January 15, 2025

ఎన్నికల్లో ప్రజాసమస్యలు ప్రస్తావనకు రావాలి. నిరుద్యోగం, రైతుసమస్యలు, అధికధరలు, పేదల కష్టాలు, వ్యవసాయ సంక్షోభం, కునారిల్లుతున్న ఆర్ధికప్రగతి ఇవన్నీ ప్రస్తావనకు రావాలి. కాని ఈ ఎన్నికల్లో అవేవీ పాలకపక్షం ప్రస్తావించడం లేదు.

ఈ సారి ఎన్నికలు ఏడు విడతలుగా జరుగుతున్నాయి. మొదటి విడత ముగిసింది. ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ రాజస్థాన్ లో మాట్లాడుతూ ముస్లిములను ‘‘చొరబాటుదారులు’’ అన్నారు. కాంగ్రెసుపార్టీ అధికారంలోకి వస్తే హిందూ మహిళల బంగారు ఆభరణాలను, చివరకు మంగళసూత్రాలను కూడా లాక్కుని ముస్లిములకు పంచిపెడుతుందని చెప్పారు. కాంగ్రెసు పార్టీ మేనిఫెస్టో చూస్తే మనకు ఇలాంటి మాటలేవీ కనిపించవు. ఈ ప్రసంగం తర్వాత ఎన్నికల కమీషనుకు ఫిర్యాదులు వెళ్ళాయి. ప్రతిపక్షాలు ఫిర్యాదు చేయడమే కాదు, 17వేల మంది ప్రజలు కూడా సంతకాలు చేసి ఎన్నికల కమీషనుకు పిటీషను పంపారు. కాని, గతంలో మోడీపై చేసిన ఫిర్యాదుల మాదిరిగానే ఈ సారి కూడా ఎన్నికల కమీషన్ ఎలాంటి చర్యలు తీసుకోదన్నది స్పష్టంగా కనిపిస్తుంది.

ఈ విద్వేష ప్రచారాన్ని ఆయన ఒక సభలో మాట్లాడుతూ మాత్రమే చేయలేదు. ఇవే మాటలు మరో సభలో కూడా చెప్పారు. అంతేకాదు, కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వస్తే యస్సీ యస్టీ రిజర్వేషన్లలో కోత పెట్టి ఆ రిజర్వేషన్లు ముస్లిములకు పంచిపెడుతుందన్నారు. కాంగ్రెసు పార్టీ ముస్లిం బుజ్జగింపు రాజకీయాలు చేస్తుందన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన ఒక ప్రసంగం గురించి చెబుతూ, దేశ వనరులపై మొదటి హక్కు ముస్లిములకే ఉందని మన్మోహన్ సింగ్ చెప్పారన్నారు. నిజానికి మన్మోహన్ సింగ్ 2006లో చేసిన ఆ ప్రసంగంలో ముస్లిముల గురించి మాత్రమే కాదు, యస్సీ, యస్టీ, వెనుకబడిన వర్గాలు, మహిళలు అందరి గురించి మాట్లాడారు. ఈ విషయమై నిజనిర్ధారణలు అనేకసార్లు జరిగాయి. కాని ప్రధాని మోడీకి నిజాలతో పనిలేదు. మతవర్గాల మధ్య చిచ్చుపెట్టి తన రాజకీయ ప్రయోజనాలు సాధించుకోవడమే ముఖ్యంగా ఆయన పనిచేస్తారన్నది పలుమార్లు రుజువయ్యింది. కాంగ్రెసు అనేకసార్లు ఆంధ్రప్రదేశ్ లో ముస్లిములకు రిజర్వేషన్లు ఇవ్వడానికి ప్రయత్నించిందని, కోర్టులు కల్పించుకోవడం వల్ల సఫలం కాలేకపోయిందని చెప్పారు. సచర్ కమిటీ సహా అనేక కమిటీలు ముస్లిముల్లో వెనుకబాటుతనం గురించి స్పష్టమైన నివేదికలు ఇచ్చి ఉన్నాయి. అలాంటప్పుడు వారిని ఆదుకోవడానికి రిజర్వేషన్లు కల్పించడం పాపమా? కాని బీజేపీ దృష్టిలో ఇది మహాపాపం. ముస్లిముల రిజర్వేషన్లు ఇతర వర్గాల రిజర్వేషన్లను తగ్గించి ఇవ్వడం జరగదన్నది కూడా పలుమార్లు విశ్లేషకులు వివరించారు. కాని ఈ అబద్దపు ప్రచారంతో మోడీ మెజారిటీ ఓట్లను దండుకోవాలని చూస్తున్నారు.

మోడీ మాటల్లో వైరుధ్యాన్ని కూడా గమనించాలి. అలీగఢ్ లో మాట్లాడుతూ ప్రధాని మోడీ తనను తాను ముస్లిముల ఉద్ధారకుడిగా చెప్పుకున్నారు. ఎందుకంటే, అలీగఢ్ లో ముస్లిం జనాభా ఎక్కువగా ఉంది. అంతకు ముందు ముస్లిములందరిని చొరబాటుదారులన్న మనిషి తర్వాత వారి కోసం తాను చాలా చేశానని చెప్పడం చాలా విచిత్రంగా మనకు కనిపించవచ్చు. కాని ఓట్లు సంపాదించుకోవడం తప్ప మరో విలువ ఏదీ లేని నేతలు ఇలాంటి మాటలే చెబుతారు. అబద్దాలు చెప్పడం, అసత్యాలు సత్యాలుగా ప్రచారం చేయడం, విద్వేషాన్ని రాజేయడం ఇదే రాజకీయంగా ఇప్పుడు మారిపోయింది.

కాంగ్రెసు మేనిఫెస్టోలో ఆదాయాల్లో అసమానతల గురించి ప్రస్తావించింది. అంబానీ, ఆదానీల ఆదాయం ఏటా 40 నుంచి 60 శాతం వరకు పెరుగుతుంటే సగటు మనిషి ఆదాయం ఐదు శాతం పెరగడం లేదు. ఇది ప్రధాని మోడీ పరిపాలనలోని ఒక చేదు వాస్తవం. గతంలో మన్మోహన్ సింగ్ చేసిన ప్రసంగం నిజానికి ఈ అసమానతలకు సంబంధించిందే. బలహీనవర్గాలు, కేవలం ముస్లిములే కాదు యస్సీ, యస్టీ, ఓబీసీ, మైనారిటీ, మహిళలకు వనరులపై మొదటి హక్కు ఉండాలని చెప్పారు. ఈ మాటలనే వక్రీకరించి ఇప్పుడు ప్రధాని ప్రచారం చేస్తున్నారు.

భారత రాజకీయాలను గత కొన్ని దశాబ్దాలుగా గమనిస్తున్న వారికి ప్రధాని మోడీ వ్యాఖ్యలు పెద్దగా ఆశ్చర్యం కల్పించవు. ఆయన అలా మాట్లాడకపోతేనే ఆశ్చర్యపోవాలి. ముస్లిం విద్వేష వ్యాఖ్యలను ఆయన పలుమార్లు చేశారు.

కాంగ్రెసు పార్టీ మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు మోడీ దానిపై విమర్శలు చేస్తూ స్వతంత్రానికి, పాకిస్తాన్ ఏర్పాటుకు కారణమైన ముస్లిం లీగ్ మేనిఫెస్టోలా ఉందని అన్నారు. కాంగ్రెసు పార్టీని ముస్లిముల పార్టీగా చిత్రీకరించడం, ముస్లిములను దేశద్రోహులుగా, చొరబాటుదారులుగా చిత్రీకరించడం, చొరబాటుదారులను బుజ్జగించే పార్టీగా కాంగ్రెసును చూపించడం ద్వారా తామే అసలైన దేశభక్తులనమని ప్రజలను నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నారు. తాము దేశభక్తులమని ప్రజలను నమ్మించాలంటే ప్రజల కోసం, దేశం కోసం ఏం చేశారో చెప్పుకోవాలి. నిరుద్యోగం పెరిగింది. ఆర్థికవ్యవస్థ కుదేలయ్యింది. అధికధరలతో ప్రజలు అల్లాడుతున్నారు. ప్రధానిగా ప్రజల కోసం ఆయన చేసింది ఏముందని చెప్పుకోడానికి. చెప్పుకోడానికి ప్రధాని మోడీ వద్ద ఏదీ లేదు. అందువల్ల ఇక మిగిలిన మార్గం ప్రతిపక్షాలు దేశద్రోహులని చెప్పడం. మిగిలిన వారంతా దేశద్రోహులని ప్రజలను నమ్మిస్తే  దేశభక్తులు కేవలం బీజేపీ వాళ్ళే అని ప్రజలు నమ్మి ఓటేస్తారన్నది అసలు ఆలోచన.

కాంగ్రెసు పార్టీ ఎన్నికై అధికారానికి వస్తే ప్రజల ఆస్తులను లాక్కుని, మహిళల మంగళసూత్రాలు కూడా లాక్కుని చొరబాటుదారులకు, అధికసంతానం కలిగిన వారికి పంచిపెడుతుందని అన్నారు. ఇక్కడ ఆయన చొరబాటుదారులు, అధికసంతానం కలిగిన వారని చెబుతున్నది ముస్లిముల గురించి. అధికసంతానం కలిగిన వారని చెప్పడం ద్వారా దేశ జనాభా పెరగడానికి కూడా వాళ్ళే కారణమని నమ్మించడం, అలాగే ముస్లిముల జనాభా పెరిగిపోతుందన్న భయాలు రెచ్చగొట్టడం కూడా ఈ ప్రసంగంలో ఉంది. గణాంకాలను పరిశీలిస్తే ముస్లిముల జనాభా వృద్ధి రేటు మిగిలిన సముదాయాలతో సమానంగానే ఉందన్నది స్పష్టంగా తెలుస్తుంది. ఏడుగురు పిల్లలు, ఆరుగురు పిల్లలున్న కుటుంబాలు మిగిలిన సముదాయాల్లో కూడా ఉన్నాయి. ఉదాహరణకు స్వయంగా మోడీ గారి తోడబుట్టిన వారు ఎంతమంది? మోహన్ భగవత్ తోడబుట్టిన వారు ఎంతమంది? ఇలాంటి లెక్కలు తీస్తే చాలా సామాజిక వాస్తవాలు అర్థమవుతాయి. కాని ఈ లెక్కలు తీసి మాట్లాడే తీరిక ఎవరికి ఉంది? ప్రధాని మోడీకి ఈ లెక్కలు గణాంకాలతో పనిలేదు. ఆయన తన అబద్దాల ప్రచారంతో ఈ ఎన్నికల్లో గట్టెక్కాలనుకుంటున్నారు.

ముస్లిం విద్వేష ప్రసంగాలు ఇదే మొదటిసారి కాదు. గుజరాత్ నరమేధం జరిగినప్పుడు ఒక ఇంటర్వ్యులో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆయన మాట్లాడుతూ ఒక కుక్కపిల్ల కారు క్రింద పడి మరణించినా బాధపడతామని, అలాగే గుజరాత్ అల్లర్లలో మరణించిన వారి పట్ల కూడా బాధపడుతున్నానని అన్నారు.

బీజేపీ నేతలు ఎన్నికల్లో ముస్లిం విద్వేష ప్రసంగాలు చేయడం మామూలే. గతంలో కూడా చాలా మంది చేశారు. ఎన్నికల కమీషన్ వారిపై చర్యలు తీసుకున్నఉదాహరణలు అరుదు. గతంలో ఉత్తరప్రదేశ్ సహరాన్ పూర్ లో యోగీ ఆదిత్యనాథ్ ప్రసంగిస్తూ కాంగ్రెస్ పై దాడి చేశాడు. అప్పట్లో సహరాన్ పూర్ కాంగ్రెస్ అభ్యర్థి ఇమ్రాన్ మసూద్ పై దాడి చేశాడు.  ఉగ్రవాది మసూద్ అజహర్ కు కాంగ్రెస్ అభ్యర్థి ఇమ్రాన్ మసూద్ అల్లుడన్నట్లు మాట్లాడాడు. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అప్పట్లో మాట్లాడుతూ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే పాకిస్తాన్ లో దీపావళి జరుపుకుంటారని వ్యాఖ్యానించాడు. ఈ నేతల మాటలకు అర్థమేమిటి? ఈ దేశంలో ఒక్క బీజేపీ తప్ప మిగిలిన పార్టీలన్నీ దేశద్రోహులకు టిక్కెట్లిచ్చే పార్టీలనీ, దేశంలో ప్రతిపక్షమంటే దేశద్రోహుల పార్టీలనీ, దేశభక్తి కేవలం బీజేపీకి మాత్రమే గుత్తసొత్తు అని ప్రజలను నమ్మిస్తున్నారు.

ఏది ఏమైనా భారత ఎన్నికల్లో గత కొన్ని దశాబ్దాలుగా ముస్లిములు, పాకిస్తాన్ వంటి పదాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. గతంలో బీహారు ఎన్నికల ప్రచారంలో అమిత్ షా కూడా కాంగ్రెస్ గెలిస్తే పాకిస్తాన్ లో టపాకాయలు కాల్చి పండగ చేసుకుంటారని చెప్పాడు.

గత ఎన్నికల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉత్తర ప్రదేశ్‌లోని అమేథీతోపాటు కేరళలోని వయనాద్‌ నుంచి కూడా పోటీ చేయాలని నిర్ణయించారు. దీన్ని మోడీ విమర్శించారు. ‘హిందూ ఉగ్రవాదం’ అనే పదజాలాన్ని కాంగ్రెస్ రూపొందించిందని,  5,000 సంవత్సరాల నుంచి ఉన్న హిందూ సంస్కృతిని అవమానించిందని విమర్శించారు. హిందువులు అధికంగా ఉన్న నియోజకవర్గం నుంచి పోటీ చేసే దమ్ము కాంగ్రెస్ కు లేదన్నారు. మెజారిటీ ప్రజల జనాభా తక్కువగా ఉన్న స్థానం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకుందన్నారు.  గత ఎన్నికల్లో మహారాష్ట్రలోని వార్ధాలో జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ ఈ మాటలన్నారు. హిందువులు అధికంగా ఉండే నియోజకవర్గం నుంచి పోటీ చేసే ధైర్యం రాహుల్ కి లేదని చెప్పడం ఎంతవరకు నిజం. అమేధీలో హిందువులు అధికంగానే ఉన్నారు కదా. అక్కడి నుంచి ఆయన గెలిచాడు కదా? హిందువులు అధికంగా ఉన్న నియోజకవర్గం నుంచి పోటీ చేసే ధైర్యం రాహుల్ కి లేదని చెప్పడం వెనుక ప్రధానోద్దేశ్యం రాహుల్ హిందువులకు వ్యతిరేకం అని చెప్పడం. ఇదంతా గత ఎన్నికల్లో జరిగిన వ్యవహారం. ఇదే వ్యవహారం ఇప్పుడు జరుగుతోంది. ఇంత నిస్సిగ్గుగా మతాన్ని ఎన్నికల కోసం వాడుకోవడం గతంలో ఎప్పుడైనా జరిగిందా?

గత ఎన్నికల్లో కాంగ్రెసు విషయంలో మోడీ చేసిన వ్యాఖ్యలు కూడా గమనించడం అవసరం. ‘‘హిందూ ఉగ్రవాదం అనే పదజాలానికి వాళ్ళు జన్మనిచ్చారు. హిందువులకు ఉగ్రవాదులనే పేరును తగిలించి పాపం చేశారు. ఇప్పుడు హిందువులు మెజారిటీగా ఉన్న స్థానం నుంచి పోటీ చేయడానికి భయపడుతున్నారు. అందుకే వాళ్ళు మైనారిటీ ప్రజలు ఎక్కువగా ఉన్న స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు’’ అని మోదీ అప్పట్లో అన్నారు. ఈ మొత్తం ప్రసంగంలో గమనించవలసిన విషయమేమంటే, కాంగ్రెస్ హిందువులకు ద్రోహం చేసింది. కాంగ్రెస్ హిందువులకు శత్రువు వంటిది, అందువల్ల కాంగ్రెస్ కు మెజారిటీ హిందువులుండే నియోజకవర్గం నుంచి పోటీ చేసే దమ్ములేదు. ఇది గత ఎన్నికల్లో చెప్పిన మాట. ఇప్పుడు మోడీ కాంగ్రెసు చొరబాటుదారులకు హిందువుల ఆస్తులు పంచి ఇచ్చేస్తుందని అంటున్నారు. ఇక్కడ చొరబాటుదారులంటే ముస్లిములు. క్లుప్తంగా అర్థమయ్యేదేమంటే, కాంగ్రెసు ముస్లిముల పార్టీ అని, ముస్లిములు చొరబాటుదారులని, కాబట్టి కాంగ్రెసు చొరబాటుదారుల కోసం పనిచేస్తున్న పార్టీ అని దేశప్రజలను నమ్మించడం, బీజేపే మాత్రమే హిందువుల పార్టీ కాబట్టి హిందువులందరూ బీజేపీకి ఓటు వేయాలని చెప్పడం. ఇది 80 వర్సెస్ 20 ఫార్మూలా. దేశంలోని అధికశాతం ప్రజలు హిందువులు, కాబట్టి వారందరినీ మభ్యపెట్టి వారి ఓట్లు పొందితే చాలు అధికారం సొంతం అనే ఫార్మూలా ఇది. ఈ ఫార్మూలా ఇప్పటి వరకు బాగానే పనిచేస్తూ వచ్చింది. అందుకే బీజేపీ నేతల నోటి నుంచి హిందు, హిందు అనే మాట తప్ప భారతదేశం, దేశంలోని దళితులు, బడుగు బలహీనవర్గాల సమస్యలు, వారి జీవితాలు, దేశశ్రేయస్సు అనే మాటలు వినబడడమే లేదు. దేశంలో హిందువులైనా, ముస్లిములు, క్రయిస్తవులు, శిక్కులు, పార్శీలు, బౌద్ధులు, జైనులు ఎవరైనా గానీ ఈ దేశ ప్రజలే. హిందూ మెజారిటీ ఉన్న ప్రాంతంలో పోటీ చేయడమే దేశభక్తికి గీటురాయి అవుతుందా? మైనారిటీ సముదాయం ప్రజలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం నుంచి పోటీ చేయడం దేశభక్తికి వ్యతిరేకమా? దేశంలో రాజకీయాలను ఏ స్థాయికి బీజేపీ దిగజార్చిందో ఈ మాటల వల్ల స్పష్టంగా అర్థమవుతుంది. ఎంతగా దిగజారాయన్నది అర్ధం చేసుకోవాలంటే కొన్ని సంఘటనలతో పోల్చి చూసుకోవడం అవసరం. 1952లో మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ లో గొప్ప నాయకుడు, నెహ్రూ కేబినేటులో విద్యా మంత్రి మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ ను ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ నుంచి పోటీ చేయండని నెహ్రూ కోరారు. మౌలానా కాస్త అయోమయంగా, మరికాస్త ఆసక్తిగా ఆ నియోజకవర్గమే ఎందుకు ఎంపిక చేశారని నెహ్రూను అడిగారు. రాంపూర్ లో ముస్లిం జనాభా చాలా ఎక్కువ. కాబట్టి మీరు అక్కడ గెలుపొందడం తేలికవుతుంది అన్నారు నెహ్రూ. మౌలానా వెంటనే నెహ్రూకు జవాబిస్తూ, నేను కేవలం ముస్లిముల నాయకుడిని కాదు, ఇండియాకు నాయకుడిని అంటూ నెహ్రూ ఆఫర్ ను తిరస్కరించారు. మోడీ మంత్రివర్గంలో, బీజేపీ పార్టీలో ఎవరైనా ఈ ప్రజాస్వామిక సూత్రాన్ని ఆయనకు చెప్పేవారున్నారా?

పార్టీలు, నేతలు అభ్యర్థులు జాతి, కుల, మత, ప్రాంతీయపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రవర్తించకూడదు. ఇతర రాజకీయ పార్టీలను విమర్శించేటప్పుడు వాటి గత చరిత్రను, ఇంతకు ముందు పనితీరును మాత్రమే దృష్టిలో ఉంచుకోవాలి. ప్రజా జీవితంతో సంబంధంలేని, వ్యక్తిగత దూషణలు చేయకూడదు. రాజకీయ ప్రకటనల ద్వారా కుల,మతపరమైన అభ్యర్థనలు చేయకూడదు. మసీదులు, చర్చిలు, దేవాలయాలు, ఇతర ప్రార్థన, పవిత్ర స్థలాల్లో ఎన్నికల ప్రచారం చేయకూడదు. ఇవి ఎన్నికల నియమావళి లోని అంశాలు. రాజకీయాల్లో మర్యాదా సంక్షోభం నెలకొందని భారత ప్రధానిగా వాజ్‌పేయీ లోగడ నిష్ఠుర సత్యం పలికారు. అది ఇప్పుడు తారాస్థాయికి చేరింది. ఎన్నికల ప్రవర్తన నియమావళి నిర్దేశాలను తుంగలో తొక్కి మాట్లాడుతున్నారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి క్షణం కూడా ఆలోచించడం లేదు. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం ప్రజల బాగు కోసం చేసిన పని ఒక్కటి కూడా లేదు చెప్పుకోడానికి. బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందని ఆలోచిస్తే, ఉద్యోగాల కల్పనలో వైఫల్యం, ఉపాధి కల్పనలో వైఫల్యం, ఆర్థికరంగంలో వైఫల్యం, ఆదాయల్లో అసమతుల్యం, విద్యా,వైద్యరంగాల్లో వైఫల్యాలు… చేసిందేమిటంటే, జమ్ము కశ్మీరులో 370 అధికరణ తొలగించడం, దీనివల్ల సాధించిందేమిటో ఇంతవరకు స్పష్టం కాలేదు. పౌరసత్వ సవరణ చట్టం తీసుకురావడం. దీనివల్ల ఏం సాధించారు? ఎంతమందికి పౌరసత్వం ఇచ్చారు? త్రిపుల్ తలాక్ చట్టం తీసుకురావడం. దీనివల్ల ఎంతమందికి ప్రయోజనం కలిగిందో లెక్కలు ప్రకటిస్తే బాగుండేది. అయోధ్యలో రామమందిరం నిర్మించడం. ఇవన్నీ ఏదో ఒకరూపంలో ముస్లిములతో సంబంధం ఉన్న అంశాలే. బీజేపీ రాజకీయాలన్నీ ముస్లిం వ్యతిరేకత చుట్టే తిరుగుతుంటాయన్నది కాస్త ఆలోచించినా అర్థమయ్యే విషయం. ముస్లిం వ్యతిరేకత వల్ల దేశప్రజలకు ప్రయోజనమేమిటి. దీనివల్ల ఉద్యోగాలు వస్తాయా? ఉపాధి అవకాశలు పెరుగుతాయా? ఆర్ధికవ్యవస్థ బాగుపడుతుందా? విద్యా వైద్యరంగాల్లో మార్పు వస్తుందా? రోడ్లు బాగుపడతాయా?

సగటు ప్రజలకు ఒనగూడిన ప్రయోజనాలు ఏవీ లేవు. ప్రజల కోసం చేసింది ఏదీ లేదు కాబట్టి హిందూ ముస్లిం రాజకీయాలు చేయడమే గెలుపు సాధించే ఏకైక మార్గంగా బీజేపీ భావిస్తుంది. అందుకే విద్వేష రాజకీయాలు మరోసారి వేడిగా నడుపుతోంది. ఈ క్రమంలో ఎన్నికల నియమావళిని తుంగల్లో తొక్కుతుంది. గతంలో కూడా బీజేపీ నేతలు ఇలాంటి ప్రచారాలే చేసి విజయాలు సాధించారు. గతంలో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత సైన్యాన్ని ‘మోడీ సేన’గా చెప్పాడు. యోగీ చేసిన వ్యాఖ్యలు అప్పుడు రాజకీయంగా దుమారం రేపాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఘజియాబాద్‌లోని ఒక ర్యాలీలో యోగీ మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలను  ప్రతిపక్ష నేతలు తీవ్రంగా తప్పుపట్టారు. ‘కాంగ్రెస్‌ నేతలు ఉగ్రవాదులకు బిర్యానీలు పెట్టి పోషించారు. కానీ మోడీ సేన మాత్రం ఉగ్రవాదులకు తూటాలు, బాంబులతో సమాధానం చెబుతోంది’ అని ఆయన వ్యాఖ్యానించారు. యోగీ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేదీ స్పందిస్తూ.. భారత ఆర్మీని ఆదిత్యనాథ్‌ కించపరిచారన్నారు. సైన్యం అనేది ప్రయివేటు సంస్థ కాదని, దీనిపై యోగీ తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. యోగీ వ్యాఖ్యలను సైన్యానికి చెందిన ఉన్నతాధికారులు అప్పట్లో ఖండించినట్లు సమాచారం. భారత సైన్యాన్ని, మోదీ సైన్యం అని ఎలా అంటారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. బాలాకోట్ వైమానిక దాడులను రాజకీయ ప్రయోజనాల కోసం వాడటం మాత్రమే కాదు…భారత సైన్యం తమ సొంత సేనగా పేర్కొనడం దారుణమని మమతా బెనర్జీ విమర్శించారు. గత ఎన్నికల్లో జరిగిందేమిటంటే, మోదీ ప్రభుత్వం అనేక రంగాల్లో విఫలమైన తర్వాత, ఎన్నికల్లో గెలుపొందడానికి జాతీయ భద్రతను ప్రచారంలో ప్రధానంగా వాడుకుంది. భారత సైన్యాన్ని మోడీ సేనగా వర్ణించడం ద్వారా సైన్యం సాధించిన విజయాలను బీజేపీ ఖాతాలో వేసేయాలని యోగీ ఆదిత్యనాథ్ అప్పట్లో ప్రయత్నించాడు.  పాకిస్తాన్ నుంచి విడుదలై వచ్చిన వింగ్ కమాండర్ ఫోటోను ప్రచారానికి వాడుకోవడం మనకు తెలుసు. పుల్వామాలో అమరులైన సిఆర్పీఎఫ్ జవాన్ల ఫోటోలు వాడుకున్నారు. మైం భీ చౌకీదార్ అంటూ ప్రారంభించిన ప్రచారంలో ఒక వీడియోలో నరేంద్రమోదీని యుద్ధట్యాంకులో చూపించారు. బీజేపీ నేతలు మిలిటరీ యూనిఫాం ధరించి కార్యక్రమాల్లో పాల్గొన్న వార్తలు వచ్చాయి. బాలాకోట్ వాయుసేన దాడుల తర్వాత బీజేపీ ఎం.పీ.మనోజ్ తివారీ మిలిటరీ యూనిఫాం ధరించి ఒక ర్యాలీలో పాల్గొన్నాడు. ఈ యూనిఫాం ధరించడం గర్వంగా ఉందని అన్నాడు. కాని ఆ యూనిఫాం ధరించే అర్హత మిలిటరీలో పనిచేసే వారికి మాత్రమే ఉంటుందన్నది ఆయన మరిచిపోయాడు. క్లుప్తంగా చెప్పాలంటే, గత ఎన్నికల్లో భారత సైన్యం సాధించిన విజయాలను బీజేపీ తన విజయాలుగా ప్రచారం చేసుకుంది.

ఎన్నికల నియమావళి ఇప్పుడు అలంకారప్రాయంగా మిగిలిపోయింది. భారతదేశం జయప్రదంగా యాంటి శాటిలైట్ మిస్సైల్ పరీక్ష నిర్వహించిందన్న ప్రకటన అప్పట్లో శాస్త్రవేత్తలు చేయలేదు,  ప్రధాని మోడీ స్వయంగా ప్రకటించారు. భారతీయ జనతాపార్టీ మంత్రులు వెంటనే ట్విట్టర్లో ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. తమ పార్టీ నినాదం – అసాధ్యం ఇప్పుడు సాధ్యమయ్యిందంటూ ట్వీట్లు చేశారు. కాని ఇది జరిగింది అప్పట్లో ఎన్నికల నియమావళి అమలులో ఉన్నప్పుడే.  ఇలాంటి ప్రకటనలు ప్రధాని చేయడం సముచితమా అనేది ప్రశ్న. అప్పుడు చేసిన మిస్సైల్ ప్రయోగం ద్వారా భారతదేశం రోదసీలో ఉన్న ఉపగ్రహాన్ని నేలకూల్చే సామర్థ్యం ఉన్నట్లు ప్రకటించింది. నిజానికి ఈ సామర్థ్యం భారతదేశానికి చాలా కాలం నుంచి ఉందన్నది అనధికారిక సమాచారం. ఈ ప్రకటన వల్ల ప్రధాని మోడీకి జాతీయ మీడియాలో అసాధారణ కవరేజి దొరికిందన్నది వాస్తవం. మంత్రులంతా బీజేపీ స్లోగన్ ’’అసాధ్యం ఇప్పుడు సుసాధ్యం‘‘ అంటూ ప్రచారం చేసే అవకాశం దొరికింది.

ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు సంబంధించి అనేక ఆరోపణలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. గతంలో ఇంత ఎక్కువగా ఆరోపణలు ఎన్నడూ రాలేదు. నరేంద్రమోడీ జీవితచరిత్రపై ఒక సినిమా గత ఎన్నికల సందర్భంగా విడుదలయ్యింది. ఈ సినిమా రికార్డు టైములో తీశారు. జనవరి నెలాఖరున సినిమా తీయబోతున్నారన్న ప్రకటన వచ్చింది. ఏప్రిల్ 5వ తేదీన విడుదలకు కూడా సిద్ధమై పోయారు. మరో సినిమా యాక్సిడెంటల్ ప్రైం మినిస్టర్ పేరుతో మాజి ప్రధాని మన్మోహన్ సింగ్ పై విడుదల అయ్యింది. మన్మోహన్ సింగ్ పై విమర్శ, ఆయన్ను బలహీనమైన ప్రధానిగా చూపించిన సినిమా తర్వాత అత్యంత బలవంతుడైన బాహుబలి ప్రధాని మోదీ గురించి మరో సినిమా దేశప్రజలు చూడ్డానికి విడుదల చేశారు. ఈ సినిమా విడుదలకు కోర్టులు కూడా లైన్ క్లియర్ చేసేశాయి. ఈ తతంగమంతా గత ఎన్నికల్లో ప్రజలు చూశారు. అంతేకాదు, మరో వైపు నమో టీవీ అంటూ కొత్త టీవీ ఎలాంటి అనుమతులు లేకుండా వచ్చింది. ఇందులో 24 గంటలపాటు ప్రధాని నరేంద్ర మోదీ వివిధ ప్రాంతాల్లో చేస్తున్న ఎన్నికల ప్రసంగాల ప్రత్యక్ష ప్రసారాలను ఎప్పటికప్పుడు ప్రసారం చేయడంతోపాటు వాటిని మళ్లీ మళ్లీ రిపీట్‌ చేస్తోంది. సెక్యూరిటీ క్లియరెన్స్‌ లేదా ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అసలు అనుమతికి ఎలాంటి దరఖాస్తును కూడా సమర్పించకుండానే ఈ టీవీ ఛానల్‌ ప్రసారం అయ్యిందని వార్తలు వచ్చాయి.

ఎన్నికల నియమావళి కేవలం అలంకారప్రాయంగా మారిందని చెప్పడానికి మరో ఉదాహరణ గతంలో రైల్వేశాఖ మోడీ ఫోటోతో సుమారు లక్ష టిక్కెట్లను ముద్రించింది. తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి లేఖ రాసి, రైల్వే శాఖ బీజేపీ ప్రభుత్వానికి లబ్ధి చేకూర్చేలా మోదీ ఫొటో కలిగిన టిక్కెట్లను విక్రయిస్తోందని ఆరోపించింది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న రైల్వే, ఎయిరిండియా…. ఈ రెండు సంస్థలను పర్యవేక్షించే మంత్రిత్వ శాఖలకు ఎన్నికల సంఘం నోటీసులు పంపింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆయా సంస్థలు జారీ చేసే టికెట్లపై ప్రధాని నరేంద్ర మోడీ ఫొటోలను ఎందుకు ముద్రిస్తున్నారో తెలపాలంటూ ఈ నోటీసులు జారీ చేసింది. ఎయిర్ ఇండియా టిక్కెట్లపై ప్రధాని మోదీ బొమ్మల వివాదం సమసిపోకముందే శతాబ్ది రైళ్లలో అందించే డిస్పోజబుల్ టీ కప్పులపై “మై భీ చౌకీదార్” అని కాంపెయినింగ్ నడుస్తోంది. సంకల్ప్ ఫౌండేషన్ అనే ఎన్జీవో ఈ అడ్వర్టైజ్‌మెంట్ వేసిందని  తెలుస్తోంది. శతాబ్ది రైళ్లలో చౌకీదార్ ప్రకటనలు ఉన్న డిస్పోజబుల్ కప్పులు దర్శనమివ్వగా నెటిజన్లు ట్విట్టర్ ద్వారా డిస్పోజబుల్ టీ కప్ ఫోటోలు షేర్ చేసి రైల్వేస్ నిర్వాకంపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల నియమావళిని ఎన్ని రకాలుగా ఉల్లంఘించాలో అన్ని రకాలుగా ఉల్లంఘనలు జరుగుతున్నాయి.

మొదటి విడత పోలింగ్ తర్వాత బీజేపీకి వ్యతిరేక గాలులు వీస్తున్నట్లు స్పష్టంగా అర్థమయ్యింది. అందుకే విద్వేష రాజకీయాలను రాజేయడం మరింత తీవ్రం చేసింది. గతంలో ఎన్నికల ప్రయోజనాలు సాధించడానికి ఈ రాజకీయాలే ఉపయోగపడ్డాయి. ఈ విద్వేష రాజకీయాలకు జవాబిచ్చే రియాక్షనరీ రాజకీయాలు ప్రతిపక్షాలు చేస్తే బీజేపీ పథకం పారినట్లే. ఉద్యోగాలు, ఉపాధి కల్పన, పేదరిక నిర్మూలన, ఆదాయల పెంపు, విద్యవైద్య సదుపాయాల వంటి అసలు సమస్యల నుంచి ప్రతిపక్షాలు పక్కకు తప్పుకోరాదు. ఈ సమస్యలనే ప్రజల్లోకి మరింత బలంగా తీసుకువెళ్ళవలసిన అవసరం ఉంది.

–      వాహెద్