ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికల ఫలితాలు దేశంలోని ప్రతిపక్ష పార్టీలకు, ముఖ్యంగా కాంగ్రెస్ కు మరిచిపోకూడని గుణపాఠాలు నేర్పుతున్నాయి. ఎన్నికల వ్యూహాలు, ప్రచారం, ప్రజా సంబంధాల విషయంలో కష్టపడ కుండా ఫలితాలు రావన్నది బీజేపీని చూసి కాంగ్రెస్ నేర్చు కోవాలి. బీజేపీని ఓడిరచడానికి షార్ట్ కట్ దారులేవీ లేవన్నది కాంగ్రెస్ ఇప్పటికైనా గుర్తించాలి. తెలంగాణలో విజయం ఒక్కటే కాంగ్రెసుకు సాంత్వన. మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కాంగ్రెసు నేతలు బీజేపీకి పోటీగా సాఫ్ట్ హిందూత్వ రాజకీయాలతో నెట్టుకురావాలని చేసిన ప్రయత్నాలు మరోసారి బెడిసికొట్టాయి. 2024 సార్వత్రిక ఎన్నికలకు బీజేపీ ఇప్పుడు పూర్తిస్థాయిలో సంసిద్ధంగా ఉంది. కాంగ్రెసు ఎక్కడ ఉందో భారత్ జోడో యాత్రికులు ఆలోచించుకోవాలి.
మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ లలో ఓటమికి ముఖ్యమైన కారణం అతినమ్మకం. ఈ ఎన్నికల్లో ఈ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ చాలా బలంగా ఉందన్న అతినమ్మకమే కాంగ్రెసును ముంచింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కేంద్ర నిఘా సంస్థలను ఉపయోగించి ప్రతిపక్ష నేతలను వేధిస్తుందని తరచు ఆరోపించే ప్రతిపక్ష నేతలు ఎన్నికల సమయంలో ఐక్యతను చూపలేకపోతున్నారు. సీట్ల సర్దుబాటుకు సిద్ధం కాలేకపో తున్నారు. అభ్యర్థుల విషయంలో స్వార్థ ప్రయోజనాలను వదులు కోలేకపోతున్నారు. ఫలితం కళ్ళ ముందు కనబడుతోంది.
ప్రతిపక్షాలన్నీ కలిసి ఇండియా కూటమిని ఏర్పాటు చేశాయి. మొత్తం 27 పార్టీలు ఈ కూటమిzలో ఉన్నాయి. వచ్చే సంవత్సరం సాధారణ ఎన్నికల్లో కలిసికట్టుగా పోటీ చేయాలని నిర్ణయిం చాయి. కాని సాధారణ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలను సెమీఫైనల్‌గా బీజేపీ భావిస్తే, కాంగ్రెసు మాత్రం భారత్ జోడోతో బలం చాలా పెరిగిపోయిం దన్న అపోహలో కొట్టుకుపోయింది. మరోవైపు కమల్ నాథ్, అశోక్ గెహ్లాత్, భూపేష్ భాగేల్ వంటి నేతలు ఇతర పార్టీలతో పొత్తు అవసరమే లేదన్న అహంకారాన్ని ప్రదర్శించారు. ఇండియా కూటమి పొత్తులు కేవలం సాధారణ ఎన్నికలకు మాత్రమేనని, రాష్ట్రాల ఎన్నికల్లో పొత్తులు అవసరం లేదనుకు న్నారు. ఈ వైఖరిని కాంగ్రెస్ అధిష్ఠానం కూడా ఆమోదించడం విచిత్రం. ఆ తర్వాత బీజేపీకి పూర్తి అవకాశం కాంగ్రెస్ స్వయంగా ఇచ్చింది. ఇండియా కూటమిలోని ప్రముఖ పార్టీ సమాజవాది పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ ఈ విషయమై ప్రశ్నించారు కూడా. ఇండియా కూటమిగా రాష్ట్రాల ఎన్నికల్లో పోటీ చేయాలని కోరాడు. కాని మధ్యప్రదేశ్ కాంగ్రెసు నాయకుడు అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యలను కించపరుస్తున్నట్లు, అఖిలేష్, గిఖిలేష్ గురించి నాకు చెప్పకండి అంటూ గర్వంగా వ్యాఖ్యానించాడు. ఇండియా కూటమి నిషేధించిన యాంకర్లలో ఒక యాంకరును పిలిచి మరీ ఇంటర్వ్యు ఇచ్చి కూటమి నిర్ణయాల పట్ల తనకు ఎంతమాత్రం గౌరవం లేదన్న అహంకారాన్ని ప్రదర్శించాడు. ఈ నేతలు పొత్తులకు సిద్ధపడలేదు. సమాజవాది పార్టీతోను ఇతర చిన్న పార్టీలతోను పొత్తులు పెట్టుకుని ఉన్నట్లయితే బహుశా కాంగ్రెసు పరిస్థితి మరోలా ఉండేది. క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలం పెరిగేది. కేవలం మధ్యప్రదేశ్ మాత్రమే కాదు, రాజస్థాన్, చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లోను కాంగ్రెస్ నేతలు పొత్తులకు సిద్ధం కాలేదు. ఈ సారి కూడా బీజేపీ తన ఎన్నికల ఎత్తుగడల్లో విజయం సాధించింది. బీజేపికి వ్యతిరేకంగా అనేకమంది ప్రత్యర్థులు నిలబడే వాతావరణంలో ఓట్లు చీలిపోయే పరిస్థితిని తనకు అనుకూలంగా మరల్చుకుంది.
మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అగ్రనేతలు సాఫ్ట్ హిందూత్వ రాజకీయాలతో బీజేపీపై గెలవవచ్చని అనుకున్నారు. ఇలాంటి ప్రయత్నాలు ఇంతకుముందు కూడా కాంగ్రెసు చాలా సార్లు చేసి తలబొప్పి కట్టిన అనుభవాలున్నాయి. అయినా గుణ పాఠాలు నేర్చుకోలేదు. మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్ బాహాటంగా బాబాలకు సాగిలపడడాన్ని ఓటర్లు చూశారు. హిందూత్వ కావాలనుకునే ఓటర్లకు హిందూత్వ విషయంలో కాంగ్రెసు కన్నా మెరుగైన బీజేపీ ఉన్నప్పుడు కాంగ్రెసుకు ఎందుకు ఓటు వేస్తారు? హిందూత్వ రాజకీయాల పట్ల తటస్థ వైఖరి ఉన్నవారు కూడా మతతత్వ రాజకీయాల విషయంలో కాంగ్రెసుకు, బీజేపీకి తేడా లేనట్లుగా కనిపిస్తున్నప్పుడు కాంగ్రెసుకు ఎందుకు ఓటు వేస్తారు? హిందూత్వ రాజకీయాలు వద్దనుకునే ఓటర్లు కూడా కాంగ్రెసు వైఖరి పట్ల విసిగిపోయారు. మధ్యప్రదేశ్ మాత్రమే కాదు, ఛత్తీస్‌గఢ్ లోను పరిస్థితి ఇదే. ఛత్తీస్‌గఢ్‌లో మతఘర్షణల్లో మరణించిన భువనేశ్వర్ సాహూ కుటుంబానికి ఛత్తీస్‌గఢ్ కాంగ్రెసు ప్రభుత్వం పదిలక్షలు సహాయం అందించింది. అవే మత ఘర్షణల్లో మరణించిన ఇద్దరు ముస్లిముల కుటుంబాలకు అలాంటి సహాయమేదీ ఇవ్వలేదు. 2018లో అధికారంలోకి రాగానే ఆవుపేడ, గోమూత్రాలతో ఛత్తీస్ గఢ్ కాంగ్రెస్ నేతలు రాజకీయాలు మొదలు పెట్టారు. ఆవుపేడ, గోమూత్రాలను సేకరించే పథకం ప్రవేశపెట్టారు. జీవమిత్ర, బ్రహ్మాస్త్ర అనే ఎరువులను తయారు చేయడానికి సేకరిస్తున్నట్లు చెప్పారు. ఆరెస్సెస్ ఈ పథకాన్ని మెచ్చుకుంది. బీజేపీ ఈ ప్రయత్నాలను అవహేళన చేసింది. యువకులకు ఉద్యోగాలు ఇవ్వకుండా పేడ ఎత్తే పనిలో ప్రభుత్వం పెడుతుందని ఎగతాళి చేసింది. భాగేల్ ప్రభుత్వం గుడులు కట్టడంలో అత్యంత ఉత్సాహం చూపించింది. మరోవైపు క్రయిస్తవ వ్యతిరేక హింసాకాండలోను భాగేల్ ప్రభుత్వం సాఫ్ట్ హిందూత్వ వైఖరి బయటపెట్టుకుంది. కాని ఈ సాఫ్ట్ హిందూత్వ కార్డు భాగేల్‌కు ఉపయోగపడలేదు. హిందూత్వ ఓటర్లెవరు ఆయనకు ఓటు వేయలేదు.
రాజస్థాన్ లో పరిస్థితిని గమనిస్తే ప్రతి సారి ప్రభుత్వాన్ని మార్చే రాజస్థాన్ ఓటర్లు ఈ సారి కూడా ప్రభుత్వాన్ని మార్చారు. నిజానికి గెహ్లాత్ ప్రభుత్వం చక్కటి పరిపాలన అందించింది. కాంగ్రెసు ఇక్కడ ఓడిపోవడానికి ముఠా కుమ్ములాటలు కారణం. అభ్యర్థులను నిలబెట్టడంలో ఈ ముఠాలకే ప్రాముఖ్యత లభిం చడంతో ప్రజల్లో అభ్యర్థుల పట్ల వ్యతిరేకత పెరిగింది. దాంతో పాటు అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ పరీక్షల పేపర్లు లీక్ కావడం కూడా మరో కారణం. దాంతో పాటు కన్నయ్య కుమార్ హత్యను మతతత్వ రాజకీయాలకు బీజేపీ వాడుకోవడం కూడా బీజేపికి కలిసి వచ్చింది. రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఓటమిని, తెలంగాణలో బీఆరెస్ ఓటమిని పరిశీలిస్తే కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. రెండు రాష్ట్రాల్లోను ప్రభుత్వాలు ప్రజాసంక్షేమ పథకాలకు ప్రాముఖ్యం ఇచ్చాయి. కాని రెండు రాష్ట్రాల్లోను పాలకపార్టీ గర్వాతిశయాన్ని ప్రదర్శిం చింది. సంక్షేమ పథకాలు ప్రకటించడంలో చూపించిన ఉత్సాహం సంక్షేమం ప్రజల వద్దకు వెళ్ళడంలో చూపించలేదు. మతతత్వ రాజకీయాల పట్ల ఖచ్చితమైన వ్యతిరేకతను రాజస్థాన్ కాంగ్రెస్ నేతలు ప్రదర్శించలేదు. మహిళల భద్రత విషయంలో బీజేపీ ఆరోపణలకు సరైన జవాబు ఇవ్వలేకపోయారు. రాజస్థాన్ లో కాంగ్రెస్ ఓటమి వెనుక కారణాలను విశ్లేషించుకోవడం పార్టీకి ఎంతైనా అవసరం.
ఈ ఎన్నికల్లో గెలవడానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కులజనగణన గురించి నొక్కి మాట్లాడారు. బీజేపీ మతతత్వ రాజకీయాలకు విరుగుడుగా ఇండియా కూటమి నేతలు కూడా ఈ వ్యూహాన్ని అనుసరించాలనుకున్నారు. బీహారులో కులజన గణన నివేదికను విడుదల చేశారు. కాంగ్రెసు పాలిత రాష్ట్రాలు తాము కూడా కులజనగణన నిర్వహిస్తామన్నాయి. ఓబీసి ఓటర్లను ఆకట్టుకోడానికి రాహుల్ గాంధీ కులజనగణన గురించి ఎంత మాట్లాడినా ఆయన తప్ప కాంగ్రెసులో మరో నాయకు డెవరు దీని గురించి మాట్లాడలేదు. మధ్యప్రదేశ్‌లో, చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ అగ్రనేతలు కుల జనగణన గురించి పొరబాటున కూడా ప్రస్తావించలేదు. రాజస్థాన్‌లో కూడా నేతలు దీని గురించి మాట్లాడలేదు. కాంగ్రెసు చెప్పే కుల జనగణనను ఓటర్లు నమ్మలేని పరిస్థితి వచ్చింది.
రాహుల్ గాంధీ ముహబ్బత్ కి దుకాన్ నినాదం ఉత్త నినాదం గానే మిగిలిపోయింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలు ముహబ్బత్ కి దుకాన్ అవసరం లేదనుకున్నారు. సాఫ్ట్ హిందూత్వతో పాటు అవకాశవాద రాజకీయాలు నడిపి గెలవగలమని భావించారు. కొత్తతరానికి అవకాశమిచ్చే బదులు పాతతరం వృద్ధనేతలే కొనసాగాలను కున్నారు. కాంగ్రెస్ అనేక సంక్షేమపథకాల గ్యారంటీ ఇచ్చింది. నిన్నటి వరకు తాయిలాలు, రేవడీలంటూ విమర్శించిన బీజేపీ కూడా మారుతున్న రాజకీయ వాతావరణాన్ని గమనించి వెంటనే తన తరఫున తాయిలాలు, రేవడీలు ప్రకటించడానికి వెనుకాడ లేదు. కాంగ్రెస్ ఇచ్చే గ్యారంటీ కన్నా, బీజేపీ ఇచ్చే గ్యారంటీ బలమైందని ప్రచారం చేసింది.
ఏది ఏమైనా ఈ రాష్ట్రాల్లో ఎన్నికల తర్వాత బీజేపీ మతతత్వ రాజకీయాలు మరింత పెరుగుతాయని, సాధారణ ఎన్నికల వరకు రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతుందన్నది స్పష్టం. కాంగ్రెసును ముస్లిం పార్టీగా చిత్రించి ప్రచారం చేయడం కూడా కొనసాగుతుంది. ఈ ప్రచారాన్ని ఎదుర్కోడానికి కాంగ్రెస్ అనుసరించే సాఫ్ట్ హిందూత్వ రాజకీయాలు, మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్, చత్తీస్ గఢ్ లో భాగేల్ నడిపిన మాదిరి రాజకీయాలు కాంగ్రెసును మరింత బలహీనపరుస్తాయి.
వేలాది కిలోమీటర్లు భారత్ జోడో యాత్ర లో నడిచి ముహబ్బత్ కి దుకాన్ సందేశమిచ్చిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర స్ఫూర్తికి ఈ సాఫ్ట్ హిందూత్వ రాజకీయాలకు సంబంధమే లేదు. రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలు భారత్ జోడో స్ఫూర్తికి విరుద్దంగా వ్యవహరిస్తుంటే కాంగ్రెస్ గెలుపుపై నమ్మకం పెట్టుకోవడం అత్యాశే అవుతుంది. రాష్ట్రాల్లో ఈ నేతలను అదుపు చేయలేని అధిష్ఠానం ఎన్నికల్లో మంచి ఫలితాలను ఎలా ఆశించగలదు.
ఈ పరాజయాలు కాంగ్రెసులో పునరాలోచనలను, దిద్దుబాట్లను ప్రోత్సహిస్తాయా? వేచి చూద్దాం.
- అబ్దుల్ వాహెద్