తేలికగా చెయ్యగలుగుతాడు.
ప్రణాళిక కారణంగా మనిషి శక్తి సామర్థ్యాలు పెంపొందుతాయి. మనిషి తన కార్యాలను గురించి ప్రణాళిక తయారు చేసుకునే టప్పుడు ఏ కార్యాలు ముఖ్యమైనవి, ఏవి తరువాత చేసుకో గలుగుతారో మరీ చూసి ప్రణాళిక పట్టికను తయారు చేసుకుంటాడు. దాని కారణంగా అతను ఒక దాని తరువాత ఒకటి చేసుకుంటూ పోతున్నప్పుడు ప్రతి పనిపై అతను ప్రత్యేక దృష్టిని పెట్టగలుగుతాడు. పూర్తి ఏకాగ్రతతో ఆ పనిని చెయ్యగలుగుతాడు. దాని ద్వారా అతని ప్రతి పని పూర్తి ఫలితాన్ని ఇస్తుంది. ఈ ఫలితం అతని ఒత్తిడిని తగ్గిస్తుంది.
ప్రణాళిక ద్వారా ఉత్తమ ఫలితాలు లభిస్తాయని తెలిసినప్పుడు మనిషి తప్పకుండా ప్రణాళికను తయారు చేసుకోవాలి. దానిపై పూర్తిగా పాటించే ప్రయత్నం చెయ్యాలి. ప్రణాళిక అనేది ఎక్కువ రోజులకు సంబంధించినది కూడా ఉండాలి. తక్కువ రోజులది ఉండాలి. చివరకు ఒక రోజు ప్రణాళిక కూడా ఉండాలి. ఉదాహరణకు ఒక నెలకు, తరువాత ఒక వారానికి ఆ తరువాత ఒక రోజుకు సంబంధించినది అయి ఉండాలి. ఈ ప్రణాళిక అనేది ఒక డైరీలో వ్రాసుకోవాలి. దానిద్వారా వాటిపై అమలు పరచటం తేలికైపోతుంది.

నసీరాబేగం