October 18, 2024

 బీజేపీ గొడ్డుమాంసం పేరుతో రాజకీయాలు చేస్తుంది కాని, ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం మాట మార్చేస్తుంది.

ముస్లిములు నిందితులుగా ఉంటే కోర్టుల్లో బెయిల్ దొరకడం చాలా కష్టం. ఈ మాటలు చెప్పింది సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్. పౌరహక్కుల పరిరక్షణ సంఘం (Association for protection of civil rights (APCR) ఇటీవల నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పౌరసత్వ సవరణ చట్టం, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనల సందర్భంగా అనేకమంది అరెస్టయ్యారు. ఈ అరెస్టులు జరిగి నాలుగేళ్ళు గడిచిపోయాయి. ఈ సందర్భంగా ఏపిసిఆర్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దిగ్విజయ్ సింగ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఆరెస్సెస్ పై తీవ్ర విమర్శలు సంధించారు.
ఈ సారి లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి ఎదురు దెబ్బలు తగిలాయి. ఎన్నికల ప్రచారంలో ముస్లిములపై విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రసంగాలు, మంగళసూత్రం, గొడ్డుమాంసం, మఛిలీ వంటి ప్రయత్నాలు ఎన్ని జరిగినా బీజేపీకి అనుకున్న ఫలితాలు లభించలేదు. బీజేపీ బలహీనపడింది కాని ముస్లిములపై విద్వేష ప్రసంగాల ఉధృతి, దాడుల పరంపర తగ్గడం లేదు. బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలు, ప్రసంగాలు, చర్యల వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ వాతావరణం సంఘవిద్రోహశక్తులకు తామేం చేసినా చెల్లుతుందన్న ధైర్యాన్నిస్తోంది.
ఉదాహరణకు డెబ్బయి సంవత్సరాల ముస్లిం వృద్ధుడిపై రైల్లో జరిగిన దాడి అలాంటిదే. ఆయన తీసుకెళుతున్న ఆహారం గొడ్డుమాంసం అని ఆరోపించి అత్యంత పైశాచికంగా ఆయనపై దాడి చేయడమే కాదు, క్రూరమైన, పైశాచికమైన ఆనందం ఆ యువకుల ముఖాల్లో కనిపించింది.
ఇటీవల ఒడిశాలో జరిగిందేమిటి?
దేశంలో గొడ్డుమాంసంపై నిషేధం ఉందా? బరంపురంలో ప్రభుత్వ నిర్వహణలో నడుస్తున్న ఒక సాంకేతిక కళాశాలలో ఏడుగురు విద్యార్థులను కాలేజీ నుంచి బహిష్కరించారన్న వార్త వచ్చింది. వారు తమ హాస్టల్ గదిలో గొడ్డుమాంసం వండుకుని తిన్నారని విశ్వహిందూపరిషద్, భజరంగ్ దళ్ కార్యకర్తలు హంగామా చేశారు. అంతే వారిని కాలేజీ బహిష్కరించింది.
దేశంలో గొడ్డుమాంసంపై నిషేధం ఉందా? గోమాంసంపై నిషేధం ఉంది. కాని గొడ్డుమాంసం నిషేధమా? ప్రపంచంలో గొడ్డుమాంసం ఎగుమతి చేస్తున్న ప్రముఖ దేశాల్లో భారతదేశం ఉన్నప్పుడు గొడ్డుమాంసం గురించి ఈ హంగామాలు ఏం చెబుతున్నాయి? గొడ్డుమాంసం పేరు చెప్పి ఎంతమందిపై దాడులు చేశారు? ఆ సంఘటనలు వార్తలను ఇక్కడ ప్రస్తావిస్తే ఒక పుస్తకమే అవుతుంది. అనేక మూకహత్యలు, మూకదాడుల సంఘటనలున్నాయి. ఇటీవల ఒక కారులో ఆవును తరలిస్తున్నారన్న అనుమానంతో ఈ గుండాలు కాల్చి చంపింది ఒక హిందూ కుర్రాడిని. ముస్లిం అనుకుని పొరబడి కాల్చి చంపామని వివరణలు ఈ గుండాలు చెప్పడం, అదే వివరణను మన మీడియా ప్రముఖంగా ప్రచారంలో పెట్టడం చూస్తుంటే దేశంలో ఎలాంటి పరిస్థితి ఉందో అర్థమవుతుంది.
ఒకవైపు గొడ్డుమాంసం పేరు చెప్పి ఈ శక్తులు ముస్లిములపై దాడులు చేస్తున్నారు. కాని మరోవైపు ఓట్ల కోసం చేస్తున్న రాజకీయాలు వేరుగా కనిపిస్తున్నాయి. కేంద్రంలో మంత్రి హోదాలో 2015లో బీజేపీ నాయకుడు కిరణ్ రిజిజు స్వయంగా తాను గొడ్డుమాంసం తింటానని, తినకుండా తనను ఎవరూ ఆపలేరని అన్నాడు. గొడ్డుమాంసం తినేవారు పాకిస్తాన్ వెళ్ళాలని ఒకవైపు బీజేపీ నేతలు చెబుతారు. మరోవైపు బీజేపీ నేతలే గొడ్డుమాంసం గురించి మరోమాట చెబుతారు.
ఒకే దేశం, ఒకే ఎన్నిక, ఒకే చట్టం అనే పెద్ద పెద్ద నినాదాలు మనం వింటూనే ఉంటాం. మేఘాలయ మన దేశంలోని రాష్ట్రమే. ఆవును జాతీయమాతగా ప్రకటించాలంటూ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద్ ఒక యాత్ర తలపెట్టారు. కాని మేఘాలయ విద్యామంత్రి రక్కం ఏ. సంగ్మా దీనిపై అభ్యంతరాలు చెప్పారు. ఆయన పార్టీ నేషనల్ పీపుల్స్ పార్టీ బీజేపీకి మిత్రపక్షం. దేశంలో ఎక్కడైనా ఈ ర్యాలీ తీసుకోండి కాని మేఘాలయకి రావద్దని ఖరాఖండిగా చెప్పేశారు. ప్రజలు ఏం తినాలో ఏం తినకూడదో శాసించే హక్కు ఎవరికీ లేదన్నారు. గొడ్డుమాంసం తినకుండా తనను ఎవరు ఆపలేరని కూడా చెప్పారు. ఈ వార్త హిందూ పత్రికలో కూడా వచ్చింది. బీజేపీ గొడ్డుమాంసం పేరుతో రాజకీయాలు చేస్తుంది కాని, ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం మాట మార్చేస్తుంది. నాగాలాండ్, మేఘాలయ, మిజోరం రాష్ట్రాల్లో నిషేధాలు విధించమని 2017లో బీజేపీ నేతలు చెప్పిన మాటలు వార్తల్లో వచ్చాయి. నాగాలాండ్ బీజేపీ చీఫ్ గా అప్పట్లో పనిచేసిన విసాసోలి లోంగూ మాట్లాడుతూ తమ పార్టీ అధికారంలోకి వస్తే ఉత్తరప్రదేశ్ మాదిరి గోవధ నిషేధాలు నాగాలాండ్ లో అమలు చేయమని అన్నారు. ఒకే దేశం, ఒకే చట్టం గురించి మాట్లాడే పార్టీ మాటలివి. ఇవన్నీ వార్తల్లో వచ్చాయి. అందరూ చదివిని విషయాలే. అయినా గొడ్డుమాంసం సాకుతో మూకదాడులు, మూకహత్యలు జరుగుతున్నాయి. గత మాసంలో హర్యానాలో జరిగిన సంఘటన అలాంటిదే. పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన వలసకూలీ గొడ్డుమాంసం తిన్నాడన్న అనుమానంతో కొట్టి చంపేశారు. ఇలాంటి ఎన్ని సంఘటనలు. స్కూలుకు వస్తున్నప్పుడు టిఫిన్ బాక్సులో నాన్ వెజ్ తీసుకొచ్చిన చిన్నపిల్లాడిని ఉగ్రవాదిగా పేర్కొన్న ప్రిన్సిపల్, పనిష్మెంట్ ఇచ్చి పిల్లాడిని స్కూలు నుంచి పంపేసే ప్రయత్నాలు. ఇవన్నీ ఏం చెబుతున్నాయి? స్కూలులో నాన్ వెజ్ తీసుకెళ్ళడంపై నిషేధం ఉందా? స్కూలు నియమాలున్నాయా?
బీజేపీ ముఖ్యమంత్రులున్న రాష్ట్రాల నుంచి వస్తున్న వార్తలు అందరికీ తెలిసినవే. బుల్డోజర్ జస్టిస్ అంటూ వేస్తున్న వీరంగాలు కూడా చూస్తున్నాం. మధ్యప్రదేశ్ లో గొడ్డుమాంసం ఇంట్లో ఉందన్న ఆరోపణతో 11 మంది ముస్లిముల ఇళ్ళు పోలీసులు బుల్డోజర్లతో కూల్చేశారు. ముస్లిములనే కాదు దళితులపై కూడా ఈ దౌర్జన్యాలు జరుగుతున్నాయి. ఇటీవల మధ్యప్రదేశ్ లోనే పోలీసు స్టేషనులో దళిత కుటుంబానికి చెందిన తల్లీకొడుకులపై పోలీసుల దౌర్జన్యం గురించిన వార్త వచ్చింది.
అస్సాంలో బీజేపీ ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ముస్లిములపై వరద జిహాద్, ఎరువుల జిహాద్ ఇలా నానా రకాల జిహాదుల పేరుతో చేస్తున్న విద్వేష ప్రచారం అందరికీ తెలిసిందే. మేఘాలయలో ఉన్న ముస్లిం ప్రయివేట్ యూనివర్శిటీ USTM నుంచి ఉత్తీర్ణులైన వారికి అస్సాంలో ఉద్యోగార్హత ఉండదన్నాడు. మరో బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లోని బిజ్నూర్ లో ఒక ఇంట్లో గొడ్డుమాంసం ఉందన్న ఆరోపణతో దాడి చేసి నానా యాగి చేశారు. ఈ దాడిలో 55 సంవత్సరాల మహిళ మరణించింది. ఆ ఇంట్లో పోలీసులకు ఏమీ దొరకలేదని వార్త. అక్కడి 6 గురు ముస్లిం రాజకీయ నాయకులపై 175 కేసులు పెట్టారు. ఇందులో కొందరు జైల్లో ఉన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ తనపై కేసులను రద్దు చేయించుకున్నారు.
హిమాచల్ ప్రదేశ్ లో మస్జిదులపై గలాభా సృష్టిస్తున్నారు. మహారాష్ట్రలో మస్జిదుల్లో దూరి చావబాదుతామని బెదిరింపులు జారీ చేస్తున్నారు. బీజేపీ ఈ సారి లోక్ సభ ఎన్నికల్లో రాజకీయంగా బలహీనపడింది కానీ, మతతత్వ రాజకీయాల ఉధృతి మరింత పెరిగింది.
రాజకీయంగా బలహీనపడడం వల్ల కొన్ని విధానపరమైన నిర్ణయాల్లో వెనక్కి తగ్గవలసి వచ్చింది. మిత్రపక్షాల ఒత్తిళ్ళ వల్ల వెనక్కి తగ్గక తప్పలేదు. కాని మతతత్వ రాజకీయాలే తమకు మరోసారి భారీ విజయాలు సాధించిపెడతాయన్న ధోరణిలోనే బీజేపీ నేతలున్నారు. మోడీ రెండు సార్లు ప్రధానిగా సాధించిందేమిటి? అధికధరలు, నిరుద్యోగ సమస్యలు వెంటాడుతున్నాయి. ఈ వంద రోజుల పరిపాలనలోను చెప్పుకోడానికి ఏమీ లేదు. ఇక మిగిలింది మతతత్వ రాజకీయాలే. అందువల్లనే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు బాహాటంగా విద్వేష రాజకీయాలు నడుపుతున్నారు. కాని ఈ రాజకీయలను ప్రజలు ఏవగించుకుంటున్నారన్నది ఈ లోక్ సభ ఎన్నికల ఫలితాలు చెబుతూనే ఉన్నాయి. ఇలాంటి మతతత్వ, విద్వేష రాజకీయాలు ఎలాంటి వాతావరణాన్ని సృష్టిస్తాయో ముస్లిముగా పొరబడి చంపేశామని నిందితులు చెప్పిన మాటల్లో స్పష్టంగా అర్థమవుతున్నాయి. ఈ పరిస్థితి మార్చడానికి పూనుకోవలసింది ప్రజలే.

– వాహెద్