July 27, 2024

జమాఅతె ఇస్లామీ హింద్‌ తెలంగాణ శాఖ ఈ ఎన్నికల్లో తన మద్దతు ఎవరెవరికో ప్రకటిం చింది. పార్టీల ప్రాతిపదికన కాకుండా, అభ్యర్థుల ప్రాతిపదికన వివిధ నియోజక వర్గాల్లో విభిన్న పార్టీలకు చెందిన అభ్యర్థులకు మద్దతు ప్రకటించారు. మొత్తం 119 నియోజక వర్గాల్లో 41 చోట్ల బీఆరెస్‌ పార్టీ అభ్యర్థులకు జమాఅత్‌ మద్దతిస్తోంది. మిగిలిన నియోజక వర్గాల్లో 69 చోట్ల కాంగ్రెసు అభ్యర్థులకు జమాఅత్‌ మద్దతిస్తోంది. మజ్లిస్‌ పార్టీకి చెందిన 7 గురు అభ్యర్థులు జమాఅత్‌ మద్దతు పొందారు. బియస్పీ, వామపక్షాలకు చెందిన ఒక్కో అభ్యర్థికి మద్దతు ప్రకటించడం జరిగింది.

గతంలో జరిగిన వివిధ ఎన్నికల్లో కూడా జమాఅత్‌ వ్యక్తిగతంగా అభ్యర్థుల పనితీరు ప్రాతిపదికన మద్దతు నిర్ణయం తీసుకోవడం అనేకసార్లు జరిగింది. ఈ సారి తీసుకున్న నిర్ణయంలోను కొల్లాపూరులో ప్రశ్నించే స్వరం బర్రెలక్కకు జమాఅత్‌ మద్దతు ప్రకటించడం గమనార్హం. జమాఅత్‌ తీసుకున్న నిర్ణయం యావత్తు ముస్లిం సమాజాన్ని ప్రభావితం చేస్తుందన్నది పలుమార్లు రుజువైన విషయం. జమాఅత్‌ మద్దతు 69 మంది కాంగ్రెసు అభ్యర్థులకు లభించడం ఈ ఎన్నికల్లో కీలకాంశంగా మారే అవకాశాలున్నాయి. ఈ 69 నియోజక వర్గాల్లో కాంగ్రెసు గెలుపు అవకాశాలు పెరిగాయి. అలాగే జమాఅత్‌ మద్దతిచ్చిన 41 మంది బీఆరెస్‌ అభ్యర్థుల గెలుపు అవకాశాలు కూడా బాగా పెరిగాయి.
మరోవైపు లోక్‌పాల్‌ మెగా సర్వే వచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెసు గాలి బలంగా వీస్తున్నట్లు ఈ సర్వే చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్రతో కాంగ్రెసు బలం పుంజుకుంది. లోక్‌ పాల్‌ సర్వే చూస్తే కాంగ్రెసు ఓట్లశాతం 43 నుంచి 46 వరకు పెరిగేలా ఉంది. దాదాపు 69 నుంచి 72 సీట్లు గెలుచుకునేలా ఉంది. అధికారపక్షానికి ఇది కాస్త ఇబ్బందికరమైన పరిస్థితే. ఈ సర్వే ప్రకారం బీఆరెస్‌ 36 నుంచి 39 స్థానాలు పొందవచ్చు. అంటే బీఆరెస్‌ భారీగా నష్టపోయే పరిస్థితి. కాగా బీఆరెస్‌` కాంగ్రెస్‌ మధ్య ముస్లిముల ఓట్లు చీలడం వల్ల బీజేపీ కొంతమేర ప్రయోజనం పొందే పరిస్థితి కూడా ఉంది. గతంలో ఒకే ఒక్క స్థానంలో గెలిచిన బీజేపీ ఈసారి రెండు స్థానాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయని అంచనా. బీఆరెస్‌ మిత్రపక్షం మజ్లిస్‌ గెలిచే స్థానాలు కూడా తగ్గుతాయా? మజ్లిస్‌ కంచుకోటగా పేరుపడిన 7 స్థానాలు తిరిగి కైవసం చేసుకుంటుందా? ఎన్నికల ఫలితాల తర్వాతే చెప్పగలం. ఇంతకు ముందు వచ్చిన సి వోటర్‌ సర్వే కూడా తెలంగాణలో కాంగ్రెస్‌ గాలి బలంగా వీస్తున్నట్లే చెప్పింది. దాదాపు 43 నుంచి 55 స్థానాల్లో కాంగ్రెసు గెలిచే అవకాశా లున్నట్లు సి వోటర్‌ సర్వే చెప్పింది. సర్వేలు కాంగ్రెసు పునరాగ మనాన్ని సూచిస్తున్నాయి.
ఈ ఎన్నికల్లో ముస్లిం ఓట్లు చాలా ప్రాముఖ్యం సంతరించు కున్నాయి. కాంగ్రెసు పార్టీ ఈ వాస్తవాన్ని ముందే గుర్తించింది. బీఆరెస్‌ చాలా ఆలస్యంగా గుర్తించిందని చెప్పాలి. గత ఎన్నికల్లో ముస్లిములు రాష్ట్రంలో బీఆరెస్‌ పక్షాన బలంగా నిలుచున్నారు. ఈ సారి కూడా ముస్లిం మద్దతు తమకే లభిస్తుందన్న ధీమాతో నిర్లక్ష్యం చేసిన బీఆరెస్‌ ఇప్పుడు మూల్యం చెల్లించుకునే పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలోని 40 నియోజక వర్గాల్లో ముస్లిం ఓట్లు గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో ఉన్నాయి. రాష్ట్రంలోని 3.26 కోట్ల మంది ఓటర్లలో 13 శాతం ముస్లిములున్నారు. బీఆరెస్‌ వరుసగా రెండు సార్లు గెలుపొందడం వెనుక కూడా ముస్లిముల ఓట్లే కీలకపాత్ర పోషించాయి. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ముస్లిములు పెద్ద స్థాయిలో పాలుపంచు కున్నారు. వివిధ ముస్లిం సంఘాలు, సంస్థలు తెలంగాణ రాష్ట్రసాధన ఉద్యమంలో పోరాడాయి. జమాఅతె ఇస్లామీ హింద్‌ తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగాన నిలిచింది. ఉద్యమ పార్టీగా అప్పట్లో టీఆరెస్‌గా ఉండిన బీఆరెస్‌కు సహజంగానే అన్ని వర్గాల మద్దతు లభించింది. ముస్లిములు కూడా బీఆరెస్‌ పక్షానే నిలిచారు. ఆ తర్వాత జరిగిన 2018 ఎన్నికల్లో కూడా ఉద్యమ పార్టీగా బీఆరెస్‌ ప్రాభవం కొనసాగింది. జమాఅత్‌ అప్పట్లో బీఆరెస్‌కు తన మద్దతు ప్రకటించింది. ఈ సారి హ్యాట్రిక్‌ సాధిం చాలనుకున్న బీఆరెస్‌ మరోసారి అన్ని వర్గాల ఓట్లు తనకు లభిస్తాయని భావిస్తోంది. ముస్లిముల ఓట్లు కూడా తప్పక తమకే లభిస్తాయని బీఆరెస్‌ నాయకులు భావిస్తున్నారు. కాని మారిన పరిస్థితుల్లో ముస్లిం ఓట్లు కాంగ్రెసు వైపు మొగ్గు చూపడం ప్రారంభమయ్యింది. దీనివల్ల బీఆరెస్‌, కాంగ్రెసు మధ్య ఓట్లు చీలిపోయే పరిస్థితి తలెత్తింది.
కాంగ్రెసు కర్నాటకలో సాధించిన విజయాన్ని తెలంగాణలో కూడా సాధించాలనుకుంటోంది. కాని కర్నాటకకు, తెలంగాణకు మధ్య తేడా ఉంది. కర్నాటకలో ప్రాంతీయపార్టీ ఏదీ రంగంలో లేదు. కర్నాటకలో ముస్లిములకు కాంగ్రెసు ఒక్కటే మతతత్వం నుంచి కాపాడే పార్టీ. కర్నాటకలో బీజేపీ తీసుకున్న నిర్ణయాలు, హిందూత్వ ఎజెండా, హిజాబ్‌ నిషేధం, హలాల్‌పై వివాదం, లవ్‌ జిహాద్‌ వివాదాలు ముస్లిము ఓట్లన్నీ ఎలాంటి చీలిక లేకుండా కాంగ్రెసుకు పోలయ్యే వాతావరణాన్ని సృష్టించాయి. మజ్లిస్‌ పార్టీ అక్కడ అడుగుపెట్టడానికి ప్రయత్నించింది. అలాగే ముస్లిం పార్టీగా సోషల్‌ డెమొక్రటిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా కూడా రంగంలోకి దిగింది. ఓట్లు చీలిపోయే పరిస్థితి కొంతవరకు వచ్చింది. కాని ఓట్లు చీలిపోకుండా కర్నాటక ముస్లిములు ఈ ప్రయత్నాలను తిప్పికొట్టారు. కాంగ్రెసుకు విజయం వరించింది. కర్నాటకలో మజ్లిస్‌, యస్డిపీఐ పార్టీలు పెద్ద పార్టీలేమీ కాదు. కాబట్టి ఈ పార్టీలు ముస్లిం ఓట్లను చీల్చడం సాధ్యమూ కాలేదు. కానీ తెలంగాణ పరిస్థితి వేరు. ఇక్కడ సెక్యులర్‌ పార్టీగా బీఆరెస్‌ బలమైన పార్టీ మాత్రమే కాదు, అధికార పక్షం కూడాను. కాంగ్రెసు పార్టీ దేశవ్యాప్తంగా బీజేపీకి ప్రత్యామ్నయంగా, దేశంలో మతవిద్వేష వాతావరణాన్ని తొలగించి సామరస్య వాతావరణం కోసం పోరాడుతున్న నేతగా రాహుల్‌ గాంధీ బలమైన ఇమేజ్‌ సంపాదించారు. కాంగ్రెసు, బీఆరెస్‌ రెండూ రంగంలో ఉండడం వల్ల ముస్లిం ఓట్లు చీలిపోయే పరిస్థితిని కాదనలేము.

బీఆరెస్‌ సెక్యులర్‌ ఇమేజ్‌ బలంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి బీఆరెస్‌ పాలిస్తోంది. ఈ పదేళ్ళ పాలనా కాలంలో ఎన్నడూ మతఘర్షణలు జరగలేదు. తెలంగాణలో మూకహత్యలు, మూకదాడులు, హిజాబ్‌ వివాదాలు, హలాల్‌ వివాదాలు, లవ్‌ జిహాదు గగ్గోళ్ళు లేవు. పైగా హైదరాబాదులో బలమైన మజ్లిస్‌ పార్టీ బీఆరెస్‌ కు మిత్రపక్షం. మరోవైపు ముస్లిం యునైటెడ్‌ ఫోరం అనే సంస్థ కూడా బీఆరెస్‌కు మద్దతు ప్రకటిం చింది. ఇవన్నీ సానుకూలాంశాలు కాబట్టి ముస్లిం ఓట్లు తమవైపే ఉంటాయని బీఆరెస్‌ భావిస్తోంది.

మతఘర్షణలను సమర్థవంతంగా అదుపు చేయడమే బీఆరెస్‌ ముఖ్యంగా ముస్లిములకు చేసిన మేలుగా భావించాలి. పదేళ్ళలో మైనారిటీల కోసం 12,780 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, మైనారిటీల సంక్షేమ బడ్జెటును 2,200 కోట్ల రూపాయలకు పెంచామని, మైనారిటీలకు రెసిడెన్షియల్‌ స్కూళ్ళు కట్టించామని, అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని బీఆరెస్‌ చెబుతున్నప్పటికీ ముస్లిముల ఓట్లు పొందడానికి ముఖ్యంగా ఆధారపడుతున్నది మతఘర్షణలు లేని పాలన అందించామన్న వాదనపైనే. గంగా జమునా తహజీబ్‌ గురించి బీఆరెస్‌ అగ్రనేతలు తరచు తమ ప్రసంగాల్లో మాట్లాడుతున్నారు. ఇది చాలా జాగ్రత్తగా గమనించవలసిన వాదన. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాల కాలం గడిచిపోయినా ఇప్పటికి కూడా ముస్లి ములు తమ ప్రగతి వికాసాల కన్నా ఎక్కువగా తమ భద్రతకు ప్రాముఖ్యం ఇవ్వవలసిన పరిస్థితులున్నాయి. ఈ పరిస్థితి ఇప్పటి తరం ముస్లిము యువతకు ఇష్టం లేదు. అందరితో పాటు ప్రగతి వికాసాల్లో పోటీ పడాలని వారు భావిస్తున్నారు. ఉన్నత చదువు లతో ముందుకు పురోగమించాలనుకుంటున్నారు. హిందూ ముస్లిం రాజకీయాలతో బీజేపీ దేశంలో ఎదగాలని భావిస్తుంటే, భద్రత కల్పిస్తే చాలు అనుకునే పరిస్థితిలో మాత్రమే ముస్లిములు ఉండాలని మరికొన్ని పార్టీలు భావిస్తున్న పరిస్థితికి ఈ ఎన్నికల ప్రచారం దర్పణం పడుతోంది. కేంద్రంలో బీజేపీ తీసుకున్న అనేక నిర్ణయాల విషయంలో బీఆరెస్‌ మెతకవైఖరి కూడా ముస్లిముల దృష్టిలో ఉంది. ఈ నేపథ్యంలో ‘ముహబ్బత్‌ కి దుకాన్‌’ నినాదంతో ముందుకు వచ్చిన రాహుల్‌ గాంధీ ఈ ఎన్నికల్లో ప్రత్యేక ఆకర్షణ అయ్యారు. జమీఅతె ఉలమా, తెహ్రీక్‌ ముస్లిం షబ్బాన్‌ వంటి సంస్థలు కాంగ్రెసుకు మద్దతు ప్రకటిం చాయి.
బీఆరెస్‌ ఎన్నడూ బీజేపీని వ్యతిరేకించలేదని, కేవలం రాష్ట్ర స్థాయిలో మాత్రమే బీజేపీ పట్ల వ్యతిరేకత చూపిస్తుందని, కేంద్రంలో బీఆరెస్‌ ఎల్లప్పుడూ బీజేపీ నిర్ణయాలకు వత్తాసు పలుకుతుందన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. బీఆరెస్‌, మజ్లిస్‌ పార్టీలు బీజేపీతో కుమ్మక్కయ్యాయని కాంగ్రెసు ఆరోపిస్తోంది. కాంగ్రెసుకు, బీజేపీకి ముఖాముఖి పోటీ ఉన్న రాష్ట్రాల్లో మజ్లిస్‌ తన అభ్యర్థులను రంగంలోకి దింపడం కూడా అనేకసార్లు విమర్శలకు తావిచ్చింది. బీజేపికి ప్రయోజనాలు చేకూర్చడానికే ఈ పని చేస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపించాయి.
మరోవైపు కాంగ్రెసు బలమైన దాడి చేస్తోంది. 12 శాతం రిజర్వేషన్లేమయ్యాయి? 4 శాతం రిజర్వేషన్లు కూడా కల్పించింది కాంగ్రెసు పార్టీయే. ఈ రిజర్వేషన్ల వెనుక బీఆరెస్‌ ప్రయత్నాలేవీ లేవు అంటూ కాంగ్రెసు నాయకుడు ముహమ్మద్‌ అలీ షబ్బీర్‌ నిలదీస్తున్నారు. ముహమ్మద్‌ అలీ షబ్బీర్‌ వంటి సీనియర్‌ ముస్లిం నాయకుడు కాంగ్రెసులో ఉన్నాడు. అలాంటి స్థాయి ఉన్న ముస్లిం నేతలెవ్వరు బీఆరెస్‌ లో కనిపించడం లేదు. మైనారిటీల బడ్జెటు పెంచామని చెబుతున్నప్పటికీ బడ్జెటులో 60 శాతం ఖర్చు చేయడం లేదని కాంగ్రెసు నేతలు విమర్శిస్తున్నారు. అలాగే ఉద్యోగాల కల్పన, పేదలకు నివాసగృహాల పంపిణీ వంటి అనేక అంశాల్లో బీఆరెస్‌ వైఫల్యాలను కాంగ్రెసు నిలదీసి ప్రశ్నిస్తోంది.
తెలంగాణలో దాదాపు 13 శాతం ముస్లిం ఓటర్లున్నారు. ఇక్కడ మజ్లిస్‌ పార్టీ ముస్లిం ప్రధానమైన పార్టీ. మజ్లిస్‌ అగ్రనాయకత్వంలో అందరూ ముస్లిములే. మజ్లిస్‌ బలం కేవలం హైదరాబాదుకు మాత్రమే పరిమితం. రాష్ట్రంలో పోటీ పడుతున్న ప్రధాన పార్టీలు బీఆరెస్‌, కాంగ్రెసులు. ఈ రెండు పార్టీలకు ముస్లిముల ఓట్లు కావాలి. పోటీ పడుతున్న మరో పార్టీ బీజేపీ. బీజేపీకి ముస్లిముల ఓట్లు అక్కర్లేదు, అందుకే బాహాటంగా తాము అధికారంలోకి వస్తే ముస్లిములకు లభిస్తున్న 4 శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తామని ప్రకటించారు. కాని ముస్లిముల ఓట్లు కోరుతున్న కాంగ్రెసు, బీఆరెస్‌ పార్టీలు ముస్లిములకు మాత్రం టిక్కెట్లివ్వడం లేదు. బీఆరెస్‌ పార్టీ ముస్లిములకు చాలా చేశానని చెబుతోంది. కాని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం ముగ్గురికి మాత్రమే టిక్కెట్లిచ్చింది. దాదాపు 40 స్థానాల్లో ముస్లిములు నిర్ణాయకస్థాయిలో ఉంటే కేవలం మూడు టిక్కెట్లు. ఇందులో ముహమ్మద్‌ షకీల్‌ ఆమిర్‌ బోధన్‌లో సిట్టింగ్‌ ఎమ్మెల్యే. మరొకరు చార్మినార్‌ నియోజకవర్గం నుంచి పోటీ పడుతున్న సలాహుద్దీన్‌ లోఢీ. ఇక్కడ మజ్లిస్‌తో స్నేహపూర్వక పోటీ అని చెప్పుకోవాలి. అంటే బీఆరెస్‌ అభ్యర్థి గెలిచే అవకాశమే లేదు. అలాగే బహదూర్‌ పురాలో ఇనాయత్‌ అలీకి టిక్కెట్టిచ్చారు. ఇక్కడ కూడా మజ్లిస్‌తో స్నేహపూర్వకమైన పోటీయే. అంటే ఈయన కూడా గెలవడం కష్టం. అంటే నిజానికి కేవలం ఒకే ఒక్క టిక్కెట్టు బీఆరెస్‌ ఇచ్చిందని అర్థం చేసుకోవాలి. ఇక కాంగ్రెసులో చూస్తే మొత్తం ఆరుగురు ముస్లిం అభ్యర్థులకు టిక్కెట్లిచ్చింది. ఇందులో ముహమ్మద్‌ అజ్హరుద్దీన్‌ జుబిలీ హిల్స్‌ నుంచి పోటీ చేస్తున్నారు. మాజీ మంత్రి ముహమ్మద్‌ అలీ షబ్బీర్‌ నిజామాబాద్‌ అర్బన్‌ నుంచి పోటీ చేస్తున్నారు. నాంపల్లి నుంచి ఫిరోజ్‌ ఖాన్‌, కార్వాన్‌ నుంచి ఉస్మాన్‌ అల్‌ హాజిరి, చార్మినార్‌ నుంచి ముజీబుల్లా షరీఫ్‌, మలక్‌ పేట నుంచి షేక్‌ అక్బర్‌ పోటీ పడుతున్నారు. బీఆరెస్‌ కన్నా ఈ విషయంలో కాంగ్రెసు కాస్త మెరుగ్గా కనిపిస్తున్నప్పటికీ ముస్లిములకు ఇవ్వవలసినంత రాజకీయ ప్రాతినిథ్యం ఇవ్వడం లేదన్నది స్పష్టం. మజ్లిస్‌ తొమ్మిది స్థానాల్లో పోటీ చేస్తుంటే అందులో ఒక టిక్కెట్లు ముస్లిమేతరులకు కేటాయించింది. మరో విషయం గమనించవలసిందేమిటంటే, చార్మినార్‌, మలక్‌ పేట, కార్వాన్‌, బహదూర్‌ పుర నియోజకవర్గాల్లో బీఆరెస్‌ ఎవరికి టిక్కెట్లు ఇచ్చినా, కాంగ్రెసు ఎవరికి టిక్కెట్టు ఇచ్చినా ఇక్కడ బలంగా ఉన్న మజ్లిస్‌తో పోటీ పడడం సులభం కాదు.
అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ముస్లిముల ప్రాతినిధ్యం పెరగవలసిన అవసరం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కాని ప్రధాన పార్టీలు ముస్లిములకు మొండిచెయ్యి చూపించడం వల్ల అసెంబ్లీలోను, పార్లమెంటులోను ముస్లిములు కనిపించడం లేదు. తెలంగాణ అసెంబ్లీలో ముస్లిము ముఖాలుగా కేవలం మజ్లిస్‌ పార్టీ నేతలే ఎక్కువగా కనిపించడానికి కారణం ఇదే. బీఆరెస్‌ లో ముహమ్మద్‌ షకీల్‌, కాంగ్రెసులో ముహమ్మద్‌ అలీ షబ్బీర్‌ ఈ ఇద్దరు నేతలు తప్ప జిల్లాల నుంచి ముస్లిం నేతలు మరెవ్వరు కనిపించడం లేదు. టిక్కెట్లు లభించిన మిగిలిన వారంతా కేవలం హైదరాబాదుకు చెందిన వారే. ఈ ఎన్నికల్లో కాంగ్రెసు హవా నడుస్తుందా? లేక బీఆరెస్‌ హవా నడుస్తుందా? ముస్లిములు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు? అనే ప్రశ్నల కన్నా ముస్లిముల రాజకీయ ప్రాతినిధ్యం పట్ల ఈ పార్టీలు నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి కారణాలేమిటి అనే ప్రశ్న ముస్లిం సముదాయానికి అత్యంత కీలకమైన ప్రశ్న.

 

అబ్దుల్ వాహెద్